సాయి వచనం:-

- శ్రీబాబూజీ.

సాయిభక్తుల అనుభవమాలిక 172వ భాగం....


ఈరోజు భాగంలో అనుభవం:
  • శ్రద్ధ, సబూరీ యొక్క ప్రాశస్త్యం

సాయిభక్తుడు జి.పి.సిన్హా ఒక సాయిలీలను మనతో పంచుకుంటున్నారు:

బాబా కరుణామూర్తి, గొప్ప వైద్యుడు. ఆయన దయకు అంతులేదు. ఆయన అనుగ్రహాన్ని ఆస్వాదించాలంటే మనకు ఉండాల్సినవి కేవలం రెండే రెండు. అవే - శ్రద్ధ, సబూరీ. ఎవరికైతే ఆయనయందు అంతులేని విశ్వాసం, సహనం ఉంటాయో వారి బాధలన్నీ ఇట్టే నిర్మూలించబడతాయి. నేను ఇప్పుడు ఒక బాబా లీలను మీతో పంచుకోబోతున్నాను. నేనెందుకు ఈ అనుభవాన్ని మీతో పంచుకోబోతున్నానంటే, ఆ లీల ద్వారా భక్తులలో శ్రద్ధ, సబూరీ వృద్ధిచెందడంతో పాటు, సచ్చరిత్ర యొక్క ప్రాముఖ్యత కూడా అందరికీ అవగతమవుతుంది.

నా కజిన్ సిస్టర్, నాకు పుత్రికా సమానురాలైన పల్లవికి జతిన్‌తో వివాహమైంది. వాళ్లకొక పాప కూడా ఉంది. 2008 జూలై నెలలో హఠాత్తుగా జతిన్ ఎడమ మోకాలి భాగంలో తీవ్రమైన నొప్పి మొదలైంది. అన్నిరకాల పరీక్షలు చేశారు కానీ, సమస్య నిర్ధారణ కాలేదు. తరువాత డాక్టర్లు MRI, బయాప్సీ పరీక్షలు చేసి 'ఒస్టెరో సర్కోమా' అని నిర్ధారించారు. వాడుక భాషలో చెప్పాలంటే - క్యాన్సర్. వైద్యులు వివిధరకాల అభిప్రాయాలను వెళ్లబుచ్చి, చివరికి కీమోథెరపీ చేయాలని చెప్పారు. దానితో వారి ఇంటి వాతావరణం ఎలా ఉండివుంటుందో ఎవరైనా ఇట్టే ఊహించవచ్చు. అందరూ బాధలో కూరుకుపోయారు.

చాలామంది ముంబాయివాసులలాగే జతిన్‌కి కూడా బాబా గురించి తెలుసు. అయితే అతడు బాబాకు నిజమైన భక్తుడు కాదు. అతడెప్పుడూ శిరిడీ దర్శించలేదు. అదృష్టవశాత్తూ నేను ఆ సమయంలో ముంబాయిలో ఉండటంతో బాబాను ప్రార్థించి జతిన్‌ను చూడటానికి వెళ్ళాను. కొంత సంభాషణ జరిగాక నేను జతిన్‌తో, "బాబా నీకు రక్షణనిస్తారు. పన్వెల్ సాయిదర్బారు నుండి పవిత్రమైన ఊదీ, అభిషేక జలం తెప్పించుకుని ఉపయోగించు. అలాగే ప్రతిరోజూ శ్రీసాయిసచ్చరిత్ర చదువు" అని చెప్పాను. తరువాత నేను ఊదీ, అభిషేక జలం, సచ్చరిత్ర పుస్తకం, బాబా ఫోటో ఒకటి అతనికి పంపించాను(ఆ ఫోటోను మేము నవంబర్ 1997లో శిరిడీలో బాబాకు 'పోషక్' సమర్పించిన తర్వాత తీసిన ఫోటో. ముఖం మీద ప్రత్యేకమైన చిరునవ్వు కలిగివున్న అరుదైన బాబా ఫోటో అది. ఫోటో తీసినప్పటినుండి ఎప్పుడూ ఆ ఫోటో నాతోపాటు ఉండేది). తరువాత నేను, "బాబా! నేను మీ తరపున జతిన్, పల్లవిలకు హామీ ఇచ్చాను. దయచేసి వారికి సహాయం చెయ్యండి" అని బాబాను పదే పదే ప్రార్థిస్తూ ఉండేవాడిని.

జతిన్ నా సూచనలను పాటించడం మొదలుపెట్టాడు. మరోవైపు అతని చికిత్స కూడా ప్రారంభమైంది. అతడు పూర్తి శ్రద్ధ, సబూరీలతో బాబావైపు రెండు అడుగులు వేయడంతో బాబా అతనివైపు చాలా అడుగులు వేశారు. బాబా లీలలు మొదలయ్యాయి. అతడికి కలలో బాబా దర్శనమైంది. కలలోనే తన బాధకు సంబంధించి బాబాతో సంభాషణ కూడా జరిగింది. అతడు, "బాబా! ఈ ప్రాణాంతక వ్యాధి నాకెందుకు వచ్చింది? నేను ఏమి చేసినందుకు నాకీ బాధ?" అని అడిగాడు. అందుకు బాబా ప్రేమపూరితమైన కళ్ళతో చూస్తూ, "ఇదంతా నీ గత జీవిత కర్మల వల్లనే. ఇప్పుడు నువ్వెందుకు బాధపడుతున్నావో తెలుసుకోవాలని అనుకుంటున్నావా? గతంలో నువ్వు ఏమి చేశావో చూడాలనుకుంటున్నావా?" అని అడిగి జతిన్ గత జీవితంలోని కొన్ని పనులను గూర్చి తెలియజేసారు. అప్పుడు జతిన్, "నేను వాటిని గుర్తు తెచ్చుకోలేకున్నాను. కానీ నేనిప్పుడు ఏం చేయాలి?" అని అడిగాడు. బాబా, "నీవు నా సంరక్షణలో ఉన్నావు. కాబట్టి ఎందుకు ఆందోళనపడతావు?" అన్నారు. బాబా మాటలను గుర్తుంచుకోండి.

కొన్నిరోజుల తరువాత జతిన్‌కు రెండవ కల వచ్చింది. కలలో అతడు బాబా పాదాల వద్ద కూర్చుని ఉన్నాడు. బాబా అతనితో, "లేచి నిలబడు. నాతో కూడా రా! భిక్షకు వెళదాం!" అన్నారు. (ఇది చాలా అరుదైన విషయమని నేను అనుకుంటున్నాను. 1918 వరకు బాబా సశరీరులుగా ఉన్న రోజుల్లో, బాబా తన తరపున భిక్షకు వెళ్ళమని కేవలం ఇద్దరు భక్తులను మాత్రమే ఆదేశించారు. అటువంటి గొప్ప అవకాశం కలలో జతిన్‌కు లభించింది.) బాబా, జతిన్ భిక్షకు బయలుదేరారు. ఇద్దరు భక్తుల వద్దనుండి భిక్ష తీసుకున్న తరువాత జతిన్, "బాబా! ఇది మన ఇద్దరికీ సరిపోతుంది. ఇంకా ఎందుకు భిక్ష అడగటం?" అని అడిగాడు. అందుకు బాబా, "నేను ఏమి చేస్తున్నానో నాకు తెలుసు. నువ్వు కేవలం నన్ను అనుసరించు" అని కోపంగా సమాధానమిచ్చారు. తరువాత వాళ్ళు మరికొన్ని ఇండ్లకు వెళ్లి చాలా ఆహారాన్ని సేకరించిన తర్వాత తిరిగి ద్వారకామాయికి వచ్చారు. అతికొద్ది సమయంలో ఎద్దులబండ్లలో చాలామంది ప్రజలు బాబా దర్శనం కోసం వచ్చారు. బాబా వారందరికీ ఆహారాన్ని తినమని చెబుతూ, జతిన్ వైపు నవ్వుతూ చూశారు. 'ఆయనకు అన్నీ తెలుసు. ఆయన ప్రతి ఒక్కరి విషయంలో శ్రద్ధ వహిస్తార'ని జతిన్ గ్రహించి ఆయన పాదాలకు నమస్కరించాడు. అక్కడితో కల ముగిసింది.

అప్పటికి జతిన్‌కి కీమోథెరపీ రెండుసార్లు జరిగింది. అతను చాలా బలహీనపడిపోయి ఉన్నప్పటికీ రోజూ ఊదీ, అభిషేక జలం తీసుకుంటూ ఉన్నాడు. హఠాత్తుగా ఒకరోజు వైద్యులు మరోసారి MRI, బయాప్సీ చేయించమని సూచించారు. సాధారణంగా జరిగే చర్య కాదది. రిపోర్టులు చూసిన వైద్యులు దిగ్భ్రమ చెందారు. క్యాన్సర్ ఆనవాళ్లు ఏమాత్రం కనపడలేదు. వైద్యులు అలాంటి ఫలితాలను అస్సలు ఊహించలేదు. అంత త్వరితగతిన క్యాన్సర్ పూర్తిగా సమసిపోవడం ఎలా సాధ్యమైందని వైద్యులకి ఎంతో ఆశ్చర్యాన్ని కలిగించిందా సంఘటన. సైన్స్ ఎక్కడ ఆగిపోతుందో, అక్కడ విశ్వాసం మొదలవుతుంది. దానితో బాబాతో ఐక్యత లభిస్తుంది. అక్కడితో వైద్యులు ఆగక తమ పుస్తకజ్ఞానాన్ని అనుసరించి తమ తదుపరి చికిత్సను కొనసాగించారు. బాబా, జతిన్‌ ల మధ్య సంభాషణ కూడా కొనసాగింది.

కొన్నిరోజులకి జతిన్ తీవ్రమైన జ్వరంతో హాస్పిటల్లో చేరాడు. అతడు వైద్యులతో, "నా వద్ద బాబా ఊదీ, అభిషేక జలం ఉన్నందున మీరు నా చికిత్స విషయంలో ఆందోళన చెందకండి" అని చెప్పి వాటిని స్వీకరించాడు. కొద్దిసేపట్లో జ్వరం మాయమైంది. తరువాత తెల్లవారుఝామున అతడు గాఢనిద్రలో ఉన్న సమయంలో బాబా మళ్ళీ స్వప్నదర్శనమిచ్చారు. అతడు, "బాబా! హాస్పిటల్ సిబ్బంది వచ్చి నా రక్తనమూనాలు సేకరించేందుకు అరగంట సమయం మాత్రమే ఉంది. ఈలోగా నేను ఏదైనా ఆధ్యాత్మిక అనుభవం పొందగలనా?" అని అడిగాడు. అందుకు బాబా, "ఎందుకు పొందలేవు?" అంటూ అదృశ్యమయ్యారు. జతిన్ ఆయనకోసం వెతకడం ప్రారంభించాడు. అలా వెతుకుతూ వెతుకుతూ శిరిడీ వీధుల్లో తానున్నట్లు గుర్తించాడు. ఆ వీధి ద్వారకామాయికి దారితీసింది. అతడు ద్వారకామాయిలోకి ప్రవేశించి చూడగా, బాబా ధునిమాయి ఎదురుగా తాము సాధారణంగా కూర్చునే చోట కూర్చొని ఉన్నారు. అతడు బాబాతో, "మీరు ఎక్కడికి అదృశ్యమయ్యారు?" అని అడిగాడు. బాబా, "నేను ఇతరులను కూడా చూసుకోవాలి. ఇక్కడ నా అవసరం ఉంది" అని సమాధానమిచ్చారు. అప్పుడు జతిన్ బాబాతో, "నేను మీ ఒడిలో పడుకోవచ్చా?" అని అడుగగా బాబా, "నా ఒడి యొక్క ఉపయోగమే అది.  అందరూ ఇక్కడ విశ్రాంతి తీసుకోవచ్చు. రా, వచ్చి కొంతసేపు నిద్రపో!" అన్నారు. అతడు బాబా ఒడిలో తల పెడుతూనే వర్ణించలేని ఆనందకరమైన స్థితిలోకి వెళ్ళిపోయాడు. (దానిని అతను వివరించలేకపోయాడు. బహుశా అది సమాధిస్థితి అయివుండొచ్చని నేను అనుకుంటున్నాను.) కొంతసేపటికి జతిన్ ఆ ఆనందాన్ని అనుభవిస్తూనే తను హాస్పిటల్ బెడ్‌ మీద ఉన్నట్లు, బాబా తన తలపై తడుతున్నట్లు అనుభూతి చెందాడు. ఆ స్థితిలో హాస్పిటల్ సిబ్బంది ప్రత్యక్షమయ్యారు. అతడు, "నేను నా కళ్ళు తెరవను. ఈ స్థితి నుండి బయటకు రావడం నాకు ఇష్టం లేద"ని చెప్పాడు. ఆ స్థితిలోనే రక్తనమూనాలు తీసుకునేందుకు తన చేతిని అందించాడు. 30 నిముషాల సమయంలో కల ముగిసింది. అతనికి  ఆ ఆనందకరమైన స్థితి మాత్రం గంటల తరబడి కొనసాగింది.

అలాంటి బాధాకరమైన పరిస్థితులు చుట్టుముట్టినప్పుడు మనమందరం విచ్ఛిన్నమైపోతాము. మన జీవితాలు ముగిసిపోయినట్లు అనిపిస్తుంది. కానీ జతిన్ పూర్తిగా బాబాకు శరణాగతి చెందడం, ఆయనపై తనకున్న విశ్వాసం తన జీవితంలోకి సంతోషకరమైన క్షణాలను తెచ్చిపెట్టింది. అతని అనుభవం ద్వారా శ్రద్ధ, సబూరీ యొక్క ప్రాశస్త్యాన్ని తెలిపారు బాబా. ఇంత చక్కటి అనుభవాన్ని చూపినందుకు బాబాకు కృతజ్ఞతలు తెలియజేసేందుకు పదాలు దొరకడంలేదు నాకు.


శ్రీ సచ్చిదానంద్ సద్గురు సాయినాథ్ మహరాజ్ కీ జై!

- జి.పి.సిన్హా

7 comments:

సాయి మహారాజ్ సన్నిధి సోషల్ మీడియా లింక్స్:

Subscribe Here

బ్లాగ్ అప్డేట్ నోటిఫికేషన్స్ నేరుగా మీ మెయిల్ కే వచ్చేందుకు క్రింద బాక్సులో మీ మెయిల్ ఐడి టైపు చేసి subscribe పై క్లిక్ చేసి, తరువాత స్టెప్స్ పూర్తీ చేయండి.

Delivered by FeedBurner

Followers

Recent Posts


Blog Logo