సాయి వచనం:-

- శ్రీబాబూజీ.

శ్రీవాసుదేవ సదాశివ జోషీ



షోలాపూర్‌లోని సత్యనారాయణ కంపెనీలో శ్రీవాసుదేవ సదాశివ జోషీ మేనేజరుగా పనిచేసేవాడు. స్వభావరీత్యా దైవచింతనగలవాడు. సాధుశీలి. ఒకసారి యాదృచ్ఛికంగా ఆయనకు ప్రముఖ సాయిభక్తుడైన శ్రీచిదంబర్ కేశవ్ గాడ్గిల్‌తో  పరిచయం కలిగింది. శ్రీగాడ్గిల్ ద్వారా బాబాను గురించి విన్నాడు. అప్పటినుండి జోషీ హృదయంలో శ్రీసాయి దర్శనం చేసుకోవాలనే తహతహ కలిగింది. అయితే, పరిస్థితులు అనుకూలించకపోవడంచేత, వెంటనే శిరిడీ వెళ్ళేందుకు అతనికి వీలు కుదరలేదు. తరువాత కొంతకాలానికి, (1913లో) శిరిడీలో నామసప్తాహం జరుగుతున్నదనీ, ఖర్చవుతుందని వెనుకాడకుండా వెంటనే శిరిడీ రమ్మని శ్రీగాడ్గిల్ శిరిడీ నుండి జోషీకి ఉత్తరం వ్రాశాడు. ఆ ఉత్తరం చూశాక, ఇక బాబాను దర్శించాలనే ఆరాటం పట్టలేక, ప్రయాణ ఖర్చులకు ఎలాగో ఒక పది రూపాయలు సమకూర్చుకొని శిరిడీ చేరాడు జోషీ. అతనికి సాఠేవాడాలో బస ఏర్పాటైంది. స్నానాదులు పూర్తిచేసుకొని పూజాద్రవ్యాలతో మసీదు చేరే సమయానికి బాబాకు సాయంత్ర ఆరతి జరుగుతున్నది. ఆ సమయంలో జోషీకి నరసింహస్వామిలా దర్శనమిచ్చారు బాబా. బాబా ముఖం మాత్రం నరసింహమూర్తిలా వున్నది. తక్కిన దేహం మామూలుగానే (సాయిరూపంలో) కనిపించింది. జోషీ తనను తాను మరచిపోయి ఆరతి జరుగుతున్నంతసేపు దివ్యానందములో బాబాకేసి అలానే కన్నార్పకుండా చూస్తుండిపోయాడు. “ఆరతి అయిపోయింది, ఇక బయలుదేరు” అంటూ శ్రీగాడ్గిల్ కుదిపి లేపితేగానీ అతనికి బాహ్యస్మృతి కలుగలేదు. ఆ తరువాత కూడా కూర్చున్నా, నడుస్తున్నా, ఏ పనిచేస్తున్నా మసీదులో తనకు కలిగిన ఆ దివ్యదర్శనం అలానే తన కళ్ళముందు సాక్షాత్కరిస్తున్నది. 

జోషీ తన అనుభవాన్ని గాడ్గిల్‌తో చెప్పాడు. దానికి గాడ్గిల్, “బాబా ఇలాంటి గమ్మత్తులు చాలా చేస్తుంటారులే! నీవు మాత్రం అంతటితో తృప్తిపడక బాబాను ఇంకా గట్టిగా పట్టుకో!” అన్నాడు. ఆ తరువాత కూడా వరుసగా మూడు రోజులు ఉదయం, సాయంత్రం బాబా అలానే జోషీకి దర్శనమిచ్చారు. దృశ్యాదృశ్యజగత్తంతా భగవంతుని లీల అనే ఎఱుక, ఏదో తెలియని దివ్యపారవశ్యం - అలా, జోషీకి శిరిడీలో రోజులు గడిచిపోతున్నాయి. జోషీ ఇక తిరిగి షోలాపూరు బయల్దేరాల్సిన రోజు వచ్చింది. ప్రయాణానికి సిద్ధమవుతుంటే, అతనితో శ్రీసాఠే, “బాబా అనుమతి లేకుండా శిరిడీ వదలి వెళ్ళడం మంచిది కాద”ని అన్నాడు. దాంతో, బాబా అనుమతి కోసం మసీదుకు బయలుదేరాడు జోషీ. అప్పుడు అక్కడ వాడాలో ఉన్న సాటి భక్తులు ‘అనుమతితో బాటు బాబాను ఏదైనా కోరిక కోరుకొమ్మ’ని సలహా ఇచ్చారు. “బాబా దర్శనమే నా చిరకాల వాంఛ. అది నాకు నెరవేరింది. నాకిప్పుడు పరమానందంగా ఉంది. నాకింకేమీ అడగాలనిపించడంలేదు!” అన్నాడు జోషీ, కనీసం తాను పనిచేసే కంపెనీ శ్రేయస్సుకోసమైనా అడగమన్నారు సాటి భక్తులు. ఎందుకో అది కూడా అడగాలనిపించడం లేదన్నాడు జోషీ. తరువాత అతను మసీదు చేరాడు. అప్పుడు మధ్యాహ్నం సుమారు రెండు గంటలవుతున్నది. ఆ సమయంలో మసీదులో చాలామంది భక్తులు వున్నారు. అక్కడున్నవారు అతనిని గాడ్గిల్ మిత్రుడని బాబాకు పరిచయం చేసి, అతను పనిచేసే కంపెనీకి ఆశీస్సులివ్వమని అడిగారు. దానికి బాబా, “ఆ నారాయణుని దయవల్ల ఇతనికి అన్నపానీయాలకు లోటులేదు. ఇక, ఏదో ‘అడుగు, అడుగు’ అని అతన్ని ఎందుకు బలవంతపెడతారు?” అన్నారు. ‘వాడాలో తమ మధ్య జరిగిన సంభాషణ బాబాకు ఎలా తెలిసిందా?’ అని అందరూ ఆశ్చర్యపోయారు.

ఇంటికి తిరిగి వెళ్ళడానికి బాబా అనుమతి కోరాడు జోషీ. దానికి బాబా, “ఏ కోరికా లేకుండా (నిరపేక్షబుద్ధితో) శిరిడీకి వచ్చేవాళ్ళు ఎప్పుడైనా రావచ్చు, ఎప్పుడైనా వెళ్ళవచ్చు! వాళ్ళు నా అనుమతి అడగాల్సిన అవసరంలేదు!" అన్నారు ప్రసన్నంగా.

ఆరోజు గురువారం. బాబా ప్రసాదం ఇంటికి తీసుకెళ్ళమని చెప్పాడు గాడ్గిల్. ప్రసాదం కోసం శ్రీబాపూసాహెబ్ జోగ్ వద్దకెళ్ళాడు జోషీ. శ్రీజోగ్ అతనికి మూడు పాలకోవా బిళ్ళలు ఇచ్చాడు. ఇంట్లో వాళ్ళందరికీ అవి సరిపోవేమోనని జోషీ ఆలోచిస్తుంటే, అతనితో శ్రీగాడ్గిల్, “ఆ ప్రసాదంతో పాటు ఒక 8 అణాలకు పాలకోవా బిళ్ళలు అంగట్లో కొనుక్కుని ఇంటికి తీసుకుపో! శిరిడీలో ఎక్కడ కొనుక్కున్నా అది బాబా ప్రసాదమే!” అన్నాడు. జోషీ ప్రసాదం కొనుక్కోవడానికి బయలుదేరబోతుండగా ఒక వ్యక్తి పెద్ద పాలకోవా పళ్ళెంతో ఎదురువచ్చి, “మీలో గాడ్గిల్ బంధువు ఎవరు? ఈ పాలకోవా ఇమ్మన్నారు బాబా” అని చెప్పాడు. మనసులోని కోరికను మరునిమిషమే తీర్చిన శ్రీసాయి కరుణకు, సర్వజ్ఞతకు పులకించిపోయాడు శ్రీజోషీ. ఇంతలో ఒక భక్తుడు బజారు నుండి ఉప్పుశనగలు తెచ్చి, వాడాలోవున్న భక్తులకు కొద్దికొద్దిగా పంచాడు. అది చూచిన శ్రీజోషీకి ఉప్పుశనగలను కూడా ప్రసాదంగా ఇంటికి తీసుకెళితే బాగుండునని అనిపించి, ఒక వ్యక్తిని పిలిచి, ఒక రూపాయి ఇచ్చి, బజారుకెళ్ళి ఉప్పుశనగలు తెమ్మన్నాడు. దారిలో శ్రీహెచ్.వి.సాఠే ఎదురువస్తూ, ‘ఎక్కడికి పోతున్నావ’ని ఆ వ్యక్తిని అడిగాడు. అతడు విషయం చెప్పగానే, “నీవు బజారుకు పోవలసిన అవసరం లేదు. బాబానే అర్థమణుగు శనగలు పంపారు. వాటిని తిన్నంత తిని, జోషీ ఎంత ఇంటికి తీసుకుపోదలిస్తే అంత తీసుకుపొమ్మన్నారు. మిగిలినవి పిల్లలకు పేదలకు పంచిపెట్టమన్నారు” అని చెప్పాడు. బాబా పంపిన శనగల మూట తీసుకొని ఆ వ్యక్తి వాడా చేరాడు. సర్వాంతర్యామియైన శ్రీసాయి అనుగ్రహలీలకు అక్కడున్న అందరి కళ్ళు ఆనందంతో చెమర్చాయి.

తమకై తాము తమను ఫోటో తీయమని బాబా ఆదేశించిన ఒకే ఒక అరుదైన సందర్భం!

షోలాపూరు చేరిన శ్రీజోషీ, ఆ తరువాత కొంతకాలానికి ‘వి.ఎస్. ఫోటోగ్రాఫర్' అని పిలువబడే ఒక మంచి ఫోటోగ్రాఫర్‌ను శిరిడీ పంపాడు. అతనితో, “నీవు బాబాను దర్శించి, ఆయన అనుమతిస్తే వారి ఫోటో ఒకటి తీసుకురా!” అని చెప్పాడు. ఆ సమయంలో శిరిడీలోనే వున్న గాడ్గిల్‌కు ఒక పరిచయపత్రం వ్రాసిచ్చి, ఖర్చులకుగాను పదిరూపాయలు కూడా ఇచ్చాడు. సాఠే, గాడ్గిల్‌లు కలిసి ఆ ఫోటోగ్రాఫర్‌ను మసీదుకు తీసుకెళ్ళారు. అయితే, అతడు ఫోటో తీయడానికి బాబా అనుమతి అడగడానికి బిడియపడుతూ ఒక మూల కూర్చున్నాడు. కొంతసేపయ్యాక బాబా అతనితో, “ఫోటో తీయమని కదా జోషీబువా నిన్ను ఇక్కడకు పంపింది? మరి అలా గమ్మున కూర్చుంటావేం? నీకు ఎలా కావాలంటే అలా ఫోటో తీసుకో!” అన్నారు. ఆ తరువాత ఎంతో ప్రసన్నంగా కూర్చుని ఒకటి, నిల్చుని ఒకటి - మొత్తం రెండు ఫోటోలు - తీయించుకున్నారు. ఫోటో తీయించుకోవడానికి సాధారణంగా ఇష్టపడని బాబా అలా తామే అడిగి మరీ ఫోటో తీయించుకోవడం భక్తులకు చాలా ఆశ్చర్యం కలిగించింది.


 చేసుకోకు ఈ ఫొటోతో సొమ్ము!
ఇది సాయిభక్తులందరి సొమ్ము!

ఆ తరువాత బాబా ఆ ఫోటోగ్రాఫర్‌ను నాలుగు రోజులు శిరిడీలోనే వుంచి, అతను శలవు తీసుకొని వెళ్లేటప్పుడు, “ఈ ఫోటోకు న్యాయమైన ధర తీసుకో! ఎక్కువ ధరకు అమ్మి సొమ్ము చేసుకోవద్దు! అయినా, నీవు జోషీబువా శిష్యుడివి కదా! అతను ఈ ఫోటోకు ఒక్క పైసా కూడా తీసుకోనివ్వడులే!" అన్నారు.

source : సాయిపథం - ప్రధమ సంపుటం.

6 comments:

  1. Om Sai
    Sri Sai
    Jaya Jaya Sai🙏🙏🙏🙏

    ReplyDelete
  2. ఓం సాయిరాం🙏💐🙏

    ReplyDelete
  3. 🙏🙏🙏 Om srisairam Om srisairam Om srisairam thankyou sister.

    ReplyDelete
  4. OM SRI SACHIDANAMDA SAMARDHA SATHGURU SAINATH MAHARAJ KI JAI...OM SAI RAM

    ReplyDelete
  5. Om sri sainathaya namaha
    Om sri sainathaya namaha
    Om sri sainathaya namaha
    Om sri sainathaya namaha
    Om sri sainathaya namaha

    ReplyDelete

సాయి మహారాజ్ సన్నిధి సోషల్ మీడియా లింక్స్:

Subscribe Here

బ్లాగ్ అప్డేట్ నోటిఫికేషన్స్ నేరుగా మీ మెయిల్ కే వచ్చేందుకు క్రింద బాక్సులో మీ మెయిల్ ఐడి టైపు చేసి subscribe పై క్లిక్ చేసి, తరువాత స్టెప్స్ పూర్తీ చేయండి.

Delivered by FeedBurner

Followers

Recent Posts


Blog Logo