సాయి వచనం:-

- శ్రీబాబూజీ.

సాయిభక్తుల అనుభవమాలిక 272వ భాగం....


ఈ భాగంలో అనుభవం:
  • నాలాంటి చాలా చిన్న భక్తురాలికోసం కూడా బాబా వస్తారు!

USA నుండి అజ్ఞాత సాయిభక్తురాలు తన అనుభవాన్నిలా పంచుకుంటున్నారు:

సాయిరామ్! నేనొక చిన్న సాయిసేవకురాలిని. నేను పాఠశాలకి వెళ్ళేరోజుల నుండి నేను ఆయన భక్తురాలిని. అప్పటినుండి ఎప్పుడూ నాకు రక్షణనిస్తున్నది ఆయనే అని నేను గుర్తించాను. ఆయనే నా సంరక్షకుడు.

నేను, నా భర్త, ఇద్దరు అందమైన చిన్నారులతో(ఆడపిల్లలు)తో మాదొక చిన్న కుటుంబం. మావారు ఐటీ ఫీల్డ్‌లో పనిచేస్తున్నారు. నేను గృహిణిని. తీవ్రంగా ప్రయత్నించిన మీదట బాబా కృపతో మేము  H1B వీసాపై USA కి వచ్చాము. తరువాత 2014, డిసెంబరులో నా భర్త వేరే క్రొత్త ఉద్యోగంలో చేరారు. అయితే అక్కడ మావారి బాస్ చాలా మొరటుగా ప్రవర్తిస్తూ నలుగురి ముందు మావారిని తిడుతుండేవాడు. ఏదో ఒకవిధంగా సర్దుకుపోతూ మావారు తన పని తాను చేసుకోవడానికి ప్రయత్నిస్తుండేవారు. కొన్నినెలల తరువాత మావారు ఆ ఉద్యోగం మానేయాలని అనుకున్నారు. కానీ హెచ్1బి వీసాలో ఉండడం వల్ల కనీసం వాళ్ళు మా గ్రీన్‌కార్డు దాఖలు చేసేవరకు, మాకు I-140 ఫారం వచ్చేవరకు వేచి ఉండాల్సి వచ్చింది. మా ఈ పరిస్థితిని అవకాశంగా తీసుకుని ఆ బాస్ ఇంకా ఇంకా మావారిని ఇబ్బందిపెడుతూ ఉండేవాడు. రోజులు గడుస్తున్నాగానీ పరిస్థితిలో మార్పురాలేదు. చివరికి సంవత్సరం పూర్తి కావస్తుండటంతో గ్రీన్‌కార్డు ప్రక్రియను బాస్ ఆమోదించాల్సిన సమయం వచ్చింది. ఆ స్థితిలో అతను ముందుగా ఎటువంటి సూచన లేకుండా అకస్మాత్తుగా నా భర్తను ఉద్యోగం నుంచి తొలగించాడు.

దాంతో నా భర్త పూర్తిగా కృంగిపోయారు. అటువంటి బాస్ నుండి విముక్తి లభించడం సంతోషమే అయినా‌, వీసా మొదలైన ఇతర సమస్యలతో మేము చాలా ఒత్తిడికి లోనయ్యాము. మేము ఎంతో సహనంతో ఉన్నప్పటికీ ఇలా ఎందుకు జరిగిందో అర్థంకాక ఎంతో బాధపడుతూ ఉండేవాళ్ళం. అటువంటి పరిస్థితిలో నేను, "బాబా! మాకు త్వరగా ఇంకొక ఉద్యోగం చూపించి, భారతదేశానికి తిరిగి వెళ్ళకుండా మమ్మల్ని కాపాడమ"ని బాబాను ప్రార్థించడం మొదలుపెట్టాను. ప్రతిరోజూ భక్తుల అనుభవాలు చదువుతుంటే 'బాబా జాగ్రత్త తీసుకుంటారని, మాకు తప్పక సహాయం చేస్తారని' ఆశ కలిగింది. నేను రోజూ సాయిసచ్చరిత్ర చదువుతూ మనసులో ఆయన నామజపం సదా చేస్తూ ఉండేదాన్ని. ఇక్కడొక ముఖ్యమైన విషయం చెప్పాలి. ఆ క్లిష్టకాలంలో ఒక మధ్యవయస్కుడైన ముస్లిం వ్యక్తి తెల్లని ధోతి(పాదాలవరకు పొడవాటి దుస్తులు), తెలుపురంగు టోపీ ధరించి మా అపార్ట్‌మెంట్ ఆవరణలో నడుస్తూ కనిపించేవాడు. అతని ముఖం ఎంతో ప్రశాంతంగా చాలా ఆహ్లాదకరంగా ఉండేది. నార్త్ కరోలినాలో జనవరి, ఫిబ్రవరి నెలల్లో చలి చాలా ఉంటుంది. అంత చలిలో కూడా అతను ఒక జాకెట్ గాని, కోటుగాని ధరించలేదు. నాకు అతను బాబాను పోలి ఉన్నట్లుగా అనిపించి నా హృదయంలోనే అతనికి ప్రణామం చేసేదాన్ని. కానీ, 'నాలాంటి చాలా చిన్న భక్తురాలికోసం బాబా ఎందుకు వస్తారు?' అని అనుకునేదాన్ని. నేను నా పిల్లలకోసం బస్‌స్టాప్‌కి వెళ్ళేటప్పుడు నేను అతన్ని చూస్తుండేదాన్ని. ఒకసారి నేను అతన్ని చూసినప్పుడు అతను నన్ను చూస్తూ చక్కగా ఒక నవ్వు నవ్వారు. ఇప్పటికీ నేను ఆ నవ్వును మరువలేను. ఆశ్చర్యంతో నేను కూడా తిరిగి నవ్వాను. ఇప్పుడది గుర్తుచేసుకుంటుంటే ధన్యత నొందినట్లుగా అనిపిస్తుంది. "చాలా చాలా ధన్యవాదాలు బాబా!" మా వీసా స్థితి గురించి నేను చాలా టెన్షన్ పడినప్పుడల్లా కిటికీలోంచి చూస్తే, అతను బయట నడుస్తూ కనపడేవాడు. అలా కొన్ని రోజులు గడిచాక మావారికి ఉద్యోగం వచ్చింది. వీసా బదిలీ కూడా జరుగుతోంది. అంతలో RFE (Request For Evidence) సమస్య వచ్చింది. ఆలస్యమైనా చివరకు వీసా ఆమోదం పొందింది. మొత్తానికి సమస్యల నుండి మాకు ఉపశమనం కలిగింది అనుకున్నాం.

కానీ మరుసటిరోజే మరో చెడువార్త వినాల్సి వచ్చింది. నా భర్త ఏ పోస్టుకు అయితే ఎంపిక అయ్యారో ఆ పోస్టు ఇప్పుడు లేదని, కాబట్టి ఇప్పుడు ఉద్యోగంలోకి తీసుకోలేమని చెప్పారు. మేము పూర్తిగా కుప్పకూలిపోయాము. నేను బాబా ముందు ఏడ్చి ఏడ్చి అలసిపోయాను. కానీ ఏమీ జరగలేదు. సమస్య మళ్ళీ మొదటికొచ్చింది. ఉద్యోగం లేదు కాబట్టి మేము USAలో ఉండలేము. నా భర్త ఆ కంపెనీ వాళ్ళని కనీసం తనని ఇండియాలో అయినా నియమించమని అభ్యర్థించారు. బాబా దయవల్ల అందుకు వాళ్ళు సరేనని చెప్పి, వెంటనే ఇండియా రమ్మని అన్నారు. కేవలం 4 రోజుల్లో మేము అన్నింటినీ యు.ఎస్.ఏ. లో అమ్మేసి ఇండియాకి తిరిగి ప్రయాణమయ్యాము. అది చాలా బాధాకరమైన పరిస్థితి. ఎంతో ప్రయత్నంతో యు.ఎస్.ఏ. వచ్చిన మేము భారమైన మనస్సుతో తిరిగి ఇండియా చేరుకున్నాము.

బహుశా అదంతా మా కర్మ కావచ్చు. బాబా చెప్పినట్లు మేము దానిని ఎదుర్కోవలసి వచ్చింది. కానీ  బాబా తోడుగా ఉంటూ ధైర్యంగా ఆ కష్టాన్ని దాటించారని నేను చెప్పగలను. ఎందుకంటే, మావారు ఉద్యోగంలో చేరిన నాలుగువారాల్లో బాబా అద్భుతం చేశారు. మళ్ళీ మేము యు.ఎస్.ఏ. వెళ్లే అవకాశం వచ్చింది. మేము యు.ఎస్.ఏ. వెళ్లి అదే అపార్ట్‌మెంటులో దిగాము. అక్కడ మూడు నెలలు ఉన్నాక చికాగోకి మారాము. మేము ఉన్న ఆ మూడునెలల్లో, కష్టాల్లో ఉన్నప్పుడు కనపడ్డ ముస్లిం వ్యక్తి ఒక్కసారి కూడా కనపడలేదు. అప్పుడు నాకనించింది, 'ఎన్నోసార్లు నాకు కనిపించింది, నన్ను చూసి నవ్వింది బాబానే' అని. ఆయన దయవల్లే మేము మా జీవితంలోని ఆ కష్టకాలాన్ని దాటగలిగాము. ఆయన "మీరు పిలిచినంతనే నేను మీవద్ద ఉంటాను" అనే వాగ్దానాన్ని నా విషయంలో నిరూపించి నన్ను ఆశీర్వదించారు. "చాలా ధన్యవాదాలు బాబా! దయచేసి మీ ఆశీస్సులను మీ భక్తులందరిపై కురిపించండి. వాళ్ళ జీవితాలలో సవాళ్లను అధిగమించడానికి వారికి సహాయపడండి. ముఖంపై చిరునవ్వుతో జీవితంలో ఎదురయ్యే సమస్యలను ఎదుర్కోవడానికి తగిన ధైర్యం, బలం ఇవ్వండి. ఓపికగా మీ దయకు ఎదురుచూస్తున్న భక్తులకు, మీరు అనుగ్రహించే సమయం వచ్చేవరకు అవసరమైన విశ్వాసాన్ని దయచేసి ఇవ్వండి. ఐ లవ్ యు బాబా! మా అందరినీ ఆశీర్వదించండి". 

source : http://www.shirdisaibabaexperiences.org/2019/10/shirdi-sai-baba-miracles-part-2515.html

No comments:

Post a Comment

సాయి మహారాజ్ సన్నిధి సోషల్ మీడియా లింక్స్:

Subscribe Here

బ్లాగ్ అప్డేట్ నోటిఫికేషన్స్ నేరుగా మీ మెయిల్ కే వచ్చేందుకు క్రింద బాక్సులో మీ మెయిల్ ఐడి టైపు చేసి subscribe పై క్లిక్ చేసి, తరువాత స్టెప్స్ పూర్తీ చేయండి.

Delivered by FeedBurner

Followers

Recent Posts


Blog Logo