సాయి వచనం:-

- శ్రీబాబూజీ.

సాయిభక్తుల అనుభవమాలిక - 341వ భాగం....


ఈ భాగంలో అనుభవాలు:
  1. సాయిబాబా ఇచ్చిన పుట్టినరోజు బహుమతి
  2. మ్రొక్కినంతనే అనుగ్రహించిన సాయి

సాయిబాబా ఇచ్చిన పుట్టినరోజు బహుమతి

ఒక అజ్ఞాత సాయిభక్తురాలు తన అనుభవాన్ని ఇలా పంచుకుంటున్నారు:

నేను నా కుటుంబంతో ఢిల్లీలో నివాసముంటున్నాను. నేను సాయిబాబాకు చిన్న భక్తురాలిని. బాబా నా జీవితాన్ని నడిపిస్తున్న కాంతికిరణం. నేను ఆయనకు చాలా ఋణపడి ఉన్నాను. ఆయన ఉనికి వలన నేను నా జీవితంలో లెక్కించలేని చాలా అద్భుతాలను చూశాను. చిన్నదైనా సరే ఆయనను సేవించగలగడం ద్వారా నేను ధన్యురాలిని అవుతున్నాను. ఆయన గత ఏడాది అద్భుతరీతిన మమ్మల్ని శిరిడీకి రప్పించుకున్నారు. ఆ అనుభవాన్ని నేనిప్పుడు మీతో పంచుకుంటాను.

నేను మొదటిసారి 2015లో శిరిడీ సందర్శించాను. అప్పటినుండి మళ్ళీ ఎప్పుడు ఆయనను దర్శిస్తానా అని నా హృదయం తహతహలాడుతుండేది. రెండు సంవత్సరాలపాటు నేను ఎంతగానో ప్రయత్నించాను కానీ, ఏదో ఒక కారణం వల్ల అది సాధ్యపడలేదు. అంతలో 2018 వచ్చింది. జనవరిలో నా భర్త పని మీద విదేశాలకు వెళ్ళవలసి వచ్చింది. నేను ఒంటరిగా మా రెండేళ్ల పాపను, అనారోగ్యంతో బాధపడుతున్న నా తల్లిదండ్రులను, అత్తమామలను, ఇంకా కుటుంబ బాధ్యతలను చూసుకుంటూ, ఉద్యోగ విధులను నిర్వహిస్తూ చాలా కఠినమైన సమయాన్ని గడిపాను. సెప్టెంబరు నెలలో నా భర్త 15 రోజుల సెలవుపై మా వద్దకు వచ్చారు. ఆ సమయంలోనే నేను శిరిడీ వెళ్లి బాబా దర్శనం చేసుకోవాలని అనుకున్నాను.

ఢిల్లీ నుండి ముంబాయి వెళ్లి, అక్కడున్న మా బంధువులతో ఒకరోజు గడిపి అక్కడినుండి శిరిడీ వెళ్లాలని ప్రణాళిక వేసుకున్నాము. సరిగ్గా మేము బయలుదేరాల్సిన రోజు మా పాప తీవ్రమైన జ్వరంతో అనారోగ్యానికి గురైంది. మేము తనని ఆసుపత్రికి తీసుకుని వెళ్తే, డాక్టర్ తనని 3 గంటలు పరిశీలనలో ఉంచి, ఈ స్థితిలో ప్రయాణం చేయవద్దని చెప్పారు. కానీ మేము ఎలాగైనా బాబా దర్శనం చేసుకోవాలని నిశ్చయించుకున్నాము. బాబా ఖచ్చితంగా మమ్మల్ని పిలుస్తున్నారని నా మనసుకు అనిపించింది. బాబాని తలచుకుని పాప నుదుటిపై ఊదీ పెట్టి మేము సాయంత్రం రైలెక్కాము. కానీ ప్రయాణంలో పాపకు అసౌకర్యంగా ఉంటుందేమోనని మేము చాలా భయపడ్డాము. మేము భయపడినట్లే రైలు ఎక్కిన తర్వాత 30 నిమిషాల వరకు తను ఏడుస్తూనే ఉంది. తరువాత బాబా దయవలన ఆశ్చర్యకరంగా ఏడుపు ఆపి ప్రశాంతంగా నిద్రపోయింది. మరుసటిరోజు ఉదయం ముంబాయి చేరుకున్న తరువాతే తను నిద్రలేచింది.

మరుసటిరోజు మేము ముంబాయి నుండి శిరిడీ వెళ్ళవలసి ఉండగా హఠాత్తుగా ముంబాయిలో బంద్ ప్రకటించారు. అయినా మేము బాబాను తలచుకుని కారులో మా ప్రయాణాన్ని మొదలుపెట్టాము. 10 నిమిషాల తరువాత మా కారు ప్రమాదానికి గురైంది. ఆ సమయంలో ట్రాఫిక్ లేనందువల్ల ఎవరికీ ఎటువంటి గాయాలు కానప్పటికీ బంద్ కారణంగా కారు మరమ్మత్తు చేయించడానికి మెకానిక్‌ దొరకలేదు. నేను ప్రయాణంలో ఆలస్యం అవుతుందని, ప్రయాణం మొదలైనప్పటినుండి ఎదురవుతున్న ప్రతికూల సంకేతాల గురించి ఆలోచిస్తూ భయపడ్డాను. కొంత సమయం తరువాత కారు మెకానిక్ దొరకడంతో కారు మరమ్మత్తు చేయించుకుని బయలుదేరాము. ఎలాగైనా అదేరోజు శిరిడీ చేరుకోవాలని అనుకున్నాము. కానీ ప్రమాదం కారణంగా మొత్తం యాత్ర ఒకరోజు ఆలస్యం అయింది. బాగా ఆలస్యం కావడంతో ఆ రాత్రి మేము నాసిక్‌లో ఆగిపోయాము. దురదృష్టవశాత్తూ, ఆ రాత్రి నా భర్తకు అర్థరాత్రివేళ కండరాల నొప్పులు వచ్చాయి. ఆయన తీవ్రమైన నొప్పితో అస్సలు కదలలేక చాలా బాధపడ్డారు. ఏదోలా ఆ రాత్రి మేము హోటల్‌లో గడిపాము.

మరుసటిరోజు ఉదయం మావారు ఆ స్థితిలో శిరిడీ వెళ్ళలేనని తిరిగి ముంబాయి వెళ్లిపోవడానికి డ్రైవర్ కోసం వెతుకుతున్నారు. బహుశా ఇప్పుడు మేము శిరిడీ రావడం బాబాకు ఇష్టం లేదని అనుకుంటూ నేను చాలా నిరుత్సాహపడ్డాను. అదృష్టవశాత్తూ, హోటల్ సిబ్బంది నా భర్తను సమీపంలోని డాక్టర్ వద్దకు తీసుకెళ్లారు. డాక్టర్ కొన్ని ఇంజెక్షన్లు మా వారికి ఇచ్చారు. నేను కూడా బాబా ఊదీ తన వీపు మీద రాసి, బాధనుండి ఉపశమనం కలిగించమని బాబాను ప్రార్థించాను. మధ్యాహ్నానికల్లా మావారికి ఉపశమనం లభించి, "శిరిడీ వెళ్దాం, నేను డ్రైవ్ చేస్తాన"ని అన్నారు. నెమ్మదిగా డ్రైవ్ చేస్తూ మొత్తానికి ఆనందంగా బాబా సన్నిధికి చేరుకున్నాము. మేము శిరిడీ చేరుకున్న వెంటనే హోటల్‌కి వెళ్ళాము. హోటల్ వెలుపల నిలబడివున్న ఒక వ్యక్తి నాకు ఒక ఎర్రగులాబీ ఇచ్చి 'స్వాగతం' అన్నాడు. అది చూసి నా భర్త, "బాబా నీకు పుట్టినరోజు కానుక ఇస్తున్నారు" అన్నారు. ప్రయాణంలో ఏర్పడిన సమస్యలు, ఆలస్యం అన్నీ మేము సెప్టెంబరు 11న శిరిడీ చేరుకునేలా చేశాయి. అంటే, నా పుట్టినరోజునాడు నేను శిరిడీలో ఉండేలా బాబా చేశారు. కృతజ్ఞతాభావంతో కన్నీళ్ళు నా కళ్ళనుండి ప్రవహించటం ప్రారంభించాయి. నేను చాలా చాలా ఆనందించాను. బాబా మార్గాలు మనం అర్థం చేసుకోలేము. ఆయన మా యాత్ర అంతటా మమ్మల్ని పరీక్షించారు, కానీ అది ఒక అందమైన అనుభవంగా మలిచారు. మాకు బాబా చక్కటి దర్శనాలు ఇచ్చారు. మొదటిసారి మా పాప బాబాను చూసి చాలా చాలా సంతోషించింది. "ధన్యవాదాలు బాబా!" తరువాత మళ్ళీ మా తల్లిదండ్రులతో తమ దర్శనానికి బాబా మమ్మల్ని శిరిడీ పిలిచారు.

భక్తిని కలిగి ఉండండి, మిగిలిన వాటిని బాబాకు వదిలివేయండి. బాబాపై నమ్మకమంటే ఆయన సమయాలను కూడా నమ్మడం. మనకు ఏది ఉత్తమమో ఆయనకు తెలుసు, తగిన సమయంలో వాటిని ఆయన మనకు ఇస్తారు. "బాబా! దయచేసి మీ భక్తులందరూ ధర్మమార్గాన్ని అనుసరించేలా ఆశీర్వదించండి. శతకోటి ప్రణామాలు దేవా!".

source: http://www.shirdisaibabaexperiences.org/2019/12/shirdi-sai-baba-miracles-part-2571.html

మ్రొక్కినంతనే అనుగ్రహించిన సాయి

ఓం శ్రీసాయిబాబా! నా పేరు వెంకటేశ్వర్రావు. నేను హైదరాబాద్ నివాసిని. 1980 నుండి నేను సాయిబాబాను పూజిస్తున్నాను. నేను ఈ బ్లాగులోని భక్తుల అనుభవాలు చదువుతూ బాబా ప్రేమను అనుభూతి చెందుతున్నాను. సాయికి మ్రొక్కుకున్నట్లుగా నేనిప్పుడు నా అనుభవాన్ని మీతో ఈ బ్లాగు ద్వారా పంచుకుంటాను.

రెండు నెలలుగా నా ఆరోగ్యం బాగాలేదు. మందులు వాడుతున్నా నయం కాలేదు. అందువలన నేను ఎంతగానో బాధపడుతూ ఉండేవాడిని. ఒకరోజు పూజ చేస్తూ, "నా బాధ తగ్గించండి బాబా, నా అనుభవాన్ని బ్లాగులో పంచుకుంటాను" అని సాయిని వేడుకున్నాను. శ్రీసాయి నా మొర ఆలకించారు. మరునాటికే నా బాధను తొలగించారు. "శ్రీసాయినాథా! చాలా చాలా కృతజ్ఞతలు తండ్రీ!" అడిగినంతనే అనుగ్రహించే శ్రీసాయి ఎల్లప్పుడూ మనతోనే ఉంటూ మనల్ని చల్లగా చూసుకుంటారు. వారి ఆశీస్సులు అందరికీ ఉండాలని మనస్పూర్తిగా కోరుకుంటున్నాను. నేను మొదటిసారి నా అనుభవాన్ని వ్రాస్తున్నాను. తప్పులుంటే సాయిబంధువులు క్షమించగలరు. 


4 comments:

సాయి మహారాజ్ సన్నిధి సోషల్ మీడియా లింక్స్:

Subscribe Here

బ్లాగ్ అప్డేట్ నోటిఫికేషన్స్ నేరుగా మీ మెయిల్ కే వచ్చేందుకు క్రింద బాక్సులో మీ మెయిల్ ఐడి టైపు చేసి subscribe పై క్లిక్ చేసి, తరువాత స్టెప్స్ పూర్తీ చేయండి.

Delivered by FeedBurner

Followers

Recent Posts


Blog Logo