1. బాబా మీద భారం వేస్తే, ఆయనే మనల్ని కాపాడుతారు
2. నమ్మిన వారితో బాబా ఎప్పుడూ ఉంటారు
బాబా మీద భారం వేస్తే, ఆయనే మనల్ని కాపాడుతారు
సాయి భక్తులందరికీ నా నమస్కారాలు. నా పేరు సాయి అంజని. నేను పది సంవత్సరాలుగా సాయి భక్తురాలిని. ఈ పది సంవత్సరాలలో బాబా నాకు చాలా అనుభవాలు ఇచ్చారు. ఆయన రోజూ నాకు ఏదో ఒక అనుభవాన్ని ఇస్తూ ఉంటారు. అందులో నుండి కొన్ని అనుభవాలను నేను ఇప్పుడు మీతో పంచుకుంటున్నాను. నాకు ఇద్దరు పిల్లలు. పెద్దబాబుకి ఐదు సంవత్సరాలు, చిన్నబాబుకి ఒక సంవత్సరం. మేము చెన్నైలో ఉంటాము. నా అత్తమామలు హైదరాబాదులో ఉంటారు. వర్క్ ఫ్రం హోం వల్ల మేము హైదరాబాదులో ఉన్నప్పుడు నాకు కాన్పు జరిగి చిన్నబాబు పుట్టాడు. తరువాత బాబును తీసుకుని మేము మా అమ్మవాళ్ళ ఇంటికి వెళ్ళాము. బాబుకి మూడు నెలలు వయసప్పుడు నా అత్తమామలు, "ఇంటికి మరమ్మత్తులు చేయించాలి, హైదరాబాదుకి రా" అని మావారితో అన్నారు. చిన్నపిల్లాడితో కష్టమని మమ్మల్ని మాత్రం రావద్దు అన్నారు. దాంతో నాకు ఆందోళన మొదలైంది. ఎందుకంటే, పెద్దబాబు నన్ను వదిలి ఎన్ని రోజులైనా ఉంటాడు, నాకోసం అస్సలు దిగులుపడడు. కానీ వాడికి ఎప్పుడూ వాళ్ళ నాన్న కావాలి. ఆయన లేకుండా ఒక్క రోజు కూడా ఉండలేడు. ఒకసారి ఆయన శ్రీశైలం వెళ్ళి ఒకరోజు అంతా ఇంటిలో లేకపోతే ఆ రాత్రంతా నిద్రపోకుండా ఏడుస్తూనే ఉన్నాడు. అలాంటిదిప్పుడు 20 రోజులు వాళ్ళ నాన్న లేకుండా వాడు ఎలా ఉంటాడని నేను బాగా దిగులుపడ్డాను. వాడితో నేను, "నాన్నకి ఆఫీసు ఓపెన్ అయింది. చెన్నై వెళ్లిపోవాలి. ముందు నాన్న వెళ్లి, తర్వాత మనల్ని తీసుకుని వెళ్తారు. నాన్నకోసం నువ్వు ఏడవకూడదు" అని చెప్పాను. అందుకు వాడు "సరే" అన్నాడు. ఆరోజు రాత్రి బస్సుకి మావారు హైదరాబాద్ వెళ్ళిపోయారు. నాకు టెన్షన్‍గా అనిపించి, "బాబా! బాబు నిద్రపోకుండా ఏడుస్తాడు, ఇప్పుడెలా బాబా? వాడు ఏడిస్తే, చాలా బిగ్గరగా అందరూ భయపడేలా ఏడుస్తాడు. మూడు నెలల బాబుతో ఇద్దరినీ చూసుకోవడం నావల్ల కాదు. మావారు వచ్చేదాకా మీరే వాడిని చూసుకోండి" అని బాబాతో చెప్పుకున్నాను. బాబా చేసిన అద్భుతం ఏమిటంటే! బాబు వాళ్ళ నాన్న తిరిగి వచ్చేదాకా దాదాపు 20 రోజుల్లో ఎప్పుడూ నాన్న గురించి అడగలేదు, ఆయనను రమ్మని చెప్పలేదు, అస్సలు ఏడవలేదు. నేను ఎంత ఆందోళన చెందానో అంత ప్రశాంతంగా నన్ను ఉంచారు బాబా. బాబా మీద భారం వేస్తే, ఆయనే మనల్ని కాపాడుతారు.
ఇప్పుడు నాకు చాలా సంతోషాన్నిచ్చిన మరో అనుభవం పంచుకుంటాను. మేము మా పెద్దబాబుకి శృంగేరిలో అక్షరాభ్యాసం చేయిద్దామనుకున్నాము. 2020, జనవరిలో ఒక తేదీ ఖరారు చేసుకుని చెన్నై నుండి శృంగేరికి ట్రైన్ టిక్కెట్లు బుక్ చేసుకున్నాము. మా అత్తగారువాళ్ళు కూడా శృంగేరి రావడానికి హైదరాబాదు నుండి టికెట్లు బుక్ చేసుకున్నారు. కానీ హఠాత్తుగా నా ఆరోగ్యం బాగా లేకుండా అయింది. బాగా నీరసం, గ్యాస్ట్రిక్ సమస్యతో చాలా ఇబ్బందిపడ్డాను. అయినా తగ్గిపోతుందిలే వెళదామని అనుకున్నాము కానీ, తగ్గలేదు. ఇక ఆ స్థితిలో వెళ్తే, అక్కడ నేను ఇబ్బందిపడతానని మా ప్రయాణాన్ని క్యాన్సిల్ చేసాము. అయితే 2020, ఫిబ్రవరి 24కి మా బాబుకి మూడేళ్లు నిండిపోతాయని అర్జెంట్‍గా చెన్నైలో ఉన్న శృంగేరి మఠంలో బాబుకి అక్షరాభ్యాసం చేసాము. కానీ ఎప్పుడైనా శృంగేరి వెళ్లి అక్కడ మళ్ళీ అక్షరాభ్యాసం చేయిద్దామనుకున్నాము. మరుసటి నెల నేను మళ్ళీ గర్భం దాల్చాను. 2020, నవంబర్ 6న నాకు బాబు పుట్టాడు. అప్పటినుండి మేము ఎన్నిసార్లు ప్రయత్నం చేసినా శృంగేరి వెళ్ళలేకపోయాము. అందరూ కోవిడ్ సమయంలో పిల్లలతో సమస్య అవుతుందని అంటుండేవారు. కానీ నా మనసులో ఏదో తెలియని బాధ. శృంగేరిలో అక్షరాభ్యాసం చేయనందువల్లే బాబు బాగా అల్లరి చేస్తూ, అసలు చదవడానికి ఆసక్తి చూపడం లేదని నేను బాగా దిగులుపడేదాన్ని. నేను శృంగేరి వెళ్ళటానికి ఎంతలా చెప్పి నా భర్తను ఒప్పించినా నా అత్తమామలు ఒప్పుకునేవారు కాదు. అప్పుడు నేను, "బాబా! నేను శృంగేరి వెళ్లి బాబుకి అక్షరాభ్యాసం చేసుకోగలిగేలా అనుగ్రహించండి" అని బాబాతో చెప్పుకున్నాను. ఆరోజు సాయంత్రం నా భర్త మా మామయ్యగారితో శృంగేరి వెళదామని యథాలాపంగా అన్నారు. అంతే, అప్పటివరకు ఒప్పుకోనే ఒప్పుకోని మావయ్యగారు చాలా తేలికగా ఒప్పుకున్నారు. అంతా బాబా వలనే జరిగింది. మేము 2021, డిసెంబర్ 9న హైదరాబాదులో బయలుదేరి శృంగేరి వెళ్లి డిసెంబర్ 11న బాబుకి అక్షరాభ్యాసం చేసాము. నా మనసుకెంతో ప్రశాంతంగా, ఆనందంగా అనిపించింది. "థాంక్యూ బాబా".
2021 నుండి నా భర్త గ్యాస్ట్రిక్ సమస్యతో బాగా ఇబ్బంది పడుతున్నారు. టాబ్లెట్లు వేసినా ఉపయోగం ఉండటం లేదు. ఒకరోజు నా భర్త హాస్పిటల్‍కి వెళితే, డాక్టరు ఎండోస్కోపీ చేసి, "కడుపులో ఇన్ఫెక్షన్ ఉంద"ని మందులిచ్చి నెల రోజులు వాడిన తరవాత మళ్లీ రమ్మన్నారు. మందులు వాడిన నెలరోజులు బాగానే ఉన్నా టాబ్లెట్లు అయిపోగానే మళ్ళీ మావారు బాధపడ్డారు. చెకప్‍కి వెళ్తే, డాక్టరు మరో నెలరోజులకు మందులిచ్చారు. ఆ నెలరోజులు బాగానే ఉంది కానీ, తరువాత మళ్ళీ మావారు బాధపడ్డారు. అయితే మునుపటి అంత ప్రభావం లేదు. కానీ పూర్తిగా నయం కాలేదు. దాంతో మళ్ళీ మావారు హాస్పిటల్‍కి వెళ్లారు. నాకు చాలా భయమేసి, "బాబా! ఈసారి డాక్టరు ఇన్ఫెక్షన్ తగ్గిందని చెప్పాలి" అని బాబాతో చెప్పుకున్నాను. డాక్టరు మళ్ళీ ఎండోస్కోపీ చేసి, "90% ఇన్ఫెక్షన్ తగ్గింది. మరో నెల మందులు వాడిన తరువాత మందులు ఆపేయొచ్చు" అని చెప్పారు. అప్పుడు నా మనసుకి చాలా ప్రశాంతంగా అనిపించింది. ఇలా బాబా నాకు చాలా అనుభవాలు ఇచ్చారు. "చాలా చాలా ధన్యవాదాలు బాబా".
నమ్మిన వారితో బాబా ఎప్పుడూ ఉంటారు
ఓం శ్రీసాయినాథాయ నమః!!! నా పేరు విష్ణుప్రియ. మేము బెంగళూరులో ఉంటాము. నాకు ఒక పాప. తనకి 5 సంవత్సరాల వయసు. నాకు చదువుకునే రోజుల నుంచి బాబా అంటే చాలా ఇష్టం. బాబాకి సమర్పించనిదే నేను ఏమీ తినను, త్రాగను. కష్టం, బాధ ఏది వచ్చినా బాబాకి చెప్పుకుంటే, ఆయన తీరుస్తారని నా నమ్మకం. 2021లో మావారు మా అత్తయ్యగారి ఊరికి వెళ్లారు. కరోనా ప్రభావం ఎక్కువగా ఉండడం వల్ల నేను, మా పాప వెళ్ళలేదు. అక్కడ ఊళ్ళో ఎవరో డబ్బులు అవసరమై ఇల్లు అమ్ముతున్నారు. ఆ విషయం ఎవరో తెలిసినవాళ్ళు మావారికి చెప్పారు. మావారు ఆ ఇల్లు చూసి, పోటోలు తీసుకొచ్చి నాకు చూపించారు. నాకు ఆ ఇల్లు అసలు నచ్చలేదు. అయితే నేను ఎంత చెప్పినా మావారు వినరని నాకు తెలుసు. అందుచేత నేను బాబా దగ్గర నిల్చొని, "సాయీ! నాకు ఏది మంచో, చెడో నాకన్నా మీకే బాగా తెలుసు. నాకైతే ఆ ఇల్లు అంత బాగా అనిపించలేదు. ఒకవేళ మంచిదైతే కొనుక్కునేలా చూడండి, లేదంటే తప్పించు తండ్రి. ఆ ఇల్లు కొనుక్కుంటే నిజంగా మాకు కలిసి వస్తుందని మీకు అనిపిస్తే, డబ్బు కూడా మీరే సమకూర్చండి. ఇక అంతా మీ దయ బాబా" అని బాబాని వేడుకున్నాను. బాబా దయవల్ల అమ్మేవాళ్లు ఎక్కువ ధర చెప్పడంతో మావారు వెనక్కి తగ్గారు. బాబాకి అన్నీ తెలుసు. నాకు ఆ ఇల్లు కలిసి రాదని కూడా తెలుసు. కాబట్టే ఆ ఇల్లు మాకు దక్కకుండా తప్పించారని నేను చాలా ఆనందపడ్డాను.
2021, గురుపౌర్ణమి రోజున నేను పూజ చేసుకుని బాబా నామస్మరణ చేసుకుంటూ ఉండగా నా మనసుకెందుకో ధూపం పొగలో బాబా బాగున్నారనిపించి ఒక ఫోటో తీయాలనిపించింది. వెంటనే మొబైల్‍లో సాయి విగ్రహం ఫోటో తీసాను. ఆ ఫోటోను కాస్త దగ్గరగా చూస్తే, ధూపం పొగలో బాబా ముఖం చాలా స్పష్టంగా కనిపించింది. దాంతో బాబా నాతోనే ఉన్నారని చాలా సంతోషపడ్డాను. నమ్మిన వారితో బాబా ఎప్పుడూ ఉంటారు. "ధన్యవాదాలు బాబా".

