సాయి వచనం:-

- శ్రీబాబూజీ.

సాయిభక్తుల అనుభవమాలిక 1424వ భాగం....


ఈ భాగంలో అనుభవాలు:

1. శిరిడీ అనుభూతులు  
2. నడక భారమైన భక్తుని చేత గిరిప్రదక్షిణ పూర్తి చేయించిన బాబా

శిరిడీ అనుభూతులు  


సాయిభక్తులందరికీ నా నమస్కారాలు. బ్లాగు నిర్వహిస్తున్న సాయికి నా హృదయపూర్వక అభినందనలు. నా పేరు సాయిఅంజని. మేము 2022, సెప్టెంబర్ 30న శిరిడీకి ప్రయాణమయ్యాము. మా యాత్ర ఎటువంటి ఇబ్బంది లేకుండా పూర్తయి సురక్షితంగా ఇంటికి వస్తే నా అనుభవాన్ని బ్లాగ్ ద్వారా తోటి భక్తులతో పంచుకుంటానని బాబాతో చెప్పుకున్నాను. ఆ అనుభవాన్ని ముందుగా పంచుకుంటాను. మేము ఎక్కిన ట్రైన్ ఆలస్యమై అక్టోబర్ 1, ఉదయం 7 గంటలకి నాగర్‌సోల్ చేరుకోవాల్సింది కాస్తా 9 గంటలకి చేరుకుంది. మేము 20 రోజుల ముందు కీరవాణి సత్రంలో రూమ్ బుక్ చేసుకున్నాము. వాళ్ళు, "మీకోసం రైల్వేస్టేషన్‍కి టాక్సీ పంపుతాం, మీరు రైలు దిగేసరికి మా డ్రైవర్ మీ దగ్గరకి వస్తాడ"ని చెప్పి, అతని పేరు, ఫోన్ నెంబర్ ఇచ్చారు. ఆ డ్రైవర్ పేరు ఏంటంటే 'బాబా'. నాకు ఆ పేరు వినగానే బాబానే ఆ రూపంలో మాకోసం వచ్చారనిపించింది. మేము 11 గంటలకి శిరిడీలోని కీరవాణి సత్రం చేరుకున్నాము. గదులు చాలా విశాలంగా బాగున్నాయి. భోజనాలు చేసి సుమారు మధ్యాహ్నం 2-30కి బాబా దర్శనం కోసం వెళ్ళాము. సమాధిమందిరానికి వెళ్ళినప్పుడు నేను నా మనసులో 'బాబా! మీరు నన్ను చూస్తున్నారని ఏదో ఒక విధంగా తెలియజేయండి' అని అనుకున్నాను. నేను, నా భర్త, సంవత్సరం 11 నెలల వయసున్న మా చిన్నబాబు బాబాను దర్శించుకుని బయటకు వెళ్లబోతుండగా ఒక పూజారి నా భర్తని పిలిచి బాబా దగ్గర ఉన్న ఒక స్వీట్ తీసి మా బాబుకివ్వమని ఇచ్చారు. బాబా నన్నే చూస్తున్నారని నాకర్థమై నాకు ఆనందభాష్పాలు వచ్చాయి. ఇకపోతే, ఆరోజు జనం తక్కువగా ఉండటం వల్ల మేము వెంటనే మళ్ళీ బాబా దర్శనానికి వెళ్ళాము. అప్పుడు బాబా తమ ముందు 10 నిమిషాలు ఉండే భాగ్యాన్ని మాకు ఇచ్చారు.  అక్కడ సెక్యూరిటీవాళ్ళు మమ్మల్ని వెళ్ళమని అస్సలు చెప్పలేదు. నాకు చాలా చాలా సంతోషంగా అనిపించింది.


రెండవరోజు ఉదయం కాకడ ఆరతికి ఆన్‌లైన్‌లో టిక్కెట్లు బుక్ చేసుకున్నాము. అంటే, మేము ఉదయం 4 గంటలకల్లా క్యూలో ఉండాలి. అయితే నాకు ఇద్దరు చిన్న పిల్లలు ఉన్నారు. తెల్లవారుఝామున వాళ్ళని లేపితే ఏడుస్తారేమో అని భయపడ్డాను. కానీ బాబా దయవల్ల వాళ్ళు లేపగానే లేచి ఫ్రెష్ అయ్యారు. మేము 4:30 కల్లా మందిరానికి వెళ్ళాము. ఇంకా ముందు వెళ్లుంటే బాబా ముందు ఉండేవాళ్ళము. కానీ ఆలస్యం అవటం వల్ల కొంచెం వెనకపడ్డాం. అయినా కాకడ ఆరతి అనుభవం నాకు చాలా బాగా అనిపించింది. మొదటిసారి కాకడ ఆరతికి హాజరయ్యేవాళ్ళు చాలా మంచి అనుభూతితో బయటకి వస్తారు. నాకూ అదే అనుభవం అయింది. తరువాత మేము భీమశంకర్(జ్యోతిర్లింగం) వెళ్లి శివుని దర్శించుకుని రాత్రి 7-30కి మా గదికి చేరుకున్నాము. భోజనం చేసి శేజారతికి వెళ్ళాము. మూడోరోజు అభిషేకం టిక్కెట్లు బుక్ చేశాము. బాబా దయవల్ల అభిషేకం చాలా బాగా జరిగింది


అదేరోజు సాయంత్రం మేము తిరుగు ప్రయాణానికి బయల్దేరి నాగర్‌సోల్ రైల్వేస్టేషన్‍కి చేరుకున్నాము. స్టేషన్లో లైట్లు లేకపోవడం వల్ల చాలా చీకటిగా ఉంది. రాత్రి 9 గంటలకి రైలు రాగానే చాలా జాగ్రత్తగా మా లగేజీ అంతా తీసుకుని రైలు ఎక్కి సామానంతా సర్దుకుని నిద్రపోయాము. ఉదయం లేచేసరికి మా హ్యాండ్‌బ్యాగ్ కనిపించలేదు. అంతా వెతికి చూశాము, కానీ బ్యాగ్ కనిపించలేదు. ఒక పోలీసుని అడిగితే, "నాందేడ్ స్టేషన్‍లో దొంగలు ఎక్కుతారు. వాళ్లే తీసుంటారు" అని అన్నారు. ఆ బ్యాగులో సాయి స్తవనమంజరి పుస్తకం ఉంది. నేను ఎక్కడికి ప్రయాణమైనా నాతో ఆ స్తవనమంజరి తీసుకెళ్తాను. అది నా అలవాటు. అలాంటి పుస్తకం పోయిందని నేను చాలా బాధపడ్డాను. ఇంటికి వచ్చాక, "ఏం పోయినా పరవాలేదు బాబా. నా స్తవనమంజరి మాత్రం వేరే బ్యాగులో ఉండేలా చేయండి బాబా" అని అనుకున్నాను. బాబా దయ చూపారు. వేరే బ్యాగులో నా పుస్తకం ఉంది. ''చాలా చాలా ధన్యవాదాలు బాబా''. శిరిడీ వెళ్ళేవాళ్ళు నాగర్‌సోల్‌లో ట్రైన్ ఎక్కితే మీ సామాను చాలా జాగ్రత్తగా ఉంచుకోండి. 


శిరిడీ నుండి వచ్చాక ఉండ్రాళ్లతద్ది, అట్లతద్ది నోముల ఉద్యాపన కోసం మేము మా అమ్మావాళ్ళ ఇంటికి వెళ్ళాము. 'ఎలాంటి సమస్యలు లేకుండా నా ఉద్యాపన పూర్తయితే, నా అనుభవాన్ని బ్లాగులో పంచుకుంటాన'ని అనుకున్నాను. బాబా దయవల్ల ఎలాంటి ఇబ్బందులు లేకుండా నా ఉద్యాపన పూర్తయింది. 'ధన్యవాదాలు బాబా'.


నవంబర్ 6న మా చిన్నబాబు రెండో పుట్టినరోజు పార్టీ పెట్టుకున్నాము. అందరినీ ఆహ్వానించి అన్ని ఏర్పాట్లు చేసుకున్నాము. కానీ అది నాకు, మా సిస్టర్‌కి నెలసరి సమయం. నెలసరి వస్తే, పార్టీ రద్దు చేసుకోవాల్సి వస్తుంది. అందువల్ల నేను బాబాతో, "ప్లీజ్ బాబా ఎలాగైనా పార్టీ అయ్యేదాక నాకు, మా సిస్టర్‌కి నెలసరి రాకుండా చూసి పార్టీ బాగా జరిగేలా చూసుకోవాలి" అని చెప్పుకున్నాను. మా సిస్టర్‌కి పీరియడ్స్ ముందే వచ్చినా పార్టీ అయితే ఎలాంటి సమస్యలు లేకుండా బాగా జరిగింది. ఆ మరుసటిరోజు ఉదయం నాకు నెలసరి వచ్చింది. నాకైతే చాలా అద్భుతమనిపించింది. ''చాలా ధన్యవాదాలు బాబా''.


నడక భారమైన భక్తుని చేత గిరిప్రదక్షిణ పూర్తి చేయించిన బాబా


శ్రీ సచ్చిదానంద సమర్థ సద్గురు శ్రీసాయినాథ్ మహరాజ్ కీ జై!!!


ముందుగా శ్రీసాయిసమర్థులకు, సాయిబంధువులకు మరియు బ్లాగ్ నిర్వాహకులకు అనేక నమస్కారాలు.  నేను ఒక సాయిభక్తుడిని. నా పేరు నాగయ్య. నా వయసు 63 సంవత్సరాలు. నేను గతంలో రెండుసార్లు నా అనుభవాలు ఈ 'సాయి మహరాజ్ సన్నిధి'లో పంచుకున్నాను. ఇప్పుడు నేను పంచుకోబోయే అనుభవం చాలా విశిష్టమైనది. శ్రీసాయిసమర్థులు ఎంతటి అద్భుతాలు చేయగలరో తెలుపుతుంది. మూడు సంవత్సరాల క్రితం రోడ్డు ప్రమాదంలో నా కాలి మడమ పైభాగంలో కీలు విరిగి ఒక సంవత్సరంపాటు ఎటూ కదలలేకపోయాను. ఆ తర్వాత కర్ర సాయంతో నడుస్తున్నాను. అయితే ఎక్కువ దూరం నడవాలంటే మాత్రం కష్టంగా ఉంటుంది. ఇక విషయానికి వస్తే... ఈమధ్య నెల్లూరులో ఉంటున్న పూర్వాశ్రమ మిత్రులు అరుణాచలం రమ్మని నన్ను ఆహ్వానించారు. నేను గిరిప్రదక్షిణ(14 కిలోమీటర్లు) చేయలేనని నా బలహీనతను వారికి తెలియజేశాను. అందుకు వాళ్ళు, "అక్కడ ఉండడానికి ఇబ్బంది లేదు. ఒక ఆశ్రమంలో ఉండే అవకాశం ఉంది. నడవలేని పక్షంలో ఆ ఆశ్రమంలో ఉండవచ్చ"ని చెప్పారు. అప్పుడు నేను వాళ్లతో నడవలేని పక్షంలో ఆటోలో వెళ్ళవచ్చునని, అది కూడా కష్టంగా ఉంటే ఆశ్రమంలో విశ్రాంతి తీసుకోవచ్చునని భావించి బాబాతో చెప్పుకుని వాళ్లతో వెళ్ళడానికి మొగ్గుచూపాను. 2022, డిసెంబర్ 6, ఉదయం నెల్లూరు నుండి బయలుదేరి మధ్యాహ్నం రెండు గంటలకు మేము అరుణాచలం చేరుకున్నాం. అది కృత్తిక దీప సమయం కావడం వలన ఆశ్రమం వరకు వెళ్లేందుకు దారి లేక ఊరు బయటే మా కారు ఆపివేయవలసి వచ్చింది. ఎటు చూసినా జన సందోహం. దాదాపు 15 లక్షల మంది జనాభా ఆ సమయంలో అరుణాచలంలో ఉన్నారని అంచనా. ఆటోలుగానీ, మరే ప్రయాణ సాధనాలుగానీ లేవు. ఉండడానికి వసతి గృహాలు లేవు. నా ముందున్న మార్గం ఒకటే, సాయితండ్రికి సమస్యను నివేదించుకుని అందరితోపాటు నడవడం తప్ప చేయగలిగిందేమీ లేదు. అంతే, సాయికి చెప్పుకుని ఆయన నామం జపిస్తూ కర్ర సాయంతో నడక ప్రారంభించాను. కానీ విపరీతమైన కాలినొప్పి వలన ఎక్కడ పడిపోతానో తెలియదన్నట్టుంది నా పరిస్థితి. అయినా నా సాయితండ్రి నా చేయి పట్టుకుని(స్నేహితుల ఆసరాతో) 14 కిలోమీటర్ల అరుణాచల గిరిప్రదక్షిణ విజయవంతంగా పూర్తిచేయించారు. తరువాత అరుణాచల జ్యోతిదర్శనం చేసుకుని తిరిగి ఇంటికి వచ్చాను. నేను గిరిప్రదక్షిణ చేశానంటే నా బంధువర్గంలో ఎవ్వరూ నమ్మలేదు. అంతా ఆ సాయినాథుని కృప. ఇంతకంటే అద్భుత కార్యం నా జీవితంలో మరేదీ లేదు. "ధన్యవాదాలు బాబా".


శ్రీ సచ్చిదానంద సమర్థ సద్గురు సాయినాథ్ మహరాజ్ కీ జై!!!


4 comments:

  1. సాయి నా వంశీ మనసు మంచిగా మార్చు సాయి తనని అర్థం చేసుకునేలా చూడు సాయి నన్ను మల్లి భార్యగా స్వీకరించి కాపురానికి తీసుకొని వెళ్లేలా చూడు సాయి నా తల్లిదండ్రులు పెట్టుకొని ఉన్నారు సాయి నా జీవితాన్ని నిలబెట్టు సాయి వాళ్ళ బాధలు తీర్చే సాయి బాబా సాయి కాపాడు బాబా సాయి నేను కూడా నా అనుభవాన్ని బ్లాక్లో పంచుకుంటాను సాయి

    ReplyDelete
  2. A ammayi korika thiruchu thandri mimmalani antha ga aduguthundi.. please baba

    ReplyDelete
  3. Om sri sainathaya namaha
    Om sri sainathaya namaha
    Om sri sainathaya namaha
    Om sri sainathaya namaha
    Om sri sainathaya namaha

    ReplyDelete
  4. Om Sairam
    Sai always be with me

    ReplyDelete

సాయి మహారాజ్ సన్నిధి సోషల్ మీడియా లింక్స్:

Subscribe Here

బ్లాగ్ అప్డేట్ నోటిఫికేషన్స్ నేరుగా మీ మెయిల్ కే వచ్చేందుకు క్రింద బాక్సులో మీ మెయిల్ ఐడి టైపు చేసి subscribe పై క్లిక్ చేసి, తరువాత స్టెప్స్ పూర్తీ చేయండి.

Delivered by FeedBurner

Followers

Recent Posts


Blog Logo