సాయి వచనం:-

- శ్రీబాబూజీ.

సాయిభక్తుల అనుభవమాలిక 158వ భాగం....


ఈరోజు భాగంలో అనుభవాలు:
  1. నా ఆజ్ఞ లేక ఆకైనా కదలదు
  2. ఊదీతో పైల్స్ మాయం

"నా ఆజ్ఞ లేక ఆకైనా కదలదు"

నేనిప్పుడు ఇటీవల నాకు జరిగిన ఒక స్వీయ అనుభవాన్ని మీతో  పంచుకుంటాను.

"నా ఆజ్ఞ లేక ఆకైనా కదలదు" అని బాబా చెప్పిన మాట. ఆ వాక్యాన్ని ఎన్నోసార్లు మనం చదువుతూ ఉంటాం. కానీ మనకది అనుభవంలో లేక ఆ ఎరుకలో మనం ఉండలేకపోతున్నాము. ఆ సత్యాన్ని మనం గ్రహిస్తే, ఒకరు మనకి కీడు చేశారనిగాని, బాధపెట్టారనిగాని దిగులు ఉండదు. ఏది జరిగినా అది బాబా మన శ్రేయస్సు కోసమే ఇచ్చారన్న నిశ్చింత ఏర్పడుతుంది. ఇకపోతే నేను చేసే పారాయణ కూడా బాబా సంకల్పానుసారమే జరుగుతుందన్న అనుభవాన్ని బాబా నాకు ఇటీవల ఇచ్చారు. ఆ అనుభవాన్ని నేనిప్పుడు మీతో పంచుకుంటాను.

గత 11 ఏళ్లుగా నేను రోజూ సాయిలీలామృతం చదువుతున్నాను. నా వీలును బట్టి ఒకటి, రెండు లీలలు లేదా ఒక అధ్యాయం, మరీ వీలుకాని పక్షంలో కనీసం ఒక్క వాక్యమైనా చదువుతాను. నేను చదవడం ముగించే పేజీలో గుర్తుగా ఒక చిన్న పాకెట్ సైజు బాబా ఫోటో ఒకటి పెట్టుకుంటాను. 2019, జులై 24న సాయిలీలామృతం చదవడం మొదలుపెట్టబోతూ ఆ ఫోటో తీసి అదే పుస్తకం మధ్యలో ఒకచోట పెట్టి పారాయణ చేశాను. రెండు మూడు లీలలు చదివాక ఆరోజు చదవడం ముగించి, అక్కడ బాబా ఫోటోను పెట్టడానికి ఫోటోకోసం వెతికాను. ఇటునుంచి అటు, అటునుంచి ఇటు దాదాపు పదిసార్లు జల్లెడపట్టినా ఫోటో ఎక్కడా కనపడలేదు. పక్కన పడిపోయిందేమోనని నా చుట్టూ చూశాను, కానీ ఫోటో ఎక్కడా కనపడలేదు. "పెట్టడం పుస్తకంలోనే పెట్టాను, మరి ఇంతలోనే ఏమైంద"ని నాకు ఆశ్చర్యంగా అనిపించింది. ఇంతలో, "ఇంకా పారాయణ కొనసాగించమని బాబా ఉద్దేశ్యం అయివుంటుందా?" అని నా మనసుకు అనిపించింది. సరేనని మరికొన్ని లీలలు చదివి ఫొటో కోసం చూస్తే, నేను తెరిచిన పేజీలోనే ఆ ఫోటో ఉంది. నాకు ఆశ్చర్యంగా అనిపించిందిగానీ, 'ప్రతిరోజూ నేను చదివే దాంట్లో ఎంత భాగం చదవాలి? అసలు చదవాలా వద్దా? ఇలా ప్రతిదీ బాబా సంకల్పానుసారమే జరుగుతుంద'న్న సత్యాన్ని తెలుసుకున్నాను. "బాబా! ఈ అనుభవంతో మీరు నేర్పిన సత్యాన్ని సదా నా జ్ఞప్తిలో ఉంచుకోగలిగే శక్తి నాకు లేదు. మీరే నాపై ప్రేమతో ఆ స్థితిని కలిగించాలని కోరుకుంటున్నాను. మీ అనుగ్రహానికి నా శతకోటి ప్రణామములు".

ఊదీతో పైల్స్ మాయం

సాయిభక్తుడు కుమార్ ఇటీవల జరిగిన తన అనుభవాన్నిలా పంచుకుంటున్నారు:


2019, జులై 17 అర్థరాత్రి హఠాత్తుగా మా ఇంటిలో అందరికీ విరోచనాలు మొదలయ్యాయి. ప్రతి ఒక్కరూ రెండు, మూడుసార్లు టాయిలెట్ కి వెళ్లి వచ్చారు. నాకు ఏ కష్టం వచ్చినా బాబాయే గుర్తుకు వస్తారు. ఆయన్నే తలచుకుని, "విరోచనాలు ఆగేలా చూడమ"ని ప్రార్థించాను. కానీ, తగ్గలేదు. ఉదయం లేచాక కూడా ఆ సమస్య అలానే ఉంది. మాములుగా అయితే టాబ్లెట్ వేసుకోవడానికి నేను ఇష్టపడను, బాబా అనుగ్రహంతోనే ఆరోగ్యం చక్కబడాలని కోరుకుంటాను. అలాంటిది ఆరోజు విరోచనాలు కొనసాగుతూనే ఉండటంతో ఆ సమయంలో నాకున్న సాయిసేవలో ఎక్కడ అంతరాయం ఏర్పడుతుందోనని భయం వేసి, "బాబా! మీ సేవకు అంతరాయం కలగకూడదని టాబ్లెట్ వేసుకుంటున్నాను, అయినా టాబ్లెట్ కూడా మీ అనుగ్రహమే కదా!" అని చెప్పుకుని టాబ్లెట్ వేసుకున్నాను. కానీ తరువాత కూడా ఒకసారి టాయిలెట్ కి వెళ్లాల్సి వచ్చింది. అక్కడితో ఆ సమస్య ముగిసింది గానీ, పైల్స్ సమస్య మొదలైంది. అంతకుముందు ఆ సమస్య ఒకటి, రెండుసార్లు వచ్చినా కూడా ఈసారి సమస్య తీవ్రత ఎక్కువగా కనిపించింది. కూర్చోవడానికి, కూర్చుంటే లేవడానికి బాధాకరంగా ఉండేది. అయినా టాబ్లెట్స్ వేసుకోవాలని నాకు అనిపించక, 'కష్టం తీర్చమ'ని బాబాకే చెప్పుకున్నాను. సమస్య ఎక్కువగానే ఉన్నా బాబా కృపతో సహించగలిగాను. రెండురోజులు అలానే ఇబ్బందిపడ్డాను. మూడవరోజు ఉదయం రెండు, మూడు గంటలు కూర్చొని పని చేయాల్సి ఉండటంతో 'ఆ పైల్స్ తో అంతసేపు ఎలా కూర్చోగలనా?' అని ఆందోళనపడ్డాను. ఆ ముందురోజు రాత్రి పడుకోబోయేముందు చిటికెడుకంటే కాస్త ఎక్కువ మోతాదులో ఊదీ తీసుకుని, "బాబా! నాకు చాలా ఇబ్బందిగా ఉంది. ఈ స్థితిలో నేను రేపు ఉదయం ప్రశాంతంగా ఎలా పని చేసుకోగలను? మీ పవిత్రమైన ఊదీ తీసుకుంటున్నాను. ఉదయానికి నాకే ఇబ్బందీ లేకుండా చేయండి. అలా జరిగితే మీ అనుగ్రహాన్ని బ్లాగు ద్వారా తోటి సాయిభక్తులతో పంచుకుంటాను" అని బాబాను ప్రార్థించాను. తరువాత ఊదీని గ్లాసు నీళ్లలో కలిపి త్రాగి పడుకున్నాను. అద్భుతం! ఉదయం లేచేసరికి సమస్య 75 శాతం నయమైపోయింది. మిగిలిన 25 శాతం వలన నాకెటువంటి ఇబ్బందీ అనిపించలేదు. అస్సలు సమస్యపై ఎటువంటి ధ్యాస లేకుండా ప్రశాంతంగా పని చేసుకున్నాను. మరి రెండురోజుల్లో మిగిలిన సమస్య కూడా తీరిపోయింది. "బాబా! మీరు మాపై చూపే ప్రేమకు కృతజ్ఞత అన్నది చిన్న మాటే అయినా కూడా మీకు చాలా చాలా కృతజ్ఞతలు". బాబాకు తన భక్తులను ఎప్పుడు ఎలా అనుగ్రహించాలో తెలుసు. సరైన సమయంలో ఆయన మనపై అనుగ్రహాన్ని కురిపిస్తారు. 

1 comment:

సాయి మహారాజ్ సన్నిధి సోషల్ మీడియా లింక్స్:

Subscribe Here

బ్లాగ్ అప్డేట్ నోటిఫికేషన్స్ నేరుగా మీ మెయిల్ కే వచ్చేందుకు క్రింద బాక్సులో మీ మెయిల్ ఐడి టైపు చేసి subscribe పై క్లిక్ చేసి, తరువాత స్టెప్స్ పూర్తీ చేయండి.

Delivered by FeedBurner

Followers

Recent Posts


Blog Logo