సాయి వచనం:-

- శ్రీబాబూజీ.

సాయిభక్తుల అనుభవమాలిక 1412వ భాగం....


ఈ భాగంలో అనుభవాలు:

1. ఎటువంటి సమస్య అయినా సాయితండ్రి అనుగ్రహంతో మటుమాయం
2. శ్రీసాయి అనుగ్రహం
3. ఆపరేషన్ చేయాలన్న స్థితిని మార్చి రిపోర్టులన్నీ నార్మల్ వచ్చేలా అనుగ్రహించిన బాబా

ఎటువంటి సమస్య అయినా సాయితండ్రి అనుగ్రహంతో మటుమాయం


ఓం శ్రీ సాయినాథాయ నమః!!! ముందుగా 'సాయి మహరాజ్ సన్నిధి' అనే అద్భుతమైన బ్లాగును నిర్వహిస్తూ సాయి లీలామృతాన్ని భక్తులకు అందిస్తున్న బ్లాగ్ నిర్వాహకులకు నా హృదయపూర్వక ధన్యవాదాలు, వారికి  శ్రీసాయి ఆశీస్సులు ఎల్లప్పుడూ ఉండాలని కోరుకుంటున్నాను. నేను ఒక సాయిభక్తుడిని. నేను రైల్వేలో ఉద్యోగం చేస్తున్నాను. 2022, నవంబర్ నెల చివరిలో నేను విపరీతమైన జలుబుతో ఇబ్బందిపడ్డాను. మందులు వాడుతున్నా నాలుగు రోజుల వరకు తగ్గలేదు. అప్పుడు నేను బాబాని ప్రార్థించి, ఊదీని నీళ్లలో కలిపి తాగడం మొదలుపెట్టాను. దాంతో జలుబు కాస్త తగ్గుముఖం పట్టింది. కానీ పూర్తిగా తగ్గలేదు. అదే సమయంలో ఆఫీస్ పని మీద నేను ముంబాయి వెళ్ళవలసి వచ్చి వెళ్ళాను. తిరుగు ప్రయాణానికి రాత్రి 11:30కి ట్రైన్ ఉండగా నా టికెట్ కన్ఫర్మ్ కాలేదు(RACలో ఉండిపోయింది). అసలే వెళ్ళేటప్పుడు ఏసీ కోచ్‌లో ప్రయాణం చేసినందువల్ల జలుబు కంట్రోల్ అవలేదు. నా తలంతా పట్టేసింది. కళ్ళు కూడా నొప్పిగా ఉన్నాయి. పైగా రోజంతా పని వల్ల బాగా నీరసించిపోయి ఉన్నాను. ఆ స్థితిలో ఫుల్ బెర్త్ లేకుండా ఎలా ప్రయాణం చేయాలో నాకు అర్దం కాలేదు. సరైన విశ్రాంతి లేకపోతే నా ఆరోగ్యం ఇంకా చెడిపోతుందని భయం కూడా పట్టుకుంది. ఇంకా నేను బాబాను తలుచుకుని, "బాబా! నా ఆరోగ్య పరిస్థితి ఇలా ఉంది. బెర్త్ దొరకకపోతే నేను ఎలా ప్రయాణం చేయాలి తండ్రి. మీ దయతో టిటి బెర్త్ సర్దుబాటు చేసినట్లైతే, అలాగే ఉదయానికి నా ఆరోగ్యం చక్కబడినట్లైతే నా అనుభవాన్ని ఆధునిక సచ్చరిత్రగా పిలవబడుతున్న మీ బ్లాగులో పంచుకుంటాను" అని మ్రొక్కుకున్నాను. ఇక బాబా చేసిన అద్భుతం చూడండి. నేను ట్రైన్ ఎక్కిన అరగంట తర్వాత TT వచ్చి RAC టిక్కెట్టుతో ఒకే బెర్త్ మీద ప్రయాణిస్తున్న నాకు, ఇంకో అతనికి విడివిడి బెర్తులు ఇచ్చారు. దానితో నేను ప్రశాంతంగా నిద్రపోయాను. ఉదయానికి నా ఆరోగ్యం కూడా నార్మల్ అయిపోయింది. అంతా ఆ తండ్రి అనుగ్రహం. "ధన్యవాదాలు బాబా". 


నేను ఈమధ్య 15 రోజులు సెలవులు తీసుకుని తిరిగి డ్యూటీలో జాయిన్ అయ్యాను. అక్కడికి 3 రోజుల్లో 'ఫుల్ స్కేల్ మాక్ డ్రిల్' నిర్వహించారు. మాక్ డ్రిల్‍లో పై స్థాయి ఆఫీసర్స్ అందరూ ఉంటారు. ఏదైనా తప్పిదం జరిగితే పనిష్మెంట్ విధిస్తారు. అందువల్ల నేను చాలా భయపడి, "ఏ సమస్య లేకుండా మాక్ డ్రిల్ మంచిగా పూర్తవ్వాలని బాబాని ప్రార్థించాను. బాబా మహిమ చూడండి, మాక్ డ్రిల్ అనంతరం ఆఫీసర్స్ అందరూ మా టీమ్‍ని ప్రశంసించారు. 5 రోజుల తరువాత సేఫ్టీ ఆడిట్ జరిగింది. ఆ సమయంలో నా ఆరోగ్యం అంతగా బాగాలేదు. అందువల్ల ఆడిట్ ఎలా అవుతుందోనని భయపడి, "బాబా! మీ దయతో ఈ ఆడిట్ కూడా బాగా అయిపోతే, మాక్ డ్రిల్ అనుభవం, ఈ అనుభవం 'సాయి మహారాజ్ సన్నిధి' బ్లాగులో పంచుకుంటాను" అని బాబాను వేడుకున్నాను. బాబా దయవల్ల ఆడిట్ అంతా బాగా జరిగింది. ఎలాంటి ఇబ్బంది కలగలేదు. అలానే బాబా అనుగ్రహం వల్ల నా భార్య, బిడ్డ నా భార్య పుట్టింటి నుండి మా ఇంటికి క్షేమంగా చేరుకున్నారు. "ధన్యవాదాలు బాబా. అలాగే ఎప్పటినుండో పెండింగ్‍లో ఉన్న నా ప్రమోషన్ ఈ సంవత్సరం వచ్చేటట్లు, అది కూడా ఉన్న చోటనే ఉంచి నా కుటుంబంతో కలిసి గడిపేలా చూడు తండ్రి"


నాలుగు నెలల వయసున్న మా బాబు హఠాత్తుగా తల్లిపాలు త్రాగడం మానేసాడు. ఎంత ఆకలిగా ఉన్నా డబ్బాతో పడితే త్రాగేవాడు కానీ తల్లిపాలు అస్సలు త్రాగేవాడు కాదు. అలా రెండు రోజులు జరిగేసరికి మాకు టెన్షన్ మొదలయ్యింది. ఆ రాత్రి నేను, "బాబా! బాబు మునుపటిలా తల్లిపాలు చక్కగా తాగేలా చేయి తండ్రి. మీ అనుగ్రహాన్ని 'సాయి మహారాజ్ సన్నిధి' బ్లాగులో పంచుకుంటాను. అలాగే గురువారం నాడు మీ గుడిలో మీకు కోవా నివేదిస్తాను" అని బాబాను ప్రార్థించాను. ఆ కరుణామయుని దయవల్ల మరుసటిరోజు ఉదయం నుండి బాబు తల్లిపాలు చక్కగా తాగి ఆడుకుంటున్నాడు. బాబాని నమ్ముకుంటే జరగనిది అంటూ ఏమీ ఉండదు. "ధన్యవాదాలు బాబా. ఈమధ్య బాబు రాత్రి వేళల్లో లేచి ఏడుస్తున్నాడు. తను రాత్రుళ్ళు చక్కగా నిద్రపోయేలా కరుణించు తండ్రి. నా భార్య, బిడ్డ ఆరోగ్యంగా ఉండేటట్లు అనుగ్రహించు తండ్రి. వాళ్ళ మీద ఎటువంటి దుష్టశక్తుల ప్రభావం పడకుండా చూడు తండ్రి. మా కుటుంబంపై, నీ భక్తులపై ఎల్లప్పుడూ మీ అనుగ్రహాన్ని చూపుతూ సదా కాపాడు తండ్రి".


అఖిలాండకోటి బ్రహ్మాండనాయక రాజాధిరాజ యోగిరాజ శ్రీ సచ్చిదానంద సద్గురు శ్రీసాయినాథ్ మహరాజ్ కి జై!!!


శ్రీసాయి అనుగ్రహం


ఓం శ్రీగురుభ్యో నమః!!! సమస్త సాయి బంధువులకు నమస్కారాలు. ఈ బ్లాగ్ నిర్వహిస్తూ, సోషల్ మీడియా ద్వారా ఇంత చక్కని సేవ చేయొచ్చని నిరూపించిన వారికి ఆ సద్గురు సచ్చిదానందమూర్తి యొక్క అనుగ్రహం ఎల్లవేళలా ఉండాలని కోరుకుంటున్నాను. నా పేరు రమేష్. మాది శ్రీకాకుళం. ప్రస్తుతం నేను కర్ణాటకలోని హోస్పేట్‍లో ఉంటున్నాను. 1992లో మా గురువుగారు సిహెచ్ ఆనందరావు గారి ద్వారా నాకు బాబాతో పరిచయం ఏర్పడింది. అప్పటినుండి బాబా నాకు ఎన్నో విషయాలలో, ఎన్నో విపత్తులలో తోడుగా ఉంటూ కాపాడుతున్నారు. నా చదువు, ఉద్యోగం, వివాహం, పిల్లలు ఇవన్నీ బాబా నాకు ప్రసాదించిన అద్భుతాలే. ఇప్పుడు నేను రెండు అనుభవాలు మీతో పంచుకుంటాను. మేము సొంతిల్లు కట్టుకోవాలని దాదాపు ఒక సంవత్సరం నుండి ప్రయత్నం చేస్తున్నాము. కానీ కలిసి రాలేదు. ఆఖరికి నేను బాబా మీద విశ్వాసముంచి మళ్ళీ ప్రయత్నం చేశాను. అప్పుడు ఒకరోజు అనుకోకుండా ఒక ఫోన్ నెంబర్ కోసం ఒకరింటికి వెళ్లాను. అక్కడికి ఒక సైట్ యజమాని వచ్చి మాటల్లో, "మా ప్లాట్ చూడండి. మీకు నచ్చితే తీసుకోండి" అని అన్నారు. విచిత్రంగా బాబా దయవల్ల ఆ ప్లాట్ మాకు నచ్చడం, అతను రీజనబుల్ ధర చెప్పడం, పదిహేను రోజుల్లో రిజిస్ట్రేషన్ చేసుకోవడం జరిగిపోయాయి. అవసరమైన డబ్బులు కూడా మేము అనుకున్న దానికంటే చాలా వేగంగా ఏర్పాటు చేసారు బాబా. "ధన్యవాదాలు బాబా. ఇలాగే మీ దయతో ఇంటి నిర్మాణం పూర్తి కావాలి తండ్రి".


మేము ఈమధ్య(2022, నవంబర్ 23) హోస్పేట్‍లో సత్యసాయిబాబా జన్మదినోత్సవం ఘనంగా జరుపుకున్నాము. ఆ సందర్భంలో మా పాప తన కళ్ళద్దాలు ఎక్కడో పెట్టి మర్చిపోయింది. ఆ జనంలో ఎంత వెతికినా అవి దొరకలేదు. కళ్ళజోడు లేకపోతే పాపకు స్కూల్లో ఇబ్బంది అవుతుంది. అందువలన తను, "నేను స్కూలుకి వెళ్లన"ని ఏడ్చింది. అప్పుడు నేను, "బాబా! కొత్త కళ్ళద్దాలు తీసుకోవాలంటే కనీసం వారం రోజులు పడుతుంది. పాపకి స్కూల్ పోతుంది. దయచేసి మీరే ఏదో ఒకటి చేయాలి" అని బాబాను వేడుకున్నాను. బాబా ప్రేరణో ఏమోగానీ విచిత్రంగా నా భార్య, "మీరు వెళ్లి సత్యసాయి మందిరంలో ఒక రాయి పక్కన చూడండి" అని చెప్పింది. అక్కడికెళ్లి చూస్తే కళ్ళద్దాలు దొరికాయి. "థాంక్యూ సాయి". ఇంకా చాలా అద్భుతాలు నా జీవితంలో జరిగాయి. ఇంకోసారి మీతో పంచుకుంటాను.


ఆపరేషన్ చేయాలన్న స్థితిని మార్చి రిపోర్టులన్నీ నార్మల్ వచ్చేలా అనుగ్రహించిన బాబా


నా పేరు దేవి. ఒకరోజు ఉన్నట్టుండి అమెరికా నుండి మా అమ్మాయి ఫోను చేసి, 'అమ్మా! నేను ఈమధ్య ఏదీ తినలేకపోతున్నాను. అందుకని ఇక్కడి డాక్టర్ దగ్గరకి వెళ్తే, కొన్ని పరీక్షలు చేసి, 'ప్రేగుల్లో ఇన్ఫెక్షన్ ఉంది, బహుశా అపరేషన్ చేయాల్సి ఉంటుంది. అంతకన్నా ముందు మోషన్ మరియు రక్త పరీక్ష చేయాల'ని సాంపిల్స్ తీసుకున్నారు" అని చెప్పి ఏడుపు మెదలుపెట్టింది. అది విన్న నాకు కాళ్ళుచేతులు ఆడలేదు. నేను మాత్రం ఏం చేయగలను, నా సాయితండ్రిని ఆర్తితో వేడుకోవడం తప్పితే. అందువల్ల ఆరోజు నుంచి నేను బాబాను ఒకటే వేధించడం మొదలుపెట్టాను. ఆకలి లేదు, నిద్రలేదు, పగలూరాత్రీ, “బాబా! మీకు నాకు భేటీ, ఇందులో నేనే గెలవాలి. ప్లీజ్ బాబా, నా బిడ్డకి పెద్దగా ఏ సమస్యా ఉండకూడదు. నా బిడ్డవైపు చూడండి బాబా. మీరు తప్పించి ఈ ప్రపంచంలో నాకు ఎవరూ లేరు. మన 40 ఏళ్ళ స్నేహబంధానికి దయచేసి మచ్చ రానివ్వకండి" అని. ఒకటే ఏడుపు. 24 గంటల్లో అనుక్షణం మన బ్లాగులోని తోటి తోబుట్టువులు ఆరోగ్యం కోసం జపించే తారక మంత్రం 'ఓం శ్రీసాయి ఆరోగ్యక్షేమదాయ నమః' ఎడతెరిపి లేకుండా జపించాను. బాబాకి నా ప్రార్థన వినిపించింది. వారం తర్వాత మా అమ్మాయి ఫోన్ చేసి "అమ్మా! ఆపరేషన్ ఉండకపోవచ్చు. కాని అన్ని టెస్టులు చేయించుకోవాల"ని చెప్పింది. అంతే, ఆదేచాలు అని అనుకున్నాను. మళ్ళీ అంతలోనే టెస్టులు అంటే భయమేసింది. సరిగ్గా ఒక నెల తర్వాత హైదరాబాద్ వచ్చింది. తనకి అన్ని టెస్టులు చేయిస్తే బాబా దయవల్ల అన్నీ నార్మల్ వచ్చాయి. "చాలు బాబా, చాలు. మీరు నా ప్రక్కన ఉన్నందుకు చాలా సంతోషం తండ్రి. ఇంతవరకు నన్ను ఎన్నో విధాలుగా ఆదుకుంటూ వచ్చావు. ముందు ముందు కూడా ఆదుకుంటావు తండ్రి. నా జీవితంలో మీరు చేస్తున్న సహాయానికి నా చర్మంతో మీకు చెప్పులు కుట్టించినా తక్కువే తండ్రి. ఏమిచ్చి మీ ఋణం తీర్చుకోగలం, కేవలం ప్రేమతో మీ పాదాలను ముద్దాడడం తప్పించి తండ్రి. నేను ఏ జన్మ ఎత్తినా మీ స్మరణ, మీ తోడు ఉండేలా అనుగ్రహించండి తండ్రి"


5 comments:

  1. సాయి పలుగు సాయి తెలుస్తూనే ఉన్నాను ఒకసారి మాట్లాడు సాయి పలుకు సాయి నన్ను నా భర్తని కలుపు సాయి నా కాపురాని నిలబెట్టు సాయి తనని అర్థం చేసుకునేలా చూడు సాయి నీలాంటి పరిస్థితుల్లో చేయాల్సి వచ్చింది అర్థం చేసుకోవాలి సాయి మంచిగా మారాలి సాయి నువ్వు నాకు మాట ఇచ్చావు సాయి నన్ను నా భర్తని కలుపుతానని ఓం సాయి రామ్

    ReplyDelete
  2. Om sri sainathaya namaha
    Om sri sainathaya namaha
    Om sri sainathaya namaha
    Om sri sainathaya namaha
    Om sri sainathaya namaha

    ReplyDelete
  3. Om Sri sainadhayanamaha

    ReplyDelete
  4. Om Sairam
    Sai always be with me

    ReplyDelete

సాయి మహారాజ్ సన్నిధి సోషల్ మీడియా లింక్స్:

Subscribe Here

బ్లాగ్ అప్డేట్ నోటిఫికేషన్స్ నేరుగా మీ మెయిల్ కే వచ్చేందుకు క్రింద బాక్సులో మీ మెయిల్ ఐడి టైపు చేసి subscribe పై క్లిక్ చేసి, తరువాత స్టెప్స్ పూర్తీ చేయండి.

Delivered by FeedBurner

Followers

Recent Posts


Blog Logo