సాయి వచనం:-

- శ్రీబాబూజీ.

సాయిభక్తుల అనుభవమాలిక 1426వ భాగం....


ఈ భాగంలో అనుభవాలు:

1. బాబా దయతో నెరవేరిన సొంతింటి కల - ఆయన పాదాల వద్దే ఉద్యోగం
2. చెప్పినట్లే, టెన్షన్ లేకుండా చేసిన బాబా
3. కోరుకున్నట్లే నార్మల్ రిపోర్టు వచ్చేలా అనుగ్రహించిన సాయి

బాబా దయతో నెరవేరిన సొంతింటి కల - ఆయన పాదాల వద్దే ఉద్యోగం


నేను ఒక చిన్న సాయి భక్తుడిని. నా పేరు తిరుమలకృష్ణ. నేను నా చిన్నతనంలో అంటే 6వ తరగతిలో ఉన్నప్పుడు మా అమ్మగారు బాబా చరిత్ర పారాయణ చేయడం చూసి నేను కూడా పారాయణ చేశాను. అప్పటినుంచి ఇప్పటివరకు నాకు బాబా అంటే చాలా చాలా ఇష్టం. బాబా మందిరానికి వెళ్తే, ఎనలేని ప్రశాంతత, భక్తిభావం కలుగుతుంది. అలా ఉంటాయి బాబా మందిరాలు. నేడు నాకు, నా కుటుంబానికి నాలుగు వేళ్ళు నోటిలోకి వెళ్తున్నాయి అంటే అది బాబా ఆశీర్వాదం, ఆయన చలవే. ఇక నా అనుభవాల విషయానికి వస్తే... ఎన్నో ఏళ్ళుగా సొంతిల్లు కట్టుకోవాలన్నది నా కల. అందుకోసం బాబాను ఎంతగానో ప్రార్థిస్తూ ఉండేవాడిని. ఆ కల ఈ సంవత్సరం(2022) ఆగస్టులో నెరవేరింది. అది బాబా చలవే. ఎందుకిలా అంటున్నానంటే, మేము ఇల్లు కట్టుకోవాలనుకున్న స్థలం ఉన్న చోట కేవలం 8 అడుగుల రోడ్డు మాత్రమే ఉంది. మా స్థలానికి మూడువైపులా ఇండ్లు కట్టేసుకున్నారు. అక్కడ మా స్థలం మాత్రమే ఖాళీగా ఉంది. కాబట్టి ఇంటి నిర్మాణానికి కావల్సిన మెటీరియల్ వేసుకోవడానికి, దూరంగా వేస్తే తెచ్చుకోవడానికి చాలా ఇబ్బందికరంగా ఉంటుంది. ఆ కారణంగా ఏ బిల్డరుని అడిగినా రేట్ ఎక్కువ చెప్పేవాళ్ళు. కొంతమంది ఆ సందులో కట్టడం కష్టం అనేవారు. అలా ఎవరూ ముందుకి వచ్చేవారు కాదు. కానీ ఆ బాబా కృప ఉంటే ఆపడం ఎవరి తరం కాదు కదా! ఆయన దయతో 2021, ఆగస్టు 21న మా ఇంటి నిర్మాణం ప్రారంభమైంది. అప్పటికి  చిన్నచిన్న గొడవలు, ఆటంకాలు అన్ని బాబా దయతో సద్దుమణిగాయి. నా చేతిలో చిల్లిగవ్వ  లేకపోయినా మా ఇంటి పునాది పడింది. దానికి బాబా భక్తుడైన నా మేనమామ ఆర్థికంగా సహాయసహకారాలు అందించారు. ఇల్లు నిర్మాణం పూర్తయ్యే దశలోనే డబ్బులు నీళ్లలా ఖర్చు అయిపోతాయి. ఆ సమయంలో కూడా నేను అడగకుండానే నా మేనమామ 5లక్షల రూపాయలు సహాయం చేసి కష్టసమయంలో  నన్ను ఆదుకున్నారు. ఆ సమయంలో అతను చేసిన సహాయం నేను నా జీవితంలో మర్చిపోలేను. ఎన్ని కష్టనష్టాలు ఎదురైనా బాబా దయవల్లనే మేము ఈ సంవత్సరం ఆగస్టు 4న మా కొత్తింట్లో దిగాము. ఎప్పుడో నా అంతిమ దశలో అవుతుందనుకున్న పని బాబా దయవల్ల చాలా తొందరగా పూర్తయింది. మా అమ్మానాన్నలను నా సొంతింటిలో కూర్చోపెట్టాలనే నా కోరికను బాబా ఎంతో ప్రేమతో మన్నించారు. "ధన్యవాదాలు బాబా. ఆ ఇంట్లో మీ పేరున అఖండజ్యోతి ప్రజ్వలన చేయాలన్నది నా కోరిక. దయతో తొందరలోనే అది నెరవేరేలా అనుగ్రహించండి బాబా".


నేను ఇదివరకు సెంట్రల్ గవర్నమెంట్ ఉద్యోగం చేస్తూ మంచి పొజిషన్లో ఉండేవాడిని. కానీ ఆ ఉద్యోగంలో ఎదుగుదల చాలా తక్కువగా ఉండటం, దానితోపాటు భారతదేశంలోని ఏ ప్రాంతానికైనా బదిలీ అవడం, దానివల్ల కుటుంబానికి దూరంగా ఉండడం నాకు చాలా కష్టంగా ఉండేది. అందువలన నేను ఈ మధ్యకాలంలో ఒక మంచి ప్రైవేట్ కంపెనీలో ప్రయత్నిస్తే మంచి జీతం, హోదా గల ఉద్యోగం దొరికింది. కానీ నాకు తెలిసిన చాలామంది గవర్నమెంట్ ఉద్యోగం వదులుకుని ప్రైవేట్ ఉద్యోగానికి రావడమేమిటని నన్ను తిట్టారు, అలా చేయవద్దని మందలించారు. అయినా సరే నేను, "బాబా! మీ ఆజ్ఞ లేనిదే నేను ఏమీ చేయలేను. మీరు ఏం చేసిన నా మంచికే అని నాకు తెలుసు. మీ కృపవలనే నాకు ఈ ఉద్యోగం వచ్చింది. ఇక మీదట కూడా మీరే నాకు దారి చూపాలి బాబా" అని బాబా మీద భారం వేసి క్లిష్టమైన నిర్ణయం తీసుకున్నాను. కొత్త ఇంటికి హోమ్ లోన్ చెల్లిస్తున్న సమయంలో గవర్నమెంట్ ఉద్యోగానికి 2 లక్షలు కట్టి మరీ రాజీనామా చేసి ప్రైవేట్ ఉద్యోగంలో జాయిన్ అయ్యాను. ఇక్కడ ట్విస్ట్ ఏంటంటే, నేను పనిచేస్తున్న కంపెనీలో బాబా మందిరం ఉంది. అది నాకు ఎనలేని సంతోషాన్ని ఇచ్చింది. నేను ఎక్కడున్నా సరే మీ పాదాలకి దగ్గర్లోనే ఉండాలని బాబాను కోరుకున్నాను. ఆయన నా కోరిక మేరకు తమ పాదాల వద్దే నాకు ఉద్యోగం ఇచ్చారు. అందుకు నేను ఆయనకు సర్వదా కృతజ్ఞుడిని. బాబా దయవల్ల ఇప్పుడు అంతా బాగుంది. ఆయన కృపతో కొద్దికాలంలో ఇంకా మంచి పొజిషన్లో ఉంటానని అనుకుంటున్నాను. దానికి తగ్గట్లు కృషి కూడా చేస్తాను. నేను బాబాని ఇప్పుడు, ఎప్పుడూ అడిగేది ఒక్కటే, "కుదిరితే పదిమందికి సహాయం చేయగలిగే శక్తిని ఇవ్వు, లేదంటే ఎవరికీ ఏ అన్యాయం, అపకారం చేయకుండా నా పని నేను చేసుకునేటట్లు చూడు స్వామి" అని.


చెప్పినట్లే, టెన్షన్ లేకుండా చేసిన బాబా


నేను ఒక సాయి భక్తురాలిని. 'సాయి మహారాజ్ సన్నిధి' బ్లాగు నిర్వహిస్తున్న బృందానికి బాబా కృపాకటాక్షాలు సదా ఉండాలని కోరుకుంటూ బాబా ప్రసాదించిన మరో అనుభవం మీతో పంచుకోవడానికి మళ్ళీ మీ ముందుకు వచ్చాను. మా పిన్ని(మా అమ్మగారి చెల్లెలు) బాబా భక్తురాలు. 2022, జూన్ నుంచి ఆమె ఆరోగ్యం సరిగా ఉండటం లేదు. తను ఎన్నో హాస్పిటల్స్ కి వెళ్ళింది కానీ, ఎక్కడా తనకున్న సమస్య ఇదని ఖచ్చితంగా చెప్పలేదు. సుమారు అక్టోబర్ నెల నుండి ఉన్న సమస్య చాలదన్నట్లు బ్లీడింగ్ కూడా అవ్వసాగింది. దానివల్ల తను బలహీనంగా అయిపోయి చాలా బాధను అనుభవించింది. హాస్పిటల్ వాళ్ళు తన బ్లడ్ సాంపిల్స్ ముంబయి పంపి, "అవసరం అయితే ఆపరేషన్ చేయాల్సి ఉంటుంద"ని చెప్పారు. పిన్ని రిపోర్టు ఎలా వస్తుందో అని చాలా టెన్షన్ పడింది. మరోపక్క బ్లడ్ చాలా పోతుందని మానసిక ఒత్తిడికి గురైంది. ఆ స్థితిలో నేను, "బాబా! పిన్ని రిపోర్టులన్నీ మంచిగా ఉండాలి. తన ఆరోగ్యం బాగుండాలి. తను మునుపటిలా సంతోషంగా ఉండాలి" అని బాబాతో చెప్పుకుని పిన్నిని తలుచుకుని బాబా ఊదీ నా కడుపుకి రాసుకున్నాను. ఇంకా, "రిపోర్టులన్నీ నార్మల్‍గా వస్తే, 'సచ్చరిత్ర' పారాయణ చేస్తాను, మీ కృపను తోటి భక్తులతో పంచుకుంటాను" అని బాబాకి మ్రొక్కుకున్నాను. తరువాత రిపోర్టులు రావడానికి ముందురోజు ఇంస్టాగ్రామ్ ద్వారా "ఆరోగ్యం బాగుంటుంది. టెన్షన్ పడాల్సిన పని లేదు" అని బాబా సందేశమిచ్చారు. అయినా మనిషిని కదా, కాస్త టెన్షన్ పడ్డాను. బాబా ఎప్పుడూ కష్టకాలంలో నాకు తమ సంకేతాలు ఇస్తుంటారు. అయినా నేను ఏదో తెలియని భయంతో బతుకుతూ ఉంటాను. "నాకు కాస్త ధైర్యాన్ని ప్రసాదించు బాబా". ఇకపోతే, డిసెంబర్ 15, గురువారంనాడు నేను భయపడుతూనే మా పిన్నికి ఫోన్ చేశాను. తను, "రిపోర్టులన్నీ మంచిగా వచ్చాయ"ని సంతోషంగా మాట్లాడింది. నాకు కూడా చాలా సంతోషమేసింది. బాబా దయతో తను పూర్తి ఆరోగ్యంగా ఉండాలని కోరుకుంటున్నాను. "మీ కృపకు చాలా ధన్యవాదాలు సాయినాథ్".


కోరుకున్నట్లే నార్మల్ రిపోర్టు వచ్చేలా అనుగ్రహించిన సాయి


ఓం శ్రీసాయినాథాయ నమః!!! సద్గురు శ్రీసాయినాథ్ మహరాజ్ కీ జై!!! నా పేరు శ్రీవాణి. నేను కొన్ని నెలలుగా గ్యాస్ సమస్యతో ఇబ్బందిపడుతూ టాబ్లెట్లు వాడుతున్నాను. టాబ్లెట్లు వాడినంత కాలం మంచిగా ఉండి, టాబ్లెట్లు వేసుకోవడం ఆపేస్తే మళ్ళీ యధావిధిగా గ్యాసు పట్టేస్తోంది. చివరికి మావారు నన్ను గాస్ట్రోఎంట్రాలజీ డాక్టర్ దగ్గరకి తీసుకెళ్లారు. డాక్టర్ ఏం చెప్తారో అని నాకు చాలా భయమేసి, "సాయీ! మీరే నన్ను ఆరోగ్యంగా ఉంచాలి. నాకు ఏమీ లేదు, అంతా నార్మల్‍గా ఉందని రిపోర్టులో వచ్చేలా చూడు సాయి" అని డాక్టరును కలిసే వరకు బాబాని మ్రొక్కుతూనే ఉన్నాను. ఇంకా డాక్టరుని కలిసి నా సమస్య గురించి చెప్తే, ఎండోస్కోపి చేస్తానన్నారు. అది విని లోపల ఏమన్నా సమస్య ఉందేమోనని నేను భయపడ్డాను. 'సాయి సాయి' అని తలుచుకుంటూ సాయి రూపం నా కళ్ళలో నింపుకుని, "బాబా! లోపల అంతా నార్మల్‍గా ఉంది, ఎలాంటి ఇబ్బంది లేదు, మంచిగానే ఉందని రిపోర్టులో రావాలి. అదే జరిగితే మీ దర్శనానికి వచ్చి కలకండ పంచుతాను. అలాగే మీ కృపను బ్లాగులో పంచుకుంటాను. నా మీద దయ చూపు సాయి. నాకు తల్లి, తండ్రి, దైవం అన్నీ నీవే నాయన" అని వేడుకున్నాను. ఆయన నా మీద దయ చూపారు. రిపోర్టులో అంతా నార్మల్‍గా ఉందని వచ్చింది. డాక్టరు, "గొంతు దగ్గర గ్యాస్ రిలీజై కొంచెం ఎర్రగా మారింది. మందులతో తగ్గిపోతుంది. ఏమి ప్రాబ్లం కాదు" అని చెప్పి మందులిచ్చారు. "ధన్యవాదాలు సాయి. మీ దయవల్ల ఈ టాబ్లెట్లతో గ్యాస్ పట్టే సమస్యను పూర్తిగా తగ్గేటట్లు చేయండి సాయి. అలాగే త్వరలోనే మీ దర్శనానికి మాకు మీ అనుమతిని ఇవ్వండి. మాపై దయతో మా కుటుంబాన్ని ఆరోగ్యంగా ఉంచు సాయి".


4 comments:

  1. బాబా సాయి సైకాపర్ సాయి నా భర్త నన్ను అర్థం చేసుకునేలా చూడు సాయి. తను నన్ను కాపురానికి తీసుకెళ్లలా చూడు సాయి నాకోసం తిరిగి వచ్చేలా చూడు సాయి మీద ఎంతో నమ్మకంతో చూస్తున్నాను బావ ఏంటి బావ నాకు ఇక్కడ

    ReplyDelete
  2. బాబా సాయి నా భర్త నన్ను అర్థం చేసుకునేలా చూడు తండ్రి నన్ను కాపురానికి తీసుకెళ్లేలా చూడు స్వామి నాకోసం మళ్ళీ తిరిగి వచ్చేలా చూడు తండ్రి నా కాపురాన్ని నిలబెట్టి తండ్రి నిన్నే నమ్ముకొని బ్రతుకుతున్నాను సాయి

    ReplyDelete
  3. Om sri sainathaya namaha
    Om sri sainathaya namaha
    Om sri sainathaya namaha
    Om sri sainathaya namaha
    Om sri sainathaya namaha

    ReplyDelete
  4. Om Sairam
    Sai always be with me

    ReplyDelete

సాయి మహారాజ్ సన్నిధి సోషల్ మీడియా లింక్స్:

Subscribe Here

బ్లాగ్ అప్డేట్ నోటిఫికేషన్స్ నేరుగా మీ మెయిల్ కే వచ్చేందుకు క్రింద బాక్సులో మీ మెయిల్ ఐడి టైపు చేసి subscribe పై క్లిక్ చేసి, తరువాత స్టెప్స్ పూర్తీ చేయండి.

Delivered by FeedBurner

Followers

Recent Posts


Blog Logo