సాయి వచనం:-

- శ్రీబాబూజీ.

శ్రీమతి చంద్రాబాయి బోర్కర్ - నాలుగవ భాగం




నిన్నటి తరువాయిభాగం ....

1921వ సంవత్సరంలో రామచంద్ర బోర్కర్‌కి పండరిపురం నుండి నాసిక్, మన్మాడ్ మార్గంలో ఉన్న ఆసావలీకి బదిలీ అయింది. బోర్కర్ కుటుంబం రైల్వేస్టేషన్‌కి సమీపంలో ఉన్న రైల్వేక్వార్టర్సులో నివాసముంటుండేవారు. ఒకనాటి సాయంత్రం బోర్కర్ తన విధులు ముగించుకొని ఇంటికి జ్వరంతో వచ్చాడు. మూడు, నాలుగు దుప్పట్లు కప్పుకున్నప్పటికీ అతను చలితో వణికిపోసాగాడు. అంతటి తీవ్రమైన జ్వరంతో అతను బాధపడుతున్నాడు. చిన్న గ్రామమైన ఆసావలీలో వైద్యుడు, వైద్య సదుపాయం అందుబాటులో లేవు. ఆ కారణంగా శ్రీమతి చంద్రాబాయి ఇంటిలోనే మందు తయారుచేసి భర్తకు ఇచ్చింది. అది తీసుకున్నాక వణుకుతున్నప్పటికీ అతనికి బాగా నిద్రపట్టింది. చంద్రాబాయి కూడా భర్త పాదాల చెంతే నిద్రలోకి జారుకుంది. కాసేపటికి కలలో ఆమెకు బాబా కన్పించి, “బాయీ! బాధపడకు. నీ భర్త శరీరానికి ఊదీ రాయి, అతనికి నయమవుతుంది. కానీ, రేపు ఉదయం 11 గంటల వరకు అతనిని బయటకి పోనివ్వవద్దు” అని చెప్పారు. ఆమె వెంటనే లేచి బాబా చెప్పినట్లు భర్త శరీరమంతా ఊదీ రాసింది. ఆశ్చర్యంగా క్షణాల్లో అతని శరీర ఉష్ణోగ్రత తగ్గింది. ఉదయం లేచేసరికి అతను పూర్తి ఆరోగ్యంగా ఉన్నాడు. 

చంద్రాబాయి తన భర్తతో, “బయటకెక్కడికీ వెళ్ళవద్దు. రోజంతా విశ్రాంతి తీసుకోమ”ని చెప్పింది. కానీ అతను ఆమె మాటను పట్టించుకోకుండా, ఆమె వారిస్తున్నా వినకుండా అల్పాహారం తీసుకొని ఇంటినుండి బయలుదేరి సమీపంలో ఉన్న రైల్వే ట్రాక్ వద్దకు వెళ్ళాడు. చంద్రాబాయి కిటికీలోనుండి భర్తనే గమనిస్తూ, “నా భర్తకి రక్షణనివ్వమ”ని బాబాను ప్రార్థిస్తూ ఉంది. ఇంతలో ట్రాక్‌పై ఉన్న బోర్కర్‌ని మరో రైల్వే ఉద్యోగి కలిశాడు. ఇద్దరూ ట్రాక్‌పై నిలుచొని మాటల్లో పడ్డారు. అదే సమయంలో స్టేషన్ వైపునుండి రైలు వారున్న ట్రాక్ మీదుగా వస్తోంది. దాన్ని ఏమాత్రమూ గమనించకుండా వాళ్లిద్దరూ మాటల్లో నిమగ్నమై ఉన్నారు. కొద్దిక్షణాల్లో నేరుగా వచ్చిన రైలు అకస్మాత్తుగా రామచంద్ర బోర్కర్‌ని గుద్దింది. రైలు వేగానికి అతను ఎగిరి ప్రక్క ట్రాక్ మీద పడ్డాడు. అదంతా చూస్తున్న చంద్రాబాయి ‘బాబా!’ అని అరుస్తూ స్పృహతప్పి పడిపోయింది. ప్రక్కింటివాళ్ళు ఆమె ముఖంపై నీళ్ళు చల్లాక ఆమెకు స్పృహ వచ్చింది. జరిగిన ఘోర ప్రమాదంలో బోర్కర్ కాలి ఎముక విరిగింది. కొంతమంది అతనిని మోసుకుంటూ ఇంటికి తీసుకొచ్చారు. ఆమె కన్నీరుమున్నీరుగా విలపిస్తూనే ఆయుర్వేద మూలికలతో ఔషధం తయారుచేసి, అందులో బాబా ఊదీని కలిపి ఆ మిశ్రమాన్ని తన భర్త కాలికి పూసి కట్టుకట్టింది. కొంతసేపటికి స్పృహలోకి వస్తూనే ఆమె భర్త, “ఇంట్లో ఎవరైనా ఫకీరు ఉన్నారా?” అని అడిగాడు. ఆమె, “నాకు ఎవరూ కనిపించట్లేదు. కానీ మీరు ఆ ఫకీరును చూడగలుగుతున్నట్లైతే ఆయన వేరెవరో కాదు, నేను నిత్యం పూజించే సాయిబాబా” అని చెప్పింది. 

మరునాడు మన్మాడు నుండి ఒక వైద్యుడు వచ్చి చంద్రాబాయి కట్టిన కట్టును, మిశ్రమాన్ని తొలగించి ప్లాస్టర్‌తో కట్టుకట్టాడు. ఆ కట్టు వలన రామచంద్రకు నొప్పి ఎక్కువైంది. రాత్రయ్యేసరికి నొప్పి రెండింతలై అతను చాలా బాధను అనుభవించసాగాడు. ఆ రాత్రి చంద్రాబాయికి సాయిబాబా దర్శనమిచ్చారు. ఆమె వెంటనే బాబా పాదాలపై శిరస్సు ఉంచి నమస్కరించింది. “నీవు అతని కాలుని తీసివేయాలని అనుకుంటున్నావా ఏమిటి? వెంటనే ఆ వైద్యుడు కట్టిన కట్టు విప్పేసి గోధుమపిండి, కొబ్బరినూనె, ఊదీ మిశ్రమాన్ని నీ భర్త కాలుకి పూయి” అని చెప్పి బాబా అదృశ్యమయ్యారు. ఆమె అలాగే చేసింది. సాయి వాక్కు, ఊదీల ప్రభావం వలన అతనికి మూడునెలల్లో పూర్తిగా నయమైంది. అది చూసి వైద్యులు ఆశ్చర్యపోయారు.

1934లో రామచంద్ర బోర్కర్ మరణానికి రెండు నెలల ముందు చాతుర్మాస్య౦లో ఒకరోజు శ్రీమతి చ౦ద్రాబాయికి బాబా స్వప్నదర్శనమిచ్చి, “భయపడకు! నేను నీ రాముని తీసుకుపోతాను” అని అన్నారు. ఆమె, “నన్నే ముందు తీసుకెళ్ళండి బాబా” అని అడిగింది. అప్పుడు బాబా, “నీవు చేయాల్సిన పనులు మిగిలివున్నాయి. అందువల్ల నీ భర్త మరణాన్ని ఓర్పుతో సహించి నీకు విధించిన కార్యాలు నేరవేర్చ”మని చెప్పారు. ఈ విషయాన్ని ఆమె తన భర్తకు చెప్పింది. అతను దానిని కలే కదా అని తేలికగా తీసుకున్నాడు. కానీ కొద్దిరోజులకి అతను తీవ్రమైన మూత్రపిండాల సమస్యతో మరియు వెక్కిళ్ళతో జబ్బునపడ్డాడు. అతనికి తన అంతిమ ఘడియలు సమీపించాయని స్పష్టమైంది. అయితే తనకు చాతుర్మాస్య౦ పరిసమాప్తమైన తరవాత చనిపోవాలని బలంగా ఉందని బోర్కర్ తన భార్యతో చెప్పాడు. మరుక్షణమే కాళ్ళు, చేతులు బిగుసుకుపోయి అతను స్పృహ కోల్పోయాడు. చంద్రాబాయి తన భర్త కోరిక ప్రకార౦ చాతుర్మాస్య౦ పూర్తయ్యేవరకు అతనిని ఉంచమని ఆర్తిగా బాబాను ప్రార్థించింది. బాబా దయవలన మరుసటిరోజు అతను స్పృహలోకి వచ్చాడు, కానీ అతని అవయవాలు పటుత్వాన్ని కోల్పోయాయి. అయినప్పటికీ అతను చాలా ఉల్లాసంగా కనిపించాడు. అలా కొన్నిరోజులు గడిచాక చాతుర్మాస్య౦ పూర్తయింది. ఏడవరోజు రాత్రి అతను టీ త్రాగి భార్యతో బాబాకు హారతిచ్చి, విష్ణు సహస్రనామ౦ పెద్దగా చదవమని చెప్పాడు. అతను చెప్పినట్లే ఆమె చేయసాగింది. మరుసటిరోజు తెల్లవారి వైద్యుడు వచ్చేవరకు ఆమె చదువుతుంటే అతను వింటూ ఉన్నాడు. వైద్యుడు అతనిని పరిశీలించి ప్రమాద౦ తప్పి౦దని ఆశాజనకంగా మాట్లాడినప్పటికీ ఆమెకు తెలుసు, ఆరోజు మధ్యాహ్నం లేదా సాయంత్రం అతను కన్నుమూస్తాడని. ఆమె బాబాను తలచుకొని గంగాజలాన్ని అతని నోటిలో పోసింది. తరువాత ఆమె అతని పక్కనే కూర్చొని బాబాని, శ్రీకృష్ణుణ్ణి తన భర్తను వారి పాదాల చెంతకు చేర్చుకోమని ప్రార్థిస్తూ ఉండగా కొంతసేపటికి అతను “శ్రీరామ, శ్రీరామ్” అని స్మరించసాగాడు. ఇంతలో ఒక కుర్రవాడు వచ్చి అతనిని “బాబా!” అని పిలిచాడు. అతను, ‘ఓహ్’ అని పలికి, “శ్రీరామ, శ్రీరామ్” అంటూ కన్నుమూశాడు. అతడేనాడూ శిరిడీ రాకపోయినా, తనను నమ్మి సేవించకపోయినా, చంద్రాబాయి భక్తి వలన, ఆమె భర్తకూ అలా సద్గతి ప్రసాదించారు బాబా.

భర్త మరణంతో బిడ్డ పోషణ, నివాసముంటున్న భవంతిని కాపాడుకోవలసిన బాధ్యత శ్రీమతి చంద్రాబాయిపై పడ్డాయి. కొంతమంది బంధువులు ఆమెకు ఎడతెగని చిక్కులు తెచ్చిపెడుతూ కోర్టులో వ్యాజ్యం వేస్తామని బెదిరిస్తుండేవారు. బాబా కృపతో అతి కష్టం మీద ఆమె 14,000 రూపాయలు సేకరించి వాళ్ళనుండి ఇంటిని కాపాడుకోవడమేకాక ఇతర సమస్యలను కూడా పరిష్కరించుకుంది. తరువాత దుష్టబుద్ధి గల కొందరు ఆమె ఇంటిని ఎవరూ అద్దెకు తీసుకోకుండా చేతబడి చేసి మంత్రించిన నిమ్మకాయను ఇంటిలోకి పడేశారు. ఆ విషయాన్ని బాబా ఆమెకు స్వప్నదర్శనమిచ్చి తెలియజేసి, “కులదేవతను ఆరాధించి కష్టం తొలగించుకో”మని చెప్పారు. దాంతో ఆమె తమ కులదేవత కొలువైయున్న గోవాకు ఒక వ్యక్తిని పంపి, గిట్టనివాళ్ళు చేసిన చెడు ప్రయోగాన్ని విచ్ఛిన్నం చేయించి కష్టంనుండి బయటపడింది.

శ్రీమతి చంద్రాబాయికి బాబాపట్ల గల ప్రేమ అపారం. తన స్వగృహాన్నే సాయిమందిరంగా మలచిన సాయిభక్తురాలీమె. ముంబాయిలో విల్లేపార్లే, తిలక్‌రోడ్‌‌లోని 'శ్రీరామ్‌‌సాయినివాస్ మందిరం'గా పిలవబడే ఈ మందిర వివరాలను, శ్రీమతి చంద్రాబాయి బోర్కర్‌‌కు బాబాతో గల అనుబంధాన్ని, ఆమె కోడలు శ్రీమతి 'మంగళా బోర్కర్' మాటల్లో కింద ఇవ్వబడిన లింక్ ఓపెన్ చేసి తెలుసుకోవచ్చు.


గమనిక:- కొన్ని కారణాలవల్ల బాబా దర్శన భాగ్యం పొందిన ఆనాటి భక్తుల అనుభవాలు ఇకపై రోజూవారీ కాకుండా అప్పుడప్పుడు ప్రచురించాలని అనుకుంటున్నాము. అందుకు మీ అందరూ నన్ను క్షమించాలి. సాయిభక్త అనుభవమాలిక మాత్రం యధాతధంగా కొనసాగుతుంది. 

source ‘ది గ్లోరీ ఆఫ్ షిరిడీ సాయి’ 2016, ఏప్రిల్ నెల సంచిక
http://bonjanrao.blogspot.com/2012/09/c-h-n-d-r-b-i-b-o-r-k-e-r.html
http://saiamrithadhara.com/mahabhakthas/chandrabai_borkar.html

5 comments:

  1. Very sad to jnow that you are planning to stop Sai Samakaleena devotee stories. Pl dont stop them. We are all eagerly wait for them and we want to read more of such stories

    ReplyDelete
    Replies
    1. పూర్తిగా స్టాప్ చేయను సాయీ. కానీ రోజూ ఇవ్వడానికి ఇబ్బంది అవుతుంది. అప్పటి భక్తుల అనుభవాలకు సంబందించి ఇన్ఫర్మేషన్ వెతకడం, దాన్ని ట్రాన్స్లేట్ చేయడం కాస్త టైమ్ పడుతుంది సాయీ. ఏదో రోజూ ఇవ్వాలని ఆదరాబాదరాగా చేస్తే నాకు, మీకు సంతృప్తి ఉండదు. అందుకే కాస్త నిదానంగా చేద్దామని ఈ నిర్ణయం సాయీ. అంతేగానీ పూర్తిగా అపే ఉద్దేశ్యం నాకూ లేదు. బాబా ప్రేమ అనంతం. నా శాయశక్తులా ఆ ప్రేమను ఆస్వాదిస్తూ, మీకు కూడా పనుచుకుంటాను.

      Delete
  2. 🙏🙏🙏 Om srisairam Om srisairam Om srisairam thankyou sister

    ReplyDelete

సాయి మహారాజ్ సన్నిధి సోషల్ మీడియా లింక్స్:

Subscribe Here

బ్లాగ్ అప్డేట్ నోటిఫికేషన్స్ నేరుగా మీ మెయిల్ కే వచ్చేందుకు క్రింద బాక్సులో మీ మెయిల్ ఐడి టైపు చేసి subscribe పై క్లిక్ చేసి, తరువాత స్టెప్స్ పూర్తీ చేయండి.

Delivered by FeedBurner

Followers

Recent Posts


Blog Logo