సాయి వచనం:-

- శ్రీబాబూజీ.

సాయిభక్తుల అనుభవమాలిక - 338వ భాగం....


ఈ భాగంలో అనుభవాలు:
  1. కోల్పోయిన డబ్బు బాబా ఆశీస్సులతో తిరిగి లభించింది
  2. బాబా దయతో నెరవేరిన సంకల్పం

కోల్పోయిన డబ్బు బాబా ఆశీస్సులతో తిరిగి లభించింది

సాయిభక్తురాలు నిక్ తన అనుభవాన్ని ఇలా పంచుకుంటున్నారు:

మే నెలలో ఒకరోజు నేను ఇన్‌స్టాగ్రామ్‌లో, 'కేవలం 0.01 డాలర్‌ కే మొబైల్ స్కానర్' (అదీ HP బ్రాండ్‌కి చెందినది. ఆ వెబ్‌సైట్‌ని కూడా చూపిస్తోంది.) అనే ఒక ప్రకటనను చూశాను. మంచి ఆఫర్ అని కొనుగోలు చేయడానికి ప్రయత్నించాను. నేను కార్డు వివరాలను నమోదు చేసిన వెంటనే ఆలస్యం లేకుండా ఓటీపీ వంటి సెక్యూరిటీకి సంబంధించినవేవీ అడగకుండా మనీ ట్రాన్స్‌ఫర్ అయిపోయింది. అప్పుడుగానీ అది మోసమని గ్రహించలేకపోయాను. సుమారు రూ. 25,000 ($ 360) అకౌంట్ నుండి తీసివేయబడ్డాయి. 'ఎంత పెద్ద పొరపాటు చేశాన'ని చాలా చాలా బాధపడ్డాను. ఏమి చేయాలో నాకు తెలియలేదు. బాబా ముందు కూర్చుని నాకు సహాయం చేయమని కన్నీళ్ళతో వేడుకున్నాను. తరువాత బ్యాంకుకి ఫోన్ చేసి జరిగిన విషయాన్ని చెప్పాను. వాళ్ళు అది అనుమానాస్పద లావాదేవీ అని, కార్డును బ్లాక్ చేస్తున్నామని చెప్పారు. ఆ డబ్బు నాది కూడా కాదు, మా అమ్మది. అందువలన నేను ఎంతో బాధపడుతూ ఉండిపోయాను. నా బాధను చూసి అమ్మ నన్ను తిట్టలేదుగానీ, తప్పులనుండి గుణపాఠం నేర్చుకోవాలని చెప్పింది.

కానీ, రోజులు, వారాలు గడుస్తున్నా నేను దానిగురించే ఆలోచిస్తూ ఉండేదాన్ని. తింటున్నా, పడుకున్నా, నడుస్తున్నా, ఏమి చేస్తున్నా నాకు చాలా బాధగా ఉండేది. నేను మనస్ఫూర్తిగా నవ్వలేకపోయేదాన్ని. నిరంతరం బాబాను ప్రార్థిస్తూ ఉండేదాన్ని. ఇన్‌స్టాగ్రామ్ కమ్యూనిటీలోని సాయిభక్తులను కూడా నా గురించి ప్రార్థించమని కోరాను. నా కోసం ప్రార్థించిన వారందరికీ నా ధన్యవాదాలు. సాయిసచ్చరిత్రలో, గోవాకు చెందిన ఒక వ్యక్తి తాను కోల్పోయిన 30,000 రూపాయలను బాబా ఆశీస్సులతో 15 రోజులలో తిరిగి పొందిన లీల నిరంతరం నా మదిలో మెదులుతుండేది. నేను దానిని బాబా సూచనగా భావించి, డబ్బులు తిరిగి వచ్చేవరకు నాకు ఇష్టమైన తీపి పదార్థాలను తిననని బాబాకు ప్రతిజ్ఞ చేశాను. కొన్నిరోజుల తరువాత అనుకోకుండా అమ్మ నాకు చక్కెరతో ఇడ్లీ ఇచ్చింది. నేను నా ప్రతిజ్ఞ గురించి పూర్తిగా మర్చిపోయి అవి తినేశాను. తిన్న తరువాత నేను నా ప్రతిజ్ఞను జ్ఞాపకం చేసుకుని అమ్మతో చెప్పాను. ఇదంతా బాబా ఫోటో ముందు జరిగింది. బాబా సమక్షంలో నేను నా ప్రతిజ్ఞ నిలుపుకోలేకపోయినందుకు చాలా సిగ్గుపడ్డాను. ప్రతిదీ ఆయన ఇష్టానుసారం జరుగవచ్చు, కానీ నేను చాలా గందరగోళానికి గురయ్యాను. నేను బాబాకి చాలాసార్లు క్షమాపణలు చెప్పుకున్నాను.

మూడు నెలలు గడిచిపోయాయి. ఆ సంఘటన నాకు గుర్తుకొచ్చినప్పుడల్లా బాధాకరంగా అనిపించి సాయిని తలుచుకుంటూ ఉండేదాన్ని. ఒకరోజు నేను, అమ్మ కలిసి బయటకు వెళ్ళినప్పుడు, మాటల్లో హఠాత్తుగా అమ్మ అసలు విషయాన్ని నాతో చెప్పింది. ఆ సంఘటన జరిగిన నెలలోపే (అంటే జూన్‌ నెలలో) పోయిన డబ్బు బ్యాంకు ఖాతాలో తిరిగి జమ అయ్యిందని. ఆ మాటలు వింటూనే నేను చాలా ఉపశమనం పొందాను. సాయిని తలచుకుని మనసారా కృతజ్ఞతలు చెప్పుకున్నాను. నా కళ్ళనుండి కన్నీళ్ళు పొంగుకొస్తుంటే, అమ్మ నన్నే చూస్తోందని వాటిని నియత్రించుకుంటూ, ఇదంతా సాయి కృపే అని, జరిగిందంతా గుర్తుచేసుకుని అమ్మతో పంచుకున్నాను.

ఇంతకన్నా అద్భుతమైన లీల ఏముంటుందో నాకు తెలియదు. బాబా ఎల్లప్పుడూ మాతో ఉన్నారు. ఇప్పుడు ఇదంతా వ్రాస్తూ కృతజ్ఞతాభావంతో నేను కన్నీరుమున్నీరవుతున్నాను. ఈ అద్భుతమైన అనుభవాన్ని మీ అందరితో పంచుకునే అవకాశాన్ని బాబా నాకిచ్చారు. బాబాను ఎల్లప్పుడూ మీకు మీ కుటుంబానికి సంరక్షకుడిగా ఉండనివ్వండి. ఆయన ఖచ్చితంగా మనకి రక్షణనిస్తారనడంలో ఎటువంటి సందేహాలూ లేవు. పూర్తిగా ఆయనకు శరణాగతి చెంది, విశ్వాసంతో, సహనంతో ఉండండి. బాబాకు ఉత్తమమైనదేదో తెలుసు, అదే మనకు ఇ(చ్ఛే)స్తారు. "సాయీ! దయచేసి మాకు మార్గదర్శిగా ఉండండి, సదా మమ్మల్ని రక్షించండి. ఎల్లప్పుడూ మీ సేవ చేసేలా మమ్ము అనుగ్రహించండి. ధన్యవాదాలు సాయీ!"

source: http://www.shirdisaibabaexperiences.org/2019/12/shirdi-sai-baba-miracles-part-2572.html

బాబా దయతో నెరవేరిన సంకల్పం

నెల్లూరు నుండి సాయిభక్తుడు వాసు తన అనుభవాన్ని మనతో పంచుకుంటున్నారు.

ఓం సాయిరామ్! నా పేరు వాసు మోదడుగు. నేను నెల్లూరు నివాసిని. బాబానే మాకు తల్లి, తండ్రి, దైవం, గురువు. మేము మా పెద్దబాబుకు వివాహం చేయదలచి, బాబా దయతో వివాహం సజావుగా జరగాలని మా స్వగృహంలో సామూహిక సాయిసచ్చరిత్ర పారాయణ చేసుకోవాలని సంకల్పించాము. ఆ సంకల్పానికి మా అబ్బాయి వివాహంతో పాటు మరో కారణం కూడా ఉంది. అదేమిటంటే, బాబా దయతో మేము, మా అబ్బాయి హనీష్ కుమార్ లోన్ మీద ఒక ఇల్లు తీసుకున్నాము. గృహప్రవేశం 2019, ఏప్రిల్ 26వ తేదీన జరిగింది. ఆ సమయంలో కూడా మేము సామూహిక సచ్చరిత్ర పారాయణ చేసుకోవాలని అనుకున్నాము. నేను ప్రతిరోజూ మన ఈ బ్లాగులోని బాబా లీలలను చదువుతుంటాను. ఆ ప్రేరణతోనే నాకు ఈ సంకల్పం కలిగింది. అయితే అందుకు బాబా అనుగ్రహం లేకపోవడమో ఏమోగానీ రకరకాల పరిస్థితుల కారణంగా పారాయణ జరగలేదు. మా సంకల్పం నెరవేరడానికి మేము చాలాకాలం ఎదురు చూడాల్సి వచ్చింది. చివరికి ఈ ఏడాది బాబా అనుగ్రహించారు. 2020, ఫిబ్రవరి 23, ఆదివారంనాడు అందరికీ మంచి జరగాలని బాబాను వేడుకుని తోటి సాయిభక్తుల సహకారంతో ఎంతో వైభవంగా సామూహిక సాయిసచ్చరిత్ర పారాయణ చేసుకున్నాము. అంతా బాబా దయ. "బాబా! మీ ఆశీస్సులతో మా పెద్దబాబు వివాహం త్వరలోనే వైభవంగా జరిగేలా అనుగ్రహించండి".


4 comments:

సాయి మహారాజ్ సన్నిధి సోషల్ మీడియా లింక్స్:

Subscribe Here

బ్లాగ్ అప్డేట్ నోటిఫికేషన్స్ నేరుగా మీ మెయిల్ కే వచ్చేందుకు క్రింద బాక్సులో మీ మెయిల్ ఐడి టైపు చేసి subscribe పై క్లిక్ చేసి, తరువాత స్టెప్స్ పూర్తీ చేయండి.

Delivered by FeedBurner

Followers

Recent Posts


Blog Logo