సాయి వచనం:-

- శ్రీబాబూజీ.

సాయి అనుగ్రహసుమాలు - 322వ భాగం.


ఖపర్డే డైరీ - ఎనిమిదవ  భాగం

10-12-1911.

ఉదయం నా ప్రార్థన అయిపోకముందే బొంబాయి సొలిసిటర్ దత్తాత్రేయ చిట్నిస్ వచ్చాడు. నేను కాలేజీలో చదివేటప్పుడు అతను క్రొత్తగా కాలేజీలో చేరాడు. అతను నా చిరకాల మిత్రుడు. కాబట్టి సహజంగానే అతను పాతరోజుల గురించే మాట్లాడాడు. యథాప్రకారం నేను సాయి మహారాజుని వారు బయటకు వెళ్ళే సమయంలోనూ, తరువాత మళ్ళీ వారు తిరిగి వచ్చి యథాస్థానంలో కూర్చున్న సమయంలోనూ దర్శించాను. ఆరతి అయ్యాక అందరం తిరిగి వచ్చాం. ఉదయం ఫలహారం కొంచెం ఆలస్యమైంది. 

నేను ఆ తరువాత ఉపాసనీతోనూ, నానాసాహెబ్ చందోర్కర్‌తోనూ మాట్లాడుతూ కూర్చున్నాను. అతను చాలా ముఖ్యుడు. మరోలా చెప్పాలంటే సాయి మహారాజుకి పాత భక్తుడు. అతను చాలా సరదా మనిషి. తనకు సాయి మహారాజుతో అనుబంధం ఎలా ఏర్పడిందో, తను ఎలా పురోగతి సాధించాడో ఆ చరిత్రంతా నాకు వివరించి చెప్పాడు. అతను తనకి విధించబడిన నిబంధనలు చెప్పాలనుకున్నాడు కానీ చాలామంది ఉండటంతో వారిని దృష్టిలో పెట్టుకుని ఆ విషయాలు చెప్పలేకపోయాడు. మధ్యాహ్నం సాయి మహారాజుని దర్శించుకునేందుకు నేను రెండు ప్రయత్నాలు చేశాను. కానీ ఎవర్ని చూసేందుకూ వారు ఇష్టపడలేదు. సాయంత్రం చావడి దగ్గర వారిని చూశాను. సాఠేతోనూ, చిట్నిస్‌తోనూ ఇంకా వేరే వాళ్ళతో చాలాసేపు మాట్లాడాను. నర్సోబావాడీ నుంచి గోఖలే అనే ఒకాయన వచ్చి ఉన్నాడు. ఆయన ఖేడ్‌గాఁవ్ నారాయణ మహారాజునూ, సాయి మహారాజునూ చూడటానికి తాను వచ్చానని చెప్పాడు. అతను చాలా బాగా పాడతాడు. రాత్రి నేను అతని చేత కొన్ని భజనలు పాడించుకున్నాను. నానాసాహెబ్ చందోర్కర్ ఈరోజు ఠాణాకి వెళ్ళిపోయాడు. బాలాసాహెబ్ భాటేకి కొద్దిరోజుల క్రితం పుట్టిన కొడుకు ఈరోజు సాయంత్రం చనిపోయాడు. అది చాలా విషాదం. ఈ మధ్యాహ్నం సాయి మహారాజు తయారుచేసిన మందును అతను తీసుకున్నాడు.

11-12-1911.

ప్రొద్దుటి ప్రార్థన చాలా ఆహ్లాదంగా ఉండటంతో ఆ తరువాత నేను చాలా ఉత్తమస్థితిలోకి వెళ్ళినట్లు భావించాను. తరువాత పంచదశిలోని కొన్ని శ్లోకాలు దత్తాత్రేయ చిట్నిస్‌కి వివరిస్తూ కూర్చున్నాను. సాయి మహారాజు బయటకి వెళుతున్నప్పుడు, తిరిగి వస్తున్నప్పుడు వారి దర్శనం చేసుకొన్నాం. నాకు వారు చాలాసార్లు చిలుమునూ, రాధాకృష్ణమాయి పంపిన ద్రాక్షపళ్ళనూ ప్రసాదించారు. మా అబ్బాయి బల్వంత్‌కు ద్రాక్షపళ్ళు రెండుసార్లిచ్చారు. మధ్యాహ్నం ఆయన మశీదును శుభ్రం చేస్తున్నట్లు విన్నాను. కనుక అటువైపు పోయే ప్రయత్నం చేయలేదు. ప్రజలంతా సాయిబాబా వద్దకు వచ్చి ప్లేగును నిర్మూలన చేయమని వినుతి చేశారు. రోడ్లు బాగుచేయమనీ, సమాధులను, శ్మశానాలనీ పరిశుభ్రం చేయమనీ, పేదలకు అన్నదానం చేయమని సాయి వారితో చెప్పారు. మధ్యాహ్నమంతా నేను దినపత్రికలు చదువుతూ, చిట్నిస్‌తోనూ, ఇతరులతోనూ మాట్లాడుతూ కూర్చున్నాను. ఉపాననీ ఏదో వ్రాస్తున్నాడు. సాయంత్రం సాయి మహారాజుని చావడి వద్ద చూసి, శేజారతికి హాజరయ్యాను. అది అయ్యాక చిట్నిస్, అతని ఇంజనీరు మిత్రుడు, మరో మిత్రుడు వెళ్ళిపోయారు.

12-12-1911.

కాకడ ఆరతి ప్రారంభం అవుతోందేమోనని నేనూ, భీష్మ చాలా త్వరగా లేచాం. కానీ మేము ఒక గంట ముందుగా ఉన్నాం. మేఘుడు వచ్చాక మేమంతా ఆరతికి హాజరయ్యాం. తరువాత నేను ప్రార్థన చేసుకొని సాయి మహారాజు బయటకి వెళతారేమోనని ఎదురుచూస్తూ కూర్చున్నాను. వారు వెళ్ళేటప్పుడు, మళ్ళీ వారు తిరిగి వచ్చేటప్పుడు కూడా వారిని చూశాను. విరామ సమయమంతా గోఖలే పాటలు వింటూ గడిపేశాను. అతను బాగా పాడాడు. మేఘుడికి బిల్వపత్రాలు దొరక్కపోవటంవల్లా, అతను వాటికోసం చాలా దూరం వెళ్ళవలసి రావటం వల్లా ఈరోజు ఉదయ ఫలహారం ఆలస్యమైంది. కనుక మధ్యాహ్నపూజ మధ్యాహ్నం 1.30 వరకూ పూర్తి కాలేదు. సాయి మహారాజు చాలా ఉత్సాహంగా ఉన్నారు. హాయిగా నవ్వుతూ మాట్లాడుతూ కూర్చున్నారు. ఉదయ ఫలహారానంతరం నేను కాసేపు విశ్రమించిన తరువాత మావాళ్ళతో కలిసి మశీదుకి వెళ్ళాను. 

సాయి మహారాజు సరదాగా ఉన్నారు. ఓ కథ చెప్పారు. అక్కడ పడివున్న ఒక పండుని చేతిలోకి తీసుకొని నా వైపు చూస్తూ, "ఇది ఎన్ని పళ్ళను ఉత్పత్తి చేయగలదు?" అని ప్రశ్నించారు. దానిలో ఎన్ని గింజలు ఉన్నాయో అన్ని వేలరెట్లని ఉత్పత్తి చేయగలదని చెప్పాను. ఆయన చాలా ఆహ్లాదంగా నవ్వుతూ, "దాని స్వంత సూత్రాలకు అది కట్టుబడి ఉంటుంద"న్నారు. అక్కడ ఒకమ్మాయి ఎంత మంచిగా ఉండేదో, పవిత్రంగా ఉంటూ, తనకెలా సేవచేసిందో, తరువాత ఎలా ఐశ్వర్యవంతురాలైందో చెప్పారు. 

సూర్యాస్తమయ వేళకి మాకు ఊదీ దొరికింది. సాయి మహారాజు సాయంత్ర వ్యాహ్యాళికి బయటకి వచ్చినప్పుడు వారిని దర్శించుకోవచ్చని చావడికి ఎదురుగా నుంచున్నాం. మేం వారిని చూసి, తిరిగి వచ్చాక భీష్మ, గోఖలే, భాయీలతో పాటు దీక్షిత్ అనే ఒక యువకుడు పాడిన భజనలు వింటూ కూర్చున్నాం. మాధవరావు దేశ్‌పాండే, ఉపాసనీ మాతో ఉన్నారు. సాయంత్రం హాయిగా గడిచిపోయింది.

తరువాయి భాగం రేపు ......

source:  "దేవుడున్నాడు లేడంటావేం!" బై విమలాశర్మ.

2 comments:

సాయి మహారాజ్ సన్నిధి సోషల్ మీడియా లింక్స్:

Subscribe Here

బ్లాగ్ అప్డేట్ నోటిఫికేషన్స్ నేరుగా మీ మెయిల్ కే వచ్చేందుకు క్రింద బాక్సులో మీ మెయిల్ ఐడి టైపు చేసి subscribe పై క్లిక్ చేసి, తరువాత స్టెప్స్ పూర్తీ చేయండి.

Delivered by FeedBurner

Followers

Recent Posts


Blog Logo