సాయి వచనం:-

- శ్రీబాబూజీ.

సాయిభక్తుల అనుభవమాలిక 1417వ భాగం....


ఈ భాగంలో అనుభవాలు:

1. కష్టాలు బాబాని చేరుకునే మెట్లు
2. నమ్ముకున్నవారికి బాబా తప్పక సహాయం చేస్తారు

కష్టాలు బాబాని చేరుకునే మెట్లు


శ్రీ సచ్చిదానంద సమర్థ సద్గురు సాయినాథ్ మహరాజ్ కీ జై!!!


ముందుగా ఈ బ్లాగు నిర్వాహకులకు మరియు బాబా భక్తులకు నా హృదయపూర్వక నమస్కారాలు. బాబా తమని నమ్మిన భక్తులని ఎన్నడూ వదలరని, ఎల్లవేళలా వారి యోగక్షేమాలు చూస్తూంటారనడానికి ఈ బ్లాగులో ప్రచురితమయ్యే అనుభవాలే ఉదాహరణలు. నేను నా చిన్నతనం నుండి బాబాకి భక్తురాలిని. ఊహ తెలియని వయసు నుండే నేను ఆయన్ని నమ్మేదాన్ని. స్కూల్లో చదువుకునేటప్పుడు పరీక్షలు బాగా వ్రాయకపోయినా, ఇంకే చిన్న సమస్య వచ్చినా 'బాబా బాబా' అని అనుకుంటూ ఉండేదాన్ని. ప్రతిసారీ బాబా నన్ను కాపాడేవారు. చిన్నప్పటి ఆ అలవాటే పెద్దయ్యాక కూడా నాకు ఉంది. ఈరోజుకీ నాకు దిక్కు బాబానే. ఆయన ఎన్నో సమస్యల నుండి నన్ను గట్టెక్కించారు. ఒకనొక సమయంలో నేను ఎవ్వరికీ చెప్పుకోలేని మానసిక ఆందోళనను అనుభవించాను. తట్టుకోలేక థెరపిస్ట్ ని కలిసి నా ఆందోళనలను చెప్పుకోవాలనిపించేది. అటువంటి స్థితిలో బాబాయే నాకు అండగా నిలిచి అందులో నుండి బయటపడేసారు. ఆయన నన్ను ఎంతలా కనిపెట్టుకుని ఉన్నారో మాటల్లో చెప్పలేను. కాలమెప్పుడూ ఒకేలా ఉండదు, మారుతూ ఉంటుంది. మన కష్టాలు కూడా సమసిపోతాయి. కానీ ఆ కష్టాలు బాబాని చేరుకునే మెట్ల వంటివి. సరైన అవగాహనతో కష్టాలను ఎదుర్కొనగలిగితే అవి మనల్ని బాబా చెంతకు చేరుస్తాయి. బాబా అనుగ్రహం ఉంటే కష్టాలు కూడా బాబా అనుగ్రహాన్ని చవిచూపే అనుభవాలవుతాయి. అలాంటి అనుభవాలు నా జీవితంలో లెక్కలేనన్ని. వాటిల్లో నుండి కొన్ని ఇప్పుడు ఈ బ్లాగులో పంచుకుంటాను.


ఒకరోజు ఆఫీసులో నాకు అప్పగించిన పని నేను సరిగ్గా చేయలేదు. దానివల్ల నాపై అధికారి ఇబ్బందిపడతారేమో అని నేను చాలా భయపడ్డాను. కానీ బాబాని తలుచుకోగానే మా భయమంతా పోయింది. అంతేకాదు, నేను పని సరిగా చేయకపోవడం వల్ల ఎటువంటి నష్టం కలగలేదు. ఇది చిన్న విషయంగా అనిపించినా నా మనసులో కలిగిన భయాందోళనలు అంతాఇంతా కాదు. అవి ఆ బాబాకే తెలుసు.


ఒకసారి మా అన్నయ్యవాళ్ళు నన్ను ఒక విహారయాత్రకు పిలిచారు. నాకు వెళ్ళాలనే ఉన్నా వెళితే ఆఫీసులో ఇబ్బంది అవుతుందేమోనని భయపడ్డాను. అదీకాక సరిగ్గా ప్రయాణానికి 3 రోజులు ఉందనగా నేను విపరీతమైన జలుబుతో ఇబ్బందిపడ్డాను. చాలా ఆందోళనగా అనిపించి అన్నయ్యకి రాలేనని చెప్పినా తను వినలేదు. నన్ను, నా ఇబ్బందిని ఎవరూ అర్దం చేసుకోవట్లేదని, నాకు ఏది మంచో నా కుటుంబసభ్యులే నిర్ణయించేసి, నేను సంపూర్ణంగా ఇష్టపడకపోయినా నాచేత చేయిస్తున్నారని, తెలియని మనోవేదనతో చాలా బాధ అనుభవించాను. ఇప్పుడేకాదు, ప్రతిసారీ వాళ్ళు నా ప్రమేయం లేకుండానే నాకు సంబంధించి నిర్ణయం తీసేసుకుని నన్ను ఒప్పిస్తారని నాకు చాలా కష్టంగా అనిపించింది. నేను చాలా విషయాలలో అయోమయంగా ఉంటాను. ముఖ్యంగా కుటుంబం విషయాల్లో. గట్టిగా నా అభిప్రాయం చెప్పాలనుకుని కూడా ఒక్కోసారి చెప్పలేక నాలో నేను సతమతమవుతాను. అలాంటి నేను బాబా దయవల్ల ఈ మధ్యనే ఉద్యోగంలో చేరి, అప్పటినుండే మానసికంగా ఉల్లాసంగా ఉన్నాను. ఎలాగైనా కష్టపడి ఆత్మవిశ్వాసంతో బతకాలన్నది నా ధ్యేయం. నా ఈ ప్రయత్నంలో బాబా నాకు తోడుగా ఉంటారని బాబా మీద నమ్మకంతో నా ప్రతి అడుగువేస్తున్నాను. ఇదంతా సరేగానీ,  ఏదేమైనా యాత్రకి వెళ్లాల్సి వస్తే, ఆఫీసులో పని, అలాగే నా ఆరోగ్యం ఎలా అనిపించి, "నాకు ఎటువంటి ఇబ్బంది లేకుండా చూడమ"ని బాబాను వేడుకున్నాను. బాబా దయవల్ల ప్రయాణానికి ముందురోజువరకు టాబ్లెట్లకి కంట్రోల్ కాని జలుబు సరిగ్గా ప్రయాణమయ్యే రోజుకి కంట్రోల్ అయింది. ప్రయాణం కూడా బాగా జరిగింది. మామూలుగా మా వదిన కొంచెం పేచీకోరు మనిషి. ఆమెతో ఉండేటప్పుడు ఎప్పుడు ఏ గొడవ వస్తుందో అని నాకు కొంచెం భయంగా ఉంటుంది. అలాంటిది బాబా దయవల్ల ప్రయాణమంతా సాఫీగా జరిగింది. అలాగే ఆఫీసులో కూడా ఏ ఇబ్బందీ కలగలేదు. ఇలా బాబా నా వెంటే ఉంటూ నా ప్రతి ఆందోళనను తొలిగిస్తూ నన్ను ఎంతగానో అనుగ్రహిస్తున్నారు. ధన్యవాదాలు బాబా. సదా నాకు తోడుగా ఉండండి.


ఒకసారి మా అక్క పిల్లల సెలవులకి రెండు రోజులు మా ఇంటికి వస్తానని అంది. కాని టిక్కెట్లు అందుబాటులో ఉన్న రోజు మా అక్క, బావకి కుదరకపోవటం, వాళ్ళకి కుదిరే రోజు టిక్కెట్లు లేకపోవటం జరిగింది. దాంతో అక్క, "చాలారోజులు అయింది మీ అందరిని చూసి, కానీ రాలేకపోతున్నాను" అని బాధపడింది. నాకు చాలా దిగులుగా అనిపించి, "బాబా! ఏ ఆటంకం లేకుండా అక్క మా ఇంటికి వచ్చి, రెండు రోజులుండి వెళితే నేను మీ అనుగ్రహాన్ని మన 'సాయి మహరాజ్ సన్నిధి'లో పంచుకుంటాను" అని బాబాకి మ్రొక్కుకున్నాను. బాబా అనుగ్రహంతో అక్క రావడానికి కారు సర్దుబాటు అయి తను ఏ ఇబ్బంది లేకుండా మా ఇంటికి వచ్చింది. ఇకపోతే సరిగ్గా మా అక్క తిరుగు ప్రయాణమయ్యే సమయానికి ఒక బంధువు ఒకాయన మా ఇంటికి రావడంతో మేము టెన్షన్ అయ్యాము. ఎందుకంటే, ఆయనకి, మా బావకి కొంచెం మనస్పర్థలున్నాయి. ఆ కారణంగా అక్క బాధపడేలా ఆయన ఏమన్నా మాట్లాడతారేమో, అక్క మా ఇంటి నుండి వెళ్ళేటపుడు బాధడుతూ వెళ్తుందేమో అని నాకు చాలా ఆందోళనగా అనిపించింది. నేను వెంటనే, "బాబా! అక్క వెళ్లే లోపల ఆయన ఏమీ మాట్లాడకుండా బయలుదేరితే బ్లాగులో పంచుకుంటాను" అని బాబాని వేడుకున్నాను. ఆయన లీల చూడండి. నేను అలా అనుకున్న మరు నిమిషంలో ఆయన నేను బయలుదేరతానని వెళ్ళిపోయాడు. బాబా అనుగ్రహానికి నేను ఎంతో పులికించిపోయాను. అలా మా అక్క వచ్చి, వెళ్లేవరకు అంతా సవ్యంగా జరిగేలా అనుగ్రహించారు బాబా. "ధన్యవాదాలు బాబా. నేను ఇంకేమైనా అనుభవాలు పంచుకోవడం మార్చిపోయుంటే క్షమించండి బాబా".


శుభం భవతు!!!

రాజాధిరాజ యోగిరాజ పరబ్రహ్మ శ్రీ సచ్చిదానంద సద్గురు శ్రీసాయినాథ్ మహరాజ్ కీ జై!!! 

సర్వం శ్రీసాయినాథార్పణమస్తు!!!


నమ్ముకున్నవారికి బాబా తప్పక సహాయం చేస్తారు


సాయిబంధువులకు, 'సాయి మహారాజ్ సన్నిధి' బ్లాగు నిర్వాహకులకు నా నమస్కారాలు. నేను ఒక సాయి భక్తురాలిని. నా పేరు శ్రీదేవి. బాబా అండ లేకపోతే నేను ఎలా ఉండేదాన్నో ఊహించడానికే భయంగా ఉంది. ఆయనే నా ధైర్యం, బలం. నాకు సంతోషమేసినా, బాధ కలిగినా, ఇంకే సమస్య అయినా నేను ముందుగా బాబా తండ్రికి చెప్పుకుంటాను. బాబా చేసిన ఒక మేలును నేనిప్పుడు మీతో పంచుకుంటున్నాను. అందుకు నాకు సంతోషంగా ఉంది. నాకు ఒక అన్నయ్య, చెల్లెలు ఉన్నారు. వాళ్లిద్దరూ వాళ్లకు ఏ సమస్య వచ్చినా ముందు నాతోనే చెప్పి, బాబాను ప్రార్థించమని చెప్తారు. కొన్నిరోజుల క్రితం అన్నయ్య తన ట్రాక్టర్ ఒకటి అమ్మాలనుకున్నాడు. కానీ ఎంత ప్రయత్నించినా ఏదో ఒక ఆటంకం వచ్చి ట్రాక్టర్ అమ్మలేకపోయాడు. అప్పుడు, "ఎలాగైనా ట్రాక్టర్ అమ్ముడుపోయేలా చూడమ"ని బాబాను ప్రార్థించాడు. తరువాత ఒక గురువారంనాడు ఒక సాయిబంధువు ద్వారా ఆ ట్రాక్టరుని అమ్మగలిగాడు. ఆ ట్రాక్టరు కొనుకున్న వాళ్ళకి దానికి సంబంధించిన ముఖ్యమైన కాగితాలు ఇవ్వాల్సి ఉండగా, అన్నయ్య వాటిని ఒక పుస్తకంలో పెట్టానని గుర్తు చేసుకుని ఆ పుస్తకంలో చూస్తే ఆ పేపర్లు కనపడలేదు. అప్పుడు అన్నయ్య ఆ పేపర్లు అర్జెంటుగా వాళ్ళకి ఇవ్వాలి అని నాతో చెప్పాడు. నేను వెంటనే బాబాను, "ఆ పేపర్స్ దొరికితే, నా అనుభవాన్ని బ్లాగులో పంచుకుంటాన"ని ప్రార్థించాను. తర్వాత అన్నయ్యకు ఆ పుస్తకంలోనే పేపర్స్ ఉన్నాయేమోననిపించి మరోసారి పుస్తకం తెరిస్తే, ఆశ్చర్యంగా ఆ పేపర్స్ అందులోనే ఉన్నాయి. ఇదంతా బాబా దయే అనుకున్నాము. నిరంతరం బాబా నామస్మరణ చేసుకుంటూ బాబా చూపిన మార్గంలో నడిచేవారికి బాబా తప్పక సహాయం చేస్తారు.


3 comments:

  1. Om sri sainathaya namaha
    Om sri sainathaya namaha
    Om sri sainathaya namaha
    Om sri sainathaya namaha
    Om sri sainathaya namaha

    ReplyDelete
  2. Om Sairam
    Sai always be with me

    ReplyDelete

సాయి మహారాజ్ సన్నిధి సోషల్ మీడియా లింక్స్:

Subscribe Here

బ్లాగ్ అప్డేట్ నోటిఫికేషన్స్ నేరుగా మీ మెయిల్ కే వచ్చేందుకు క్రింద బాక్సులో మీ మెయిల్ ఐడి టైపు చేసి subscribe పై క్లిక్ చేసి, తరువాత స్టెప్స్ పూర్తీ చేయండి.

Delivered by FeedBurner

Followers

Recent Posts


Blog Logo