సాయి వచనం:-

- శ్రీబాబూజీ.

సాయిభక్తుల అనుభవమాలిక 1402వ భాగం....


ఈ భాగంలో అనుభవాలు:

1. తోడుగా ఉండి ఎంతగానో అనుగ్రహించిన బాబా
2. గోల్డ్ బిస్కెట్ ఇప్పించి టెన్షన్ తీసేసిన సాయిబాబా

తోడుగా ఉండి ఎంతగానో అనుగ్రహించిన బాబా


ఓంసాయి శ్రీసాయి జయజయ సాయి!!! నాపేరు సూర్యనారాయణమూర్తి. 'సాయి మహారాజ్ సన్నిధి' ద్వారా సాయి భక్తులందరినీ సాయి భక్తి రసానుభూతిలో తేలియాడిస్తున్న వారికి సాయి అనుగ్రహ కటాక్ష వీక్షణాలు ఎల్లవేళలా ఉండాలని ప్రార్థిస్తున్నాను. నేనిప్పుడు ఈ బ్లాగులోని 'సాయి భక్తుల అనుభవమాలిక'కు ఇటీవల జరిగిన నా అనుభాలతో మరికొన్ని కుసుమాలను సమర్పించుకుంటున్నాను. నేను 2022, నవంబర్ 5న బయలుదేరి ఒంటరిగా రాజమండ్రి వెళ్లాలని నిశ్చయించుకున్నాను. అయితే కరోనా మహమ్మారి విజృంభించిన తర్వాత నేను ఒక్కడినే ఎక్కడికీ వెళ్ళని కారణంగా మా కుటుంబసభ్యులు నా ప్రయాణానికి అభ్యంతరం చెప్పారు. నేను వాళ్లతో, "బాబా ఉన్నారు. ఆయన తోడుగా వస్తారు" అని చెప్పి నవంబర్ 5 రాత్రి కాకినాడ స్పెషల్ రైలుకి టికెట్టు బుక్ చేసుకున్నాను. రైలు బయలుదేరేముందు సికింద్రాబాద్ స్టేషన్ సమీపం నుండి మొదలై తిరిగి 2022, నవంబర్ 8న హైదరాబాదు చేరుకునే వరకు బాబా నాకు చూపిన చమత్కారాలను నేనిప్పుడు తోటి భక్తులతో పంచుకుంటున్నాను.


ఆరోజు రాత్రి 7:10 ని.లకు సికింద్రాబాద్ స్టేషన్‍లో రైలు ఎక్కాల్సి ఉండగా నేను రెండు గంటల ముందు మా ఆఫీస్ నుండి బయలుదేరి మెట్రో రైలులో సాయంత్రం 5:50కి సికింద్రాబాద్ చేరుకున్నాను. ఇంకా గంట వ్యవధి ఉన్నందున రైల్వేస్టేషన్‍కి సమీపంలో ఉన్న శ్రీగణపతి ఆలయం దర్శించుకుందామని వెళ్లాను. ఆలయంలోకి ప్రవేశించగానే నేను బాబాను, "ఓ సాయి గణపతి! నేను ఒంటరిగా రెండు రోజులు గడపాలి. ఈ రెండు రోజులు నా భారం మీదే" అని ప్రార్థించాను. ఆ గుడిలో ఒక చక్కటి భజన బృందం సంకీర్తన చేస్తుంటే 6:40 వరకు అక్కడే ఉండి బయటకు వచ్చాను. చూస్తే, నా పాదరక్షలు కనబడలేదు. నేను కంగారుగా చూస్తుంటే, ఒక పెద్దాయన చెప్పుల స్టాండ్ పక్క నుంచి నన్ను పిలిచి 'నేను ఆయనకి తెలుసని, గుడిలోపల భజన దగ్గర నన్ను చూశానని, చెప్పుల స్టాండ్‍కి దూరంగా ఉన్న నా చెప్పులను తానే తీశానని' చెప్పి నా చెప్పులు నాకు అందజేశాడు. అయితే నేను ఆ పెద్దాయనను గుర్తుపట్టలేదు. అందుకని ఆయన, "నీవు నాకు తెలుసు బాబు. ఇంకేం ఆలోచించకు. వెళ్లి, రైలు ఎక్కు. నేనూ వస్తాను" అని చెప్పాడు. నేను హడావుడిలో ఏమీ పట్టించుకోకుండా వెళ్లి రైలు ఎక్కాను. గుడి దగ్గర జరిగిందంతా పూర్తిగా మర్చిపోయాను. కొంతసేపటికి లోవర్ బెర్త్ లో పడుకున్న నాకు ఎదురుగా ఉన్న సైడ్ లోవర్ బెర్త్ లో ఒక ఆయన కూర్చున్నట్టు అనిపించింది. నేను తరచి తరచి చూస్తుంటే ఆయన కాలు బంగారు వర్ణంలో, ముఖం చంద్రబింబం వలే కనిపించాయి. నిజానికి అక్కడ ఎవరూ లేరు. నాకు గుడి దగ్గర విషయం గుర్తొచ్చింది. అప్పుడు మళ్ళీ ఎదురుగా చూస్తే, బాబా నవ్వుతూ, 'తోడు రమ్మని నన్ను మర్చిపోతే ఎలా?' అని అంటున్నట్లు నాకనిపించింది. ఇక నేను ధైర్యంగా ఉండొచ్చని బాబాని ప్రార్థించి నిద్రపోయాను. 


ఒక అశుభకార్యానికి వెళ్తున్న నన్ను ఆ కార్యానికి హాజరుకావడానికికన్నా ముందే వేరే దైవకార్యానికి హాజరయ్యేలా బాబా ఎలా చేసారో ఇప్పుడు చెప్తాను. నేను రాజమండ్రిలో రైలు దిగి బయటకు వెళ్లేసరికి మామూలుగా అయితే మా ఊరు వెళ్లే బస్సులు ఉంటాయి. కానీ ఆ రోజు నేను స్టేషన్ బయటకు వెళ్ళగానే మా ఊరి బస్సులకు బదులు మా చెల్లివాళ్ళ ఊరు బస్సు వచ్చింది. ఆ బస్సును చూడగానే నేను మా చెల్లివాళ్ళ ఊరు వెళ్లి రెండు సంవత్సరాలైందని గుర్తొచ్చింది. అంతే, మా చెల్లివాళ్ళ ఇంటి ఎదురుగా ఉన్న శ్రీసాయిబాబా మందిరంలో బాబాను దర్శించుకుని ప్రార్థించుకోవచ్చు అని ఆ బస్సు ఎక్కాను. రెండేళ్ల తరువాత నన్ను చూసిన మా చెల్లి చాలా సంతోషించింది. వాళ్ళు ఆరోజు ఆ ఊరి దేవుడు శ్రీగౌతమీశ్వరునికి లక్ష బిల్వపత్ర పూజ, అభిషేకం జరుపుకుంటున్నారు. అందువల్ల మా చెల్లి, "ఈ రోజు ఇక్కడే ఉండి, రేపు ఉదయం తొలి బస్సుకి ఊరు వెళ్తే మంచిద"ని చెప్పింది. నేను సరేనని నా స్నానాదులు ముగించుకుని ఎదురుగా ఉన్న బాబా మందిరానికి వెళ్లి బాబాను దర్శించుకున్నాను. అక్కడ నిల్చొని ఉండగా, 'నన్ను ఈశ్వర పూజలో కూర్చోవద్దని, గుడిలోనే దూరంగా కూర్చుని పూజ, అభిషేకం అయ్యాక ప్రసాదం తీసుకుని మా ఊరు వెళ్ళమ'ని బాబా ఆదేశించారు. బాబా ఆజ్ఞననుసరించి నేను ఉదయం 10 గంటల నుండి రాత్రి 8 వరకు దేవాలయంలో కూర్చొని రాత్రి 8:30కి అన్నప్రసాదం స్వీకరించాను. ఆ దేవాలయంలో ఉన్నంతసేపు శివలింగంలో బాబా అనేకసార్లు తమ అద్భుత దర్శనాన్ని నాకు ప్రసాదించారు. ఒకసారి నా పక్కనే ఉండి ఆయన కూడా రుద్ర పారాయణ చేస్తున్నట్లు నాకు దర్శనమైంది. సాయే ఈశ్వరుడు కదా!


ఇకపోతే, 2022, నవంబర్ 7 ఉదయం తొలి బస్సుకి మా ఊరు వెళదామనుకుంటే అక్కడివాళ్ళు తొలిబస్సు ఉదయం 6:00 గంటలకని, కానీ ఆ బస్సు సుమారు ఒక గంట ఆలస్యంగా వస్తుందని అన్నారు. కానీ బాబాపై విశ్వాసమున్న నేను ఉదయం 5:55 నిమిషాలకే తయారై బస్సుకోసం నిరీక్షించాను. సరిగా 6:05 నిమిషాలకు తొలి బస్సు వచ్చింది. అలా బాబా దయతో సమయానికి బస్సు రప్పించి, మా ఊరు చేర్చి, నేను హాజరు కావలసిన కార్యాన్ని తొందరగా పూర్తి చేయించారు. ఆ తర్వాత నేను మా ఊరికి దగ్గరలో ఉన్న బంధువులను కలిసి, తిరిగి మా ఊరు వచ్చి భోజనమయ్యాక తిరుగు ప్రయాణానికి సిద్ధమయ్యాను. కానీ కార్తీకమాసంలో సోమవారంనాడు మా ఊరి దైవమైన శ్రీఉమకొప్పులింగేశ్వరస్వామిని దర్శించుకోలేకపోయానని గుడిదాక వెళ్ళాను. అక్కడ గుడి తాళం వేసి ఉండటం చూసి నేను బాధపడుతూ బాబాని తలుచుకున్నాను. అంతలో పూజారి(నా స్నేహితుని తమ్ముడు) తాళం తీసుకుని వచ్చాడు. విషయమేమిటంటే, ఉదయం నుండి వేలకొలది భక్తులు ఈశ్వరుని దర్శించుకున్నాక పూజారి ఇంటికి వెళ్లి కాసేపు పడుకున్నాడు. అతనికి కలలో నేను గుడిలోకి వెళ్ళబోతున్నట్లు కనిపించింది. వెంటనే అతను తాళాలు తీసుకుని గుడికి వచ్చి, గుడి తలుపు తెరిచి నాకు ఈశ్వర దర్శనం చేయించాడు. తరువాత నేను రైల్వేస్టేషన్‍కు వెళ్లి రైలు ఎక్కాను. పడుకునే ముందు చూస్తే, సైడ్ లోయర్ బెర్త్ లో బాబా కాలు మీద కాలు వేసుకుని కూర్చుని నన్ను ఆశీర్వదించారు. ఆయన ఒంటరిగా ప్రయాణం చేయలేననుకున్న నాకు అన్ని విధాలా తోడుగా ఉండి ఇంతలా అనుగ్రహించారు. ఇదంతా బాబాకు భక్తులపట్ల గల అనన్య ప్రేమను తెలియపరుస్తుంది. భక్తులు కోరాలేగాని ఎక్కడైనా, ఎప్పుడైనా బాబా సిద్ధంగా ఉంటారు.


ఇప్పుడు మరికొన్ని అనుభవాలు పంచుకుంటాను. ఈ అనుభవాలన్నీ కూడా ఆయా సందర్భాల్లో బ్లాగులో పంచుకుంటానని అనుకున్న వెంటనే జరిగినవి. అందుకని ఆయా తేదీల వారీగా వివరిస్తున్నాను. 2022, సెప్టెంబర్ 8న నేను చాలామంది నా స్నేహితులతో, వాళ్ళకి తెలిసిన మరికొంతమందితో కలిసి భోజనం చేశాను. మరి ఎవరి దృష్టి దోషమోగానీ ఆరోజు రాత్రి నేను అసౌకర్యానికి గురై చాలా బాధపడ్డాను. అప్పుడు 'ఓం శ్రీసాయి ఆరోగ్యక్షేమదాయ నమః' అని జపిస్తూ, 'నాకు తగ్గితే బ్లాగులో పంచుకుంటాను' అని అనుకున్నాను. బాబా దయవలన మరునాడు ఉదయానికి నేను ఆ ఇబ్బంది నుండి బయటపడ్డాను. అలాగే 2022, సెప్టెంబర్ 10న నా ఆఫీసులో కొంతమందితో కలిసి సమోసాలు తిన్నాను. ఆరోజు ఎసిడిటీతో బాధపడ్డాను. 'ఆ బాధ తగ్గితే, బ్లాగులో పంచుకుంటాన'ని అనుకున్న 20 నిమిషాల్లో ఎసిడిటీ హాంఫట్ అయింది. అంతా బాబా దయ.


ఆఫీసులో కొన్ని ముఖ్యమైన విషయాలలో సమస్యలు రాగా నేను, "బాబా! వెంటనే ఈ సమస్యలు సద్దుమణిగితే, మీ కృపను బ్లాగులో పంచుకుంటాను" అని బాబాకి విన్నవించుకున్నాను. ఆ సద్గురుని కృపాదృష్టి వల్ల 2002, సెప్టెంబర్ 12 సాయంత్రానికి ఆ సమస్యలన్నీ సర్దుకున్నాయి.


2022, సెప్టెంబర్ 14, 15 తేదీలలో అచలానందసరస్వతి గారిచే రచింపబడ్డ శ్రీసాయి సచ్చరిత్ర అఖండ పారాయణ మా కాలనీలో చేశాము. 'పారాయణ ఎటువంటి అవాంతరాలు లేకుండా జరిగితే, బ్లాగులో పంచుకుంటాన'ని అనుకున్నాను. సద్గురు శ్రీసాయినాథుని దయవలన 28 గంటలపాటు పారాయణ అద్భుతంగా జరిగింది. బాబాకి మాటిచ్చినట్లు ఈ అనుభవాలను బ్లాగుకి పంపాను. "ఒక్కరోజు ఆలస్యానికి క్షమించండి బాబా". చివరిగా ప్రతినిత్యం ఈ బ్లాగుని అనుసరించమని ప్రతి సాయి భక్తున్ని కోరుకుంటున్నాను. ఈ బ్లాగు నిర్వహిస్తున్న సాయిని దీవించమని ఆ సద్గురు సాయినాథుని వేడుకుంటున్నాను.


సూర్యనారాయణమూర్తి.

178/3RT, విజయనగర్ కాలనీ,

హైదరాబాద్.

ఫోన్ నెంబర్: 9052797168.


శ్రీ సచ్చిదానంద సద్గురు సాయినాథ్ మహరాజ్ కీ జై!!!


గోల్డ్ బిస్కెట్ ఇప్పించి టెన్షన్ తీసేసిన సాయిబాబా


శ్రీసాయి బంధువులకు, 'సాయి మహారాజ్ సన్నిధి' బ్లాగు నిర్వాహకులకు నా నమస్కారాలు. నా పేరు వెంకట ప్రసాదరావు. మాది ఏలూరు. బాబా నాకు ప్రసాదించిన ఒక అనుభవం మీతో పంచుకుంటున్నాను. నేను ఈమధ్యనే పదవి విరమణ చేశాను. బాధ్యతలన్నీ తీరిపోయినందున రిటైర్ అవ్వడం వల్ల వచ్చిన డబ్బుతో నా భార్యకి బంగారం కొందామనుకున్నాను. రేటు తక్కువగా ఉన్నప్పుడు బంగారం కొనుక్కొని, తర్వాత నగలు చేయించుకోవచ్చని అనుకున్నాం. ఆ తరువాత ఒకరోజు ఆన్లైన్లో రేటు తక్కువగా ఉండటం చూసి, ఒక 100 గ్రాములు గోల్డ్ బిస్కెట్ కొందామని తెలిసిన బంగారం షాపు అతనితో మాట్లాడాము. అతను చెప్పిన రేటు మాకు అనుకూలంగా ఉండటంతో, "మాకు ఒక గోల్డ్ బిస్కెట్ కావాల"ని చెప్పాము. అప్పుడు అతను ఒక బ్యాంకు అకౌంట్ నెంబర్ ఇచ్చి, ఆ అకౌంటుకి ఐదు లక్షల, ఐదు వేల రూపాయలు ట్రాన్స్ఫర్ చేయమని చెప్పాడు. ఆలస్యం చేస్తే, మళ్లీ ఎక్కడ ధర పెరుగుతుందో అని వెనక ముందు ఆలోచించకుండా మేము ఆ అకౌంటుకి డబ్బులు ట్రాన్స్ఫర్ చేసాం. కానీ ఆ షాపతను చెప్పిన సమయానికి బిస్కెట్ మాకు ఇవ్వలేదు. అడిగితే, పొద్దున్న 10 గంటలకి, సాయంత్రం 5:00 గంటలకి ఇస్తానని ప్రతిరోజూ చెప్తుండేవాడు. అతను అలా చెప్తున్నా ఒక పది రోజుల వరకు మాకు అనుమానం రాలేదు. తర్వాత కూడా అతను అలాగే చెప్తుంటే భయమేసి అతనిచ్చిన బ్యాంకు అకౌంట్ నెంబర్ వెరిఫై చేస్తే, అది బినామీ అకౌంటు అని తెలిసింది. ఆలోగా 15 రోజులయ్యాయి. అతను మాత్రం ఇదిగో, అదుగో అంటుండేవాడుగానీ, బంగారం ఇవ్వలేదు. ఇక లాభం లేదు, మేము నమ్మిన ఆ సాయినాథుడే మాకు దిక్కు అని తలచి గుడికి వెళ్లి, ఆ సాయినాథుని ప్రార్థించి, "మా బంగారం మా చేతికొస్తే, మీ అనుగ్రహాన్ని బ్లాగులో పంచుకుంటాను" అని అనుకున్నాము. అక్కడికి మూడోరోజు నేను నా స్నేహితుడు ఒక అతన్ని తోడుగా తీసుకుని ఆ షాపుకు వెళ్లి, గట్టిగా అడిగాను. అతను ఎప్పటిలాగే చెప్పాడు. దాంతో మేము, "మీరు ఇచ్చేవరకు ఇక్కడే కూర్చుంటాం. అయినా ఇవ్వకపోతే ఇంకా మా వాళ్ళని తీసుకొచ్చి గొడవ చేస్తామ"ని చెప్పాము. అతను మమ్మల్ని అలాగే కూర్చోబెట్టాడు. ఉదయం 9 గంటలకు వెళ్ళిన మేము మధ్యాహ్నం రెండు గంటలైనా అలాగే షాపులో కూర్చున్నాము. ఇక అప్పుడు ఆ షాపతను బిస్కెట్ తెస్తానని షాపుని కుర్రాళ్ళకి అప్పగించి బయటికి వెళ్లిపోయాడు. గంట అయినా రాలేదు. ఏం చేయాలో తెలియక ఆ బాబానే తలుచుకుంటూ, భోజనం కూడా చేయకుండా అలానే షాపులో కూర్చున్నాము. బహుశా మా గోడు ఆలకించిన సాయినాథుడు ఆ షాపతనికి మంచి బుద్ధిని ప్రసాదించినట్లున్నారు. చాలాసేపటికి అతను గోల్డ్ బిస్కెట్ తీసుకొచ్చి మాకిచ్చాడు. కాదు, కాదు ఆ బాబానే అతని చేత మాకు ఇప్పించారు. ఆ సాయినాథుని మీద భారం వేస్తే, అంతా ఆయనే చూసుకుంటారని ఈ అనుభవం ద్వారా నిరూపితమైంది. "శతకోటి ధన్యవాదాలు సాయి. మీరు చేసిన మేలు జన్మలో మర్చిపోలేము".


2 comments:

  1. Sai nannu na barthani kalupu sai na kapuranni nilabettu sai pls nannu ontari danni cheyyodhu sai thanu ante naku chala istam sai. Na bartha ki dhuram ga undalka narakam anubhavisthunna sai.nyayam nip is the nannu na barthani kalupu sai we blog panchukuntamu anukunte andhari korikalu thrippothunnai sai.nenu kids na anubhavanni. Panchukuntanu sai. Naku as dhrustanni prasadhinchandi sai.plssss

    ReplyDelete
  2. Om sri sainathaya namaha
    Om sri sainathaya namaha
    Om sri sainathaya namaha
    Om sri sainathaya namaha
    Om sri sainathaya namaha

    ReplyDelete

సాయి మహారాజ్ సన్నిధి సోషల్ మీడియా లింక్స్:

Subscribe Here

బ్లాగ్ అప్డేట్ నోటిఫికేషన్స్ నేరుగా మీ మెయిల్ కే వచ్చేందుకు క్రింద బాక్సులో మీ మెయిల్ ఐడి టైపు చేసి subscribe పై క్లిక్ చేసి, తరువాత స్టెప్స్ పూర్తీ చేయండి.

Delivered by FeedBurner

Followers

Recent Posts


Blog Logo