సాయి వచనం:-

- శ్రీబాబూజీ.

సాయిభక్తుల అనుభవమాలిక 157వ భాగం....


ఈరోజు భాగంలో అనుభవాలు:
  1. ఆదుకున్న సాయినాథుడు
  2. ఉపాధిని చూపించి మానసికస్థైర్యాన్ని పెంచిన బాబా

ఆదుకున్న సాయినాథుడు

గుర్గాఁవ్ నుండి శ్రీమతి కమల్ తనకు బాబా ప్రసాదించిన అనుభవాలను మనతో ఇలా పంచుకుంటున్నారు:

“బాబా! మీరు నాకు ప్రసాదించిన అనుభవాలను అందరితో పంచుకునే శక్తిని, ధైర్యాన్ని ప్రసాదించండి తండ్రీ!”

నా పేరు కమల్. 2005వ సంవత్సరంనుంచి నేను బాబా మందిరానికి వెళ్లి ఆరతులకు హాజరవుతుండేదానిని. క్రమంగా నాకు బాబా ఆరతులంటే చాలా ఇష్టం ఏర్పడింది. 2012లో మావారు తను చేస్తున్న ఉద్యోగాన్ని వదిలిపెట్టి బిజినెస్ లోకి వచ్చారు. తను ముక్కుసూటి మనిషి. ఎవరితోనూ అంతగా కలవరు. అయితే తనది చాలా కష్టపడే మనస్తత్వం. అయినప్పటికీ బిజినెస్ లోకి వచ్చాక మేము ఎంత కష్టపడ్డా కలిసొచ్చేది కాదు. ఆ కష్టంలోనే నేను బాబాకి బాగా దగ్గరయ్యాను. మేము ప్రారంభించిన ఒక హోటల్ వల్ల మాకు చాలా నష్టం రావడంతో దానిని మూసివేయాలని ఎంతగానో ప్రయత్నించాము, కానీ కుదిరేదికాదు. స్థలం ఓనరు, “డిసెంబరు వరకు ఆ స్థలం అగ్రిమెంట్ ప్రకారం లాక్-ఇన్ లో వుంది కాబట్టి అడ్వాన్స్ ఇవ్వను, మీరు అక్కడ ఉండాల్సిందే” అని గొడవపెడుతుండేవాడు. ఇక నేను తట్టుకోలేక 2019, ఆగష్టు 22వ తేదీ గురువారంనాడు మందిరానికి వెళ్ళి, బాబాను దర్శించుకుని, “బాబా! నేను ఈ రాత్రిలోపు శుభవార్త వినాలి. ఎలాగైనా సరే హోటల్ ని మూసివేసేలా చేసి మున్ముందు జరగబోయే నష్టాన్ని తగ్గించు బాబా!” అని బాబాను మనస్ఫూర్తిగా వేడుకున్నాను. నేను బాబా గుడిలో వుండగానే మావారు ఫోన్ చేసి, “ఓనర్ ఒప్పుకున్నాడు. మనం సెప్టెంబరు లోపు హోటల్ మూసివేయచ్చు” అని చెప్పారు. ఇదంతా బాబా కృపతోనే సాధ్యమయిందని నా నమ్మకం. “తండ్రీ! ఈ సమస్య తీరితే నా అనుభవాన్ని సాటి సాయిభక్తులతో పంచుకుంటానని మీకు మాటిచ్చాను. మీకు మాటిచ్చిన ప్రకారమే ఇప్పుడు నా అనుభవాన్ని పంచుకుంటున్నాను. మీకు చాలా చాలా కృతజ్ఞతలు బాబా!”

పై అనుభవం జరిగి ఇంకా వారం తిరగకముందే ఆగష్టు 28న బిజినెస్‌లో ఎప్పటినుండో ఉన్న మరో ఇబ్బందిని కూడా బాబా ఎంతో దయతో తొలగించారు. “బాబా! ఇలానే మాకున్న కష్టాలన్నీ తొలగించు తండ్రీ! వ్యాపారాలన్నీ బాగుండేలా, మావారికి మంచి ఉద్యోగం వచ్చేలా, పిల్లలిద్దరూ వారు ఆశించిన చదువు చదువుకుని మంచి వృద్ధిలోకి వచ్చేలా, మా కుటుంబానికి ఎప్పటికీ మీ తోడు, కృప, ఆశీర్వాదం ఉండేలా కరుణించు తండ్రీ! బాబా, నీమీదే భారం, శరణు! శరణు!”

ఉపాధిని చూపించి మానసికస్థైర్యాన్ని పెంచిన బాబా

యు.ఎస్.ఏ. నుండి సాయిభక్తురాలు మోడుపల్లి వనిత తన అనుభవాన్నిలా పంచుకుంటున్నారు:

సాయిరామ్! అందరికీ నమస్తే! నేను ఎం.పి(మహా పారాయణ) - 215 గ్రూపులో సభ్యురాలిని. ఈ గ్రూపులో చేరాక నేను బాబా ఆశీస్సులు చాలా పొందాను. నేను నా అనుభవాన్ని మీతో పంచుకోవాలనుకుంటున్నాను.

మహాపారాయణలో చేరడానికి ముందు నేను చాలా ఆరోగ్య సమస్యలతో, అనవసరమైన వైద్యఖర్చులతో చాలా బాధపడ్డాను. పైగా ఆర్థిక పరిస్థితుల కారణంగా నాకు, నా భర్తకు గొడవలు జరుగుతూ ఉండేవి. మొత్తానికి జీవితం చిందరవందరగా ఉండేది.

నేను, నా భర్త ఇద్దరు పిల్లలతో యు.ఎస్.ఏ. లో ప్రశాంతమైన జీవితం గడపాలంటే మాకు డబ్బు కావాలి. కాని నేను అందరిలా ప్రతిభావంతురాలిని కాను. 15 సంవత్సరాల క్రితం M.com పూర్తి చేశాను. అది కూడా కరస్పాండెన్స్‌లో. కాబట్టి నాకు కమ్యూనికేషన్, సామాజిక నైపుణ్యాలు లేవు. ఆ కారణంగా యు.ఎస్.ఏ. లో నేను ఏ పనీ చేయలేను. బాబాని నమ్ముకోవడం తప్ప నాకు వేరే మార్గం లేదు. అది మా పరిస్థితి. అయితే అకస్మాత్తుగా ఒక గురువారంనాటి ఉదయం 8.30 సమయంలో ఎవరో ఒకామె నాకు ఫోన్ చేసి, "నా కుమార్తె పుట్టినరోజు పార్టీకి వంట చేసి పెట్టగలరా?" అని అడిగింది. తనకు నా స్నేహితుల వద్దనుండి నా ఫోన్ నెంబర్ తెలిసిందట. ఆరోజు గురువారం కాబట్టి బాబాయే నాకా అవకాశం ఇస్తున్నారనిపించి నేను 'సరే'నన్నాను.  నేను 100 రోటీలు, 70 జామూన్లు, సగం ట్రే పన్నీర్ గ్రేవీ, సగం ట్రే ఉల్లిపాయ పకోడీ చేసి పంపించాను. దానికి నాకు మంచి మొత్తం ముట్టింది. నా వంట రుచిచూసిన ఆమె స్నేహితులలో ఒకరు నాకు ఫోన్ చేసి కేటరింగ్ ఆర్డర్‌ ఇచ్చి, మొదటిసారికంటే ఎక్కువ మొత్తం ఇచ్చారు. ఇది తరువాత గురువారం జరిగింది. నేను తయారుచేసే ఆహారం ప్రతి ఒక్కరూ ఇష్టపడటంతో ప్రతివారం నాకు ఆర్డర్లు లభిస్తున్నాయి. నాకీ అవకాశం ఇచ్చినందుకు బాబాకు చాలా చాలా కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాను. ఇప్పుడు నేను కూడా అందరిలాగే ఏదైనా చేయగలనని నమ్మకం కుదిరింది. నా జీవితం వృధా కాదు. నన్ను మహాపారాయణలో చేర్చిన వారికి నా ధన్యవాదాలు. "బాబా! మీకు నా ప్రణామాలు". నాలాంటి స్థితిలో ఉన్నవారికి నేను చెప్పేది ఒకటే, దయచేసి మీ ఆశలను కోల్పోకండి. మీవంతు కోసం వేచి ఉండండి. బాబా ఖచ్చితంగా మీ కోసం అద్భుతాలు చేస్తారు. ఈ రోజు నావంతు, రేపు మీదే!

ఓం సాయిరామ్!
మోడుపల్లి వనిత.

1 comment:

సాయి మహారాజ్ సన్నిధి సోషల్ మీడియా లింక్స్:

Subscribe Here

బ్లాగ్ అప్డేట్ నోటిఫికేషన్స్ నేరుగా మీ మెయిల్ కే వచ్చేందుకు క్రింద బాక్సులో మీ మెయిల్ ఐడి టైపు చేసి subscribe పై క్లిక్ చేసి, తరువాత స్టెప్స్ పూర్తీ చేయండి.

Delivered by FeedBurner

Followers

Recent Posts


Blog Logo