1. బాబా ఎప్పుడూ మన మధ్యే ఉన్నారు - తలచుకోగానే ప్రక్కనే ఉండి బాధలు తీరుస్తారు
2. శ్రీసాయి ప్రసాదించిన చిరు అనుభవాలు
3. ఆపద వాటిల్లినా చిన్న దెబ్బతో సరిపెట్టిన బాబా
బాబా ఎప్పుడూ మన మధ్యే ఉన్నారు - తలచుకోగానే ప్రక్కనే ఉండి బాధలు తీరుస్తారు
సాయి భక్తులందరికీ నమస్తే. నా పేరు శ్రీనివాసరావు. శ్రీసాయినాథుడు మాకు ప్రసాదించిన రెండు అనుభవాలను నేనిప్పుడు మీతో పంచుకుంటున్నాను. నేను ఒక స్థలం కొనదలచి దాదాపు నాలుగు, ఐదు నెలలు తిరిగాను. తిరిగి తిరిగి అలసిపోయానుగాని సరైన స్థలం కుదరలేదు. చివరికి ఒక స్థలం చూసి తీసుకోవడానికి సిద్ధపడ్డాను. కానీ ఆ స్థలానికి నైరుతి మూల ఉంది. వాస్తుపరంగా అలాంటి స్థలం మంచిది కాదు. ఆ విషయం నాకు ముందు తెలియదు. ఆ స్థలం తీసుకోవడానికి ముందురోజు మా పక్కింటివాళ్ళు ఆ విషయం గురించి నాతో చెప్పారు. అంతటితో నేను ఆ స్థలం తీసుకోవడం మానుకున్నాను. నా తండ్రి బాబానే వాళ్ళ ద్వారా నేను ఆ స్థలం కొని ఇబ్బందులు పాలుకాకుండా కాపాడారని నా నమ్మకం. తరువాత వేరొక స్థలం చూసి, దాన్ని తీసుకోవడానికి ముందు, "ఎటువంటి ఇబ్బంది లేకుండా చూడండి బాబా. అలాగే అనుకున్న సమయానికి రిజిస్ట్రేషన్ అయ్యేటట్లు అనుగ్రహించండి" అని బాబాతో చెప్పుకుని భారం ఆయన మీద వేసి అగ్రిమెంట్ చేసుకున్నాను. బాబా దయవలన నేను కోరుకున్నట్లే ఎటువంటి సమస్యలు లేకుండా నవంబర్ 18వ తారీఖుకు డబ్బు సమకూరి స్థలం రిజిస్ట్రేషన్ చేసుకున్నాను. ఆ తండ్రి కరుణ వల్ల నా కుటుంబం మొత్తం సంతోషంగా ఉన్నాం. "ధన్యవాదాలు తండ్రి. మా పిల్లలు పై చదువులకోసం ప్రయత్నిస్తున్నారు. వారికి మీరు తోడుగా ఉండి వారు అనుకున్న చదువు చదువుకునేందుకు సీటు వచ్చేలా అనుగ్రహించండి. అలాగే మా అందరి ఆరోగ్యాలు బాగుండేటట్లు మీ చల్లని చూపును మాపై ప్రసరించండి. చివరిగా నా అనుభవం పంచుకోవటంలో ఆలస్యం అయినందుకు నన్ను క్షమించు బాబా".
ఇటీవల ప్రభుత్వం టీచర్ల బదిలీలకి అనుమతి ఇచ్చింది. అందులో భాగంగా 8 సంవత్సరాల కాలం ఒకే చోట పనిచేసిన వారిని తప్పక బదిలీ చేయమని ఉత్తర్వులు వచ్చాయి. కాబట్టి 5 సంవత్సరాలుగా ఒకే స్కూలులో పనిచేస్తున్న నా భార్యకి బదిలీ ఉండదని, మాకు ఏ ఇబ్బంది ఉండదని నేను అనుకున్నాను. కానీ ఒక చిక్కు సమస్య వచ్చింది. అదేమిటంటే, నిబంధనల ప్రకారం నా భార్య పని చేస్తున్న స్కూల్లో ముగ్గురు టీచర్లు పని చేయాల్సి ఉండగా ఈమధ్య ఆ స్కూలుకి ఒక HM పోస్ట్ మంజూరు అయింది. అందువల్ల రేషనలైజేషన్‍లో ఒక పోస్ట్ పోతుంది. అందువల్ల స్కూలులో పనిచేస్తున్న సీనియర్/జూనియర్ ఒకరు తప్పక బదిలీ అవ్వాల్సి ఉంది. కాబట్టి ఆ స్కూల్లో జూనియర్ అయిన నా భార్యకి తప్పనిసరిగా బదిలీ అయ్యే పరిస్థితి వచ్చింది. అలా జరిగే పక్షంలో నా భార్యకు తక్కువ పాయింట్స్ ఉండటం వలన చాలా దూరప్రాంతానికి అనగా జిల్లా బోర్డర్‌కు వెళ్ళవలసి వస్తుంది. అయితే ఆరోగ్యపరంగా ఇబ్బందులు ఉన్న నా భార్యకి బదిలీ అయితే తను చాలా ఇబ్బందిపడుతుంది. ఒక్క సంవత్సరం బదిలీ ఆగితే తనకి ఇబ్బంది ఉండదు. అంటే 2023 వేసవి సెలవుల్లో నా భార్యకు బదిలీ అయితే సమస్య ఉండదు. మేము మా తండ్రి బాబాను, "బాబా! ఉదయం లేచిన దగ్గర నుండి రాత్రి నిద్రపోయేవరకు మిమ్మల్నే తలుచుకుంటూ మీమీదే నమ్మకం పెట్టుకున్న మాకు ఇంత ఇబ్బంది ఎలా కలిగిస్తావు? ఎలాగైనా ఇప్పుడు బదిలీలు జరగకుండా, వచ్చే వేసవి సెలవుల్లో జరిగేటట్లు చేసి ఈ ఆపదను తప్పించండి" అని ఎంతగానో వేడుకున్నాము. నా భార్య అయితే 2, 3 రోజులపాటు నిద్రలేని రాత్రులు గడిపింది. తను ఆ తండ్రి విగ్రహం పట్టుకుని, "నన్ను కాపాడు" అని కన్నీళ్ళతో వేడుకుంది. "పిలిస్తే పలుకుతాను. తక్షణమే మీ కష్టాలు తొలగిస్తాను" అని మన అందరికీ అభయమిచ్చిన బాబా ఆ మూడు రోజులు ఈ బ్లాగు ద్వారా "మీకు నేను ఉన్నాను. మీకు ఏ ఇబ్బందీ కలగకుండా నేను చూసుకుంటాను" అని, "భయపడకు అంతా నేను చూసుకుంటా" అని, "సదా నన్ను గుర్తుంచుకో, నీకు ఎంతో మేలు జరుగుతుంది" అని సందేశాలిస్తూ మీకు నేనున్నానని తెలియజేసారు. మేము ఆ తండ్రి మీద నమ్మకం ఉంచాము. బాబా పెద్ద అద్భుతం చేశారు. ఆ స్కూల్లో పనిచేస్తున్న సీనియర్ టీచర్ బదిలీ మీద వేరే చోటకి వెళ్ళడానికి ఒప్పుకున్నారు. అలా నా భార్యకు బాబా ఊరట కలిగించారు. కానీ ఆ టీచరుకి ఇబ్బంది అవుతుందేమో అని మేము బాధపడ్డాము. మరుసటిరోజు ప్రభుత్వ అధికారులు ఆ స్కూలుకి రేషనలైజేషన్ లేనందున ఎవరూ ఆ స్కూలు నుండి బదిలీ మీద వెళ్లాల్సిన పనిలేదు అని చెప్పారు. అలా ఎవ్వరికీ ఇబ్బంది లేకుండా బాబా కాపాడారు. నా తండ్రి చేసిన ఈ అద్భుతాన్ని తలుచుకుంటుంటే బాబా ఎప్పుడూ మన మధ్యే ఉన్నారని, తలచుకోగానే వచ్చి మన ప్రక్కనే ఉంటారని, మన భాధలు తీరుస్తారని అనిపిస్తుంది. నా తండ్రి బాబాకు మేము ఏమిచ్చి ఋణం తీర్చుకోవాలి? ఈ ప్రాణం ఉన్నంతవరకు ఆ తండ్రి పాదాల వద్ద సర్వస్య శరణాగతి చెందటం తప్ప ఏం చేయగలం? "ధన్యవాదాలు బాబా. మా పిల్లలకు ఉన్నత విద్యను, ఉన్నత స్థాయిని, మంచి బుద్ధిని, నడవడికను, పదిమందికి సహాయపడే తత్వాన్ని, ఎటువంటి ఇబ్బంది లేని మంచి జీవితాన్ని ప్రసాదించి ఉన్నంతలో మా కుటుంబాన్ని సంతోషంగా ఉండేటట్లు ఆశీర్వదించు తండ్రి".
సర్వం శ్రీసాయినాథ దివ్య చరణారవిందార్పణమస్తు.
శ్రీసాయి ప్రసాదించిన చిరు అనుభవాలు
శ్రీ సచ్చిదానంద సద్గురు సాయినాథ్ మహరాజ్ కీ జై!!!
శ్రీసాయినాథుని పాదాలకు వేలకోట్ల ప్రణామాలు. నా పేరు లత. 2014 వరకు నేను ఒక సామాన్య సాయి భక్తురాలిని. ఎన్నో సమస్యలు చుట్టుముట్టి జీవితం చాలా భయంగా గడుపుతున్న సమయంలో మా ఎదురింట్లో పూజ్యశ్రీ సాయినాథుని శరత్ బాబూజీ శిష్యులు ప్రతి గురువారం భజన, ప్రవచనాలు చేస్తూండేవాళ్లు. వాళ్ళు శరత్ బాబూజీ రచించిన పత్రికలు ఇస్తుండేవాళ్ళు. ఆ పత్రికల్లోని భక్తుల అనుభవాలు చదివి నేను కూడా బాబాకి శరణాగతి చేసుకుంటే, నా సమస్యలు తీరుతాయోమో, కష్టాలు గట్టెక్కుతానేమో అని బాబాకి శరణాగతి చేసుకున్నాను. అంతలోనే బాబా మా ఊరికి వచ్చారు. గుడి నిర్మించారు. ఒకరోజు శ్రీభరద్వాజ మాస్టర్ గారి 'సాయి లీలామృతం' పుస్తకం నాకు ఒకరి ద్వారా లభించింది. ఆ పుస్తకం చదువుతూ, బాబాని సేవించుకున్నప్పటినుంచి బాబా నా భయాలను, ఆందోళనలను తొలగించి ఎన్నో అనుభవాలు ప్రసాదించారు. బాబాకి శరణాగతి చేసుకున్న కొత్తలో మా ఇంట్లో సువాసన వెదజల్లే పరిమళం వస్తుండేది. ఒకసారి మా ఇంటి తాళం చెవి కనబడకపోతే బాబాను ప్రార్థించాను. రెండవరోజు తోటలో ఆ తాళం చెవి కనపడింది. ఈ మధ్యకాలంలో నా బంగారు గాజు ఒకటి కనిపించలేదు. మావారు టాయిలెట్లో పడిపోయి ఉంటుంది, దొరకదు అన్నారు. కానీ 'నాకు బాబా ఉన్నారు. నా గాజు దొరుకుతుంద'నే గట్టి నమ్మకంతో ఉన్నాను. ఆ నమ్మకమే మా కోడలికి బట్టలు సర్దుతుంటే నా గాజు కనిపించేలా చేసింది. ఒకసారి నాలుగు నెలల పసిపాపకు టీకా వేయిస్తే, ఎందుకనో బాగా ఏడ్చింది. పాపకు బాబా ఊదీ పెట్టి, సాయినామం జపిస్తే పాప ఏడుపు ఆపి నిద్రపోయింది. మాది కేబుల్ టీవీ కాకపోవడం వల్ల మా టీవీలో తెలుగులో 'సాయి టీవీ' ఛానల్ రాదు, తమిళంలో వస్తుంది. దాన్ని కూడా నవంబర్ 26 నుంచి రద్దు చేస్తామని స్క్రోలింగ్లో వచ్చింది. అప్పుడు నేను, "బాబా! ఆ ఛానల్ తీసేస్తే ఎలా తండ్రి? అందులోనే కదా, పొద్దున్నే నిన్ను దర్శించుకుంటాను తండ్రి" అని బాబాకి దణ్ణం పెట్టుకున్నాను. నాయందు దయుంచి ఆ ఛానల్ తీయకుండా అనుగ్రహించారు బాబా. ఇవన్నీ ఎవరికైనా సిల్లీగా అనిపించవచ్చునేమోగాని ఇవి ముమ్మాటికీ సత్యం. "సాయితండ్రీ! మీ పాదాలకు సదా ప్రణామాలు. ఇంకా కొన్ని సమస్యలున్నాయి. కర్మఫలం ఇంకా పూర్తవలేదేమో సాయితండ్రి. త్వరగా పూర్తయ్యేలా చేసి ఆ సమస్యలను కూడా పరిష్కరించు తండ్రి. నా కుటుంబాన్ని చల్లగా కాపాడు తండ్రి. ఏవైనా తప్పులుంటే క్షమించు తండ్రి".
ఆపద వాటిల్లినా చిన్న దెబ్బతో సరిపెట్టిన బాబా
సాయి బంధువులకు నా నమస్కారాలు. ఈ బ్లాగు నిర్వహిస్తున్న వారికి నా హృదయపూర్వక ధన్యవాదాలు. నేను ఒక సాయి భక్తుడిని. నా పేరు సుదర్శన్. నేను ఇప్పుడు బాబా నాకు ప్రసాదించిన ఒక అనుభవాన్ని తోటి సాయి భక్తులతో పంచుకోవాలనుకుంటున్నాను. నేను ప్రతి గురువారం బాబా గుడిలో ధూప్ ఆరతికి వెళ్తాను. ఒకరోజు నా కుటుంబం కూడా నాతో గుడికి వచ్చింది. మేము పల్లకి సేవలో పాల్గొనగా మా అమ్మాయి ధ్యానంలో కూర్చుంది. కాసేపటికి తనకి ధ్యానంలో 'నాకు ఆపద ఉందని, తమకు చక్కెర నివేదించమని' బాబా చెప్పారు. పల్లకి సేవ అనంతరం మా అమ్మయి నాకు ఆ విషయం చెప్పింది. నేను బాబా మీద భారం వేసి బైక్ మీద నా కుటుంబంతో ఇంటికి బయలుదేరాను. మా అమ్మాయి మెల్లగా వెళ్ళమని చెప్తుంటే, మెల్లగానే వెళ్ళాను. అయినా ఆపద తప్పలేదు. పెద్ద ప్రమాదమే జరిగింది కానీ, మాకు పెద్దగా ఏం కాలేదు. నాకు చిన్న దెబ్బ తగిలి నొప్పిగా ఉండింది. ఇంటికి వచ్చాక, "నొప్పి తగ్గేలా చూడు సాయితండ్రి" అని బాబాని వేడుకున్నాను. తరువాత మా అమ్మాయికి ధ్యానంలో "పెద్దదాన్ని చిన్నదిగా చేశాను. ఊదీ పెట్టుకుంటే నొప్పి అదృశ్యమవుతుంది" అని బాబా మాటలు వినిపించాయి. మా అమ్మాయి ఆ విషయం చెపితే నేను ఊదీ పెట్టుకున్నాను. రాత్రి కలలో నొప్పి ఉన్న చోట ఊదీ పెడుతున్నట్లు బాబా దర్శనమిచ్చారు. ఇలా నా సాయినాథుడు నాకు ఎల్లవేళలా సహాయం చేస్తున్నారు. "బాబా! మీకు చాలా చాలా ధన్యవాదాలు తండ్రి".
Sai naku na bartha kavali baba sai plss
ReplyDeleteOm Sairam
ReplyDeleteSai always be with me
Om sri sainathaya namaha
ReplyDeleteOm sri sainathaya namaha
Om sri sainathaya namaha
Om sri sainathaya namaha
Om sri sainathaya namaha
సాయి తండ్రి ఒకరిని బాధ పెట్టడం వల్ల తర్వాత నా కు తెలిసి చాలా బాధపడ్డాను.మా అపోహలు తొలగించు తండ్రి.అనాలొచితంగ అన్నాను. నువ్వు కలిపి ంంచు కొని సమస్యలను సాయి చేయి తండ్రి ఓం సాయి రామ్ పరిష్కారం చూపించు
ReplyDelete