సాయి వచనం:-

- శ్రీబాబూజీ.

సాయిభక్తుల అనుభవమాలిక 160వ భాగం....

ఈరోజు భాగంలో అనుభవం:
  • ద్వారకామాయిలో అడుగుపెట్టాక బాబా కృపతో లభించిన మనశ్శాంతి

యు.ఎస్.ఏ నుండి పేరు వెల్లడించని సాయిభక్తురాలి అనుభవం:

ఓం సాయిరామ్! చాలామంది సాయిభక్తులలో నేను ఒకదాన్ని. శ్రీసాయిబాబా యందు విశ్వాసాన్ని బలోపేతం చేసేందుకు నేను నా అనుభవాన్ని పంచుకోవాలనుకుంటున్నాను. నేను భగవంతుడిని నమ్ముతాను. కానీ సాయిబాబా "సబ్‌కా మాలిక్ ఏక్" అని చెప్పినట్లు నేను ఏదో ఒక దేవుడినే నమ్ముకోలేదు. మా అమ్మ, సోదరి సాయిబాబా భక్తులు. వాళ్ళు ప్రతి గురువారం సాయి పూజలు చేస్తూండేవాళ్లు. వాళ్ళ కారణంగా నిదానంగా నేను సాయిబాబా వైపు మొగ్గుచూపడం మొదలుపెట్టాను. నేను కూడా వాళ్ళలా పూజలు చేయాలని బాబా కోరుకుంటున్నట్లుగా భావించేదాన్ని. కానీ మొదట్లో నేను అందుకు సిద్ధంగా లేను. నేను బాబా మందిరానికి వెళ్తుండేదాన్ని. శిరిడీ కూడా చాలాసార్లు వెళ్ళాను. కానీ బాబా గురించి పెద్దగా తెలియదు. కొంతకాలానికి నేను గర్భవతిగా ఉన్నప్పుడు మొదటిసారి 'సాయి సచ్చరిత్ర' చదివాను. అప్పుడు నేను సాయిబాబా జీవితం, బోధనల గురించి లోతుగా తెలుసుకున్నాను. అప్పటినుండి ఆయనపై విశ్వాసం దృఢమైంది. ఇక నా అనుభవానికి వస్తే....

గత 3 సంవత్సరాలు నా జీవితంలో సవాలు వంటివి. ఎందుకంటే నేను చాలా ఆరోగ్య సమస్యలను ఎదుర్కొన్నాను. అవి నన్ను చాలా కలతపెట్టిన భయానకమైన రోజులవి. శారీరకంగా, మానసికంగా నన్ను చాలా కృంగదీశాయి. ముఖ్యంగా నా మానసికస్థితిపై చాలా ప్రభావం చూపాయి. నేను నిత్యం అసహనానికి గురవుతూ, ఆందోళనపడుతూ నా కుటుంబంతో సమయం గడపలేకపోయేదాన్ని. చిన్నపిల్లలతో సహా కుటుంబంలో ఎవరితోనూ కలవలేక నాలో నేను కృంగిపోతుండేదాన్ని. నిరాశా నిస్పృహలతో నిత్యం నేను ఏడుస్తూ, "నాకు తోడుగా ఉండండి, ఈ పరిస్థితినుండి బయటపడేందుకు నాకు సహాయం చేయండి" అని బాబాను ప్రార్థిస్తుండేదాన్ని. చాలా రాత్రులు బాబాతో మాట్లాడుతూ, కనీసం కలలో అయినా 'అంతా బాగానే ఉంటుంది' అని ఒక సందేశం లేదా సంకేతం ఇవ్వమని ప్రాధేయపడుతూ ఉండేదాన్ని. కానీ ఏ సంకేతం వచ్చేది కాదు. 

ఆ మానసిక ఆందోళన నుండి కాస్తైనా శాంతి, బలం లభిస్తుందని సచ్చరిత్ర చదివాను. అయినా కూడా నా మనస్సు చంచలంగానే ఉండేది. అలాంటి సమయంలో, 'ద్వారకామాయికి వెళితే అంతా బాగుంటుంద'ని ఒక ఆలోచన నా మనసులో మెదిలింది. కానీ భారతదేశంలో మాకు దగ్గర కుటుంబీకులు ఎవరూ లేనందున అక్కడికి వెళ్లే ప్రణాళిక ఎప్పుడూ చేయలేదు. మేము అక్కడికి వెళ్లి తొమ్మిదేళ్లయింది. పైగా పిల్లలకి స్కూల్ కూడా ఉంది. అందుచేత నేను మౌనంగా ఉండిపోయాను. అయితే మన ప్రతి ఆలోచనను కనిపెట్టుకునివుండే బాబా ఊహించని రీతిన నా కోరిక నెరవేర్చారు. హఠాత్తుగా నా భర్త, "నువ్వు భారతదేశానికి వెళ్లాలనుకుంటున్నావా? నాకు 12 రోజుల సెలవు ఉంది" అని అన్నారు. నేను ఆశ్చర్యపోతూ 'అవున'ని చెప్పాను. నాకు తెలుసు, అదంతా బాబా లీల అని. బాబా నన్ను శిరిడీకి పిలుస్తున్నారని ఆ రాత్రంతా ఆనందంతో కన్నీరు కార్చాను.

తరువాత మేము భారతదేశానికి బయలుదేరాము. మేము ముందుగా అనుకున్నట్లు మా స్నేహితులతో కలిసి శిరిడీ చేరుకుని బాబా దర్శనం కోసం క్యూలో వెళ్లి నిల్చున్నాము. భక్తులు చాలామంది ఉన్నారు. అందువలన బాబాతో ఎంత సమయం గడపబోతానో అని కాస్త ఆందోళనపడ్డాను. కాని మేము సమాధిమందిరంలోకి ప్రవేశించాక, కారణం నాకు గుర్తులేదు గానీ ఒక గంటపాటు క్యూ లైన్లు ఆపేశారు. లోపలికి మేమే చివరిగా ప్రవేశించినందువల్ల అంత రద్దీలోనూ బాబాతో కొన్ని అదనపు నిమిషాలు గడపబోతున్నామని నాకనిపించింది. తరువాత బాబా నామం జపిస్తూ లైనులో వేచి ఉన్నప్పుడు బాబా ఒక వైపుకు ఒరిగి లైనులో ఉన్న నన్ను చూడటానికి ప్రయత్నిస్తున్నట్లుగా నాకనిపించింది. నేను కూడా అదేవిధంగా బాబాను చూడటానికి ప్రయత్నిస్తూ, ఆయన పాదాల చెంతకు చేరుకోవడానికి ఎంతో ఆత్రుతపడ్డాను. ఆ అనుభవం ఆధ్యాత్మికమైనది, మాటల్లో వివరించలేనిది. తరువాత మేము బాబా చెంతకు చేరుకుని వెండిపాదుకలను అక్కడి పూజారికి అందించాము. ఆయన వాటిని బాబా పాదాలకు తాకించి తిరిగి మాకిచ్చారు. నాకెంతో ఆశీర్వాదపూర్వకంగా అనిపించింది.

తరువాత మేము ద్వారకామాయికి వెళ్ళాము. అక్కడ నేను కూర్చుని బాబాతో కాసేపు గడపాలనుకున్నాను. కానీ అక్కడ చాలా జనం ఉన్నారు, కూర్చోవడానికి చోటు లేకపోవడంతో నేను నిరాశతో బయటకు రావాల్సి వచ్చింది. తరువాత మేము జ్యూస్ త్రాగి ద్వారకామాయి ముందుగా వెళ్తున్నప్పుడు లైన్ అంతా ఖాళీగా ఉంది. లోపల కొద్దిమంది మాత్రమే కూర్చుని ఉన్నారు. వెంటనే నేను లోపలికి వెళ్లి కాసేపు అక్కడ కూర్చుని నేను అనుకున్నట్లుగా బాబాతో ప్రశాంతంగా మాట్లాడుకున్నాను. దానితో నాకు ఒక విధమైన సంతృప్తిగా అనిపించింది. ఇంకా లెండీబాగ్ వంటి ఇతర ప్రదేశాలను సందర్శించాలని ఉన్నప్పటికీ అప్పటికే ఇద్దరు పిల్లలూ అలసిపోయి ఆకలితో ఉన్నందున ఆ ఆలోచన మానుకున్నాను. అయితే చాలాకాలం తరువాత నేను శిరిడీలో అడుగుపెట్టినందుకు, బాబాను దర్శించుకోగలిగినందుకు చాలా సంతోషించాను.

శిరిడీ దర్శించిన తరువాత, ఆశ్చర్యంగా నా మనస్సులో చాలా శాంతి చోటుచేసుకుంది. నా సాయిబాబా సర్వదా నాకు తోడుగా ఉన్నారు. ఆయన కృపవలన ఇప్పుడంతా బాగుంది.

1 comment:

సాయి మహారాజ్ సన్నిధి సోషల్ మీడియా లింక్స్:

Subscribe Here

బ్లాగ్ అప్డేట్ నోటిఫికేషన్స్ నేరుగా మీ మెయిల్ కే వచ్చేందుకు క్రింద బాక్సులో మీ మెయిల్ ఐడి టైపు చేసి subscribe పై క్లిక్ చేసి, తరువాత స్టెప్స్ పూర్తీ చేయండి.

Delivered by FeedBurner

Followers

Recent Posts


Blog Logo