సాయి వచనం:-

- శ్రీబాబూజీ.

సాయి అనుగ్రహసుమాలు - 314వ భాగం


ఖపర్డే డైరీ - ముందుమాట

విమలాశర్మ గారు రచించిన "దేవుడున్నాడు లేడంటావేం!" అనే పుస్తకంలోని ఖాపర్డే డైరీని నేటి నుండి పాఠకుల ముందుంచుతున్నాము. చదివి బాబా ప్రేమను ఆస్వాదించండి.

🌸 శ్రీగణేష్ శ్రీకృష్ణ ఖపర్డే🌸



గౌరవనీయులైన శ్రీ గణేష్ శ్రీకృష్ణ ఖపర్డే ప్రఖ్యాతి చెందిన గొప్ప క్రిమినల్ లాయరు. నిజానికి ఆరోజుల్లో ఖపర్డేకు ఈ ప్రాక్టీసుతో ఎంతో ఆదాయం కూడా ఉండేదట. అంతేకాక, లోకమాన్య బాలగంగాధర్ తిలక్ బర్మాలోని మండలి జైలులో శిక్షను అనుభవిస్తున్నప్పుడు ముఖ్య సహాయకుడుగా కూడా గుర్తింపు పొందాడు. సెంట్రల్ లెజిస్లేటివ్ అసెంబ్లీలో ఈయన సభ్యుడు. చక్కటి వాక్పటిమ గల వక్త. శ్రీ ఖపర్డే సంస్కృతమూ, మరాఠీ కూడా బాగా చదువుకున్నవాడు. ఈ రెండు భాషల్లోనూ ఆధ్యాత్మిక విషయాలకు సంబంధించిన గొప్ప గ్రంథాలలో బాగా పాండిత్యం ఉన్నవాడు. విద్యారణ్యస్వామి వ్రాసిన 'పంచదశి'పై ఈయనకున్న తీవ్రమైన వివరణా సామర్థ్యాన్ని గురించిన ప్రస్తావన హేమాడ్‌పంత్ విరచిత శ్రీసాయి సచ్చరిత్రలో (27వ అధ్యాయం) ఉంది.

శ్రీ ఖపర్డే, ఈయన భార్య ఇద్దరూ శ్రీ సాయిబాబాకు మంచి భక్తులు. వీరు శిరిడీని ఎన్నోసార్లు దర్శించినా, రెండుసార్లు మాత్రం ఎక్కువ రోజులు గడిపారు. 1910లో శిరిడీలో ఒకసారి ఏడు రోజులున్నారు. మళ్ళీ 1911లో మూడు, నాలుగు నెలలున్నారు. ఈ రెండు సందర్భాల్లో కూడా శ్రీ ఖపర్డే వివరంగా వ్రాసి పెట్టుకున్న డైరీ ప్రస్తుతం మనకో చారిత్రాత్మకమైన ప్రాముఖ్యతను సంతరించిపెట్టింది. ఈ రచనలోని శైలి, ముఖ్యంగా తన వ్యక్తిగత భావాల, ప్రతిస్పందనల వ్యక్తీకరణలో గుంభనంగా ఉండటం - ఇవన్నీ చూస్తుంటే బహుశా ఇది భవిష్యత్తులో తను గుర్తుపెట్టుకోవటానికి వీలుగా ఆయన వ్రాసిపెట్టుకున్నాడనే అనిపిస్తుందిగానీ, ఇది ప్రచురింపబడాలని ఆయన ఎప్పుడూ అనుకున్నట్లుగా తోచదు. అయినప్పటికీ శ్రీసాయిబాబా సాన్నిధ్యాన్ని మనకు అందించటంలోనూ, మనసుకు హత్తుకునే బాబా వ్యాఖ్యానాలనీ, సామెతల ద్వారా ఇచ్చే బాబా బోధనూ, వీటన్నిటినీ మించి మానవాళిపై బాబాకున్న అమితమైన ప్రేమను అందించటంలోనూ ఇది విఫలమవలేదు. ఆరోజుల్లోని వాతావరణం మనకోసం ఈ పేజీల్లో తిరిగి సృష్టించబడింది. దురదృష్టవశాత్తూ ఆల్ ఇండియా సాయి సమాజ్, మద్రాసు వారిచేత పుస్తక రూపంలో ప్రచురించబడి కూడా ప్రస్తుతం ఇది లభ్యం కావటం లేదు. అందుకని 1985 ఆగస్టు నుండి 1986 ఫిబ్రవరి వరకు శ్రీసాయిలీలా పత్రికలో తిరిగి ప్రచురింపబడింది. తెలుగులో ఆచార్య భరధ్వాజ గారు శ్రీసాయిలీలామృతంలోనూ, శ్రీసాయిసన్నిధిలోనూ కొంత భాగం తెనిగించారు. కానీ పూర్తిగా ఎక్కడా ప్రచురించబడలేదు. భక్తుల సౌకర్యార్థం ఇప్పుడు ఈ డైరీ యథాతథంగా తెనిగించబడుతోంది.

వ్యక్తిగతంగా నాకీ డైరీ అంటే చాలా అభిమానం. సాయి సమాధి చెందకముందు రోజుల్లోకి - ఆ శిరిడీ - ఆ ప్రశాంతమైన సాయి సన్నిధి - సాయి ప్రేమను నింపుకొన్న ఆ వాతావరణమూ - భక్తి పొంగిపొరలే ఆ గురుస్థానమూ - అందరికి 'అమ్మ'యై వెచ్చని ప్రేమను పంచిచ్చే ఆ ద్వారకామాయీ, ఇంతెందుకు, మనం మన సాయితో జీవిస్తాం, వారి మమతానురాగాల్లో మమేకమైపోతాం. మరో ముఖ్యమైన విషయం - మనం ఎన్ని చరిత్ర గ్రంథాలు చదివినా, ప్రతి గ్రంథంలోనూ మనం మనకెవరికీ ఇష్టం లేని - మనం భరించలేని, మన గుండెలు బ్రద్దలయే ఆ సాయిసమాధి ఘట్టాన్ని చదవాల్సిందే, కానీ ఈ గ్రంథంలో ప్రత్యేకత - ఇందులో సాయి సజీవులై శాశ్వతంగా మన హృదయాల్లో చిరస్థాయిగా ఉంటారేకానీ - సమాధి చెందరు!! (ఇది 1911లో వ్రాసిన డైరీ కదా మరి) అందుకే ఇది నాకు ప్రాణాధికం. దీన్ని చదివిన అందరికీ ఇది అలాంటి మధురానుభూతినే కలిగించి సాయి సన్నిధిని ప్రసాదిస్తుందని నా ప్రగాఢ విశ్వాసం.

రేపటి నుండి డైరీలోని విశేషాలు.... 

 source:  "దేవుడున్నాడు లేడంటావేం!" బై విమలాశర్మ.

3 comments:

సాయి మహారాజ్ సన్నిధి సోషల్ మీడియా లింక్స్:

Subscribe Here

బ్లాగ్ అప్డేట్ నోటిఫికేషన్స్ నేరుగా మీ మెయిల్ కే వచ్చేందుకు క్రింద బాక్సులో మీ మెయిల్ ఐడి టైపు చేసి subscribe పై క్లిక్ చేసి, తరువాత స్టెప్స్ పూర్తీ చేయండి.

Delivered by FeedBurner

Followers

Recent Posts


Blog Logo