సాయి వచనం:-

- శ్రీబాబూజీ.

సాయి అనుగ్రహసుమాలు - 321భాగం


ఖపర్డే డైరీ -  ఏడవ భాగం

8-12-1911. 

నిన్నా మొన్నా నేనో విషయం చెప్పటం మరచిపోయాను. అమరావతిలో ఉండే ఉపాసనీ వైద్య ఇక్కడే ఉన్నాడు. నేనిక్కడకు రాగానే నన్ను చూశాడు. మేం కూర్చుని మాట్లాడుకున్నాం. అతను తను అమరావతిని వదిలినప్పటినుంచి జరిగిన తన కథను, తను ఎలా గ్వాలియర్ రాష్ట్రానికి వెళ్ళిందీ, తను ఎలా ఒక గ్రామాన్ని కొన్నదీ, అది ఎలా నష్టాన్ని కలిగించిందీ, తను ఎలా ఒక మహాత్ముణ్ణి కలుసుకొన్నదీ, తను జబ్బుపడి అన్ని ఔషధాలతో ఎలా ప్రయత్నించిందీ, ఎలా అనేకమంది సాధువులతోనూ, మహాత్ములతోనూ మొరపెట్టుకున్నదీ, ఎలా తనకు నయమైందీ, ఎలా తనకు ఇక్కడ ఉండాలని అనుజ్జ వచ్చిందీ క్లుప్తంగా నాకు చెప్పాడు. అతను సంస్కృతంలో సాయి మహారాజు మీద ఒక 'స్తోత్రం' రాశాడు. 

మేమంతా పెందరాళే లేచి కాకడ ఆరతికి హాజరయ్యాం. అది చాలా అద్భుతంగా ఉంది. నా నిత్యప్రార్థన, స్నానాల అనంతరం సాయి మహారాజు బయటకు వెళ్ళేటప్పుడు, తిరిగి వచ్చేటప్పుడు, మధ్యాహ్నం మరోసారి చూశాను. సాయి మహారాజు నావైపు చూస్తూ, "కా సర్కార్?" (ఏం.. పెద్దమనిషీ?) అన్నారు. అప్పుడు వారు, "దేవుడెలా వుంచితే అలా జీవించాల"ని నాకో సలహా ఇచ్చారు. ఒకతను తన కుటుంబం పట్ల ఎంతో మమకారంతో ఉండటం వల్ల ఎన్నో ఇబ్బందుల్ని భరించవలసి వచ్చిందని చెబుతూ ఏదో తాత్కాలికమైన ఇబ్బందుల వల్ల సాయంత్రం వరకు ఆకలితో మాడి తనకోసం తానే తయారుచేసుకొన్న ఒక ఎండురొట్టెను తిన్న ఒక భాగ్యవంతుడి కథను చెప్పారు.

సాయి మహారాజుని మళ్ళీ సాయంత్రం చూశాం. దీక్షిత్‌చే నిర్మించబడ్డ భవనంలోని వరండాలో కూర్చున్నాం మేము. ముంబాయి నుంచి వచ్చిన ఇద్దరు పెద్దమనుషులు ఒక సితార్‌ను తెచ్చి, దాన్ని వాయిస్తూ భజన చెప్పారు. నాచేత 'హజరత్'గా పిలువబడే తోసర్ అద్భుతంగా పాడితే, భీష్మ తన మామూలు భజనలు పాడాడు. అర్థరాత్రి వరకూ సమయం హాయిగా గడిచిపోయింది. తోసర్ నిజంగా ఒక మంచి సహచరుడు. మా అబ్బాయి బల్వంత్, కొందరు ముంబాయి మనుషులు, ఇంకా ఇతరులతో నేను ధ్యానం గురించి మాట్లాడాను.

9-12-1911

నేను నిద్రలేవటం, ప్రార్థన చేసుకోవటం ఆలస్యమైపోయింది. ఈరోజు చాలామంది వచ్చారు. చందోర్కర్ కూడా ఒక సేవకుడితో వచ్చాడు. అప్పటికే ఇక్కడున్న కొందరు వెళ్ళిపోయారు. చందోర్కర్ చాలా మంచివాడు. నిరాడంబరంగా ఉంటూ అతను ఎంతో ఆహ్లాదంగా సంభాషిస్తున్నా వ్యవహారాల్లో మాత్రం ఖచ్చితంగా ఉండే మనిషి. నేను మశీదుకి వెళ్ళి అక్కడ ఆయన చెప్పే విషయాలను వింటూ చాలాసేపు కూర్చున్నాను. సాయి మహారాజు చాలా హాయిగా ఉన్నారు. నేను అక్కడకు తీసుకువెళ్ళిన హుక్కాను సాయి మహారాజు పీల్చారు. వారు ఆరతి సమయంలో అద్భుతమైన సౌందర్యంతో మెరిసిపోతున్నారు. ఆరతి అయిన వెంటనే అందర్నీ వెళ్ళిపొమ్మన్నారు. మాతో కలసి భోజనానికి తాము వస్తామన్నారు. నా భార్యను 'అమ్మమ్మ' అని సంబోధించారు. 

మేం వాడాకు రాగానే అనారోగ్యంగా ఉన్న దీక్షిత్ గారి అమ్మాయి చనిపోయిందని తెలిసింది మాకు. కొద్దిరోజుల క్రితం ఆ అమ్మాయికి సాయి మహారాజు తనని వేపచెట్టు క్రింద ఉంచినట్లు కల వచ్చిందిట. సాయి మహారాజు ఆ అమ్మాయి చనిపోతుందని నిన్ననే చెప్పారు. మేం ఆ విషాద సంఘటన గురించి మాట్లాడుతూ కూర్చున్నాం. ఆ అమ్మాయికి పాపం ఏడేళ్ళే. నేను వెళ్ళి చనిపోయిన ఆ పాపను చూశాను. తను చాలా అందంగా ఉండటమే కాక, చనిపోయిన ఆ పాప ముఖంలోని భావం విచిత్రమైన అందంతో మెరిసిపోతోంది. ఆ ముఖం ఇంగ్లాండులో నేను చూసిన మెడోనా చిత్రాన్ని గుర్తుచేసింది. ఆ అమ్మాయికి అంత్యక్రియలు మా బస వెనుకనే జరిగాయి. ఆ అంత్యక్రియలకి నేను వెళ్ళాను. 

దీక్షిత్ ఆ దెబ్బను అద్భుతంగా భరించాడు. అతని భార్య సహజంగానే భరించరాని దుఃఖంతో కుప్పకూలిపోయింది. ప్రతివాళ్ళూ ఆమెకు సానుభూతి చూపించారు. సాయంత్రం నాలుగు గంటల వరకూ ఏమీ తినలేదు. సాయంత్రమూ, తరువాత శేజారతి సమయంలోనూ చావడికి వెళ్ళి సాయి మహారాజుని చూశాను. నేను, మాధవరావు దేశ్‌పాండే, భీష్మ, ఇంకా కొంతమందిమి కూర్చుని చాలా రాత్రి వరకూ సాయి మహారాజు గురించి మాట్లాడుకున్నాం. బొంబాయి తిరిగి వెళ్ళేందుకు తోసర్‌కు సాయి అనుమతి లభించింది. అతను రేపు ప్రొద్దున వెళతాడు.

తరువాయి భాగం రేపు ......

source:  "దేవుడున్నాడు లేడంటావేం!" బై విమలాశర్మ.

3 comments:

  1. Om sai sri sai Jaya Jaya sai, om sai sri sai Jaya Jaya sai, om sai sri sai Jaya Jaya sai, om sai sri sai Jaya jaya sai🙏🙏🙏🙏

    ReplyDelete

సాయి మహారాజ్ సన్నిధి సోషల్ మీడియా లింక్స్:

Subscribe Here

బ్లాగ్ అప్డేట్ నోటిఫికేషన్స్ నేరుగా మీ మెయిల్ కే వచ్చేందుకు క్రింద బాక్సులో మీ మెయిల్ ఐడి టైపు చేసి subscribe పై క్లిక్ చేసి, తరువాత స్టెప్స్ పూర్తీ చేయండి.

Delivered by FeedBurner

Followers

Recent Posts


Blog Logo