సాయి వచనం:-

- శ్రీబాబూజీ.

సాయిభక్తుల అనుభవమాలిక - 350వ భాగం....


ఈ భాగంలో అనుభవాలు:
  1. సాయినాథుని అండ
  2. కేవలం గంటలో బాబా సమస్యను పరిష్కరించారు

సాయినాథుని అండ

గుంటూరు నుండి సాయిభక్తురాలు ప్రసన్న తనకు బాబా ప్రసాదించిన అనుభవాలను మనతో పంచుకుంటున్నారు.

ఓం సాయిరామ్! నా పేరు ప్రసన్న. నేను గుంటూరు నివాసిని. 'సాయి మహరాజ్ సన్నిధి' బ్లాగుని నిర్వహిస్తున్న సాయికి నా నమస్కారాలు. బాబా ఆశీస్సులు ప్రతి ఒక్కరికీ ఉండాలని ప్రార్థిస్తున్నాను. కొన్ని నెలల క్రితం బాబా నన్ను జాగ్రత్తగా ద్వారకాతిరుమలలోని శ్రీవేంకటేశ్వరస్వామి దర్శనం చేయించి తమ ఆశీస్సులిచ్చి నా కోరిక నెరవేర్చారు. సాయినాథుడు నా కోరికను ఎలా నెరవేర్చారో ఈ 'సాయిమహరాజ్ సన్నిధి' ద్వారా మీ అందరితో పంచుకొనే అవకాశం ఇచ్చిన మన సాయిమహారాజుకి కృతజ్ఞతలు.

ఒకరోజు నేను నా ఫోన్లో ఉన్న ఒక యాప్ ద్వారా ద్వారకాతిరుమలలో శ్రీవేంకటేశ్వరస్వామి వారి కళ్యాణమహోత్సవం గురించి తెలుసుకున్నాను. వెంటనే, స్వామివారి కళ్యాణం చూసే భాగ్యాన్ని ప్రసాదించమని బాబాని ప్రార్థించాను. నేను నా దగ్గరున్న డబ్బులతో రైల్లోగానీ, బస్సులోగానీ వెళదామని అనుకున్నాను. కానీ మాకు తెలిసిన వాళ్ళ కారులో వెళ్లే అవకాశం వచ్చింది. వాళ్ళు మాకు కారు ఇస్తారని నేనస్సలు ఊహించలేదు. అలాంటిది బాబా దయవల్ల కారు సమయానికి వచ్చింది. కళ్యాణం రాత్రి 9 గంటలకి మొదలవుతుంది. కాబట్టి ఆలోపే అక్కడికి చేరుకోవాలని నేను, మా చిన్నక్క, మా పెద్దక్కావాళ్ళ అబ్బాయి, మరియు కారు డ్రైవరుతో కలిపి మొత్తం నలుగురం సాయంత్రం 6 గంటలకి గుంటూరులో బయలుదేరాము. విజయవాడ దాటేసరికి బాగా మబ్బుపట్టి వర్షం మొదలైంది. చిన్న వర్షమే కదా తగ్గిపోతుందిలే అని అనుకున్నాము. కానీ వర్షం తగ్గకపోగా ఉరుములు, మెరుపులతో ఇంకా తీవ్రమైంది. మాకు భయమేసి తిరిగి ఇంటికి వెళ్ళిపోదామని డ్రైవరుతో అన్నాము.  అందుకతను "ఏం పర్వాలేదు, నిదానంగా వెళ్లొచ్చు" అని చెప్పి ఎక్కడా ఆగకుండా కారు నెమ్మదిగా నడుపుతున్నాడు. నేను బాధపడుతూ, "స్వామి దర్శనం కోసమని బయలుదేరితే ఈ వర్షమేమిటి బాబా? వర్షం తగ్గకపోతే వెంకటసాయిగా నీ ఆశీర్వాదం నాకెలా అందుతుంది?" అనుకుంటూ, మనసులోనే 'సాయిరామ్..సాయిరామ్' అని జపిస్తూ, "ప్లీజ్ సాయిరామ్! ద్వారకాతిరుమలలో వర్షం ఉంటే నేనెలా కళ్యాణం చూస్తాను? అక్కడ వర్షం లేకుండా చూడండి. ఇంతదూరం వచ్చి కళ్యాణం చూడకపోతే నాకు బాధగా ఉంటుంది. ప్లీజ్, మిమ్మల్ని వేడుకుంటున్నాను, వర్షం లేకుండా చూడండి బాబా" అని బాబాని ప్రార్థిస్తూ ప్రయాణం సాగించాను. బాబా అద్భుతం చూపించారు. ద్వారకాతిరుమలకు దగ్గరలో ఉన్న కొమ్ముగూడెం వరకు పడుతున్న వర్షం లక్ష్మీపురంలోకి ప్రవేశించేసరికి లేదు. ఆనందంతో మనసులోనే నా సాయినాథునికి హృదయపూర్వక సాష్టాంగనమస్కారాలు తెలుపుకున్నాను. తరువాత కనులారా స్వామివారి కళ్యాణాన్ని తిలకించాము. మాయందు దయవుంచి అంత వర్షంలోనూ ఏ ఆపదా కలగకుండా ప్రయాణం సాగేలా చేసి నా కోరిక తీర్చి ఆశీర్వదించిన నా సాయినాథునికి ఏవిధంగా కృతజ్ఞతలు తెలుపుకోగలను?

మరో చిన్న అనుభవం:

2020 ఫిబ్రవరి నెల చివరిలో ఒకరోజు నేను మా ఇంటిని శుభ్రపరుస్తున్నాను. అనుకోకుండా నా చేతిలో ఉన్న బూజుకర్ర దేవుని గదిలో ఉన్న ట్యూబ్‌లైటుకి తగిలి అది పేలిపోయింది. అయితే నాపై ఒక్క గాజుపెంకు కూడా పడలేదు. గదిలో చుట్టూ పడి ఉన్న గాజుపెంకులు చూసాక నా గోవిందసాయి నాపై ఒక్క పెంకు కూడా పడకుండా కాపాడారని నాకు అర్థమయ్యింది. "ప్రాణదాత సాయినాథా! ఇంత చిన్న ప్రమాదంలో కూడా నన్ను కనిపెట్టుకొని రక్షించిన మీకు నా కృతజ్ఞతాపూర్వక నమస్కారములు".

ఒక్కసారి మనం ఆ సాయినాథుని మనసారా మన మనస్సులో నిలుపుకుంటే చాలు, మనకు అండగా ఉంటూ పిలవగానే సమాధానం ఇస్తారు. ఆ స్వామి నా జీవితంలోకి వచ్చినప్పటినుండి ప్రతిక్షణం, ప్రతి విషయంలో, ప్రతి పనిలో, ప్రతి కష్టంలో అండగా ఉంటూ కాపాడుతున్నారు. ఆయనను సాధ్యమైనంతవరకు ఆరాధిస్తూ, స్మరిస్తూ, కన్నులారా తృప్తిగా దర్శించుకుంటూ ఉండటమే నా జీవితానికి ధన్యత. "సాయిరామ్! మీ అండ నాకుంది. మీ లీలలను, మీరు ప్రేమతో ఇచ్చే అద్భుతమైన అనుభవాలను ఏ పదాలతో వర్ణించను? ఒక సామాన్యురాలినైన నా జీవితంలో మీరు ఉన్నందుకు నా జన్మ ధన్యమైంది. ప్రభూ! నీ నీడలో నా జీవితం చల్లగా సాగిపోనీ! ఆపద్బాంధవా! అభయప్రదాతా! కోరికలు తీర్చే కొంగుబంగారు స్వామీ! నీకు శరణం. నాకు అండగా ఉన్నట్లే మీ భక్తులందరికీ అండగా ఉంటూ ఆదుకోవాలని, మీ కృప అందరిపై ఉండాలని మనస్పూర్తిగా కోరుకుంటున్నాను బాబా!"

కేవలం గంటలో బాబా సమస్యను పరిష్కరించారు

USA నుండి పేరు వెల్లడించని ఒక సాయిభక్తుడు తన అనుభవాన్ని ఇలా పంచుకుంటున్నారు:

ఓం సాయిరామ్! నేను యు.ఎస్.ఏ.లో ఉంటున్న చిన్న సాయిభక్తుడిని. ఇది నా ఇటీవలి అనుభవం. నేను ప్రస్తుతం ఉంటున్న ప్రదేశానికి వచ్చినప్పుడు అమెజాన్‌ ద్వారా ఆన్‌లైన్‌లో ఒక పరుపు కొన్నాను. అయితే నేను క్రొత్త ఉద్యోగం కోసం ప్రయత్నిస్తూ వేరే రాష్ట్రానికి వెళ్లాలనుకుంటున్న కారణంగా నేను దాన్ని అమ్మివేయాలని అనుకున్నాను. ఆ విషయమే చాలాచోట్ల ప్రకటన ఇచ్చాను. రెండు నెలలు గడిచినప్పటికీ ఎటువంటి స్పందనా రాలేదు. అప్పుడు నేను, "బాబా! నా పరుపు అమ్ముడయ్యేలా అనుగ్రహించండి. నేను దాన్ని 150 డాలర్లు ఇచ్చి కొన్నాను, కనీసం నాకు 100 డాలర్లు వచ్చినట్లైతే వెంటనే నేను నా అనుభవాన్ని బ్లాగు ద్వారా సాటి సాయిభక్తులతో పంచుకుంటాను" అని బాబాను ప్రార్థించాను. వెంటనే బాబా అద్భుతం చేసారు. ఒక వ్యక్తి పరుపుకోసం నాకు ఫోన్ చేసి మాట్లాడి, ఒక గంటలో నా ఇంటికి వచ్చి 100 డాలర్లిచ్చి పరుపు తీసుకుని వెళ్లారు. రెండు నెలలు నేను ఈ విషయంలో చాలా ఆందోళనపడ్డాను, బాబా కేవలం ఒక్క గంటలో సమస్యను పరిష్కరించేశారు. ఆయన మనకు ఏదైనా చేయాలనుకుంటే, ఆయనకు సమయం అవసరం లేదని ఈ అనుభవం ద్వారా నాకు అర్థమైంది. బాబా చెప్పినట్లు విశ్వాసం, సహనం కలిగి ఉండటం అవసరం. నాకు తెలుసు, మనం మనుషులం కాబట్టి ఓపికతో ఎదురుచూడలేక చంచలత్వంతో పదేపదే బాబాని అడుగుతుంటాం. కానీ, మనం ఆయనపట్ల విశ్వాసంతో వేచి ఉండాలి. ఈ విషయం గురించి నేను ఇంకా నేర్చుకుంటున్నాను. ఆయన అనుగ్రహంతో స్పష్టత వస్తుందని ఆశిస్తున్నాను. "బాబా! థాంక్యూ సో మచ్. మా అందరినీ ఆశీర్వదించండి".


source:http://www.shirdisaibabaexperiences.org/2019/12/shirdi-sai-baba-miracles-part-2580.html


2 comments:

సాయి మహారాజ్ సన్నిధి సోషల్ మీడియా లింక్స్:

Subscribe Here

బ్లాగ్ అప్డేట్ నోటిఫికేషన్స్ నేరుగా మీ మెయిల్ కే వచ్చేందుకు క్రింద బాక్సులో మీ మెయిల్ ఐడి టైపు చేసి subscribe పై క్లిక్ చేసి, తరువాత స్టెప్స్ పూర్తీ చేయండి.

Delivered by FeedBurner

Followers

Recent Posts


Blog Logo