సాయి వచనం:-

- శ్రీబాబూజీ.

సాయిభక్తుల అనుభవమాలిక 362వ భాగం....


ఈ భాగంలో అనుభవాలు:
  1. సాయి నాతో ఉన్నందుకు నేను ఎంతో గర్వపడుతున్నాను
  2. అర్పణ చేసుకునే భాగ్యాన్నిచ్చిన బాబా

సాయి నాతో ఉన్నందుకు నేను ఎంతో గర్వపడుతున్నాను

ఒక సాయిభక్తుడు తన అనుభవాన్ని ఇలా పంచుకుంటున్నారు:

ఓం సాయిరామ్! నేను సాధారణ సాయిభక్తుడిని. పదేళ్ల వయస్సు నుండి నాకు బాబా తెలుసు. ఆ వయస్సులో నేను "మామూలు మనిషిలా దుస్తులు ధరించిన ఈ తాతని దేవుడిలా ఎలా పూజిస్తారో?" అని ఆశ్చర్యపోయేవాడిని. కానీ తరువాత రోజుల్లో నా సద్గురు సాయినాథుడు చాలా అద్భుతాలను చూపించారు. ఆయన రక్షణలో ఉన్న ఎవరైనా జీవితంలో ఎప్పుడూ ఆనందాన్ని పొందుతారు.

నేను ఒక మధ్యతరగతి కుటుంబానికి చెందినవాడిని. మాకు తిండిపెట్టి పోషించేది నా తల్లి. ఎందుకంటే నా తండ్రికి ఉద్యోగం లేదు. ఆయన ఉద్యోగం కోసం చాలా ప్రయత్నించారు గానీ, వ్రాయడంలో తన అసమర్థత కారణంగా ఉద్యోగం పొందలేకపోయారు. నేను 12వ తరగతి చదువుతున్నప్పుడు మేము తీవ్రమైన అప్పుల బాధలు ఎదుర్కోవలసి వచ్చింది. ఆ పరిస్థితుల వలన చదువులో నేను మంచి మార్కులు తెచ్చుకోవడానికి ఎంతో ఒత్తిడి అనుభవించాను. నిరంతర ఒత్తిడి కారణంగా ఒకరోజు నేను రోడ్డుమీద స్పృహతప్పి పడిపోయాను. బాబా దయవల్ల ఒక వృద్ధుడు నేను మా ఇంటికి చేరుకోవడానికి సహాయం చేశాడు. ఆ విషయం నేను మా అత్తతో చెప్పినప్పుడు ఆమె నాతో, "ఆ వృద్ధుడు మరెవరో కాదు, ఆ సాయినాథుడే! ఆ క్లిష్ట పరిస్థితిలో నీకు సహాయపడి తన ఉనికిని తెలియజేశారు" అని చెప్పింది. ఆరోజు నుండి నేను సాయిబాబాను హృదయపూర్వకంగా ప్రార్థించడం ప్రారంభించాను. నాకు ఇబ్బందులు వచ్చినప్పుడల్లా సాయి సచ్చరిత్ర చదవడం మొదలుపెడతాను. నేను ఆ పుస్తకాన్ని కౌగిలించుకుని పడుకున్న రోజులు చాలా ఉన్నాయి. ఎంతో మానసిక ఒత్తిడి అనుభవించినప్పటికీ, బాబా దయవలన నేను 89 శాతం మార్కులు సాధించాను. ఒక ప్రసిద్ధ ఇంజనీరింగ్ కళాశాలలో నాకు సీటు వచ్చింది. ఆ రోజుల్లో కూడా మేము పేదరికంలో ఉన్నాము. కానీ, మా సాయినాథుడు అప్పుడే పుట్టిన తన పిల్లలను తల్లిపక్షి ఎలా రక్షిస్తుందో అలా మాకు రక్షణనిచ్చారు. అటువంటి సద్గురువు నాకున్నందుకు నేను ఎంతో గర్వపడుతున్నాను.

నేను ట్యూషన్ చెప్పడం మొదలుపెట్టి కుటుంబానికి కొంత సహాయాన్ని అందించడం మొదలుపెట్టాను. కళాశాల చివరి సంవత్సరంలో కాలేజీ ప్లేస్‌మెంట్స్ జరుగుతున్నప్పుడు నేను ఆప్టిట్యూడ్ పరీక్ష బాగా వ్రాయలేక పోయినందున మంచి కంపెనీలో ఉద్యోగం పొందలేకపోయాను. తరువాత ఒక సంవత్సరం గడిచిపోయినా నేను నిరుద్యోగిగా మిగిలిపోయాను. ప్రతిరోజూ నాకు నరకంలా గడిచేది. ఆ సమయంలో నేను ప్రతిరోజూ బాబా గుడికి వెళ్ళడం ప్రారంభించాను. ఆయన అనుగ్రహం వలన చివరికి 2018లో నేను నా ఇంజనీరింగ్ కోర్సుకు సంబంధించిన ఒక చిన్న కంపెనీలో చేరాను. అయితే రోజూ దూరప్రయాణం చేయాల్సిన కారణంగా నేను 8 నెలలకు మించి అక్కడ కొనసాగలేకపోయాను. మళ్ళీ మూడునెలలపాటు నేను నిరుద్యోగిగా ఉన్నాను. అప్పుడు నేను ఒక డిజైనింగ్ కోర్సులో చేరాను. బాబా దయవలన ఆ కోర్సుకు చాలా డిమాండ్ ఉంది. ఒకప్పుడు నేనెప్పటికీ ఉద్యోగం పొందలేననుకున్న కంపెనీలు ఇప్పుడు నా అందుబాటులోకి వచ్చాయి. నేను అంతకుముందు సంపాదించిన దానికంటే 30 శాతం ఎక్కువ జీతం ఆశించి చాలా ఇంటర్వ్యూలకు హాజరయ్యాను. బాబా ఆశీస్సులతో కాంట్రాక్టు ఉద్యోగిగా ఒక మంచి సంస్థలో చేరాను. బాబా దానిని పర్మినెంట్ ఉద్యోగంగా మారుస్తారని ఆశిస్తున్నాను. ఎప్పుడైనా బాబా మనలను అనుగ్రహించనట్లు కనపడినా అది మనం ఎదురుచూస్తున్న దానికంటే ఎక్కువ ఇవ్వడానికే!

జై సచ్చిదానంద సద్గురు సాయినాథ్ మహరాజ్ కీ జై!

source: http://www.shirdisaibabaexperiences.org/2020/01/shirdi-sai-baba-miracles-part-2591.html

అర్పణ చేసుకునే భాగ్యాన్నిచ్చిన బాబా

పేరు వెల్లడించని ఒక సాయిభక్తురాలు తన అనుభవాన్ని ఇలా పంచుకుంటున్నారు:

సాయిబంధువులందరికీ నమస్కారం. నేను బాబాకి చిన్న భక్తురాలిని. నేను 2020, ఫిబ్రవరిలో సాయి దివ్యపూజ మొదలుపెట్టాను. మార్చి 12వ తేదీతో 5 వారాల పూజ పూర్తయింది. ఆ సందర్భంగా కిచిడీ తయారుచేసి ముందుగా బాబాకి నివేదించి ఐదుగురికి పెట్టాను. ఆరోజే 'సాయి టీవీ' తరపున మొదటిరోజు శ్రీరామనవమికి గోధుమలు అర్పణ చేసుకునే అవకాశం లభించడంతో నాకు చాలా చాలా సంతోషంగా అనిపించింది. ప్రతిసారీ నేను ఒక్కదాన్నే బాబాకి అర్పణం చేసేదాన్ని. కానీ ఈసారి నా భర్త, పిల్లలతో కలిసి అర్పణం చేసుకునే భాగ్యాన్ని బాబా ఇచ్చారు. "ఈ అవకాశం ఇచ్చిన మీకు చాలా చాలా కృతజ్ఞతలు బాబా!"

అఖిలాండకోటి బ్రహ్మాండనాయక రాజాధిరాజ యోగిరాజ పరబ్రహ్మ శ్రీ సచ్చిదానంద సద్గురు సాయినాథ్ మహరాజ్ కీ జై!


2 comments:

సాయి మహారాజ్ సన్నిధి సోషల్ మీడియా లింక్స్:

Subscribe Here

బ్లాగ్ అప్డేట్ నోటిఫికేషన్స్ నేరుగా మీ మెయిల్ కే వచ్చేందుకు క్రింద బాక్సులో మీ మెయిల్ ఐడి టైపు చేసి subscribe పై క్లిక్ చేసి, తరువాత స్టెప్స్ పూర్తీ చేయండి.

Delivered by FeedBurner

Followers

Recent Posts


Blog Logo