సాయి వచనం:-

- శ్రీబాబూజీ.

తర్ఖడ్ కుటుంబ అనుభవాలు - 10వ భాగం


బాబా పెట్టిన బంగారు పరీక్ష

ప్రియమైన సాయిభక్తులారా! ఇంతవరకు నేను చెప్పిన అనుభవాలన్నీ కూడా మీకు సంతోషాన్ని కలిగించాయని అనుకుంటున్నాను. సాధారణంగా మన జీవితచక్రంలో, మొదట సంసార జీవితంలో చిక్కుకొని, అందులోని తీపి, చేదులను అనుభవించాక, చివరకు మనశ్శాంతికోసం ఆధ్యాత్మికతవైపు ఆకర్షితులమవుతాము. కానీ, మా నాన్నగారి విషయంలో ఇది తలక్రిందులైంది. ఆయన మొదట ఆధ్యాత్మికంగా ఎన్నో దివ్యానుభూతులను పొందిన తరువాతనే సంసారజీవితాన్ని అనుభవించారు. కానీ, సాయిబాబా సహచర్యం వలన, ఆయన జీవితంలో ఎటువంటి పరిస్థితినైనా ఎదుర్కొనే నేర్పుని, స్థైర్యాన్ని పొందారనే విషయం మాత్రం తేటతెల్లం. 

భక్తిమార్గంలో సాధన మొదలుపెట్టాక, సాధకుడు జీవితంలో ఎటువంటి విపత్కర పరిస్థితినైనా ఎదుర్కొనేందుకు సన్నద్ధమవుతాడని నేను కూడా నమ్ముతాను. ఇప్పటికి మా నాన్నగారు శిరిడీకి చాలాసార్లు వెళ్ళి ఆయన ఖాతాలో ఎన్నో దివ్యానుభూతులను జమచేసుకుని ఆధ్యాత్మికంగా ఎంతో ధనవంతుడయ్యారు. కానీ జీవితంలో, ఆయన కూడా కొన్ని క్లిష్టమైన పరిస్థితులను ఎదుర్కోవలసి వచ్చింది.

అవి శీతాకాలపు రోజులు. పగటి సమయం తక్కువ, రాత్రి సమయం ఎక్కువగా ఉండే కాలం అది. అలాంటి ఒక సాయంత్రం ఆకాశంలో నక్షత్రాలు మిణుకు మిణుకుమని మెరుస్తున్న సమయంలో, బాబా మా నాన్నగారిని తమతో పాటు రమ్మన్నారు. అది ఊహించని ఆహ్వానం. ఎందుకంటే, మామూలుగా ఆ సమయంలో బాబా ఎన్నడూ మసీదు విడిచివెళ్ళరు. ఆయన లెండీబాగ్ వైపు నడుచుకుంటూ వెళ్ళి, అక్కడనుంచి క్రిందటి అధ్యాయంలో వివరించిన వాగు ఒడ్డు వద్దకు వచ్చారు. అప్పటికి పూర్తిగా చీకటి పడింది. చంద్రుడు ఆకాశం మధ్యలోకి వచ్చాడు. అప్పుడు బాబా మా నాన్నగారితో, ఒక విచిత్రం చూపించడానికి ఆయనను అక్కడకు తీసుకుని వచ్చానని చెప్పారు. బాబా తనపై ప్రత్యేకమైన శ్రద్ధను చూపిస్తున్నందుకు మా నాన్నగారు చాలా సంతోషించారు. 

వాళ్ళు అక్కడే నేలమీద కూర్చున్నాక, బాబా తమ చేతితో మెత్తగావున్న మట్టిని కదిలించడం మొదలుపెట్టారు. ఆయన మా నాన్నగారితో మట్టిలో ఏమైనా కనబడుతోందేమో చూడమని అడిగారు. మా నాన్నగారు మట్టిలో చూసి, ఏమీ లేదని చెప్పారు. బాబా ఇంకొంచెం మట్టిని త్రవ్వి, ఈసారి ఏమైనా కనిపిస్తుందేమో చూడమన్నారు. మా నాన్నగారు రెండవసారి కూడా చూసి, తనకు మట్టి మాత్రమే కనబడుతోందని చెప్పారు. అప్పుడు బాబా మూడవసారి తిరిగి అదే పని చేసి, తమ చేతితో మా నాన్నగారి తల వెనుక భాగంలో మెల్లగా కొట్టి, ఆయనతో జాగ్రత్తగా చూడమని చెప్పారు. మా నాన్నగారు ఆ ప్రదేశంలో జాగ్రత్తగా చూడగా, అక్కడ ఏదో మెరుస్తున్న లోహం కనబడింది. వెన్నెల వెలుగులో అది ఇంకా మెరుస్తూ కనబడింది. బాబా మళ్ళీ మా నాన్నగారిని ఏమైనా కనబడుతోందా అని అడిగారు. ఏదో లోహపు వస్తువు మెరుస్తూ కనబడుతోందని మా నాన్నగారు జవాబిచ్చారు.

అప్పుడు బాబా, "భావూ! అది బంగారం. నీకు ఎంత కావాలంటే అంత తీసుకో!” అన్నారు. మా నాన్నగారు బాబాతో, “బాబా! నాకివేమీ వద్దు. మీ అనుగ్రహం వల్ల మాకు దేనికీ లోటు లేదు. మీనుంచి ఇటువంటి ప్రాపంచిక లబ్దిని పొందే ఉద్దేశ్యంతో నేను శిరిడీకి రావటం లేదు” అన్నారు. అప్పుడు బాబా ఆయనతో, “భావూ! ఇది లక్ష్మీదేవి. ఆమె నిన్ను అనుగ్రహించడానికి నీ వద్దకు వచ్చింది. ఒక్కసారి కనుక నువ్వు ఆమెను తిరస్కరిస్తే ఇకమీదట జీవితంలో ఆమె ఎప్పుడూ నీ వద్దకు తిరిగి రాదు. అందుచేత ఆలోచించుకో!” అని హెచ్చరించారు. అప్పుడు మా నాన్నగారు బాబాతో, “బాబా! మీరు నన్ను పరీక్షిస్తున్నారు. నేను ఈ మాయలో పడను. మీ ఆశీస్సులు నాతో ఉన్నంతవరకు నేను ఈ మాయలో పడకుండా ప్రశాంతంగా, సుఖంగా జీవించగలను” అని అన్నారు. అప్పుడు బాబా తిరిగి మట్టిని కప్పివేసారు.

తరువాత ఇద్దరూ మసీదుకు తిరిగి వచ్చారు. అదే సమయంలో ఒక ఆసక్తికరమైన సంఘటన జరిగింది. శిరిడీ గ్రామస్థుడొకరు వాగు ఒడ్డున జరిగినదంతా దూరంనుంచి గమనించాడు. సాయిబాబా మా నాన్నగారికి అక్కడేదో నిక్షిప్తమైవున్న నిధిని చూపించి వుంటారని ఊహించాడు. రాత్రి బాగా ప్రొద్దుపోయాక ఆ ప్రదేశానికి వెళ్ళి ఆ నిధిని త్రవ్వి తీసుకుందామనుకున్నాడు. అనుకున్న విధంగా అర్థరాత్రి లేచి ఆ నిధి కోసం బయలుదేరాడు. చీకటిలో అతడు గునపం మీద చెయ్యి వెయ్యగానే, అతడి వేళ్ళమీద తేలు కుట్టింది. దాంతో అతడు నిధి మాట మరచిపోయి, ఆ రాత్రంతా బాధపడుతూనే వున్నాడు. ఉదయానికి బాధ ఇంకా భరింపరానిదిగా తయారవడంతో, అతడు బుద్దిగా సాయిబాబా వద్దకెళ్ళి, తన తప్పు ఒప్పుకుందామని నిశ్చయించుకున్నాడు. గతరాత్రి తాను నిధి కోసం వెళదామనుకున్న విషయం బాబాకు తప్ప మరెవరికీ చెప్పకూడదని అనుకున్నాడు.

అతడు విపరీతమైన బాధతో మసీదులోకి ప్రవేశించినప్పుడు మా నాన్నగారు కూడా అక్కడే ఉన్నారు. ఆ స్థానికుడు తన తప్పును మన్నించమని, ఇకమీదట అటువంటి తప్పు ఎప్పుడూ చేయనని, తనని తేలు కుట్టిన  బాధనుండి విముక్తుణ్ణి  చేయమని బాబాను వేడుకోవటం మా నాన్నగారు చూశారు. మా నాన్నగారు కూడా అతడిని క్షమించమని బాబాను వేడుకున్నారు. అప్పుడు బాబా ఆ స్థానికుడితో, “ఎవరైనా దైవసంకల్పితమైన నిధిని తీసుకోవడానికి నిరాకరిస్తే దానర్థం మరెవరైనా దానిని పొందవచ్చని కాదు. ఈ సృష్టిలో భగవంతుడు కర్మానుసారంగా ఎవరికేది లభించాలో వారికది లభించేలా ఒక నియమాన్ని ఏర్పాటుచేసాడు. ఎవరైతే ఈ నియమాన్ని ఉల్లంఘిస్తారో, వారు భగవంతుని చేత శిక్షింపబడతారు” అని చెప్పారు. మా నాన్నగారికి ఆ సంభాషణంతా అర్థమైంది. తరువాత బాబా తమ పవిత్రమైన ఊదీని, తేలు కుట్టిన ఆ స్థానికుని వేలిపై వ్రాసి, ఇక ముందెన్నడూ అలా చేయవద్దని చెప్పి, భగవంతుడు అతడిని ఆ బాధనుండి విముక్తుడిని చేస్తారని ఆశీర్వదించారు. శిరిడీలో మా నాన్నగారికి బాబా పెట్టిన 'బంగారు పరీక్ష' ఇది. మా నాన్నగారు ఎటువంటి మాయలో పడకుండా సఫలీకృతులయ్యారని నేను అనుకుంటున్నాను. కానీ భవిష్యత్తులో ఆయన ధనాన్ని కూడబెట్టుకోలేకపోయారన్నది మాత్రం నిజం. లక్ష్మీదేవి ఆయనకు దూరంగానే ఉన్నది. అందుచేత ఆయన ఆర్థికపరిస్థితి అంతంత మాత్రంగానే వుండేది.

సోర్స్ : "Live Experiences of the Tarkhad Family with Shri Sai Baba of Shirdi"



ముందు భాగం

కోసం

బాబా పాదుకలు

తాకండి.


నిర్ధిష్టమైన భాగం కోసం పైన నెంబర్లను తాకితే, ఆ నెంబరుకి సంబంధించిన భాగం ఓపెన్ అవుతుంది.

 

 


తరువాయి భాగం

కోసం

బాబా పాదాలు

తాకండి.


2 comments:

  1. Om Sai Ram 🙏🌹🙏
    ఓం శ్రీ సాయినాథాయ నమః 🙏
    ఓం శ్రీ సాయి ఆరోగ్య క్షేమదాయ నమః🙏

    ReplyDelete
  2. OM SRI SACHIDHANAMDHA SAMARDHA SATHDGURU SAINATHAYA NAMAH..Om Sai Ram

    ReplyDelete

సాయి మహారాజ్ సన్నిధి సోషల్ మీడియా లింక్స్:

Subscribe Here

బ్లాగ్ అప్డేట్ నోటిఫికేషన్స్ నేరుగా మీ మెయిల్ కే వచ్చేందుకు క్రింద బాక్సులో మీ మెయిల్ ఐడి టైపు చేసి subscribe పై క్లిక్ చేసి, తరువాత స్టెప్స్ పూర్తీ చేయండి.

Delivered by FeedBurner

Followers

Recent Posts


Blog Logo