సాయి వచనం:-

- శ్రీబాబూజీ.

సాయిభక్తుల అనుభవమాలిక - 342వ భాగం....


ఈ భాగంలో అనుభవం:
  • సబ్ కా మాలిక్ ఏక్

ఒక అజ్ఞాత సాయిభక్తురాలు తన అనుభవాన్ని ఇలా పంచుకుంటున్నారు:

సాయిభక్తులందరికీ ఓం సాయిరామ్! గత ఐదేళ్ళుగా నేను సాయిభక్తురాలిని. నేను ఈరోజు జీవిస్తున్న జీవితం బాబా కృపే. నేనిప్పుడు నా జీవితానుభవాన్ని మీ అందరితో పంచుకోవాలనుకుంటున్నాను.

నేను సాయిబాబాను నమ్మేవాళ్ళంటూ లేని కుటుంబానికి చెందినదాన్ని. కుటుంబంలో ప్రతి ఒక్కరికి వారి వారి గురువులు ఉన్నారు, నమ్మకాలూ ఉన్నాయి. కానీ మంచి విషయం ఏమిటంటే, మా అమ్మ 'దేవుడు ఒక్కడే, మానవత్వమే అసలైన మతం' అని నాకు చెప్పేది. అదే నా మనసులో నాటుకుంది. నేను చిన్నవయసులో ఉన్నపుడు టీవీలో సాయిబాబాకి సంబంధించిన ఒక సీరియల్ వస్తుండేది. నేను క్రమంతప్పకుండా ఆ సీరియల్ చూస్తుండేదాన్ని. అమ్మ జీవితం పట్ల చెప్పే విషయాలు, బాబా బోధనలు ఒకేలా అనిపించి, క్రమంగా నేను బాబా బోధనల పట్ల ఆకర్షితురాలినయ్యాను. నా హైస్కూల్ చదువు పూర్తయింది. సరిగ్గా అదే సమయంలో మా అమ్మ రోడ్డు ప్రమాదానికి గురై తన కుడికాలిని కోల్పోయింది. దాంతో ఇంటి బాధ్యత నా మీద పడింది. దాంతో టీవీ చూడటం, ఇంకా ఇతర కాలక్షేపాలు పోయాయి. చదువు, ఇంటి పనులతో బిజీ అయిపోయాను. ఆ స్థితిలో బాబా సీరియల్ మీద దృష్టి పెట్టలేకపోయాను. తరువాత నేను పైచదువులలో బిజీగా ఉన్న సమయంలో నా వివాహం నిశ్చయమైంది. వివాహం మా సొంత ఊరిలో అనుకున్నారు. నేనప్పుడు వేరే ఊరిలో ఉన్నాను. వివాహానికి కొన్నిరోజుల ముందు నేను ఇంటికి బయలుదేరుతున్నప్పుడు హఠాత్తుగా నాకు ఒక లేఖ వచ్చింది. పంపినవారి పేరు చూస్తే 'సాయిబాబా' అని ఉంది. నేను ఆశ్చర్యంగా కవరు తెరిచాను. అందులో కేవలం ఒక వాక్యం టైపు చేసి ఉంది. అదేమిటంటే, 'నువ్విప్పుడు ఏదైతే చేయబోతున్నావో, దయచేసి దానిని చేయవద్దు. అది జరిగితే నువ్వు ఇబ్బందుల్లో పడతావు' అని. అది చదివి, 'ఇప్పుడు నేను పెళ్లి చేసుకోవాలా, వద్దా' అని కాస్త కలత చెందాను. నేను మా అమ్మతో ఈ విషయాన్ని చెప్పి, ఆ లేఖను చూపించాను. సాయిపై నమ్మకంలేని ఆమె, "దీనిగురించి అంతగా ఆలోచించవద్దు, దేవునిపై నమ్మకముంచు. సంతోషంగా సంప్రదాయబద్ధంగా వివాహం చేసుకో"మని చెప్పింది. నేను అలాగే చేసి కొత్త జీవితాన్ని ప్రారంభించాను. నా అత్తమామలు కూడా సాయిభక్తులు కాదు. వివాహం తరువాత నేను నా చదువు, ఉద్యోగం వేట, ఇంటి బాధ్యతలలో పడి నెమ్మదిగా ఆ లేఖ గురించి మరచిపోయాను. వ్యక్తిగతంగా నా జీవితంలో ఆనందం, ప్రశాంతత ఎప్పుడూ లేవు. స్పష్టంగా చెప్పాలంటే నేను నా భర్తతో సంతోషంగా లేను, నా వంతు ప్రయత్నం చేస్తూ సర్దుకుపోతుండేదాన్ని.

వివాహమైన ఆరు సంవత్సరాల తరువాత నేను గర్భం దాల్చాను. ఆరునెలల గర్భవతిగా ఉన్నప్పుడు ఒకరోజు నేను సాయి పల్లకిని చూశాను. భక్తులు సంబరాలు జరుపుకుంటూ రోడ్డు మీద సాయి పల్లకి తీసుకువెళ్తుంటే చూసిన నాకు అది ఏమిటో ఆ క్షణం అర్థం కాలేదు. కానీ హృదయంలో బాబాకు నమస్కరించాను. కొన్నిరోజుల తరువాత మా పక్కింటివాళ్ళు శిరిడీ నుండి ఒక సాయిబాబా ఫోటో, ప్రసాదం తీసుకొచ్చి నాకు ఇచ్చారు. నేను బాబా ఫోటోను పూజామందిరంలో ఉంచాను. అది నా భర్తకు నచ్చలేదు. దానితో నేను ఆ బాబా ఫోటోను భద్రంగా నా బ్యాగులో దాచుకున్నాను.

బాబా దయవలన కొన్నిరోజుల తర్వాత నా భర్త నా జీవితాన్ని నరకంగా మార్చేస్తున్నారని తెలిసింది. అతను నాపై చేతబడి వంటివి చేయిస్తున్నట్లుగా నాకు చాలా సాక్ష్యాలు దొరికాయి. అంతకుముందెప్పుడూ నేను అలాంటి విషయాలను నమ్మలేదు, వాటివలన బాధపడలేదు. అలాంటిది హఠాత్తుగా నా భర్త చేస్తున్న విషయాలు తెలిసి నేను చాలా బాధను అనుభవించాను. ఒకరోజు నా బాధను నా స్నేహితురాలితో పంచుకున్నాను. ఆమె సాయిభక్తురాలు. ఆమె నాతో, "సాయిపై భారం వేసి, సాయివ్రతాన్ని మొదలుపెట్టమ"ని చెప్పింది. నా తల్లిదండ్రులు కూడా జ్యోతిష్కుడిని సంప్రదించి నా సమస్యల గురించి చెప్పారు. అతను సాయిబాబా ముందు దీపం వెలిగించి, గురువారం ఉపవాసముండి పూజ చేయమని చెప్పాడు. ఇంట్లో వాళ్లకు ఇష్టం లేకపోయినా నేను బలవంతంగా 2014లో వ్రతాన్ని ప్రారంభించాను. వ్రతం మొదలుపెట్టిన మొదటిరోజే సాయిబాబా కలలో దర్శనమిచ్చి ప్రేమగా, "ఇకపై చింతించకు. నేను ఉన్నాను. ఎవ్వరూ నీకు ఏ హానీ తలపెట్టలేరు" అని భరోసా ఇచ్చారు. ఆరునెలలు గడిచేసరికి నా ఆలోచనా విధానంలో, ఆత్మవిశ్వాసంలో పెద్ద మార్పు వచ్చింది. నేను నా భర్తతో విడాకులు తీసుకోవాలని నిర్ణయం తీసుకున్నాను. సాయితల్లితో, నా 11 సంవత్సరాల కూతురితో కొత్త జీవితాన్ని ప్రారంభించాను. అప్పటినుండి నేను సాయిమందిరానికి వెళ్తూ, సాయినామాన్ని జపిస్తూ, నవగురువార వ్రతం చేస్తూ, సాయిసచ్చరిత్ర చదువుతూ నా సాయి ధ్యాసలో ఆనందంగా ఉన్నాను. నెమ్మదిగా నా కూతురు కూడా నన్ను అనుసరిస్తూ నేను చేసేవి చేయడం ప్రారంభించింది. ఇప్పుడు ఆమె ఆత్మవిశ్వాసంలో కూడా చాలా తేడా వచ్చింది. ఈ సంవత్సరం ఆమె చాలా పేరున్న పాఠశాలకు ఎంపికై అక్కడ చదువుకోబోతోంది. ఐదేళ్ళకు ముందు జీవితంలో ఇంత పెద్ద మార్పు మేము ఊహించలేదు. ఇదంతా సాయిబాబా ఆశీర్వాదం వల్లనే. సాయి ఎప్పుడూ నాకు అండగా ఉంటూ నన్ను నడిపిస్తున్నారని ఇప్పుడు నాకు అనిపిస్తుంది. "బాబా! మీరు నాపై చూపుతున్న కృపకు వేలవేల కృతజ్ఞతలు".


2 comments:

సాయి మహారాజ్ సన్నిధి సోషల్ మీడియా లింక్స్:

Subscribe Here

బ్లాగ్ అప్డేట్ నోటిఫికేషన్స్ నేరుగా మీ మెయిల్ కే వచ్చేందుకు క్రింద బాక్సులో మీ మెయిల్ ఐడి టైపు చేసి subscribe పై క్లిక్ చేసి, తరువాత స్టెప్స్ పూర్తీ చేయండి.

Delivered by FeedBurner

Followers

Recent Posts


Blog Logo