సాయి వచనం:-

- శ్రీబాబూజీ.

సాయిభక్తుల అనుభవమాలిక 156వ భాగం....


ఈరోజు భాగంలో అనుభవాలు:

  1. శిరిడీ వెళ్లేందుకు బాబా చేసిన సహాయం
  2. ఊదీ అద్భుతశక్తి.

శిరిడీ వెళ్లేందుకు బాబా చేసిన సహాయం

ఓం సాయిరామ్! నా పేరు భాను. మాది నిజామాబాద్. ఇంతకుముందు శిరిడీలో సేవ చేసినప్పటి నా అనుభవాలన్నీ మీతో పంచుకున్నాను. ఇప్పుడు నేను నాలుగవసారి బాబా సేవకు సంబంధించిన నా అనుభవాలను మీతో పంచుకుంటాను. బాబా దయతో 2019 మే నెలలో శిరిడీలో సేవాభాగ్యం నాకు లభించింది. నేను హైదరాబాదులో ఒక ప్రైవేటు సంస్థలో ఉద్యోగం చేస్తున్నాను. మే 12న నేను సేవకి శిరిడీ వెళ్ళాలంటే పదిరోజులు సెలవు పెట్టాలి. అన్నిరోజులంటే ఆఫీసులో ఒప్పుకోరేమోనని నేను చాలా ఆందోళనపడ్డాను. ఎందుకంటే, ఉద్యోగంలో చేరినప్పుడే 'ఎక్కువ సెలవలు ఇవ్వము' అని కంపెనీ వాళ్ళు ఖండితంగా చెప్పారు. 'గుడి, పూజ అంటే అస్సలు ఇవ్వము' అని మా సార్ చెప్పారు. అందువలన సేవకు వెళ్ళగలుగుతానో లేదోనని నెలరోజులపాటు నాలో నేనే చాలా బాధపడ్డాను. చూస్తుండగానే మే నెల వచ్చేసింది. నాకు ఏమి చెయ్యాలో అర్థంకాక బాబాకు చెప్పుకుని మా సార్ ని సెలవు కావాలని అడిగాను. బాబా దయతో మా సార్ ఒక వారం రోజులు సెలవు ఇచ్చారు. అలా సెలవుల సమస్య తీరడంతో నా సంతోషానికి అవధులు లేవు. ఇకపోతే నేను వెళ్లాల్సిన తేదీలోపు నా జీతం వస్తుందని నేను నిశ్చింతగా ఉన్నాను. కానీ కొన్ని కారణాలవల్ల జీతాలు ఇవ్వడానికి ఇంకా 3 రోజులు ఆలస్యం అవుతుందని చెప్పారు. సెలవు దొరికినా సమయానికి జీతం రాకపోయేసరికి నేను చాలా బాధపడ్డాను. ఎవరినైనా అడుగుదామంటే 'అప్పు చేసి శిరిడీ ప్రయాణం చెయ్యడం' బాబాకు నచ్చదని ఆ ఆలోచనే మానుకున్నాను. ఆ స్థితిలో శిరిడీ ప్రయాణానికి అవసరమయ్యే డబ్బులకోసం ఏం చెయ్యాలో నాకస్సలు అర్థం కాలేదు. అయితే హఠాత్తుగా బాబా దయవలన ఒక విషయం గుర్తుకు వచ్చింది. రెండునెలల ముందు నేను నా జీతం డబ్బులలో రూమ్ రెంట్, ఖర్చులు వగైరా పోను ఎప్పుడైనా శిరిడీ వెళ్ళినప్పుడు ఆరతి, దర్శనం వంటి వాటికి ఉపయోగపడుతుందని ఒక 1000 రూపాయలు దాచిపెట్టుకున్నాను. ఆ డబ్బులు ట్రైన్ టికెట్లకైతే సరిపోతాయి. కానీ మిగతా ఖర్చులకి ఏం చేయాలో అర్థంకాక, ”బాబా! నేను ఎలాగైనా శిరిడీకి రావాలి. నీ సేవ చేసుకోవాలి. ఎన్నిసార్లయినాగాని నీ సేవను మాత్రం నేను వదులుకోదలుచుకోలేదు. నువ్వు ఏమి చేస్తావో ఏమో నాకు తెలియదు. నేను మాత్రం ఎవరినీ డబ్బులు అడగను” అని భారమంతా బాబాపై వేసాను. నా ప్రార్థన విన్న బాబా ఒక లీల చేసారు. అంతకుముందు నాతోపాటు శిరిడీలో సేవ చేసిన ఒక అన్నయ్య ఈసారి కూడా సేవకి వస్తున్నాడు. అతను నాకు ఫోన్ చేసి, "సేవకి వస్తున్నావా చెల్లెమ్మా?" అని అడిగాడు. నా పరిస్థితి అంతా అన్నయ్యకి వివరించాను. వెంటనే తను, "నువ్వేమీ దిగులుపడకు. నేను ఖర్చులకి డబ్బులు ఇస్తాను. నీకు జీతం అందాక నాకు తిరిగి ఇవ్వొచ్చు, కానీ దొరికిన ఈ అరుదైన అవకాశాన్ని డబ్బులు కారణంగా వదులుకోవద్దు" అని చెప్పాడు. కానీ అప్పు తీసుకుని శిరిడీ రావడం బాబాకి నచ్చదని తన వద్దనుండి తీసుకునేందుకు నేను అంగీకరించలేదు. అందుకు తను, "డబ్బులు నువ్వు నన్ను అడగలేదు. నేనే నీకు ఇస్తున్నాను. ఇదేమీ అప్పు కూడా కాదు, కేవలం చేబదులు. కాబట్టి తీసుకోవచ్చు, ఏమీ తప్పులేదు" అని చెప్పి నన్ను ఒప్పించాడు. అలా నా డబ్బుల సమస్యని కూడా బాబా పరిష్కరించి నన్ను శిరిడీ తీసుకుని వెళ్లారు. ఆయన అనుగ్రహం వలన సంతోషంగా శిరిడీలో పదిరోజులు సేవ చేసుకుని తిరిగి వచ్చాను. "చాలా చాలా ధన్యవాదాలు బాబా! ఎప్పుడూ నాకు మీ సేవను ఇస్తూ నన్ను అనుగ్రహించండి".

ఊదీ అద్భుతశక్తి.

సాయిభక్తుడు సెంథిల్ సచిన్ తన అనుభవాన్నిలా పంచుకుంటున్నారు:

నేనిప్పుడు చెప్పబోయే అనుభవం 2013వ సంవత్సరంలో జరిగింది. నెల నాకు సరిగా గుర్తులేదుగాని, ఒకరోజు మా అమ్మ ఏదేదో మాట్లాడుతూ చాలా వింతగా ప్రవర్తించడం మొదలుపెట్టింది. ఆమెకు కొన్ని అనారోగ్య సమస్యలు ఉన్నాయి. కానీ అంతకుముందెప్పుడు అలా ప్రవర్తించలేదు. ఆమె దాదాపు నేలమీదపడి ఆభరణాలను తీసుకోండి, మామయ్యను మరియు ఇతర విషయాలను జాగ్రత్తగా చూసుకోమని చెప్తుంటే మా అందరికి చాలా భయమేసింది. ఏమి జరుగుతుందో, ఏమి చేయాలో అర్ధంకాక మేమంతా మాట పలుకు లేకుండా చూస్తుండిపోయాము. హఠాత్తుగా నాకు శిరిడీ నుండి తెచ్చుకున్న బాబా ఊదీ జ్ఞాపకం వచ్చింది. వెంటనే కొద్దిగా ఊదీ తీసుకుని ఆమె నుదిటిపై పెట్టి, మరికొంత నీటిలో కలిపి ఆమెచేత త్రాగించాను. అద్భుతాల్లో అద్భుతం. వెంటనే ఆమె పూర్తిగా స్పృహలోకి వచ్చి మాములుగా అయ్యింది. కళ్ళ నిండా నీళ్ళతో అనంతమైన బాబా దయకు కృతజ్ఞతలు చెప్పుకున్నాను. మరుసటిరోజు మేము తనని డాక్టర్ వద్దకు తీసుకుని వెళ్ళాము. అన్నిరకాల పరీక్షలు చేసి అంతా సాధరణంగా ఉందని చెప్పారు. ఊదీ తక్షణమే మా అమ్మకి నయమయ్యేలా చేసి కుటుంబంలో ఏ విపత్తును సంభవించకుండా కాపాడింది. ఓం సాయిరాం. 

No comments:

Post a Comment

సాయి మహారాజ్ సన్నిధి సోషల్ మీడియా లింక్స్:

Subscribe Here

బ్లాగ్ అప్డేట్ నోటిఫికేషన్స్ నేరుగా మీ మెయిల్ కే వచ్చేందుకు క్రింద బాక్సులో మీ మెయిల్ ఐడి టైపు చేసి subscribe పై క్లిక్ చేసి, తరువాత స్టెప్స్ పూర్తీ చేయండి.

Delivered by FeedBurner

Followers

Recent Posts


Blog Logo