సాయి వచనం:-

- శ్రీబాబూజీ.

సాయిభక్తుల అనుభవమాలిక 1416వ భాగం....


ఈ భాగంలో అనుభవాలు:

1. ప్రాణాల మీదకొస్తే కొద్దిసేపట్లోనే కాపాడిన బాబా
2. బాధను భరించలేమని గుర్తించేలోపే ఆ బాధలోంచి బయటపడేస్తారు బాబా
3. ఒక్క రూపాయి ఖర్చు అవ్వకుండా అనుగ్రహించిన బాబా

ప్రాణాల మీదకొస్తే కొద్దిసేపట్లోనే కాపాడిన బాబా


సాయిబంధువులందరికీ నా నమస్కారాలు. నా పేరు రాజేశ్వరి. కరోనా వ్యాక్సిన్ ఇవ్వడం మొదలుపెట్టాక నాకు, మా చెల్లికి ఒకేరోజు స్లాట్ దొరికింది. మావారు, మా మరిది మమ్మల్ని తీసుకెళ్తే మేము వ్యాక్సిన్ వేయించుకున్నాం. తరువాత ఒక ఐదు నిమిషాలు కూర్చుని బాగానే ఉందని తిరిగి ఇంటికి బయలుదేరాం. ఇంకో పది నిమిషాల్లో మా ఇంటికి చేరుకుంటామనగా మా చెల్లి, "నాకు ఏదో అవుతుంది. ఊపిరి అందట్లేదు" అంటూ మనిషి సీట్లోంచి జారిపోసాగింది. ఇంజక్షన్ రియాక్షన్ ఇచ్చిందని మాకు అర్థమై హాస్పిటల్‍కి వెళదామని కారు వెనక్కి తిప్పుతుంటే మా చెల్లి, "లేదు, నాకు ఏమైనా సరే ఇంటికి తీసుకుపోండి" అని ఏడ్చింది. మాకు ఏం చేయాలో బుర్ర పని చేయలేదు. అప్పుడే నాకు ఒక విషయం గుర్తొచ్చింది. ఆరోజు పొద్దున్న సాయిబాబా వచనం చూస్తే, "నేనుండగా ఏమి కాదు. నా ఊదీతో ఏ గడ్డ అయినా, జ్వరమైనా తగ్గిపోతుంది" అని వచ్చింది. అది చదివిన నేను, 'ఓహో! ఈరోజు వ్యాక్సిన్‍కి వెళ్తున్నాం కదా! జ్వరమొస్తే ఊదీ తీసుకోమ'ని బాబా చెప్తున్నారని అనుకున్నాను. కానీ మా చెల్లికి రియాక్షన్ అయి ప్రాణాల మీదకి వస్తుందని అనుకోలేదు. సరే, ఈలోగా మా చెల్లి కళ్ళు తేలేస్తుంటే నేను వెంటనే నా దగ్గర ఎప్పుడూ ఉండే ఊదీ ప్యాకెట్ తీసి తన నుదురు అంతా ఆ ఊదీ రాసి, తన నోరు బలవంతంగా తెరిచి మరికొంత ఊదీ నాలుక చివరన పెట్టి చప్పరించమని చెప్పాను. తరువాత తనచేత 'ఓఆర్ఎస్' పట్టించాలని చూసానుగాని తను అస్సలు త్రాగలేకపోయింది. ఈలోగా ఇల్లు వచ్చింది. లిఫ్ట్ లో తనని తీసుకెళ్తుంటే తను ఒక్కసారిగా కూలబడిపోయింది. మేము ఎలాగో తనని తీసుకొచ్చి ఇంట్లో సోఫాలో కూర్చుండబెట్టాము. మెడికల్ స్టూడెంట్ అయిన మా అబ్బాయి వెంటనే బీపీ, పల్స్ చూసి, "అమ్మా! బిపి, పల్స్ నార్మల్‍గా ఉన్నాయి. కాబట్టి కంగారు పడాల్సిన పనిలేదు. ముందు నువ్వు ఆపకుండా ఏదో ఒకటి పిన్నికి పెడుతూ ఉండు. ఈలోగా డాక్టర్ని అడిగి సలహా తీసుకుంటాను. పల్స్, బిపి పడిపోతున్నట్లు అనిపిస్తే వెంటనే అంబులెన్స్ పిలిచి హాస్పిటల్‍కి తీసుకెళ్ళి పోదాం" అని అన్నాడు. నేను గోరువెచ్చని పాలు చెల్లి గొంతులో పోసి మింగమని చెప్పాను. ముందే వంట చేసి ఉన్నందువల్ల గబగబా అన్ని కలిపి నాలుగు ముద్దలు మింగించి మంచి నీళ్లు తాగిస్తే, చెల్లి కళ్ళు కొంచెం తెరిచింది. శ్రీసాయిబాబా దయవల్ల కొద్దిసేపటికి తను ఇంకాస్త తేరుకుని, "నాకు ఊపిరి ఆడుతుంద"ని చెప్పింది. తరువాత కూడా ఏదో ఒకటి తినిపిస్తూ, త్రాగిస్తూ ఉంటే సాయంత్రానికి తను నార్మల్ అయింది. డాక్టరుకి ఈ విషయమంతా చెప్తే, "ఏ భగవంతుని దయవల్లో ఆమె రక్షింపబడింది. ఇది నిజం. ఎందుకంటే, రియాక్షన్ ఇచ్చిన మనిషికి అరగంటలో యాంటీడొస్ ఇవ్వకపోతే చచ్చిపోతారు. అలాంటిది రియాక్షన్ ఇచ్చి ఊపిరి అందకుండా ఉన్న మనిషికి కేవలం పాలు, అన్నం పెడితే కొద్దిసేపట్లో ఆమె నార్మల్ అయిందంటే విచిత్రం కాకపోతే మరేంటి?" అని అన్నారు. అవును నిజంగా శ్రీసాయిబాబానే రక్షించారు తనని. మా చెల్లి కూడా, "అక్కా! నన్ను బాబానే కాపాడారు. నువ్వు ఊదీ పెట్టాక ఎవరో గట్టిగా 'నేనున్నాను. కంగారుపడకు' అని చెప్తున్నట్లు అనిపించింది. అది బాబానే. ఆయన దయవల్లనే నేను బ్రతికాను" అంది. బాబా పొద్దున్నే తమ వచనం ద్వారా జరగబోయేది సూచించి సమయానికి ఊదీ పెట్టేలా చేసారు. ఇలా అడుగడుగునా కాపాడే శ్రీసాయినాథునికి ఏమిచ్చి ఋణం తీర్చుకోగలం? "ధన్యవాదాలు బాబా. మా అందరికి మీతో ఋణం ఎప్పటికీ ఇలాగే ఉండాలి తండ్రి". ఇప్పుడు మావారి ఉద్యోగ విషయంలో బాబా అనుగ్రహాన్ని పంచుకుంటాను.


బాధను భరించలేమని గుర్తించేలోపే ఆ బాధలోంచి బయటపడేస్తారు బాబా


మావారు హైదరాబాదులోని ఒక పేరున్న కంపెనీలో చాలా ఏళ్ళు పని చేసారు. మేము అన్ని విధాల హైదరాబాదులో స్థిరపడ్డాం. కంపెనీలో పనిచేసే ఉద్యోగస్థులుగాని, ఆఖరికి పైస్థాయి అధికారులుగాని హైదరాబాద్ కంపెనీ శాశ్వతంగా మూసేస్తారని కలలో కూడా అనుకోలేదు  అలాంటిది ఒక్క నెలలో అంతా మారిపోయింది. గత నాలుగు సంవత్సరాలలో కొంతమంది పైస్థాయి ఉద్యోగస్థుల తప్పుడు నిర్ణయాల వల్ల కంపెనీ చేపట్టిన ప్రాజెక్టుల్లో నష్టాలు రావడంతో కంపెనీ ఒడిదుడుకులకు గురైంది. పోయిన సంవత్సరం ఆగస్టులో ముంబాయిలోని ఆ కంపెనీకి సంబంధించిన డైరెక్టర్లు కంపెనీలో అందర్నీ పేరుపేరునా పిలిచి కంపెనీ వదిలి వెళ్ళిపోమన్నారు. ఆ క్రమంలో నా భర్త కూడా వేరే బ్రాంచ్‍కి మారాలని అనుకున్నారు. అయితే జరిగిన అవకతవకలలో మావారికి ఏ సంబంధం లేదని తెలిసిన ఆ కంపెనీ పైఅధికారులు స్వయంగా వచ్చి మావారితో, "మీరు వేరే బ్రాంచ్‍కి మారాల్సిన అవసరం లేదు. మీకు ఏ ఇబ్బంది ఉండదు. మీరు హైదరాబాదులోనే ఉంటూ మాతో కలిసి పని చేయండి. ఇక్కడ చిందరవందరగా అయిపోయిన ఆఫీసు వ్యవహారాలను ఒక గాడిలో పెట్టి మాకు అప్పజెప్పండి" అని అన్నారు. అందుకు మావారు సమ్మతిస్తూనే, 'భవిష్యత్తులో తనని ముంబయి రమ్మంటే రానని, హైదరాబాదులో ఉంచేట్టైతేనే పని చేస్తాన'ని చెప్పారు. దానికి వాళ్లంతా, "మీరు కోరుకున్నట్లే జరుగుతుంద"ని చెప్పారు. కానీ నా భర్త ఆఫీసు వ్యవహారాలన్నీ చక్కబరిచి వాళ్ళకి అప్పజెప్పగానే, వాళ్ళు వాళ్ళ అసలు రంగు చూపించడం మొదలుపెట్టారు. సీనియర్ ఎంప్లాయ్ అయిన నా భర్తను చులకన చేయడం, తన పనులు వేరొకరికి అప్పజెప్పడం చేస్తుండేవారు. అయినా మావారు ఏమీ అనకుండా హైదరాబాదులో వేరే అవకాశాల కోసం ప్రయత్నిస్తూ చాలా ఓర్పుగా ఉండేవారు. కానీ కంపెనీవాళ్ళు మావారిని చాలా రకాలుగా ఇబ్బంది పెడుతుండేవాళ్ళు. దాంతో ఇంకా ఆ కంపెనీలో కొనసాగలేక, వేరే అవకాశాలు దొరక్క మావారితోపాటు మేమూ మానసికంగా చాలా ఇబ్బంది పడ్డాము. అయినా బాబా మీద భారమేసి మావారు అదే కంపెనీలో పని చేస్తుండేవారు. ఎందుకంటే, ఆరు నెలలుగా ప్రయత్నిస్తున్నా మావారి తోటి ఉద్యోగస్థులెవరికీ ఉద్యోగాలు దొరకలేదు. కానీ రోజురోజుకీ సమస్యలు ఎక్కువ అవుతుండేసరికి ఉద్యోగం మీదే కుటుంబ పోషణ ఆధారపడి ఉండటం వల్ల ఏమి చేయాలో అర్థంకాక మేము చాలా బాధను అనుభవిస్తుండేవాళ్ళము. అలాంటి సమయంలో ఒకరోజు హఠాత్తుగా ఒక కన్సల్టెన్సీ కంపెనీవాళ్ళు మావారికి ఫోన్ చేసి, ముంబాయిలోని ఒక పేరున్న కంపెనీలో మంచి ప్యాకేజీతో మంచి పోస్టు ఆఫర్ చేసారు. అసలు మావారు ఆ కంపెనీకి తన రెజ్యుమ్ పంపనేలేదు. వాళ్లే ఏదో సైట్లో చూసి మావారి గురించి పాత కంపెనీలో వాకబు చేసి "మీరు చేరుతానంటే, మేము జాబు ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నామ"ని అన్నారు. మావారికి వచ్చిన ఆఫర్‍కి తన తోటి ఉద్యోగస్థులందరూ చాలా ఆశ్చర్యపోయారు. ఇదంతా బాబా దయ. మావారు ఎటువంటి ప్రయత్నం చేయకుపోయినా స్వయంగా కంపెనీవాళ్లే మావారిని సంప్రదించి అంత మంచి ప్యాకేజీతో ఉద్యోగం ఇచ్చేలా అనుగ్రహించారు. కాకపోతే, హైదరాబాద్ వదిలి వెళ్ళటానికి ఇష్టపడని మావారికి ముంబాయిలో ఉద్యోగమిచ్చి అక్కడికి తీసుకెళ్లారు బాబా. ఆయన చిత్తమేంటో ఆయనకే ఎరుక.


మావారు కొత్త కంపెనీలో చేరి బిడ్డింగ్ హెడ్‍గా ఎంతో జాగ్రత్తగా బిడ్డింగ్ వేస్తుండేవారు. కానీ ఆరు నెలలైనా ఒక్క ప్రాజెక్టు కూడా రాలేదు. అన్నీ వచ్చినట్టే వచ్చి చేజారిపోతుండేవి. కంపెనీవాళ్ళు, "మీ అనుభవంతో కంపెనీకి మంచి ప్రాజెక్టులు వస్తాయి అనుకున్నాము. కానీ ఆరు నెలలైనా మీరు ఏం చేయలేకపోతున్నారు" అని అన్నారు. దాంతో ముంబాయిలో ఒంటరిగా కష్టపడుతున్న మావారు ఎంతో అనుభవం ఉండి కూడా చాలా డీలా పడిపోయారు. ఆయన్ని ఆలా చూస్తే నాకు చాలా బెంగగా ఉండేది. రోజూ బాబాని, "బాబా! జాబ్ విషయంలో మావారికి సహాయం చేయండి" అని ఏడుస్తుండేదాన్ని. ఇలా ఉండగా 2022, డిసెంబర్ 7న కూడా ఒక ప్రాజెక్టు వచ్చినట్లే వచ్చి చివరి నిమిషంలో ఆ కంపెనీ మీకు ఈ ప్రాజెక్టు ఇవ్వమని చెప్పేసింది. ఆ ప్రాజెక్ట్ ఖచ్చితంగా వస్తుందనుకున్న మావారు చాలా బాధతో నాకు ఫోన్ చేసి, "ఏం చేసినా వెనక్కి వెళ్తుంది. ఇక ఇంతేనేమో! నాకు చాలా బాధగా ఉంది" అని అనేసరికి నాకు కూడా చాలా బాధేసింది. కానీ, "అంతా బాబా దయ. మనకి ఆయన ఎన్నో గొప్పగొప్ప పనులు చేసారు. ఎన్నో సమస్యల నుండి గట్టెక్కించారు. అంతా ఆయనకి తెలుసు. బాబా తలుచుకుంటే ఎంతసేపు" అని ఒకరినొకరు ఓదార్చుకున్నాము. బాబా దయ చూడండి. 2022, డిసెంబర్ 7 రాత్రి ఎంతో బాధపడిన మావారు మరుసటిరోజు సాయంకాలం నాకు ఫోన్ చేసి, "బాబా దయ చూసావా! మీకు ప్రాజెక్ట్ ఇవ్వమన్న కంపెనీవాళ్ళే మరలా కాల్ చేసి ప్రాజెక్టు మీకే ఇవ్వడానికి ఫైనల్ చేసాము. వచ్చి, డాక్యుమెంట్లు మీద సైన్ చేసి, వర్క్ మొదలుపెట్టండి" అని చెప్పారు. ఆ కంపెనీలో జాయిన్ అయిన తర్వాత మావారికి వచ్చిన మొదటి కాంట్రాక్టు ఇది. మాకు చాలా సంతోషమేసింది. ఇలా బాబా మా కుటుంబాన్ని ఎన్నోసార్లు ఎన్నో విధాలా రక్షించారు, రక్షిస్తున్నారు. ఆయన మనం ఈ బాధను ఇక భరించలేమని గుర్తించేలోపే అనూహ్యంగా ఆ బాధలోంచి మనల్ని బయటపడేస్తారు. "ధన్యవాదాలు బాబా. మా యందు దయుంచి మీకు ఇష్టమైతే మావారికి హైదరాబాద్‍లో మంచి ఉద్యోగం ఇచ్చి, మా అందరినీ ఒకేచోట ఉంచండి బాబా".


ఒక్క రూపాయి ఖర్చు అవ్వకుండా అనుగ్రహించిన బాబా


ఓం శ్రీసాయినాథాయ నమః!!! నా పేరు అనిత. మాది విశాఖపట్నం. 2022 సెప్టెంబర్ 7, ఉదయం 8:20 నిమిషాలకి మావారికి హార్ట్ ఎటాక్ వచ్చింది. ఆయన ఒళ్లంతా చెమటలు పట్టేసి, ఊపిరి ఆడలేదు. వెంటనే మా అపార్ట్మెంట్లో వాళ్లంతా వచ్చి నాకు చాలా ధైర్యాన్నిచ్చారు. తక్షణమే మేము మావారిని తీసుకెళ్లి అపోలో హాస్పిటల్లో అడ్మిట్ చేసాము. బాబా దయవల్ల డాక్టర్స్, ఇన్స్యూరెన్సు వాళ్ళు చాలా తొందరగా స్పందించి మావారికి స్టెంట్ వేశారు. ఈవిధంగా ప్రతి మనిషి రూపంలోనూ 'నేనున్నా'ని నిరూపిస్తూ అనుక్షణం నా దగ్గరే ఉండి నాకు గొప్ప ధైర్యాన్నిచ్చారు బాబా. నేను బాబాతో ఒక్క మాట చెప్పాను, "బాబా! నాకు ఒక్క రూపాయి కూడా అవ్వకూడదు" అని. మావారి హాస్పిటల్ బిల్లు మొత్తం మూడు లక్షల రూపాయలయింది. 2 లక్షల, 60 వేల రూపాయలు ఇన్స్యూరెన్సు వచ్చాయి. మిగిలిన 40 వేల రూపాయలు మమ్మల్ని కట్టమన్నారు. సరేనని మేము ఆ డబ్బులు సమకూర్చుకున్నాము. అంతలో మా పిన్ని కొడుకు హాస్పిటల్ యాజమాన్యానికి మినిస్టర్ గారితో చెప్పించారు. దాంతో వాళ్లు, "మీరు ఒక్క రూపాయి కూడా చెల్లించనవసరం లేదు" అని అన్నారు. అది విని నేను పెద్దగా 'బాబా' అని అరిచాను. నా బంగారు తండ్రి నేను అడిగినట్లే నాకు ఒక్క రూపాయి ఖర్చు అవ్వకుండా అనుగ్రహించారు. మందులు కూడా ఇన్స్యూరెన్సు వాళ్లే పెట్టుకున్నారు. ఇలా బాబా నా జీవితంలో ఎన్నో అద్భుతాలు చూపించారు. మరికొన్ని అనుభవాలతో మళ్ళీ కలుస్తాను. "ధన్యవాదాలు బాబా. చక్కని మార్కులతో నా పెద్దకొడుకుని ఇంటర్ పాస్ చేయించిన మీకు జన్మజన్మలు ఋణపడి ఉంటాను బంగారు తండ్రి".


శ్రీసాయినాథ్ మహరాజ్ కీ జై!!!


3 comments:

  1. సాయి నాకు నా భర్త కావాలి సాయి నా వంశీ నన్ను అర్థం చేసుకునేలా చూడు సాయి నేను అడిగిన ప్రతి ప్రశ్నకి సమాధానం చెబుతున్నారు సాయి కానీ ఫలితం మాత్రం ఏం కనిపించట్లేదు సాయి. ఏ ప్రశ్న అడుగుతాను దానికి సమాధానం వెంటనే దొరుకుతుంది సాయి చూడాలి సాయి ఇన్ని అవమానాలు భరించలేకపోతున్నాను సాయి. కాపాడు సాయి

    ReplyDelete
  2. Om sri sainathaya namaha
    Om sri sainathaya namaha
    Om sri sainathaya namaha
    Om sri sainathaya namaha
    Om sri sainathaya namaha

    ReplyDelete
  3. Om Sairam
    Sai always be with me

    ReplyDelete

సాయి మహారాజ్ సన్నిధి సోషల్ మీడియా లింక్స్:

Subscribe Here

బ్లాగ్ అప్డేట్ నోటిఫికేషన్స్ నేరుగా మీ మెయిల్ కే వచ్చేందుకు క్రింద బాక్సులో మీ మెయిల్ ఐడి టైపు చేసి subscribe పై క్లిక్ చేసి, తరువాత స్టెప్స్ పూర్తీ చేయండి.

Delivered by FeedBurner

Followers

Recent Posts


Blog Logo