సాయి వచనం:-

- శ్రీబాబూజీ.

సాయిభక్తుల అనుభవమాలిక 360వ భాగం....


ఈ భాగంలో అనుభవం:
  • శిరిడీ ప్రయాణం - బాబా అనుగ్రహం - రెండవ భాగం 

నా పేరు శ్రావణి. ఇటీవలి మా శిరిడీయాత్రలోని కొన్ని అనుభవాలు నిన్న పంచుకున్నాను. ఇప్పుడు మరికొన్ని అనుభవాలు మీతో పంచుకుంటాను. 

శిరిడీ చేరుకున్న మొదటిరోజు నేను, మా బాబు, నాన్న, నా స్నేహితురాలు కలిసి మొదటిసారి బాబా దర్శనానికి వెళ్ళాము. బాబా చక్కటి దర్శనంతో అనుగ్రహించారు. మేము చాలా సంతోషంగా బయటకి వచ్చాము. మా బాబు అనికేత్ చాలా అల్లరివాడు. వాడు నా చెయ్యి వదిలేసి హనుమాన్ మందిరం దగ్గర ఉన్న ఒక షాపులోకి వెళ్ళిపోయాడు. కాసేపట్లోనే అక్కడినుండి మళ్ళీ ఎటు వెళ్ళాడో తెలియలేదు, ఎక్కడ చూసినా కనిపించలేదు. నేను వాడి గురించి చాలా ఆందోళన చెందుతూ ద్వారకామాయి దగ్గర నిల్చొని, "బాబా, ప్లీజ్! అనికేత్‌ని చూపించండి" అని వేడుకున్నాను. వెంటనే ఎవరో ఒకతను నా చేతిలో పాలకోవా పెట్టి వెళ్లిపోయాడు. ఆ మరుక్షణమే మా బాబు ఒక బొమ్మల దుకాణం నుంచి బయటకి వస్తూ కనిపించాడు. హమ్మయ్య అనుకుంటూ అడిగినంతనే వాడిని చూపించిన బాబాకు కృతజ్ఞతలు చెప్పుకున్నాను. ఇంకోసారి 3వ నెంబర్ గేట్ వద్ద నేను హ్యాండ్‌బ్యాగ్ చెక్ చేయించుకుంటున్నంతలో వాడు క్యూ లైన్ల మధ్యలో ఉండే సందుల గుండా వెళ్ళిపోయాడు. ఆ జనంలో వాడిని ఎలా పట్టుకునేది అని నేను కంగారుపడుతుంటే, బయటకి వెళ్తున్న ఒకతను నన్ను అక్కడే ఉండమని చెప్పి, వాడిని తీసుకొచ్చి నా చేతికి అప్పగించి వెళ్లిపోయాడు. మేము అక్కడినుండి లోపల ఉన్న మ్యూజియం వద్దకు వెళ్లేసరికి నాకు బాబుని అప్పగించిన అదే వ్యక్తి  అక్కడ కూర్చొని నవ్వుతూ కనిపించాడు. 'బయటకు వెళ్తున్న వ్యక్తి మళ్ళీ ఇంతలోనే ఇక్కడెలా ఉన్నాడా?' అని నేను ఆశ్చర్యపోయాను. అతని చిరునవ్వు మాత్రం చాలా ప్రశాంతంగా ఉంది. అతను నాతో, "మీ బాబు చాలా అల్లరివాడు" అని హిందీలో అన్నారు. నేను ‘అవున’ని అన్నాను.

అదేరోజు రాత్రి నేను, నా ఫ్రెండ్ మరలా బాబా దర్శనానికి వెళ్తుండగా క్యూ లైన్ దగ్గర ఒక పాప వచ్చి బాబా ఫోటో నా చేతిలో పెట్టి, "ఆప్కో, లేలో దీదీ (ఇది మీకే, తీసుకో అక్కా)" అంది. నేను వద్దన్నాను. తను వెంటనే "ముప్త్ మే లేలో దీదీ (ఉచితంగానే తీసుకో)" అని చేతిలో పెట్టి వెళ్లిపోయింది. ఆశ్చర్యమేమిటంటే, ఆ పాప ప్రక్కనే ఉన్న నా స్నేహితురాలికి ఇవ్వలేదు, కేవలం నాకు మాత్రమే ఇచ్చింది. ఆ ఫోటోలోని బాబాని చూస్తూ లోపలికి వెళ్ళాను. చాలా త్వరగానే సమాధి మందిరంలోకి ప్రవేశించాము. బాబా నాకు ఎంతో ఇష్టమైన లావెండర్ కలర్ దుస్తుల్లో దర్శనమిచ్చి నాకు చాలా ఆనందాన్ని ప్రసాదించారు. అక్కడినుండి గురుస్థాన్ దగ్గరకి వెళ్తూ, "బాబా నాకెప్పుడూ వేపాకు ఇవ్వరు" అనుకుంటూ ఉన్నాను. అంతలో నా స్నేహితురాలికి ఒక వేపాకు దొరికితే దాన్ని తను నాకిచ్చింది. నేను నా మనసులో, 'ఎప్పుడూ నాకొకరు ఇవ్వటమేగాని నాకుగా దొరకవు' అనుకున్నాను. అంతలో గ్రిల్స్ మధ్యలో ఒక వేపాకు కనిపించింది. అక్కడే ఉన్న ఒక వేపపుల్లతో దాన్ని నెమ్మదిగా బయటకు లాగాను. మొదటిసారి నాకు వేపాకు దొరకడంతో నా ఆనందానికి అవధులు లేవు. తరువాత అక్కడే మందిర ప్రాంగణంలో కూర్చొని బాబాని చూస్తూ మాట్లాడుకుంటూ ఉన్నాము. అంతలో గాలి వీస్తున్నట్లుగా గమనించాను. ఆ సమయంలో గురుస్థాన్ వద్ద ఎవరూ లేరు. వెంటనే పరుగున అక్కడికి వెళ్ళాను. నాపై చాలా ఆకులు రాలిపడ్డాయి. నా హ్యాండ్ బ్యాగు తీసి దొరికిన అన్ని వేపాకులను బ్యాగులో వేసుకోవడం మొదలుపెట్టాను. నేను వేసుకుంటూనే ఉన్నాను, అవి పడుతూనే ఉన్నాయి. చుట్టూ జనం ఉన్నారు, కానీ మేమున్న చోటకి మాత్రం ఎవరూ రావటం లేదు. గతంలో నేను మీతో పంచుకున్న ఒక అనుభవంలో స్వప్నంలో బాబా నా రెండు చేతుల నిండా వేపాకులు ఇచ్చారని చెప్పాను. అక్షరాలా ఆ స్వప్నాన్ని ఇప్పుడు బాబా నిజం చేసి నన్ను అనుగ్రహించారని నాకనిపించి బాబాకు మనసారా కృతజ్ఞతలు తెలుపుకున్నాను. తర్వాత అక్కడినుండి మేము ద్వారకామాయికి వెళ్లి చాలాసేపు కూర్చున్నాం. కొంతసేపటికి నా స్నేహితురాలు ‘నీ జుట్టులో ఒక వేపాకు ఉంది’ అని చెప్పి, తీసి నాకిచ్చింది. అప్పటికి నేను చాలాసార్లు నా టీషర్ట్ కున్న క్యాప్ వేస్తూ తీస్తూ ఉన్నా కూడా అది క్రిందపడకుండా నా తలలోనే ఉండటం ఆశ్చర్యంగా అనిపించింది. ఈ అనుభవం నేను ఎప్పటికీ మర్చిపోలేనిది, నాకు చాలా చాలా ఆనందాన్నిచ్చింది.

చివరిగా మేము తిరుగు ప్రయాణమవ్వాల్సిన రోజు వచ్చింది. ఆరోజు నా ఫ్రెండ్ వేకువనే వెళ్లి బాబా దర్శనం చేసుకుందామంటే తొందరగా లేచి రెడీ అయ్యాము. కానీ నా మనసుకి మా బాబుని కూడా తీసుకెళ్లి ద్వారకామాయిలో బాబా దర్శనం చేయిద్దామని చాలా అనిపించింది. కానీ ‘ఇంత చలిలో వాడు పొద్దున్నే లేవడు’ అనుకుంటూ ఉన్నాను. మరుక్షణమే వాడు నిద్రలేచి చకచకా రెడీ అయిపోయాడు. దర్శనానికి వెళ్తూ దారిలో నా స్నేహితురాలు తన ఆఫీసులోని వాళ్ళు బాబాకి నైవేద్యం తీసుకెళ్లమని చెప్పారని కోవా, బొరుగులు తీసుకుంది. నాకు కూడా తెలిసిన వాళ్ళు కోవా తీసుకోమని చెప్పి ఉండటంతో నేను కూడా ఒక కోవా ప్యాకెట్ తీసుకున్నాను. అప్పుడు నా ఫ్రెండ్, "బాబాకి నువ్వు ఏమీ ఇవ్వవా?" అని అడిగింది. నేను తనతో, "మీరంతా ఇచ్చేవి నేను ఇవ్వను. నేను బాబా కోసం నల్లద్రాక్ష తీసుకెళ్తాను" అని చెప్పి వాటిని తీసుకున్నాను. చలి ఎక్కువగా ఉండటంతో క్యూ లైన్లో ఉన్నపుడు నాకు బాగా దగ్గు వచ్చి వాంతి అయ్యేలా కూడా అనిపించింది. దాంతో ఎవరినీ పట్టించుకోకుండా ఒక దగ్గర కూర్చుండిపోయాను. నా పరిస్థితి అర్థం కాకపోయినా నా స్నేహితురాలు నాకు బాబా ఊదీ ఇచ్చింది. ఊదీ తీసుకోగానే బాబా దయవల్ల నా పరిస్థితి చక్కబడింది, మరలా దగ్గు రాలేదు. ఆదివారం కావడంతో దర్శనానికి మాకు రెండు గంటల సమయం పట్టింది. బాబా దగ్గరకి చేరుకున్నాక అక్కడున్న పూజారికి మేము తీసుకెళ్లిన ప్రసాదాల ప్యాకెట్లను అందించాము. ఆ పూజారి ప్రత్యేకంగా నేను తీసుకెళ్లిన నల్లద్రాక్ష ప్యాకెట్‌ని ఓపెన్ చేసి, కొన్ని తన చేతిలోకి తీసుకొని, కొంతసేపు అలాగే పట్టుకొని తరువాత బాబా పాదాలకి తాకించి నాకు ఇచ్చారు. అంతసేపూ నేను బాబా ప్రక్కనే ఉన్నాను. అంత రద్దీలో నేను తీసుకెళ్లిన నైవేద్యాన్ని స్వీకరించడమే కాకుండా, ఎక్కువ సమయం తమను దర్శించుకొనే అవకాశమిచ్చి బాబా ఎంతగానో నన్ను ఆశీర్వదించారు. 

తరువాత గురుస్థాన్ దగ్గర మా బాబుని ఒకచోట కూర్చోబెట్టి మేమిద్దరం ప్రదక్షిణలు చేశాము. మేము వచ్చేసరికి వాడు, 'ఎవరో ఒకతను వచ్చి తనతో హిందీలో మాట్లాడి, కొన్ని వేపాకులు ఇచ్చి వెళ్లార'ని చెప్పాడు. ప్రదక్షిణలు చేయడంలో నిమగ్నమై నేను అతనిని చూడలేకపోయాను. కొద్దిసేపటి తరువాత గురుస్థాన్‌లో గురు, శుక్రవారాలలో ధుని వెలిగించే చోట తలపై టోపీ పెట్టుకున్న ఒక పెద్దాయనను చూశాను. ఆయన నాకోసమే వేచి చూస్తున్నట్లుగా నా చేతిలో ఊదీ పెట్టేసి వెళ్లిపోయారు. అయితే నేను ఆయన మొహాన్ని సరిగ్గా చూడలేకపోయాను, టోపీ పెట్టుకొని ఉండడం మాత్రం చూశాను. తర్వాత నేను అనుకున్నట్లుగానే మా బాబుని తీసుకొని ద్వారకామాయికి వెళ్లి బాబా దర్శనం చేయించాను. తరువాత మహాలక్ష్మి మందిరంలో ఆరోజు ఆరతికి కూడా హాజరయ్యాము.

మా తిరుగు ప్రయాణానికి నేను బస్సులో అమ్మ, నాన్నకోసం క్రింద రెండు సీట్లు, మాకోసం పైన రెండు సీట్లు బుక్ చేశాను. అయితే నేను బస్సు ఎక్కేసరికి మేము బుక్ చేసుకున్న పైసీట్లలో భార్యభర్తలు పడుకొని ఉన్నారు. వారిలో ఒకరు "మాకు మీ సీట్స్ కావాలి, బదులుగా నేను మీకు మేము బుక్ చేసుకున్న కింద రెండు సీట్లు ఇస్తాను" అని అన్నారు. నేను వెనకా ముందూ ఆలోచించుకోకుండా సరేనని చెప్పాను. అయితే అదంతా బాబా తన బిడ్డల క్షేమం కోసమే చేసిన ఏర్పాటని నాకు తర్వాత అర్థమైంది. కొంతసేపటికి నాకు వాంతులు మొదలయ్యాయి. దాంతో నేను చాలా అవస్థపడ్డాను. బాబా ఊదీ పెట్టుకున్నప్పటికీ సమస్య అలాగే కొనసాగింది. తెల్లవారుఝామున 4 గంటల వరకూ నాకు, అమ్మకి నిద్రలేదు. ఆ సమయంలో ఊదీ రెండవసారి పెట్టుకున్నాక నాకు నిద్ర పట్టింది. బాబా దయవల్ల బస్సు ఎక్కగానే సీట్లు మార్పు జరిగింది కాబట్టి సరిపోయింది, లేకపోతే పైసీటులో ఉండి నేను వాంతులు చేసుకుంటుంటే అందరికీ చాలా సమస్య అయ్యేది. నిజానికి క్రిందనే అమ్మ పక్కన నేను ఉండేలా బాబా చేసిన సహాయం అంతా ఇంతా కాదు, నేను ఎప్పటికి మరువలేనిది.

తరువాత హైదరాబాదులో మేము ఎక్కాల్సిన ట్రైనులో మాకు అన్నీ మిడిల్, అప్పర్ బెర్తులు వచ్చాయి. వయస్సు పైబడిన అమ్మ, నాన్నలు పైబెర్తులు ఎక్కలేరు. పోనీ ట్రైన్ ఎక్కాక ఎవరినైనా రిక్వెస్ట్ చేసి బెర్తులు మార్చుకుందామంటే, క్రింది బెర్త్ వచ్చిన వాళ్ళు కూడా వయసు పైబడిన వాళ్ళైతే సమస్య అవుతుంది. ఆ స్థితిలో నాకేమి చేయాలో తోచక సహాయం చేయమని బాబానే ప్రార్థించాను. తరువాత మాకు తెలిసిన వాళ్ళ మొబైల్ నెంబర్ కనుక్కొని, అతని ద్వారా క్రింది బెర్తుల కోసం ప్రయత్నించాను. బాబా కృపవలన అతను రెండు క్రింది బెర్తులు వచ్చేలా చేశారు. అయితే నాకు, నా స్నేహితురాలికి బెర్తులు వేరేచోట ఉండటంతో అమ్మావాళ్లకు ఏదైనా అవసరమైతే ఎలా అని ఆందోళనపడ్డాను. దాన్ని కూడా బాబా దూరం చేశారు. స్వామిమాలలో ఉన్న ఒకతను మాకు సహాయం చేసి మేమంతా ఒకేచోట ఉండేలా చేశారు. ఇలా ప్రతి విషయంలో బాబా మాకు సహాయం చేస్తూ మమ్మల్ని జాగ్రత్తగా ఇంటికి చేర్చారు. ముందే చెప్పానుగా, ఇంటికి వచ్చాక అమ్మకు ఆపరేషన్ అవసరం లేదని బాబా మాకు ఇచ్చిన గొప్ప ఉపశమనం గురించి(ముందు భాగంలో).

శిరిడీ నుండి వచ్చాక డిసెంబరులో మా బాబు ఒంటిపై ఒక సెగగడ్డ లేచింది. దాని గురించి నాకంతగా అవగాహన లేకపోవడంతో నేను అశ్రద్ధ చేశాను. అయితే రానురానూ వాడు ఆ సెగగడ్డతో ఇబ్బందిపడుతుంటే చూడలేక ఒకరోజు వాడిని తీసుకొని చర్మవ్యాధుల డాక్టర్ దగ్గరకి వెళ్ళాను. కానీ ఆరోజు డాక్టర్ హాస్పిటల్లో లేరు. దాంతో అదేరోజు సాయంత్రం బాబుని హోమియో డాక్టరు వద్దకు తీసుకొని వెళ్లగా, అతను కొన్ని మందులు ఇచ్చారు. అయితే రాత్రికి ఆ సెగగడ్డ బాగా పెద్దగా అయిపోయింది. దాంతో బాబు కూర్చోడానికి చాలా ఇబ్బందిపడ్డాడు. అన్నం కూడా పడుకొనే తిన్నాడు. రాత్రి 9.30 సమయంలో వాడు బాధను తట్టుకోలేక పెద్దగా ఏడవటం మొదలుపెట్టాడు. వాడిని చూస్తుంటే మాకు చాలా బాధేసింది. వాడు ఏడుస్తూనే బాబా ఊదీ ఇవ్వమని అడిగాడు. నేను ఊదీ ఇస్తే, వాడు కొంచెం నోట్లో వేసుకొని శిరిడీలో తీసుకున్న బాబా క్యాలెండరుని చూస్తూ “బాబా.. బాబా” అంటూ ఏడుస్తూనే ఉన్నాడు. హోమియో డాక్టర్, మా ఇంటికి దగ్గర్లో ఉన్నవాళ్ళు కూడా “గడ్డ చాలా పెద్దదై గట్టిగా ఉంది, అందువల్ల ఇంకో రెండు రోజులైనా అది పగలదు” అని మమ్మల్ని ఇంకా భయపెట్టారు. నేను బాబా ఊదీని నీళ్ళలో కలిపి వాడికిచ్చి, “బాబా! దయచేసి ఈరోజే వాడికి తగ్గేలా చెయ్యండి” అని ప్రార్థించాను. వాడు 'బాబా.. బాబా' అంటూ ఏడ్చి ఏడ్చి నిద్రలోకి జారుకున్నాడు. రాత్రి 12.30 సమయంలో మా అమ్మ బాబుని చూడడానికని వచ్చి, సెగగడ్డ పగిలి ఉండటం చూసి నన్ను నిద్ర లేపింది. ఆలోగా వాడు కూడా లేచి నొప్పి వలన 2.30 వరకు బాధపడుతూ ఉన్నాడు. అప్పుడు కాస్త నొప్పి ఉపశమనం కావడంతో వాడు హాయిగా నిద్రపోయాడు. మరుసటిరోజుకి బాబా దయవల్ల సెగగడ్డ పూర్తిగా తగ్గిపోయి బాబు మునుపటిలా హుషారైపోయాడు.

తరువాత ఒకరోజు మా బాబు నాతో మాట్లాడుతూ హఠాత్తుగా చెంపలు వేసుకున్నాడు. “ఎందుకురా అలా చెంపలు వేసుకున్నావు?” అని నేనడిగితే వాడు, “'బాబా అబద్దం చెప్పకూడద'ని నాతో చెప్పారు" అని అన్నాడు. “ఎప్పుడు చెప్పారు” అని అడిగితే, "నవంబర్ 27వ తేదీన" అని స్పష్టంగా చెప్పాడు. ఆ విషయం గురించి రెండు మూడుసార్లు అడిగినప్పటికీ కూడా వాడు ఖచ్చితంగా అదే తేదీ చెప్పాడు. నిజానికి ఆరోజే మా శిరిడీ ప్రయాణం మొదలైంది. చిన్నవయస్సులోనే వాడికి బాబాపై ఉన్న ప్రేమని చూస్తుంటే మాకు చాలా ముచ్చటగా అనిపిస్తుంది. "బాబా! మీరు మా కుటుంబంపై చూపుతున్న అనుగ్రహానికి చాలా చాలా ధన్యవాదాలు. ఎప్పుడూ మమ్మల్ని ఇలాగే ఆశీర్వదించండి".


(మా బాబుకి బాబాతో చాలా అనుబంధం ఉంది. ఆ అనుభవాలు ఇదివరకు మీతో ఈ బ్లాగు ద్వారా పంచుకున్నాను. ఎవరైనా అవి చదవాలనుకుంటే, ఇక్కడ ఇస్తున్న లింకుపై క్లిక్ చేసి చదవవచ్చు  - https://saimaharajsannidhi.blogspot.com/2019/08/129.html)



No comments:

Post a Comment

సాయి మహారాజ్ సన్నిధి సోషల్ మీడియా లింక్స్:

Subscribe Here

బ్లాగ్ అప్డేట్ నోటిఫికేషన్స్ నేరుగా మీ మెయిల్ కే వచ్చేందుకు క్రింద బాక్సులో మీ మెయిల్ ఐడి టైపు చేసి subscribe పై క్లిక్ చేసి, తరువాత స్టెప్స్ పూర్తీ చేయండి.

Delivered by FeedBurner

Followers

Recent Posts


Blog Logo