సాయి వచనం:-

- శ్రీబాబూజీ.

సాయిభక్తుల అనుభవమాలిక - 359వ భాగం....


ఈ భాగంలో అనుభవం:
  • శిరిడీ ప్రయాణం - బాబా అనుగ్రహం - మొదటి భాగం 

నా పేరు శ్రావణి. గతంలో బాబా నాకు ప్రసాదించిన కొన్ని అనుభవాలను ఈ బ్లాగు ద్వారా మీతో పంచుకున్నాను. ఇటీవలి మా శిరిడీయాత్ర గురించి ఇప్పుడు మీతో పంచుకుంటాను. 

మేము 2018, ఆగష్టులో శిరిడీ వెళ్ళివచ్చాము. 2019 సంవత్సరం ప్రారంభమయ్యాక నాకు మళ్ళీ శిరిడీ వెళ్లి బాబాను దర్శించుకోవాలని అనిపించింది. ఆ విషయంలో నాకంటే మా బాబుకే ఎక్కువ ఆరాటం ఉందని చెప్పాలి. తనను శిరిడీ తీసుకెళ్లమని మా బాబు పదేపదే అడుగుతుండేవాడు. కానీ అనుకోని సంఘటనల కారణంగా అప్పుడు నేను శిరిడీకి వెళ్లలేని పరిస్థితి. వాటి గురించి చెపితే అర్థం చేసుకోలేని వయస్సు వాడిది. అందువలన వాడికి ఏదో ఒకటి నచ్చచెప్తూ ఉండేదాన్ని. కానీ వాడు మాత్రం ఎప్పటికప్పుడు తనను శిరిడీ తీసుకెళ్లమని అడుగుతుండేవాడు. ఒకసారి వాడు నిద్రలేస్తూనే "శిరిడీ ఎప్పుడు తీసుకెళ్తావ"ని మారాం చేశాడు. మరోసారి శిరిడీ టిక్కెట్లు బుక్ చెయ్యమని మావారి చేతిలోని ఫోన్ బలవంతంగా లాక్కుని నా చేతిలో పెట్టాడు. అలా వాడు చేసిన మారాం అంతా ఇంతా కాదు. అక్టోబరు నెలలో ఒకరోజు వాడు టాయిలెట్‌లో కూర్చొని ఏడుస్తున్నాడు. మా అమ్మ, "ఎందుకు వాడలా ఏడుస్తున్నాడు?" అని నన్నడిగితే, నేను వెళ్లి వాడిని కారణం అడిగాను. అందుకు వాడు, "నాకు శిరిడీకి వెళ్ళాలని ఉంది. నన్ను శిరిడీకి తీసుకెళ్తానంటే కానీ నేను బయటకు రాను" అని మొండిపట్టు పట్టాడు. దాంతో సాయిభక్తులైన మా నాన్న, తన మనవడి ఆరాటం చూసి, "ఎవరు వచ్చినా రాకపోయినా నేనే వాడిని ఫ్లైట్‌లో శిరిడీకి తీసుకొని వెళ్తాన"ని అన్నారు. దాంతో నేను, మా బాబు, మా నాన్న, మా అత్తయ్య, నా స్నేహితురాలు శిరిడీ వెళ్లడానికి నిర్ణయించుకొని ఫ్లైట్ టిక్కెట్లు బుక్ చేసుకున్నాం. అలా మా శిరిడీ ప్రయాణాన్ని బాబా ఎంతో చక్కగా ప్లాన్ చేశారు.

అయితే అనుకోకుండా నవంబరు నెలలో మంచు ఎక్కువగా ఉండటంతో సాంకేతిక కారణాల వల్ల మేము ఎక్కాల్సిన ఫ్లైట్ రద్దయింది. నేను ఆలస్యం చెయ్యకుండా వెంటనే స్లీపర్ బస్సుకి టిక్కెట్లు బుక్ చేశాను. రెండురోజులలో ప్రయాణమనగా మా బాబుకి కలలో బాబా కనిపించి, "నువ్వు శిరిడీకి రా, నిన్ను జాగ్రత్తగా చూసుకుంటాను" అని చెప్పారు. మా ప్రయాణానికి ఒకరోజు ముందు మా అత్తయ్య బైక్ మీద నుండి క్రింద పడిపోయింది. ఆమె వెన్నుపూసకు ఫ్రాక్చర్ అవ్వడంతో డాక్టర్లు ఆమెను దూరప్రయాణం చేయవద్దని చెప్పారు. దాంతో నేను 'శిరిడీ వెళ్ళాలా, వద్దా?' అన్న పెద్ద సందిగ్ధంలో పడిపోయాను. కానీ మా అత్తయ్య, "నాకేమీ పరవాలేదు, నువ్వు శిరిడీకి వెళ్ళు" అని ధైర్యం చెప్పడంతో నాకు కాస్త ఊరట కలిగింది. కానీ మా అత్తయ్య టికెట్ ఏం చెయ్యాలో నాకు అర్థం కాలేదు. పోనీ మా అమ్మని తీసుకెళదామంటే, ఆమెకున్న మోకాళ్ళ నొప్పుల కారణంగా తను ఎక్కువగా ప్రయాణాలు చెయ్యటంలేదు. కానీ మా అత్తయ్యతో సహా అందరూ మా అమ్మను శిరిడీకి వెళ్ళిరమ్మని బలవంతం చెయ్యడంతో ఆమె ప్రయాణానికి సిద్ధమైంది. "నా ఆజ్ఞ లేనిదే ఎవరూ శిరిడీలో అడుగుపెట్టలేరు" అని బాబా అన్నారు. బాబా ఎవరిని, ఎలా తన దగ్గరకు రప్పించుకుంటారో తెలుసుకోవటానికి మా అమ్మ శిరిడీ ప్రయాణమే ఒక నిదర్శనం. అసలు మా అమ్మని శిరిడీకి రప్పించుకోవటంలో బాబా ప్రణాళిక చాలా భిన్నంగా ఉంది.

బాబా మా అమ్మను అనుగ్రహించిన తీరు

మేము నెల్లూరు నుండి సికింద్రాబాదు చేరుకొన్నాము. సికింద్రాబాదు రైల్వేస్టేషనులో ఎస్కలేటర్ మీద వెళ్తుండగా వేరొకరి పొరపాటు వల్ల ట్రాలీ తట్టుకొని మా అమ్మ క్రింద పడిపోయింది. అయితే బాబా దయవల్ల ఆమెకు ఏమీ కాలేదు. అంతేకాదు, మోకాళ్ళ నొప్పులున్న అమ్మ ఎటువంటి ఇబ్బందీ లేకుండా వెంటనే మెట్లు దిగి క్రిందకు రాగలిగింది. మరుసటిరోజు ఉదయం మేము శిరిడీ చేరుకున్నాం. ఆరోజు రాత్రి మా అమ్మ నిద్రలో మంచం మీద నుండి క్రింద పడిపోయింది. నేను, నా స్నేహితురాలు ఇద్దరం కలిసి ఆమెను లేపి మంచంపైన పడుకోబెట్టాము. మరునాటి ఉదయం ఆమె ఎటువంటి ఇబ్బందీ లేకుండా బాబా దర్శనం చేసుకుంది. ఆ తర్వాత ఆమె చక్కగా నడుస్తూ మసీదు (ద్వారకామాయి), చావడి మొదలైన ప్రదేశాలన్నీ దర్శించుకుంది. మాములు పరిస్థితుల్లో అయితే ఆమె అంత దూరం నడవలేదు, కాస్త దూరం నడవటానికే ఇబ్బందిపడుతుండేది. ఆమెకు ఎటువంటి కష్టం లేకుండా బాబా చూసుకున్నారు. అంతా బాబా దయ

మేము శిరిడీ నుండి తిరుగు ప్రయాణమయ్యేరోజు మా అమ్మను ఒంటరిగా హోటల్ గదిలో వదిలి మేమంతా బాబా దర్శనానికి వెళ్ళాము. ఆమె గదిలో ఒంటరిగా పడుకొని ఉంది. ఆ సమయంలో ఆమెకు ఆ గదిలో ఉన్న ఒక అలమారా దగ్గర నల్లని వస్త్రాలు, కిరీటం ధరించి నిల్చొని ఉన్నట్లుగా బాబా స్పష్టంగా కనిపించారు. ఆమె పూర్తి మెలకువ తెచ్చుకొని బాబాతో మాట్లాడాలని, బాబా దగ్గరకు వెళ్ళాలని ప్రయత్నించినప్పటికీ తను మంచం మీద నుండి లేవలేకపోయింది. బాబా దర్శనం చేసుకుని గదికి తిరిగి వచ్చిన తర్వాత జరిగిన విషయం తెలుసుకొని, బాబా ఆమెను శిరిడీకి పిలిపించుకొని తమ దర్శనాన్ని ప్రసాదించి ఆమెను అనుగ్రహించారని  మేము అనుకున్నాము.

ఇప్పుడు అసలైన అద్భుతాన్ని మీతో పంచుకుంటాను. నిజానికి మూడేళ్ళ క్రితం 2016లో మా అమ్మగారి ఒక మోకాలికి ఆపరేషన్ జరిగింది. ఆ సమయంలోనే డాక్టర్లు ఆమె రెండవ మోకాలికి కూడా ఆపరేషన్ చెయ్యాలని అన్నారు. ఆ ఆపరేషన్ 2020 ఫిబ్రవరిలో చెయ్యాల్సి ఉంది. అయితే మేము శిరిడీ నుండి నెల్లూరు తిరిగి వచ్చాక చెకప్ కోసం డాక్టరు దగ్గరకు వెళ్ళినప్పుడు, డాక్టర్ ఎక్స్-రే తీసి ఆమెకు ఇక ఆపరేషన్ అవసరం లేదని చెప్పారు. అది విని మేమంతా ఎంతో ఆశ్చర్యానికి లోనయ్యాము. సికింద్రాబాదు స్టేషన్లో ఎస్కలేటర్ మీద నుండి పడిపోవటం, శిరిడీలో హోటల్ గదిలో మంచం మీదనుండి క్రింద పడిపోవడం, శిరిడీలో బాబా దర్శనం, అక్కడ చాలా దూరం నడవటం, ఆ తర్వాత హోటల్ గదిలో బాబా దర్శనమూ - ఇవన్నీ అమ్మకి బాబా చేసిన చికిత్సలేమో! బాబా దయవల్ల ఇప్పుడు అమ్మ బాగున్నారు. బాబా అద్భుత వైద్యాన్ని ఏమని వర్ణించేది?

రేపటి భాగంలో నా అనుభవాలు మరికొన్ని పంచుకుంటాను ....



3 comments:

  1. Very nice experiences.
    One thing is 100% true that once baba invites us, everything will be so smooth and we need not worry at all during the trip🙏🙏

    ReplyDelete
  2. Sai nadha! Bless me with Job 🙏🙏🙏🙏🙏

    ReplyDelete

సాయి మహారాజ్ సన్నిధి సోషల్ మీడియా లింక్స్:

Subscribe Here

బ్లాగ్ అప్డేట్ నోటిఫికేషన్స్ నేరుగా మీ మెయిల్ కే వచ్చేందుకు క్రింద బాక్సులో మీ మెయిల్ ఐడి టైపు చేసి subscribe పై క్లిక్ చేసి, తరువాత స్టెప్స్ పూర్తీ చేయండి.

Delivered by FeedBurner

Followers

Recent Posts


Blog Logo