సాయి వచనం:-

- శ్రీబాబూజీ.

సాయిభక్తుల అనుభవమాలిక 1422వ భాగం....


ఈ భాగంలో అనుభవాలు:

1. ఆరోగ్య ప్రదాయక సాయినాథ
2. శ్రీసాయి అనుగ్రహం

ఆరోగ్య ప్రదాయక సాయినాథ


రాజాధిరాజ యోగిరాజ పరబ్రహ్మ శ్రీ సచ్చిదానంద సద్గురు సాయినాథ్ మహారాజ్ కీ జై!!!


నా పేరు ఉపేంద్ర. మాది విజయవాడ. నేను గతంలో బాబా దయతో ఆయన నాపై చూపిన ప్రేమను ఈ బ్లాగులో పంచుకున్నాను. శ్రీసాయినాథుని అనుగ్రహం వలన నాకు ఈమధ్య వరుసగా కొన్ని అనుభవాలు కలిగాయి. వాటిని ఇప్పుడు పంచుకుంటాను. ముందుగా మా అమ్మాయి ఆరోగ్య విషయంలో బాబా చూపిన అనుగ్రహం గురించి చెప్తాను. 2022, నవంబర్‌లో మా అమ్మాయికి జలుబు చేసి, దగ్గు కూడా మొదలైంది. మొదట మేము గృహ చిట్కాలు పాటించాము. వాటితో తగ్గకపోవడంతో నాలుగు రోజుల తరువాత డాక్టరును సంప్రదించాము. డాక్టరు ఒక వారం రోజులకి మందులు ఇచ్చారు. ఆ మందులు వాడినా పాపకి దగ్గు తగ్గలేదు. దాంతో పాపను మళ్లీ డాక్టర్ దగ్గరకి తీసుకెళితే. ఆస్తమా లక్షణాలున్నాయని రెండు నెలలపాటు ఇన్హేలర్, మరికొన్ని మందులు వాడమన్నారు. అయితే అవి వాడుతున్నా ఎలాంటి ప్రయోజనం కనిపించలేదు. ఇక ఈసారి పాపను ఆయుర్వేద వైద్యుడికి చూపించి మందులు తీసుకున్నాము. ఆ మందులతో పాపకి దగ్గు తగ్గలేదు సరికదా మూడోరోజు రాత్రంతా తను ఆపకుండా దగ్గుతూనే ఉంది. ఆ రాత్రి ఇంట్లో ఎవరికీ నిద్రలేదు. పాప పరిస్థితి మాకు చాలా బాధను కలిగిచింది. అప్పటికి దగ్గు మొదలై దాదాపు నెల రోజులైంది. మాకు భయమేసి మరుసటిరోజు ఉదయం ఛాతి వైద్య నిపుణుడిని దగ్గరకి వెళదామనుకున్నాము. వెళ్ళేముందు, "బాబా! రెండు రోజుల్లో పాపకు దగ్గు తగ్గించు తండ్రి. అలా తగ్గిస్తే, మీ అనుగ్రహాన్ని బ్లాగులో పంచుకుంటాను" అని బాబాను ప్రార్థించాను. తరువాత డాక్టరుని సంప్రదించడానికి వెళ్ళి, అక్కడ వెయిట్ చేస్తుండగా బయట నుండి బాబా పాటలు వినిపించాయి. బయటకి వెళ్ళి చూస్తే, దూరంగా బాబా ఫొటోలతో ఒక బండి వెళుతోంది. అక్కడున్న ఒక మెడికల్ షాపు బోర్డు మీద పెద్ద బాబా ఫోటో దర్శనమిచ్చింది. అంతే, నాకు చాలా ధైర్యం వచ్చింది, ఎంతో సంతోషం కలిగింది. తరువాత డాక్టరుగారు మమ్మల్ని లోపలికి పిలిస్తే, వెళ్ళాము. డాక్టరు మా అమ్మాయిని పరీక్షించి చెస్ట్ స్కానింగ్ వ్రాసి, రక్త పరీక్షలు కూడా చేయించమన్నారు. ఆ రిపోర్టులు చూసి డాక్టరుగారు మీ అమ్మాయికి 'వైరల్ నిమోనియా' అని, "హాస్పిటల్లో అడ్మిట్ చేయవలసి వస్తుంది. ఆలోచించుకుని చెప్పండి" అన్నారు. నేను బాబా మీద నమ్మకంతో, "మందులు ఇవ్వండి సార్. మా ఇల్లు ఇక్కడికి దగ్గరే, అవసరమైతే వచ్చి అడ్మిట్ చేస్తాము" అని చెప్పాను. డాక్టరు మూడు రోజులకు మందులు ఇచ్చారు. బాబా దయవలన ఆ మందులు పనిచేసి మా అమ్మాయి ఆ రాత్రి నుండి దగ్గకుండ నిద్రపోయింది. పగలు మాత్రం అప్పుడప్పుడు కొంచెం దగ్గు వస్తుండేది. మూడు రోజుల తరువాత డాక్టర్ దగ్గరకి వెళ్తే మరో ఐదు రోజులపాటు మందులు వాడమన్నారు. బాబా నా మొర విని, నెల రోజులుగా ఉన్న అనారోగ్యాన్ని రెండు రోజుల్లో చాలావరకు తగ్గించారు. మరో ఐదు రోజులలో పూర్తిగా తగ్గిస్తారనే సంపూర్ణ విశ్వాసముంచి ఐదు రోజుల తరువాత డాక్టరు దగ్గరకి వెళితే టెస్టులు చేసి, "ఇన్ఫెక్షన్ చాలావరకు తగ్గిపోయింది. ఆక్సిజన్ లెవల్ నార్మల్‍గా(98) ఉంది(మునపటివారం 92-94 ఉంది). ఇక ఇబ్బంది లేదు. నాలుగు రోజుల తరువాత అమ్మాయిని స్కూలుకు కూడా పంపవచ్చు" అని చెప్పి కొన్ని మందులిచ్చారు. బాబా దయవలన డిసెంబర్ 17 నాటికి పాపకి బలహీనత కూడా తగ్గి తన ఆరోగ్యం సాధారణ స్థాయికి చేరుకుంది. "చాలా చాలా ధన్యవాదాలు బాబా. ఎల్లపుడూ మీ బిడ్డలందరిని చల్లగా చూడు తండ్రీ".


ఇప్పుడు నా విషయంలో బాబా చూపిన ప్రేమను, రక్షణను మీతో పంచుకుంటాను. 2022, డిసెంబర్ 22, బుధవారంనాడు నేను ఆఫీసుకు బయలుదేరేటప్పుడు నా ఛాతీలో కొంచెం నొప్పిగా అనిపించింది. అయినా బాబాను తలచుకుని ధైర్యంగా బయలుదేరాను. నేను ఎల్లపుడూ నా వెన్నంటి ఉండమని బాబాను కోరుకుంటాను. ప్రతిరోజూ ఆఫీసుకు వెళ్ళేటపుడు దారిలో ఏదో ఒక చోట బాబా ఫోటో రూపంలో నాకు దర్శనం ఇస్తుంటారు. కానీ ఆరోజు దారిలో బాబా దర్శనం కోసం ఎంతగానో ఎదురుచూసినప్పటికీ ఆయన ఎక్కడా కనిపించలేదు. అందువల్ల నాలో ఏదో తెలియని ఆందోళన మొదలైంది. అయితే ఆఫీసు దగ్గరకు చేరుకున్న క్షణాన ఒక బైక్ నన్ను దాటుకుంటూ వెళ్ళింది. ఆ బైక్ వెనక లైటుపై 'ఓం సాయిరాం' అన్న అక్షరాలు కనిపించాయి. వాటిని చూడగానే నా మనసు కుదుటపడింది. తరువాత 12.00 గంటల సమయంలో నా ఛాతీలో నొప్పి ఎక్కువగా అనిపించింది. నాకు భయమేసి నా మిత్రులతో కలిసి మా ఆఫీసు ప్రాంగణంలో ఉన్న హాస్పిటల్‌కు వెళ్ళాను. డాక్టరు ఈసీజీ చేసి, "చాలా తేడాగా ఉంది. మీరు వెంటనే విజయవాడలోని పెద్ద ఆస్పత్రికి వెళ్ళండి" అని అంబులెన్స్ పిలిపించారు. నాకు చాలా భయమేసింది, నా బీపీ పెరిగిపోయింది. వెంటనే మిత్రులతో కలిసి విజయవాడకు ప్రయాణమయ్యాను. విజయవాడలోకి ప్రవేశిస్తూనే మా అంబులెన్స్ వెనక ఒక లారీ, ఆ లారీపైన అభయహస్తంతో నిలువెత్తు బాబా ఫోటో కనిపించేసరికి నాకు చాలా సంతోషం కలిగింది. 'బాబా నా వెంటే ఉన్నారు' అనే ధైర్యం వచ్చింది. హాస్పిటల్‌కి చేరుకున్న తరువాత కార్డియాలజీ డాక్టర్ ప్రాథమిక పరీక్షలు(ఈసీజీ, 2డి ఎకో, బ్లడ్ టెస్టులు) చేసి, "మీకు స్ట్రోక్ వచ్చిన సూచనలేమీ లేవు. బహుశా మీకొచ్చింది కండరాల నొప్పి అయి ఉండాలి. అయినప్పటికీ చివరగా సిటీ స్కాన్, ఆంజియోగ్రామ్ చేసి చూద్దామ"ని చెప్పి ఆ పరీక్షల కోసం అంబులెన్స్‌లో పరీక్ష చేసే చోటుకు పంపించారు. నాకు మళ్ళీ భయమేసి బాబాను తలచుకుని, "ఈ పరీక్షల్లో కూడా నెగిటివ్ రావాలి బాబా" అని కోరుకున్నాను. నేను అలా బాబాను తలచుకున్న వెంటనే మా అంబులెన్స్ ముందున్న కారు వెనక బాబా ఫోటో రూపంలో దర్శనమిచ్చారు. ల్యాబ్‌కి చేరుకునేవరకు ఆ కారు మా అంబులెన్స్ ముందు పైలట్ వెహికల్ లాగా వచ్చి ముందుకు వెళ్ళిపోయింది. నాకు చాలా ధైర్యం వచ్చింది. బాబాకి తన భక్తులంటే ఎంత ప్రేమో! సిటీ, ఆంజియోగ్రామ్ చేశాక, "రిజల్ట్స్ మరుసటిరోజు వస్తాయి. మీరు ఇంటికి వెళ్ళి, రేపు రండి" అని చెప్పారు. మరుసటిరోజు గురువారం. నేను బాబాకి పూజ చేసి, ఆయన మీద నమ్మకంతో రిజల్ట్స్ కోసం ఎదురుచూసాను. కొంతసేపటికి హాస్పిటల్ నుండి, "రిజల్ట్స్ వచ్చాయి. మీరు రండి" అని ఫోన్ చేశారు. నేను వెళ్ళే దారిలో బాబా గుడిలో దర్శనం చేసుకుని హాస్పిటల్‌కి వెళ్ళాను. రిపోర్ట్స్ చూసిన డాక్టర్, "మీరు ఆందోళన పడవలసిన అవసరం లేదు. నొప్పి కండరాల నొప్పి అయుంటుంది. గుండెకు సంబంధించినది కాదు. కేవలం 10% బ్లాక్స్ ఉన్నాయి. వాటికి మందులు ఇస్తాను వాడండి" అని చెప్పారు. నేను నమ్ముకున్న నా దేవుడు, నా సర్వస్వం బాబానే. ఆయన నాకు తోడుగా, నీడగా ఉండి నన్ను కాపాడారు. కన్నీళ్లతో(ఆనందభాష్పాలు) తప్ప ఆయనకి నా కృతజ్ఞతలు ఎలా చెప్పాలో నాకు తెలియడం లేదు. "ధన్యవాదాలు బాబా. మీరు చెప్పిన మార్గంలో నడిచే శక్తిని ఇవ్వండి. అలాగే శ్రద్ద, సహనం పెంపొందేలా అనుగ్రహించండి బాబా. ఎల్లప్పుడూ నా వెన్నంటి ఉంటూ, నన్ను కాపాడుతూ ముందుకు నడిపిస్తున్న మీకు శతకోటి వందనాలు. థాంక్యూ బాబా. ఐ లవ్ యూ బాబా". ఆ కరుణామూర్తి దయవల్ల అందరూ ఆరోగ్యంగా, ఆనందంగా ఉండాలని ప్రార్థిస్తూ సెలవు తీసుకుంటున్నాను.


ఓం శ్రీసాయి ధన్వంతరియే నమః!!!

శ్రీ సచ్చిదానంద సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజ్ కీ జై!!!


శ్రీసాయి అనుగ్రహం


ఓం శ్రీసాయినాథాయ నమః!!! 'సాయి మహారాజ్ సన్నిధి' బ్లాగు నిర్వహిస్తున్న సాయికి, సాయి బంధువులకు నమస్కారాలు. నా పేరు విజయ. నేను శ్రీసాయినాథుని దివ్య పాదాలకు శిరస్సు వంచి నమస్కరిస్తూ నా అనుభవాలను మీతో పంచుకోబోతున్నాను. ముందుగా నా అనుభవాలు పంచుకోవడంలో ఆలస్యమైనందుకు బాబాకు క్షమాపణలు చెప్పుకుంటున్నాను. ఈమధ్య చెన్నైలో ఉంటున్న మా అమ్మాయి ఒళ్లంతా రాషెస్ చాలా ఎక్కువగా వచ్చాయి. తను స్కిన్ స్పెషలిస్ట్ కి చూపించుకుంటే, కిడ్నీ టెస్ట్, క్యాన్సర్ టెస్ట్ అని చాలా టెస్టులు వ్రాసారు. 50 వేల రూపాయలు దాకా అయింది. మా అమ్మాయి చాలా భయపడి మాకు విషయం చెప్పింది. అది విని మాకు కూడా చాలా భయమేసింది. నేను బాబా దగ్గర చెప్పుకుని బాధపడి, 'సాయీ! అన్ని రిపోర్టులు నార్మల్‍గా వచ్చేలా చూసి అమ్మాయి ఆరోగ్యం బాగుండేలా అనుగ్రహించు తండ్రి. నా సంతోషం 'సాయి మహారాజ్ సన్నిధి' బ్లాగు ద్వారా తోటి భక్తులతో పంచుకుంటాను" అని చెప్పుకున్నాను. బాబా దయవల్ల రిపోర్టులన్నీ బాగా వచ్చాయి. "ధన్యవాదాలు సాయితండ్రి. మీ పాదాలే శరణం గురుదేవా".


ఒకసారి నేను, మావారు మా మానవడిని తీసుకుని ఒక మాల్‍కి వెళ్ళాము. మా అమ్మాయి ఆఫీస్ నుంచి నేరుగా మాల్‍కి వచ్చింది. తను బాబుని గేమ్స్ ఆడిస్తుంటే, నా చేతిలో ఉన్న పర్సు తనకిచ్చి నేను, మావారు ఫోన్ మాట్లాడుతూ బయటికి వెళ్ళాము. మా అమ్మాయి నేను పర్సు ఇచ్చిన విషయం మరిచిపోయి ఆ పర్సును అక్కడే కింద వదిలేసింది. తర్వాత డబ్బులు కావాల్సి వచ్చి మా మనవడు పర్సు అడిగాడు. అప్పుడు పర్సు కోసం చూస్తే కనిపించలేదు. ఆ పర్సులో బ్యాంక్ కార్డులు, 20,000 రూపాయలు ఉన్నాయి. ఆ మాల్‍లో చాలా జనం ఉన్నారు. అంత జనంలో అంతా వెతికాము కానీ పర్సు దొరకలేదు. కానీ నాకెందుకో పర్సు దొరుకుతుందనిపించి సాయిస్మరణ చేస్తూ ఉన్నాను. కాసేపటికి ఆ మాల్‍లో పనిచేసే ఒక వర్కర్‍ని పర్సు గురించి అడిగితే, "అక్కడ ఆఫీస్ రూములో అడగండి. ఎవరికైనా దొరికి ఉంటే అక్కడ ఇస్తారు. అలా ఇచ్చి ఉంటే మీ పర్సు మీకు దొరకవచ్చు" అన్నాడు. అక్కడికి వెళ్లి అడగగానే వాళ్ళు "ఎర్ర పర్సా?" అని అడిగారు. అవును అనగానే వాళ్ళు మా పర్సు మాకిచ్చారు. కొన్ని వందల మంది తిరిగే చోట పోయిన పర్సు దొరకడమంటే నిజంగా బాబా ఆశీర్వాదమే. 'చాలా చాలా ధన్యవాదాలు బాబా'.


4 comments:

  1. ఓం సాయిరాం వంశి మంచిగా మారి నన్ను అర్థం చేసుకొని నన్ను కాపురానికి తీసుకొని వెళ్లేలా చూడు సాయి నేను కూడా నా అనుభవాన్ని బ్లాక్లో లో పంచుకుంటాను సాయి

    ReplyDelete
    Replies
    1. తప్పకుండా బాబా మీ husband ని పంపిస్తారు sister. మీరు శ్రద్ధ సభూరి తో ఉండండి

      Delete
  2. Om sri sainathaya namaha
    Om sri sainathaya namaha
    Om sri sainathaya namaha
    Om sri sainathaya namaha
    Om sri sainathaya namaha

    ReplyDelete
  3. Om Sairam
    Sai always be with me

    ReplyDelete

సాయి మహారాజ్ సన్నిధి సోషల్ మీడియా లింక్స్:

Subscribe Here

బ్లాగ్ అప్డేట్ నోటిఫికేషన్స్ నేరుగా మీ మెయిల్ కే వచ్చేందుకు క్రింద బాక్సులో మీ మెయిల్ ఐడి టైపు చేసి subscribe పై క్లిక్ చేసి, తరువాత స్టెప్స్ పూర్తీ చేయండి.

Delivered by FeedBurner

Followers

Recent Posts


Blog Logo