- భూతానికి ముక్తి
- బాబా దర్శనంతో నయమైన ప్లేగువ్యాధి
భూతానికి ముక్తి
మనం 21వ శతాబ్దంలో పయనిస్తున్నామని, దయ్యాలు, భూతాలు మొదలైనవి ఉన్నాయని నమ్మడం చాలా కష్టమని నాకు బాగా తెలుసు. నేను విజ్ఞానశాస్త్రాన్ని బాగా నమ్మినవాడిని, ఇంజనీరుని, పైగా ప్రపంచం అంతా తిరిగినవాడిని. పవిత్రక్షేత్రమైన శిరిడీలో, మా నాన్నగారికి బాబా ప్రసాదించిన అద్భుతమైన అనుభవాలలో ఇది ఒకటి. ఈ అనుభవం నా జ్ఞాపకాలలో ఇంకా సజీవంగా ఉంది.
ఒకరోజు తెల్లవారు ఝామున శిరిడీ పొలిమేరల్లో వున్న వాగు వద్దనున్న ఒక రావిచెట్టు క్రింద ఆయన కాలకృత్యాలు తీర్చుకుంటున్నారు. అప్పటికింకా చీకటిగానే వుంది. ఇంతలో ఆయన ముందు ఒక అడవికోడి ప్రత్యక్షమయింది. ఆ కోడి 'కొక్కొరకో', అని కూస్తున్నది. కానీ, ఆ కూత చాలా వింతగా వుంది. మా నాన్నగారు ఇంతకుముందెన్నడూ అటువంటి వింతైన కోడికూత వినివుండలేదు. ఆ కోడి మా నాన్నగారి దృష్టిని ఆకర్షించింది. మా నాన్నగారు దానినే గమనిస్తుండగా, హఠాత్తుగా ఆ కోడి నల్లటి పాముగా మారిపోయింది. ఆ పాము తన తోకపైకి నిటారుగా లేచి పడగవిప్పింది. మా నాన్నగారు భయంతో బాబాను ప్రార్థించారు. కొంతసేపటి తరువాత ఆ పాము అక్కడినుంచి మాయమైపోయింది.
అప్పుడు మా నాన్నగారికి మరణభయం పట్టుకుంది. కాలకృత్యాలు త్వరగా ముగించి ఆ చోటునుంచి వెళ్ళిపోదామని నిర్ణయించుకున్నారు. ఆయన ఆ ప్రయత్నంలో ఉండగా, “ఓ మానవుడా! నేను ప్రతిరోజూ నడిచే మార్గంలో నువ్వు కూర్చున్నావు. నా దారిలోంచి తొలగిపో!” అనే మాటలు వినపడ్డాయి. వెంటనే ఆయనముందు అందవికారంగా ఉన్న ఒక మరుగుజ్జు మనిషి నిలబడ్డాడు. మా నాన్నగారు, అతడు వెళ్ళడానికి చాలా స్థలం వుందనీ, అంతేకాకుండా తన కాలకృత్యాలు పూర్తవగానే తను ఎలాగూ ఆ ప్రదేశాన్ని విడిచి వెళ్ళిపోతాననీ అతడితో చెప్పారు. ఇంతలో ఆ మరుగుజ్జు పొడుగ్గా పెరిగిపోవడం మొదలుపెట్టి, “నేను భూతాన్ని. ఇది నా రాజ్యం. ఇక్కడినుండి వెళ్ళిపో!” అని ఆజ్ఞాపించాడు.
మా నాన్నగారు బాగా భయపడినప్పటికీ, శిరిడీకి బాబాయే యజమాని అని, తను బాబానే దైవంగా ఆశ్రయించినందువల్ల శిరిడీనుంచి తనను వెళ్ళిపొమ్మనే అధికారం కేవలం బాబాకు మాత్రమే వుందని అనుకున్నారు. అప్పుడు మా నాన్నగారు చేతినిండా మట్టిని తీసుకుని బాబా నామం ఉచ్ఛరిస్తూ, ఆ భూతం మీదకు విసిరి, తనను రక్షించమని బాబాను ప్రార్థించారు. వెంటనే ఆ భూతం అదృశ్యమై, ఆ ప్రదేశంలో పెద్ద రేఖలా పొగ లేచి, తరువాత మెల్లిగా గాలిలో కలిసిపోయింది.
మా నాన్నగారు ఆ ప్రదేశం నుంచి పరుగునవెళ్ళి తన బసకు చేరారు. తరువాత స్నానం, ఫలహారం ముగించి మసీదుకు వెళ్ళి బాబా పాదాల వద్దకు చేరుకోగానే బాబా చిరునవ్వుతో, “భావూ! ప్రొద్దున్నే నా ఊదీ కావాలని ఎందుకు అడిగావు?” అన్నారు. మా నాన్నగారు ఆయన పాదాల మీదపడి జరిగినదంతా చెప్పి, అప్పుడు తనవద్ద ఊదీ లేదని, అందుకే బాబా పుణ్యభూమియైన శిరిడీ మట్టినే ఊదీగా భావించి ఆ భూతం మీదకు విసిరానని చెప్పారు. అది విని బాబా, “భావూ! నువ్వీరోజు ఆ భూతానికి ముక్తిని ప్రసాదించి ఎంతో మంచిపని చేశావు” అన్నారు. ఆ భయానక క్షణంలో తన ఆలోచనాశక్తి నశించిందని, అందువలన తన దైవమైన బాబా నుంచి వచ్చిన సూచనల ప్రకారమే అలా చేశానని మా నాన్నగారు చెప్పారు. ఆయన బాబాకు మనస్ఫూర్తిగా కృతజ్ఞతలు తెలుపుకున్నారు.
ఆ తరువాత, “ఈ ప్రపంచంలో భూతాలు, దయ్యాలు నిజంగా ఉన్నాయా?” అని బాబాను అడిగారు. దానికి బాబా, “భావూ! అవి కూడా భగవంతుని సృష్టి. కానీ, నాశనకారి కన్నా రక్షించేవాడు ఎప్పుడూ శక్తివంతుడేనని గుర్తుంచుకో! నేనిక్కడ పవిత్రమైన మసీదులో కూర్చుని వుండగా నీకెవరూ ఎటువంటి హాని చేయలేరు. శిరిడీలో ధైర్యంగా ఉండు!” అని అభయమిచ్చారు. సాయిభక్తులారా! ఈ లీల చెబుతున్నప్పుడు నా శరీరమంతా కంపిస్తోంది. ఈ అనుభవాన్ని విశ్వసించమని నా వినయపూర్వక విజ్ఞప్తి. ఇది మా నాన్నగారి మనోబ్రాంతి కాదు. మా నాన్నగారికి జిజ్ఞాసతో కూడిన ప్రశ్నలు ఎన్నో వస్తుండేవి. వాటిని తమదైన శైలిలో బాబా పరిష్కరిస్తూ ఉండేవారు. ఇటువంటి అనుభవాలు ఆ కాలంలో చాలామంది బాబా భక్తులు పొంది ఉండవచ్చు.
బాబా దర్శనంతో నయమైన ప్లేగువ్యాధి
మా నాన్నగారు శిరిడీ దర్శించినప్పుడల్లా, బాబా వద్ద ఆయన ఎన్నో అనుభవాలను పొందేవారు. ఆయన ఆధ్యాత్మికానుభూతుల్లోకి వెళ్ళినప్పుడల్లా ఆ అనుభవాలను వివరించి మమ్మల్ని ఆనందపరుస్తూ ఉండేవారు. అలా మాకు వివరించేటప్పుడు ఆయన కూడా అమితానందం పొందేవారని నాకు తెలుసు. బాబాపై నాకున్న భక్తి, ప్రేమలను వ్యక్తీకరించుకొనే ప్రయత్నంలో భాగంగానే వాటిని తిరిగి మీతో పంచుకుంటున్నాను.
మా ముత్తాతగారి కుటుంబం ముంబయి నగరంలో చౌపాటీ ప్రాంతంలోని (గిర్గాఁవ్ బీచ్) చర్నీరోడ్డులో తమ స్వంత బంగళాలో ఉంటుండేవారు. మా తాతగారు, మా నాన్నగారు తరచుగా శిరిడీకి వెళుతున్నారని మా ముత్తాతగారి కుటుంబంలోని వారికి తెలిసింది. తండ్రి, కొడుకులిద్దరూ (మా తాతగారు, మా నాన్నగారు) బాంద్రాలోని టాటా బ్లాక్సులో అద్దెకు ఉంటున్నందున, వారు అప్పుడప్పుడు మాత్రమే మా ముత్తాతగారి కుటుంబాన్ని కలుసుకుంటూ ఉండేవారు. మా ముత్తాతల జీవన విధానం అప్పటి ఆంగ్లేయుల పద్దతిలో ఉండేది. అయినప్పటికీ, మా నాన్నగారు వారిని చూడటానికి చౌపాటీ వచ్చినప్పుడల్లా, మా తాతమ్మగారు జిజ్ఞాసతో శ్రీసాయిబాబా గురించి, బాబా లీలల గురించి ఆయనను అడిగి తెలుసుకుంటూ వుండేది. తనను కూడా సాయిబాబా దర్శనానికి శిరిడీకి తీసుకువెళ్ళమని ఆమె తరచుగా అడుగుతూ ఉండేది. మా నాన్నగారు తప్పకుండా తీసుకువెళ్తానని ఆమెకు మాట ఇచ్చేవారు. కానీ, మా ముత్తాతగారికి బాబాలన్నా, సాధువులన్నా నమ్మకం లేనందువల్ల ఆయన అనుమతి ఇవ్వరని, అందువలన అది జరిగే పని కాదని మా నాన్నగారికి బాగా తెలుసు. పైగా మా తాతమ్మగారి వయస్సు 70 సంవత్సరాలకు పైమాటే.
ఒకసారి ముంబయిలో భయంకరమైన ప్లేగువ్యాధి ప్రబలింది. అప్పటికింకా వైద్యులు ఆ భయంకరమైన వ్యాధి నివారణకు సరైన మందు కనుక్కోలేదు. మా తాతమ్మగారికి కూడా ప్లేగు జ్వరం వచ్చింది. వైద్యుడైన ఆమె భర్త వైద్యం చేస్తున్నప్పటికీ ఏమీ గుణం కనపడలేదు. ఆమె అనారోగ్యం గురించి తెలుసుకున్న మా నాన్నగారు వారింటికి వెళ్ళినప్పుడు మా తాతమ్మగారు, తను ప్లేగువ్యాధి నుంచి బయటపడలేనని, తనను రక్షించమని సాయిబాబాను ప్రార్థించమని మా నాన్నగారితో చెప్పారు. తనకు నయమయిన తరువాత శిరిడీ వెళ్లి ఆయన దర్శనం చేసుకుంటానని ఆమె చెప్పారు. అప్పుడు మా నాన్నగారు, ఆమెకు నిజంగా బాబా మీద నమ్మకం ఉంటే తను మంచం మీద నుండే బాబాను ప్రార్థించవచ్చని, శ్రీసాయి తప్పకుండా వచ్చి ఆమెకు సహాయం చేస్తారని సలహా ఇచ్చారు.
మా నాన్నగారు ఎప్పుడూ తన పర్సులో చిన్న ఊదీ పొట్లం ఉంచుకుంటారు. ఆయన ఆ ఊదీ పొట్లం తీసి ఆమె దిండు క్రింద పెట్టారు. ఇంటికి తిరిగి వచ్చిన తరువాత మా తాతమ్మగారి ప్లేగువ్యాధి నయం చేయమని ఆయన బాబాను ప్రార్థించారు. మూడవరోజున తెల్లవారుఝామునే చౌపాటీ బంగళా నుంచి ఒక పనివాడు బాంద్రాకు వచ్చి, జ్యోతిబాను (మా నాన్నగారిని) వెంటనే తనతో పాటు తీసుకురమ్మని పంపారని ఆయనతో చెప్పాడు. మా తాతగారు, నాన్నగారు ఆందోళనపడి జరగరానిది ఏదీ జరగకుండా చూడమని బాబాను ప్రార్థించి, వెంటనే చౌపాటీకి బయలుదేరివెళ్లారు.
వారక్కడికి చేరుకొని, మంచం మీద మామూలుగా కూర్చునివున్న మా తాతమ్మగారిని చూసి విస్మయం చెందారు. వారిని చూడగానే ఆమె ఆనందభాష్పాలు నిండిన కళ్ళతో మా నాన్నగారితో ఇలా అన్నారు: “జ్యోతిబా! ముందురోజు రాత్రి నీ సాయిబాబా ఇక్కడకు వచ్చారు. ఆయన తెల్లని దుస్తులు ధరించి, తలకు తెల్లని గుడ్డ కట్టుకుని ఉన్నారు. ఆయనకు తెల్లని గడ్డం ఉంది. ఆయన నా మంచం దగ్గర నిలబడి, ఊదీతో నిండిన ఆయన అరచేతిని నా నుదిటిమీద ఉంచి, “అమ్మా! ఇప్పటినుంచి నీకు నయమవడం మొదలవుతుంది! తప్పకుండా పూర్తిగా నయమవుతుంది!” అని చెప్పి అదృశ్యమయిపోయారు. ఆ తరువాత నాకు బాగా చెమటలు పట్టి జ్వరం పూర్తిగా తగ్గిపోయింది. ప్రొద్దున నిద్రలేచేసరికల్లా నేను జ్వరం తగ్గి మామూలుగా ఉన్నాను. నేను ముఖం కూడా కడుక్కోకుండా పనివాడిని అద్దం తెమ్మని అడిగాను. అద్దంలో నా ముఖం చూసుకుంటున్నప్పుడు నా నుదిటి మీద ఊదీతో ఉన్న బాబా అరచేయి ముద్రని స్పష్టంగా చూశాను. అందుకే వెంటనే నిన్ను తీసుకురమ్మని పనివాడిని పంపించాను. ఇప్పుడు నువ్వే చూడు!”
తాతమ్మ, మనవళ్ళ సంతోషానికి అవధులు లేవు. శ్రీసాయిబాబా దివ్యత్వానికి మా నాన్నగారు కృతజ్ఞతలు తెలిపారు. మా ముత్తాతగారయిన డాక్టర్ తర్ఖడ్ కూడా ఆశ్చర్యపోయారు. కారణం, ప్లేగువ్యాధికి చికిత్సకోసం ఆయన వద్దకు వచ్చిన రోగులు చాలామంది చనిపోయారు. అప్పటికే వారు తమ బంగళాలో దాసగణు కీర్తనకోసం ఏర్పాట్లు చేసుకుని ఉన్నారు. కానీ అంతలోపలే మా తాతమ్మగారికి ఈ విధంగా సాయిదర్శనం అయింది. శ్రీసాయి స్వయంగా ఆమె కోరికను తీర్చారు. “సాయీ! మీకు కృతజ్ఞతలు తెలుపుకోవడానికి మాకు మాటలు చాలడంలేదు. దయచేసి మీ దివ్యాశీస్సులు మా అందరిమీద ఎప్పుడూ ఇలాగే కురిపిస్తూ ఉండండి.”
అమూల్యమైన మా నాన్నగారి అనుభవాలను వివరించడంలో ఎక్కడయినా ఏమైనా తప్పులు దొర్లినట్లయితే నన్ను మనస్ఫూర్తిగా క్షమించమని 'దాదా' అని మేము పిలిచుకొనే మా నాన్నగారిని నేను వినయంగా ప్రార్థిస్తున్నాను. ఆయన ఆత్మ ఎక్కడున్నా సరే నన్ను క్షమిస్తుందని నాకు తెలుసు. దాదా జీవించి ఉండగా నేను ప్రత్యేకంగా ఆయనకు ఎప్పుడూ నమస్కరించలేదు. కనుక ఈ పుస్తకం వ్రాయడంలోని ముఖ్య ఉద్దేశ్యం ఆయనకు నా నమస్సుమాంజలి అర్పించడమే. ఆలస్యంగానయినా ఈ పని చేస్తున్నందుకు నేను ఎంతో ఆనందిస్తున్నాను.
సోర్స్ : "Live Experiences of the Tarkhad Family with Shri Sai Baba of Shirdi"
Om Ñamahshivaya ❤️
ReplyDeleteOM SRI SACHIDANAMDA SAMARDHA SATHGURU SAINATHAYA NAMAH..OM SAI RAM
ReplyDeleteOm sai ram, na manasuki nachakunda yedi jaragakunda chudandi tandri pls na manasu meeku telusu, amma nannalani kshamam ga chudandi tandri vaalla badyata meede, ofce lo anta bagunde la chayandi illu konali anna na korika neravere la chudandi tandri pls
ReplyDelete