సాయి వచనం:-

- శ్రీబాబూజీ.

శాంతారాం బల్వంత్ నాచ్నే- నాలుగవ భాగం


నాచ్నే రెండవ భార్య మరణంతో వారి మూడేళ్ళ బిడ్డ సాయినాథ్ బాగోగులు చూసుకోవడానికి ఎవరూ లేకుండా పోయారు. దాంతో అతని తల్లిదండ్రులు 1930లో నాచ్నేకి శ్రీగోవిందరావు దీక్షిత్ కుమార్తె గులాబ్‌బాయి అలియాస్ ఇందిరాబాయితో (1912లో జన్మించారు) వివాహం జరిపించారు. ఆ దంపతులకి చాలామంది సంతానం కలిగారు. బాబా ఆశీస్సులు వాళ్లందరిపై ఉన్నాయి. నాచ్నేను రక్షించిన విధంగానే వాళ్ళని కూడా బాబా రక్షించారు. ఆ దంపతుల మొదటి సంతానం వాసుదేవ్ 1932లో జన్మించాడు.

1932లో ఒకసారి సాయినాథ్ తన తమ్ముడు వాసుదేవ్‌కు ఒక ఉంగరం ఇచ్చాడు. చిన్నపిల్లలకుండే స్వభావరీత్యా వాడు సహజంగానే దానిని తన నోటిలో పెట్టేసుకున్నాడు. అది పోయి వాడి గొంతులో ఇరుక్కుపోయింది. ఇంట్లో అందరూ భయపడిపోయారు. ఉంగరాన్ని బయటకు కక్కించడానికి ఏవేవో ప్రయత్నాలు చేశారు. వైద్యుడు కూడా మందులిచ్చాడు. కానీ ఏమీ ప్రయోజనం లేకపాయింది. దాదాపు ఒక గంటపాటు ఆందోళనకర వాతావరణం నెలకొంది. చివరికి నాచ్నే బాబా ఊదీ తీసుకొచ్చి పిల్లాడి నోటిలో వేశాడు. తరువాత అతను తన వేలిని పిల్లాడి నోటిలోకి లోతుగా చొప్పించాడు. ఉంగరం వేలికి తగిలింది. బాబా దయవలన అతను ఉంగరాన్ని బయటకు తీయగలిగాడు. దానితో ప్రమాదం తప్పిపోయింది.

1934లో వాసుదేవ్‌కు మీజిల్స్(చిన్న అమ్మవారు) పోసింది. దానికితోడు న్యుమోనియా వచ్చి ఛాతీపై ఒక గడ్డ లేచింది. దాంతో వాడు క్రమంగా క్షీణించిపోసాగాడు. ఆ స్థితిలో ఆపరేషన్ చేసి ఆ గడ్డను తొలగించడానికి డాక్టర్ ఆద్యే వెనుకాడాడు. నాచ్నే ఆ గడ్డపై వాపును తగ్గించే ఔషధాన్ని రాశాడు. దానితో ఆ గడ్డ పేలి పెద్ద పుండులా తయారయ్యింది. డాక్టర్ ఏవిధమైన సహాయం చేయలేకపోయాడు. ఇక నాచ్నే ఆ డాక్టరుపై కాకుండా సాయిబాబాపై ఆధారపడదలచి, బాబాపై నమ్మకంతో కొంచెం ఊదీ తీసుకుని ఆ పుండుపై వేశాడు. అదంతా గమనిస్తున్న అతని స్నేహితుడైన డిప్యూటీ కలెక్టర్ శ్రీవసంత్‌రావ్ జాదవ్ విస్తుపోతూ, "నువ్వు చేస్తున్న ఊదీ చికిత్స వల్ల పుండు మానిపోతుందని అనుకుంటున్నావా? అలా అయితే దానికి ఎంత సమయం పడుతుంది?" అని అడిగాడు. అందుకు నాచ్నే "24 గంటలలో మానిపోతుంది" అని బదులిచ్చాడు. ఆ రాత్రి బాబా అతనికి కలలో కనిపించి, "24 గంటలని ఎందుకు చెప్పావు? 'వెంటనే' అని చెప్పి ఉండాల్సింది" అని అన్నారు. అతను తన పొరపాటుకు కలలోనే బాబాకు క్షమాపణలు చెప్పుకున్నాడు. మరుసటిరోజు ఉదయానికి ఆ పుండు మానిపోయింది. ఆ పుండు లేచిన ప్రాంతంలో ఊదీ అద్దిన నాచ్నే బొటనవేలిముద్ర స్థిరంగా ఉండిపోయింది. 

ఆ అద్భుతానికి జాదవ్ ఆశ్చర్యపోయి, న్యుమోనియాతో బాధపడుతున్న నాలుగున్నర సంవత్సరాల తన కుమారునికి బాబా ఊదీ, ఆశీస్సులు కావాలని అడిగాడు. వెంటనే నాచ్నే అతనికి బాబా ఊదీని ఇచ్చాడు. అప్పటికే ఆ పిల్లవాడు ఆరురోజులుగా జ్వరంతో బాధపడుతున్నాడు. వాడికి చికిత్స చేస్తున్న డాక్టర్ జ్వరం తొమ్మిది రోజులకు గాని తగ్గదని చెప్పాడు. కానీ ఊదీ వాడిన మరుసటిరోజుకల్లా పిల్లవాడి జ్వరం తగ్గిపోయింది. జాదవ్ కృతజ్ఞతాపూర్వకంగా ఏడు రూపాయలిచ్చి, శ్రీసాయిబాబా సంస్థాన్‌కి పంపమని నాచ్నేను కోరాడు.

1935లో క్యాషియరుగా పనిచేస్తున్న ఒకతని ఆఫీసు ఖాతాలో 3,500 రూపాయలకు లెక్క తేలలేదు. అంటే లోటు కనిపించింది. దాంతో అతను చాలా ఆందోళన చెందాడు. అప్పుడు అతని స్నేహితుడు అతన్ని నాచ్నే వద్దకు పంపించాడు. ఆ క్యాషియర్ సాయిబాబాను మహమ్మదీయునిగా భావించడం వల్ల వారిపట్ల అతనికి అయిష్టత ఉండేది. నాచ్నే అతనికి సాయిబాబా యొక్క మహిమల గురించి చెప్పి, అతనిని కాపాడగలవారు బాబా ఒక్కరేనని, వెంటనే శిరిడీ వెళ్లి వారిని క్షమించమని వేడుకుని సహాయం కొరకు ప్రార్థించమని చెప్పాడు. అతను శిరిడీ వెళ్లి, ఒక బాబా ఫోటో తీసుకుని సగుణమేరునాయక్ సహాయంతో ఆ ఫోటోను సమాధిపై ఉంచి ఆర్తిగా బాబాను ప్రార్థించాడు. తరువాత ఆ ఫోటోను తీసుకుని అతను శిరిడీ నుండి  తిరిగి వచ్చాడు. అప్పటినుండి పరిస్థితులు మెరుగుపడసాగాయి. ఆఫీసు ఖాతాలో తగ్గిన 3,500 రూపాయలు జమకట్టడానికి అతనికి ఎనిమిది రోజుల గడువు ఇచ్చారు. అతను ఆ గడువులోపు డబ్బు సేకరించి చెల్లించగలిగాడు. అంతటితో సమస్య సమసిపోయింది. అతడిని విచారించడంగాని, ఉద్యోగం నుండి తొలగించడంగాని జరగలేదు.

వి.సి.చిట్నిస్ అనే అతనికి కూడా అదే విధమైన సహాయం బాబా నుండి లభించింది. అతనిని ఉద్యోగం నుండి తొలగించారు. అతను సహాయం కోసం నాచ్నే వద్దకు వెళ్ళాడు. నాచ్నే అతనితో, "సాయిబాబాపై భారాన్ని వేసి, శిరిడీ వెళ్లి సహాయం కోసం బాబాని ప్రార్థించమ"ని చెప్పాడు. అతను అలాగే చేశాడు. తరువాత అతనిని తిరిగి ఉద్యోగంలో చేర్చుకున్నారు.

1935లో ఒకరోజు నాచ్నే ఇంటిలో పొయ్యి మీద పాలు మరుగుతున్నాయి. అతని రెండేళ్ల పిల్లవాడు ఆనంద్ పరుగెత్తుకుంటూ వచ్చి, కాళ్లకు కర్ర తట్టుకుని పాలు కాగుతున్న పొయ్యిమీద పడ్డాడు. సాధారణంగా అలాంటి సమయంలో మరుగుతున్న పాలు పిల్లవాడి ఒంటిమీద పడటమో లేదా వాడి ఒంటిమీద ఉన్న బట్టలు అంటుకుని కాలడమో జరుగుతుందని ఎవరైనా ఊహిస్తారు. కానీ బాబా కృపవలన పాలు ఒకవైపుకు, పొయ్యి మరోవైపుకు ఎగిరిపడి పిల్లవాడు మధ్యలో పడ్డాడు. అందువలన వాడికి ఏ హానీ జరగలేదు. అలా ప్రమాదం జరగకుండా బాబా కాపాడారు.

1936లో వాసుదేవ్, తన తమ్ముడు కలిసి అల్మారాలు వెతుకుతుండగా బిళ్ళలున్న ఒక పెట్టె కనిపించింది. వాసు వాటిని పిప్పరమెంట్లనుకుని కొన్ని తమ్ముడికిచ్చి కొన్ని తన నోట్లో వేసుకున్నాడు. అవి వెగటుగా ఉన్నందువల్ల వాడు తినలేక నాలుక వెళ్ళబెట్టి ఏడవసాగాడు. నాచ్నే భార్య వాడు సున్నం తిన్నాడనుకుని తన వేలితో వాడి నోట్లో ఉన్నదంతా తీసివేసింది. తరువాత ఏమి తిన్నావని అడిగితే, ప్రక్కనున్న చిన్న పెట్టెను చూపించాడు. అవి దీపావళి సమయంలో పిల్లలు కాల్చుకునే పాముమందు బిళ్ళలు. ఆ బిళ్లలను ముట్టిస్తే వాటినుండి బుసబుసమని వంపులు తిరుగుతూ పాములాంటి కుబుసాలు వస్తాయి. వెంటనే వాడిని వైద్యుడి వద్దకు తీసుకువెళ్ళారు. డాక్టరు విషపదార్థమంతా వాంతి అయ్యేందుకు మందిచ్చాడు. కానీ వాంతి కాలేదు. అప్పుడు నాచ్నే పిల్లవానికి బాబా ఊదీ, తీర్థం ఇచ్చాడు. వెంటనే అది ప్రభావం చూపించింది. పిల్లవాడికి వాంతి అయ్యి, విషపదార్ధమంతా బయటకి వచ్చేసింది. పిల్లవాడు కోలుకుని తన తమ్ముడికి కూడా బిళ్ళలు ఇచ్చానని చెప్పాడు. అయితే వాడు చాలా కొద్దిగా తిన్నందువల్ల వాడికేమీ కాలేదు. అయినప్పటికీ బాబాను స్మరించి వాడికి కూడా ఊదీ, తీర్థం ఇచ్చారు. వాడు కూడా వాంతి చేసుకున్నాడు. ఇద్దరు పిల్లలకీ బాబా కృపవలన ఏమీ కాలేదు.

1936లో నాచ్నే దంపతులకు మరో మగబిడ్డ జన్మించాడు. వాడికి రవీంద్ర అని పేరు పెట్టారు. వాడి తరువాత మరికొంతమంది పిల్లలు పుట్టారు. వాళ్ళ పేర్లు విజయ్, శ్రీకాంత్, ప్రకాష్, సతీష్. ఆ దంపతులకి ఆడపిల్లలు లేకపోయినప్పటికీ బాబా ఆశీర్వాదం వలన ఇంతమంది పిల్లలతో వారి వంశం వృద్ధి చెందింది. 

బాబా నాచ్నేను ఎంతగానో ప్రేమించేవారు. అతనిని ఒక పిచ్చివాడి నుండి, పులి నుండి, నదీప్రవాహం నుండి రక్షించారు. అలాంటి మరెన్నో ఉదాహరణలున్నాయి. ఇప్పుడు బాబా నాచ్నేను ఒక పఠాన్ నుండి ఎలా రక్షించారో తెలుసుకుందాం......... 

1940లో నాచ్నే కుటుంబం కుర్లాలో ఉండేవారు. అక్కడున్న ఒక పఠానుకి తాను చేసిన నేరాలకు శిక్ష పడింది. అయితే ఆ శిక్ష పడటానికి ముందునుండే నాచ్నే అతనికి శిక్ష పడుతుందని చెప్తుండటం వలన తనకి శిక్ష పడేలా చేసింది నాచ్నేనే అని అతడు తప్పుగా అర్థం చేసుకున్నాడు. అందువలన ఆ శిక్ష ముగిసిన తరువాత ఒకరోజు నాచ్నే ఆఫీసు నుండి ఇంటికి వెళ్తున్నపుడు అతనొక పదునైన కత్తి చేతిలో పట్టుకుని వెంబడించాడు. వెనకనుండి అతను నాచ్నేను పొడవబోయే సమయానికి అదృష్టవశాత్తూ ఒక దుకాణం వద్ద కూర్చుని ఉన్న పోలీసు కానిస్టేబుల్ చూశాడు. వెంటనే అతను ఆ పఠాన్ చేయి పట్టుకుని, "నాచ్నే, జాగ్రత్త!" అని అరిచాడు. అలా బాబా కృప వలన నాచ్నే పెద్ద ప్రమాదం నుండి రక్షింపబడ్డాడు.

నాచ్నే కుటుంబంలో ఏ శుభకార్యం తలపెట్టినా ముందుగా తమ ఇలవేలుపుకి, తరువాత శ్రీసాయిబాబాకు ఆహ్వానపత్రికలు ఇచ్చిన తరువాతే బంధువులకు, స్నేహితులకు ఇచ్చేవారు. 1940వ సంవత్సరంలో నాచ్నే తన కుమారుడు వాసుదేవ్‌కు ఉపనయనం చేయదలచి బాబాను ఆహ్వానించడానికి శిరిడీ వెళ్ళాడు. బాబాను దర్శించి ఆహ్వానపత్రికను బాబా పాదాల చెంత ఉంచాడు. ఆరోజు రాత్రి నాచ్నేకు కలలో బాబా కనిపించి, "ఉపనయన వేడుకకు వస్తాన"ని చెప్పారు. తరువాత ఆ వేడుక జరిగే రోజు భోజనాలు మొదలుపెడుతుండగా ఒక ఫకీరు వచ్చాడు. నాచ్నే ఆ ఫకీరును ఆదరించి కుటుంబసభ్యులతోపాటు భోజనం వడ్డించాడు. నాచ్నే అన్నగారైన ఆనందరావు, "బాబా ఎప్పుడో మరణించారు. అనవసరంగా ఇప్పుడు ఒక ఫకీరును బాబాగా పరిగణించి కుటుంబసభ్యులతోపాటు కూర్చోబెడుతున్నావ"ని కోపగించుకున్నాడు. ఫకీరు భోజనం చేసిన తరువాత వాసుదేవ్‌ను పిలిచి, కింగ్ రూపం ముద్రించబడి ఉన్న ఒక రెండు రూపాయల వెండినాణాన్ని అతనికిచ్చి గబగబా భోజనపళ్లాన్ని పడవేయడానికి వెళ్ళాడు. అది గమనించిన నాచ్నే వెంటనే ఫకీరు కోసం వెళ్ళాడు. కానీ ఆ ఫకీరు అదృశ్యమయ్యాడు. ఆ రాత్రి నాచ్నేకు కలలో బాబా కనిపించి, "ఉపనయన వేడుకకు వచ్చాను. భోజనం కూడా చేశాన"ని చెప్పారు.

కొంతకాలానికి నాచ్నే పదవీవిరమణ చేసి తన భార్య సోదరుడు నివాసముంటున్న ఉంబర్‌గాఁవ్‌ వెళ్లి అక్కడ నివాసముండసాగాడు. కొద్దిపాటి పెన్షన్‌తో పెద్ద కుటుంబాన్ని పోషించడం అతనికి చాలా కష్టంగా మారింది. అందువలన అతను ఆందోళన చెందుతూ సహాయం కోసం బాబాను ప్రార్థిస్తుండేవాడు. ఆ సమయంలో దేశానికి స్వతంత్రమొచ్చింది. బాబా కృపవలన నాచ్నేకు మళ్ళీ ఉద్యోగం వచ్చింది. ఆవిధంగా సాయిబాబా అతని కుటుంబానికి సహాయం చేశారు.

సాయినాథ్, వాసుదేవ్ పెరిగి పెద్దవాళ్ళై ఉద్యోగం కోసం ముంబాయి వెళ్లారు. రవీంద్ర దాదర్‌లో ఉన్న తన మేనమామ ఇంట ఉండి విద్యనభ్యసిస్తుండేవాడు. మిగతా పిల్లలతో కలిసి నాచ్నే దంపతులు ఉంబర్‌గాఁవ్‌లో నివాసముండేవారు. కుటుంబం పెద్దదైనందున అందరూ కలిసి ఉండటానికి కాస్త విశాలమైన చోటు అవసరమైంది. అందువల్ల 1950వ సంవత్సరంలో వాళ్లు చంబూర్ సమీపంలోని మహుల్ గ్రామానికి నివాసం మార్చారు. అక్కడికి వచ్చాక ఖోట్ అనువాని వద్ద పనిచేయడం ప్రారంభించాడు నాచ్నే. వాళ్ళ ఇంటికి సమీపంలో ఒక ఔదుంబర వృక్షం ఉండేది. నాచ్నే ఆ చెట్టు కింద దత్తాత్రేయుని మరియు శ్రీసాయిబాబా ఫోటోలను ఉంచి, ప్రతిరోజూ రెండుపూటలా సాంబ్రాణి కడ్డీలు, దీపం వెలిగించి చెట్టు చుట్టూ ప్రదక్షిణలు చేసేవాడు. బాబా తన మేలుకోసమే ఈ ఏర్పాటు చేశారని అతను చెప్పేవాడు. అంతేకాదు, అతనెప్పుడూ తన జీవితంలో జరిగే ప్రతి సంఘటనా శ్రీసాయిబాబా దయతోనే జరుగుతుంది అనేవాడు.

మహుల్‌లో ఉన్నప్పుడు నాచ్నే పిల్లలు ఆ గ్రామాధికారి మాణిక్‌రావు వద్ద సాయిబాబా కథలను, అనుభవాలను వింటుండేవారు. అతడు వివరించే సాయిబాబా కథలను వినడానికి కస్టమ్స్ అధికారి అయిన శ్రీకసమ్, కృష్ణపాటిల్ అనే గ్రామస్తుడు, ప్యూన్ ఖోట్ శ్రీజానూమాత్రే, నిత్యానందస్వామి శిష్యుడైన శ్రీదయానంద్ శాలిగ్రామ్ మహరాజ్ వచ్చేవారు. శ్రీదయానంద్ మహరాజ్ కొన్ని తప్పులు చేసినందున ప్రాయశ్చిత్తంగా 3 సంవత్సరాలు మాట్లాడకూడదని ప్రతిజ్ఞ పూనాడు. ఆ 3 సంవత్సరాలు పూర్తయిన తరువాత అతను నాచ్నేను తన గురువు వద్దకు వెళ్ళమని కోరాడు. అతని కోరిక మేరకు నాచ్నే వెళ్ళినప్పుడు అతని గురువు, "అతడు శిక్షను పూర్తి చేశాడు" అంటూ గురుపూర్ణిమనాడు పూజించే పవిత్రమైన పాదుకలను నాచ్నేకిచ్చి, అతనికిమ్మని చెప్పారు. అందుకు గుర్తుగా ప్రతి సంవత్సరం నవంబరు 30న ప్రత్యేక ప్రార్థనలు చేస్తారు.

శ్రీదయానందస్వామి శ్రీసాయిబాబా ఉంగరాన్ని, లక్ష్మి, విష్ణుమూర్తిల చిన్న విగ్రహాలను, ఒక శివలింగాన్ని నాచ్నేకు బహుకరించారు. ఇవి ఇప్పటికీ రవీంద్ర శాంతారామ్ నాచ్నే ఇంట పూజామందిరంలో ఉన్నాయి. ఆయన ఒక ఆవును కూడా నాచ్నేకి ఇచ్చారు. ఆ ఆవు ఒక దూడకు జన్మనిచ్చే సమయంలో బురదగుంటలో కూరుకుపోయింది. ఎలాగో మొత్తానికి బయటకు తీశారుగానీ లేగదూడకు జన్మనిచ్చి ఆ ఆవు అనారోగ్యం పాలైంది. అది నాచ్నే దగ్గరకు వచ్చి కన్నీళ్లు పెట్టుకుంది. అవి రెండూ ఎక్కువ కాలం జీవించే అవకాశం లేదని గ్రహించిన నాచ్నే దాని శరీరంపై చేయివేసి వాత్సల్యంతో నిమురుతూ ఓదార్చాడు. అతను ఊహించినట్లుగానే లేగదూడ 3-4 రోజుల్లో, ఆవు నెలరోజుల్లో చనిపోయాయి. అతడు వాటి ఆత్మకు శాంతి చేకూరాలని సాయిబాబాను ప్రార్థించాడు.

నాచ్నే రెండవ కుమారుడు సాయినాథ్‌కు సునంద అనే ఆమెతో 1956లో వివాహమైంది. ఆ దంపతులకి 1957లో కుమారుడు సుభాష్ జన్మించాడు. శుభాంగి, నందిని అనే ఇద్దరు కుమార్తెలు కూడా ఉన్నారు. సుభాష్ వివాహం చారు అనే ఆమెతో జరిగింది. ఆ దంపతులకి కునాల్ అనే కొడుకు, అంకిత అనే కూతురు ఉన్నారు. శుభాంగిని అనిల్ సుబ్నిస్‌కు ఇచ్చి వివాహం చేశారు. వారికి ఇద్దరు పిల్లలు; కుమారుడు అంకిత్, కుమార్తె అమృత. నందిని రాజేష్ శృంగార్‌పూర్‌ను వివాహం చేసుకున్నారు. వీరికి రోహిత్ అనే ఒక కుమారుడు ఉన్నాడు.

సాయిబాబా ధ్యాసలో ఉంటూ, నిరంతరం ఆయన సహవాసంలో ఉండటం వలన ఒక వ్యక్తిని చూసి వారి భవిష్యత్తును పసిగట్టగలిగేవాడు నాచ్నే. ఒకసారి ప్రభాకర్ చౌబాల్ గారి కుమార్తె తార నాచ్నే ఇంటికి వచ్చి అతని పాదాలకు నమస్కరించింది. ఆమెను చూస్తూ నాచ్నే, "సొంత బంగ్లా ఉన్నవాడు నీకు భర్తగా వస్తాడు" అని అన్నాడు. అదే జరిగింది. ఆమె రావుబహదూర్ చిత్రే గారి ఇంటి కోడలైంది. ఆమె 86 ఏళ్లు జీవించి 2010, ఫిబ్రవరి 21న కన్నుమూసింది. ఆమె అసలు పేరు సుల్భా జయంత్ చిత్రే.

రవీంద్ర నాచ్నే భార్య పెళ్లికి ముందు ఒకసారి ఉంబర్‌గాఁవ్‌కు వచ్చినప్పుడు నాచ్నే ఆమెతో, "నీకు ప్రభుత్వ ఉద్యోగం వస్తుంద"ని చెప్పాడు. ఆమెకు వివాహం అయిన తరువాత థానేలో ఉంటున్నప్పుడు కలెక్టర్ కార్యాలయం నుండి ఇంటర్వ్యూ కోసం పిలుపు వచ్చింది. ఆ ఇంటర్వ్యూకి 20 మంది మహిళలు పాల్గొనగా ముగ్గురిని ఎంపిక చేశారు. వారిలో ఆమె కూడా ఒకరు. ఆ విధంగా బాబా ఆశీస్సుల వలన నాచ్నే చెప్పిన జోస్యం నిజమైంది.

శాంతారాం బల్వంత్ నాచ్నే 1958, జూన్ 26, గురువారంనాడు ముంబాయి మహానగరంలోని చెంబూర్‌లోని మహుల్ గ్రామంలో కన్నుమూశాడు. ఆరోజు విపరీతమైన వర్షం కురుస్తోంది. ఆ కారణంగా నాచ్నేని చివరిసారి చూసుకోవడానికి ఉదయం బయలుదేరిన బంధువులు ఆలస్యంగా సాయంత్రానికి చేరుకున్నారు. నాచ్నే తన చివరి క్షణాల్లో ప్యూన్ జానుమాత్రేతో తన అంతిమసంస్కారాల కోసం ఇంటిముందు ఉన్న మామిడిచెట్టును నరకమని చెప్పాడు. అయితే మామిడిచెట్టును తొలగించే విషయంలో కుటుంబసభ్యులు అభ్యంతరం వ్యక్తం చేశారు. కానీ ప్యూన్ జానుమాత్రే నాచ్నే తనకు ఆవిధంగానే చెప్పారని, అతని చివరి కోరిక మేరకు ఏది ఏమైనా తాను అలాగే చేస్తానని పట్టుబట్టి ఇతరుల సహాయంతో ఆ చెట్టును నరికాడు. అంతవరకూ భోరున కురుస్తున్న వర్షం విచిత్రంగా దహనసంస్కారాలు జరిగే సమయానికి ఆగిపోయింది. వర్షానికి బాగా తడిసిపోయి ఉన్న చెట్టు కూడా ఎటువంటి ఇబ్బంది కలగజేయకుండా దహనమైంది. శ్రీసాయిబాబా ఆశీస్సుల వల్లనే అంతా సజావుగా జరిగాయని అందరూ గ్రహించారు.

నాచ్నే మూడవ భార్య గులాబ్‌బాయి అలియాస్ ఇందిరాబాయి 1989 డిసెంబర్ 30న ప్రశాంతంగా కన్నుమూశారు. నాచ్నే రెండవ కుమారుడు సాయినాథ్ అలియాస్ హరేశ్వర్ 2000 నాటి చైత్ర మాసంలో కన్నుమూశాడు.

 source:  Personal Interview with Shri.Ravindra Shantaram Nachane Son of Late Shri.Shantaram Balavant Nachane, and Akhanda Shree Sai Krupa Marathi Book written and published by Shri.Ravindra Shantaram Nachane)
devotees experiences of saibaba by b.v. narasimha swamy.

 


ముందు భాగం కోసం

బాబా పాదుకలు తాకండి.




నిర్ధిష్టమైన భాగం కోసం పైన నెంబర్లను తాకితే, ఆ నెంబరుకి సంబంధించిన భాగం ఓపెన్ అవుతుంది.

 


తరువాయి భాగం కోసం

బాబా పాదాలు తాకండి.

5 comments:

  1. Om sai sri sai Jaya Jaya sai, om sai sri sai Jaya Jaya sai, om sai sri sai Jaya Jaya sai, om sai sri sai Jaya Jaya sai🙏🙏🙏🙏

    ReplyDelete
  2. Om sai ram, ofce lo anta bagunde la chayandi tandri anta prashantam ga unde la chayandi tandri pls, naaku surgery baga jarigi ika mundu ye problem rakunda chayandi tandri pls.amma nannalani kshamam ga chusukondi vaalla badyata meede tandri.

    ReplyDelete

సాయి మహారాజ్ సన్నిధి సోషల్ మీడియా లింక్స్:

Subscribe Here

బ్లాగ్ అప్డేట్ నోటిఫికేషన్స్ నేరుగా మీ మెయిల్ కే వచ్చేందుకు క్రింద బాక్సులో మీ మెయిల్ ఐడి టైపు చేసి subscribe పై క్లిక్ చేసి, తరువాత స్టెప్స్ పూర్తీ చేయండి.

Delivered by FeedBurner

Followers

Recent Posts


Blog Logo