సాయి వచనం:-

- శ్రీబాబూజీ.

సాయిభక్తుల అనుభవమాలిక - 347వ భాగం....


ఈ భాగంలో అనుభవాలు:
  1. బాబా కృపతో పోయిన బైక్ దొరికింది
  2. తృటిలో బాబా మమ్మల్ని కాపాడారు

బాబా కృపతో పోయిన బైక్ దొరికింది

సాయిభక్తుడు రవి తన అనుభవాన్ని మనతో ఇలా పంచుకుంటున్నారు:

ఓం సాయిరామ్! నేను ఉద్యోగరీత్యా నా తల్లిదండ్రులకు దూరంగా వేరే సిటీలో ఉంటున్నాను. ఒకరోజు ఉదయం 11 గంటల సమయంలో నా సోదరి ఫోన్ చేసి మా నాన్నగారి బైక్ పోయిందని చెప్పింది. ఒక్కసారిగా నేను నిశ్చేష్టుడినయ్యాను. అప్పటికే నేను చాలా పోగొట్టుకున్నప్పటికీ అవన్నీ పెద్ద నష్టాన్ని కలిగించలేదు. కానీ ఇది మాత్రం చాలా పెద్ద నష్టమని అనుకున్నాను. అయితే ఆరోజు నేను నా రోజువారీ పనుల్లో ఆలస్యం అయ్యాను. అప్పటికింకా బాబా పూజ కూడా పూర్తి చేయలేదు. ఆహారం తయారుచేసుకోవాల్సి ఉంది. కాబట్టి నేను మళ్ళీ మాట్లాడతానని నా సోదరికి చెప్పి ఫోన్ పెట్టేశాను. అప్పటినుండి నేను, "నాన్న బైక్‌ దొరికేలా చేయండి బాబా" అంటూ మనస్సులోనే సాయిని ప్రార్థించడం మొదలుపెట్టాను. బైక్ దొరికితే బ్లాగులో నా అనుభవాన్ని పంచుకుంటానని బాబాకి వాగ్దానం కూడా చేశాను. అయితే, కోల్పోయిన వస్తువులను తిరిగి పొందడం గురించి బ్లాగులో చదివానుగానీ, దొంగిలించబడినవి తిరిగి పొందినట్లు చాలా తక్కువ చదివాను.

ఆ తరువాత నేను ఏ ఫోన్ కాల్ వచ్చినా లిఫ్ట్ చేయడం మానేశాను. అందుకు కారణం, ముందు బాబా పూజ పూర్తి చేయాలని. అంతేకాదు, మన సద్గురుసాయి "ఖాళీ కడుపుతో పని చేయవద్ద"ని చెప్పారు. నేను ఆయన చెప్పినట్లు అనుసరిస్తాను. అందుకే పూజకు, ఆహారం తయారుచేసుకోవడానికి మొదటి ప్రాధాన్యతనిచ్చాను. ముందుగా నేను ఆహారాన్ని తయారుచేసుకుని, స్నానం చేసి పూజ పూర్తి చేశాను. పూజలో కూడా నేను, "నాన్న బైక్ తిరిగి దొరికేలా చేయండి సాయి తండ్రీ" అని ప్రార్థించాను. ఆ తరువాత భోజనం చేస్తూ నా మొబైల్‌ చూశాను. అప్పుడు, 'బైక్ దొరికింది' అని నా సోదరి నుండి వచ్చిన సందేశాన్ని చూసి ఆశ్చర్యపోయాను. ఇంతలోనే ఈ అద్భుతాన్ని ఎవరు చేయగలరు, మన సాయితండ్రి తప్ప?

ఇప్పుడు జరిగిన కథనాన్ని చెప్తాను. సాధారణంగా నాన్న రోజూ ఉదయం 6-7 గంటల మధ్య యోగాకు వెళతారు. ఆయన అక్కడినుండి 8 గంటలకు ఇంటికి వస్తారు. ఆరోజు కూడా అలాగే వచ్చారు. దాదాపు ఉదయం 10:30 గంటలకు ఆయన ఏదో పనిమీద బయటికి వెళ్లాలని చూస్తే బైక్‌ కనిపించలేదు. అంతటా వెతికి ఎక్కడా బైక్ కనిపించకపోవడంతో ఇంటి ఓనరుకి సమాచారం ఇచ్చారు. కొంతసేపటి తర్వాత ఇంటి ఓనర్ నాన్నతో, "రోడ్డుకు అవతలివైపు ఒక బైక్ కనిపిస్తోంది, వెళ్లి మీదేనేమో చూడండి" అని చెప్పారు. అప్పుడు ఉదయం 11:20 అయింది. నాన్న వెళ్లి చూస్తే, అది నాన్న బైకే! "దాన్ని ఎవరు తీసుకువెళ్లారు? అక్కడ ఎందుకు విడిచిపెట్టారు?" అనంటే అది సాయికి మాత్రమే ఎరుక.

నాన్నకు 67 ఏళ్ళ వయస్సు. ఆయన తన బైక్ లాక్ చేయడమైతే చేశారుగానీ, హ్యాండిల్ లాక్ చేయడం మర్చిపోయారు. ఇది గమనించిన ఎవరో వ్యక్తి అవకాశం తీసుకున్నాడు. 'కీ' లేనందున బైక్‌ స్టార్ట్ చేసే అవకాశం లేదు. కాబట్టి అతను బైక్‌ను దాదాపు 300 మీటర్ల వరకు నెట్టుకుంటూ వెళ్లి, అక్కడ వదిలేశాడు. ఇక్కడ నేను ఒక ముఖ్యమైన విషయం చెప్పాలనుకుంటున్నాను. అతను గనక బైక్‌ను మరో 100 మీటర్ల దూరం నెడితే, అక్కడ బైక్ రిపేర్ సెంటర్ ఉంది. వాళ్ళు కీ లేకుండానే బైక్ స్టార్ట్ చేసి ఇవ్వగలరు. కానీ అలా జరగలేదు. అతను బైక్ ఎందుకు తీసుకువెళ్ళాడో, అక్కడ ఎందుకు విడిచిపెట్టాడో సాయికే ఎరుక.

నేను బైక్ పోయిందని తెలిసినప్పటినుండి బైక్‌ దొరికిందన్న మెసేజ్ చూసే వరకు ఏ పని చేస్తున్నా  సాయిని ప్రార్థిస్తూ గడిపాను. నా సాయి కరుణ చూపారు, మా బైక్ మాకు దొరికింది. నేను వాగ్దానం చేసినట్లుగా ఈ అనుభవాన్ని మీతో పంచుకుంటున్నందుకు చాలా ఆనందంగా ఉంది. "ధన్యవాదాలు సాయి తండ్రీ! నా జీవితం మీ పవిత్రపాదాలకు సమర్పించుకున్నాను. మీ ఆశీస్సులు సదా మాపై కురిపించండి".

అనంతకోటి బ్రహ్మాండనాయక రాజాధిరాజ యోగిరాజ పరబ్రహ్మ శ్రీ సచ్చిదానంద సద్గురు సాయినాథ్ మహరాజ్ కీ జై!

source:http://www.shirdisaibabaexperiences.org/2019/12/shirdi-sai-baba-miracles-part-2564.html

తృటిలో బాబా మమ్మల్ని కాపాడారు

పేరు వెల్లడించని ఒక సాయిభక్తురాలు బాబా తనకు ఇటీవల ప్రసాదించిన ఒక అనుభవాన్ని మనతో పంచుకుంటున్నారు.

సాయిరామ్! ఇటీవల నాకు జరిగిన ఒక అనుభవాన్ని మీ అందరితో పంచుకోవాలనుకుంటున్నాను. సాధారణంగా నా భర్త చాలా జాగ్రత్తగా కారు నడుపుతారు, ఎప్పుడో కొన్ని సందర్భాలలో మాత్రమే కాస్త దురుసుగా డ్రైవ్ చేస్తారు. 2020, ఫిబ్రవరి 29, శనివారంనాడు మేము తిరుపతి నుండి బెంగళూరుకు వస్తున్నాము. మేము హొసకోటె చేరుకున్నాక అకస్మాత్తుగా మావారు కారు వేగాన్ని పెంచారు. అనుకోకుండా వేగంగా పోతున్న మా కారుకి చాలా దగ్గరగా ఒక లారీ అతివేగంగా వచ్చేసింది. అదృష్టవశాత్తూ రెప్పపాటుకాలంలో లారీ డ్రైవర్ వేగాన్ని అదుపులోకి తెచ్చుకున్నాడు. లేకపోతే పరిస్థితిని ఊహించే ధైర్యం కూడా నేను చేయలేను. అంతా బాబా దయ. బాబాయే మమ్మల్ని రక్షించారని నేను గట్టిగా నమ్ముతున్నాను. మేము కారు ఎక్కుతూనే నేను 'సాయిరామ్' అని జపించడం మొదలుపెట్టాను. కానీ సరిగ్గా సంఘటన జరిగే సమయానికి మేము కొన్ని కుటుంబ విషయాల గురించి చర్చించుకుంటున్నాము. మేము ఏమరుపాటుగా ఉన్నప్పటికీ బాబా మమ్మల్ని రక్షించారు. "తృటిలో మమ్మల్ని కాపాడినందుకు ధన్యవాదాలు బాబా. దయచేసి, నన్ను, నా కుటుంబాన్ని ఆశీర్వదించండి. ఎప్పుడూ మాకు మీరు అండగా ఉండండి బాబా".


3 comments:

  1. అనంతకోటి బ్రహ్మాండనాయక రాజాధిరాజ యోగిరాజ పరబ్రహ్మ శ్రీ సచ్చిదానంద సద్గురు సాయినాథ్ మహరాజ్ కీ జై!

    ReplyDelete

సాయి మహారాజ్ సన్నిధి సోషల్ మీడియా లింక్స్:

Subscribe Here

బ్లాగ్ అప్డేట్ నోటిఫికేషన్స్ నేరుగా మీ మెయిల్ కే వచ్చేందుకు క్రింద బాక్సులో మీ మెయిల్ ఐడి టైపు చేసి subscribe పై క్లిక్ చేసి, తరువాత స్టెప్స్ పూర్తీ చేయండి.

Delivered by FeedBurner

Followers

Recent Posts


Blog Logo