సాయి వచనం:-

- శ్రీబాబూజీ.

సాయిభక్తుల అనుభవమాలిక 1403వ భాగం....


ఈ భాగంలో అనుభవాలు:

1. యూఎస్ఏ వెళ్ళాలన్న కల నెరవేర్చిన బాబా
2. బాబా ఉండగా మనకు భయం ఎందుకు?
3. బాబా కృపతో తీరిన ఆరోగ్య సమస్యలు - అందిన డబ్బులు

యూఎస్ఏ వెళ్ళాలన్న కల నెరవేర్చిన బాబా


అందరికీ నమస్కారాలు. నా పేరు గిరిజ. నా భర్త పేరు శ్రీహర్ష. మాది మధ్యతరగతి కుటుంబం. నేను ఒక ఐటీ కంపెనీలో పని చేస్తున్నాను. మావారు ఇంజనీరింగ్ కాలేజీలో ప్రొఫెసర్‍గా పని చేస్తున్నారు. పిల్లలతో బాధ్యత తెలిసి వస్తుందని అన్నట్టు నేను కడుపుతో ఉన్నప్పుడు నేను, మావారు మనం మనకి పుట్టబోయే బిడ్డకోసం కష్టపడాలి, అవసరమైతే కొన్నాళ్ళు దూరంగా ఉండి అయినా యూఎస్ఏ వెళ్లి, అక్కడ స్థిరపడాలి అని అనుకున్నాము. మాకు 2019లో బాబు పుట్టాడు. తనకి ఝశ్విన్ శ్రీకార్తికేయ అని పేరు పెట్టుకున్నాము. ముందుగా  అనుకున్నట్లు యూఎస్ఏ వెళ్లేందుకు మా ప్రయత్నాలు మొదలుపెట్టాము. అయితే అదే సమయంలో కోవిడ్ మొదలైంది. అయినా మేము నిరుత్సాహపడకుండా మా ప్రయత్నాలు కొనసాగించాము. బాబా, దత్తుడు దయవల్ల మాకు యూకే వెళ్లే అవకాశం వచ్చింది. కానీ మేం వెళ్లాలనుకున్నది యూఎస్ఏ. అందువల్ల యూకే వెళ్లాలా, వద్దా అన్న సందిగ్ధంలో పడ్డాము. అప్పుడు మా అమ్మ, అమ్మమ్మ 'ఎక్కడికి వెళ్లాలని వస్తే అక్కడికి వెళ్లాలి' అని బాబా ముందు చీటీలు వేశారు. అప్పుడు యూకే వెళ్లాలని బాబా సమాధానం వచ్చింది. దాంతో అది దేవుని ఆశీర్వాదమని మేము యూకే వెళ్ళాము. కానీ మా ఆయనకి యూఎస్ఏ మీద ఆశపోలేదు. ఎందుకో తెలియదు ఆయన ఒకరోజు నాతో, "నేనిక్కడ సెటిల్ అవ్వడానికి ప్రయత్నిస్తున్నాను కదా! నువ్వు యూఎస్ఏ వెళ్లి చదువుకుంటావా? నీ చదువు అయ్యేసరికి నేను అక్కడకు వచ్చేస్తాను" అన్నారు. ఆ విషయమై దత్తుడు మరియు బాబా ముందు చీటీలు వేస్తే, ఆశ్చర్యంగా అప్పుడు కూడా యూకే అనే వచ్చింది. అందువలన మేము యూఎస్ఏ వెళ్లడానికి ఏ ప్రయత్నాలు చేయలేదు. కానీ అనుకోకుండా ఒకరోజు యూఎస్ఏలో ఉంటున్న మా చెల్లి మేఘన, తన భర్త టాటాబాబు మావారికి ఫోన్ చేసి, "మీకోసం యూఎస్ఏ H1B వీసాకి అప్లై చేయాలనుకుంటున్నాము" అని, "అయితే లాటరీ సిస్టం కాబట్టి ఎక్కువగా ఆశలు పెట్టుకోవద్దు" అని కూడా చెప్పారు. మేము బాబా, సాయిదత్తుల యందు నమ్మకం ఉంచాము. యూఎస్ఏ వెళ్లి బతకాలన్నది మా కల. కనుక ఆయనే మాకు ఈ అవకాశం ఇచ్చారని మనస్ఫూర్తిగా నమ్మాము. మా నమ్మకం నిజమైంది. లాటరీలో మావారి వీసా సెలెక్ట్  అయింది. ఒకటి తర్వాత ఒకటి అన్ని విజయవంతమవుతుండగా వీసా ఇంటర్వ్యూకి బుక్ చేసుకున్నాము. కానీ చాలా భయాందోళనలకు గురయ్యాం. మా మరిదితో సహా అందరూ 99% వీసా అప్రూవ్ అవ్వడం కష్టమన్నారు. మేము మాతో బాబా ఉన్నారనే నమ్మకంతో భారమంతా ఆయనపై వేసాము. అప్పుడే నాకు ఈ బ్లాగు గురించి తెలిసింది. మా అమ్మ, "హెచ్1బి వీసా అప్రూవయితే, బ్లాగులో పంచుకుంటానని బాబాకి దణ్ణం పెట్టుకోమ"ని చెప్పింది. నేను అలాగే చేశాను. ఆ బాబా, దత్తుని ఆశీర్వాదంతో 2022, నవంబర్‍లో మా వీసాలు అప్రూవ్ అయ్యాయి. అందరూ చాలా ఆశ్చర్యపోయారు, సంతోషించారు. మా కల నెరవేరినందుకు మా సంతోషానికి అవధులు లేకుండా పోయాయి. ఇంకో నిజం ఏమిటంటే, మాకు వీసా అప్లై చేయడానికి, అవి అప్రూవ్ అవ్వడానికి కారణం మేము యూకేలో ఉండటమే. అందువలనే మాకు ఈ అవకాశం వచ్చింది. మా కల నెరవేరాలంటే ముందుగా మేము యూకే వెళ్లాలని, అక్కడ ఉండాలని చీటీల ద్వారా మాకు సూచించిన బాబాను మేము మా జీవితాంతం పూజించుకుంటాం.


ఇకపోతే, మేము వారంలో యూఎస్ఏకి ప్రయాణమవ్వాలని ఫ్లైట్ టికెట్లు బుక్ చేసుకుని లగేజీ అంతా ప్యాక్ చేసుకుంటున్న సమయంలో మూడేళ్ళ మా బాబుకి ఆటలమ్మ వచ్చింది. మేము, 'ఫ్లైట్ ఎక్కేటప్పటికి అది తగ్గుతుందో, లేదో, టికెట్లు క్యాన్సిల్ చేసుకోవడానికి కానీ, రీషెడ్యూల్ చేసుకోవడానికి కానీ అవకాశం లేద'ని చాలా కంగారు పడ్డాము. నేను వెంటనే బాబాకి దణ్ణం పెట్టుకుని, "ఎటువంటి ఆటంకం లేకుండా మా ప్రయాణం జరగాలి బాబా. అలా జరిగితే, మీ అనుగ్రహాన్ని బ్లాగులో పంచుకుంటాను" అని అనుకున్నాను. బాబా దయవల్ల మా ప్రయాణ సమయానికల్లా బాబుకి నయమై మేము ఏ ఆటంకం లేకుండా క్షేమంగా యూఎస్ఏ చేరుకున్నాము. మేము ఇక్కడికి వచ్చిన ఒక వారానికి నాకు జ్వరం, గొంతునొప్పి వచ్చాయి. నేను నొప్పి తట్టుకోలేక ఏడుస్తూ బాబా నామస్మరణ చేస్తూ పడుకున్నాను. కలలో బాబా చక్కటి దర్శనమిచ్చి నా నుదుటన ఊదీ పెట్టారు. తర్వాత నాకు అంతా బాగైంది. "చాలా చాలా ధన్యవాదాలు బాబా".


ఓం నమో శ్రీసాయినాథ్ మహరాజ్ కీ జై!!!


బాబా ఉండగా మనకు భయం ఎందుకు?


ఓం శ్రీ సచ్చిదానంద సమర్థ సద్గురు సాయినాథ్ మహరాజ్ కీ జై!!!


ముందుగా మన సాయినాథునికి కోటికోటి పాదాభివందనాలు. సాయి బంధువులందరికీ నమస్కారాలు. మన ఈ 'సాయి మహారాజ్ సన్నిధి' బ్లాగు నిర్వహకులకు ధన్యవాదాలు. నా పేరు మల్లేశ్వరి. నేను ప్రతి చిన్న విషయం మన తండ్రి సాయినాథునితో చెప్పుకుంటూ ఉంటాను. ఆయన నాకు సదా తోడుగా ఉంటారు. నేను నా గత అనుభవంలో మేము ఒక గ్రానైట్ ఫ్యాక్టరీ తీసుకున్నామని చెప్పాను. ఈమధ్య ఆ ఫ్యాక్టరీకి సంబంధించి ఏదో కేసు ఉందని మైనింగ్ వాళ్ళు వచ్చి, 'మా ఫ్యాక్టరీలో ఎక్కువ సరుకుందని, ఇదంతా పట్టుకుంటే 20 లక్షలు కట్టాల్సి ఉంటుంది' అన్నారు. "మేము కొత్తగా ఈ ఫ్యాక్టరీ తీసుకున్నాము, రెండు నెలలు అయింది" అని చెప్పినా వినలేదు. మా వాళ్లంతా భయపడిపోయారు. నేను మాత్రం మన బాబాని తలుచుకుని, "బాబా! నువ్వే ఏదైనా చేయాలి తండ్రి" అని అనుకుంటూ 'సాయి వచనం' చూస్తే, "నువ్వు భయపడవద్దు. నేను అంతా చూసుకుంటాను" అని వచ్చింది. నేను, "సాయినాథా! ఏదైనా అద్భుతం నువ్వే చేయాలి. నేను మీ అనుగ్రహాన్ని మన 'సాయి మహారాజ్ సన్నిధి' బ్లాగులో పంచుకుంటాను" అని బాబాకి మ్రొక్కుకున్నాను. బాబా ఎంత అద్భుతం చేసారో చూడండి! కేవలం 3 లక్షలతో సమస్య సమసిపోయింది. మనం బాబాని నమ్ముకుంటే, ఏదీ అసాధ్యమనేది ఉండదు. కానీ కొన్ని అనుభవించాల్సిన కర్మలను అనుభవించక తప్పదు.


నేను 2022, సెప్టెంబర్ 26న కేథార్నాథ్, బద్రీనాథ్, గంగోత్రి, యమునోత్రి యాత్రలకు వెళ్లాను. మా ఊరు నుంచి నేను ఒక్కదాన్నే. నాకు ఎవరూ తెలియదు అంటే, మా అమ్మాయి నాకు తెలుసని చెప్పింది. దాంతో గుంటూరు వాళ్ళతో కలిసి వెళ్లాను. అయినా బాబా ఉండగా మనకు భయం ఎందుకు? ఆయన అప్పట్లో శ్యామాకు గయలో దర్శనమిచ్చినట్లు నేను వెళ్లిన ప్రతిచోటా తమ దర్శనమిస్తూ 'నీకు భయమెందుకు, నేను ఉండగా' అని అభయమిచ్చారు. ఇంకో విషయం 'మా అక్క కూతురుకి ఉద్యోగం వస్తే, మన బ్లాగులో పంచుకుంటాన'ని బాబాతో చెప్పుకున్నాను. ఆయన దయవల్ల తనకి ఉద్యోగం వచ్చింది. "ధన్యవాదాలు బాబా. మా ఇంటి పరిస్థితులు మీకు తెలుసు బాబా. చాలా దారుణంగా ఉన్నాయి. మీ దయతో అవన్నీ సర్దుకుంటే, మళ్ళీ నా అనుభవాలు తోటి భక్తులతో పంచుకుంటాను తండ్రి".


బాబా కృపతో తీరిన ఆరోగ్య సమస్యలు - అందిన డబ్బులు


సాయి బంధువులకు నమస్కారం. నా పేరు రవీంద్ర. నేను హైదరాబాద్ నివాసిని. నేను రోజూ 'సాయి మహారాజ్ సన్నిధి' బ్లాగు చదువుతాను. సాయి బంధువుల అనుభవాలు చదువుతుంటే ఎంతో ఆనందంగా ఉంటుంది. ఇక నా అనుభవాల విషయానికి వస్తే..  ఒకరోజు రాత్రి నాకు గ్యాస్ట్రిక్ పెయిన్ బాగా ఎక్కువగా వచ్చింది. జలోసిల్ వేసుకున్నా తగ్గలేదు. అప్పుడు బాబా ఊదీ రాసుకుని, మరికొంత ఊదీ నోట్లో వేసుకున్నాను. బాబా దయవల్ల కాసేపటికి నొప్పి తగ్గి హాయిగా నిద్రపోయాను. మరొకరోజు అకస్మాత్తుగా నా గుండెల్లో దడ మొదలై ఎంతకీ తగ్గలేదు. అప్పుడు నేను 'ఓం శ్రీసాయి ఆరోగ్యక్షేమదాయ నమః' అని స్మరిస్తూ పడుకున్నాను. కాసేపటికి దడ తగ్గింది.


నేను 18 నెలల పాటు ఒక కిరాణా షాపు నడిపాను. అది సరిగ్గా నడవకపోవడంతో మూసేసి షాపులోని టేబుళ్లు, ఇతర సామాన్లన్నీ తక్కువ రేటుకి అమ్మేశాను. బాబా దయవలన నాకు రావాల్సిన డబ్బులు కొన్ని వచ్చాయి కాని, టేబుళ్ల తాలూకు డబ్బులు రాలేదు. ఇంకా ఆ డబ్బులు నాకు రావనుకున్నాను. కానీ బాబాను ఆ డబ్బులు నాకు వచ్చేలా చూడమని ప్రార్థించాను. బాబా మన ఈ బ్లాగు ద్వారా 'నీ డబ్బులు ఎక్కడికి పోవు' అని సందేశమిచ్చారు. అలాగే మూడునెలల తరువాత నా ఆ డబ్బులు నాకు అందాయి. "ధన్యవాదాలు బాబా. ఏమైనా మర్చిపోతే క్షమించండి బాబా. తొందరలో గ్యాస్ట్రిక్ సమస్య పూర్తిగా తగ్గేటట్లు చేయండి బాబా. నేను ఉద్యోగం కోసం సంవత్సరం నుండి ప్రయత్నిస్తున్నాను. త్వరగా ఉద్యోగం వచ్చేలా దయ చూపండి". సాయి భక్తులారా! మీరు కూడా నాకు ఉద్యోగం వచ్చేలా అనుగ్రహించమని బాబాను ప్రార్థించండి. ఉద్యోగం వచ్చిన తర్వాత ఆ అనుభవంతో మళ్లీ మీ ముందుకు వస్తాను. ఎల్లవేళలా బాబా ఆశీస్సులు అందరికీ ఉండాలని కోరుకుంటూ..


2 comments:

  1. Om sri sainathaya namaha
    Om sri sainathaya namaha
    Om sri sainathaya namaha
    Om sri sainathaya namaha
    Om sri sainathaya namaha

    ReplyDelete
  2. Om Sairam
    Sai always be with me

    ReplyDelete

సాయి మహారాజ్ సన్నిధి సోషల్ మీడియా లింక్స్:

Subscribe Here

బ్లాగ్ అప్డేట్ నోటిఫికేషన్స్ నేరుగా మీ మెయిల్ కే వచ్చేందుకు క్రింద బాక్సులో మీ మెయిల్ ఐడి టైపు చేసి subscribe పై క్లిక్ చేసి, తరువాత స్టెప్స్ పూర్తీ చేయండి.

Delivered by FeedBurner

Followers

Recent Posts


Blog Logo