సాయి వచనం:-

- శ్రీబాబూజీ.

సాయిభక్తుల అనుభవమాలిక 1404వ భాగం....


ఈ భాగంలో అనుభవాలు:

1. జీవితానికి సరిపడా పల్లకీ సేవ భాగ్యాన్ని ఇచ్చిన శ్రీసాయి
2. సదా తోడుగా ఉన్న బాబా
3. అడిగినంతనే సానుకూల సమాధానమిచ్చిన బాబా

జీవితానికి సరిపడా పల్లకీ సేవ భాగ్యాన్ని ఇచ్చిన శ్రీసాయి


ఓంసాయి శ్రీసాయి జయజయ సాయి!!! నేనూ సాయి భక్తురాలినని చెప్పుకోవడానికి నాకు చాలా గర్వంగా ఉంది. నా చిన్నతనంలో మా పక్కింటివాళ్ళు శిరిడీ వెళ్లి, అక్కడినుండి వచ్చాక వాళ్ళు చెప్పిన మాటలు విన్న నాలో నాకు తెలియకుండానే, అసలు సాయిని చూడకుండానే ఆయన అంటే తెలియని భక్తిశ్రద్ధలు మొదలయ్యాయి. అప్పటినుండి ఇప్పటివరకు సాయి ఎప్పుడూ నన్ను వదిలి పెట్టలేదు. అది గుర్తించడంలో నేనే చాలా ఆలస్యం చేశాను. నేనిప్పుడు బాబా నాకు ప్రసాదించిన అనుభవాలను మీతో పంచుకోవాలని అనుకుంటున్నాను. "ఆలస్యం అయినందుకు నన్ను క్షమిచండి సాయి".  


నేను 'సాయి అఖండ పారాయణ' గ్రూపులో ఉన్నాను. ఒకరోజు ఆ గ్రూపులో ఎవరో 'సాయి దివ్యపూజ' వీడియో పెట్టారు. అది నాకోసమే పెట్టినట్టుగా నాకు అనిపించి 5 గురువారాల దివ్యపూజ చేస్తానని సాయికి మ్రొక్కుకుని 2022వ సంవత్సరం శ్రావణమాసంలో మొదలుపెట్టాను. మొదటిరోజు పూజలోనే సాయి తమ ఉనికిని చాటుకున్నారు. అదేమిటంటే, మా అక్క కొడుక్కి ఎంసెట్ పేపర్ చాలా కఠినంగా రావడం వల్ల తక్కువ మార్కులతో పెద్ద ర్యాంకు వచ్చింది. అలాంటి తనకి బాబా దయవల్ల కౌన్సిలింగ్‍లో టాప్ కాలేజీలో సీటు వచ్చింది. "చాలా ధన్యవాదాలు సాయి".


నేను ఫేస్బుక్‍లో సాయికి సంబంధించిన విషయాలు చాలా ఎక్కువగా చూస్తుంటాను. ప్రత్యేకించి శిరిడీలోని పల్లకీ ఉత్సవానికి సంబంధించిన మెసేజ్లు రోజూ చూస్తాను. వాటిని చూస్తూ అనుకునేదాన్ని, "నేను ఎప్పుడు అలాంటి సేవలో పాల్గొంటానో" అని. ఆ కోరికను బాబా అనూహ్యంగా తీర్చారు. అదెలా అంటే ఈ సంవత్సరం కార్తీక పౌర్ణమి ముందురోజు సోమవారంనాటి సాయంత్రం నేనూ, మా ఇద్దరు పిల్లలూ కలిసి సమీపంలో ఉన్న శ్రీసాయిబాబా గుడికి వెళ్ళాం. అయితే మేము వెళ్ళేసరికి హారతి అయిపోవడంతో కొంచెం నిరాశ చెందాం. లోపలికి వెళ్లి సాయి దర్శనం చేసుకున్నాక చుట్టూ ఉన్న దేవతా మూర్తుల వద్ద దీపాలు వెలిగిద్దామని వెళ్ళాము. ఉసిరి చెట్టు కింద వత్తులు వేసి దీపాలు వెలిగిస్తుండగా మేళతాళాలతో పల్లకీ సేవ మొదలైంది. మా పెద్దపాప ఒక్కసారిగా లేచి, "నేను వెళ్తాను అమ్మ, ప్లీజ్" అని అడిగింది. నేను సరే అన్నాను. తరువాత అన్నీ సర్దుకుని నేను, మా చిన్నపాప కూడా గబగబా వెళ్లి ఆ పల్లకీసేవలో పాల్గొన్నాము. ఎంత అదృష్టమంటే మాటల్లో చెప్పలేను. దాదాపు గంటన్నరపాటు సాయి పల్లకీ మోసే అవకాశం మాకు ఇచ్చారు. పెద్దపాప అయితే మొదటి నుండి చివరి వరకు పల్లకీని విడిచిపెట్టింది లేదు. ఆరోజు కార్తీక సోమవారం అయినందున జ్వాల తోరణం కింద గుండా పల్లకీ ఊరేగించి చావడికి తీసుకెళ్లారు. సాయి భజనలతో ఎంతో సంతోషమేసింది. అప్పుడు ఇక ఆలస్యం అవుతుందని పిల్లల్ని తీసుకుని పక్కనే ఉన్న శ్రీఆంజనేయస్వామి, శివుని గుడులకు వెళ్లి అక్కడ కూడా దీపాలు వెలిగించి, ఇంటికి వెళ్దామని బయలుదేరాము. అంతలో హారతి మొదలైన శబ్ధం వినిపించింది. అంతే, పెద్దపాప, "నేను సాయి దగ్గరకి వెళ్తున్న, హరతి చూడాలి" అంటూ ఒకటే పరుగు తీసింది. బహుశా సాయంత్రం హారతి అందుకోలేకపోయామని రాత్రి హారతికి సాయి పిలుస్తున్నట్లుగా అనిపించి మేము కూడా పెద్దపాప వెనుకే వెళ్లి హారతిలో పాల్గొన్నాము. ఆరోజు దాదాపు ఐదుసార్లు సాయి పాదాలను స్పృశించే అవకాశం మాకు వచ్చింది. అప్పటికి సమయం రాత్రి 09.45 అయింది. ఆ రాత్రివేళ ఆటోలు దొరుకుతాయో, లేదో అనుకున్నానుకాని, సాయి దయవల్ల ఇంటికి సురక్షితంగా చేరాము. మా ఈ అనుభవం గురించి ఎంత చెప్పినా తక్కువే. జీవితానికి సరిపడా పల్లకీ సేవను తిలకించే భాగ్యాన్ని, అందులో పాల్గొనే అవకాశాన్ని ఇచ్చిన సాయికి  చాలా చాలా ధన్యవాదాలు.


ఓంసాయి శ్రీసాయి జయజయ సాయి!!!

సమర్థ సద్గురు శ్రీసాయినాథ్ మహారాజ్ కీ జై!!!


సదా తోడుగా ఉన్న బాబా


శ్రీసాయినాథ్ మహరాజ్ కి జై!!!


శ్రీసాయిబాబాకు, సాయిబంధువులకు నమస్కారం. నేను ఒక సాయి భక్తురాలిని. నేను నా 7వ తరగతిలో ఉండగా బాబా నన్ను అనుగ్రహించి ప్రతి వారం తమ గుడికి రప్పించుకునేవారు. బాబా దయతో అప్పటినుండి నేను చదువులో బాగా రాణించి మంచి మెరిట్ విద్యార్థినయ్యాను. ఎంతలా అంటే 10వ తరగతిలో నాకు స్కూల్లో మొదటి ర్యాంకు వస్తుందని అందరూ అనుకునేంతగా. కానీ నాకు 3వ ర్యాంకు వచ్చింది. అందుకు కారణం 1, 2 ర్యాంకులు వచ్చిన అమ్మాయిలు బాగా చదివేవాళ్ళు అయినప్పటికీ పరీక్షల్లో కొన్ని అవకతవకలు చేసి ఆ ర్యాంకులు సాధించారు. మొదటి రెండు ర్యాంకులు వచ్చిన వాళ్లకి స్కూలు తరపున గ్రాడ్యుయేషన్ వరకు ప్రభుత్వం అందించే ఫ్రీ సీట్లు వస్తాయి. అయితే ఏవో కారణాల వల్ల వాళ్ళకి ఫ్రీ సీట్లు రానందున వాళ్ళు 3, 4 నెలలు ఆలస్యంగా దగ్గరలోని కాలేజీలో చేరారు. అయితే బాబా నా విషయంలో అద్భుతం చేశారు. ఆయన నాకు మూడవ ర్యాంకు వచ్చినా ఆ ర్యాంకుతో సంబంధం లేకుండ నా మార్కులు ఆధారంగా ఫ్రీ సీట్ వచ్చేలా అనుగ్రహించారు. ఇంటర్ రెండు సంవత్సరాలూ చదువు, హాస్టల్, ఫుడ్ అన్నీ ఫ్రీ. అది మా తల్లితండ్రులకి చాలా గొప్ప విషయం. ఎందుకంటే, మాది ఒక దిగువ మధ్య తరగతి కుటుంబం. కానీ నా దురదృష్టం ఏంటంటే, బాబా అనుగ్రహాన్ని నేను అప్పట్లో గుర్తించలేకపోయాను. బహుశా చిన్న వయసు కారణంగా అనుకుంట. ఆ తర్వాత పై చదువుల విషయంలో కూడా బాబా నాకు తోడుగా ఉన్నారు. అప్పుడు కూడా నేను ఆయన కృపను తెలుసుకోలేకపోయాను. తరువాత ఒకానొక స్థితిలో ఎంతో ఎత్తుకి ఎదిగిన నేను ఒక్కసారిగా కిందకి కూలబడ్డాను. ఎంతో బాగుంటుందనుకున్న నా జీవితం అంధకారమయమైపోయింది. ఆ సమయంలో నేను బాబాను అస్సలు గుర్తుపెట్టుకోకపోయినా బాబా నన్ను విడిచి పెట్టలేదు. 10 సంవత్సరాల ఆ కష్టకాలంలో నేను ధైర్యం కోల్పోకుండా బాబా ఎప్పుడూ నాకు అండగా ఉన్నారు. అప్పుడు కూడా బాబా నాకు తోడుగా ఉన్నారని తెలుసుకోలేకపోయాను. అలాంటి నాకు ఈమధ్య ఒకరోజు మధ్యాహ్నం బోజనం చేసిన తరువాత నిద్రపోతుంటే ఒక కల వచ్చింది. ఆ కలలో బాబా విగ్రహ రూపంలో దర్శనం ఇచ్చారు. నేను బాబా కాళ్లకు నా తలను ఆనించి నమస్కారం చేస్తుంటే, నా చేతులకి బాబా కాళ్ళు చాలా మృదువుగా సుతిమెత్తని దూదిలా తగిలాయి. నేను, 'ఇదేంటి విగ్రహం ఇంత కోమలంగా ఉన్నట్లు స్పర్శ కలుగుతుంద'ని అనుకుంటూ నా తలను పైకెత్తి చూస్తే, బాబా సజీవ రూపంలో నా వంక చూసి నవ్వుతున్నారు. నేను ఎటు వెళ్లినా ఆయన నా వంకే చూస్తూ నవ్వుతూ కనిపించారు. మేలుకున్నాక ఆ కలను గుర్తు చేసుకుని బాబా నాకు తోడుగా ఉన్నామన్న నిరూపణ ఇచ్చారనిపించింది.


ఈ మధ్య ఒకసారి మా చిన్నబాబుకి విపరీతంగా కఫం పట్టి, దగ్గుతో నిద్రలో చాలా ఇబ్బందిపడ్డాడు. హాస్పిటల్‍కి తీసుకెళ్తే, టెస్టు చేసి హాస్పిటల్లో రెండు రోజులు ఉండాలి అన్నారు. అప్పుడు నేను, "హాస్పిటల్లో ఉండే అవసరం లేకుండా చూడు బాబా. మీ అనుగ్రహాన్ని మీ బ్లాగులో పంచుకుంటాను" అని బాబాతో చెప్పుకున్నాను. ఆయన కరుణతో వాళ్ళు చిన్న ట్రీట్మెంట్ చేసి, "కేవలం సిరప్‍తో తగ్గిపోతుంది. ఇక మీరు ఇంటికి వెళ్లిపోవచ్చు" అని చెప్పారు. "ధన్యవాదాలు సాయితండ్రి. ఈ మధ్య నాకు మీ సచ్చరిత్ర పారాయణ చేయాలనిపించి, పారాయణ చేసాను. ప్రస్తుతం నేను చేస్తున్న ఉద్యోగ ప్రయత్నాలు ఫలించేలా చేసి నాకు ఒక ఉద్యోగం ప్రసాదించి నా మరియు నా పిల్లల జీవితాలకు మంచి చేస్తారని, అలాగే నా భర్తకి సద్భుద్ధిని ప్రసాదిస్తారని ఆశిస్తున్నాను బాబా. మీ కరుణతో ఈమధ్య మీ స్మరణలో ఉండేందుకు ప్రయత్నింస్తున్నాను. నన్ను వదలక మీ ఈ చిన్ని పిచ్చుకను సదా మీ నామస్మరణలో ఉండేట్టు చూసి మీ దరికి చేర్చుకోండి తండ్రి".


సద్గురు శ్రీసాయినాథ్ మహరాజ్ కీ జై!!!


అడిగినంతనే సానుకూల సమాధానమిచ్చిన బాబా


నేను ఒక సాయి భక్తురాలిని. నాకు పెళ్ళై ఒక సంవత్సరం దాటింది. జాతకరిత్యా నాకు సంతానం కలగడం చాలా కష్టమని అన్నారు. నేను మానసికంగా చాలా నరకం అనుభవించాను. సాయిబాబాను నమ్ముకున్న నేను 2022, నవంబర్ 28న, "నాకు సంతాన భాగ్యం కలిగే విషయంలో ఏదైన సందేశం ఇవ్వండి బాబా" అని అనుకున్నాను. తరువాత ఈ బ్లాగులోని భక్తుల అనుభవాలు చదివాను. అందులో ఒక అమ్మాయి తన తల్లి తనని ఒక జ్యోతిష్యుని దగ్గరకి తీసుకెళితే, తన జాతకం ప్రతికూలంగా ఉందని చెప్పారని, దాంతో తను ఎంతో మానసిక సంఘర్షణకు గురైనట్లు, కొంతకాలానికి శిరిడీ వెళ్లి బాబాను దర్శించి, తన మనసులోని ప్రశ్నను బాబాను అడిగి సచ్చరిత్ర తెరిస్తే, దామూఅణ్ణకి సంబంధించిన లీల వచ్చిందని, దాంతో తన మనసు శాంతించినట్లు పంచుకుంది. దామూఅణ్ణ జాతకంలో సంతానభాగ్యం లేకపోయినప్పటికీ బాబా అతనికి సంతానాన్ని అనుగ్రహించారని కూడా ఆ అమ్మాయి అనుభవంలో ఉంది. అది బాబా నాకే చెప్తునట్లు అనిపించింది. ఇది నిజంగా అద్బుతం. ఆన్‌లైన్‌లో కూడా 'త్వరలో మీ కుటుంబం విస్తరించబడుతుంది' అని సాయిబాబా సందేశాలు వస్తున్నాయి. "చాలా చాలా ధన్యవాదాలు. దయతో నాకు త్వరలో సంతాన భాగ్యం కలిగేలా చూడు తండ్రి".


4 comments:

  1. Sai nannu na barthani kalapandi sai na kapuranni nilabettandi sai pls mimmalne nammukoni yedhuruuchusthunna sai

    ReplyDelete
  2. Om sri sainathaya namaha
    Om sri sainathaya namaha
    Om sri sainathaya namaha
    Om sri sainathaya namaha
    Om sri sainathaya namaha

    ReplyDelete
  3. Om Sairam
    Sai always be with me

    ReplyDelete
  4. Om Sree Sachidhanandha Samardha Sadguru Sai Nadhaya Namaha 🕉🙏😊❤

    ReplyDelete

సాయి మహారాజ్ సన్నిధి సోషల్ మీడియా లింక్స్:

Subscribe Here

బ్లాగ్ అప్డేట్ నోటిఫికేషన్స్ నేరుగా మీ మెయిల్ కే వచ్చేందుకు క్రింద బాక్సులో మీ మెయిల్ ఐడి టైపు చేసి subscribe పై క్లిక్ చేసి, తరువాత స్టెప్స్ పూర్తీ చేయండి.

Delivered by FeedBurner

Followers

Recent Posts


Blog Logo