సాయి వచనం:-

- శ్రీబాబూజీ.

సాయిభక్తుల అనుభవమాలిక 1408వ భాగం....


ఈ భాగంలో అనుభవాలు:

1. దేనికీ భయపడాల్సిన అవసరం లేదు - చివరి క్షణంలో అయినా బాబా గట్టెక్కిస్తారు
2. బాబా అద్భుతానుగ్రహం
3. శ్రీసాయి ప్రసాదించిన అదృష్టం

దేనికీ భయపడాల్సిన అవసరం లేదు - చివరి క్షణంలో అయినా బాబా గట్టెక్కిస్తారు


శ్రీసాయినాథ్ మహరాజ్ కీ జై|

సాయినాథుని శరత్ బాబుజీ కీ జై||


బాబా మహిమను అందరికీ తెలియపరుస్తున్న బ్లాగు నిర్వాహకులకు ధన్యవాదాలు. సాయి బంధువులకు నమస్కారాలు. నా పేరు చక్రవర్తి. నేను ఇదివరకు కొన్ని అనుభవాలు పంచుకున్నాను. ఇప్పుడు మరికొన్ని అనుభవాలు పంచుకుంటున్నాను. నేను కొంతకాలంగా వ్యాపారం మరియు మరికొన్ని ఇతర కారణాల వలన ఆర్థికంగా బాగా దెబ్బ తిని ఉన్నాను. ఇటువంటి స్థితిలో 8 నెలల క్రితం బాబా పిలుపుమేరకు నేను, నా స్నేహితుడు బాబాని దర్శించుకుందామని శిరిడీ ప్రయాణం పెట్టుకున్నాము. ఆ సమయంలో కరోనా కారణాల వల్ల మాకు రిజర్వేషన్ దొరకలేదు. అందువలన జనరల్ టికెట్లు తీసుకుని జనరల్ బోగి ఎక్కాము. మేము ఎక్కినప్పుడు బోగి అంతా ఖాళీగా ఉందికాని, నిజామాబాద్ దాటిన తర్వాత జనం పెరిగారు. రాత్రి అయ్యాక నాకు బాగా నిద్ర వచ్చి, నేను తీసుకుని వెళ్లిన లగేజీ బ్యాగు నా తల పక్కనే పెట్టుకుని నిద్రపోయాను. మధ్యలో మెలకువ వచ్చి చూస్తే, నా బ్యాగు కనిపించలేదు. ఎవరో ఆ బ్యాగు దొంగిలించారు. బోగి అంతా వెతికాను కానీ, బ్యాగు దొరకలేదు. ఎవరిని అడిగినా తెలియదన్నారు. అదికాక వాళ్లంతా మరాఠీ మాట్లాడుతున్నారు. ఇక నా పరిస్థితి చూడాలి, అసలే తీవ్రమైన ఆర్థిక సమస్యలలో ఉన్న నాకు ఒంటిమీద వేసుకున్న డ్రెస్ తప్ప మరో డ్రస్సు లేకుండా పోయింది. తీసుకుని వెళ్లిన బట్టలన్నీ బ్యాగులోనే ఉన్నాయి. డబ్బులు మాత్రం చేతిలో ఉన్నాయి. "ఏమిటయ్యా బాబా.. నీ దర్శనం కోసం వస్తుంటే బ్యాగు దొంగలించబడింది. డ్రెస్సులు కొనుక్కోలేని ఆర్థిక పరిస్థితి నాది. అయినా నీ నిర్ణయం ఎట్లా ఉంటే అట్లా జరుగుతుంది. కాబట్టి జరిగిన దానికి నేను బాధపడను. ఒంటి మీద ఉన్న ఈ బట్టలతోనే నీ దర్శనం చేసుకుంటా బాబా" అని అనుకున్నాను. ఉదయం 10 గంటలకి బండి 'సాయినగర్' రైల్వేస్టేషన్ చేరుకుంది. అందరూ దిగిపోయినా నేను, నా స్నేహితుడు 10 నిమిషాలపాటు బండిలోనే కూర్చున్నాము. అప్పుడు నాకెందుకో ఒకసారి బ్యాగు కోసం మళ్ళీ బోగిలో చూద్దామనిపించి చూశాను. ఆశ్చర్యం! నా బ్యాగు కనిపించింది. 'ఏమిటి బాబా, ఈ అద్భుతం!' అనుకున్నాను. దొంగిలించినవాళ్లు బ్యాగు అంతా వెతికి బట్టలు తప్ప డబ్బులు లేకపోవడంతో దాన్ని అక్కడ వదిలేసి వెళ్లిపోయినట్లున్నారు. ఒక ఫాగ్ సెంట్ బాటిల్ మాత్రం తీసుకున్నారు. ఏదేమైనా నేను ఇబ్బందిపడతానని బాబా దొంగలించిన వాళ్ళ మనసు మార్చి నా బ్యాగు నాకు ఇప్పించారు. లేకపోతే ఎంత వెతికినా దొరకని బ్యాగు కనిపించడం ఏమిటి? "బాబా! అంతా నీ దయ తండ్రి. ఈ అనుభవం సాటి సాయి బంధువులతో పంచుకోవడం ఆలస్యమైంది. అందుకు నన్ను మన్నించు బాబా. గురువుగారు చెప్పినట్లు నీ పేరు ఎత్తడానికి కూడా అర్హత లేనివాడిని. అవధులు లేని నీ కరుణను స్మరించి సిగ్గుతో కృంగిపోతున్నాను బాబా. నన్ను దీవించు తండ్రి".


నేను ఆర్థికంగా చాలా నష్టపోయి ఎంతో ఇబ్బందిపడుతున్నాను. అట్టి స్థితిలో ఉన్న నేను ఒకసారి ఒక వస్తువు కోసమని ఇతరులు ఇచ్చిన డబ్బులు వాడుకున్నాను. ఆ డబ్బు తిరిగి ఇవ్వడానికి కొంత సమయముంది, ఆలోపు నాకు రావాల్సిన డబ్బులు వచ్చేస్తాయిలే అనుకున్నాను. కానీ సమయానికి నాకు రావలసిన డబ్బు రాలేదు. అప్పుడు నేను, "బాబా! నన్ను ఈ సమస్య నుండి నన్ను గట్టెక్కించు. నా అనుభవం సాటి సాయి బంధువులతో పంచుకుంటాను తండ్రి" అని మనసులో అనుకున్నాను. బాబా దయవల్ల డబ్బులు వేరే రీతిన నాకు అందాయి. ఇంకోసారి నేను ఒక అతనికి పదివేల రూపాయలు ఇవ్వాల్సి ఉండగా, "గడువు సమయానికి ఆ డబ్బులు నాకు అందించు బాబా. నా అనుభవాన్ని గురు బంధువులతో పంచుకుంటాన"ని అనుకున్నాను. నా తండ్రి నేను కోరుకున్నట్లే ఆ డబ్బు నాకు సమకూర్చారు. ఇలా బాబా నన్ను అనేక సందర్భాలలో ఆదుకున్నారు. నేను ఈరోజు బ్రతికి ఉన్నానంటే అది బాబా పెట్టిన భిక్ష. లేకపోతే అనారోగ్యంతో నేను ఏనాడో చనిపోయేవాడిని. నాకు ఆరోగ్యాన్నిచ్చి పునర్జన్మను ప్రసాదించారు బాబా. 'సాయి వంటి దైవంబు లేడోయి లేడు' అని అన్నారు శ్రీసాయినాథుని శరత్ బాబుజీ. అది నూటికి నూరుశాతం నిజం. 'సాయి భక్తుడు పతనం కాడని. ఒకవేళ ఎవరైనా పతనమైతే వాడు అసలు సాయి భక్తుడే కాద'ని కూడా అన్నారు గురువుగారు. 


సాయి భక్తులు ఎవరైనాసరే బాబా ద్వారా పొందిన మేలును గుర్తుంచుకుని సాయిపట్ల కృతజ్ఞత కలిగి ఉండాలని మనవి చేసుకుంటున్నాను. మనం దేనికీ భయపడాల్సిన అవసరం లేదు. ఎలాంటి సమస్య వచ్చినా చివరి క్షణంలో అయినా బాబా మనల్ని గట్టెక్కిస్తారు. కానీ మనకు కావలసింది 'ఓర్పు'. కాబట్టి ఆ ఓర్పును ప్రసాదించమని మనం సాయిని ప్రార్థించాలి. నేను ఒకటే చెప్తున్నాను 'జాతకాలు, రాళ్లు, వాస్తు మొదలైన వాటిని వదిలిపెట్టండి. ఎవరికైనా ఆ పిచ్చి ఉంటే దయచేసి తప్పుగా అనుకోకండి. సాయి నామాన్ని పిలవండి. అన్ని సమస్యలు అవే సర్దుకుంటాయి. 'సాయి సాయి సాయి సాయి' అని హృదయంలో నుండి పిలవండి మీ పిలుపు కోసం బాబా ఎదురు చూస్తూ ఉంటారు.


సాయిబాబా సాయిబాబా సాయిబాబా...


బాబా అద్భుతానుగ్రహం


నాపేరు కృష్ణవేణి. నేను ఒక సాయి భక్తురాలిని. 3 సంవత్సరాల క్రితం నా బ్యాక్ బ్లడర్‍కి లేజర్ శస్త్రచికిత్స జరిగింది. 6 నెలలకి ఒక్కసారి చెకప్‍కి రమ్మని డాక్టర్ చెప్పారు. 2022, ఏప్రిల్ లేదా మేలో చెకప్‍కి వెళ్ళినప్పుడు నవంబరులో సర్జరీ చేయాల్సి వస్తుందేమోనని అనుమానం వ్యక్తం చేసారు. అందువలన నేను నవంబరులో చెకప్‍కి వెళ్ళినప్పుడు, "రిపోర్టులు నార్మల్ వస్తే, మీ అనుగ్రహాన్ని బ్లాగులో పంచుకుంటాను బాబా" అని అనుకున్నాను. ఆ తండ్రి దయవల్ల రిపోర్టులన్నీ నార్మల్ వచ్చాయి. డాక్టరు, "ఇప్పుడు సర్జరీ అవసరం లేదు" అని టాబ్లెట్లు వ్రాసి ఇచ్చారు. నేను రోజూ 'సాయి ధన్వంతరియే నమః' అని 108 సార్లు అనుకుని, బాబా ఊదీ నుదుటన పెట్టుకుని, కొంచం నోట్లో వేసుకుంటున్నాను. బాబా దయవల్ల నా ఆరోగ్య సమస్యలు కొంచం తగ్గాయి. "థాంక్యూ సో మచ్ బాబా".


మేము మా ఇంటి పక్క స్థలం కొనాలని మూడు సంవత్సరాల నుంచి ప్రయత్నిస్తున్నాము. ప్రతిసారీ కొనేదాక రావడం, ఆగిపోవడం జరుగుతుండేది. ఇలా ఉండగా ఒకసారి నేను మీతో పంచుకున్న నా అనుభవంలో బాబాను, "బాబా! మేము మా ఇంటి పక్క స్థలం కొనేలా చేయమ"ని ప్రార్థించాను. తరువాత ఆయన దయతో మేము అక్టోబర్ నెలలో ఆ స్థలం కొనుక్కోగలిగాము. ఆ తరువాత, "నువ్వు త్వరగా ఇల్లు కట్టు. నేను నీతో వచ్చి ఉంటాను" అని బాబా మెసేజ్ వచ్చింది. అయితే మేము అంత త్వరగా ఇంటి నిర్మాణం మొదలుపెడతామని అనుకోలేదు. ఎందుకంటే, ఈ మధ్యనే స్థలం కొని, మళ్ళీ అంతలోనే ఇంటి నిర్మాణం అంటే డబ్బులు సరిపోవు అనుకున్నాను. నా మనుసులోని ప్రతిదీ బాబాకి తెలుస్తుంది. నేను దేని గురించి ఆలోచిస్తే, దానికి తగట్టు బాబా మెసేజ్ రూపంలో నాకు సమాధానమిస్తారు. ఆయన, "నువ్వు ఇంటి నిర్మాణం మొదలుపెట్టు. అన్నీ నేను చూసుకుంటాను" అని మెసేజ్ ఇచ్చారు. బాబా దయవల్ల ఎలాగో డబ్బు సర్దుబాటు అయింది. దాంతో ఆ స్థలంలో ఇల్లు కట్టుకోవాలని నవంబర్ 28న ఆ స్థలాన్ని క్లీన్ చేసాము. కానీ అయ్యగారు రెండు నెలలు ఆగి ఇల్లు కట్టండి అని చెప్పడంతో పని ఆగిపోయింది. దాంతో నాకు కొంచెం బాధేసింది. కానీ బాబా నా మంచికే ఇలా చేసారని నా నమ్మకం. ఎందుకంటే, 2 నెలల తరువాత గురువారంనాడు ఇంటి నిర్మాణం మొదలుపెట్టమన్నారు. అంతా బాబా చేసిన అద్భుతం. "చాలా చాలా ధన్యవాదాలు బాబా. అన్ని మీరే చూసుకోవాలి తండ్రి. నాకు మంచి-చెడు ఏమీ తెలీదు. అన్నీ మీరే అయి నడిపించాలి బాబా".


శ్రీసాయి ప్రసాదించిన అదృష్టం


నా పేరు రత్నాజీ. కార్తీకమాసం వస్తుండగా నేను ఒకచిన్న శివలింగమైనా ఉంటే పూజ మందిరంలో పెట్టుకుని అభిషేకం చేసుకుందామని అనుకున్నాను. కానీ శివలింగం లేక, "బాబా! మీ విగ్రహం పెట్టుకుని, మిమ్మల్నే శివుడిగా తలచి కార్తీకమాసంలో రోజూ నీళ్లు పోస్తాను. ఈ మాసఫలం నాకు దక్కేలా చేసే బాధ్యత నీదే" అని బాబాతో చెప్పుకున్నాను. అలాగే కార్తీకమాసం మొదలవుతూనే అభిషేకం మొదలుపెట్టాను. అంతే! అమోఘంగా హైకోర్టు జడ్జీలు వస్తున్నారని ఎప్పుడూ నాకు వేయని ప్రోటోకాల్ వేయడంతో మూడు సోమవారాలు శ్రీద్రాక్షారామంలో వందలాది మందిని దాటుకుని మంది మార్బలాలతో నేరుగా శివుని దర్శించుకునేలా అనుగ్రహించారు బాబా. ఈ లోపల నాకు ఒక కల వచ్చింది. ఆ కలలో నేను శ్రీకంచి శ్రీవిజయేంద్రసరస్వతిస్వామి వారిని కలిసినట్లు, ఆయనతో మాట్లాడుతుండగా ఎవరో పెద్ద విగ్రహం లాంటి మనిషి రావడంతో స్వామి కింద కూర్చున్నారు. నేను, 'స్వామి కింద కూర్చున్నారంటే ఈయన ఎంత గొప్పవారో' అని అనుకున్నాను. అప్పుడు ఆ నిలువెత్తు మనిషి నన్ను తమ పక్కన కూర్చోబెట్టుకుని, ప్రేమగా కబుర్లు చెప్పారు. ఆయన ఎవరో మీకు అర్థమయ్యే ఉంటుంది, బాబానే. తరువాత నాలుగో వారం శ్రీపిఠాపురంలోని శ్రీకుక్కుటేశ్వరస్వామి ఆలయంలో స్వయంగా స్వామికి అభిషేకం చేసుకోవడం, అక్కడి శక్తిపీఠం అమ్మవారికి కుంకుమ పూజ చేసుకోవడం కలలా జరిగిపోయాయి. ఇదంతా ఎందుకు చెప్తున్నానంటే, ఎప్పుడైతే నేను బాబానే సర్వమని నమ్మి పగ్గాలు ఆయనకు అప్పగించానో అప్పటినుండి ఆయన ఎంతో అదృష్టాన్ని నాకు ప్రసాదిస్తున్నారు. ఆ విషయం పై అనుభవం ద్వారా మీకు అర్థమయ్యే ఉంటుంది. "ధన్యవాదాలు సాయి. ఇలాగే మీ కృప నాపై, నా కుటుంబంపై ఎల్లవేళలా చూపండి బాబా. మీరు చూపిన ఇంట్లో అద్దెకు దిగాము. ఇక్కడినుంచి సొంత ఇంటికి మీరే చేర్చాలి. గురువే దైవమని నిన్నే శరణుజొచ్చితిని బాబా. తరతరాలు మీ భక్తికి బానిసలం అయ్యేలా మమ్ము ఆశీర్వదించు తండ్రి".


శ్రీసాయీశ్వరా నమోనమః!!!


4 comments:

  1. సాయి నన్ను నా వంశీని కలుపు సాయి ఆ కాపురాని నిలబెట్టి సాయి కన్నతండ్రి లాగా దగ్గర ఉండి పెళ్లి చేశారు కదా సాయి నన్ను కాపురానికి కూడా పంపించండి సాయి మిమ్మల్ని నమ్ముకుని ఉన్నాను సాయి నాకు నా భర్త అంటే చాలా ఇష్టం సాయి తనకు దూరంగా ఉండలేకపోతున్నాను సాయి. తనకు మంచి మనసు ని ఇవ్వండి సాయి మోసం చేయడం తప్పని తెలుసుకునేలా చూడు సాయి తను మల్లి నాకోసం వచ్చి నన్ను కాపురానికి త తీసుకుని వెళ్లేలా చూడు సాయి. నేను కూడా నా అనుభవాన్ని బ్లాక్లో పంచుకుంటాను సాయి నాకు నా అనుభవం అని పంచుకున్న అదృష్టం ప్రసాదించండి సాయి అందరూ జరిగితే మేము బ్లాక్లో పంచుకుంటాము అనగానే సరిపోతుంది కానీ నేనేం పాపం చేశాను సాయి ఎన్నో రోజుల నుంచి అడుగుతూనే ఉన్నాను సాయి చెప్పండి సాయి ప్లీజ్

    ReplyDelete
    Replies
    1. తప్పకుండా బాబా మీ ఇద్దరినీ ఒక్కటి చేస్తారు అమ్మ..... మీరు సాయి సచ్చరిత్ర పారాయణ చేయండి. మీకు అద్బుతం జరుగుతుంది

      Delete
  2. Om Sairam
    Sai always be with me

    ReplyDelete
  3. Om sri sainathaya namaha
    Om sri sainathaya namaha
    Om sri sainathaya namaha
    Om sri sainathaya namaha
    Om sri sainathaya namaha

    ReplyDelete

సాయి మహారాజ్ సన్నిధి సోషల్ మీడియా లింక్స్:

Subscribe Here

బ్లాగ్ అప్డేట్ నోటిఫికేషన్స్ నేరుగా మీ మెయిల్ కే వచ్చేందుకు క్రింద బాక్సులో మీ మెయిల్ ఐడి టైపు చేసి subscribe పై క్లిక్ చేసి, తరువాత స్టెప్స్ పూర్తీ చేయండి.

Delivered by FeedBurner

Followers

Recent Posts


Blog Logo