సాయి వచనం:-

- శ్రీబాబూజీ.

తర్ఖడ్ కుటుంబ అనుభవాలు - 14వ భాగం


  • భగవంతుని కర్తవ్యం
  • అగ్నితో యుద్ధం - ఖటావ్ మిల్లుల రక్షణ
  • సాయిబాబా కఫ్నీని ఉతికిన జ్యోతీంద్ర

భగవంతుని కర్తవ్యం 

బాబా సశరీరులుగా ఉన్నకాలంలో కొంతమంది భక్తులు తాము శిరిడీకి వచ్చినప్పుడు, మసీదును శుభ్రం చేయడం, బాబా మసీదునుండి లెండీతోటకు రోజూ నడచి వెళుతుండే దారిని శుభ్రం చేయడం వంటి కొన్ని పనులు స్వచ్ఛందంగా చేస్తూ వుండేవారు. ఈ విధులను ఎవరూ ఎవరికీ చేయమని చెప్పరు. భక్తులే బాబాపై తమ భక్తి, ప్రేమలను వ్యక్తీకరించుకోవడంలో భాగంగా అటువంటి సేవలు చేస్తూ వుండేవారు. శిరిడీలో నివసించే స్థానిక భక్తులు అటువంటి విధులన్నింటినీ క్రమం తప్పకుండా చేస్తూ వుండేవారు.

మా నాన్నగారు శిరిడీలో ఉన్నప్పుడు ప్రతిరోజూ పెట్రోమాక్స్ దీపాలను శుభ్రం చేయడం, సాయంత్రం వేళల్లో వాటిని వెలిగించి, మసీదులో వాటికి కేటాయించిన స్థానాల్లో వ్రేలాడదీయటం వంటి పనులు ఎంతో బాధ్యతగా చేసేవారు. మనసులో ఏమన్నా సందేహాలు వుంటే, బాబాను అడిగి వాటిని నివృత్తి చేసుకోవటానికి ఆయన ఆ సమయాన్ని వినియోగించుకుంటూ వుండేవారు. సాయంత్రం చీకటి పడిన తరువాత లాంతర్లు వెలిగించగానే, ఎన్నో పురుగులు దీపాల చుట్టూ చేరి, కొంతసేపు వాటి చుట్టూ తిరిగి, ఆ దీపాలలో పడి చనిపోతుంటాయి. ఒకసారి ఆయన బాబాతో పెట్రోమాక్స్ దీపాలను వెలిగించటం వలన తాను పాపం చేస్తున్నాననీ, ఇకమీదట తాను ఆ పని చేయననీ చెప్పారు. తాను దీపాలను వెలిగించకపోతే పురుగులు చనిపోయే అవకాశం వుండదు కదా అనే తన అభిప్రాయాన్ని బాబాతో చెప్పారు. భగవంతుడు అటువంటి విపరీతాన్ని ఎందుకు సృష్టించాడని  బాబాను ప్రశ్నించారు.

ఆ ప్రశ్నకు బాబా నవ్వి, “భావూ! నువ్వు నిజంగా పిచ్చివాడివి. నువ్వు లాంతర్లు వెలిగించనంత మాత్రాన ఈ పురుగులు చనిపోవని అనుకుంటున్నావా? ఎక్కడైతే దీపాలు, వెలుగు ఉంటాయో అవి అక్కడికి వెళ్ళి చనిపోతాయి. ఇదంతా భగవంతుని సృష్టి. ఆయన వాటిని సృష్టించే సమయంలోనే వాటి మరణాన్ని కూడా నిర్ణయిస్తాడు. ఒకవేళ లాంతరు గానీ, దీపం గానీ లేకపోయినా, వేరే ప్రాణులు వాటిని అంతం చేస్తాయి. ఇటువంటి పనులవల్ల మానవులకు పాపాలు ఏమాత్రం అంటవు. మసీదులో చీకటిని పారద్రోలి, భక్తులు సులభంగా పూజచేసుకోవాలనే ముఖ్య ఉద్దేశ్యంతో నువ్వు దీపాలను వెలిగిస్తున్నావు. అందువలన నువ్వు ఎటువంటి పాపము చేయడంలేదు. పురుగులు చనిపోతున్నాయనే నిజం నిన్ను బాధిస్తున్నదంటే నీకు దయగల హృదయం ఉన్నదని అర్థం. భగవంతునికి తన కర్తవ్యం బాగా తెలుసు. ఆయన పనులలో మనం కల్పించుకోకూడదు. ఆయన మనలో ప్రాణం పోసేటప్పుడే మన మరణాన్ని కూడా నిర్ణయిస్తాడు. అందుచేత నువ్వు ఎటువంటి ఆందోళన చెందకుండా నీకు సంతోషాన్నిచ్చే పనిని చేస్తూ ఉండు. దైవం నీ పట్ల ఎంతో దయగా ఉంటాడు. అల్లా భలా కరేగా!” అని అన్నారు.

అలా బాబా బోధనలు చాలా సరళంగానూ, అందరికీ అర్థమైన రీతిలో ఉండేవి. ఈ సంఘటన ద్వారా బాబా మా నాన్నగారికి చక్కగా బోధించి భగవంతుని కర్తవ్యం గురించి తెలియచేశారు.

అగ్నితో యుద్ధం - ఖటావ్ మిల్లుల రక్షణ

ప్రియమైన సాయిభక్తులారా! ప్రమాదవశాత్తు కొలిమిలో పడ్డ కమ్మరివాని కుమార్తెను బాబా రక్షించారని మీకు తప్పకుండా తెలిసేవుంటుంది. ఆ సమయంలో ఆయన చేతులు విపరీతంగా కాలి గాయాలయ్యాయి. కుష్టువ్యాధిగ్రస్తుడు, బాబా భక్తుడయిన భాగోజీషిండే ఆయన కాలిన గాయాలకు ప్రతిదినమూ నెయ్యి రాసి, గుడ్డలతో కట్టుకట్టేవాడు.

బాబా తన చేతులను తెడ్డుగా ఉపయోగించి ఉడుకుతున్న పప్పును గానీ, మాంసపు కూరను గానీ కలియబెట్టి, తరువాత ఆ పదార్థాలనే తమ భక్తులకు ప్రసాదంగా పంచేవారు. బాబా పవిత్రమైన హస్తస్పర్శ ఆ పదార్థాలను అపరిమితమైన ఔషధ గుణాలతో నింపుతుందని నేను ఖచ్చితంగా నమ్ముతున్నాను. వాటిని ప్రసాదంగా తిన్నప్పుడు అది వెంటనే దీర్ఘ రోగాలను పారద్రోలేది.

ఇంకొక అపూర్వమైన సంఘటన ఒకటి ఇప్పుడు వివరిస్తాను. ఒకరోజు ప్రొద్దున్నే మా తాతగారు ఒక కలగన్నారు. ఆ కలలో, ఆయన పనిచేసే ఖటావ్ మిల్లులు అగ్నిజ్వాలలలో ఉండటం చూసిన ఆయనకు నిద్రాభంగమయ్యింది. ఆ రోజు ఉదయం అల్పాహారం చేసే సమయంలో ఆయన మా నాన్నగారికి తన కల గురించి చెప్పారు. ఈ విషయాన్ని వెంటనే తమ యజమానియైన ధరంసీ ఖటావ్ గారికి తెలియచేద్దామని వారిద్దరూ నిర్ణయించుకున్నారు. మిల్లులకు సెక్రెటరీగా మా తాతగారు మిల్లులకు అగ్నిప్రమాదాలనుండి రక్షణగా తగినవిధంగా బీమా చేయించమని తమ యజమానికి సలహా ఇచ్చారు.

ఆ రోజుల్లో సాధారణంగా బీమా రక్షణకు పెట్టే ఖర్చువల్ల కంపెనీ లాభాలు తగ్గిపోతాయని ఫైనాన్షియల్ మేనేజర్స్ దానిని వ్యతిరేకించడంతో వారు బీమారక్షణ చేయించేవారు కాదు. ఆఖరికి మా తాతగారు ధరంసీగారిని ఒప్పించడంలో కృతకృత్యులు అయ్యారు. వారు మొత్తం టెక్స్ టైల్ మిల్లులను తిరిగి మదింపు చేసి, మెరుగైన విలువకు మిల్లుల బీమా రక్షణ చేయించారు.

ఇది జరిగిన 5 లేక 6 నెలల తరువాత ఒకరోజు ప్రొద్దున్నే మిల్లులో అగ్నిప్రమాదం జరిగిందని మిల్లు నుండి వార్త వచ్చింది. మా తాతగారు, నాన్నగారు వెంటనే బయలుదేరి ప్రమాదస్థలానికి చేరుకున్నారు. అక్కడకు చేరుకున్న వెంటనే మిల్లులోని వీవింగ్ డిపార్టుమెంట్ మంటల్లో వుండటం చూశారు. ఆ మంటలను ఆర్పమని, మిల్లు పూర్తిగా నాశనమవకుండా కాపాడమని వారిద్దరూ బాబాను ప్రార్థించారు. వారు రెండవ అంతస్తులోని వీవింగ్ డిపార్టుమెంటుకు వెళ్ళేసరికి, తలకు గుడ్డ కట్టుకునివున్న ఒక ఫకీరు ఆ మంటల మధ్యలో నిలబడి, తన రెండు చేతులను ఊపుతూ మంటలను ఆర్పటానికి ప్రయత్నిస్తూ వుండటం చూసి వారు చాలా ఆశ్చర్యపోయారు. 

మా తాతగారు మా నాన్నగారితో, “మంటలను ఆర్పటానికి ప్రయత్నిస్తున్నది మన బాబానే కదా!” అన్నారు. బాబా తమ ప్రార్ధనలు మన్నించి స్పందించారని వారికి నిర్ధారణ అయింది. మంటలు అదుపులోకి తేవటానికి ఇంకో గంటపైన పట్టింది. వీవింగ్ డిపార్టుమెంటుకు జరిగిన నష్టం పరిమితంగానే ఉండి, మిల్లును మూసివేయాల్సిన అవసరం లేకపోవడంతో వారంతా ఊపిరి పీల్చుకున్నారు. బీమా రక్షణ కూడా ఉండటం వల్ల ఆర్థిక నష్టాలకు పరిహారం కూడా వచ్చింది. మిల్లు కార్యకలాపాలు మళ్ళీ సాధారణస్థాయికి చేరుకున్న వెంటనే వారిద్దరూ బాబాకు కృతజ్ఞతలు తెలుపుకోవటానికి శిరిడీ వెళ్ళారు.

వారు మసీదు మెట్లు ఎక్కుతున్నప్పుడే మా తాతగారితో బాబా, “మ్హాతరా! నీ మిల్లును ఎవరు నిర్వహిస్తున్నారు?” అని అడిగారు. మా తాతగారు బాబా పాదాలకు సాష్టాంగ నమస్కారం చేసి, వారి దీవెనలు తమపై అలానే నిరంతరం కురిపిస్తూ ఉండమని ఆయనను వేడుకున్నారు. అగ్నితో యుద్ధం చేసి తమ మిల్లులను కాపాడినందుకు ఆయన బాబాకు ఎంతో కృతజ్ఞతలు తెలుపుకుంటూ, “మీరే మా నిజమైన సెక్రెటరీ!” అని అన్నారు. ఇది వినగానే బాబా తన ఆసనం నుండి లేచి, “మ్హాతరా! పైకిలే! నా భక్తులు ఎంత తీవ్రమైన ప్రమాదాల బారినపడినా వారిని రక్షించి బయట పడవేయడానికి నేను కట్టుబడి వున్నాను గుర్తుంచుకో! ఈ మసీదులో కూర్చొని నా భక్తుల కోసం చేసిన వాగ్దానాలన్నీ నేను నెరవేరుస్తాను. నా భక్తుడు ప్రమాదంలో ఉన్నానని సంకేతం ఇచ్చిన వెంటనే ఈ ప్రపంచంలో ఎక్కడ ఉన్నా సరే అతడి సేవకై అక్కడ నేను వెంటనే ప్రత్యక్షం అవుతాను” అన్నారు. అది ఒక అపూర్వమైన సంఘటన అని మీరంతా నాతో ఏకీభవిస్తారని నాకు తెలుసు. శ్రీసాయీ! మీకు, మీ దివ్యమైన లీలలకు వినమ్రంగా నమస్కరిస్తున్నాను.

సాయిబాబా కఫ్నీని ఉతికిన జ్యోతీంద్ర

మా నాన్నగారు డైరీ వ్రాసి ఉండవలసిందని నేను ప్రగాఢంగా భావిస్తున్నాను. బాబా సాంగత్యంలో ఆయనకు కలిగిన అనుభవాలు, ఆ అనుభవాల ప్రభావంతో శ్రీసాయిపై అనుక్షణం పెరుగుతుండిన వారి ప్రేమను గురించి కాలక్రమానుసారంగా ఆ డైరీ తెలియజేసి ఉండేది. ఆయన శ్రీసాయిని మొట్టమొదటిసారి కలుసుకున్నప్పుడు, తాను ఒక మహాశక్తిని కలుసుకున్నానని గానీ, అది తన జీవితాన్ని కొత్తమలుపు తిప్పుతుందనే భావన గానీ ఆయనకు వచ్చి ఉండకపోవచ్చు. నాకు కలిగిన కొన్ని అనుభవాలను కూడా నేను తేదీల వారీగా వ్రాసి పెట్టుకోలేదు. మా నాన్నగారి మహాద్భుతమైన అనుభవాలతో పోల్చుకుంటే నా అనుభవాలు చాలా కొన్ని మాత్రమేనని మనవి చేస్తున్నాను.

ఇప్పుడు ఇంకొక సంఘటనను వివరించబోతున్నాను. బాబా మీద మా నాన్నగారి భక్తి దినదినాభివృద్ధి చెందుతున్నప్పటికీ, తన భక్తునితో గల బంధాన్ని బలపరచడంలో బాబాది ఒక ప్రత్యేకమైన శైలి. మా నాన్నగారు శిరిడీలో ఉన్నప్పుడు, బాబా స్నానం చేయటం కూడా ఒక ప్రత్యేకమైన పద్దతిలో ఉండేదని అక్కడి స్థానిక భక్తుల ద్వారా తెలుసుకున్నారు. బాబా తన శరీరాన్ని మనందరిలాగా బాహ్యంగా శుభ్రపరచుకోవడమే కాకుండా, తన శరీరం లోపలి భాగాలను కూడా శుభ్రపరచుకొనేవారుఆయన తమ ప్రేవులను బయటకు వెడలగ్రక్కి, శుభ్రం చేసుకుని తిరిగి తమ యథాస్థానంలో ఉంచేవారు. అటువంటి అష్టసిద్ధులతో జన్మించిన కారణంగా భగవంతుని అవతారాలైన శ్రీరాముడు, శ్రీకృష్ణుడు వంటివారు మానవరూపంతో ఉన్న దైవాలుగా పూజింపబడ్డారని మా నాన్నగారు చెప్తుండేవారు.

బాబా పుట్టుకను గురించిన వివరాలు ఎవ్వరికీ తెలియవు. కానీ, బాబా లీలలు అన్నివిధాలుగానూ భగవంతుని లీలలతో సరిపోల్చదగినవిగా ఉండేవి. ఒకసారి ఆయన శిరిడీకి వెళ్ళినప్పుడు, బాబా మా నాన్నగారితో, తనతో పాటు ఆయన స్నానం చేసే ప్రదేశానికి వస్తే ఒక ప్రత్యేకమైన పనిని అప్పగిస్తానని చెప్పారు. మా నాన్నగారు అటువంటి పనులు చేయడానికి ఎప్పుడూ ముందుండేవారు. బాబా తనకు మరొక దివ్యానుభవాన్ని ప్రసాదిస్తారని ఆయన ముందే ఊహించారు. 

బాబా మా నాన్నగారితో, “భావూ! ఈ పని చాలా సులువు. నేను స్నానం చేయటానికి వెళ్ళినప్పుడు నువ్వు నా కఫ్నీని ఉతుకు! ఉతికిన తరువాత దానిని ఎండలో ఆరేదాకా నీ చేతులతో ఎత్తి పట్టుకుని ఉండు! నేను చాలాసేపు స్నానం చేస్తానని నీకు తెలుసు కదా! అందుచేత నేను స్నానం పూర్తిచేసేటప్పటికి అది ఆరిపోతుంది. అప్పుడు ఆ కఫ్నీని నేను ధరిస్తాను. కానీ ఒక్క విషయం బాగా గుర్తుంచుకో! కఫ్నీని ఆరబెడుతున్నప్పుడు మాత్రం అది నేలను తాకకూడదు” అన్నారు. మా నాన్నగారు వెంటనే ఆ పని చేయడానికి ఒప్పుకొని బాబాతో కలిసి లెండీతోటకు బయలు దేరారు. 

అక్కడ రేకులతో కప్పబడిన ఒక గదిలో బాబా స్నానానికి ఉపయోగించే ఒక పెద్ద రాయి ఉంది. మా నాన్నగారు స్నానాలగది బయట నిలబడి, బాబా కఫ్నీ ఇస్తే ఉతకడానికి ఎదురుచూస్తున్నారు. బాబా ఎంతకూ కఫ్నీ ఇవ్వకపోయేసరికి మా నాన్నగారు కాస్త అసహనానికి గురయ్యారు. బాబా చేస్తున్న చమత్కారాలలో అది కూడా ఒకటి అనుకున్నారు. అయినా కుతూహలంతో తలుపుకున్న చిన్న రంధ్రంగుండా గది లోపలికి చూసారు. నమ్మశక్యంకాని విధంగా, బాబా శరీరంలోని ప్రతి అణువు నుంచి కాంతి కిరణాలు ప్రసరిస్తూ ఉండటం చూశారు. శక్తివంతమైన ఆ కాంతిని భరించలేక, తను గ్రుడ్డివాడిని అయిపోతానేమోనని ఆయనకు భయమేసింది. అంతేగాక, తను చేసిన తప్పు బయట పడుతుందేమోనని కూడా అనుకున్నారు. అదే క్షణంలో, ఉతకడానికి తన కఫ్నీ బయట పడుతుందేమోనని కూడా అనుకున్నారు. 

అదే క్షణంలో, ఉతకడానికి తన కఫ్నీని తీసుకోమని బాబా పిలవడం వినపడింది. మా నాన్నగారు కఫ్నీని తీసుకుని, దగ్గరనున్న బావి వద్దకెళ్ళి సబ్బుతో బాగా శుభ్రంగా ఉతికారు. నీరు బాగా పిండి, మండుటెండలో దాన్ని తన రెండు చేతులతో ఎత్తి పట్టుకున్నారు. మొదట్లో కఫ్నీని సులభంగానే మోయగలిగారు. కానీ సమయం గడిచే కొద్దీ ఎండకు ఎండి తేలికవ్వడానికి బదులు, కఫ్నీ బరువెక్కడం మొదలుపెట్టింది. అలా బరువు పెరుగుతూవుంటే అతిత్వరలోనే కఫ్నీ నేలను తాకుతుంది, అప్పుడు తాను బాబా పెట్టిన ఆ పరీక్షలో తప్పుతానని మా నాన్నగారికి అర్థమయింది. ఈ కఠినమైన కార్యంలో కృతకృత్యుడవటానికి తగిన బలాన్నిమ్మని ఆయన తన మనస్సులో హనుమంతుడిని ప్రార్థించడం మొదలుపెట్టగానే, బాబా లోపలినుంచి అరుస్తూ, “భావూ! సహాయం కోసం హనుమంతుడిని ఎందుకు పిలుస్తున్నావు?” అన్నారు. బాబా నిస్సందేహంగా 'సర్వాంతర్యామి'. అందరి మనసులోని ఆలోచనలను ఉన్నవి ఉన్నట్లుగా చదవగలరు.

అప్పుడు మా నాన్నగారు, బాబా స్నానం చేస్తున్నప్పుడు చూడటానికి ప్రయత్నించి తప్పు చేశానని, అందుకు మన్నించమని బాబాను వేడుకున్నారు. బాబా మన్నించగానే, తాను పట్టుకున్న బాబా కఫ్నీ తేలికయిపోవడం మా నాన్నగారు గమనించారు. బాబాకు కృతజ్ఞతలు చెప్పి, ఇకముందు అటువంటి సాహసకార్యాలు చేయనని ఆయన ప్రమాణం చేశారు. బాబా నుంచి ఎవరూ ఏదీ దాచలేరని ఆయనకు అర్థమయింది. బాబా బోధనలు ఎంతో గొప్పవి. బాబా ద్వారా ప్రత్యక్షంగా బోధనలు అందుకున్నవారు ధన్యులు.

సోర్స్ : "Live Experiences of the Tarkhad Family with Shri Sai Baba of Shirdi"



ముందు భాగం

కోసం

బాబా పాదుకలు

తాకండి.


నిర్ధిష్టమైన భాగం కోసం పైన నెంబర్లను తాకితే, ఆ నెంబరుకి సంబంధించిన భాగం ఓపెన్ అవుతుంది.

 

 


తరువాయి భాగం

కోసం

బాబా పాదాలు

తాకండి.


3 comments:

  1. ఓం శ్రీ సాయిరాం జీ 🙏

    ReplyDelete
  2. Om sai Sri sai Jaya Jaya sai🙏🙏🙏

    ReplyDelete
  3. OM SRI SACHIDANAMDA SAMARDHA SATHGURU SAINATHAYA NAMAH..OM SAI RAM

    ReplyDelete

సాయి మహారాజ్ సన్నిధి సోషల్ మీడియా లింక్స్:

Subscribe Here

బ్లాగ్ అప్డేట్ నోటిఫికేషన్స్ నేరుగా మీ మెయిల్ కే వచ్చేందుకు క్రింద బాక్సులో మీ మెయిల్ ఐడి టైపు చేసి subscribe పై క్లిక్ చేసి, తరువాత స్టెప్స్ పూర్తీ చేయండి.

Delivered by FeedBurner

Followers

Recent Posts


Blog Logo