1. వేడుకున్నంతనే బాధలు తీర్చే బాబా
2. కారు తాళాల సమస్య సులభంగా పరిష్కారమయ్యేలా సహాయం చేసిన బాబా
3. శ్రీసాయినాథుని దయతో సుఖప్రయాణం
వేడుకున్నంతనే బాధలు తీర్చే బాబా
ఓం శ్రీసాయినాథాయ నమః!!! ముందుగా మనకి సర్వం అయినటువంటి శ్రీసాయినాథునికి శతకోటి నమస్కారాలు. ఈ బ్లాగ్ నిర్వహిస్తున్న సాయికి సదా శ్రీసాయినాథుని దివ్యాశీస్సులు ఉండాలని కోరుకుంటున్నాను. నా పేరు యశోద. మాది అనంతపురం. నేను ఇదివరకు నా అనుభవాలు కొన్ని తోటి సాయి భక్తులతో పంచుకున్నాను. ఇప్పుడు మరో రెండు అనుభవాలతో మీ ముందుకి వచ్చాను. ముందుగా ఈ అనుభవాలను పంచుకోవడంలో కొద్దిగా ఆలస్యమైనందుకు బాబాకి క్షమాపణలు చెప్పుకుంటున్నాను. 2022, నవంబర్ 24న మేము శిరిడీ వెళ్లాలని 2 నెలల ముందు టికెట్లు, శిరిడీలో రూములు బుక్ చేసుకున్నాము. అన్ని యాత్ర స్థలాలకు ఎప్పుడనుకుంటే అప్పుడు వెళ్ళవచ్చు, కానీ, శిరిడీ వెళ్లాలంటే శ్రీసాయినాథుడే మనల్ని పిలవాలి. ఆయన మనలను పిలవకపోతే ఎవరూ ఇంటి గడపను దాటలేరని సాయి భక్తుల విశ్వాసం. అలాంటిది బాబా ఒకే సంవత్సరంలో మూడుసార్లు శిరిడీ రప్పించుకుంటే ఎంత సంతోషంగా ఉంటుందో ఊహించండి. అవును బాబా దయతో నేను 2022వ సంవత్సరంలో అది మూడోసారి శిరిడీ వెళ్లబోవటం. అందుకే నేను మూడోసారి శిరిడీ దర్శన భాగ్యం కలుగుతున్నందుకు ఎంతో పొంగిపోయాను. అలా పొంగిపోతూ నవంబర్ 24 ఎప్పుడు వస్తుందా అని ఎదురు చూస్తూ గడిపాను. ఇంతలో నవంబర్ నెల రానే వచ్చింది. సరిగ్గా మా ప్రయాణానికి నాలుగు రోజుల ముందు అంటే 20వ తేది నుండి హైదరాబాద్‍లో ఉంటున్న మా అమ్మాయికి జ్వరం, ఆయాసం ఎక్కువగా ఉండసాగాయి. తను నాకు ఫోన్ చేసి, "డాక్టర్ వద్దకు వెళ్లినా తగ్గలేదు. చాలా ఆయాసంగా ఉంటుంది" అని చెప్పింది. అప్పటినుండి నాకు చాలా దిగులుగా అనిపించి 'అమ్మాయికి తగ్గకపోతే నేను శిరిడీ ఎలా వెళ్ళేద'ని చాలా బాధపడ్డాను. కానీ 'బాబా పిలిచారంటే, ఆయనే రప్పించుకుంటార'ని ఆయన మీద విశ్వాసంతో ఉంటూ అమ్మాయిని, "బాబా ఊదీ నీళ్లలో కలుపుకుని త్రాగమ"ని చెప్పాను. తను అలాగే చేసింది. నేను, "బాబా! నేను శిరిడీకి ప్రయాణమయ్యేనాటికి మా అమ్మాయికి తగ్గిపోవాలి. అలాగైతే మీ అనుగ్రహాన్ని 'సాయి మహారాజ్ సన్నిధి' బ్లాగు ద్వారా తోటి భక్తులతో పంచుకుంటాను" అని బాబాను వేడుకున్నాను. నవంబర్ 24వ తేదీ ఉదయం మా అమ్మాయి ఫోన్ చేసి, "జ్వరం, ఆయాసం లేవు. పూర్తిగా తగ్గిపోయాయి" అని సంతోషంగా చెప్పింది. మేము సంతోషంగా శిరిడీ వెళ్లి బాబా దర్శనం చేసుకుని తిరిగి వచ్చాము.
నేను గవర్నమెంట్ టీచర్ని. 2022, డిసెంబరులో నేను వారం రోజులు సెలవు పెట్టి, హైదరాబాదులో ఉన్న మా అమ్మాయి దగ్గరకి వెళ్లాను. మేము మా వృత్తిరిత్యా ఆదివారాలు, పబ్లిక్ సెలవులు, మేము పెట్టుకున్న సెలవులు అన్నీ కలిపి పదిరోజులకి మించితే మాకు ఇబ్బంది అవుతుంది. అందువలన డిసెంబరు 23వ తేదీన నేను ఖచ్చితంగా స్కూలుకు వెళ్లాలి. ఎందుకంటే, అప్పటికే నేను హైదరాబాద్ వచ్చి 9 రోజులు అయింది. కాబట్టి డిసెంబరు 22న అనంతపురం వెళ్లడానికి బస్సు రిజర్వేషన్ చేయించుకున్నాను. ఆ రోజు రాత్రి తొమ్మిది గంటలకి బస్సు. మా అమ్మాయివాళ్ళు హైదరాబాదులోని నల్లగండ్లలో ఉంటారు. బస్సు కూకట్‍పల్లిలో ఎక్కాల్సి ఉండగా మేము గం.8:45 నిమిషాలకు అక్కడ ఉండాలి. మేము రాత్రి ఏడున్నరకి తయారై కారులో బయలుదేరుతుండగా ట్రావెల్స్ వాళ్ళు ఫోన్ చేసి ఒక గంట ఆలస్యంగా రమ్మని చెప్పారు. మేము బయలుదేరిపోయామని చెప్తే, "సరే, మియాపూర్కు రండి. బస్సు అక్కడ నుండే బయలుదేరుతుంది" అని చెప్పారు. సరేనని, మేము అక్కడికి వెళ్లాం. అక్కడ, "బస్సు చెడిపోయింది. రిపేర్ అవ్వడం కష్టమ"ని చెప్పారు. అప్పటికప్పుడు వేరే బస్సుకి టికెట్ దొరకదు. నాకేం చేయాలో తోచక, "రేపు స్కూలుకి వెళ్ళాలి. ఇలా అయిందేంటి?" అని చాలా టెన్షన్ పడ్డాను. వెంటనే మన తండ్రికి దణ్ణం పెట్టుకుని, "ఎలాగైనా బస్సు రిపేర్ అయి, రేపు ఉదయానికి నేను స్కూలుకి వెళ్లగలిగేలా చేయండి బాబా. అలా జరిగితే మీ అనుగ్రహాన్ని బ్లాగులో పంచుకుంటాను" అని వేడుకున్నాను. అలా బాబాను ప్రార్థించిన పది నిమిషాల్లో, "బస్సు రెడీ అయింది, బస్సు ఎక్కండి" అని చెప్పారు. నాకు ఎంత ఆనందమేసిందో చెప్పలేను. అలా ఆ సాయినాథుని దయతో నేను క్షేమంగా మా ఊరు చేరుకుని, నా డ్యూటీకి వెళ్ళాను. ఏమిచ్చి బాబా ఋణం తీర్చుకోను?
మా అమ్మాయివాళ్ళు డిసెంబర్ 23, 24 తేదీలలో శిరిడీ వెళ్లాలనుకున్నారు. కానీ టికెట్లు దొరకలేదు. అప్పుడు వాళ్ళు శిరిడీ వెళ్లకుంటే, తరువాత వెళ్లడానికి కుదరదు. అందువలన నేను బాబాను ప్రార్థించాను. బాబా దయవలన వెంటనే బస్సు టికెట్లు దొరికి మా అమ్మాయివాళ్ళు క్షేమంగా శిరిడీ వెళ్లి బాబాను దర్శించుకుని, తిరిగి ఇంటికి వచ్చారు. అంతా సాయి దయ. వేడుకున్నంతనే బాధలు తీర్చే మన బాబాకు ఎన్ని జన్మలలో సేవ చేసినా ఆయన ఋణం తీర్చుకోలేము. "ధన్యవాదాలు సాయినాథా! నాకు ఒక్కటే కోరిక, 'తుదిశ్వాస వీడే సమయంలో కూడా మీ రూపమే, మీ నామమే నాకు గుర్తుండాలి బాబా"'.
శ్రీసాయినాథ్ మహారాజ్ కి జై!!!
కారు తాళాల సమస్య సులభంగా పరిష్కారమయ్యేలా సహాయం చేసిన బాబా
నా పేరు కుమార్. నేను హైదరాబాద్ నివాసిని. ఒకరోజు నేను, నా స్నేహితుడు బైక్ మీద వెళ్తుండగా నా ప్యాంటు జేబులో ఉన్న నా కారు తాళం ఎక్కడో పడిపోయింది. సంవత్సరం క్రితం మొదటి తాళం పోగొట్టుకున్నాను. ఇప్పుడు పోయింది రెండో తాళం. ఎంత వెతికినా ఆ తాళం దొరకలేదు. బాబాకి నమస్కరించుకుని చాలాసేపు వెతికాను. అయినా దొరకలేదు. ఇంక చేసేది లేక తాళాలు చేసే వ్యక్తి దగ్గరకి వెళ్ళి నా కారుకి ఒక తాళం చేసివ్వమని అడిగాను. అతను నాకు కొన్ని సలహాలిచ్చి, "కారు కొన్నప్పుడు కారు తాళాలతోపాటు ఒక తాళం కోడ్ (నెంబర్) ఇస్తారు. ఆ నెంబర్ ఉంటే చాలా సులభంగా కారు తాళం తయారుచేయవచ్చు, లేకపోతే చాలా కష్టం అవుతుంది" అని చెప్పాడు. నేను వెంటనే ఇంటికి వచ్చి ఆ తాళం కోడ్ నెంబర్ కోసం ఇల్లంతా చాలా వెతికాను. రెండురోజులపాటు అన్ని చోట్ల, అన్ని కాగితాలలో వెతికాను. కానీ ఆ కోడ్ దొరకలేదు. కారు కొని 5 సంవత్సరాలు అయినందున ఆ నెంబర్ ఎక్కడో పోయుంటుంది, ఇంకిప్పుడు దొరకడం కష్టం అని అనుకుని చివరి ప్రయత్నంగా బాబాకి దణ్ణం పెట్టుకుని, "బాబా! మీ దయవలన ఎలాగైనా ఆ నెంబర్ దొరికితే, మీ అనుగ్రహాన్ని 'సాయి మహారాజ్ సన్నిధి' బ్లాగులో పంచుకుంటాను" అని అనుకున్నాను. అలా అనుకున్న 10 నిమిషాల్లోనే ఆ కోడ్ నెంబర్ దొరికింది. కారు ఇన్వాయిస్‍లో ఆ నెంబర్ వ్రాసి ఉంది. అది చూసి ఎంతో ఆనందంతో బాబాకి కృతజ్ఞతలు చెప్పుకుని, తాళాలు చేసే అతని దగ్గరకి వెళ్ళి ఆ నెంబర్ ఇచ్చాను. అతను 30 నిమిషాల్లో తాళాలు తయారుచేసి ఇచ్చాడు. ఆ నెంబర్ దొరకకపోయుంటే ఎంతో కష్టపడాల్సి వచ్చేది. చాలా ఇబ్బందిపడి ఉండేవాడిని. బాబా దయవలనే చాలా సులభంగా పని అయింది. ఏ కష్టమొచ్చినా బాబాతో చెప్పుకుంటే, ఆ కష్టం ఇట్టే తీరిపోతుంది. సాయినాథుడు ఎంతో దయామయుడు. మనం కష్టపడటం ఆయన అస్సలు చూడలేరు. ప్రతిక్షణం కంటి రెప్పలా కాపాడుతున్న నా తండ్రి సాయినాథునికి మనస్ఫూర్తిగా కృతజ్ఞతలు తెలుపుకుంటూ సెలవు తీసుకుంటున్నాను.
అఖిలాండకోటి బ్రహ్మాండనాయక రాజాధిరాజ యోగిరాజ పరబ్రహ్మ శ్రీ సచ్చిదానంద సమర్ధ సద్గురు సాయినాథ్ మహారాజ్ కీ జై!!!
శ్రీసాయినాథుని దయతో సుఖప్రయాణం
ఓంసాయి శ్రీసాయి జయజయ సాయి!!! ముందుగా శ్రీసాయి భక్తులకు నమస్కారం. నేను ఒక సాయి భక్తురాలిని. నా పేరు కళ్యాణి. శ్రీసాయినాథుని పాదపద్మములకు ప్రణామాలర్పించి బ్లాగు నిర్వహిస్తున్న సాయికి ఆయురారోగ్యాలు ప్రసాదించమని కోరుకుంటూ నేను నా అనుభవాన్ని మీ అందరితో పంచుకుంటున్నాను. హఠాత్తుగా మా పిన్నిగారు మరణించడంతో నేను, మా అబ్బాయి ఊరు వెళ్ళవలసి వచ్చింది. ఆకస్మిక ప్రయాణం వల్ల రిజర్వేషన్ లేకుండా టికెట్ కొనుక్కొని జనరల్ బోగిలో ప్రయాణం చేయవలసి వచ్చింది. అప్పుడు శ్రీసాయినాథుని తలుచుకుని, "బాబా! ప్రయాణం ఏ ఇబ్బంది లేకుండా సాఫీగా సాగేలా చూడండి. మీ కృపను 'సాయి మహారాజ్ సన్నిధి' బ్లాగులో పంచుకుంటాను" అని బాబాతో చెప్పుకున్నాను. బాబా దయవల్ల ప్రయాణం చాలా బాగా జరిగింది. తిరుగు ప్రయాణమప్పుడు మా బావగారు జనరల్ బోగిలో జనం ఎక్కువగా ఉన్నందున రిజర్వేషన్ బోగీలో మమ్మల్ని ఎక్కించారు. నేను, మా అబ్బాయి చాలా భయపడ్డాము. అయితే శ్రీసాయినాథుని చమత్కారం చూడండి. నేను ఆయన్ను కేవలం కూర్చోడానికి సీటు అడిగితే, ఏకంగా బెర్త్ ఇప్పించారు. చాలా ఆనందంగా మా జర్నీ పూర్తయింది. "ధన్యవాదాలు బాబా. ఆలస్యంగా నా అనుభవం పంచుకున్నందుకు నన్ను క్షమించండి. మరెన్నో అనుభవాలు నా జీవితంలో జరగాలి. మీ కృప అందరి మీద ఉండాలి తండ్రి". మరో అనుభవం మీతో పంచుకున్నందుకు చాలా చాలా సంతోషంగా ఉంది.
Please bless my son and daughter, daughter in law.Give long life to them. please bless my husband also.om sai ram
ReplyDeleteబాబా సాయి నా భర్త అని అర్థం చేసుకునేలా చూడు సాయి నాకు కాపురానికి తీసుకెళ్ళి సాయి దయ చూపండి సాయిబాబా
ReplyDeleteOm sri sainathaya namaha
ReplyDeleteOm sri sainathaya namaha
Om sri sainathaya namaha
Om sri sainathaya namaha
Om sri sainathaya namaha
Om Sairam
ReplyDeleteSai always be with me