సాయి వచనం:-

- శ్రీబాబూజీ.

సాయిభక్తుల అనుభవమాలిక 629వ భాగం...



ఈ భాగంలో అనుభవాలు:
  1. అన్నిటికీ బాబానే దిక్కు!
  2. మనకేది మంచిదో అదే దయచేస్తారు సాయి 

అన్నిటికీ బాబానే దిక్కు!


పేరు వెల్లడించని ఒక సాయిభక్తురాలు తనకు బాబా ప్రసాదించిన అనుభవాలను మనతో పంచుకుంటున్నారు.


ఓం సాయిరాం! సాయిబంధువులందరికీ నా నమస్కారాలు. ఈ సాయి మహరాజ్ సన్నిధి బ్లాగ్ నిర్వహిస్తున్న సాయికి నా హృదయపూర్వక నమస్కారాలు. బాబా నాకు ప్రసాదించిన అనుభవాలలో కొన్నిటిని ఇంతకుముందు మీతో పంచుకున్నాను. ఇప్పుడు బాబా ప్రసాదించిన మరో అనుభవాన్ని మీతో పంచుకుంటున్నాను. 


నేను ఇదివరకు ఒక వర్క్ కోసం దరఖాస్తు చేసుకున్నాను. అది విజయవంతంగా ఆమోదింపబడటంతో వర్క్ చేయడం ప్రారంభించాను. కానీ, 10 రోజులకే ఆ వర్క్ ఆగిపోతుందని నా స్నేహితురాలు నాతో చెప్పింది. ఆ వర్క్‌తో వచ్చే డబ్బుల కోసం ఎంతో ఆశపడిన నేను వర్క్ ఆగిపోతుందని తెలిసి చాలా బాధపడ్డాను. బాబానే ఈ సమస్యకు పరిష్కారం చూపుతారని భావించి బాబాకు నమస్కరించుకుని, “బాబా! ఈ వర్క్ ఆగిపోకుండా 3 నెలల వరకు కొనసాగేలా అనుగ్రహించు. మీ దయవల్ల అలా జరిగితే నా అనుభవాన్ని తోటి సాయిబంధువులతో పంచుకుంటాను” అని మ్రొక్కుకున్నాను. ఆశ్చర్యం! 10 రోజులకే ఆగిపోతుందని భయపడిన ఆ వర్క్ బాబా దయవల్ల ఆగిపోకుండా 3 నెలల వరకు కొనసాగుతూనే ఉంది. నిజానికి ఆ వర్క్ డబ్బుల మీద మా అక్క కుటుంబం ఆధారపడివుంది. ఈ కరోనా సమయంలో పనులు లేక మేము చాలా ఇబ్బందిపడ్డాము. ఈ విధంగా బాబా మాకు దారిచూపారు. బాబా చూపిన కృపకు మేమంతా ఎంతో సంతోషించి బాబాకు మనసారా కృతజ్ఞతలు తెలుపుకున్నాము. “బాబా! ఈ వర్క్ మరో సంవత్సరం వరకు కొనసాగేలా అనుగ్రహించు తండ్రీ!”


మరో అనుభవం:


కొంతకాలంగా నాకు పెళ్ళి సంబంధాలు కుదరక చాలా ఇబ్బందిపడ్డాను. ‘వయసు పెరిగిపోతోంది, ఎక్కడా సంబంధాలు కుదరటంలేద’ని మా కుటుంబమంతా బాధపడుతుండేవారు. పెళ్ళి సంబంధం కుదరాలంటే నేను 11 గురువారాలు పూజ చేయాలని ఒక సాయిభక్తుడి ద్వారా బాబా నాకు తెలియజేశారు. బాబా చెప్పినట్లే నేను 11 గురువారాల పూజ ప్రారంభించాను. 8వ గురువారం నాకు ఒక పెళ్ళి సంబంధం వచ్చింది. అన్నీ కుదిరి, 11వ గురువారంనాడు కట్నకానుకల గురించి మాట్లాడుకుని డిసెంబరు 23వ తారీఖున మా వివాహం నిశ్చయించారు. బాబా నాపై చూపిన కృపకు ఆనందంతో నాకు కన్నీళ్ళు ఆగలేదు. 


నాకు ఏ బాధ వచ్చినా బాబాకే చెప్పుకుని ఏడుస్తాను, బాబా నా బాధ వింటూ నన్ను ఓదారుస్తున్న అనుభూతిని పొందుతాను. “బాబా! నీ మీద భారం వేసి, నిన్నే నమ్ముకొని ఈ సంబంధం ఒప్పుకున్నాను. అన్నీ దగ్గరుండి నువ్వే చూసుకోవాలి బాబా. ఎల్లప్పుడూ నాకు తోడుగా ఉండు బాబా. సమయానికి అన్నీ సమకూరి, ఎటువంటి ఆటంకాలూ లేకుండా మా పెళ్ళి జరిగేలా దీవించు బాబా! మా వైవాహిక జీవితం ఆనందంగా ఉండేలా అనుగ్రహించు తండ్రీ! బాబా! మా పెద్దక్కయ్యవాళ్ళకి ఆర్థిక సమస్యలు ఉన్నాయి. వాళ్ళు నీ మీద భారం వేసి నిన్నే వేడుకుంటున్నారు. ఇంకా వాళ్ళని పరీక్షించకు బాబా. వాళ్ళకు రావలసిన డబ్బులు త్వరగా వచ్చి వాళ్ళ ఆర్థిక సమస్యలు, అప్పులు తీరేలా దీవించు తండ్రీ! నువ్వే మా కుటుంబానికి దిక్కు బాబా. మా కుటుంబానికి ఏ ఆపదా రాకుండా కాపాడు తండ్రీ!” 


మాకు ఏ చిన్న ఆపద వచ్చినా మా నోటినుండి వచ్చే మొదటి పదం – బాబా. మా సర్వస్వం బాబానే. నా పెళ్ళి జరిగాక మరో అనుభవాన్ని మీతో పంచుకుంటాను.


ఓం సాయిరాం!


మనకేది మంచిదో అదే దయచేస్తారు సాయి 

ముందుగా సాయిబంధువులందరికీ నా నమస్కారములు. ఈ బ్లాగ్ నిర్వాహకులకు కృతజ్ఞతలు. నా పేరు వెంకటరావు. శిరిడీ సాయిని సర్వస్య శరణంగా నమ్ముకున్నవాడిని. ప్రతిక్షణమూ బాబా ఎన్నెన్నో అనుభవాలను కలిగిస్తుంటారు. అందులో ఒక అనుభవాన్ని మీతో పంచుకుంటాను. 

ఆరోజు అక్టోబర్ 15, 2020. తేదీ ప్రకారం బాబా మహాసమాధి చెందినరోజు. అదేరోజు మాకు ప్రియతముడైన వ్యక్తి కరోనాతో హాస్పిటల్లో ఉన్నారు. ఆరోజే ఆక్సిజన్ స్థాయి తగ్గిపోతోందని డాక్టర్లు తనకు వెంటిలేటర్ పెట్టారు. ఆ సమయంలో నేను ఆఫీసులో ఉన్నాను. ఇంటర్‌నెట్‌లో శిరిడీ సాయి దర్శనం ప్రత్యక్ష ప్రసారాన్ని చూశాను. బాబా కిరీటధారులై అద్భుతమైన దర్శనమిచ్చారు. బాబా దర్శనంతో మనసుకి ఎంతో ఆనందం కలగటంతో పాటు హాస్పిటల్లో ఉన్న మా ప్రియమైన వ్యక్తిని బాబా ఆపద నుంచి బయటపడేస్తారనే నమ్మకమూ కలిగింది. అదే భరోసాతో అందరికీ ధైర్యం చెప్పాను. ఆ సాయంత్రమే తనకు ప్లాస్మా డోస్ కూడా ఏర్పాటు చేశారు బాబా. అది మాకు మరింత ధైర్యాన్ని కలిగించింది. మరుసటిరోజు ఉదయం డ్యూటీ డాక్టర్లు తన ఆరోగ్య పరిస్థితి మెరుగయిందని కూడా చెప్పారు. అంతా సవ్యంగా సాగుతుందని మేమంతా నమ్మాము. అయితే స్పెషలిస్ట్ డాక్టర్ మాత్రం, “ఐసీయూలో ఉన్న పేషెంట్ పరిస్థితి ఎలా ఉంటుందో అంత సులభంగా చెప్పలేము. ప్రస్తుతం 75 శాతం వెంటిలేటర్ సపోర్టుంది. జబ్బు నయమయ్యే కొద్దీ ఆ శాతం తగ్గుతూ వస్తుంది. అందుకని అప్పుడే ఏమీ చెప్పలేము” అన్నారు. మరుసటిరోజుకు వెంటిలేటర్ సపోర్టును 55 శాతానికి తగ్గించారు. బాబా చల్లగా చూస్తున్నారనుకున్నాము. పిదప దాన్ని 60 శాతానికి పెంచాల్సి వచ్చిందన్నారు. అలా ఆ డోలాయమాన స్థితి కొనసాగుతూనే ఉంది, ఆశ నిరాశల మధ్య మా పరిస్థితి కూడా. చివరి మూడు రోజులు తన పరిస్థితి నిలకడగా ఉందన్నారు డాక్టర్లు. తీరా విజయదశమిరోజు సాయంత్రం నాలుగు గంటలకి ఆక్సిజన్ లెవల్స్ అకస్మాత్తుగా పడిపోయి మా ప్రియమైన వ్యక్తి సాయిలో లీనమయ్యారు. 

మనం కోరేదొకటి, మనకి మంచిదైనది మరొకటి. సాయి ఎప్పుడూ మనకేది మంచిదో అదే దయచేస్తారు. ఎన్నో శుభసూచకాలు చూపించి కూడా ఆ జీవిని మాకు దక్కకుండా తీసుకెళ్ళిపోయారు ఆ సాయిదేవుడు. ఆ జీవి మాకంటే కూడా సాయికే ఎక్కువ అవసరమేమో. బహుశా ఆ కుటుంబాన్ని స్వయంగా చూసుకుని వృద్ధిలోకి తీసుకురావాలని బాబా ఉద్దేశ్యమేమో! “ఆ కుటుంబాన్ని దగ్గరుండి కాపాడు తండ్రీ!”.

ఓం సాయిరాం!



6 comments:

  1. ఓం సాయి రామ్ 🙏🙏🙏

    ReplyDelete
  2. Sairam , naa marriage kosam wait chestuna, 11 Thursday's pooja ela cheyali, pls cheppandi sairam pls pls ����������

    ReplyDelete
  3. Baba pleaseeee amma ki problem cure cheyi thandri

    ReplyDelete
  4. 🙏💐🙏 ఓం సాయిరాం

    ReplyDelete
  5. ఓం సాయిరాం

    ReplyDelete

సాయి మహారాజ్ సన్నిధి సోషల్ మీడియా లింక్స్:

Subscribe Here

బ్లాగ్ అప్డేట్ నోటిఫికేషన్స్ నేరుగా మీ మెయిల్ కే వచ్చేందుకు క్రింద బాక్సులో మీ మెయిల్ ఐడి టైపు చేసి subscribe పై క్లిక్ చేసి, తరువాత స్టెప్స్ పూర్తీ చేయండి.

Delivered by FeedBurner

Followers

Recent Posts


Blog Logo