- బాబా ఎల్లప్పుడూ మన అన్ని అవసరాలను తీరుస్తారు
- అందరికీ బాబానే రక్ష
- మనం ప్రార్థిస్తాం - సాయిబాబా అనుగ్రహిస్తారు
బాబా ఎల్లప్పుడూ మన అన్ని అవసరాలను తీరుస్తారు
నేను ఒక సాయిభక్తుడిని. నాకు ఈ బ్లాగు 'ఆధునిక సాయిసచ్చరిత్ర' అనిపిస్తుంది. ఇందులోని ప్రతీ అనుభవం బాబాకు తన భక్తులపై ఉండే ప్రేమను తెలియజేస్తుంది. ఇక నా అనుభవంలోకి వస్తే... కరోనా కారణంగా 2020, మార్చి నుండి మా అబ్బాయి ఇంటినుండి పనిచేస్తుండగా ఆ సంవత్సరంతంలో తన బాస్ తనని, తన సహచరులను వెంటనే బెంగళూరులోని కార్యాలయానికి రావాలని చెప్పారు. దాంతో మా అబ్బాయి బెంగళూరు వెళ్ళడానికి సమాయత్తమయ్యాడు. కానీ మా మరో అబ్బాయి వివాహం డిసెంబరు 9న ఉన్నందున నేను తనతో, "పెళ్లి చూసుకుని 9వ తేదీ తరువాత బెంగుళూరు వెళ్ళమ"ని చెప్పి, ఆ విషయమై తన బాస్ వద్ద అనుమతి తీసుకోమని కూడా చెప్పాను. తను అలాగే చేశాడు. కానీ, అతని బాస్ అనుమతినివ్వలేదు. అప్పుడు నేను బాబాను ప్రార్థించి, "అతను అనుమతించేలా చూడమ"ని బాబాతో చెప్పుకున్నాను. ఆ తరువాత నేను మా అబ్బాయి బాస్‌కి మెసేజ్ చేశాను. వెంటనే అతను డిసెంబర్ 9 వరకు ఇంటినుండి పనిచేసేందుకు అనుమతించాడు. నేను ఆనందంగా బాబాకు కృతజ్ఞతలు తెలుపుకున్నాను. మనం శ్రద్ధ, సబూరీలతో బాబాపై విశ్వాసముంచాలి. విషయం చిన్నదైనా, పెద్దదైనా బాబా ఎల్లప్పుడూ మన అన్ని అవసరాలను తీరుస్తారు.
జయహో సాయి.
అందరికీ బాబానే రక్ష
ఓంసాయి శ్రీసాయి జయజయ సాయి!
సాయిబంధువులందరికీ నమస్కారం. నా పేరు లక్ష్మీ. 2020లో మావారు బ్లడ్ టెస్ట్ కోసం బ్లడ్ శాంపిల్ ఇచ్చారు. రిపోర్టుల్లో అన్నీ నార్మల్ గానే వచ్చాయి గానీ, ప్లేట్లెట్ కౌంట్ కొంచెం తక్కువగా ఉందని వచ్చింది. నాకు భయం వేసి ఒకసారి డాక్టరుని కలవమని మావారితో చెప్పాను. సరేనని మావారు డాక్టరుని కలిశారు. డాక్టరు రిపోర్టు చూసి, "కంగారుపడకండి. ఒక వారం తర్వాత మళ్ళీ ఒకసారి బ్లడ్ టెస్ట్ చేయించుకోండి" అని అన్నారు. నాకు మాత్రం ఏదో ఆందోళనగా అనిపించి, రోజూ మన సమర్థ సద్గురు సాయినాథుని ప్రార్థిస్తూ, బాబా ఊదీని నీళ్లలో వేసి మావారికి ఇస్తుండేదాన్ని. వారం తర్వాత మావారు మళ్ళీ బ్లడ్ టెస్ట్ చేయించుకున్నారు. రిపోర్టు రెండు రోజుల తర్వాత వస్తుందని అన్నారు. నేను మన సాయితండ్రి మీదనే భారం వేసి, "ప్లేట్లెట్ కౌంట్ పెరగాల"ని బాబాను ప్రార్థించాను. మన 'సుప్రీం గాడ్' సాయినాథుని దయవల్ల ప్లేట్లెట్ కౌంట్ పెరిగింది. ఆనందంగా బాబాకి కృతజ్ఞతలు చెప్పుకున్నాను. ఎప్పటికీ ఆయన దయ మన అందరిమీదా ఉండాలని బాబాను వేడుకుంటున్నాను. అడుగడుగునా తోడుగా ఉండి నడిపించే దైవం సాయి. అందరికీ ఆయనే రక్ష.
సాయినాథ్ మహరాజ్ కీ జై!
