సాయి వచనం:-

- శ్రీబాబూజీ.

తర్ఖడ్ కుటుంబ అనుభవాలు - 1వ భాగం


పరిచయం

సాయిబాబాను ప్రత్యక్షంగా సేవించిన తర్జడ్ కుటుంబానికి (శ్రీబాబాసాహెబ్ తర్ఖడ్, శ్రీమతి తర్ఖడ్ మరియు జ్యోతీంద్ర తర్ఖడ్) వారసుడైన వీరేంద్ర జ్యోతీంద్ర తర్ఖడ్, సాయిబాబా గురించి, సాయిలీలలను గురించి తన తండ్రిగారు స్వయంగా వెల్లడించిన విషయాలను, ఆంగ్లంలో రచించి ప్రచురించిన గ్రంథం - “Live Experiences of the Tarkhad Family with Shri Sai Baba of Shirdi”. ఈ అమూల్య గ్రంథంలో ఇప్పటివరకు వెలుగుచూడని ఎన్నో సాయిలీలలు, అనుభవాలు, సాయిచరిత్రకు సంబంధించిన ఎన్నో విశేషాలు పొందుపరచడం జరిగింది. శ్రీసాయి తత్త్వాన్ని, లీలాప్రబోధాన్ని ప్రతి అక్షరంలోనూ నిక్షిప్తం చేసుకున్న ఈ గ్రంథం చదువుతున్నంతసేపు శ్రీసాయి సాన్నిధ్యాన్ని మనకు అందిస్తుంది. ఆ అమూల్యమైన అనుభవాల తెలుగు అనువాదం మీ ముందు ఉంచుతున్నాము.

పరిచయం

ప్రియ పాఠకులారా! నేను(వీరేంద్ర జ్యోతీంద్ర తర్ఖడ్) ఈ అనుభవాలను గ్రంథస్తం చేసేముందు, అవన్నీ కూడా నా స్వంత అనుభవాలు కావని, మా తండ్రిగారయిన శ్రీజ్యోతీంద్ర రామచంద్ర తర్ఖడ్  తాము జీవించి ఉన్నప్పుడు ఎన్నోసార్లు మాతో పంచుకున్నవేనని మనవి చేసుకుంటున్నాను. నా చిన్నతనంలో, ఆయన తమ అనుభవాలను చెబుతుండగా విన్న నాకు అవి అద్భుతమైన కథలలాగా అనిపించేవి. నేను పెరిగి పెద్దయ్యాక, శ్రీసాయిబాబా దివ్యశక్తుల గురించి తెలుసుకున్న తరువాత, ఒక సామాన్య మానవుడు తన పూర్తి జీవితకాలంలో పొందడానికి అసాధ్యమైనటువంటి అమూల్యమైన అనుభవాలను, ఆధ్యాత్మిక అనుభూతులను శ్రీసాయిబాబా సాన్నిహిత్యంలో కేవలం 10 సంవత్సరాల వ్యవధిలోనే మా నాన్నగారు పొందారని అర్థమయింది. నేనెప్పుడూ ఈ అద్భుతమయిన అనుభవాలను అందరితో పంచుకోవాలని అనుకుంటుండేవాణ్ణి, కానీ, ప్రాపంచిక జీవితంలో మునిగితేలుతూ, దైనందిన కార్యక్రమాలలో తీరికలేకుండా ఉండే మనకు ఆధ్యాత్మిక రచనల మీద దృష్టి పెట్టడం కష్టమే. సాయిబాబా నడయాడిన పవిత్రక్షేత్రమైన శిరిడీని నేను అనేకసార్లు దర్శించాను. ఆ సమయంలో చాలామంది సాయిభక్తులను కలుసుకుంటున్నప్పుడు, “నేను కూడా ఒక సాయిభక్తుడినేనా?” అనే ఒక ప్రశ్న నాలో ఉదయిస్తుండేది. అలా చెప్పుకోవడానికి నాకు కొంచెం చిన్నతనంగా అనిపించేది, ఎందుకంటే మా నాన్నగారు అనుసరించిన సాయి పూజా విధానానికి, ఆధ్యాత్మిక మార్గానికి నేను దరిదాపులలో కూడా లేను. కానీ, మా నాన్నగారు జీవించి ఉన్నప్పుడు, బాబాతో ఆయనకున్న సాన్నిహిత్యం వల్ల నాకు కూడా శ్రీసాయిబాబాతో అద్వితీయమైన అనుబంధం ఉన్నదని, మా నాన్నగారు శిరిడీలో ఉన్నప్పుడు బాబా కార్యక్రమాలలో ఎంతో చురుకుగా పాల్గొన్న కారణంగా నేను శిరిడీ దర్శిస్తూ ఉంటానని సాటి సాయిభక్తులతో చెపుతుండేవాడిని. 

శ్రీసాయిబాబాతో అంతటి అనుబంధం కలగటానికి మా తర్ఖడ్ కుటుంబంలోని  ముగ్గురు వ్యక్తులు - మా నానమ్మగారు శ్రీమతి సీతాదేవి రామచంద్ర తర్ఖడ్, మా తాతగారు శ్రీరామచంద్ర ఆత్మారాం తర్ఖడ్ మరియు మా నాన్నగారు శ్రీజ్యోతీంద్ర రామచంద్ర తర్ఖడ్ - ప్రధాన కారకులు. శ్రీసాయిబాబాతో ఈ ముగ్గురి అనుబంధం 1908వ సంవత్సరంలో మొదలై 1918వ సంవత్సరం వరకు అంటే శ్రీసాయిబాబా మహాసమాధి అయ్యేంతవరకూ కొనసాగింది. ఈ అనుబంధం ఫలితంగా మా కుటుంబంలోని వారందరికీ శ్రీసాయిబాబా ఆరాధ్య దైవమయ్యారు.

నేను శిరిడీలో వున్నప్పుడు ఎవరైనా సాయిభక్తులు మా నాన్నగారు పొందిన కొన్ని దివ్యానుభూతులను వర్ణించమని నన్ను కోరినప్పుడు, వారి కోరికను మన్నించి, అప్పటికప్పుడు నా మదిలో మెదిలిన అనుభవాలను వారితో పంచుకునేవాడిని. ఇదంతా శిరిడీలోని లెండీబాగ్‌‌లో జరుగుతూ ఉండేది. ఆ అనుభవాలను విన్న భక్తులు ఆ తరువాత నా పాదాలకు నమస్కరించేవారు. వారలా చేయటం నాకు చాలా ఇబ్బందిగా అనిపించేది. ఒకసారి పుణె నుంచి వచ్చిన ఒక సాయిబృందం నన్ను పుణె వచ్చి అక్కడి సాయిభక్తులందరికీ ఆ అనుభవాలన్నింటినీ వివరించమని నన్ను కోరారు. నేనందుకు సమ్మతించి, నా భార్యాపిల్లలతో కలిసి పుణె వెళ్ళాను. రెండు గంటలపాటు జరిగిన ఆ కార్యక్రమం పూర్తయ్యాక, నాకు నమస్కారం చేయడానికి అందరూ లైనులో నిలబడివున్నారు. నేను గృహస్తుడిని, నేను పంచుకున్న అనుభవాలన్నీ మా నాన్నగారివి, పైగా వాటిని చెప్పేటప్పుడు కొన్ని తప్పులు జరిగే అవకాశం ఉన్న కారణంగా భవిష్యత్తులో ఇటువంటి కార్యక్రమాలకు దూరంగా ఉండాలని నిశ్చయించుకున్నాను. అదే సమయంలో, నేను ఉద్యోగ విరమణ చేసిన తరువాత చాలా ఖాళీ సమయం ఉంటుందని, ఆ సమయాన్ని మా తర్ఖడ్ కుటుంబసభ్యుల అనుభవాలను గ్రంథస్తం చేయటానికి ఉపయోగించుకోవాలని నిశ్చయించుకున్నాను. ఇది కేవలం శ్రీసాయిబాబాపై నాకున్న భక్తి, ప్రేమలను తెలియచేయడానికే. జూన్ 18, 2003 నాటికి నాకు 60 సంవత్సరాలు నిండాయి. ఈరోజు ఆగస్టు 15, 2003 అనగా మన ప్రియతమ భారతదేశపు 57వ స్వాతంత్య్ర పర్వదినాన, నేను ఈ పుస్తకం వ్రాయడానికి ఉపక్రమించాను.

ప్రియమైన సాయిభక్తులారా! నేను(వీరేంద్ర జ్యోతీంద్ర తర్ఖడ్) చిరస్మరణీయమైన శ్రీసాయిసచ్చరిత్ర రచించిన శ్రీఅన్నాసాహెబ్ దభోళ్కర్ (హేమాడ్ పంత్) అంతటివాడిని కాదని సవినయంగా మనవి చేసుకుంటున్నాను. శ్రీసాయిబాబా జీవితచరిత్రను 53 అధ్యాయాలుగా గ్రంథస్తం చేయబడిన ఆ పవిత్రమైన గ్రంథాన్ని నేను క్రమం తప్పకుండా పారాయణ చేస్తుంటాను. ఆ పవిత్రమైన గ్రంథంలో, మా నాన్నగారు శిరిడీలో ఉన్నప్పుడు జరిగిన సంఘటనలు కూడా ఉన్నాయి. మా నాన్నగారు తాను స్వయంగా చూసి, నాకు చెప్పిన వాటిని, నేను మీకు సవినయంగా వివరిస్తున్నాను. ఆ సంఘటనలు జరిగిన ఖచ్చితమైన తేదీలు గాని, సమయం గాని మీకు చెప్పలేకపోతున్నందుకు నన్ను మన్నించమని కోరుకుంటున్నాను.

మా నాన్నగారు, 1908 - 1918 సంవత్సరాల మధ్యకాలంలో మొత్తం 17 సార్లు శిరిడీ దర్శించారు. ఒకసారి శిరిడీ వెళితే, అక్కడ 8 రోజుల నుంచి నెలరోజుల వరకు ఉండేవారు. ఈ సందర్భాలలో ఆయన, శ్రీసాయిబాబా మానవాతీతశక్తులను, దివ్యలీలలను ప్రత్యక్షంగా చూశారు. నిజానికి, ఆయన తను సెయింట్ జేవియర్ స్కూల్ విద్యార్థిగా ఉన్నప్పుడే తన అనుభవాలను వ్రాస్తుంటే ఎంతో బాగుండేది. మా మనస్సుకు అద్వితీయమైన ప్రశాంతతను కలుగచేసే ఈ అనుభవాలు వ్రాయడానికి గల ముఖ్యకారణం శ్రీసాయిబాబాపై మాకున్న ప్రగాఢమైన, మనఃపూర్వకమైన భక్తి శ్రద్దలను వ్యక్తీకరించడానికే.

ఈ గ్రంథం చదివిన తరువాత నాకు కూడా కొన్ని దివ్యానుభూతులు కలిగి ఉండవచ్చని మీరు అనుకోవచ్చు. నాకు కలిగిన అనుభవాలు, మా నాన్నగారు అనుభవించినంత గొప్పవి మాత్రం ఖచ్చితంగా కాదని నేను సవినయంగా మనవి చేస్తున్నాను. ఆయన పూర్వజన్మ సుకృతం వల్ల, ఆయనకు శ్రీసాయిబాబాతో అనుబంధం ఏర్పడాలని ముందే విధి నిర్ణయింపబడి వున్నదని నేను ప్రగాఢంగా విశ్వసిస్తున్నాను. 

ఆయన అనుభవాలన్నీ కూడా ఆయన వివాహానికి ముందు అనగా ఆయన వయస్సు 14 నుండి 25 సంవత్సరాల మధ్యలో ఉండగా జరిగినవి. అటువంటి దివ్యానుభూతులను పొందిన తర్వాత కూడా మా నాన్నగారు సంసార జీవితంలోకి ఎందుకు అడుగుపెట్టారోనని నేను చాలాసార్లు ఆశ్చర్యపోతూ ఉండేవాడిని. ఒకవేళ అలానే జరిగివుంటే అప్పుడు నేనే ఉండేవాడిని కాదు, ఈ పుస్తకం కూడా వెలుగు చూసి ఉండేదికాదు.

తర్ఖడ్ కుటుంబ పరిచయం

మా స్వంత ఊరు వసయ్ కోట (ఫోర్ట్ ఆఫ్ బస్సెన్) దగ్గరున్న తర్ఖడ్  గ్రామం. అందుచేత  మా ఇంటి పేరు తర్ఖడ్ అయింది. చారిత్రాత్మకంగా, మా పూర్వీకులు గొప్ప మరాఠాయోధుడైన చిమ్నాజీ అప్పాగారితో కలిసి వసయ్ కోట యుద్ధంలో పోర్చుగీసువారికి వ్యతిరేకంగా పోరాడారు. ఆ యుద్ధంలో పోర్చుగీసువారు ఓడిపోయారు. మా పూర్వీకుల ధైర్యసాహసాలకు గుర్తుగా చిమ్నాజీ అప్పాగారు తర్ఖడ్ గ్రామాన్ని వారికి జాగీరుగా ఇచ్చారు. తరువాత కాలంలో మరాఠాల నుంచి ఆ కోటను ఆంగ్లేయలు తమ వశం చేసుకున్నారు. మా ముత్తాత నాన్నగారయిన శ్రీపాండురంగ తర్ఖడ్ తమ నివాసం తర్ఖడ్ నుండి ముంబయికి మార్చారు. ఆయన చౌపాటీలోని చర్నీరోడ్డులో విల్సన్ కాలేజ్ దగ్గర బంగళా కట్టుకున్నారు. పాండురంగ గారికి ఇద్దరు కొడుకులు - దడోబా మరియు ఆత్మారాం. వీరిలో దడోబా ప్రముఖ వ్యాకరణవేత్త. ఆయన మరాఠీ మాతృభాష అయిన వారికోసం, ఆంగ్లంలో తప్పులు లేకుండా చక్కగా మాట్లాడటానికి, వ్రాయడానికి ఉపయోగపడేలా ఆంగ్ల వ్యాకరణ పుస్తకాలను వ్రాసారు. రెండవ కొడుకు ఆత్మారాం వృత్తిరీత్యా వైద్యుడు. అప్పట్లో ముంబయి వైస్రాయికి కుటుంబవైద్యుడు కూడా. 

మా తాతగారయిన శ్రీరామచంద్ర ఆత్మారాం తర్ఖడ్ కాటన్ టెక్స్ టైల్ రంగంలో స్పెషలిస్ట్ మరియు ఖటావ్ గ్రూపు మిల్లులకు సెక్రెటరీ. ఆయన బాంద్రాలో తన నివాసాన్ని ఏర్పాటు చేసుకున్నారు. తరువాత ఆయనకు శ్రీసాయిబాబాతో పరిచయం ఏర్పడింది. 'శ్రీశిరిడీ సాయిబాబా సంస్థాన్' వ్యవస్థాపకసభ్యులలో ఆయన ఒకరు. అంతేకాకుండా, ఆయన దానికి మొట్టమొదటి కోశాధికారి కూడా. 

ముంబయి మరియు మహారాష్ట్ర ప్రజలకు బాబా సందేశాలనందిస్తున్న దాసగణు మహారాజుకు ఆయన సాధ్యమయినంత సహాయం చేస్తుండేవారు. మీరు శిరిడీని సందర్శించినప్పుడు, బాబా సమాధిమందిరంలో, బాబా భక్తుల ఫోటోల మధ్యలో వారి ఫోటోలను కూడా చూడవచ్చు. స్వర్గీయ అన్నాసాహెబ్ దభోళ్కర్ వ్రాసిన శ్రీసాయిసచ్చరిత్ర గ్రంథం మనకు ఆ కాలంలో శిరిడీలో జరిగిన బాబా లీలల యొక్క సమగ్ర సమాచారాన్ని అందిస్తుంది. శ్రీసాయిసచ్చరిత్రలోని 9వ అధ్యాయం తర్ఖడ్ కుటుంబానికి శ్రీసాయిబాబాతో గల అనుభవాలను తెలియచేస్తుంది. ఆ అధ్యాయంలో ప్రస్తావించబడిన బాబాసాహెబ్ తర్ఖడ్ మా తాతగారు, శ్రీమతి తర్ఖడ్ మా నానమ్మగారు, వారి కుమారుడు జ్యోతీంద్ర రామచంద్ర తర్ఖడ్ మా నాన్నగారు. నేను చెప్పబోయే అనుభవాలు ఎక్కువగా మా నాన్నగారు జ్యోతీంద్రగారివిఆయన 1895, జూన్ 15న జన్మించి, 1965, ఆగస్టు 16న మరణించారు. 

రచయిత పరిచయం

నా పేరు వీరేంద్ర జ్యోతిరాజా తర్ఖడ్. జ్యోతీంద్ర రెండవ కుమారుడిని. వృత్తిరీత్యా నేను ఇంజనీరుని. నేను క్రాంప్టన్ గ్రీవ్స్ లిమిటెడ్, సీమన్స్ ఇండియా లిమిటెడ్ అనే రెండు కంపెనీలలో మేనేజర్ హోదాలో పనిచేసి, ప్రస్తుతం పదవీవిరమణ చేసి శాంతాక్రజులో ఉంటున్నాను. ప్రియమైన సాయిభక్తులారా! ఈ గ్రంథం చదివిన తరువాత శ్రీసాయిపై మనకున్న భక్తి, ప్రేమలను పరస్పరం పంచుకోవడానికి మనం తప్పక కలుసుకోవచ్చు.

వీరేంద్ర జ్యోతీంద్ర తర్ఖడ్

సోర్స్ : "Live Experiences of the Tarkhad Family with Shri Sai Baba of Shirdi"


 




 

 


తరువాయి భాగం

కోసం

బాబా పాదాలు

తాకండి.


3 comments:

  1. Om Sai Ram 🙏🌹🙏
    ఓం శ్రీ సాయినాథాయ నమః 🙏
    ఓం శ్రీ సాయి ఆరోగ్య క్షేమదాయ నమః🙏

    ReplyDelete
  2. ఓం సాయిరాం...🌹🙏🏻🌹

    ReplyDelete
  3. తరువాయి బాగం please

    ReplyDelete

సాయి మహారాజ్ సన్నిధి సోషల్ మీడియా లింక్స్:

Subscribe Here

బ్లాగ్ అప్డేట్ నోటిఫికేషన్స్ నేరుగా మీ మెయిల్ కే వచ్చేందుకు క్రింద బాక్సులో మీ మెయిల్ ఐడి టైపు చేసి subscribe పై క్లిక్ చేసి, తరువాత స్టెప్స్ పూర్తీ చేయండి.

Delivered by FeedBurner

Followers

Recent Posts


Blog Logo