1. బాబా నేర్పిస్తున్న జీవిత సత్యాలు, పాఠాలు
2. తోడుగా ఉండి క్షేమంగా యుఎస్ చేర్చిన బాబా
3. బాబా చూపించిన చమత్కారం
బాబా నేర్పిస్తున్న జీవిత సత్యాలు, పాఠాలు
శ్రీసాయినాథునికి నా నమస్కారాలు. నేను ఒక సాయి భక్తురాలిని. నాకు దేన్నైనా ఒరిజినల్‍గా చూస్తేనే తృప్తి. అందువలన నేను బాబా డ్రాయింగ్స్ కన్నా ఒరిజినల్ ఫోటోలను ఎక్కువగా ఇష్టపడతాను. నేను ఈమధ్య బాబాను, "బాబా! నేను మిమ్మల్ని రోజూ ఒకే రూపంలో దర్శిస్తున్నాను. మీరు ఈశ్వరుడని నా భావన. నా నమ్మకాన్ని పెంచేటట్టుగా మీరు నాకు ఈశ్వరునిగా దర్శనమివ్వరా?" అని అడిగాను. తరువాత నేను పింటరెస్టు ఓపెన్ చేస్తే, బాబా నాకు క్రింది విధంగా దర్శనమిచ్చి నా నమ్మకాన్ని బలపరిచారు.
ప్రాచీనకాలంలో ఈశ్వరుడు పులిచర్మం మరియు బూడిద ధరించి ఉండగా ప్రస్తుత కాలానికి అనుగుణంగా సాయిబాబా కేవలం కఫనీ ధారిగా(ఆ కఫనీ చిరిగినా ఆయన ఎన్నడూ పట్టించుకోలేదు) అవతరించారు. ఈమధ్యనే బాబాకి దగ్గరవుతూ, ఇప్పుడిప్పుడే దైవాన్ని అర్ధం చేసుకుంటున్న నాకు ఈ అనుభవం ద్వారా కాలానికి అనుగుణంగా దైవ అవతారం, దైవ లీలలు ఉంటాయని అర్థమైంది. ఈ కారణంగా ఇలాంటి చిన్న చిన్న విషయాలు కూడా నాకు చాలా ఉత్సహాన్నిస్తున్నాయి. ఇవి బాబా నాకు నేర్పిస్తున్న జీవిత సత్యాలు, పాఠాలు అని నేను అనుకుంటున్నాను.
నేను ఇదివరకు బాబా చరిత్ర ఎన్నోసార్లు చదివాను. అందులో బాబా అద్భుతాలు చేస్తారని వచ్చినప్పుడు 'ఆయన దేవుడు కాబట్టి, అది సహజమే' అని అనుకునేదాన్ని. కానీ బాబా చర్యలను పూర్తిగా ఎలా అర్థం చేసుకోవాలో నాకు తెలిసేది కాదు. ప్రతిదీ లాజిక్‍తో ఆలోచించడం అలవాటైన నాకు శ్రీసచ్చరిత్రలో బాబా సన్నని గుడ్డపీలికలతో కట్టిన చెక్కబల్ల మీద నిద్రపోయే లీల ఎన్నిసార్లు చదివినా పెద్దగా మనసుకి ఎక్కేది కాదు. అయితే ఈమధ్య ఆ లీల చదువుతున్నప్పుడు "నీ తెలివిని పక్కనపెట్టి నమ్మకంతో మనసుపెట్టి ఏ ఆలోచన చెయ్యకుండా చదువు" అని బాబా నాకు చెప్తున్నట్లు అనిపించింది. అంటే ఆ లీల నాకు అర్ధం కాదన్న నిజాన్ని బాబా నాకు అర్ధమయ్యేలా చేసారు. నేను ఆ లీలలో బాబా దైవత్వం, గొప్పతనం, అనంతశక్తి ఇందులో ఏ మాటలతో చెప్పాలో తెలియట్లేదుగాని దానిని తెలుసుకోవాలంటే బాబా పాదాల దగ్గర పడి ఉండడం ఒక్కటే మార్గమని నాకు ఇప్పుడు అర్ధమైంది. అంతేకాదు లాజిక్‍తో దైవాన్ని పూర్తిగా అర్ధం చేసుకోలేమని కూడా గ్రహించాను. అందుకే బాబా చరణాల వద్ద నా లాజిక్, తెలివినంతటిని సమర్పిస్తున్నాను. ఇలా చెయ్యడం కష్టంగానే ఉంది. కానీ ఇదే బాగుంది. ఇలా ప్రయత్నిస్తూ ఉండడం కూడా జీవితంలో ఒక భాగమేమో. అది కూడా సాయికే తెలుసు మరి!
ఈమధ్య తరుచుగా బాబా నాకు స్వప్న దర్శనం ఇస్తున్నారు. నాకు ఎప్పుడు దుస్వప్నాలు వచ్చినా కొన్నిసార్లు విగ్రహ రూపంలో, కొన్నిసార్లు ఊదీ రూపంలో, మరికొన్నిసార్లు ఫకీర్ రూపంలో, ఈశ్వరునిగా, మారుతిగా బాబా నన్ను ఆపదల నుండి రక్షిస్తున్నారు. కలలో కూడా నాకు ఏ హాని కలగకుండా కాపాడుతున్న సాయిబాబాకి నేను ఎలా కృతఙ్ఞతలు చెప్పగలను? "కలలో కూడా నీకు హాని జరగనివ్వను" అన్న బాబా పలుకులు 100% నిజం. ఆయన ప్రేమ కన్నా మధురమైనది ఏదీ లేదు, ఉండబోదు. బాబాని పొగడడం నా వల్ల కాదు కానీ, ఎంత చెప్పినా తక్కువే. మరెన్నో అనుభవాలు ప్రసాదించి, వాటిని మీతో పంచుకునేలా బాబా నన్ను అనుగ్రహించుగాక!
ఓం శ్రీ సచ్చిదానంద సద్గురు సాయినాథ్ మహారాజ్ కి జై!!!
తోడుగా ఉండి క్షేమంగా యుఎస్ చేర్చిన బాబా
ముందుగా సాయి భక్తులకి, ఈ బ్లాగు నిర్వహిస్తున్న సాయికి నా నమస్కారాలు. నా పేరు సాయిలత. నేను మా పాప గురించి బాబాను ఒక కోరిక కోరుకుని, అది నెరవేరితే నా అనుభవాన్ని బ్లాగులో పంచుకుంటానని బాబాకి మ్రొక్కుకున్నాను. ఆ అనుభవాన్నే ఇప్పుడు మీతో పంచుకుంటాను. "బాబా! నన్ను క్షమించు తండ్రి. నా అనుభవాన్ని పంచుకోవడం ఆలస్యమైంది". ఇక నా అనుభవం విషయానికి వస్తే.. ఈమధ్య మా పాపకి యు.ఎస్‍లో ఎమ్ఎస్ చేయడానికి అవకాశమొచ్చి, వీసా వచ్చింది. తనకి ఇద్దరు పిల్లలు. పాప వాళ్ళని తీసుకుని క్షేమంగా యుఎస్ వెళ్లాలని నేను బాబాకి చెప్పుకున్నాను. పాప జూన్‍లో ఎడ్యుకేషన్ లోన్‍కి అప్లై చేసి ఆగష్టు 4న యుఎస్ వెళ్ళడానికి టికెట్ బుక్ చేసుకుంది. కానీ ఈలోపు ఎన్నో అవాంతరాలు వచ్చాయి. నేను, "బాబా! ఏమిటి నాయనా ఇన్ని అవాంతరాలు?" అని బాబాకి మొరపెట్టుకుంటూ ఉండేదాన్ని. అలాగే పాప యుఎస్ వెళ్లేముందు శిరిడీ వెళ్లి బాబా దర్శనం చేసుకుని, తరువాత తను యుఎస్ వెళితే బాగుంటుందని నేను అనుకున్నాను. కానీ పాపకి జూలై 29 వరకు బ్యాంకు లోన్ పనులతోనే సరిపోయింది. బాబా దయతో ఆరోజు లోన్ రావడం, ఇంకా అవాంతరాలన్నీ తొలగడంతో సమయం లేక పాప శిరిడీ వెళ్లకుండానే యుఎస్ వెళ్లేందుకు సిద్ధమైంది. తను తన లగేజీ సర్దుకునేటప్పుడు బాబా విగ్రహాన్ని లాప్టాప్ బ్యాగులో పెట్టుకుంది. ఆ బ్యాగు, ఇంకో లగేజీ బ్యాగు చేతిలో పట్టుకుని ఫ్లైట్ ఎక్కి బ్యాగులు రెండూ పైన పెట్టబోతుంటే, ఫ్లైట్ సిబ్బంది లగేజీ బ్యాగు పైన పెట్టి, లాప్టాప్ బ్యాగు కాళ్ళ దగ్గర పెట్టుకోమన్నారు. పాప, 'బ్యాగులో బాబా ఉన్నారు కదా! కాళ్ళ దగ్గర ఎలా పెట్టాల'ని పక్క సీట్ వాళ్ళు వచ్చేవరకు ఆ బ్యాగును పక్క సీట్‍లో పెడదామని పెట్టింది. సామాన్యంగా ఇంటర్నేషనల్ ట్రావెల్స్ లో 99% ఎవరూ టికెట్ క్యాన్సిల్ చేసుకోరు. అలాంటిది పాప హైదరాబాద్ నుండి అమెరికా వెళ్లెవరకూ పక్క సీట్‍లోకి ఎవరూ రాలేదు. ఇది ఎంత అద్భుతమో చూసారా! శిరిడీ వెళ్లి బాబాను దర్శించుకోకుండానే పాప యుఎస్ వెళ్తుందని నేను బాధపడితే, ఆయన ఏకంగా పాప పక్క సీట్‍ను బుక్ చేసుకుని, పాపని జాగ్రత్తగా యుఎస్‍కి తీసుకెళ్లారు. అది తెలిసినపుడు నేను పొందిన ఆనందం మాటల్లో చెప్పనలవి కానిది. ఆ ఆనందం ఎలా ఉంటుందో మీరే ఊహించండి. "ధన్యవాదాలు బాబా. నేను నిన్ను కోరిన ప్రతి కోరిక నెరవేర్చావు తండ్రి. పాపవాళ్ళ పిల్లల ఎఫ్2 వీసా కోసం ఆగష్టు నుంచి ఎదురుచూస్తున్నాం. స్లాట్ దొరకడం లేదు బాబా. మీ అనుగ్రహం ఉంటే ఏదీ అసాధ్యం కాదు కదా! మీ దయతో పిల్లలకు ఎఫ్2 వీసా వచ్చేస్తే, ఆ అనుభవాన్ని కూడా బ్లాగులో పంచుకుంటాను తండ్రి. పిల్లల్ని తొందరగా తల్లి దగ్గరకు చేర్చు తండ్రి. మా బ్రతుకులు మీవి తండ్రి. మాపై సదా మీ కృపాదృష్టి ఉండనీ తండ్రి".
బాబా చూపించిన చమత్కారం
నా పేరు డా. శివరామ. నాకు, కౌజలగి దేవస్థానం సభ్యులకు బాబా చూపించిన చమత్కారం గూర్చి నేనిప్పుడు మీకు చెప్తాను. పై ఫొటోలో ఉన్న బాబా విగ్రహాన్ని నేను జైపూర్ నుంచి తెచ్చి, బెలగాంలోని మా హాస్పిటల్లో స్థాపించాను. కాని భగవాన్ శ్రీసాయిబాబా ఉద్దేశ్యం వేరుగా ఉంది. ఆయన సంకల్పానుసారం నేను కొన్ని కారణాల వలన మా హాస్పిటల్లో ఉన్న బాబాను ఏదైనా బాబా గుడికి తరలిద్దామని అనుకున్నాను. ఆ క్రమంలో ఒక బాబా భక్తుని ద్వారా నాకు కౌజలగి దేవస్థానం సభ్యుల నెంబర్ దొరికింది. వాళ్ళకి ఫోన్ చేసి విషయం చెప్పాను. మరుసటిరోజే ఆ దేవస్థానం సభ్యులందరూ బెళగాం వచ్చి బాబాని చూసి ఆనందంతో అంతకు పూర్వం ఒక గురువుగారు వాళ్ళకి చెప్పిన విషయాన్ని నాతో చెప్పి పరవశించిపోయారు. విషయమేమిటంటే, కౌజలగిలో దేవస్థానం సిద్ధం చేసాక వాళ్ళ దగ్గర బాబా విగ్రహాన్ని తీసుకురావడానికి అవసరమయ్యే డబ్బు లేకపోయింది. వాళ్ళు ఒక గురువుగారిని కలిసి తమ సమస్యను చెప్పుకుని బాధపడ్డారు. అప్పుడు ఆ గురువుగారు, "మీరెందుకు బాధపడతారు? బాబానే మిమ్మల్ని వెతుక్కుంటూ వస్తారు. మీరు నిశ్చింతగా ఉండండి" అని అన్నారట. ఇంకో ముఖ్య విషయం, వాళ్ళు శిరిడీలో ఉండే శ్రీసాయిబాబా మూర్తి ఏ సైజులో ఉంటుందో అదే సైజు విగ్రహం కావాలని ఆశపడ్డారు. నేనిచ్చిన విగ్రహం అదే సైజులో ఉండడం వాళ్ళని అత్యంత ఆశ్చర్యచకితులను చేసింది. ఇలాంటి కోకొల్లల చమత్కారాలను తమ భక్తులకోసం, వారి శ్రద్ధ, సబూరీలను పటిష్టంగా ఉంచడంకోసం శ్రీశిరిడీ సాయిబాబా చేస్తుంటారు. ఆయన మహిమలను స్తుతించడానికి వేయినోళ్ళున్న ఆదిశేషునికే తరము కాదు.
డాక్టర్ శివరామ,
శ్రీ శిరిడీ సాయిబాబా హాస్పిటల్,
బెలగాం,
కర్ణాటక.
సర్వేజనా సుఖినోభవంతు!!!
సాయి వంశీ నన్ను అర్థం చేసుకునేలా చూడు సాయి నన్ను భార్యగా స్వీకరించిన చూడు సాయి నిన్ను నమ్ముకుని ఉన్నాను బాబా సాయి కనీసం ఈ రోజైనా కోసం వస్తాడా సాయి
ReplyDeleteOm sri sainathaya namaha
ReplyDeleteOm sri sainathaya namaha
Om sri sainathaya namaha
Om sri sainathaya namaha
Om sri sainathaya namaha
Om sairam
ReplyDeleteSai always be with me