సాయి వచనం:-

- శ్రీబాబూజీ.

సాయిభక్తుల అనుభవమాలిక 1418వ భాగం....


ఈ భాగంలో అనుభవాలు:

1. శ్రీసాయినాథుని కృపాశీస్సులు
2. ఏళ్లనాటి మ్రొక్కు తీర్చుకునేలా అనుగ్రహించిన బాబా

శ్రీసాయినాథుని కృపాశీస్సులు


ఓం శ్రీ సాయినాథాయ నమః!!! శ్రీసాయి బంధువులకు నమస్కారం, ఈ బ్లాగును నిర్వహిస్తున్నవారికి ధన్యవాదాలు. నా పేరు నివేదిత కిషోర్. నేను, మావారు ఇద్దరమూ సాయిభక్తులం. బాబా మాకు ప్రసాదించిన కొన్ని అనుభవాలను నేనిప్పుడు సాయిబంధువులతో పంచుకుంటున్నాను.


శ్రమకు తగ్గ ఫలితం అందించిన బాబా: మావారు ఒక ప్రైవేటు యూనివర్సిటీలో అసిస్టెంట్ ప్రొఫెసర్‌గా పనిచేస్తున్నారు. ఈమధ్య అసోసియేట్ ప్రొఫెసర్ ప్రమోషన్ కొరకు ఇంటర్వ్యూలు జరిగాయి. నేను, "బాబా! మావారు ఆ ఇంటర్వ్యూలో సెలెక్ట్ అయితే, మీ అనుగ్రహాన్ని 'సాయి మహరాజ్ సన్నిధి' బ్లాగులో పంచుకుంటాను" అని బాబాకి నమస్కరించుకుని, ఇంటర్వ్యూకి నోటిఫికేషన్ వెలువడినప్పటినుండి ఇంటర్వ్యూ ప్రక్రియ పూర్తయ్యేంతవరకు ఆ సాయినాథుని ప్రార్థిస్తూ ఉండేదాన్ని. ఆ పొజిషన్‍కి ఉన్న పోస్టులు రెండు అయితే, ఇంటర్వ్యూకి చాలా అధిక సంఖ్యలో అభ్యర్థులు హాజరయ్యారు. ఇంటర్వ్యూ ప్రక్రియ అంతా చాలా ఉత్కంఠభరితంగా సాగింది. ఆ స్థితిలో మావారికి ఆ పోస్టు రాదేమో అనుకున్నాము. కానీ అసాధ్యం అనుకున్నది సుసాధ్యం చేశారు నా సాయితండ్రి. ఇక రాదనుకున్న పోస్ట్ బాబా కృపవల్ల మావారికి వచ్చింది. మావారి శ్రమను, ప్రతిభను వృధా పోనివ్వలేదు బాబా.


శిరిడీ ప్రయాణం సులభతరం చేసిన బాబా: మావారికి ప్రమోషన్ రాగానే మేము శిరిడీ వెళ్లాలని అనుకున్నాము. కుటుంబమంతా పదిమంది సభ్యులం శిరిడీ వెళ్లేందుకు బయలుదేరాము. కానీ 'సమయం తక్కువగా ఉంది, టికెట్లు కన్ఫర్మ్ అవుతాయో, లేదో' అని ఒకటే టెన్షన్ పడ్డాము. నేను రోజూ, "తండ్రీ! ఎలాగైనా టికెట్లు కన్ఫర్మ్ అయ్యేలా చూడు తండ్రీ. మీ కృపను 'సాయి మహరాజ్ సన్నిధి'లో పంచుకుంటాను" అని బాబాను ప్రార్థిస్తూ ఉండేదాన్ని. ఆ సాయినాథుని దయవల్ల మా పదిమంది టికెట్లు రానూపోనూ కన్ఫర్మ్ అయ్యాయి. ఏ విధమైన ఆటంకం లేకుండా మేము శిరిడీ వెళ్లి బాబా దర్శనం చేసుకుని వచ్చాము. ఇదంతా శ్రీసాయినాథుని కృపవల్లే జరిగింది. "కృతజ్ఞతలు తండ్రీ".


పెనుప్రమాదం నుండి మా కుటుంబాన్ని కాపాడిన బాబా: మేము 2022, దసరా సెలవులకి  వైజాగ్‍లో ఉన్న మా అమ్మావాళ్ళింటికి వెళ్ళాము. అప్పుడొకరోజు నేను, మావారు, మా పాప సింహాచలం వెళ్లి తిరిగి వస్తుండగా వర్షం వల్ల రోడ్డు మీద ఒకచోట ఇసుక మేటవేసింది. ఆ ఇసుకలో మేము వెళ్తున్న బైక్ జారిపోవడంతో మేము ముగ్గురం రోడ్డుపై పడిపోయాము. నేను, మావారు స్వల్పగాయాలతో బయటపడ్డాం, కానీ మా పాప కాలికి తీవ్రగాయమై రక్తం కారిపోసాగింది. అప్పుడు సమయం రాత్రి 7:30, కటిక చీకటి. పైగా అది ఘాట్ రోడ్డు కావడాన జనసంచారం లేదు. మాకు ఏం చేయాలో అర్థం కాలేదు. మావారు పాపనెత్తుకొని పెద్దపెద్దగా కేకలు పెడుతూ పరుగుతీశారు. మా అదృష్టంకొద్దీ ఆ రాత్రివేళలో వాకింగ్ చేస్తున్న ఇద్దరు పెద్దమనుషులు మావద్దకొచ్చారు. అంతలోనే వాళ్ళ స్నేహితులు బైక్ మీద అటుగా రావడం, వాళ్ళు మావారిని, పాపని ఐదు నిమిషాల్లో హాస్పిటల్‍కి తీసుకెళ్లడం జరిగిపోయింది. డాక్టరు పాప మోకాలి మీద కుట్లు వేశారు. నాలుగు సంవత్సరాల మా పాప బాధ తట్టుకోలేక పెద్దపెద్దగా అరుస్తుంటే మావారు, 'ఇదంతా నా మూలానే' అని కుమిలిపోయారు. డాక్టరు పాప మోకాలికి ఎక్స్-రే తీయించమన్నారు. అప్పుడు, "పాపకు ఎటువంటి ఫ్రాక్చర్ ఉండకూడదు. అలా అయితే మీ అనుగ్రహాన్ని బ్లాగులో పంచుకుంటాన"ని మావారు బాబాకి మ్రొక్కుకున్నారు. బాబా దయవల్ల పాపకి ఎటువంటి ఫ్రాక్చర్ కాలేదు. అప్పటివరకు మాతోనే ఉన్న ఆ ఇద్దరు పెద్దమనుషులు రాత్రి పది గంటలప్పుడు మమ్మల్ని మా ఇంటి వద్ద వదిలి వెళ్లిపోయారు. మావారు ఏడుస్తూ తన అలవాటు ప్రకారం రాత్రి పడుకునేముందు భక్తుల అనుభవాలు చదువుదామని బ్లాగ్ ఓపెన్ చేశారు. మా ఆశ్చర్యంకొద్దీ అక్కడున్న మొదటి అనుభవంలో ఒక తల్లి, పిల్ల బైక్ మీరు వెళ్తుంటే పడిపోయారని, వాళ్ళని సాయిబాబా కాపాడారని ఉంది. అప్పుడు మా కుటుంబాన్ని కూడా ఆ సాయినాథుడే పెనుప్రమాదం నుంచి కాపాడారని మాకు అనిపించింది. "ధన్యవాదాలు బాబా. మీ దయ, దీవెనలు ఎల్లప్పుడూ మాపై ఇలానే ఉండాలి సాయితండ్రీ. మీ భక్తులమవడం మా అదృష్టం తండ్రీ".


ఏళ్లనాటి మ్రొక్కు తీర్చుకునేలా అనుగ్రహించిన బాబా


ఓం శ్రీ సాయినాథాయ నమః!!! సాయిభక్తులందరికీ నమస్కారం. 'సాయి మహరాజ్ సన్నిధి' బ్లాగ్ నిర్వాహకులకు ధన్యవాదాలు. నేను సాయిభక్తురాలిని. నేను ఇంతకుముందు శ్రీసాయి భగవాన్ నాకు ప్రసాదించిన కొన్ని అనుభవాలు పంచుకున్నాను. ఇటీవల శ్రీసాయి అనుగ్రహంతో మా గాణుగాపూర్ యాత్ర విషయాలను ఇప్పుడు పంచుకుంటున్నాను. నేను గాణుగాపూర్ వెళ్ళి దాదాపు 20 సంవత్సరాలవుతోంది. అప్పుడు మావారు అక్కడ సంగమంలో శ్రీగురుచరిత్ర సప్తాహం చేస్తానని మ్రొక్కుకున్నారు. తరువాత ఇన్ని సంవత్సరాలు గడిచిపోయాయి. ఆ మ్రొక్కు అలాగే ఉండిపోయింది. చివరికి 2022, కార్తీకమాసం ప్రారంభంలో నేను, "సాయినాథా! ఆ మ్రొక్కు తీర్చే మార్గం మీరే చూపాలి" అని శ్రీగురుచరిత్ర సప్తాహపారాయణ చేశాను. బాబా అనుగ్రహించారు. మేము నవంబరు 12న హైదరాబాద్ నుండి బయలుదేరి గాణుగాపూర్ వెళ్ళాము. మేము అక్కడికి చేరేసరికి ఆదివారం వేకువఝామున 2.00 గంటలైంది. మేము అక్కడ రూమ్స్ దొరుకుతాయని ఆన్లైన్‍లో బుక్ చేసుకోలేదు. తీరా అక్కడ చూస్తే, ఎక్కడికి వెళ్లినా రూమ్స్ ఖాళీ లేవని అన్నారు. దాంతో చేసేదిలేక గుల్బర్గా వెళ్లి అక్కడ రూమ్ తీసుకుని లగేజీ పెట్టి గాణుగాపూర్ వద్దామని  మావారు ట్యాక్సీ కోసం వెళ్ళారు. నేను, "సాయీ! మాకు గాణుగాపూర్‌లోనే రూమ్ దొరికితే, మీ అనుగ్రహాన్ని 'సాయి మహరాజ్ సన్నిధి' బ్లాగుకు వ్రాసి పంపుతాను. మాకు సహాయం చేయండి. నేనింక ప్రయాణం చేయలేను తండ్రీ" అని సాయికి నా బాధ నివేదించి వేడుకున్నాను. బాబా దయచూపారు. మావారు తెచ్చిన ట్యాక్సీ డ్రైవరే ఆర్టీసీ బస్టాండ్ వెనుక ఉన్న లాడ్జిలో ఒక మంచి రూమ్ ఇప్పించి మాకు అన్నివిధాలా సహాయం చేశాడు. మేము సంగమం వద్ద పారాయణ పూర్తిచేసి శ్రీకల్లేశ్వరుని, శ్రీశనిదేవుని దర్శించుకొని, అలాగే మిగిలిన ప్రదేశాలను చూసి, శ్రీదత్తప్రభువుని నాలుగుసార్లు దర్శించుకున్నాము. తరువాత తిరుగు ప్రయాణమై అక్కల్‌కోట వెళ్లి అక్కడ శ్రీస్వామిసమర్థ, శ్రీగజానన్ మహరాజ్ ఆశ్రమాలు దర్శించి చాలా తృప్తితో హైదరాబాద్ చేరుకున్నాము. "సాయినాథ ప్రభూ! మీ దయతో ఎన్నో ఏళ్ళనాటి మ్రొక్కు తీర్చుకున్నాము. ధన్యవాదాలు ప్రభూ. మీ పవిత్ర పాదపద్మములకు కోటికోటి నమస్కారాలు".


బాబాకి మ్రొక్కుకున్నప్పటినుండి జ్వరం లేదు


బాబా సాయి చరణం - సర్వదా శరణం శరణం!!!

బాబా సాయి నామస్మరణం -  సర్వ పాప హరణం, సర్వ దుఃఖ నివారణం!!!


నా పేరు జగదీశ్వర్. నేను గతంలో నా అనుభవాలు కొన్ని మీతో పంచుకున్నాను. ఇప్పుడు మరొక అనుభవం పంచుకుంటాను. మా పెద్దమ్మాయి, అల్లుడు, మా మనవరాలు 2022, నవంబర్ 24న శిరిడీ వెళ్లదలచి ముందుగా ఆరతి, అకామిడేషన్ బుక్ చేసుకున్నారు. అయితే ప్రయాణానికి రెండు రోజుల ముందు నుండి సంవత్సరం వయసున్న మా మనవరాలికి తీవ్రంగా జలుబు, దగ్గు ఉండేసరికి శిరిడీ ప్రయాణం రద్దు చేసుకున్నారు. అందరికీ తెలిసిందే, బాబా అనుమతి లేనిదే ఎవ్వరూ శిరిడీ వెళ్ళలేరని. సరే, పాప కోలుకున్నాక డిసెంబర్ 9న మా అమ్మాయి, అల్లుడు, వాళ్లతోపాటు మరో ముగ్గురు హైదరాబాద్ నుండి స్లీపర్ బస్సులో శిరిడీకి బయలుదేరారు. మధ్యదారిలో డిన్నర్ కోసం బస్సు ఆపినప్పుడు ఒక దొంగ బస్సు ఎక్కి మా అమ్మాయి అత్తమ్మ దగ్గర నుండి 8 వేల రూపాయలు ఉన్న పర్స్ లాక్కొని పారిపోయాడు. జరిగిన గొడవకి మా మనవరాలు చాలా ఏడ్చింది. అర్థరాత్రి తనకి జ్వరం వచ్చింది. జ్వరం మందు వేశారుగానీ, వాళ్ళు తెల్లవారి 11 గంటలకు శిరిడీ చేరుకునే లోపల పాపకి రెండుసార్లు జ్వరం వచ్చింది. వాళ్ళు శిరిడీ చేరుకున్నాక మాకు విషయం తెలిసింది. నేను వెంటనే పూజగదిలోకి వెళ్ళి బాబా ఊదీని పెట్టుకుని, "బాబా! మా మనవరాలికి జ్వరం తగ్గిపోయి, మళ్ళీ రాకుండా ఉండాలి. మీ దర్శనం వాళ్ళకి ప్రశాంతంగా జరగాలి. అలా జరిగితే నేను మీ అనుగ్రహాన్ని 'సాయి మహరాజ్ సన్నిధి' బ్లాగులో పంచుకుంటాను" అని బాబాకి మ్రొక్కుకున్నాను. అప్పటినుండి పాపకి మళ్ళీ జ్వరం రాలేదు. వాళ్ళు అదేరోజు మధ్యాహ్నం 3 గంటలకు బయలుదేరి శనిశింగణాపూర్ వెళ్లి దర్శనం చేసుకుని వచ్చారు. మరుసటిరోజు తెల్లవారి ఖండోబా దర్శనం, మధ్యాహ్నం సమాధిమందిరంలో బాబా దర్శనం చేసుకుని ఆ రాత్రి బయలుదేరి డిసెంబర్ 12న ఇంటికి చేరుకున్నారు. అంతా బాబా దయ. "ధన్యవాదాలు బాబా".


3 comments:

  1. Om sri sainathaya namaha
    Om sri sainathaya namaha
    Om sri sainathaya namaha
    Om sri sainathaya namaha
    Om sri sainathaya namaha

    ReplyDelete
  2. Om Sairam
    Sai always be with me

    ReplyDelete
  3. సాయి నన్ను కాపాడి సాయి నా వంశీ మంచి గా మార్చు సాయి తనను కాపురానికి తీసుకెళ్ళిన చూడు నన్ను భార్యగా స్వీకరించే ఓం సాయిరాం

    ReplyDelete

సాయి మహారాజ్ సన్నిధి సోషల్ మీడియా లింక్స్:

Subscribe Here

బ్లాగ్ అప్డేట్ నోటిఫికేషన్స్ నేరుగా మీ మెయిల్ కే వచ్చేందుకు క్రింద బాక్సులో మీ మెయిల్ ఐడి టైపు చేసి subscribe పై క్లిక్ చేసి, తరువాత స్టెప్స్ పూర్తీ చేయండి.

Delivered by FeedBurner

Followers

Recent Posts


Blog Logo