సాయి వచనం:-

- శ్రీబాబూజీ.

సాయిభక్తుల అనుభవమాలిక 365వ భాగం....


ఈ భాగంలో అనుభవం:
  • సాయితో నా స్మృతులు

పేరు వెల్లడించని ఒక సాయిభక్తురాలు బాబాతో తన స్మృతులను ఇలా పంచుకుంటున్నారు:

శ్రీ సాయినాథ్ మహారాజ్ కీ జై! 

శ్రీసాయినాథునికి నా నమస్సులు. బాబాని భక్తితో, ఆర్తితో పిలిస్తే ఆయన మనల్ని ఆదుకుంటారు. ఎందుకంటే ఆయనే మన తల్లి, తండ్రి, గురువు, దైవం. ఆ గురుచంద్రుని కరుణకి ఎల్లలు లేవు. ఆయన మనలను సర్వదా కంటికి రెప్పలా కాపాడతారు. ఒక్కొక్కసారి అది త్వరగా మనకు అర్థం కాకపోయినా తరువాత మనకి విషయం అర్థం అవుతుంది. అన్నింటికీ కారణాలు బాబాకు తెలుసు. మన మీద ఆయనకి ఎంతో వాత్సల్యం. మనకి పరిస్థితులు ముందుగా తెలియక అనవసరంగా గాబరాపడతాం, అంతే. శ్రీసాయిదత్తుని పాదపద్మములను అనన్యంగా శరణు పొందిన భక్తుల ఆనందం చెప్పనలవి కాదు. సాయిబాబా త్రిమూర్తి దేవతల స్వరూపం, సర్వదేవతలూ. ఆయన మన తప్పులను మన్నించి ఎల్లవేళలా మనల్ని కాపాడాలి. "ఆదిపరాశక్తి రూపమైన బాబా! నా అహాన్ని తీసివేసి నన్ను అక్కున చేర్చుకో తండ్రీ. నీ పాదపద్మములనే నేను అనన్యంగా శరణు వేడుకుంటున్నాను. ఎన్నడూ నాపై కోపించవద్దు. సాయిమాయీ! నీకు నా సహస్ర కోటి పాదాభివందనాలు. నా తప్పులనింటినీ మన్నించి నన్ను క్షమించు. నన్ను కాపాడు స్వామీ, నా తండ్రీ. నన్ను, ఇంకా అందరినీ కూడా కాపాడే నీకు సదా జయము. బాబా, నీ అనుమతితో ఈ క్రింది విషయాలు చెప్పాలనుకుంటున్నాను".

1. ఒకసారి మా అమ్మ "ఇల్లు కొనాలా? వద్దా?" అని చీటీలు వేసి బాబాను అడిగారు. బాబా సందేశం ‘వద్దు’ అని వచ్చింది. కానీ ఆత్రపడి మా అమ్మ ఇంటిని కొనేశారు. గృహప్రవేశం జరిగే రోజున బాబా ఫోటోపై ఉండే గ్లాస్ విరిగిపోయింది. కానీ కార్యక్రమం హాయిగా ఏ ఇబ్బందీ లేకుండా జరిగిపోయింది. ఈ సంఘటన ద్వారా ఏదో కీడును తమ మీదకు తీసుకొని మాకు మంచి జరిగేలా చూశారు బాబా. తరువాత ఇంటికి సంబంధించిన లోన్ మొదలైన విషయాలు కూడా బాబా అనుగ్రహంతో నెమ్మదిగా చక్కగా క్లియర్ అయ్యాయి. లేకుంటే చాలా సమస్య అయ్యేది. ఆయన ప్రేమమూర్తి. ఆయన చెప్పినదానికి మేము వ్యతిరేకంగా నడుచుకున్నప్పటికీ ఎంతో వాత్సల్యంతో మాకంతా మంచే చేశారు బాబా.

2. ఒకసారి శిరిడీ వెళ్లాలని నాకు చాలా బలంగా అనిపించింది. బాబాకు తన భక్తుల మనసులో ఏముందో తెలుసు. భక్తులు అడగకపోయినా ఆయన వాటిని నెరవేర్చి వాళ్ళని సంతోషపరుస్తారు. అయితే ఆయనపై మనం నమ్మకం ఉంచాలి, అంతే. నా విషయంలో అదే జరిగింది. శిరిడీ యాత్రకు వెళ్లే భజన బృందంలో అనుకోకుండా ఒకరు వెళ్లలేని పరిస్థితి ఏర్పడింది. ఆ టికెట్ మీద నా శిరిడీ యాత్ర కోరికను ఎంతో చక్కగా నెరవేర్చారు బాబా. వాళ్లతో శిరిడీ వెళ్లి బాబాను తృప్తిగా దర్శించుకొని ఆనందంగా తిరిగి వచ్చాను. 

3. కష్ట సమయాలలోనూ, సమస్యలోనూ, వేదనలోనూ ఉన్నపుడు చాలాసార్లు శిరిడీ నుండి ప్రసాదం పంపించి నన్ను ఆశీర్వదించేవారు బాబా. తమ అభయాన్ని, సహాయాన్ని, అనుగ్రహాన్ని నాకు అందించారు. ఎంతటి బాధలైనా, ఎటువంటి సమస్యలనైనా బాబాను నమ్మితే చాలు, ఆయన మనలను ఆదుకుంటారు. లీలల ద్వారా అన్నీ ఆయనే చక్కబెడతారు. ఆయన తన భక్తుల యోగక్షేమాలు చూసుకుంటారు.

4. బ్రతకడానికి ఒక స్థితిని, ఆర్థిక తోడ్పాటుని అందించి నన్ను, నా కుటుంబాన్ని నిలబెట్టింది బాబానే. నా చదువులో, పరీక్షల్లో వచ్చిన అడ్డంకులు దాటించారు బాబా.

5. బాబాను మనసారా నమ్మి ధ్యానిస్తే, అనారోగ్యాన్ని పారద్రోలి ఆరోగ్యాన్ని, మంచి స్థిరమైన బుద్ధిని ప్రసాదిస్తారు. ఒకసారి నేను ఆరోగ్యం బాగాలేక ఐ.సి.యు. లో ఉన్నప్పుడు మా ఊరికి దగ్గరలో ఉన్న బాబా గుడికి సంబంధించినవాళ్ళు నా తల్లితండ్రులకి కాకతాళీయంగా కనిపించారు. మా తల్లితండ్రులు రెండురోజుల అన్నదానానికని సరిపడా డబ్బు వాళ్ళకిచ్చి నా ఆరోగ్యం గురించి బాబాని ప్రార్థించమని వాళ్ళని అభ్యర్థించారు. అంతటితో మా వాళ్ళకి 'బాబా ఉన్నారు. నా విషయంలో ఆయన అంతా జాగ్రత్తగా చూసుకుంటార'ని ధైర్యం వచ్చింది. కాదు, బాబానే ఆ రీతిన మా వాళ్ళకి ధైర్యాన్నిచ్చారు. తరువాత నా ఆరోగ్యం కాస్త కుదుటపడటంతో నన్ను డిశ్చార్జ్ చేసారు. అయితే ఇంటికి వచ్చాక నాకు బాగా విరోచనాలు అవుతుండడంతో మరలా రెండవసారి హాస్పిటల్లో అడ్మిట్ అవ్వాల్సి వచ్చింది. నేను ఇంటికి వచ్చాక మా వాళ్ళు బాబా గుడిలో అన్నదానానికి డబ్బులు కట్టిన విషయం తెలిసింది. అప్పుడు అనిపించింది, నేను రెండుసార్లు హాస్పిటల్లో ఉండాల్సి వస్తుందనే బాబా రెండు రోజులకి డబ్బులు కట్టేలా ముందస్తు ఏర్పాటు చేశారేమో అని. నేను మీతో పూర్తిగా చెప్పలేనుగానీ, ఎంతో ప్రాణాపాయస్థితి నుండి బాబా కృపతో నన్ను బయటపడేశారు. నా చెడు కర్మని రూపుమాపి, నేను కోలుకొని హాయిగా ఉండేలా చేశారు

6. తరువాత నేను కోలుకుంటున్న దశలో బాబా ప్రసాదం కావాలని ఆశపడ్డాను. సరిగ్గా అదే సమయంలో మా కుటుంబ స్నేహితుల ద్వారా శిరిడీ ప్రసాదాన్ని పంపించారు బాబా. నా కోరిక తీర్చి నన్ను ఆనందింపజేసిన కరుణాసముద్రునికి నా వందనాలు.

7. ఏ పూజ చేస్తున్నా సాయినే తలచుకుంటూ ఉంటే మన కార్యక్రమాలను మనచేత ఆయన చక్కగా జరిపించి అనుగ్రహిస్తారు. ఇది చాలామందికి అనుభవమే కదా! నేను ఒకరోజు శివాలయంలో పూజ చేస్తుండగా ఎవరో ఒక అపరిచిత వ్యక్తి వచ్చి ఆనందంగా నావైపు చూశారు. ఆ రూపంలో నా సాయే నన్ను ఆశీర్వదిస్తున్నారని నాకు చాలా సంతోషం కలిగింది.  

8. ఒకసారి నా తల్లిదండ్రులు శ్రీసుబ్రహ్మణ్యేశ్వరస్వామి కోవెలలో పూజ చేస్తున్నపుడు నేనొక బాబా ఫోటో చూసి చాలా ఆనందించాను. అయినా దేవతలందరూ బాబాలోనే కొలువై ఉన్నారు. ఆ కార్తికేయస్వామి, బాబా ఒక్కరే. ఒకసారి మా కులదేవత అయిన అమ్మవారిని ఆరాధించే అవకాశాన్ని బాబా కలిపించారు. అయినా అమ్మవారు, బాబా వేరు కాదు కదా. ఆయన త్రిమూర్తిస్వరూపుడు, దత్తస్వామి.

9. ఒకసారి మేము అనుకోకుండా విజయవాడ వెళ్లాల్సి వచ్చింది. ఆకస్మిక ప్రయాణం, ఎక్కడ ఉండాలి? ఏమిటి మా పరిస్థితి? అని ఆందోళన చెందుతున్న సమయంలో బాబా మా కుటుంబ స్నేహితుని(బాబా భక్తుడు అని అనుకుంటున్నాను) రూపంలో మాకు ఉండటానికి చక్కని వసతి కల్పించారు. మనం బాబాను తలవకపోయినా మన బాధ్యత ఆయనకు గుర్తే కదా! బాబాను మనసారా స్మరిస్తే, కష్టాలు, బాధలు మనల్ని ఇబ్బందిపెట్టవు. అవి మనకి అణుమాత్రమైనా ఇబ్బంది కలిగించకపోగా ఆనందాన్నిస్తాయి సుమా! అంతా మనకి మంచే జరుగుతుందని తెలుసుకోగలిగితే చాలు.

ఇంకా బాబా నాకు ఎన్నో అనుభవాలు ప్రసాదించారు. కొన్ని సందర్భాలలో మనము వాటిని గుర్తించలేము. కానీ సమయం వచ్చినప్పుడు అవి ఖచ్చితంగా అర్థమవుతాయి. "బాబా! నాకున్న బాధలన్నింటి నుండి నన్ను దూరం చేసి, నా మనసుని నీ వైపుకి తిప్పుకొని, నా అహాన్ని తీసివేయి. నాపై కోపించక దయగల తల్లిలా నా తప్పులను మన్నించండి బాబా. సర్వదా నన్ను కాపాడు తండ్రీ. ఇప్పుడున్నట్లే ఎప్పుడూ మీ అభయం నాకుండాలి దేవా! నీ బిడ్డలపై నీ చల్లని చూపులు ప్రసరింపజేసి వారికీ రక్షణనివ్వండి బాబా".

సర్వం శ్రీ సాయినాథార్పణమస్తు!
సర్వం శ్రీసాయీశ్వర దేవతా పాదారవిందార్పణమస్తు!


సాయి అనుగ్రహసుమాలు - 323వ భాగం.


ఖపర్డే డైరీ - తొమ్మిదవ భాగం

13-12-1911.

నేను మామూలుగానే లేచి ప్రార్థన చేసుకొని స్నానం చేద్దామనుకున్నాను. కానీ వేన్నీళ్ళు సిద్ధంగా లేకపోవటంవల్ల బయటకు వచ్చి మాట్లాడుతూ కూర్చున్నాను. సాయి మహారాజు బయటకు వెళ్ళేటప్పుడు వారికి నమస్కరించుకొని అప్పుడు స్నానం చేశాను. పంచదశి పఠించిన తరువాత సాయి మహారాజును మశీదులో దర్శించుకొని ఆరతి తరువాత తిరిగి వచ్చాను. సాయంత్రం నాలుగ్గంటలకి నేను, బల్వంత్, భీష్మ, బందులతో కలసి వెళ్ళాను. బందు పట్టుకొచ్చిన నా హుక్కాని సాయి మహారాజు ఒకసారి పీల్చారు. నేను తిరిగి అమరావతి వెళ్ళేందుకు మాధవరావు సాయి మహారాజుని అడిగితే, ఆ విషయం రేప్పొద్దున నిర్ణయిస్తామన్నారు వారు. అక్కడున్న వారందరినీ మశీదు బయటకు వెళ్ళమని చెప్పి, నాకు మాత్రం అపారమైన కరుణతో కన్నతండ్రిలా సలహా ఇచ్చారు. సాయంత్రం వారిని దర్శించేందుకు చావడి ఎదురుగా వెళ్ళి, తరువాత శేజారతికి హాజరయ్యాం. భీష్మ పంచదశి పఠనం రోజూ కంటే ముందుగానే జరిగింది. భాయీ కూడా ఒక భజన పాడాడు.

14-12-1911.

వెళ్ళిపోవాలనే కోరికతో నేను త్వరగా లేచాను. కాకడ ఆరతికి హాజరయి, హడావుడిగా ప్రార్థన చేసుకొని, మాధవరావు దేశ్‌పాండేతో కలసి సాయి మహారాజును మశీదులో కలుసుకునేందుకు వెళ్ళాను. సాయి మహారాజు రేపు వెళ్ళొచ్చునని నాకు చెప్పి, నేను భగవంతుని సేవ తప్ప మరెవరి సేవా చేయకూడదని చెప్పారు. "దేవుడిచ్చింది పోదనీ, మానవుడిచ్చింది నిలువదనీ" అన్నారు వారు. నేను తిరిగి వచ్చి కల్యాణ్ నుంచి దర్వేష్ సాహెబ్ రావటం చూశాను. అతను పాతకాలపు పెద్దమనిషి. షింగణే, అతని భార్యా కూడ అతనితో ఉన్నారు. షింగణే బొంబాయిలో పేరుమోసిన పెద్దలాయరు. అతను 'లా' తరగతులు కూడా నిర్వహించేవాడు. నేను మధ్యాహ్నపూజకు హాజరయి, బాపూసాహెబ్ జోగ్‌తో కలసి నా ఉదయ ఫలహారం చేశాను. దాని తరువాత పడుకొని నిద్రపోయాను. మశీదుకి కొంచెం ఆలస్యంగా వెళ్ళి చావడి వద్ద నమస్కరించుకున్నాను. అప్పుడు దర్వేష్ సాహెబ్, షింగణేలతో మాట్లాడుతూ కూర్చున్నాను. తరువాత భీష్మ తన నిత్య భజన కార్యక్రమం నిర్వహించాడు.

15-12-1911.


ప్రొద్దున నా ప్రార్థనానంతరం షింగణే, దర్వేష్ ఫాల్కేలతో మాట్లాడుతూ కూర్చున్నాను. అతన్ని హాజీసాహెబ్ అని కూడా అంటారు. అతను బాగ్దాద్, కాన్‌స్టాంటినోపుల్, మక్కా, ఇంకా అక్కడి చుట్టుప్రక్కల ప్రదేశాలు ప్రయాణం చేశాడు. అతని సంభాషణ హాయిగానూ, సాధకుడికి సూచనలు చేసేదిగానూ ఉంది. సాయి మహారాజు అతన్నెంతో ఇష్టపడి అతనికి ఆహారం పంపి ప్రేమతో ఆదరించారు. సాయి మహారాజును వారు బయటకు వెళ్ళేటప్పుడు, వారు తిరిగి వచ్చాక మశీదులోనూ చూశాన్నేను. వారు చాలా ఉత్సాహంగా ఉన్నారు. వారి సంభాషణలో మేమంతా ఆనందాన్ని అనుభవించాం. భోజనానంతరం నేను కాసేపు విశ్రమించి, తరువాత మా అబ్బాయి బల్వంత్ చదివిన ఢిల్లీ సంగతులు వింటూ కూర్చున్నాను. మశీదుకి వెళ్ళి సాయి మహారాజు ఆశీస్సులు తీసుకొని ఆ తరువాత శేజారతికి వెళ్ళాం.

తరువాయి భాగం రేపు ......

source:  "దేవుడున్నాడు లేడంటావేం!" బై విమలాశర్మ.

సాయిభక్తుల అనుభవమాలిక 364వ భాగం....


ఈ భాగంలో అనుభవాలు:
  1. సదా సాయి రక్షణ
  2. ఎం.ఆర్‌.ఐ. స్కాన్ విషయంలో బాబా చూపిన కృప

సదా సాయి రక్షణ

సాయిభక్తుడు శ్రీనివాసరావు తనకు ఇటీవల బాబా ప్రసాదించిన అనుభవాలను మనతో ఇలా పంచుకుంటున్నారు:

నమస్తే! మా జీవితంలో ప్రతిక్షణం నా తండ్రి సాయి మాకు తోడుగా ఉంటూ మా అందరినీ రక్షిస్తూ ఉన్నారు. సాయినాథ మహారాజు నా జీవితాన్ని నిలబెట్టిన అనుభవం, నా కుమారునికి ఉద్యోగం ఇప్పించడం మొదలైన కొన్ని అనుభవాలను గతంలో నేను ఈ బ్లాగ్ ద్వారా మీ అందరితో పంచుకున్నాను. ఇటీవల జరిగిన రెండు అనుభవాలను నేనిప్పుడు మీతో పంచుకుంటాను.

మొదటి అనుభవం: 

ఇంటర్మీడియట్ పరీక్షలకు మార్టూరులోని జి.జె.సి కళాశాలలో నాకు డిపార్ట్‌మెంటల్ ఆఫీసరుగా డ్యూటీ వేశారు. నా విధులననుసరించి నేను ఉదయం గం. 8.15 ని. లకి మార్టూరు పోలీస్ స్టేషన్‌కి వెళ్లి క్వశ్చన్ పేపర్స్ తీసుకొని గం. 8.30 ని.ల కల్లా కాలేజీకి వెళ్ళాలి. 9.00 గంటలకు విద్యార్థులకు క్వశ్చన్ పేపర్స్ ఇచ్చి, వాళ్ళు పరీక్ష వ్రాసే విధంగానూ మరియు పరీక్ష జరిగే సమయంలో ఎటువంటి అవాంతరాలు జరగకుండానూ చూడవలసిన బాధ్యత నామీద ఉన్నది. ఇదంతా చాలా కాన్ఫిడెన్షియల్ వర్క్. అంతా టైం ప్రకారం జరగాలి. అందులో ఏ చిన్న పొరపాటు జరిగినా పైఅధికారులు మాపై చర్యలు తీసుకుంటారు. మూడవ పరీక్ష జరగాల్సిన రోజు ఉదయం నేను ఇంటినుండి సరైన వేళకే బయలుదేరాను. కానీ బస్సు ఆలస్యంగా అందింది. నేను చిలకలూరిపేటలో దిగి, వేరే బస్సు ఎక్కి మార్టూరు వెళ్ళాలి. అక్కడికి వెళ్ళడానికి అరగంట సమయం పడుతుంది. అందువలన గం. 8.15 ని.ల కల్లా నేను పోలీస్ స్టేషన్లో ఉండగలనా అని చాలా కంగారుపడుతూ, "బస్సు దిగిన వెంటనే మార్టూరు వెళ్ళే బస్సు దొరికేటట్లు చేయమ"ని బాబాను ప్రార్థిస్తూ ఉన్నాను. నేను చిలకలూరిపేట చేరుకునేసరికి సరిగ్గా 7.45 అయ్యింది. విచిత్రంగా, రోజూ 7.30కే వెళ్లిపోయే మార్టూరు బస్సు ఆరోజు నేను బస్సు దిగేవరకు అక్కడే ఉండి, నేను బస్సెక్కాక బయలుదేరింది. ఇదంతా నా సాయి ఏర్పాటు. సమయానికి  నేను పోలీస్ స్టేషన్‌కి వెళ్లగలిగేటట్లు చేసి నాకు ఎటువంటి ఇబ్బందులు ఎదురుకాకుండా బాబా చూశారు. బాబా చేసిన సహాయానికి మనసారా కృతజ్ఞతలు తెలుపుకున్నాను.

రెండవ అనుభవం: 

ఈమధ్య నాకు జలుబు చేసి, కఫం పట్టింది. రెండు, మూడు రోజులు గొంతు చాలా ఇబ్బందిపెట్టింది. అప్పుడు నేను, "ఊదీతో నాకు నయమయ్యేలా చేయమ"ని బాబాను ప్రార్థించి బాబా ఊదీని నోటిలో వేసుకున్నాను. పరమౌషధమైన ఊదీ ప్రభావం వల్ల మరుసటిరోజుకే నా సమస్య తగ్గిపోయింది. ఈవిధంగా బాబా ఎల్లప్పుడూ నాకు అండగా ఉంటూ రక్షిస్తున్నారు. ఆయన చూపే ప్రేమకు ఏవిధంగా కృతజ్ఞతలు తెలుపుకునేది, ప్రతిక్షణం మనసారా ఆయనను ప్రార్థించడం తప్ప?

శ్రీసచ్చిదానంద సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజ్‌కీ జై!

(మునపటి నా అనుభవాలు చదవాలనే వారికోసం:
బాబా నా జీవితాన్ని మార్చిన ఘటన - https://saimaharajsannidhi.blogspot.com/2019/07/120.html

మా అబ్బాయికి ఉద్యోగాన్ని ప్రసాదించిన శ్రీసాయి  -   https://saimaharajsannidhi.blogspot.com/2019/01/blog-post_2.html)

ఎం.ఆర్‌.ఐ. స్కాన్ విషయంలో బాబా చూపిన కృప

సింగపూర్ నుండి సాయిభక్తురాలు విజయ తన అనుభవాన్ని ఇలా పంచుకుంటున్నారు:


ఓం సాయిరామ్! నా పేరు విజయ. సింగపూరులో ఉంటున్న ఒక చిన్న సాయిభక్తురాలిని నేను. దాదాపు 3 నెలల క్రితం నా భర్తకు వెన్నునొప్పి వచ్చింది. డాక్టర్లు ఎం.ఆర్‌.ఐ. స్కాన్ చేయించమని సూచించారు. కానీ మావారు ఒక క్లాస్ట్రోఫోబిక్(హాస్పిటల్ అన్నా, ట్రీట్మెంట్స్ అన్నా భయపడే వ్యక్తి). ఎలాగో ధైర్యం చేసి తను రెండుసార్లు ఎం.ఆర్‌.ఐ. కోసం వెళ్ళారు. కానీ రెండుసార్లూ భయంతో మెషీన్ నుండి బయటకు వచ్చేశారు. మరుసటిరోజు తను మళ్ళీ వెళ్లినప్పుడు నేను కూడా తనతోపాటు వెళ్ళాను. బాబా దయవల్ల ఈసారి స్కానింగ్ పూర్తయింది, కానీ రిపోర్ట్స్ ప్రతికూలంగా వచ్చాయి. డాక్టర్స్ రెండు సమస్యలను గుర్తించారు. ఒకటి డిస్కు గురించి అనుమానించదగినది. మరొకటి అస్సలు ఊహించనిది, తల వెనుక భాగంలో ఒక గడ్డ ఉండటం. దాంతో డాక్టర్ మళ్ళీ ఎం.ఆర్‌.ఐ. చేయించమన్నారు. అయితే ఈసారి క్లోజ్డ్ ఎం.ఆర్‌.ఐ. అనటంతో మళ్ళీ మేము కష్టంలో పడ్డాము. ధైర్యాన్ని కూడగట్టుకుని స్కానింగ్ కోసం మేము లోపలికి వెళ్ళాము. నేను రెండు విషయాల కోసం తీవ్రంగా సాయిని ప్రార్థించడం మొదలుపెట్టాను. ఒకటి - మొత్తం స్కానింగ్‌ పూర్తయ్యేవరకు మావారు భయపడకుండా ఉండాలి. రెండు - రిపోర్టులో గడ్డ ఉన్నట్లు చూపించకుండా నార్మల్‌గా ఉండాలి. బాబా కృప చూపించారు. రిపోర్టులో గడ్డ లేదని తేలింది. మిగిలింది డిస్క్ సమస్య. దానికి భయపడాల్సినంత ఏమీలేదు, నిపుణులను సంప్రదిస్తే సరిపోతుంది. బాబా నా ప్రార్థనలు విన్నారు. "థాంక్యూ సో మచ్ బాబా!" నేను అనుకున్నట్లుగా నా అనుభవాన్ని తోటి సాయిభక్తులతో పంచుకుంటున్నాను.


సాయి అనుగ్రహసుమాలు - 322వ భాగం.


ఖపర్డే డైరీ - ఎనిమిదవ  భాగం

10-12-1911.

ఉదయం నా ప్రార్థన అయిపోకముందే బొంబాయి సొలిసిటర్ దత్తాత్రేయ చిట్నిస్ వచ్చాడు. నేను కాలేజీలో చదివేటప్పుడు అతను క్రొత్తగా కాలేజీలో చేరాడు. అతను నా చిరకాల మిత్రుడు. కాబట్టి సహజంగానే అతను పాతరోజుల గురించే మాట్లాడాడు. యథాప్రకారం నేను సాయి మహారాజుని వారు బయటకు వెళ్ళే సమయంలోనూ, తరువాత మళ్ళీ వారు తిరిగి వచ్చి యథాస్థానంలో కూర్చున్న సమయంలోనూ దర్శించాను. ఆరతి అయ్యాక అందరం తిరిగి వచ్చాం. ఉదయం ఫలహారం కొంచెం ఆలస్యమైంది. 

నేను ఆ తరువాత ఉపాసనీతోనూ, నానాసాహెబ్ చందోర్కర్‌తోనూ మాట్లాడుతూ కూర్చున్నాను. అతను చాలా ముఖ్యుడు. మరోలా చెప్పాలంటే సాయి మహారాజుకి పాత భక్తుడు. అతను చాలా సరదా మనిషి. తనకు సాయి మహారాజుతో అనుబంధం ఎలా ఏర్పడిందో, తను ఎలా పురోగతి సాధించాడో ఆ చరిత్రంతా నాకు వివరించి చెప్పాడు. అతను తనకి విధించబడిన నిబంధనలు చెప్పాలనుకున్నాడు కానీ చాలామంది ఉండటంతో వారిని దృష్టిలో పెట్టుకుని ఆ విషయాలు చెప్పలేకపోయాడు. మధ్యాహ్నం సాయి మహారాజుని దర్శించుకునేందుకు నేను రెండు ప్రయత్నాలు చేశాను. కానీ ఎవర్ని చూసేందుకూ వారు ఇష్టపడలేదు. సాయంత్రం చావడి దగ్గర వారిని చూశాను. సాఠేతోనూ, చిట్నిస్‌తోనూ ఇంకా వేరే వాళ్ళతో చాలాసేపు మాట్లాడాను. నర్సోబావాడీ నుంచి గోఖలే అనే ఒకాయన వచ్చి ఉన్నాడు. ఆయన ఖేడ్‌గాఁవ్ నారాయణ మహారాజునూ, సాయి మహారాజునూ చూడటానికి తాను వచ్చానని చెప్పాడు. అతను చాలా బాగా పాడతాడు. రాత్రి నేను అతని చేత కొన్ని భజనలు పాడించుకున్నాను. నానాసాహెబ్ చందోర్కర్ ఈరోజు ఠాణాకి వెళ్ళిపోయాడు. బాలాసాహెబ్ భాటేకి కొద్దిరోజుల క్రితం పుట్టిన కొడుకు ఈరోజు సాయంత్రం చనిపోయాడు. అది చాలా విషాదం. ఈ మధ్యాహ్నం సాయి మహారాజు తయారుచేసిన మందును అతను తీసుకున్నాడు.

11-12-1911.

ప్రొద్దుటి ప్రార్థన చాలా ఆహ్లాదంగా ఉండటంతో ఆ తరువాత నేను చాలా ఉత్తమస్థితిలోకి వెళ్ళినట్లు భావించాను. తరువాత పంచదశిలోని కొన్ని శ్లోకాలు దత్తాత్రేయ చిట్నిస్‌కి వివరిస్తూ కూర్చున్నాను. సాయి మహారాజు బయటకి వెళుతున్నప్పుడు, తిరిగి వస్తున్నప్పుడు వారి దర్శనం చేసుకొన్నాం. నాకు వారు చాలాసార్లు చిలుమునూ, రాధాకృష్ణమాయి పంపిన ద్రాక్షపళ్ళనూ ప్రసాదించారు. మా అబ్బాయి బల్వంత్‌కు ద్రాక్షపళ్ళు రెండుసార్లిచ్చారు. మధ్యాహ్నం ఆయన మశీదును శుభ్రం చేస్తున్నట్లు విన్నాను. కనుక అటువైపు పోయే ప్రయత్నం చేయలేదు. ప్రజలంతా సాయిబాబా వద్దకు వచ్చి ప్లేగును నిర్మూలన చేయమని వినుతి చేశారు. రోడ్లు బాగుచేయమనీ, సమాధులను, శ్మశానాలనీ పరిశుభ్రం చేయమనీ, పేదలకు అన్నదానం చేయమని సాయి వారితో చెప్పారు. మధ్యాహ్నమంతా నేను దినపత్రికలు చదువుతూ, చిట్నిస్‌తోనూ, ఇతరులతోనూ మాట్లాడుతూ కూర్చున్నాను. ఉపాననీ ఏదో వ్రాస్తున్నాడు. సాయంత్రం సాయి మహారాజుని చావడి వద్ద చూసి, శేజారతికి హాజరయ్యాను. అది అయ్యాక చిట్నిస్, అతని ఇంజనీరు మిత్రుడు, మరో మిత్రుడు వెళ్ళిపోయారు.

12-12-1911.

కాకడ ఆరతి ప్రారంభం అవుతోందేమోనని నేనూ, భీష్మ చాలా త్వరగా లేచాం. కానీ మేము ఒక గంట ముందుగా ఉన్నాం. మేఘుడు వచ్చాక మేమంతా ఆరతికి హాజరయ్యాం. తరువాత నేను ప్రార్థన చేసుకొని సాయి మహారాజు బయటకి వెళతారేమోనని ఎదురుచూస్తూ కూర్చున్నాను. వారు వెళ్ళేటప్పుడు, మళ్ళీ వారు తిరిగి వచ్చేటప్పుడు కూడా వారిని చూశాను. విరామ సమయమంతా గోఖలే పాటలు వింటూ గడిపేశాను. అతను బాగా పాడాడు. మేఘుడికి బిల్వపత్రాలు దొరక్కపోవటంవల్లా, అతను వాటికోసం చాలా దూరం వెళ్ళవలసి రావటం వల్లా ఈరోజు ఉదయ ఫలహారం ఆలస్యమైంది. కనుక మధ్యాహ్నపూజ మధ్యాహ్నం 1.30 వరకూ పూర్తి కాలేదు. సాయి మహారాజు చాలా ఉత్సాహంగా ఉన్నారు. హాయిగా నవ్వుతూ మాట్లాడుతూ కూర్చున్నారు. ఉదయ ఫలహారానంతరం నేను కాసేపు విశ్రమించిన తరువాత మావాళ్ళతో కలిసి మశీదుకి వెళ్ళాను. 

సాయి మహారాజు సరదాగా ఉన్నారు. ఓ కథ చెప్పారు. అక్కడ పడివున్న ఒక పండుని చేతిలోకి తీసుకొని నా వైపు చూస్తూ, "ఇది ఎన్ని పళ్ళను ఉత్పత్తి చేయగలదు?" అని ప్రశ్నించారు. దానిలో ఎన్ని గింజలు ఉన్నాయో అన్ని వేలరెట్లని ఉత్పత్తి చేయగలదని చెప్పాను. ఆయన చాలా ఆహ్లాదంగా నవ్వుతూ, "దాని స్వంత సూత్రాలకు అది కట్టుబడి ఉంటుంద"న్నారు. అక్కడ ఒకమ్మాయి ఎంత మంచిగా ఉండేదో, పవిత్రంగా ఉంటూ, తనకెలా సేవచేసిందో, తరువాత ఎలా ఐశ్వర్యవంతురాలైందో చెప్పారు. 

సూర్యాస్తమయ వేళకి మాకు ఊదీ దొరికింది. సాయి మహారాజు సాయంత్ర వ్యాహ్యాళికి బయటకి వచ్చినప్పుడు వారిని దర్శించుకోవచ్చని చావడికి ఎదురుగా నుంచున్నాం. మేం వారిని చూసి, తిరిగి వచ్చాక భీష్మ, గోఖలే, భాయీలతో పాటు దీక్షిత్ అనే ఒక యువకుడు పాడిన భజనలు వింటూ కూర్చున్నాం. మాధవరావు దేశ్‌పాండే, ఉపాసనీ మాతో ఉన్నారు. సాయంత్రం హాయిగా గడిచిపోయింది.

తరువాయి భాగం రేపు ......

source:  "దేవుడున్నాడు లేడంటావేం!" బై విమలాశర్మ.

సాయిభక్తుల అనుభవమాలిక 363వ భాగం....


ఈ భాగంలో అనుభవం:
  • బాబా చెప్పిన ప్రతీ పదం ఎంత నిజం!

USA నుండి ఒక సాయిభక్తురాలు తన అనుభవాన్ని ఇలా పంచుకుంటున్నారు:

మావారు 15 సంవత్సరాలుగా ఒక కంపెనీలో పనిచేస్తున్నారు. తను ఎప్పటినుండో క్రొత్త కంపెనీకి మారాలని అనుకుంటున్నారు. కానీ, పిల్లలు చిన్నవాళ్ళైనందున పాత కంపెనీలోనే సౌలభ్యంగా ఉంటుందని అందుకు తగిన ప్రయత్నాలేవీ చేయలేదు. ఇప్పుడు పిల్లలు కాస్త పెద్దయ్యారని 2019 జనవరిలో తను కొత్త ఉద్యోగం కోసం దరఖాస్తు చేయడం ప్రారంభించారు. మొదట్లో తను చాలా ఉత్సాహంగా ఉన్నారు. ఎందుకంటే, తనకి చాలా అనుభవం ఉన్నందున ఉద్యోగం సంపాదించడం చాలా సులభమైన పని అని అనుకున్నారు. బాబా దయవల్ల ఒక ప్రముఖ సంస్థనుండి తనకి ఇంటర్వ్యూకి పిలుపు వచ్చింది. మొదటి రౌండ్ ఇంటర్వ్యూ నుండి చివరి రౌండ్ వరకు చాలా బాగా జరిగింది. మావారు దాదాపు ఆ ఉద్యోగం తనకి ఖచ్చితంగా వస్తుందని అనుకున్నారు. కానీ చివరి రౌండ్ జరిగిన రెండురోజుల తర్వాత కంపెనీ వాళ్ళు తాము వెతుకుతున్న సరైన అభ్యర్థి మావారు కాదని ఒక ఇ-మెయిల్ పంపారు. అది చూసి నేను, మావారు నిర్ఘాంతపోయాము.

కొన్నివారాలపాటు మావారు దానిగురించే ఆలోచిస్తూ ఆత్మవిశ్వాసాన్ని కోల్పోయి దాదాపు నిరాశకు లోనయ్యారు. నేను సహాయం కోసం నా బాబాను తలచుకుని, "పరిస్థితిని ఎదుర్కోవటానికి, ముందుకు సాగడానికి అవసరమైన సహాయం చేయమ"ని హృదయపూర్వకంగా ప్రార్థించాను. ఆయన దయవలన నెమ్మదిగా మావారు ఆ స్థితి నుండి బయటకు వచ్చి ఉద్యోగ ప్రయత్నాలు ప్రారంభించారు. అయితే మళ్ళీ తనకి తిరస్కరణలే ఎదురయ్యాయి. కానీ ఈసారి తను ఆశను కోల్పోలేదు. ఇదంతా నా బాబా దయవల్లనే. నేను తరచూ మావారి ఉద్యోగ విషయం గురించి క్వశ్చన్&ఆన్సర్ వెబ్‌సైట్‌లో బాబాను అడుగుతూ ఉండేదాన్ని. బాబా నుండి ఎప్పుడూ సానుకూల స్పందన వస్తూ ఉండేది. ముఖ్యంగా, “మీ పని ఆదివారంనాడు స్నేహితుడి ద్వారా, మరొక వ్యక్తి ద్వారా పూర్తవుతుంది” అని వస్తుండేది.

తరువాత నేను నవగురువార వ్రతం ప్రారంభించాను. ఇక్కడినుండి బాబా అద్భుతం మొదలవుతుంది. నా భర్త స్నేహితుడొకడు ఒక స్టార్ట్-అప్(ప్రారంభ సంస్థ) కంపెనీకి దరఖాస్తు చేయమని సలహా ఇచ్చాడు. అతను తనకి ఆ సంస్థ యొక్క V.P (వైస్ ప్రెసిడెంట్) బాగా తెలుసునని, ఆ ఉద్యోగం నా భర్తకు అనుకూలంగా ఉంటుందని చెప్పాడు. తరువాత అతను నా భర్త రెజ్యూమ్‌ని తన V.P స్నేహితుడికి మెయిల్ చేశాడు. అదే సమయంలో నా భర్తకు తన కలల కంపెనీ నుండి కాల్ వచ్చింది. అతని ఆనందానికి హద్దులు లేవు. అప్పుడే స్టార్ట్-అప్ కంపెనీ నుండి కూడా ఒక కాల్ వచ్చింది. రెండు ఇంటర్వ్యూలు గురువారంనాడే షెడ్యూల్ చేశారు. నా భర్త తనకి తన కలల కంపెనీలో ఖచ్చితంగా ఉద్యోగం వస్తుందని అనుకున్నారు. కానీ క్వశ్చన్&ఆన్సర్ వెబ్‌సైట్‌లో బాబా ఇచ్చిన సమాధానం కారణంగా తనకి స్టార్ట్-అప్ కంపెనీలో ఉద్యోగం వస్తుందని నేను అనుకున్నాను. నా భర్త ఆశ్చర్యపోయేలా తన కలల కంపెనీ నుండి తిరస్కరణ ఎదురైంది. స్టార్ట్-అప్ కంపెనీ నుండి కూడా కొన్నివారాలపాటు ఎటువంటి స్పందన లేదు. నా భర్త పూర్తిగా ఆశలు కోల్పోయి డీలాపడిపోయారు. నేను, పిల్లలు తన విషయంలో చాలా బాధపడ్డాం, ఆందోళన చెందాం.

అయితే నా బాబాపై నాకు పూర్తి నమ్మకం ఇంకా ఉంది. నేను నా వ్రతాన్ని కొనసాగిస్తున్నాను. ఒకరోజు నా భర్త స్నేహితుని నుండి తన కూతురి పుట్టినరోజు వేడుకకు రమ్మని మాకు ఆహ్వానం వచ్చింది. మేము ఆ పార్టీకి వెళ్ళాము. ఆరోజు ఆదివారం. ఆ స్టార్ట్-అప్ కంపెనీ వి.పి కూడా ఆ పార్టీకి వచ్చారు. అతను నా భర్తను పక్కకు పిలిచి, "మీరు ఇంటర్వ్యూను చాలా బాగా ఎదుర్కొన్నారు. మీకు సరైన స్థానం కల్పించడానికి నేను హెచ్.ఆర్. తో కలిసి పనిచేస్తున్నాన"ని చెప్పాడు. ఎంత అద్భుతం! నా బాబా చెప్పిన ప్రతీ పదం ఎంత నిజం! నా భర్తకు ఆ వార్త ఆదివారంనాడు తన స్నేహితుడి ద్వారాను, మరోవ్యక్తి ద్వారాను తెలిసింది. నా కళ్ళ నుండి కన్నీళ్ళు ధారాపాతమయ్యాయి, నా శరీరం రోమాంచితమైంది. హృదయపూర్వకంగా బాబాకు కృతజ్ఞతలు చెప్పుకున్నాను.

నా వ్రతంలో 9వ వారం వ్రతం ముగియడానికి ముందే నా భర్త కొత్త కంపెనీలో మేము ఊహించిన దానికంటే మంచి స్థాయిలో మంచి వేతనంతో ఉద్యోగంలో చేరారు. బాబా చాలా దయగలవారు. మన జీవితంలో బాబా ఉండటం ఎంత గొప్ప విషయమో నేను మాటల్లో చెప్పలేను. బాబా లేని నా జీవితాన్ని నేనస్సలు ఊహించలేను. "ధన్యవాదాలు బాబా!"

source: http://www.shirdisaibabaexperiences.org/2020/01/shirdi-sai-baba-miracles-part-2592.html


సాయి అనుగ్రహసుమాలు - 321భాగం


ఖపర్డే డైరీ -  ఏడవ భాగం

8-12-1911. 

నిన్నా మొన్నా నేనో విషయం చెప్పటం మరచిపోయాను. అమరావతిలో ఉండే ఉపాసనీ వైద్య ఇక్కడే ఉన్నాడు. నేనిక్కడకు రాగానే నన్ను చూశాడు. మేం కూర్చుని మాట్లాడుకున్నాం. అతను తను అమరావతిని వదిలినప్పటినుంచి జరిగిన తన కథను, తను ఎలా గ్వాలియర్ రాష్ట్రానికి వెళ్ళిందీ, తను ఎలా ఒక గ్రామాన్ని కొన్నదీ, అది ఎలా నష్టాన్ని కలిగించిందీ, తను ఎలా ఒక మహాత్ముణ్ణి కలుసుకొన్నదీ, తను జబ్బుపడి అన్ని ఔషధాలతో ఎలా ప్రయత్నించిందీ, ఎలా అనేకమంది సాధువులతోనూ, మహాత్ములతోనూ మొరపెట్టుకున్నదీ, ఎలా తనకు నయమైందీ, ఎలా తనకు ఇక్కడ ఉండాలని అనుజ్జ వచ్చిందీ క్లుప్తంగా నాకు చెప్పాడు. అతను సంస్కృతంలో సాయి మహారాజు మీద ఒక 'స్తోత్రం' రాశాడు. 

మేమంతా పెందరాళే లేచి కాకడ ఆరతికి హాజరయ్యాం. అది చాలా అద్భుతంగా ఉంది. నా నిత్యప్రార్థన, స్నానాల అనంతరం సాయి మహారాజు బయటకు వెళ్ళేటప్పుడు, తిరిగి వచ్చేటప్పుడు, మధ్యాహ్నం మరోసారి చూశాను. సాయి మహారాజు నావైపు చూస్తూ, "కా సర్కార్?" (ఏం.. పెద్దమనిషీ?) అన్నారు. అప్పుడు వారు, "దేవుడెలా వుంచితే అలా జీవించాల"ని నాకో సలహా ఇచ్చారు. ఒకతను తన కుటుంబం పట్ల ఎంతో మమకారంతో ఉండటం వల్ల ఎన్నో ఇబ్బందుల్ని భరించవలసి వచ్చిందని చెబుతూ ఏదో తాత్కాలికమైన ఇబ్బందుల వల్ల సాయంత్రం వరకు ఆకలితో మాడి తనకోసం తానే తయారుచేసుకొన్న ఒక ఎండురొట్టెను తిన్న ఒక భాగ్యవంతుడి కథను చెప్పారు.

సాయి మహారాజుని మళ్ళీ సాయంత్రం చూశాం. దీక్షిత్‌చే నిర్మించబడ్డ భవనంలోని వరండాలో కూర్చున్నాం మేము. ముంబాయి నుంచి వచ్చిన ఇద్దరు పెద్దమనుషులు ఒక సితార్‌ను తెచ్చి, దాన్ని వాయిస్తూ భజన చెప్పారు. నాచేత 'హజరత్'గా పిలువబడే తోసర్ అద్భుతంగా పాడితే, భీష్మ తన మామూలు భజనలు పాడాడు. అర్థరాత్రి వరకూ సమయం హాయిగా గడిచిపోయింది. తోసర్ నిజంగా ఒక మంచి సహచరుడు. మా అబ్బాయి బల్వంత్, కొందరు ముంబాయి మనుషులు, ఇంకా ఇతరులతో నేను ధ్యానం గురించి మాట్లాడాను.

9-12-1911

నేను నిద్రలేవటం, ప్రార్థన చేసుకోవటం ఆలస్యమైపోయింది. ఈరోజు చాలామంది వచ్చారు. చందోర్కర్ కూడా ఒక సేవకుడితో వచ్చాడు. అప్పటికే ఇక్కడున్న కొందరు వెళ్ళిపోయారు. చందోర్కర్ చాలా మంచివాడు. నిరాడంబరంగా ఉంటూ అతను ఎంతో ఆహ్లాదంగా సంభాషిస్తున్నా వ్యవహారాల్లో మాత్రం ఖచ్చితంగా ఉండే మనిషి. నేను మశీదుకి వెళ్ళి అక్కడ ఆయన చెప్పే విషయాలను వింటూ చాలాసేపు కూర్చున్నాను. సాయి మహారాజు చాలా హాయిగా ఉన్నారు. నేను అక్కడకు తీసుకువెళ్ళిన హుక్కాను సాయి మహారాజు పీల్చారు. వారు ఆరతి సమయంలో అద్భుతమైన సౌందర్యంతో మెరిసిపోతున్నారు. ఆరతి అయిన వెంటనే అందర్నీ వెళ్ళిపొమ్మన్నారు. మాతో కలసి భోజనానికి తాము వస్తామన్నారు. నా భార్యను 'అమ్మమ్మ' అని సంబోధించారు. 

మేం వాడాకు రాగానే అనారోగ్యంగా ఉన్న దీక్షిత్ గారి అమ్మాయి చనిపోయిందని తెలిసింది మాకు. కొద్దిరోజుల క్రితం ఆ అమ్మాయికి సాయి మహారాజు తనని వేపచెట్టు క్రింద ఉంచినట్లు కల వచ్చిందిట. సాయి మహారాజు ఆ అమ్మాయి చనిపోతుందని నిన్ననే చెప్పారు. మేం ఆ విషాద సంఘటన గురించి మాట్లాడుతూ కూర్చున్నాం. ఆ అమ్మాయికి పాపం ఏడేళ్ళే. నేను వెళ్ళి చనిపోయిన ఆ పాపను చూశాను. తను చాలా అందంగా ఉండటమే కాక, చనిపోయిన ఆ పాప ముఖంలోని భావం విచిత్రమైన అందంతో మెరిసిపోతోంది. ఆ ముఖం ఇంగ్లాండులో నేను చూసిన మెడోనా చిత్రాన్ని గుర్తుచేసింది. ఆ అమ్మాయికి అంత్యక్రియలు మా బస వెనుకనే జరిగాయి. ఆ అంత్యక్రియలకి నేను వెళ్ళాను. 

దీక్షిత్ ఆ దెబ్బను అద్భుతంగా భరించాడు. అతని భార్య సహజంగానే భరించరాని దుఃఖంతో కుప్పకూలిపోయింది. ప్రతివాళ్ళూ ఆమెకు సానుభూతి చూపించారు. సాయంత్రం నాలుగు గంటల వరకూ ఏమీ తినలేదు. సాయంత్రమూ, తరువాత శేజారతి సమయంలోనూ చావడికి వెళ్ళి సాయి మహారాజుని చూశాను. నేను, మాధవరావు దేశ్‌పాండే, భీష్మ, ఇంకా కొంతమందిమి కూర్చుని చాలా రాత్రి వరకూ సాయి మహారాజు గురించి మాట్లాడుకున్నాం. బొంబాయి తిరిగి వెళ్ళేందుకు తోసర్‌కు సాయి అనుమతి లభించింది. అతను రేపు ప్రొద్దున వెళతాడు.

తరువాయి భాగం రేపు ......

source:  "దేవుడున్నాడు లేడంటావేం!" బై విమలాశర్మ.

సాయిభక్తుల అనుభవమాలిక 362వ భాగం....


ఈ భాగంలో అనుభవాలు:
  1. సాయి నాతో ఉన్నందుకు నేను ఎంతో గర్వపడుతున్నాను
  2. అర్పణ చేసుకునే భాగ్యాన్నిచ్చిన బాబా

సాయి నాతో ఉన్నందుకు నేను ఎంతో గర్వపడుతున్నాను

ఒక సాయిభక్తుడు తన అనుభవాన్ని ఇలా పంచుకుంటున్నారు:

ఓం సాయిరామ్! నేను సాధారణ సాయిభక్తుడిని. పదేళ్ల వయస్సు నుండి నాకు బాబా తెలుసు. ఆ వయస్సులో నేను "మామూలు మనిషిలా దుస్తులు ధరించిన ఈ తాతని దేవుడిలా ఎలా పూజిస్తారో?" అని ఆశ్చర్యపోయేవాడిని. కానీ తరువాత రోజుల్లో నా సద్గురు సాయినాథుడు చాలా అద్భుతాలను చూపించారు. ఆయన రక్షణలో ఉన్న ఎవరైనా జీవితంలో ఎప్పుడూ ఆనందాన్ని పొందుతారు.

నేను ఒక మధ్యతరగతి కుటుంబానికి చెందినవాడిని. మాకు తిండిపెట్టి పోషించేది నా తల్లి. ఎందుకంటే నా తండ్రికి ఉద్యోగం లేదు. ఆయన ఉద్యోగం కోసం చాలా ప్రయత్నించారు గానీ, వ్రాయడంలో తన అసమర్థత కారణంగా ఉద్యోగం పొందలేకపోయారు. నేను 12వ తరగతి చదువుతున్నప్పుడు మేము తీవ్రమైన అప్పుల బాధలు ఎదుర్కోవలసి వచ్చింది. ఆ పరిస్థితుల వలన చదువులో నేను మంచి మార్కులు తెచ్చుకోవడానికి ఎంతో ఒత్తిడి అనుభవించాను. నిరంతర ఒత్తిడి కారణంగా ఒకరోజు నేను రోడ్డుమీద స్పృహతప్పి పడిపోయాను. బాబా దయవల్ల ఒక వృద్ధుడు నేను మా ఇంటికి చేరుకోవడానికి సహాయం చేశాడు. ఆ విషయం నేను మా అత్తతో చెప్పినప్పుడు ఆమె నాతో, "ఆ వృద్ధుడు మరెవరో కాదు, ఆ సాయినాథుడే! ఆ క్లిష్ట పరిస్థితిలో నీకు సహాయపడి తన ఉనికిని తెలియజేశారు" అని చెప్పింది. ఆరోజు నుండి నేను సాయిబాబాను హృదయపూర్వకంగా ప్రార్థించడం ప్రారంభించాను. నాకు ఇబ్బందులు వచ్చినప్పుడల్లా సాయి సచ్చరిత్ర చదవడం మొదలుపెడతాను. నేను ఆ పుస్తకాన్ని కౌగిలించుకుని పడుకున్న రోజులు చాలా ఉన్నాయి. ఎంతో మానసిక ఒత్తిడి అనుభవించినప్పటికీ, బాబా దయవలన నేను 89 శాతం మార్కులు సాధించాను. ఒక ప్రసిద్ధ ఇంజనీరింగ్ కళాశాలలో నాకు సీటు వచ్చింది. ఆ రోజుల్లో కూడా మేము పేదరికంలో ఉన్నాము. కానీ, మా సాయినాథుడు అప్పుడే పుట్టిన తన పిల్లలను తల్లిపక్షి ఎలా రక్షిస్తుందో అలా మాకు రక్షణనిచ్చారు. అటువంటి సద్గురువు నాకున్నందుకు నేను ఎంతో గర్వపడుతున్నాను.

నేను ట్యూషన్ చెప్పడం మొదలుపెట్టి కుటుంబానికి కొంత సహాయాన్ని అందించడం మొదలుపెట్టాను. కళాశాల చివరి సంవత్సరంలో కాలేజీ ప్లేస్‌మెంట్స్ జరుగుతున్నప్పుడు నేను ఆప్టిట్యూడ్ పరీక్ష బాగా వ్రాయలేక పోయినందున మంచి కంపెనీలో ఉద్యోగం పొందలేకపోయాను. తరువాత ఒక సంవత్సరం గడిచిపోయినా నేను నిరుద్యోగిగా మిగిలిపోయాను. ప్రతిరోజూ నాకు నరకంలా గడిచేది. ఆ సమయంలో నేను ప్రతిరోజూ బాబా గుడికి వెళ్ళడం ప్రారంభించాను. ఆయన అనుగ్రహం వలన చివరికి 2018లో నేను నా ఇంజనీరింగ్ కోర్సుకు సంబంధించిన ఒక చిన్న కంపెనీలో చేరాను. అయితే రోజూ దూరప్రయాణం చేయాల్సిన కారణంగా నేను 8 నెలలకు మించి అక్కడ కొనసాగలేకపోయాను. మళ్ళీ మూడునెలలపాటు నేను నిరుద్యోగిగా ఉన్నాను. అప్పుడు నేను ఒక డిజైనింగ్ కోర్సులో చేరాను. బాబా దయవలన ఆ కోర్సుకు చాలా డిమాండ్ ఉంది. ఒకప్పుడు నేనెప్పటికీ ఉద్యోగం పొందలేననుకున్న కంపెనీలు ఇప్పుడు నా అందుబాటులోకి వచ్చాయి. నేను అంతకుముందు సంపాదించిన దానికంటే 30 శాతం ఎక్కువ జీతం ఆశించి చాలా ఇంటర్వ్యూలకు హాజరయ్యాను. బాబా ఆశీస్సులతో కాంట్రాక్టు ఉద్యోగిగా ఒక మంచి సంస్థలో చేరాను. బాబా దానిని పర్మినెంట్ ఉద్యోగంగా మారుస్తారని ఆశిస్తున్నాను. ఎప్పుడైనా బాబా మనలను అనుగ్రహించనట్లు కనపడినా అది మనం ఎదురుచూస్తున్న దానికంటే ఎక్కువ ఇవ్వడానికే!

జై సచ్చిదానంద సద్గురు సాయినాథ్ మహరాజ్ కీ జై!

source: http://www.shirdisaibabaexperiences.org/2020/01/shirdi-sai-baba-miracles-part-2591.html

అర్పణ చేసుకునే భాగ్యాన్నిచ్చిన బాబా

పేరు వెల్లడించని ఒక సాయిభక్తురాలు తన అనుభవాన్ని ఇలా పంచుకుంటున్నారు:

సాయిబంధువులందరికీ నమస్కారం. నేను బాబాకి చిన్న భక్తురాలిని. నేను 2020, ఫిబ్రవరిలో సాయి దివ్యపూజ మొదలుపెట్టాను. మార్చి 12వ తేదీతో 5 వారాల పూజ పూర్తయింది. ఆ సందర్భంగా కిచిడీ తయారుచేసి ముందుగా బాబాకి నివేదించి ఐదుగురికి పెట్టాను. ఆరోజే 'సాయి టీవీ' తరపున మొదటిరోజు శ్రీరామనవమికి గోధుమలు అర్పణ చేసుకునే అవకాశం లభించడంతో నాకు చాలా చాలా సంతోషంగా అనిపించింది. ప్రతిసారీ నేను ఒక్కదాన్నే బాబాకి అర్పణం చేసేదాన్ని. కానీ ఈసారి నా భర్త, పిల్లలతో కలిసి అర్పణం చేసుకునే భాగ్యాన్ని బాబా ఇచ్చారు. "ఈ అవకాశం ఇచ్చిన మీకు చాలా చాలా కృతజ్ఞతలు బాబా!"

అఖిలాండకోటి బ్రహ్మాండనాయక రాజాధిరాజ యోగిరాజ పరబ్రహ్మ శ్రీ సచ్చిదానంద సద్గురు సాయినాథ్ మహరాజ్ కీ జై!


సాయి అనుగ్రహసుమాలు - 320వ భాగం


ఖపర్డే డైరీ - ఆరవ భాగం

🌹సుదీర్ఘమైన రెండవ మజిలీ🌹

6-12-1911

దీక్షిత్ కొత్తగా నిర్మించిన ఇంటి వద్దకు నా టాంగా వచ్చాక నేను కలుసుకొన్న మొట్టమొదటి వ్యక్తి మాధవరావ్ దేశ్‌పాండే. నేను టాంగా నుంచి దిగకముందే దీక్షిత్ ఈరోజు తనతో భోజనం చేయమని అడిగాడు. అప్పుడు నేను మాధవరావు దేశ్‌పాండేతో కలిసి సాయి మహారాజుకి నా గౌరవ అభివాదాలు తెల్పేందుకు వెళ్ళి దూరం నుంచే నమస్కారం చేసుకున్నాను. వారు ఆ సమయంలో తమ కాళ్ళూ, చేతులూ కడుక్కుంటున్నారు. ఆ తరువాత నేను కాళ్ళు, చేతులు కడుక్కుని ప్రార్థనలో నిమగ్నమయ్యాను. అందువల్ల సాయి మహారాజ్ బయటకు వెళ్ళేటప్పుడు వారికి నమస్కారం చేసుకోలేకపోయాను. 

తరువాత మేమంతా కలిసి వెళ్ళి మశీదులో బాబా వద్ద కూర్చున్నాం. మంచి ఆహారం అంటే ఎంతో ఇష్టపడే ఒక ఫకీరు వద్ద తాము ఉండటం గూర్చిన ఒక కథను చెప్పారు వారు. ఒకసారి ఈ ఫకీరు సాయి మహారాజుతో కలిసి భోజనానికి వెళ్ళారు. బయలుదేరేముందు ఫకీరు భార్య సాయి మహారాజుని పండుగకని కొంత ఆహారం తెమ్మని అడిగి అందుకోసం ఒక పాత్రను ఇచ్చింది. ఫకీరు చాలా ఎక్కువగా తినేయటం వలన ఆ ప్రదేశంలోనే నిద్రించేందుకు నిర్ణయించుకున్నాడు. సాయి మహారాజు రొట్టెలను వీవుకు కట్టుకుని, ద్రవాహారాన్ని పోసుకున్న పాత్రను తలమీద పెట్టుకుని తిరిగి వచ్చారు. మార్గం చాలా సుదీర్ఘమైనదిగా తెలుసుకున్నారు సాయి. ఆయన దారితప్పి ఒక హరిజనవాడ దగ్గర కొద్దిసేపు విశ్రాంతి కోసం కూర్చున్నారు. కుక్కలు అరవటం మొదలుపెట్టేసరికి ఆయన లేచి తన గ్రామానికి తిరిగి వచ్చి రొట్టెలను, ద్రవాహారాలను ఫకీరు భార్యకిచ్చారు. అప్పటికి ఫకీరు కూడా రావటం వల్ల వారంతా కలిసి చక్కటి భోజనం చేశారు. మంచి ఫకీర్లను కనుక్కోవటం చాలా కష్టమని చెప్పారాయన. 

క్రిందటి సంవత్సరం నేను నివసించిన వాడాను నిర్మించిన సాఠే ఇక్కడే ఉన్నాడు. అతన్ని నేను మొదట మశీదులోనూ, తరువాత భోజనాలవద్ద చూశాను. దీక్షిత్ చాలామందికి భోజనాలు పెట్టాడు. కీర్తిశేషులు మాధవరావు గోవింద రానడే గారి చెల్లెలి కొడుకు తోసర్ కూడా వారిలో ఉన్నాడు. తోసర్ బాంబేలోని కస్టమ్స్ శాఖలో పనిచేస్తున్నాడు. అతను చాలా మంచివాడు. మేం మాట్లాడుతూ కూర్చున్నాం. నాసిక్ నుంచి వచ్చిన ఈ పెద్దమనిషే కాక ఇంకా చాలామంది ఉన్నారక్కడ. వారిలో టిప్నిస్ అనే ఆయన తన భార్యతో వచ్చాడు. ఆమె కొడుకుని ప్రసవించింది.

బాపూసాహెబ్ జోగ్ కూడా ఇక్కడే ఉన్నాడు. ఆయన భార్య కులాసాగా ఉంది. నూల్కర్ మరణించాడు. అతను లేని లోటు నాకు బాగా కనిపిస్తుంది. వారి కుటుంబసభ్యులెవరూ ఇక్కడ లేరు. బాలాసాహెబ్ భాటే ఇక్కడే ఉన్నాడు. అతని భార్య దత్తజయంతి రోజున మగబిడ్డను ప్రసవించింది. మేం ఉంటున్న దీక్షిత్ వాడా చాలా అనుకూలంగా ఉంది.

7-12-1911.

రాత్రి బాగా నిద్రపోయాను. మా అబ్బాయి, భార్య భీష్మతో బాగానే ఉన్నారు. విష్ణు కూడా ఇక్కడే ఉన్నాడు. ఈరోజు మేం చాలామందికి సంతర్పణ చేశాం. ఇక్కడి నిత్యకృత్యాలకు నేను అలవాటుపడిపోయాను. సాయి మహారాజు బయటకు వెళ్ళే సమయంలోనూ, తరువాత వారు మశీదుకి తిరిగి వచ్చేటప్పుడూ, మళ్ళీ సాయంకాలమూ, అటుతరువాత ఆయన 'చావడి'కి నిద్రించటానికి వెళ్ళే సమయంలోనూ ఆయనకి నేను నమస్కరించాను. భజన కొద్దిసేపే సాగింది. మేం శేజారతి నుంచి తిరిగి వచ్చాక భీష్మ తన మామూలు భజన చేశాడు. తోసర్ తను స్వయంగా వ్రాసిన కొన్ని శ్లోకాలు, కొన్ని ఇతరులు రాసినవీ, కొన్ని కబీరు, దాసగణు రాసినవీ పాడాడు. క్రిందటి సంవత్సరం ఇక్కడే ఉన్న దాసగణు భార్య బాయీ ఇప్పుడు వాళ్ళ తండ్రిగారింట్లో ఉంది. చాలా రాత్రి వరకు మేమంతా కూర్చుని మాట్లాడుకున్నాం. రాత్రి మాధవరావు దేశ్‌పాండే, దాదాకేల్కర్‌కి బాబు అనే మేనల్లుడు ఉన్నాడని చెప్పాడు. సాయి మహారాజు అతణ్ణి చాలా దయగా చూసేవారు. ఈ బాబు చనిపోయాడు. అతణ్ణి ఈరోజు వరకూ సాయి మహారాజు గుర్తుపెట్టుకున్నారు. ముంబాయిలో లాయరుగా ప్రాక్టీసు చేస్తున్న మోరేశ్వర్ విశ్వనాథ్ ప్రధాన్ సాయి మహారాజుని చూడటానికి వచ్చాడు. అతని భార్యని చూడగానే 'ఆమె బాబుకి తల్లి' అని చెప్పారు బాబా. తరువాత ఆమె గర్భం ధరించింది. బాంబేలో ఆమె ప్రసవించే రోజున నొప్పులు పడుతున్నప్పుడు ఇక్కడ సాయి మహారాజు 'ఆమె కవలల్ని ప్రసవిస్తుందని, అందులో ఒకరు చనిపోతార'ని చెప్పారు. అలాగే జరిగింది. శ్రీమతి ప్రధాన్ తన రెండు నెలల బిడ్డని ఇక్కడకు తీసుకువచ్చినప్పుడు సాయి మహారాజు అతన్ని తమ ఒడిలోకి తీసుకుని, "ఏం బాబూ, ఇక్కడికొచ్చేశావా మళ్ళీ?" అనగానే ఆ పిల్లవాడు "ఊఁ" అన్నాడు స్పష్టంగా.

తరువాయి భాగం రేపు ......

source:  "దేవుడున్నాడు లేడంటావేం!" బై విమలాశర్మ.

సాయిభక్తుల అనుభవమాలిక 361వ భాగం....


ఈ భాగంలో అనుభవాలు:
  1. దయామయుడైన బాబా తన భక్తులను సమస్యలలో వదిలిపెట్టరు
  2. ఊదీ, ప్రసాదాలతో లభించిన బాబా ఆశీస్సులు

దయామయుడైన బాబా తన భక్తులను సమస్యలలో వదిలిపెట్టరు

న్యూజిలాండ్ నుండి పేరు వెల్లడించని ఒక సాయిభక్తుడు తన అనుభవాన్ని మనతో ఇలా పంచుకుంటున్నారు:

"బాబా! మీకు నా ధన్యవాదాలు. నాకున్న త్వరగా కోపానికి గురయ్యే స్వభావం రోజురోజుకూ దిగజారిపోతోంది. దయచేసి నన్ను మంచి వ్యక్తిగా మలచండి". నాకు బాబా చాలా అనుభవాలిచ్చారు. కానీ ఇప్పుడు నేను పంచుకోబోయేది నా జీవితంలో చాలా ముఖ్యమైనది.

భక్తులందరికీ ఓం సాయిరామ్! కొన్ని ఆరోగ్య సమస్యల కారణంగా నేను గత సంవత్సరం(2018) నా ఉద్యోగానికి రాజీనామా చేశాను. నా ఆరోగ్యం కుదుటపడ్డాక 5 నెలల తరువాత నేను బాబాని తలచుకుని మళ్ళీ అదే సంస్థలో నా అదృష్టాన్ని పరీక్షించుకున్నాను. బాబా ఆశీస్సులతో నా టీమ్ లీడర్ నాకు అవకాశం ఇచ్చాడు. అతను నాకొక కాంట్రాక్ట్ ఉద్యోగాన్ని ఇచ్చాడు. దానితో నేను నిజంగా చాలా సంతోషించాను. తరువాత నా కాంట్రాక్టు ముగియబోతున్న సమయంలో అతను నాకు ఆ సమాచారాన్ని తెలియజేస్తూ, మళ్ళీ నన్ను సంప్రదిస్తానని చెప్పాడు. నేను చాలా టెన్షన్ పడ్డాను. కానీ బాబా తన పిల్లలను రక్షించడానికి ఉన్నారు. ఒక శుభదినాన నా టీమ్ లీడర్ నా చేతికొక కవరు ఇచ్చి, 'ఇది పర్మినెంట్ పోస్ట్' అని చెప్పాడు. నేను విన్నదాన్ని, చూసినదాన్ని నమ్మలేకపోయాను. నేను తనతో "ఇది నిజమా?!" అని అడిగాను. అతను "అవున"ని బదులిచ్చాడు. నా సంతోషానికి అవధులు లేవు. "చాలా చాలా ధన్యవాదాలు బాబా!"

ఇక నా మరో అనుభవానికి వస్తాను. ఒకరోజు పనిలో ప్రాసెస్ చేయడానికి చాలా శాంపిల్స్ ఉన్నాయి. వాటిలో కొన్ని చేశాక నా మనస్సులో ఒక ఆలోచన వచ్చింది, నేనొక్కడినే చేయడానికి ఇవి చాలా ఎక్కువ గనక కొన్నింటిని ప్రాసెస్ చేయమని నా సహోద్యోగిని అడుగుదామని. కానీ ఆమె ఏమనుకుంటుందోనని భయపడ్డాను. అప్పుడు నేను, “బాబా, ఈ పరిస్థితిలో దయచేసి నాకు సహాయం చెయ్యండి. నేను అడగకుండానే నా సహోద్యోగి ఏదోవిధంగా తానే ఈ పని చేయడానికి ముందుకు రావాలి" అని బాబాను ప్రార్థించాను. దయగల బాబా తన భక్తులను సమస్యలలో వదిలిపెట్టరు. కొద్ది నిమిషాల్లో నాకు, నా సహోద్యోగికి మధ్య సంభాషణ మొదలైంది. ఆ సంభాషణలో ఆమె తనంతట తానుగా నాతో, "నేను ఆ శాంపిల్స్ ప్రాసెస్ చేయనా? మీరు వేరే పని చేసుకోవచ్చు" అని అడిగింది. నేను ఆనందాశ్చర్యాలకు లోనై మనసులోనే బాబాకు కృజ్ఞతలు చెప్పుకున్నాను.

పరిస్థితులు ఎలా ఉన్నా బాబాను నమ్మండి. ఆయన ఖచ్చితంగా మనకు సహాయం చేసి కాపాడుతారు. "బాబా, మేము ఎదుర్కొంటున్న మరో పరిస్థితి గురించి మీకు తెలుసు. అది సమస్య అని నేను అనను, ఎందుకంటే దాన్ని జాగ్రత్తగా సరిచేయడానికి మీరున్నారని నాకు తెలుసు. ఎవరూ చెడుగా భావించకుండా విషయం సజావుగా సాగేలా సహాయం చేయండి బాబా. నేను మీ పాదకమలాల వద్ద అన్నీ విడిచిపెడుతున్నాను, అంతా మీరే చూసుకోండి".

ఓం సాయిరామ్! ఓం సాయిరామ్! ఓం సాయిరామ్!

source: http://www.shirdisaibabaexperiences.org/2019/12/shirdi-sai-baba-miracles-part-2576.html

ఊదీ, ప్రసాదాలతో లభించిన బాబా ఆశీస్సులు

పేరు వెల్లడించని ఒక సాయిభక్తురాలు తన అనుభవాన్ని ఇలా పంచుకుంటున్నారు:


ఓం సాయిరామ్! సాయిబంధువులందరికీ నమస్కారం. ఈ బ్లాగు నిర్వహిస్తున్నవారికి  ధన్యవాదాలు. ఇటీవల బాబా నాకు ప్రసాదించిన ఒక చక్కటి అనుభవాన్ని నేనిప్పుడు మీతో పంచుకుంటాను. నేను 2020, ఫిబ్రవరిలో సాయి నవగురువారవ్రతం మొదలుపెట్టాను. మార్చి 5వ తారీఖున 4వ వారం వ్రతం పూర్తిచేసి, "బాబా! మమ్మల్ని ఆశీర్వదించండి" అని వేడుకున్నాను. బాబా అద్భుతం చూపించారు. మాకు శిరిడీ సంస్థాన్‌లో పనిచేస్తున్న ఒక పండిత్ తెలుసు. ఆయన ఎప్పుడు హైదరాబాదు వచ్చినా ఆయనకి తెలిసిన వాళ్ళింట్లో దిగుతారు. ఎప్పుడూ మా ఇంటికి రాలేదు. ఆయన మార్చి 7వ తారీఖున మావారికి ఫోన్ చేసి, "8వ తారీఖున హైదరాబాదు వస్తున్నాను, ఎయిర్‌పోర్టుకి రండి" అని చెప్పారు. ఆయన మా ఇంటికి వస్తారని మేమస్సలు ఊహించలేదు. అలాంటిది ఆయన ఎయిర్‌పోర్టు నుంచి నేరుగా మా ఇంటికే వచ్చారు. మాకు బాబా ఊదీ, ప్రసాదాలు ఇచ్చారు. ఆరోజు మా ఇంట్లోనే ఉండి మరునాడు శిరిడీకి తిరుగు ప్రయాణమయ్యారు. మేము పొందిన ఆనందాన్ని మాటల్లో చెప్పలేను. "బాబా! అడిగినంతనే ఊదీ, ప్రసాదాలు పంపి మమ్మల్ని ఆశీర్వదించిన మీకు మా శతకోటి ధన్యవాదాలు. ఏమైనా తప్పులు ఉంటే మన్నించండి బాబా!"


సాయి అనుగ్రహసుమాలు - 319వ భాగం


ఖపర్డే డైరీ - ఐదవ భాగం

12-12-1910

ఉదయ ప్రార్థనానంతరం సాయి మహారాజు మామూలు అలవాటు ప్రకారం బయటకి వెళుతున్నప్పుడు దర్శనం చేసుకున్నాం. మేమంతా అలవాటు ప్రకారం మాలో మేము మాట్లాడుకుంటూ కూచున్నాం. దీక్షిత్ పూర్తిగా మారిపోయాడు. అతను తన సమయంలో ఎక్కువ భాగం ప్రార్థనలోనే గడుపుతున్నాడు. అసలే ఎంతో సాత్వికమైన ఆయన స్వభావం విశిష్టమైన మాధుర్యాన్ని సంతరించుకుంది. అదంతా లోపలి ప్రశాంతత వల్లనే. పూల్‌గాఁవ్ నుంచి రావుబహద్దూర్ రాజారామ్ పంత్ దీక్షిత్ వచ్చాడు. నాగపూర్‌లో బయలుదేరినప్పుడు శిరిడి రావాలన్న కోరికే లేదట అతనికి. అయితే పూల్‌గాఁవ్ వద్ద తన మనసుని మార్చుకుని వెంటనే శిరిడీ వెళ్ళాలనుకొని మరుక్షణం తన ప్రయాణం కొనసాగించాడు. అతన్ని చూడటం నాకు చాలా సంతోషాన్ని కలిగించింది. 

తరువాత మేమందరం సాయిబాబా దర్శనానికి వెళ్ళాం. నేను కొంచెం ఆలస్యంగా వెళ్ళటం వల్ల వారు చెప్పిన ఒక మంచి కథను వినలేకపోయాను. వారి బోధ నీతికథలతో ఉండేది. ఆ కథ ఒకతనికి ఉన్న ఒక అందమైన గుఱ్ఱం గురించినది. అది తను అనుకున్నదే చేసేదట కానీ దాని జంటతో కలిసేది కాదట. దానిక్కావలసిన శిక్షణ ఇచ్చేందుకు దానిని అన్నిచోట్లకి తిప్పినా ప్రయోజనం కలగలేదు. చివరికి దానిని ఎక్కడనుంచి తెచ్చారో ఆ చోటుకి తీసుకువెళ్ళమని ఒక పండితుడు చెప్పాడు. అలా చేశాక అప్పుడు ఆ గుఱ్ఱం సరిగ్గా స్వాధీనంలోకి వచ్చి చాలా ఉపయోగపడిందట. ఈ నీతికథ సారాంశాన్ని విన్నాన్నేను. 

నేనెప్పుడు వెళుతున్నానని అడిగారు బాబా. వారంతట వారు నాకెప్పుడు అనుమతిస్తే అప్పుడు వెళతానని సమాధానం చెప్పాను. "నీ భోజనమయాక ఈరోజే నీవు వెళ్ళొచ్చు" అన్నారు బాబా. తరువాత మాధవరావు దేశ్‌పాండే చేత పెరుగును నాకు ప్రసాదంగా పంపారు. దాన్ని భోజనంలో తిని ఆ తరువాత సాయిసాహెబ్ దగ్గరకు వెళ్ళాను. నేను వెళ్ళగానే తమ అనుమతిని ధృవీకరించారు బాబా. మా అబ్బాయి ఈ అనుమతిని నమ్మకపోవటం వల్ల మళ్ళీ ఖచ్చితంగా అడిగితే బాబా స్పష్టమైన మాటల్లో తమ అనుమతినిచ్చారు. ఈరోజు సాయి మహారాజు ఇతరులని దక్షిణ అడిగారు, కానీ నన్ను, మా అబ్బాయినీ అసలు అడగలేదు. నా దగ్గర డబ్బు లేదన్న విషయం వారికి తెలుసు కాబోలు. నూల్కర్, దీక్షిత్, బాపూసాపాబ్ జోగ్, బాబాసాహెబ్ సహస్రబుద్ధే, మాధవరావు దేశ్‌పాండే, బాలాసాహెబ్ భాటే, వాసుదేవరావు తదితరుల వద్ద సెలవు పుచ్చుకొని పట్వర్ధన్, ప్రధాన్, కాకామహాజని, తర్ఖడ్, ఈరోజే వచ్చిన భిడేలతో కలసి శిరిడీ నుంచి బయలుదేరాం. కోపర్‌గాఁవ్‌లో సాయంత్రం 6.30 గంటలకి రైలెక్కి మన్మాడ్ వెళ్ళాం. భిడే యవలా దగ్గర దిగిపోయాడు. నేను, మా అబ్బాయి వెంటనే పంజాబ్ మెయిల్లో మన్మాడ్ నుండి వెళ్ళిపోతాం.

తరువాయి భాగం రేపు ......

source:  "దేవుడున్నాడు లేడంటావేం!" బై విమలాశర్మ.

సాయిభక్తుల అనుభవమాలిక 360వ భాగం....


ఈ భాగంలో అనుభవం:
  • శిరిడీ ప్రయాణం - బాబా అనుగ్రహం - రెండవ భాగం 

నా పేరు శ్రావణి. ఇటీవలి మా శిరిడీయాత్రలోని కొన్ని అనుభవాలు నిన్న పంచుకున్నాను. ఇప్పుడు మరికొన్ని అనుభవాలు మీతో పంచుకుంటాను. 

శిరిడీ చేరుకున్న మొదటిరోజు నేను, మా బాబు, నాన్న, నా స్నేహితురాలు కలిసి మొదటిసారి బాబా దర్శనానికి వెళ్ళాము. బాబా చక్కటి దర్శనంతో అనుగ్రహించారు. మేము చాలా సంతోషంగా బయటకి వచ్చాము. మా బాబు అనికేత్ చాలా అల్లరివాడు. వాడు నా చెయ్యి వదిలేసి హనుమాన్ మందిరం దగ్గర ఉన్న ఒక షాపులోకి వెళ్ళిపోయాడు. కాసేపట్లోనే అక్కడినుండి మళ్ళీ ఎటు వెళ్ళాడో తెలియలేదు, ఎక్కడ చూసినా కనిపించలేదు. నేను వాడి గురించి చాలా ఆందోళన చెందుతూ ద్వారకామాయి దగ్గర నిల్చొని, "బాబా, ప్లీజ్! అనికేత్‌ని చూపించండి" అని వేడుకున్నాను. వెంటనే ఎవరో ఒకతను నా చేతిలో పాలకోవా పెట్టి వెళ్లిపోయాడు. ఆ మరుక్షణమే మా బాబు ఒక బొమ్మల దుకాణం నుంచి బయటకి వస్తూ కనిపించాడు. హమ్మయ్య అనుకుంటూ అడిగినంతనే వాడిని చూపించిన బాబాకు కృతజ్ఞతలు చెప్పుకున్నాను. ఇంకోసారి 3వ నెంబర్ గేట్ వద్ద నేను హ్యాండ్‌బ్యాగ్ చెక్ చేయించుకుంటున్నంతలో వాడు క్యూ లైన్ల మధ్యలో ఉండే సందుల గుండా వెళ్ళిపోయాడు. ఆ జనంలో వాడిని ఎలా పట్టుకునేది అని నేను కంగారుపడుతుంటే, బయటకి వెళ్తున్న ఒకతను నన్ను అక్కడే ఉండమని చెప్పి, వాడిని తీసుకొచ్చి నా చేతికి అప్పగించి వెళ్లిపోయాడు. మేము అక్కడినుండి లోపల ఉన్న మ్యూజియం వద్దకు వెళ్లేసరికి నాకు బాబుని అప్పగించిన అదే వ్యక్తి  అక్కడ కూర్చొని నవ్వుతూ కనిపించాడు. 'బయటకు వెళ్తున్న వ్యక్తి మళ్ళీ ఇంతలోనే ఇక్కడెలా ఉన్నాడా?' అని నేను ఆశ్చర్యపోయాను. అతని చిరునవ్వు మాత్రం చాలా ప్రశాంతంగా ఉంది. అతను నాతో, "మీ బాబు చాలా అల్లరివాడు" అని హిందీలో అన్నారు. నేను ‘అవున’ని అన్నాను.

అదేరోజు రాత్రి నేను, నా ఫ్రెండ్ మరలా బాబా దర్శనానికి వెళ్తుండగా క్యూ లైన్ దగ్గర ఒక పాప వచ్చి బాబా ఫోటో నా చేతిలో పెట్టి, "ఆప్కో, లేలో దీదీ (ఇది మీకే, తీసుకో అక్కా)" అంది. నేను వద్దన్నాను. తను వెంటనే "ముప్త్ మే లేలో దీదీ (ఉచితంగానే తీసుకో)" అని చేతిలో పెట్టి వెళ్లిపోయింది. ఆశ్చర్యమేమిటంటే, ఆ పాప ప్రక్కనే ఉన్న నా స్నేహితురాలికి ఇవ్వలేదు, కేవలం నాకు మాత్రమే ఇచ్చింది. ఆ ఫోటోలోని బాబాని చూస్తూ లోపలికి వెళ్ళాను. చాలా త్వరగానే సమాధి మందిరంలోకి ప్రవేశించాము. బాబా నాకు ఎంతో ఇష్టమైన లావెండర్ కలర్ దుస్తుల్లో దర్శనమిచ్చి నాకు చాలా ఆనందాన్ని ప్రసాదించారు. అక్కడినుండి గురుస్థాన్ దగ్గరకి వెళ్తూ, "బాబా నాకెప్పుడూ వేపాకు ఇవ్వరు" అనుకుంటూ ఉన్నాను. అంతలో నా స్నేహితురాలికి ఒక వేపాకు దొరికితే దాన్ని తను నాకిచ్చింది. నేను నా మనసులో, 'ఎప్పుడూ నాకొకరు ఇవ్వటమేగాని నాకుగా దొరకవు' అనుకున్నాను. అంతలో గ్రిల్స్ మధ్యలో ఒక వేపాకు కనిపించింది. అక్కడే ఉన్న ఒక వేపపుల్లతో దాన్ని నెమ్మదిగా బయటకు లాగాను. మొదటిసారి నాకు వేపాకు దొరకడంతో నా ఆనందానికి అవధులు లేవు. తరువాత అక్కడే మందిర ప్రాంగణంలో కూర్చొని బాబాని చూస్తూ మాట్లాడుకుంటూ ఉన్నాము. అంతలో గాలి వీస్తున్నట్లుగా గమనించాను. ఆ సమయంలో గురుస్థాన్ వద్ద ఎవరూ లేరు. వెంటనే పరుగున అక్కడికి వెళ్ళాను. నాపై చాలా ఆకులు రాలిపడ్డాయి. నా హ్యాండ్ బ్యాగు తీసి దొరికిన అన్ని వేపాకులను బ్యాగులో వేసుకోవడం మొదలుపెట్టాను. నేను వేసుకుంటూనే ఉన్నాను, అవి పడుతూనే ఉన్నాయి. చుట్టూ జనం ఉన్నారు, కానీ మేమున్న చోటకి మాత్రం ఎవరూ రావటం లేదు. గతంలో నేను మీతో పంచుకున్న ఒక అనుభవంలో స్వప్నంలో బాబా నా రెండు చేతుల నిండా వేపాకులు ఇచ్చారని చెప్పాను. అక్షరాలా ఆ స్వప్నాన్ని ఇప్పుడు బాబా నిజం చేసి నన్ను అనుగ్రహించారని నాకనిపించి బాబాకు మనసారా కృతజ్ఞతలు తెలుపుకున్నాను. తర్వాత అక్కడినుండి మేము ద్వారకామాయికి వెళ్లి చాలాసేపు కూర్చున్నాం. కొంతసేపటికి నా స్నేహితురాలు ‘నీ జుట్టులో ఒక వేపాకు ఉంది’ అని చెప్పి, తీసి నాకిచ్చింది. అప్పటికి నేను చాలాసార్లు నా టీషర్ట్ కున్న క్యాప్ వేస్తూ తీస్తూ ఉన్నా కూడా అది క్రిందపడకుండా నా తలలోనే ఉండటం ఆశ్చర్యంగా అనిపించింది. ఈ అనుభవం నేను ఎప్పటికీ మర్చిపోలేనిది, నాకు చాలా చాలా ఆనందాన్నిచ్చింది.

చివరిగా మేము తిరుగు ప్రయాణమవ్వాల్సిన రోజు వచ్చింది. ఆరోజు నా ఫ్రెండ్ వేకువనే వెళ్లి బాబా దర్శనం చేసుకుందామంటే తొందరగా లేచి రెడీ అయ్యాము. కానీ నా మనసుకి మా బాబుని కూడా తీసుకెళ్లి ద్వారకామాయిలో బాబా దర్శనం చేయిద్దామని చాలా అనిపించింది. కానీ ‘ఇంత చలిలో వాడు పొద్దున్నే లేవడు’ అనుకుంటూ ఉన్నాను. మరుక్షణమే వాడు నిద్రలేచి చకచకా రెడీ అయిపోయాడు. దర్శనానికి వెళ్తూ దారిలో నా స్నేహితురాలు తన ఆఫీసులోని వాళ్ళు బాబాకి నైవేద్యం తీసుకెళ్లమని చెప్పారని కోవా, బొరుగులు తీసుకుంది. నాకు కూడా తెలిసిన వాళ్ళు కోవా తీసుకోమని చెప్పి ఉండటంతో నేను కూడా ఒక కోవా ప్యాకెట్ తీసుకున్నాను. అప్పుడు నా ఫ్రెండ్, "బాబాకి నువ్వు ఏమీ ఇవ్వవా?" అని అడిగింది. నేను తనతో, "మీరంతా ఇచ్చేవి నేను ఇవ్వను. నేను బాబా కోసం నల్లద్రాక్ష తీసుకెళ్తాను" అని చెప్పి వాటిని తీసుకున్నాను. చలి ఎక్కువగా ఉండటంతో క్యూ లైన్లో ఉన్నపుడు నాకు బాగా దగ్గు వచ్చి వాంతి అయ్యేలా కూడా అనిపించింది. దాంతో ఎవరినీ పట్టించుకోకుండా ఒక దగ్గర కూర్చుండిపోయాను. నా పరిస్థితి అర్థం కాకపోయినా నా స్నేహితురాలు నాకు బాబా ఊదీ ఇచ్చింది. ఊదీ తీసుకోగానే బాబా దయవల్ల నా పరిస్థితి చక్కబడింది, మరలా దగ్గు రాలేదు. ఆదివారం కావడంతో దర్శనానికి మాకు రెండు గంటల సమయం పట్టింది. బాబా దగ్గరకి చేరుకున్నాక అక్కడున్న పూజారికి మేము తీసుకెళ్లిన ప్రసాదాల ప్యాకెట్లను అందించాము. ఆ పూజారి ప్రత్యేకంగా నేను తీసుకెళ్లిన నల్లద్రాక్ష ప్యాకెట్‌ని ఓపెన్ చేసి, కొన్ని తన చేతిలోకి తీసుకొని, కొంతసేపు అలాగే పట్టుకొని తరువాత బాబా పాదాలకి తాకించి నాకు ఇచ్చారు. అంతసేపూ నేను బాబా ప్రక్కనే ఉన్నాను. అంత రద్దీలో నేను తీసుకెళ్లిన నైవేద్యాన్ని స్వీకరించడమే కాకుండా, ఎక్కువ సమయం తమను దర్శించుకొనే అవకాశమిచ్చి బాబా ఎంతగానో నన్ను ఆశీర్వదించారు. 

తరువాత గురుస్థాన్ దగ్గర మా బాబుని ఒకచోట కూర్చోబెట్టి మేమిద్దరం ప్రదక్షిణలు చేశాము. మేము వచ్చేసరికి వాడు, 'ఎవరో ఒకతను వచ్చి తనతో హిందీలో మాట్లాడి, కొన్ని వేపాకులు ఇచ్చి వెళ్లార'ని చెప్పాడు. ప్రదక్షిణలు చేయడంలో నిమగ్నమై నేను అతనిని చూడలేకపోయాను. కొద్దిసేపటి తరువాత గురుస్థాన్‌లో గురు, శుక్రవారాలలో ధుని వెలిగించే చోట తలపై టోపీ పెట్టుకున్న ఒక పెద్దాయనను చూశాను. ఆయన నాకోసమే వేచి చూస్తున్నట్లుగా నా చేతిలో ఊదీ పెట్టేసి వెళ్లిపోయారు. అయితే నేను ఆయన మొహాన్ని సరిగ్గా చూడలేకపోయాను, టోపీ పెట్టుకొని ఉండడం మాత్రం చూశాను. తర్వాత నేను అనుకున్నట్లుగానే మా బాబుని తీసుకొని ద్వారకామాయికి వెళ్లి బాబా దర్శనం చేయించాను. తరువాత మహాలక్ష్మి మందిరంలో ఆరోజు ఆరతికి కూడా హాజరయ్యాము.

మా తిరుగు ప్రయాణానికి నేను బస్సులో అమ్మ, నాన్నకోసం క్రింద రెండు సీట్లు, మాకోసం పైన రెండు సీట్లు బుక్ చేశాను. అయితే నేను బస్సు ఎక్కేసరికి మేము బుక్ చేసుకున్న పైసీట్లలో భార్యభర్తలు పడుకొని ఉన్నారు. వారిలో ఒకరు "మాకు మీ సీట్స్ కావాలి, బదులుగా నేను మీకు మేము బుక్ చేసుకున్న కింద రెండు సీట్లు ఇస్తాను" అని అన్నారు. నేను వెనకా ముందూ ఆలోచించుకోకుండా సరేనని చెప్పాను. అయితే అదంతా బాబా తన బిడ్డల క్షేమం కోసమే చేసిన ఏర్పాటని నాకు తర్వాత అర్థమైంది. కొంతసేపటికి నాకు వాంతులు మొదలయ్యాయి. దాంతో నేను చాలా అవస్థపడ్డాను. బాబా ఊదీ పెట్టుకున్నప్పటికీ సమస్య అలాగే కొనసాగింది. తెల్లవారుఝామున 4 గంటల వరకూ నాకు, అమ్మకి నిద్రలేదు. ఆ సమయంలో ఊదీ రెండవసారి పెట్టుకున్నాక నాకు నిద్ర పట్టింది. బాబా దయవల్ల బస్సు ఎక్కగానే సీట్లు మార్పు జరిగింది కాబట్టి సరిపోయింది, లేకపోతే పైసీటులో ఉండి నేను వాంతులు చేసుకుంటుంటే అందరికీ చాలా సమస్య అయ్యేది. నిజానికి క్రిందనే అమ్మ పక్కన నేను ఉండేలా బాబా చేసిన సహాయం అంతా ఇంతా కాదు, నేను ఎప్పటికి మరువలేనిది.

తరువాత హైదరాబాదులో మేము ఎక్కాల్సిన ట్రైనులో మాకు అన్నీ మిడిల్, అప్పర్ బెర్తులు వచ్చాయి. వయస్సు పైబడిన అమ్మ, నాన్నలు పైబెర్తులు ఎక్కలేరు. పోనీ ట్రైన్ ఎక్కాక ఎవరినైనా రిక్వెస్ట్ చేసి బెర్తులు మార్చుకుందామంటే, క్రింది బెర్త్ వచ్చిన వాళ్ళు కూడా వయసు పైబడిన వాళ్ళైతే సమస్య అవుతుంది. ఆ స్థితిలో నాకేమి చేయాలో తోచక సహాయం చేయమని బాబానే ప్రార్థించాను. తరువాత మాకు తెలిసిన వాళ్ళ మొబైల్ నెంబర్ కనుక్కొని, అతని ద్వారా క్రింది బెర్తుల కోసం ప్రయత్నించాను. బాబా కృపవలన అతను రెండు క్రింది బెర్తులు వచ్చేలా చేశారు. అయితే నాకు, నా స్నేహితురాలికి బెర్తులు వేరేచోట ఉండటంతో అమ్మావాళ్లకు ఏదైనా అవసరమైతే ఎలా అని ఆందోళనపడ్డాను. దాన్ని కూడా బాబా దూరం చేశారు. స్వామిమాలలో ఉన్న ఒకతను మాకు సహాయం చేసి మేమంతా ఒకేచోట ఉండేలా చేశారు. ఇలా ప్రతి విషయంలో బాబా మాకు సహాయం చేస్తూ మమ్మల్ని జాగ్రత్తగా ఇంటికి చేర్చారు. ముందే చెప్పానుగా, ఇంటికి వచ్చాక అమ్మకు ఆపరేషన్ అవసరం లేదని బాబా మాకు ఇచ్చిన గొప్ప ఉపశమనం గురించి(ముందు భాగంలో).

శిరిడీ నుండి వచ్చాక డిసెంబరులో మా బాబు ఒంటిపై ఒక సెగగడ్డ లేచింది. దాని గురించి నాకంతగా అవగాహన లేకపోవడంతో నేను అశ్రద్ధ చేశాను. అయితే రానురానూ వాడు ఆ సెగగడ్డతో ఇబ్బందిపడుతుంటే చూడలేక ఒకరోజు వాడిని తీసుకొని చర్మవ్యాధుల డాక్టర్ దగ్గరకి వెళ్ళాను. కానీ ఆరోజు డాక్టర్ హాస్పిటల్లో లేరు. దాంతో అదేరోజు సాయంత్రం బాబుని హోమియో డాక్టరు వద్దకు తీసుకొని వెళ్లగా, అతను కొన్ని మందులు ఇచ్చారు. అయితే రాత్రికి ఆ సెగగడ్డ బాగా పెద్దగా అయిపోయింది. దాంతో బాబు కూర్చోడానికి చాలా ఇబ్బందిపడ్డాడు. అన్నం కూడా పడుకొనే తిన్నాడు. రాత్రి 9.30 సమయంలో వాడు బాధను తట్టుకోలేక పెద్దగా ఏడవటం మొదలుపెట్టాడు. వాడిని చూస్తుంటే మాకు చాలా బాధేసింది. వాడు ఏడుస్తూనే బాబా ఊదీ ఇవ్వమని అడిగాడు. నేను ఊదీ ఇస్తే, వాడు కొంచెం నోట్లో వేసుకొని శిరిడీలో తీసుకున్న బాబా క్యాలెండరుని చూస్తూ “బాబా.. బాబా” అంటూ ఏడుస్తూనే ఉన్నాడు. హోమియో డాక్టర్, మా ఇంటికి దగ్గర్లో ఉన్నవాళ్ళు కూడా “గడ్డ చాలా పెద్దదై గట్టిగా ఉంది, అందువల్ల ఇంకో రెండు రోజులైనా అది పగలదు” అని మమ్మల్ని ఇంకా భయపెట్టారు. నేను బాబా ఊదీని నీళ్ళలో కలిపి వాడికిచ్చి, “బాబా! దయచేసి ఈరోజే వాడికి తగ్గేలా చెయ్యండి” అని ప్రార్థించాను. వాడు 'బాబా.. బాబా' అంటూ ఏడ్చి ఏడ్చి నిద్రలోకి జారుకున్నాడు. రాత్రి 12.30 సమయంలో మా అమ్మ బాబుని చూడడానికని వచ్చి, సెగగడ్డ పగిలి ఉండటం చూసి నన్ను నిద్ర లేపింది. ఆలోగా వాడు కూడా లేచి నొప్పి వలన 2.30 వరకు బాధపడుతూ ఉన్నాడు. అప్పుడు కాస్త నొప్పి ఉపశమనం కావడంతో వాడు హాయిగా నిద్రపోయాడు. మరుసటిరోజుకి బాబా దయవల్ల సెగగడ్డ పూర్తిగా తగ్గిపోయి బాబు మునుపటిలా హుషారైపోయాడు.

తరువాత ఒకరోజు మా బాబు నాతో మాట్లాడుతూ హఠాత్తుగా చెంపలు వేసుకున్నాడు. “ఎందుకురా అలా చెంపలు వేసుకున్నావు?” అని నేనడిగితే వాడు, “'బాబా అబద్దం చెప్పకూడద'ని నాతో చెప్పారు" అని అన్నాడు. “ఎప్పుడు చెప్పారు” అని అడిగితే, "నవంబర్ 27వ తేదీన" అని స్పష్టంగా చెప్పాడు. ఆ విషయం గురించి రెండు మూడుసార్లు అడిగినప్పటికీ కూడా వాడు ఖచ్చితంగా అదే తేదీ చెప్పాడు. నిజానికి ఆరోజే మా శిరిడీ ప్రయాణం మొదలైంది. చిన్నవయస్సులోనే వాడికి బాబాపై ఉన్న ప్రేమని చూస్తుంటే మాకు చాలా ముచ్చటగా అనిపిస్తుంది. "బాబా! మీరు మా కుటుంబంపై చూపుతున్న అనుగ్రహానికి చాలా చాలా ధన్యవాదాలు. ఎప్పుడూ మమ్మల్ని ఇలాగే ఆశీర్వదించండి".


(మా బాబుకి బాబాతో చాలా అనుబంధం ఉంది. ఆ అనుభవాలు ఇదివరకు మీతో ఈ బ్లాగు ద్వారా పంచుకున్నాను. ఎవరైనా అవి చదవాలనుకుంటే, ఇక్కడ ఇస్తున్న లింకుపై క్లిక్ చేసి చదవవచ్చు  - https://saimaharajsannidhi.blogspot.com/2019/08/129.html)



సాయి అనుగ్రహసుమాలు - 318వ భాగం


ఖపర్డే డైరీ - నాలుగవ భాగం

11-12-1910.

పొద్దున - నా స్నానపూజాదులు అయాక, బాంబేకి చెందిన హరిభావు దీక్షిత్, కీ.శే. ఆత్మారామ్ పాండురంగ కుమారుడు తర్ఖడ్, అకోలాకు చెందిన అన్నాసాహెబ్ మహాజని వంశస్థుడయిన మహాజని వచ్చారు. మామూలుగానే మేం సాయిసాహెబ్ దర్శనానికి వెళ్ళాం. ఈరోజు సంభాషణ రెండు సంఘటనలవల్ల విశిష్ఠతను, ప్రాముఖ్యతను సంతరించుకొన్నది. సాయి మహారాజు తానొక మూల కూచుని తన అధోభాగాన్ని చిలుక యొక్క అధోభాగంతో మార్పిడి చేసుకుందామని కోరుకున్నారట. ఆ కోరుకున్న మార్పు వచ్చినా ఒక సంవత్సరం పాటు ఆ సంగతి తెలుసుకోలేకపోయారట. ఒక లక్ష రూపాయలు నష్టం వచ్చిందట. అప్పుడు ఆయన ఒక స్తంభం వద్ద కూచోటం మొదలెట్టేసరికి ఒక పెద్ద సర్పం కోపంతో లేచిందట. అది అంతెత్తున ఎగిరి అక్కడి నుంచి క్రిందపడుతోందట. అంతలో గబుక్కున సంభాషణ మార్చి, తాను ఒక చోటుకి వెళ్ళాననీ అక్కడ మొక్కలు నాటి నడిచే మార్గం నిర్మించాక గానీ ఆ గ్రామపెద్ద తనని అక్కడ నుంచి వెళ్ళనివ్వలేదని చెప్పారు. వారు ఆ రెండు పనులు పూర్తి చేశారట.

ఆ సమయంలో కొంతమంది లోపలికి వచ్చారు. అందులో ఒక వ్యక్తితో ఆయన, "నేను తప్ప నిన్ను చూసేవాళ్ళెవరూ లేరు" అన్నారు. చుట్టూ చూస్తూ ఆయన, "అతనికి దూరపుబంధువైన ఆమె రోహిల్లాని పెళ్ళాడితే, అతను ఈ మనిషిని దోచుకున్నాడ"ని అన్నారు. "ప్రపంచం చాలా చెడ్డది" అనీ, "మనుషులు మునుపటిలా లేరు. పూర్వం వాళ్ళు చాలా ప్రశాంతంగా, నిజాయితీగా ఉండేవారు, కానీ ఇప్పుడు వాళ్ళు అపనమ్మకాలతో ఉంటూ, చెడ్డపనుల గురించే తీవ్రంగా ఆలోచిస్తున్నారు" అనీ అన్నారు. సాయి ఇంకా ఏదో అన్నారు కానీ అదేమిటో నేను పట్టుకోలేకపోయాను. అది అతని తండ్రి గురించీ, తాత గురించీ, ఇంకా తండ్రిలాగానూ, తాతలాగానూ అయిన అతని గురించీనూ.

అప్పుడు దీక్షిత్ పళ్ళు తీసుకొచ్చాడు. సాయిసాహెబ్ అందులో కొన్ని తిని మిగతావి అందరికీ పంచారు. అప్పుడు అక్కడే వున్న ఆ తాలూకా మామల్తదారు బాలాసాహెబ్, 'సాయి మహారాజు కేవలం ఒకే రకమైన పండ్లను ఇస్తున్నార'న్నాడు. "మనకుండే భక్తిభావాన్ని బట్టి సాయి మహారాజు మనం సమర్పించిన పళ్ళను అంగీకరించటమో, తిరస్కరించటమో చేస్తారు" అని మా అబ్బాయి తన స్నేహితుడు పట్వర్ధన్‌తో అన్నాడు. మా అబ్బాయి దాన్నే నాతో చెప్పటానికి ప్రయత్నించి అలాగే పట్వర్ధన్‌తో కూడా చెప్పాలనుకున్నాడు. దీనివల్ల కొంచెం కలకలం చెలరేగింది. సాయి మహారాజు కోపంతో ప్రజ్వలించే ప్రకాశవంతమైన కళ్ళతో అద్భుతంగా నా వైపు చూసి నేనేమంటున్నానో అడిగారు. నేనేం మాట్లాడటం లేదనీ, పిల్లలు వాళ్ళల్లో వాళ్ళు మాట్లాడుకుంటున్నారని అన్నాను. ఆయన నా కుమారుడి వైపూ, పట్వర్ధన్ వైపూ చూసి వెంటనే తమ ధోరణి మార్చేసుకున్నారు.

అందరం బయటికి వస్తున్నప్పుడు బాలాసాహెబ్ మిరీకర్, 'సాయి మహారాజు అంతసేపూ హరిభావూ దీక్షితో మాట్లాడుతూనే ఉన్నార'న్నాడు. మధ్యాహ్నం మేం భోజనాలు చేస్తున్నప్పుడు అహ్మద్ నగర్‌లో స్పెషల్ మేజిస్ట్రేటూ, ఈనాముదారూ అయిన మిరీకర్ వాళ్ళ నాన్న వచ్చారు. ఆయన గౌరవనీయులైన పాతకాలం పెద్దమనిషి. ఆయన సంభాషణ నాకు చాలా నచ్చింది. సాయంత్రం సాయిసాహెబ్‌ను మేం మామూలుగా దర్శనం చేసుకుని, రాత్రి మాట్లాడుకుంటూ కూచున్నాం. నూల్కర్ కొడుకు విశ్వనాథ్ రోజూలాగే భజన చేశాడు.

తరువాయి భాగం రేపు ......

source:  "దేవుడున్నాడు లేడంటావేం!" బై విమలాశర్మ.

సాయిభక్తుల అనుభవమాలిక - 359వ భాగం....


ఈ భాగంలో అనుభవం:
  • శిరిడీ ప్రయాణం - బాబా అనుగ్రహం - మొదటి భాగం 

నా పేరు శ్రావణి. గతంలో బాబా నాకు ప్రసాదించిన కొన్ని అనుభవాలను ఈ బ్లాగు ద్వారా మీతో పంచుకున్నాను. ఇటీవలి మా శిరిడీయాత్ర గురించి ఇప్పుడు మీతో పంచుకుంటాను. 

మేము 2018, ఆగష్టులో శిరిడీ వెళ్ళివచ్చాము. 2019 సంవత్సరం ప్రారంభమయ్యాక నాకు మళ్ళీ శిరిడీ వెళ్లి బాబాను దర్శించుకోవాలని అనిపించింది. ఆ విషయంలో నాకంటే మా బాబుకే ఎక్కువ ఆరాటం ఉందని చెప్పాలి. తనను శిరిడీ తీసుకెళ్లమని మా బాబు పదేపదే అడుగుతుండేవాడు. కానీ అనుకోని సంఘటనల కారణంగా అప్పుడు నేను శిరిడీకి వెళ్లలేని పరిస్థితి. వాటి గురించి చెపితే అర్థం చేసుకోలేని వయస్సు వాడిది. అందువలన వాడికి ఏదో ఒకటి నచ్చచెప్తూ ఉండేదాన్ని. కానీ వాడు మాత్రం ఎప్పటికప్పుడు తనను శిరిడీ తీసుకెళ్లమని అడుగుతుండేవాడు. ఒకసారి వాడు నిద్రలేస్తూనే "శిరిడీ ఎప్పుడు తీసుకెళ్తావ"ని మారాం చేశాడు. మరోసారి శిరిడీ టిక్కెట్లు బుక్ చెయ్యమని మావారి చేతిలోని ఫోన్ బలవంతంగా లాక్కుని నా చేతిలో పెట్టాడు. అలా వాడు చేసిన మారాం అంతా ఇంతా కాదు. అక్టోబరు నెలలో ఒకరోజు వాడు టాయిలెట్‌లో కూర్చొని ఏడుస్తున్నాడు. మా అమ్మ, "ఎందుకు వాడలా ఏడుస్తున్నాడు?" అని నన్నడిగితే, నేను వెళ్లి వాడిని కారణం అడిగాను. అందుకు వాడు, "నాకు శిరిడీకి వెళ్ళాలని ఉంది. నన్ను శిరిడీకి తీసుకెళ్తానంటే కానీ నేను బయటకు రాను" అని మొండిపట్టు పట్టాడు. దాంతో సాయిభక్తులైన మా నాన్న, తన మనవడి ఆరాటం చూసి, "ఎవరు వచ్చినా రాకపోయినా నేనే వాడిని ఫ్లైట్‌లో శిరిడీకి తీసుకొని వెళ్తాన"ని అన్నారు. దాంతో నేను, మా బాబు, మా నాన్న, మా అత్తయ్య, నా స్నేహితురాలు శిరిడీ వెళ్లడానికి నిర్ణయించుకొని ఫ్లైట్ టిక్కెట్లు బుక్ చేసుకున్నాం. అలా మా శిరిడీ ప్రయాణాన్ని బాబా ఎంతో చక్కగా ప్లాన్ చేశారు.

అయితే అనుకోకుండా నవంబరు నెలలో మంచు ఎక్కువగా ఉండటంతో సాంకేతిక కారణాల వల్ల మేము ఎక్కాల్సిన ఫ్లైట్ రద్దయింది. నేను ఆలస్యం చెయ్యకుండా వెంటనే స్లీపర్ బస్సుకి టిక్కెట్లు బుక్ చేశాను. రెండురోజులలో ప్రయాణమనగా మా బాబుకి కలలో బాబా కనిపించి, "నువ్వు శిరిడీకి రా, నిన్ను జాగ్రత్తగా చూసుకుంటాను" అని చెప్పారు. మా ప్రయాణానికి ఒకరోజు ముందు మా అత్తయ్య బైక్ మీద నుండి క్రింద పడిపోయింది. ఆమె వెన్నుపూసకు ఫ్రాక్చర్ అవ్వడంతో డాక్టర్లు ఆమెను దూరప్రయాణం చేయవద్దని చెప్పారు. దాంతో నేను 'శిరిడీ వెళ్ళాలా, వద్దా?' అన్న పెద్ద సందిగ్ధంలో పడిపోయాను. కానీ మా అత్తయ్య, "నాకేమీ పరవాలేదు, నువ్వు శిరిడీకి వెళ్ళు" అని ధైర్యం చెప్పడంతో నాకు కాస్త ఊరట కలిగింది. కానీ మా అత్తయ్య టికెట్ ఏం చెయ్యాలో నాకు అర్థం కాలేదు. పోనీ మా అమ్మని తీసుకెళదామంటే, ఆమెకున్న మోకాళ్ళ నొప్పుల కారణంగా తను ఎక్కువగా ప్రయాణాలు చెయ్యటంలేదు. కానీ మా అత్తయ్యతో సహా అందరూ మా అమ్మను శిరిడీకి వెళ్ళిరమ్మని బలవంతం చెయ్యడంతో ఆమె ప్రయాణానికి సిద్ధమైంది. "నా ఆజ్ఞ లేనిదే ఎవరూ శిరిడీలో అడుగుపెట్టలేరు" అని బాబా అన్నారు. బాబా ఎవరిని, ఎలా తన దగ్గరకు రప్పించుకుంటారో తెలుసుకోవటానికి మా అమ్మ శిరిడీ ప్రయాణమే ఒక నిదర్శనం. అసలు మా అమ్మని శిరిడీకి రప్పించుకోవటంలో బాబా ప్రణాళిక చాలా భిన్నంగా ఉంది.

బాబా మా అమ్మను అనుగ్రహించిన తీరు

మేము నెల్లూరు నుండి సికింద్రాబాదు చేరుకొన్నాము. సికింద్రాబాదు రైల్వేస్టేషనులో ఎస్కలేటర్ మీద వెళ్తుండగా వేరొకరి పొరపాటు వల్ల ట్రాలీ తట్టుకొని మా అమ్మ క్రింద పడిపోయింది. అయితే బాబా దయవల్ల ఆమెకు ఏమీ కాలేదు. అంతేకాదు, మోకాళ్ళ నొప్పులున్న అమ్మ ఎటువంటి ఇబ్బందీ లేకుండా వెంటనే మెట్లు దిగి క్రిందకు రాగలిగింది. మరుసటిరోజు ఉదయం మేము శిరిడీ చేరుకున్నాం. ఆరోజు రాత్రి మా అమ్మ నిద్రలో మంచం మీద నుండి క్రింద పడిపోయింది. నేను, నా స్నేహితురాలు ఇద్దరం కలిసి ఆమెను లేపి మంచంపైన పడుకోబెట్టాము. మరునాటి ఉదయం ఆమె ఎటువంటి ఇబ్బందీ లేకుండా బాబా దర్శనం చేసుకుంది. ఆ తర్వాత ఆమె చక్కగా నడుస్తూ మసీదు (ద్వారకామాయి), చావడి మొదలైన ప్రదేశాలన్నీ దర్శించుకుంది. మాములు పరిస్థితుల్లో అయితే ఆమె అంత దూరం నడవలేదు, కాస్త దూరం నడవటానికే ఇబ్బందిపడుతుండేది. ఆమెకు ఎటువంటి కష్టం లేకుండా బాబా చూసుకున్నారు. అంతా బాబా దయ

మేము శిరిడీ నుండి తిరుగు ప్రయాణమయ్యేరోజు మా అమ్మను ఒంటరిగా హోటల్ గదిలో వదిలి మేమంతా బాబా దర్శనానికి వెళ్ళాము. ఆమె గదిలో ఒంటరిగా పడుకొని ఉంది. ఆ సమయంలో ఆమెకు ఆ గదిలో ఉన్న ఒక అలమారా దగ్గర నల్లని వస్త్రాలు, కిరీటం ధరించి నిల్చొని ఉన్నట్లుగా బాబా స్పష్టంగా కనిపించారు. ఆమె పూర్తి మెలకువ తెచ్చుకొని బాబాతో మాట్లాడాలని, బాబా దగ్గరకు వెళ్ళాలని ప్రయత్నించినప్పటికీ తను మంచం మీద నుండి లేవలేకపోయింది. బాబా దర్శనం చేసుకుని గదికి తిరిగి వచ్చిన తర్వాత జరిగిన విషయం తెలుసుకొని, బాబా ఆమెను శిరిడీకి పిలిపించుకొని తమ దర్శనాన్ని ప్రసాదించి ఆమెను అనుగ్రహించారని  మేము అనుకున్నాము.

ఇప్పుడు అసలైన అద్భుతాన్ని మీతో పంచుకుంటాను. నిజానికి మూడేళ్ళ క్రితం 2016లో మా అమ్మగారి ఒక మోకాలికి ఆపరేషన్ జరిగింది. ఆ సమయంలోనే డాక్టర్లు ఆమె రెండవ మోకాలికి కూడా ఆపరేషన్ చెయ్యాలని అన్నారు. ఆ ఆపరేషన్ 2020 ఫిబ్రవరిలో చెయ్యాల్సి ఉంది. అయితే మేము శిరిడీ నుండి నెల్లూరు తిరిగి వచ్చాక చెకప్ కోసం డాక్టరు దగ్గరకు వెళ్ళినప్పుడు, డాక్టర్ ఎక్స్-రే తీసి ఆమెకు ఇక ఆపరేషన్ అవసరం లేదని చెప్పారు. అది విని మేమంతా ఎంతో ఆశ్చర్యానికి లోనయ్యాము. సికింద్రాబాదు స్టేషన్లో ఎస్కలేటర్ మీద నుండి పడిపోవటం, శిరిడీలో హోటల్ గదిలో మంచం మీదనుండి క్రింద పడిపోవడం, శిరిడీలో బాబా దర్శనం, అక్కడ చాలా దూరం నడవటం, ఆ తర్వాత హోటల్ గదిలో బాబా దర్శనమూ - ఇవన్నీ అమ్మకి బాబా చేసిన చికిత్సలేమో! బాబా దయవల్ల ఇప్పుడు అమ్మ బాగున్నారు. బాబా అద్భుత వైద్యాన్ని ఏమని వర్ణించేది?

రేపటి భాగంలో నా అనుభవాలు మరికొన్ని పంచుకుంటాను ....



సాయి అనుగ్రహసుమాలు - 317వ భాగం


ఖపర్డే డైరీ - మూడవ భాగం.

9-12-1910

నేను, మా అబ్బాయి ఈరోజు వెళ్ళిపోదామనుకున్నాం. ఉదయ ప్రార్థనానంతరం సాయి మహారాజుని యథాప్రకారం దర్శనం చేసుకునేందుకు వెళ్ళినప్పుడు, వారు మా అబ్బాయితో "మీరు వెళ్ళాలనుకుంటున్నారా?" అని, "ఒకవేళ వెళ్ళదలుచుకుంటే వెళ్ళొచ్చ"ని చెప్పారు. అవసరమైన అనుమతి అనుగ్రహించారనుకుని మేం వెళ్ళేందుకు సిద్ధపడ్డాం. మా అబ్బాయి మా సామాన్లన్నీ సర్దేసి మాకోసం ఒక బండినీ, మా సామాను కోసం మరో బండినీ కుదుర్చుకుని వచ్చాక మధ్యాహ్నం మేం బయలుదేరే ముందు సాయి మహారాజుని దర్శించుకునేందుకు వెళ్ళాం. 

నన్ను చూడ్డంతోటే బాబా, "నువ్వు నిజంగా వెళదామనుకుంటున్నావా?" అన్నారు. 'నేను వెళదామనుకుంటున్నమాట నిజమే గానీ, మీరు అనుమతించకపోతే మాత్రం కాదు' అన్నాను. "అయితే మీరు రేపు గానీ, ఎల్లుండి గానీ వెళ్ళొచ్చు. ఇది మనిల్లు, ఈ వాడా మనిల్లు, నేనిక్కడ ఉండగా ఎవరు మాత్రం భయపడవలసిన అవసరమేముంది? ఇది మన సొంతిల్లు. నువ్వు దీన్ని నీ స్వంత ఇల్లుగానే చూడాలి" అన్నారు బాబా. నేను ఆగిపోవటానికి అంగీకరించి వెళ్ళిపోయేందుకు చేసుకున్న ఏర్పాట్లన్నిటినీ రద్దు చేసుకున్నాను. మేం మాట్లాడుతూ కూచున్నాం. సాయి మహారాజు చాలా సంతోషంగా ఉన్నారు. ఎన్నో సంతోషకరమైన విషయాలు చెప్పారు కానీ వారిని నేను అర్థం చేసుకోలేదనే నాకు భయమేస్తోంది.

10-12-1910

ఉదయం ప్రార్ధన కాగానే మా అబ్బాయితో, "మనల్ని ఎప్పుడు పంపించాలో అదంతా ఆయనకు తెలుసు, మనం వెళ్ళిపోయే సంగతిని సాయి మహారాజుతో ప్రస్తావించొద్దు" అన్నాను. సాయీసాహెబ్ బయటకు వెళ్ళేటప్పుడు యథాప్రకారం వారిని చూశాం. మళ్ళీ వారు మశీదుకు వెళ్ళే సమయంలోనూ చూశాం. సాయీసాపాబ్ చాలా ఆనందంగా ఉన్నారు. తనతో అడుకునే ఓ చిన్నపిల్ల పూర్వజీవితం గురించిన కథను చెప్పారు. ఆమె ఒక కళాకారిణి అనీ, ఆమె చనిపోతే మామూలుగానే పూడ్చివేశారనీ చెప్పారు. ఆ మార్గంలోనే వెళుతున్న సాయిసాహెబ్ ఆమె సమాధి వద్ద ఒక రాత్రి గడిపారట. కనుక ఆమె వారిని అనుసరించింది. ఆయన ఆమెని ఒక తుమ్మచెట్టులో పెట్టి ఆ తరువాత ఇక్కడకు తెచ్చారట. వెనుకటి జన్మలో తాను కబీరుననీ, నూలు వడికేవాడిననీ చెప్పారు. సంభాషణ అంతా అతిశయించిన ఆనందంతో సాగిపోయింది.

మధ్యాహ్నం వార్దాకి చెందిన శ్రీధర్ పంత్ పరాంజపే అనే ఆయన ఒక పండిట్, ఒక డాక్టరు, మరో పెద్దమనిషితోనూ కలిసి వచ్చారు. అహ్మద్ నగర్ జూనియర్ పట్వర్ధన్ కూడా వారితో ఉన్నాడు. అతను, మా అబ్బాయి కాలేజీ పాత ఫ్రెండ్స్. వాళ్ళు సాయిసాహెబ్‌ను చూడటానికి పోతుంటే మేము వారిననుసరించాం. మిగతా అందరితో ఎలా వ్యవహరిస్తారో వారితోనూ సాయి అలాగే వ్యవహరిస్తూ మొదట నూనె వ్యాపారి, మార్వాడీ మొదలైనవారి గురించే మాట్లాడారు. తరువాత ఆయన కొత్తగా వస్తున్న భవనాల గురించి మాట్లాడుతూ, "ప్రపంచానికి పిచ్చెక్కింది. ప్రతివాడూ చెడుభావాల్ని అలవరచుకుంటున్నాడు. వాళ్ళతో సమానంగా ఉండాలని నేనెప్పుడూ ప్రయత్నించను. కాబట్టి వాళ్ళేం చెప్పినా నే వినను. అసలు సమాధానమే ఇవ్వను. ఏం సమాధానం చెప్పాలి?" అని, అందరికీ 'ఊదీ' పంచి మమ్మల్ని వాడాకు వెళ్ళిపొమ్మన్నారు. జూనియర్ పట్వర్ధన్‌ని విడిగా చూపిస్తూ తమ సహజధోరణిలో, "నువ్వు ఆగి రేపు వెళ్ళు" అని చెప్పారు. 

నేను, బాబాసాహెబ్ సహస్రబుద్ధే వాడాకి వచ్చేశాం. పరాంజపే, అతని సహచరులూ రాధాకృష్ణ ఆయీ దగ్గరకు వెళ్ళినట్లున్నారు. బాపూసాహెబ్ జోగ్ భార్య అనారోగ్యంగా ఉంది. సాయిసాహెబ్ ఆమెకేమీ మందు ఇవ్వకపోయినా, ఆయన చెప్పిన దాంతో ఆమె బాగా ప్రయోజనాన్ని పొందింది. అయితే ఈరోజు ఆమె తన ఓర్పుని కోల్పోయి వెళ్ళిపోవాలనుకొంది. బాపూసాహెబ్ జోగ్ కూడా (కేవలం) నిస్సహాయతతో ఆమె వెళ్ళిపోవటానికి అంగీకరించాడు. ఆమె పోతున్నప్పుడు సాయిసాహెబ్ ఆమె గురించి పదే పదే అడిగారు. బావూసాహెబ్ జోగ్ ఆ సాయంత్రం సాయిసాహెబ్ దగ్గరకు అనుమతి కోసం వెళ్దామనుకునేంతలో, ఆమె 'తనకు నయంగా ఉందనీ, ఎక్కడికీ వెళ్ళాలనుకోవటం లేద'నీ అంటే మేమంతా ఆశ్చర్యపోయాం.

తరువాయి భాగం రేపు ......

  source:  "దేవుడున్నాడు లేడంటావేం!" బై విమలాశర్మ.

సాయిభక్తుల అనుభవమాలిక - 358వ భాగం....


ఈ భాగంలో అనుభవాలు:
  1. బాబా మాకు బిడ్డను అనుగ్రహించారు
  2. ప్రార్థించినంతనే అమ్మకు స్వస్థత చేకూర్చిన సాయి

బాబా మాకు బిడ్డను అనుగ్రహించారు

సాయిభక్తురాలు చేతన తన అనుభవాన్ని ఇలా పంచుకుంటున్నారు:

ఓం సాయిరామ్! నేను చాలా సంవత్సరాలుగా బాబాకు చిన్న భక్తురాలిని. ఇది నా మొదటి అనుభవం. నాలుగు సంవత్సరాల క్రితం నేను సాయిభక్తుల బ్లాగ్ ద్వారా "నాకు సంతానం ప్రసాదించమ"ని సాయిని ప్రార్థించాను. నా తరఫున బాబాను ప్రార్థించిన తోటి సాయిభక్తులకు నా ధన్యవాదాలు. వాళ్ళందరి ప్రార్థనలు ఫలించి 34 సంవత్సరాల వయస్సులో నేను సాయి ఆశీస్సులతో ఒక ఆడపిల్లకు జన్మనిచ్చాను. ఆ అనుభవాన్ని నేనిప్పుడు మీతో పంచుకుంటాను.

మా అమ్మ అనారోగ్యం పాలై దాదాపు 9 సంవత్సరాలు మంచంపట్టింది. నేను రోజూ ఆమెకు బాబా ఊదీ రాస్తుండేదాన్ని. ఆ తొమ్మిదేళ్ళలో బాబా నాకు ఎంతగానో సహాయం చేశారు. నా వివాహమైన సంవత్సరం తరువాత ఆమె చనిపోయింది. అదే నాకు పెద్ద బాధయితే, గర్భం దాల్చడంలో కూడా నాకు సమస్యలు ఎదురయ్యాయి. నేను పూర్తిగా నిరాశకు లోనయ్యాను. ఆ సమయంలో బాబా భక్తులైన నా స్నేహితులు నేను ఆశను కోల్పోకుండా మనోధైర్యాన్నిచ్చారు. అప్పుడు నేను చాలా ఆలస్యంగా సప్తాహ పారాయణ, నవగురవార వ్రతం ప్రారంభించాను. తరువాత కూడా సంవత్సరం ఐదు నెలలు గడిచినా నేను గర్భం దాల్చలేదు. అయినప్పటికీ నేను డాక్టరును సంప్రదించడానికి ఇష్టపడలేదు. నా చుట్టూ ఉన్నవాళ్ళు ఇప్పటికే చాలా ఆలస్యం అయిందన్న కారణంతో నన్ను డాక్టర్ దగ్గరకు వెళ్ళమని ఒత్తిడి చేయసాగారు. అయినా కూడా నేను చలించలేదు. బాబానే నమ్ముకుని మళ్ళీ నవగురవార వ్రతం ప్రారంభించాను. 9వ వారం వచ్చాక నేను ఇంకా వ్రతం కొనసాగించాలని అనుకున్నాను. అయితే బాబా అద్భుతం చేశారు. నా నెలసరి ఐదురోజులు ఆలస్యం అయ్యింది. ఏడురోజుల తర్వాత గురువారంనాడు నేను గర్భధారణ పరీక్ష చేసుకున్నాను. ఆశ్చర్యం! ఫలితం సానుకూలంగా వచ్చింది. ఆనందంతో నా కళ్ళు కన్నీళ్ళతో నిండిపోయాయి. ఆ ఆనందపారవశ్యంలో బాబాకు చాలాసార్లు కృతజ్ఞతలు చెప్పుకున్నాను. బాబాకు తనకంటూ సమయాలుంటాయి. సమయం వచ్చినప్పుడు ఆయన తప్పక అనుగ్రహిస్తారు. కానీ మనకు శ్రద్ధ, సబూరీ అవసరం.

నేను చాలాసార్లు ఆశను కోల్పోయాను. కానీ నా బెస్ట్ ఫ్రెండ్స్ నన్ను ప్రోత్సహిస్తుండేవారు. వాళ్ళకి నా కృతజ్ఞతలు. ఇప్పుడు నా కుమార్తెకు ఎనిమిది నెలల వయస్సు. నా అనుభూతిని వ్యక్తం చేయడానికి పదాలు లేవు. గర్భం ధరించడంలో సమస్య ఉన్నవారికి నా మాట: “చింతించకండి. బాబా మీకు సరైన సమయంలో సంతానాన్ని అనుగ్రహిస్తారు". జీవన ప్రయాణంలో ప్రశాంతంగా ఉండటం చాలా అవసరం. ప్రశాంతంగా ఉండటాన్ని బాబా నాకు చాలాసార్లు నేర్పించారు. నేను అలా ఉండేందుకు ప్రయత్నిస్తున్నాను. సహనం అంటే చింతిస్తూ ఉండటం కాదు, ప్రశాంతంగా ఉండటం. నేటి ప్రపంచంలో మనం దాన్ని సాధారణంగా కోల్పోతూ ఉంటాము. సహనాన్ని కలిగి ఉండేలా నన్ను, మనందరినీ బాబా ఆశీర్వదించాలని కోరుకుంటున్నాను.

source:http://www.shirdisaibabaexperiences.org/2019/12/shirdi-sai-baba-miracles-part-2575.html

ప్రార్థించినంతనే అమ్మకు స్వస్థత చేకూర్చిన సాయి

పేరు వెల్లడించని ఒక సాయి భక్తురాలు తన అనుభవాన్నిలా పంచుకుంటున్నారు:

ఓం శిరిడీనాథాయ నమః. 

ముందుగా ఈ బ్లాగ్ నడిపిస్తున్నటువంటి సాయిబిడ్డలకు నమస్కరిస్తూ నా మొదటి అనుభవాన్ని సాటి సాయిబిడ్డలతో పంచుకుంటున్నాను.

నాకు అయిదు సంవత్సరాలు వయస్సున్నప్పుడే మా నాన్నగారు మరణించారు. నాన్న లేకపోయినా అన్నీ తానై అమ్మే నన్ను జాగ్రత్తగా చూసుకునేది. నేను ఆరవ తరగతి చదువుతున్నప్పటి నుండి సాయిభక్తురాలిని. తరచూ నా స్నేహితులతో కలిసి 5 కిలోమీటర్ల దూరంలో ఉన్న బాబా గుడికి నడిచి వెళ్ళేదాన్ని. బాబాను చూస్తుంటే ఎంతో సంతోషంగా, ఆనందంగా ఉండేది. కానీ బాబాని నేను ఎప్పుడూ ఏ కోరికలూ కోరేదాన్ని కాదు. కొన్ని సంవత్సరాల తరువాత నేను డిగ్రీ చదువుతుండగా మా అమ్మకి తీవ్రమైన జ్వరం వచ్చింది. తెలిసిన డాక్టరుని తీసుకొచ్చి ఇంట్లోనే ట్రీట్‌మెంట్ చేయించాము. కానీ ప్రయోజనం లేకపోయింది. జ్వరం ఏమాత్రం తగ్గలేదు. రెండు రోజులు అయింది, ఇంకా జ్వరం తగ్గలేదని పక్కవూర్లో వున్న హాస్పిటల్‌కి తీసుకెళ్ళాము. హాస్పిటల్లో రెండు రోజులున్నాము. అయినప్పటికీ అమ్మ పరిస్థితిలో ఏ మార్పూ కనిపించలేదు. ఆ సమయంలో చాలామందికి స్వైన్ ఫ్లూ జ్వరాలు వచ్చాయి. మామూలుగా మా అమ్మకి ఎప్పుడూ జ్వరం రాదు. అలాంటి తను నాలుగు రోజులుగా మంచంమీద నుండి లేవకుండా జ్వరంతో బాధపడుతుండేసరికి నాకు చాలా భయమేసింది. అప్పుడు నాకు ఎంతో ఇష్టమైన సాయిబాబాని తలచుకొని. “బాబా! నువ్వు నాయందు ఉంటే సాయంత్రానికల్లా అమ్మ జ్వరం తగ్గిపోవాలి, తను ఆరోగ్యంగా ఇంటికి వెళ్ళాలి” అని ప్రార్థించాను. వెంటనే బాబా నామీద, మా అమ్మమీద ఎంతో దయ చూపించారు. ఆ సాయంత్రానికల్లా అమ్మ జ్వరం పూర్తిగా తగ్గిపోయింది. ఎంతో సంతోషంతో బాబాకు మనసారా కృతజ్ఞతలు తెలుపుకున్నాను. ఇది నా మొదటి అనుభవం. తండ్రిలేని నేను బాబానే నా తండ్రిగా భావిస్తాను. నా బాధ, సంతోషం అన్నీ బాబాతోనే చెప్పుకుంటాను. ఆ సాయినాథుడు నేను కోరినవన్నీ ఇప్పటివరకు ఇచ్చారు. ఇకపై కూడా ఇస్తారన్న దృఢనమ్మకం బాబాపై నాకున్నది. బాబా అనుగ్రహం అందరికీ ఉండాలని, ఆయన తమ భక్తులు కోరుకొనే కోరికలు నెరవేర్చాలని, అందరూ సంతోషంగా ఉండాలని బాబాను కోరుకుంటున్నాను.

అఖిలాండకోటి బ్రహ్మాండనాయక రాజాధిరాజ యోగిరాజ పరబ్రహ్మ శ్రీ సచ్చిదానంద సద్గురు సాయినాథ్ మహరాజ్ కీ జై!


సాయి మహారాజ్ సన్నిధి సోషల్ మీడియా లింక్స్:

Subscribe Here

బ్లాగ్ అప్డేట్ నోటిఫికేషన్స్ నేరుగా మీ మెయిల్ కే వచ్చేందుకు క్రింద బాక్సులో మీ మెయిల్ ఐడి టైపు చేసి subscribe పై క్లిక్ చేసి, తరువాత స్టెప్స్ పూర్తీ చేయండి.

Delivered by FeedBurner

Followers

Recent Posts


Blog Logo