సాయి వచనం:-

- శ్రీబాబూజీ.

సాయిభక్తుల అనుభవమాలిక 166వ భాగం....


ఈరోజు భాగంలో అనుభవాలు:
  1. తల్లీ బిడ్డకు బాబా జీవితాన్నిచ్చారు
  2. బాబా ప్రసాదించిన ఉద్యోగం

తల్లీ బిడ్డకు బాబా జీవితాన్నిచ్చారు

బెంగళూరునుండి సాయిభక్తురాలు లక్ష్మి తన అనుభవాన్నిలా పంచుకుంటున్నారు:

2013లో నేను ప్రెగ్నెంట్ గా ఉన్న సమయంలో బాబా నన్ను, నా బిడ్డని కాపాడారు. ఆ అనుభవాన్ని నేనిప్పుడు మీతో పంచుకుంటాను. ప్రెగ్నెన్సీ సమయంలో నేను చాలా సమస్యలు ఎదుర్కొన్నాను. హఠాత్తుగా 6వ నెలలోనే నాకు పురిటినొప్పులు మొదలయ్యాయి. డాక్టరు వద్దకు వెళితే ఆమె చికిత్స మొదలుపెట్టి, నొప్పులు ఆగడానికి నాకు ఇంజెక్షన్లు ఇచ్చి, నా భర్తతో, "ఎటువంటి ఆశా కనపడటంలేదు. తల్లీ, బిడ్డ ఇద్దరినీ కాపాడటం చాలా కష్టమైన పరిస్థితి" అని చెప్పారు. ఆ విషయం తెలిసి నేను పూజగదిలో బాబా ముందు కూర్చుని చాలా చాలా ఏడ్చాను. వారంరోజులపాటు ఎంతగా ఏడ్చానో మాటల్లో చెప్పలేను. ఆయన్నే పూజిస్తూ, సచ్చరిత్ర పారాయణ చేసినా, "నా భక్తులకు రక్షణనిస్తాను" అని సచ్చరిత్రలో చేసిన వాగ్దానాన్ని ఆయన నిలుపుకోకుండా నన్నీ స్థితిలో వదిలేశారని బాబాపై నాకు చాలా కోపం వచ్చింది. అయినా కూడా బాబామీద భారం వేసి సచ్చరిత్ర పారాయణ మొదలుపెట్టాను. మావారికి దేవుడిపై నమ్మకం లేకపోయినప్పటికీ నా తృప్తికోసం శిరిడీసాయి మందిరానికి వెళ్లి ఊదీ తెమ్మని అభ్యర్థించాను. ఆయన నా మాట కాదనలేక బాబా మందిరానికి వెళ్లి ఊదీ తెచ్చి నా నుదుటిపై పెట్టారు. మరోవైపు డాక్టర్ నన్ను, నా బిడ్డను కాపాడటానికి తన శాయశక్తులా ప్రయత్నం చేస్తున్నారు. ప్రతిరోజూ నొప్పులు ఆగడానికి ఇంజక్షన్లు వేస్తూ ఉండేవారు. కానీ డాక్టరు, "ఒకవేళ ఈ సమస్య సమసిపోయినా బిడ్డ ఎదుగుదల విషయంలో మాత్రం నేను నమ్మకంగా ఏమీ చెప్పలేన"ని చెప్పారు. నేను ఎంతో ఆందోళనపడుతూ పూర్తి బెడ్‌రెస్టులో ఉంటూ నిరంతరం సచ్చరిత్ర చదువుతూ ఉండేదాన్ని. నెలరోజులకు నా ఆరోగ్యం కాస్త కుదుటపడినప్పటికీ నా బిడ్డ ఎదుగుదల గురించి నా మదిలో ఆందోళన కొనసాగుతూ ఉండేది. నెలరోజుల తరువాత డాక్టర్ ఇంజెక్షన్లు ఇవ్వడం ఆపేసి, మందులు ఇస్తూ ఉండేవారు. నిదానంగా నా ఆరోగ్యంలో, బిడ్డ ఎదుగుదలలో మెరుగుదల ప్రారంభమైంది. ఆ సమయంలో నేను ఆపకుండా సచ్చరిత్ర పారాయణ 7సార్లు పూర్తి చేశాను. సరిగ్గా పారాయణ ముగించేరోజుకి శిరిడీ నుండి ఊదీ, ప్రసాదాలు వచ్చాయి. నాకు ఆనందంతో కన్నీళ్లు వచ్చేశాయి. డాక్టరుతో సహా మా కుటుంబసభ్యులందరూ ఆశ్చర్యపోయేలా 38 వారాలు పూర్తైనా నాకు నొప్పులు రాలేదు. నిజానికి నేను పారాయణ మొదలుపెట్టేముందు, "బాబా! నాకు నెలలు నిండేవరకు డెలివరీ కాకూడదు" అని చెప్పుకున్నాను. ఆయన నా కోరిక మన్నించారు.

ఆ తరువాత, మరుసటిరోజు డాక్టర్ని సంప్రదించాల్సి ఉందనగా ఆరోజు వేకువఝామున నాకొక కల వచ్చింది. కలలో మా తాతగారి పోలికలతో ఉన్న ఒక ముసలాయన, "ఈరోజుకి నీకు మందులున్నాయా? హాస్పిటల్ కి వెళ్ళు, జాగ్రత్త!" అని చెప్పారు. తరువాత నేనారోజు చెక్‌అప్ కోసం హాస్పిటల్ కి వెళ్ళినప్పుడు హఠాత్తుగా నాకు నొప్పులు మొదలయ్యాయి. వెంటనే నన్ను హాస్పిటల్లో చేర్చుకున్నారు. అదేరోజు సాయంత్రం నేను ఒక బిడ్డకు జన్మనిచ్చాను. బిడ్డ పుట్టిన తరువాత నేను, "బాబా! రండి! నా బిడ్డను ఆశీర్వదించండి" అని ప్రార్థించాను. బాబు పుట్టిన 11 రోజుల తరువాత నాకొక కల వచ్చింది. కలలో బాబా నా మంచం వద్దకు వచ్చి నా బిడ్డని ఆశీర్వదించి, "ఇప్పుడు నీకు సంతోషమా? ఎట్టి పరిస్థితుల్లో నేను నా భక్తులను విడిచిపెట్టను" అని అన్నారు. ఏమి చెప్పను? ఎలా వర్ణించను ఆయన లీల గురించి? "బాబా! మీకు నా హృదయపూర్వక కృతజ్ఞతలు. మీరు తిరిగి నాకు జీవితాన్నిచ్చారు". రెండేళ్ల తరువాత మా కుటుంబమంతా శిరిడీకి వెళ్లి బాబాను దర్శించుకున్నాము.

బాబా ప్రసాదించిన ఉద్యోగం

దుబాయి నుండి సాయిభక్తురాలు శివ తన అనుభవాన్నిలా పంచుకుంటున్నారు:

నేను నా కాలేజీ రోజుల నుండి సాయిబాబా భక్తురాలిని. నేను దిగువ మధ్యతరగతి కుటుంబానికి చెందిన అమ్మాయిని. మా కుటుంబంలో మొదటి గ్రాడ్యుయేట్ ని నేనే. బ్యాంకు లోన్ తీసుకుని నేను సాయి ఇన్‌స్టిట్యూట్‌లో ఇంజనీరింగ్ చదివాను. మొదట్లో నాకు దేవుడిపట్ల నమ్మకం ఉండేది కాదు. నా స్నేహితులకు దేవునిపట్ల ఉండే నమ్మకాన్ని, వారు చేసే ప్రార్థనలను చూసి నేను ప్రేరణ పొందాను. దానితో నేను సాయిని నా దైవంగా ఎన్నుకుని, రోజూ ఆయనను ప్రార్థించడం ప్రారంభించాను. నేను అత్యుత్తమ విద్యార్థినిగా ఉంటూ క్రీడలలో కూడా బాగా రాణించాను. సమయం గడిచి ఇంజనీరింగ్ చివరి సంవత్సరంలోకి వచ్చాము. క్యాంపస్ ఇంటర్వ్యూలు మొదలయ్యాయి. నా స్నేహితులంతా మొదటి కంపెనీలోనే ఎంపికయ్యారు. సగటు విద్యార్థులు సైతం ఎంపికయ్యారు. కానీ నేను మాత్రం రెండవ రౌండ్‌లో విఫలమై చాలా ఏడ్చాను. రోజులు గడుస్తున్న కొద్దీ స్నేహితులు నా ప్లేస్‌మెంట్ గురించి ప్రశ్నిస్తుంటే నాకు చాలా ఇబ్బందిగా ఉండేది. నిరాశతో బాబాను ప్రార్థిస్తూ ఉండేదాన్ని. ఈ విషయాలన్నీ అక్టోబరులో జరిగాయి.


తదుపరి ప్లేస్‌మెంట్ డిసెంబర్ 30న ప్రకటించారు. ఆ రెండు నెలలు నేను చాలా కష్టపడి ఇంటర్వ్యూలకు తయారయ్యాను. అయితే నేను ఆప్టిట్యూడ్‌లో బలహీనంగా ఉండేదాన్ని. అందువలన నేను కన్నీళ్లతో బాబాను, “నేను మీ బిడ్డను బాబా. నా గురించి మీకు బాగా తెలుసు. దయచేసి ఈ ఇంటర్వ్యూను క్లియర్ చేయగలిగేలా నన్ను ఆశీర్వదించండి” అని ప్రార్థించి ఆప్టిట్యూడ్ పరీక్షకు వెళ్ళాను. పరీక్షలో గణితానికి సంబంధించిన ప్రశ్నలు చాలా అడిగారు. నేను, "ఇచ్చిన సమయం పూర్తయ్యేలోగా వాటన్నిటికీ సమాధానం వ్రాయగలిగేలా ఆశీర్వదించమ"ని బాబాను ప్రార్థించి ప్రతి ప్రశ్నకు సమాధానాన్ని వ్రాశాను. బాబా దయతో నేను రెండో రౌండుకి ఎంపికైనట్లు ప్రకటించారు. స్నేహితులంతా సాంకేతిక ఇంటర్వ్యూ కోసం సిద్ధమవుతుంటే నేను భయపడి ప్రతిక్షణం బాబాను ప్రార్థిస్తూ ఉన్నాను. అకస్మాత్తుగా ముందు రౌండులో 85% సాధించిన విద్యార్థులకు టెక్నికల్ & హెచ్.ఆర్. రౌండులు రెండూ కలిపి ఒకేసారి జరుగుతాయని కంపెనీ ప్రకటించింది. అందులో నేను కూడా ఒకదాన్ని. నేను ఆందోళనపడుతూ హెచ్.ఆర్. రౌండుకి వెళ్ళాను. భయంతో డెస్క్ కింద నా చేతులు ఉంచి, వాటిపై 'సాయిబాబా' అని వ్రాయడం మొదలుపెట్టాను. హెచ్.ఆర్. ముందు నా పరిచయం గురించి అడిగారు. నేను బాగా చెప్పాను. తరువాత ఆయన కోడింగ్ గురించి ఏమీ అడగకుండా కేవలం టెక్నికల్  ప్రశ్నలు మరియు నా ప్రాజెక్ట్ గురించి అడిగి తెలుసుకున్నారు. ఇంటర్వ్యూ కేవలం 15 నిమిషాల్లో పూర్తయింది. బయటకు వచ్చాక నా స్నేహితులతో మాట్లాడుతున్నప్పుడు వాళ్లందరికీ 30 నిమిషాలకు పైనే ఇంటర్వ్యూ జరిగిందని తెలిసి నాకు ఉద్యోగం వస్తుందన్న ఆశను కోల్పోయాను. కానీ ఫలితం ప్రకటించేవరకూ నేను బాబా స్మరణ చేస్తూ గడిపాను. డిసెంబర్ 31న కంపెనీ ఫలితాలు ప్రకటించింది. నా సాయి నన్ను ఎంతగానో ఆశీర్వదించారు. నా పేరు ఐదవ స్థానంలో ఉంది. ఇప్పుడు నేను నా తండ్రి అనుగ్రహంతో మంచిస్థాయిలో ఉన్నాను. ఆయన నాకు తల్లి, తండ్రి, సర్వమూ. "లవ్ యు బాబా!" 

No comments:

Post a Comment

సాయి మహారాజ్ సన్నిధి సోషల్ మీడియా లింక్స్:

Subscribe Here

బ్లాగ్ అప్డేట్ నోటిఫికేషన్స్ నేరుగా మీ మెయిల్ కే వచ్చేందుకు క్రింద బాక్సులో మీ మెయిల్ ఐడి టైపు చేసి subscribe పై క్లిక్ చేసి, తరువాత స్టెప్స్ పూర్తీ చేయండి.

Delivered by FeedBurner

Followers

Recent Posts


Blog Logo