సాయి వచనం:-

- శ్రీబాబూజీ.

అణ్ణా చించణీకర్


బాబాను శ్రద్ధ, సబూరీలతో సేవించిన వారిలో దామోదర్ ఘనశ్యామ్ బాబరే అలియాస్ అణ్ణా బాబరే అలియాస్ అణ్ణా చించణీకర్ ఒకడు. ఇతడు రాణి జిల్లాలోని 'చించణీ' అనే గ్రామానికి చెందినవాడు. అందుకే అందరూ అతనిని 'అణ్ణా చించణీకర్' అని పిలిచేవారు. అతడు ఎవ్వరినీ లెక్కచేసేవాడు కాదు. ఎప్పుడూ ముక్కుసూటిగా మాట్లాడేవాడు. గుళ్లతో నిండి నొక్కగానే పేలిపోయే తుపాకిలా ఉండేవాడు. చేతితో నిప్పైనా పట్టుకోవచ్చునేమో గానీ, అణ్ణా మాత్రం అంతకంటే ఎక్కువగా మండిపడుతుండేవాడు. అతనికి పనులన్నీ చకచకా సాగిపోవాలి. అరువు బేరం ఎరుగడు. మొహమాటం లేకుండా నిష్కర్షగా వ్యవహరించేవాడు. ఇలా బాహ్యానికి కఠినంగా, రాజీలేనివ్యక్తిగా, మొరటువానిలా కనిపించినప్పటికీ అతను నిష్కపట స్వభావి, సజ్జనుడు, సాత్త్వికుడు, మోసమన్నది ఎరుగనివాడు. అందుకే బాబాకు అతడు ప్రియమైనవాడు.

అణ్ణా చించణీకర్ మొదటిసారి శిరిడీ వెళ్ళినపుడు అకస్మాత్తుగా ఆ గ్రామంలో ప్లేగు చెలరేగింది. గ్రామంలోని అందరూ ఊరు విడిచి వెళ్ళిపోయారు. అతని భార్య లక్ష్మీబాయి మాత్రమే గ్రామంలో మిగిలింది. సహజంగానే ఆమె భయపడింది. అప్పుడు బాబా ఆమెకు భౌతికంగా దర్శనమిచ్చారు. అంతటితో ఆమె ఎటువంటి భయం లేకుండా ధైర్యంగా ఉంది. వ్యాధి అంతరించి, గ్రామస్థులు తిరిగి వచ్చేదాకా సాయి ఆమెకు 10, 12 సార్లు సాక్షాత్కరించి అభయమిచ్చారు. ఈ సంఘటనతో ఆ దంపతులకు బాబాపట్ల అత్యంత భక్తిశ్రద్ధలు ఏర్పడ్డాయి.

తరువాత అణ్ణా చించణీకర్, లక్ష్మీబాయి ఇరువురూ శిరిడీ వచ్చి బాబా సన్నిధిలో నివసించసాగారు. వారు బాబా నుండి ఏమీ ఆశించకుండా చాలా సంవత్సరాలు నిష్కామసేవ (నిస్వార్థసేవ) చేశారు. అతనికి 50 సంవత్సరాలు దాటినా సంతానం కలుగలేదు. ఒకనాడు ఆ దంపతులు బాబాకు సేవ చేస్తుండగా శ్యామా, కాకాసాహెబ్ దీక్షిత్‌లు అక్కడే వున్నారు. శ్యామా బాబాతో, "దేవా! ఏమిటి మీ లీల? ఎక్కడెక్కడినుండో భక్తులు తమ కోరికలు నెరవేర్చుకోవడానికి మీ వద్దకు వస్తుంటే, వారందరి కోరికలు తీరుస్తున్నారు. కానీ ఈ అణ్ణా, లక్ష్మీబాయి మిమ్మల్ని ఇంతకాలంగా సేవిస్తున్నా మీరు వీళ్ళకు సంతానం ప్రసాదించరేమిటి?" అన్నాడు. బాబా చిన్నగా నవ్వి, "శ్యామా, నీవు చిన్నవాడివి, నీకేమీ తెలియదు. ఎవరైనా మనస్పూర్తిగా ఏదైనా కోరితే నేను ప్రసాదించకపోవడం ఎప్పుడైనా జరిగిందా? ఏమీ తెలియనివాడిలా మాట్లాడతావేం? ఈ దంపతులు నన్నేమీ కోరలేదు. కావాలంటే వారిని అడుగు. వారికి నిజంగా బిడ్డ కావాలంటే ఇస్తాను. కానీ ఒక్కతరం కంటే వీరి వంశం నిలవదు. అంతకంటే కలకాలం కొనసాగే వంశప్రతిష్ఠను ప్రసాదిస్తాను" అన్నారు. ఆయన భావమెవరికీ అర్థం కాలేదు.

అప్పట్లో అణ్ణా చించణీకర్ పొలాలకు సంబంధించిన వ్యాజ్యమొకటి దహనూ కోర్టులో నడుస్తుండేది. అచ్యుత్ నారాయణ్ ఖరే అనే ప్రఖ్యాత న్యాయవాది ఆ కేసును వాదిస్తుండేవాడు. అప్పుడప్పుడు అణ్ణా దాని గురించి బాబాను అడుగుతుండేవాడు. అతడెప్పుడడిగినా బాబా "అల్లా అచ్ఛా కరేగా!" (దైవం మేలు చేస్తాడు) అని మాత్రమే సమాధానమిస్తుండేవారు. అలా మూడు సంవత్సరాలు గడచిపోయాయి. ఒకసారి అణ్ణా చించణీకర్‌ను కష్టపెట్టడానికి గిట్టనివారెవరో అతడు కేసు ఓడిపోయినట్లుగా తెలియజేస్తూ ఉత్తరం పంపారు. ఆ ఉత్తరాన్ని చూస్తూనే అతను కాకాసాహెబ్ దీక్షిత్ వద్దకు వెళ్లి విషయాన్ని చెప్పాడు. ఆ విషయమై బాబాను అడగాలని ఆ ఇద్దరూ మసీదుకు వెళ్ళారు. వాళ్ళు మసీదులో ప్రవేశిస్తుండగానే బాబా వారికేసి చూసి, "ఈ ముసలాడికి నామీద నమ్మకం లేదు. ఆ ఉత్తరం చింపి అవతల పారేయండి!" అన్నారు. 

కొద్ది నెలల తర్వాత లాయర్ వద్దనుండి అణ్ణాకు 'కేసు నెగ్గినట్లు, రూ.1800/- లు కోర్టు ఖర్చులు కూడా చెల్లించమని కోర్టు డిక్రీ ఇచ్చినట్లు' ఉత్తరం వచ్చింది. ఆ ఉత్తరాన్ని పట్టుకొని అణ్ణా, కాకాసాహెబ్ దీక్షిత్‌లు మసీదుకు వెళ్లారు. బాబా అతనిని చూస్తూనే, "నీకిప్పటికైనా విశ్వాసం కుదిరిందా?" అన్నారు. అప్పుడు అణ్ణా ఆ ఉత్తరాన్ని బాబా పాదాలవద్ద వుంచి, "బాబా, ఇదంతా మీదే! నాకేమీ వద్దు" అన్నాడు. అప్పుడు బాబా, "ఫకీరునైన నేను ఈ ధనం ఏమి చేసుకుంటాను? నాకేమైనా కుటుంబమున్నదా? నువ్వే తీసుకో!" అన్నారు. అణ్ణా ఆ ధనాన్ని తీసుకోమని ఎంతగానో అభ్యర్థించినప్పటికీ బాబా అంగీకరించలేదు. అలా కొంతసేపు వారి మధ్య చర్చ జరిగాక ఆ డబ్బుతో రోజు విడిచి రోజు బాబా నిద్రించే చావడికి మరమ్మత్తులు చేసి పునరుద్ధరించి, ఆ దంపతుల పేర్లు లిఖించాలని కాకాసాహెబ్ దీక్షిత్ సలహా ఇచ్చాడు. ఆ సలహా అణ్ణాకు నచ్చి అలానే చేశాడు. ఇప్పటికీ భక్తులు అక్కడున్న "శ్రీ సాయినాథ్ బాబాంచీ లక్ష్మీబాయి దామోదర్ బాబరే, చించణీకర్ చావడి, శక సం.1859" అనే ఫలకాన్ని చూడవచ్చు. అలా బాబా ఆ వంశప్రతిష్ఠను చిరస్మరణీయం చేశారు.
భక్తులు తమదైన రీతిలో ప్రేమతో సాయిబాబాను సేవిస్తుండేవారు. ఒకరు ఆయన నడుం పట్టేవారు. ఒకరు వారి పాదాలు ఒత్తేవారు. మరొకరు వారి వీపును, పొట్టను మర్దించేవారు. బాబా ఎవరికీ అడ్డు చెప్పక అందరినీ సేవ చేయనిచ్చేవారు. ఒకనాటి మధ్యాహ్నం మసీదులో బాబా దర్బారు నిండుగా ఉంది. బాబా తమ ఎడమచేతిని పక్కనే ఉన్న కఠడాపై వేసి కూర్చొని ఉన్నారు. కఠడాకు ఇవతలివైపు నిలబడివున్న అణ్ణా కాస్త వంగి బాబా ఎడమచేతిని మెల్లమెల్లగా ఒత్తుతున్నాడు. కుడివైపు బాబా పట్ల అనన్య భక్తిప్రపత్తులు కలిగిన వేణుబాయి కౌజల్గి (మావిసీ బాయి) అనే వృద్ధ వితంతువు ఉంది. బాబా ఆమెను 'ఆయీ!' (అమ్మా) అని అనేవారు. జనులు ఆమెను 'మౌసీ' (పిన్నమ్మా) అని పిలిచేవారు. ఆమెకు సాయి పాదాలయందు అనుపమానమైన ప్రేమ. ఆమెది స్వచ్ఛమైన హృదయం. ఆమె తన రెండు చేతుల వేళ్లను బాబా పొట్ట చుట్టూ చుట్టి పొత్తికడుపు మర్దన చేస్తోంది. ఆమె బాబా స్మరణ చేస్తూ చాలా వింతగా పొట్ట వీపుకు అంటుకుపోయేలా గట్టిగా ఒత్తుతూ ఉంది. బాబా కిమ్మనకుండా వారికి ఏ బాధా లేదన్నట్లు ఉన్నారు. భక్తులకు మేలు కలగాలని, వారు అనవరతం తమ స్మరణలో ఉండాలని వారినుండి సాయి నిష్కపటమైన ప్రేమను తీసుకుని ఎటువంటి సేవనైనా స్వీకరించేవారు. దీనవత్సలుడైన సాయి తన భక్తులనెన్నడూ ఉపేక్షించేవారు కాదు. ఆమె బలంగా ఒత్తుతూ ఉంటే బాబా క్రిందకి పైకి ఊగిపోతున్నారు. ఆమె కూడా అలాగే కదులుతూ ఉంది. ఇవతలవైపు ఉన్న అణ్ణా ముందుకు వంగి ఉన్నప్పటికీ కదలక స్థిరంగా ఉన్నాడు. ఇరువురూ తమ తమ సేవలలో లీనమై ఉండగా ఆమె ముఖం క్రిందకి పైకి కదులుతూ అణ్ణా ముఖం వద్దకు వచ్చింది. మంచి హాస్యస్వభావం గల ఆమె అదే అవకాశంగా తీసుకుని, "ఈ చపలుడైన అణ్ణా నన్ను ముద్దివ్వమని కోరుతున్నాడు. ఇదేమిటి అణ్ణా? తల నెరిసినా నీకు సిగ్గులేదు. నన్ను ముద్దుపెట్టుకోవాలని చూస్తున్నావు" అని అన్నది. వెంటనే అణ్ణా తన చొక్కా చేతిని మడుచుకొని, "నేను ముసలివాణ్ణా? పిచ్చివాణ్ణా? నేనేమైనా మూర్ఖుణ్ణా? నీవే మొహంలో మొహం పెట్టి తగవుకు తయారయ్యావు" అని అన్నాడు. వారిద్దరినీ సమానంగా ప్రేమించే బాబా వారిని శాంతింపజేయాలనుకొని ఒక మంచి యుక్తిని పన్నారు. ఎంతో ప్రేమగా ఆయన, "అరె అణ్ణా! ఊరికే ఎందుకు గొడవ చేస్తున్నావు? తల్లిని ముద్దు పెట్టుకోవటంలో అనుచితమేముందో అర్థం కావడం లేదు" అని అన్నారు. ఆ మాటలు విని ఇద్దరూ శాంతించారు. ఆ హాస్యరసవాణిని ఆస్వాదిస్తున్న వారంతా సాయిబాబా చమత్కారానికి ముగ్ధులయ్యారు. చూడటానికి ఇది చిన్న కథే అయినా అందులోని మర్మాన్ని తెలుసుకోగల శ్రోతలు "తల్లీబిడ్డలలో ఉండవలసిన ప్రేమ ఆ ఇద్దరిలో ఉండుంటే వారికలా కోపం వచ్చేది కాదు, తగవు పుట్టేది కాదు" అన్న మాధుర్యాన్ని ఆస్వాదించగలరు.

బాబా సేవలో తరించిన శ్రీ అణ్ణా చించణీకర్ చించణీలో సాయి శివ మందిరాన్ని నిర్మించాడు. అతను 1920, ఏప్రిల్ 15న తుదిశ్వాస విడిచాడు. ఇప్పుడు ఆ మందిరం 'అణ్ణా చించణీకర్ ట్రస్ట్' పర్యవేక్షణలో ఉంది. చివరివరకు హృదయపూర్వకంగా బాబా సేవలో తమ జీవితాన్ని గడిపిన ఆ దంపతులు తమ యావదాస్తిని శిరిడీసాయి సంస్థానానికి వీలునామా ద్వారా ధారాదత్తం చేశారు. అంతేగాక, సమాధిమందిరానికి ఎదురుగా ఉన్న సభామండప నిర్మాణంలో ఖర్చయిన మొత్తంలో ఎక్కువభాగం 'అణ్ణా చించణీకర్ ట్రస్ట్' భరించింది.

అణ్ణా చించణీకర్చిన్చానికర్ నిర్మించిన మందిరం 

అణ్ణా చించణీకర్ ట్రస్ట్ కాంటాక్ట్ డిటెయిల్స్:

Sai Shiv Mandir,
C/o.Anna Chinchanikar Trust,
Chinchani-401 503,
Dahanu Taluk,
Thane District,
Maharashtra,India
Contact Person:Smt.Vidya Churi
Contact Number: 97656 75825 

సమాప్తం 

Source: Shri Sai Satcharitra by Govind Raghunath Dhabolkar alias Hemadpant, Shri Sai Leela Magazine, January 1978 Chinchani Sai Shiv Mandir Photo Courtesy: Shri.Vinod Patil, Mumbai)
http://www.saiamrithadhara.com/mahabhakthas/anna_babare.html

3 comments:

  1. ఓం శ్రీ సాయినాథాయ నమః 🙏
    ఓం శ్రీ సాయి ఆరోగ్య క్షేమదాయ నమః🙏

    ReplyDelete
  2. Om Sree Sachidhanandha Samardha Sadguru Sree Sai Nadhaya Namaha 👍❤🕉🙏😊

    ReplyDelete
  3. OM SRI SACHIDANAMDA SAMARDHA SATHGURU SAINATH MAHARAJ KI JAI...OM SAI RAM

    ReplyDelete

సాయి మహారాజ్ సన్నిధి సోషల్ మీడియా లింక్స్:

Subscribe Here

బ్లాగ్ అప్డేట్ నోటిఫికేషన్స్ నేరుగా మీ మెయిల్ కే వచ్చేందుకు క్రింద బాక్సులో మీ మెయిల్ ఐడి టైపు చేసి subscribe పై క్లిక్ చేసి, తరువాత స్టెప్స్ పూర్తీ చేయండి.

Delivered by FeedBurner

Followers

Recent Posts


Blog Logo