సాయి వచనం:-

- శ్రీబాబూజీ.

సాయిభక్తుల అనుభవమాలిక 164వ భాగం....


ఈరోజు భాగంలో అనుభవాలు:
  1. బాబా ప్రణాళికలు ఎప్పుడూ గొప్పగా ఉంటాయి
  2. బాబా కృపతో కాలు నయమయింది

బాబా ప్రణాళికలు ఎప్పుడూ గొప్పగా ఉంటాయి

హైదరాబాదు నుండి సాయిభక్తురాలు అర్చన తనకు ఇటీవల జరిగిన అనుభవాన్ని మనతో పంచుకుంటున్నారు:

ఓం సాయిరాం! నేను సాయిబాబా భక్తురాలిని. నా ఉద్యోగం విషయంలో ఎన్నోసార్లు బాబా నాకు సహాయపడ్డారు. అందుకు సంబంధించిన కొన్ని అనుభవాలను ఇదివరకు మీతో పంచుకున్నాను. ఇప్పుడు మరో అనుభవాన్ని మీతో పంచుకుంటాను.

నేను గత 12 సంవత్సరాలుగా సాఫ్ట్‌వేర్ రంగంలో డెవలప్‌మెంట్ ఇంజనీరుగా పనిచేస్తున్నాను. కానీ కుటుంబ జీవితాన్ని, వృత్తి జీవితాన్ని చక్కగా నిర్వహించుకోవాలంటే నేను టెస్టింగ్ ఇంజనీర్ అయితే బాగుంటుందని నాకనిపించేది. అందుకే అందరూ వద్దని చెప్తున్నప్పటికీ, గత మూడు సంవత్సరాలుగా నేను డెవలప్‌మెంట్ నుంచి టెస్టింగ్ వైపుకి మారాలని ప్రయత్నిస్తున్నాను, కానీ కుదరడంలేదు. ఈ విషయమై మొదట్లో నేను బాబాను అడిగినప్పుడు ఆయన నుండి ‘వద్దు’ అని సమాధానం వచ్చేది. అయితే, 2018లో అడిగినప్పుడు మాత్రం ఎక్కువ శాతం, ‘నీ కోరిక ఇప్పుడు కాదు, వచ్చే సంవత్సరం నెరవేరుతుంది’ అని సమాధానం వచ్చేది. అదలా ఉంటే గత సంవత్సరం డిసెంబరు నెలలో నేను క్రొత్త ప్రాజెక్టు కోసం చూస్తున్నప్పుడు 3 నెలల ప్రాజెక్టు వచ్చింది. మూడు నెలల తర్వాత వేరే ప్రాజెక్టులోకి నన్ను తీసుకుంటే పర్వాలేదు, లేకపోతే బెంచ్‌లో ఉంచుతారని నేను కాస్త ఆందోళనపడినప్పటికీ, అప్పటివరకు ఎలా అయితే బాబా నాకు సహాయం చేస్తున్నారో అలాగే ఆ 3 నెలల తరువాత కూడా చూసుకుంటారని ఆ ప్రాజెక్టులో చేరాను. బాబా దయవలన ఆ మూడు నెలల ప్రాజెక్టు 9 నెలలకి పొడిగించబడింది. ఆ 9 నెలల్లో, 3 నెలల డెవలప్‌మెంట్ జరిగాక టీం అంతా మార్చారు. నన్ను ఒక టెస్టింగ్ మేనేజర్ క్రింద వేశారు. ఆయన చాలా మంచివారు. నన్ను ఏ మాత్రం ఇబ్బందిపెట్టకుండా చూసుకుంటూ టెస్టింగ్ నేర్చుకోమని ప్రోత్సహించేవారు. అలాగని ఆ విషయంలో నన్ను ఒత్తిడి చేసేవారు కాదు.


ఆ ప్రాజెక్ట్ పూర్తయ్యాక టెస్టింగ్ వర్క్ వస్తుందని అందరూ అనుకున్నారు, కానీ రాలేదు. క్రొత్త ప్రాజెక్ట్ వర్క్ వచ్చే సూచనలేమీ కనపడని కారణంగా మా టెస్టింగ్ మేనేజర్ నన్ను వేరే ప్రాజెక్ట్ చూసుకోమన్నారు. ఆ క్షణంనుండి వేరే ప్రాజెక్టు చూసుకోవడానికి ఎంత సమయం పడుతుందో ఏమిటోనని నాకు టెన్షన్ మొదలైంది. చివరికి వర్క్ లేని కారణంగా 2019, ఆగస్టు 15న నన్ను బెంచ్ మీద వేశారు. నేను చాలా ఆందోళనపడ్డాను. ఎందుకంటే, బెంచ్ మీద అప్పటికే చాలామంది ఉన్నారు. అంటే, ప్రాజెక్టులు లేవేమో అని భయమేసింది. కానీ నేను ఎప్పుడు సాయి ప్రశ్నావళి (బాబా నాకు సమాధానాలు చెప్తారు) చూసినా, “నీకు మంచి జరుగుతుంది, దేవుడి మీద నమ్మకం ఉంచుకో!” అని సమాధానం వచ్చేది. అలా బాబా నుండి సానుకూలమైన సమాధానం వస్తున్నప్పటికీ నేను స్థిమితంగా ఉండలేకపోయేదాన్ని. ఒకవైపు క్రొత్త ప్రాజెక్ట్ చూసుకోవాల్సిన పరిస్థితి, మరోవైపు పిల్లల్ని చూసుకోవడానికి ఇంట్లో వేరే ఎవరూ లేరు. ఇవిగాక వేరే సమస్యలు. అలా సమస్యలన్నీ నన్ను చుట్టుముట్టాయి. పైగా అలాంటి సమయంలో నేను 2 డెవలప్‌మెంట్ ఇంటర్వూలలో పూర్తిగా విఫలమయ్యాను. దానితో నా మానసిక పరిస్థితి చాలా దారుణంగా అయిపోయింది. నా మీద నాకే నమ్మకం లేకుండా పోయి ఎప్పుడూ బాధపడుతూ ఉండేదాన్ని. బాబా మాత్రం భవిష్యత్తు బాగుంటుంది’ (సాయి ప్రశ్నావళి ద్వారా) అనే చెప్తుండేవారు. అదే సమయంలో ముగ్గురు టెస్టింగ్ మేనేజర్లు కాల్ చేసి ఇంటర్వ్యూ చేశారు. ఆశ్చర్యం! నేను చాలా ధైర్యంగానూ, ఆత్మవిశ్వాసంతోనూ మాట్లాడాను. ఇద్దరు మేనేజర్లు నన్ను వాళ్ళ ప్రాజెక్టులో దాదాపు తీసుకుంటామనేలా మాట్లాడారు, కానీ చివరి నిమిషంలో తీసుకోకపోయేసరికి నేను చాలా బాధపడ్డాను. ఆ దిగులుతో తీవ్రమైన తలనొప్పి కూడా వచ్చేసింది. మానసికంగా ఎంతో బాధపడుతున్నప్పటికీ ప్రతిక్షణం బాబానే తలచుకుంటూ, "నాకు సహాయం చేయమ"ని అడుగుతూ ఉండేదాన్ని. బాబా, "నీ నమ్మకం చంచలంగా ఉంది. దాన్ని స్థిరపరుచుకో" అని చెప్తుండేవారు. తరువాత హఠాత్తుగా ఇద్దరు టెస్టింగ్ మేనేజర్లు, ‘మీరు మాకు కావాలి’ అని ఫోను చేసి చెప్పారు. నేను చాలా ఆనందించాను. ఎందుకంటే, మొట్టమొదటి ఇంటర్వూలలో నేను విఫలమయ్యాను, తరువాత నేను ఇంటర్వ్యూ సరిగా చేసినా ఇద్దరు మేనేజర్లు నన్ను తీసుకోలేదు. అలాంటిది, బాబా అనుగ్రహంతో ‘మీరే కావాలి’ అని వాళ్ళే స్వయంగా అడగటంతో నేను చాలా ఆనందించాను. కానీ, ఏ మేనేజర్ దగ్గర వర్క్ చేయాలన్న విషయంలో నిర్ణయం తీసుకోలేక అది కూడా బాబాకే వదిలేశాను. ఆయన ఒక ప్రాజెక్టు వాళ్ళు నన్ను తీసుకొనేలా చేశారు. ఒక గురువారంరోజు, ఆ ప్రాజెక్ట్ లీడ్ నాకు ఫోన్ చేసి, నన్ను ప్రాజెక్టులోకి తీసుకుంటున్నట్లు నిర్ధారణ చేసి, ఒకసారి వచ్చి తనని కలవమని చెప్పారు. ఆయన మాటతీరును బట్టి నెమ్మదస్తులుగా ఉన్నట్లుగా నాకనిపించి, బాబా నన్ను సరైన చోట చేరుస్తున్నారని సంతోషించాను.


తరువాత నేను ఆ లీడ్ ని కలవడానికి వెళ్తున్నపుడు ఎవరో తుమ్మారు. తుమ్మితే ఏదో చెడు జరుగుతుందని నాకు సెంటిమెంట్. అయినప్పటికీ లీడ్ ని కలవక తప్పదు కాబట్టి నేను బయలుదేరుతూ ఆయన ఎక్కడ ఉంటారో సరిగా తెలియని కారణంగా ఒక డెస్క్ దగ్గర ఆగాను. అక్కడ ఉన్న అతన్ని లీడ్ ఉండే లొకేషన్ గురించి అడగాలని చూచేసరికి, చిత్రం! అక్కడ రెండు చిన్న బాబా ఫొటోలు ఉన్నాయి. అప్పుడు అనిపించింది, ‘బాబా నాతోనే ఉన్నారు. తుమ్ములకు భయపడాల్సిన పని లేద"ని. ఇక ధైర్యంగా వెళ్లి లీడ్ ని కలిసి మాట్లాడాను. బాబా దయవలన అంతా బాగా జరిగింది. ఆ తరువాత వారంరోజులకి ఆ ప్రాజెక్టుని నన్నే నడిపించమని చెప్పారు. అంత అద్భుతంగా బాబా నన్ను ప్రాజెక్టులో స్థిరపరిచారు.


చివరికలా టెస్టింగ్ వైపు వెళ్ళాలన్న నా మూడేళ్ళ కోరికను బాబా నెరవేర్చారు.
కానీ ఇప్పుడు గతంలోకి చూసుకుంటే బాబా ప్రణాళికలు ఎంత గొప్పగా ఉంటాయో అర్థమవుతుంది. ఈ మూడేళ్ళలో నేను డెవలప్‌మెంట్ లోనే ఉన్నా కుటుంబ జీవితానికి, వృత్తి జీవితానికి అనుకూలంగానే నడిచింది. మాములుగా అయితే చాలా ఇబ్బందిగానే ఉండేది. కానీ బాబా నాపై ప్రేమతో ఆ అనుకూలతను ఏర్పరిచారు. నేరుగా టెస్టింగ్ ప్రాజెక్టులోకి వెళ్తే ఇబ్బంది అవుతుందనేనేమో, ముందుగా ముందు ప్రాజెక్టులో ఉండగానే కొంతకాలం నన్ను టెస్టింగ్‌లో పెట్టి నాకు అవగాహన వచ్చేలా చేసి, ఇప్పుడొక ప్రాజెక్టుని నడిపించేంత పెద్ద బాధ్యతను నాకప్పగించారు బాబా. మనకు ఎప్పుడు ఏమి ఇవ్వాలో ఆయనకు బాగా తెలుసు. అంతవరకూ మనం సబూరీతో ఉండడమే మనకు మంచిది.

బాబా కృపతో కాలు నయమయింది

స్వీడన్‌ నుండి సాయిభక్తురాలు లలిత తన అనుభవాన్నిలా పంచుకుంటున్నారు:

ఓం సాయిరామ్! 2007 నుండి నేను సాయిభక్తురాలిని. సాయిని తలచుకున్న తరువాతే నేను ఏ పనైనా చేస్తాను. డిసెంబర్, జనవరి నెలల్లో స్వీడన్ మంచుతో కప్పబడిపోతుంది. ఆ సమయంలో ఒకరోజు సాయంత్రం నేను బస్సు ఎక్కాను. బస్సు దిగుతున్నప్పుడు అంతా మంచు కప్పబడివున్నందున అక్కడ రాయి ఉందని తెలియక దానిపై అడుగుపెట్టాను. ఆ రాయి పక్కకి ఒరగడంతో నా కాలు బెణికినట్టు అయింది. ఎలాగో మొత్తానికి మేనేజ్ చేసుకుంటూ ఇంటికి చేరుకున్నాను. రాత్రి గడుస్తున్న కొద్దీ నేను నా కాలు కదపడం కష్టంగా అయిపోయింది. నిలబడటానికి ప్రయత్నిస్తే, ఆసరా లేకుండా నిలబడలేకపోయాను. ఫ్రాక్చర్ ఏమైనా అయిందేమోనని భయమేసింది. రాత్రంతా బాబాను ప్రార్థిస్తూ నిద్రపోవడానికి ప్రయత్నించాను. మరుసటిరోజు ఉదయం సాయి స్మరణ చేస్తూ కాలికి నూనె మర్దన చేసి, స్ప్రే కూడా చేసి నెమ్మదిగా కొన్నిసార్లు చీలమండ కదిలించాను. పెద్ద సమస్యలేవీ లేకుండా బాబా కృపవలన కాలు నయమయింది. "బాబా! మీకు చాలా చాలా కృతజ్ఞతలు". సాయి నా ఏకైక నమ్మకం.

2 comments:

సాయి మహారాజ్ సన్నిధి సోషల్ మీడియా లింక్స్:

Subscribe Here

బ్లాగ్ అప్డేట్ నోటిఫికేషన్స్ నేరుగా మీ మెయిల్ కే వచ్చేందుకు క్రింద బాక్సులో మీ మెయిల్ ఐడి టైపు చేసి subscribe పై క్లిక్ చేసి, తరువాత స్టెప్స్ పూర్తీ చేయండి.

Delivered by FeedBurner

Followers

Recent Posts


Blog Logo