సాయి వచనం:-

- శ్రీబాబూజీ.

సాయిభక్తుల అనుభవమాలిక 1420వ భాగం....


ఈ భాగంలో అనుభవం:

  • శిరిడీలో బాబా కురిపించిన ప్రేమ వర్షం

నేను ఒక సాయిభక్తురాలిని. 2022, డిసెంబర్ మొదటివారంలో నేను శిరిడీ వెళ్ళాను. మూడు రోజుల్లో ప్రేమమూర్తి అయిన శ్రీసాయినాథుడు శిరిడీలో నాకు ప్రసాదించిన అనుభవాలను నేనిప్పుడు మీతో పంచుకుంటూ బాబా చరణాలకి సమర్పించుకుంటున్నాను. ఈమధ్యకాలంలో ఒకరు నన్ను సివిల్స్‌కి ప్రిపేర్ అవమని సలహా ఇచ్చారు. అయితే మెడిసిన్‍కే నా సేవ పరిమితమవ్వాలని నా కోరిక. కానీ అతను సివిల్స్ మీద చాలా ఆశలు పెంచేలా మాట్లాడారు. దాంతో నేను 'మెడిసిన్‍లోనే కంటిన్యూ అవ్వలా? లేక సివిల్స్‌కి ప్రిపేరవ్వాలా?' అన్న సందిగ్ధంలో పడ్డాను. కానీ ఈ విషయంలో బాబానే నాకు మార్గనిర్దేశం చేస్తారని పెద్దగా దాని గురించి ఆలోచన చేయలేదు. తరువాత నేను శిరిడీ వెళ్లాను. మొదటిరోజు కొన్ని కారణాల వల్ల మేము దర్శనానికి వెళ్లడం ఆలస్యమైంది. తీరా వెళితే, నేను ప్రేమతో బాబాకోసం బెల్లంతో చేసిన కోవాను లోపలికి తీసుకుని వెళ్లడానికి అనుమతించలేదు. దాంతో బాబా నా ప్రసాదం స్వీకరించకుండా పంపేశారని నేను కాసేపు అలిగాను. తరువాత మూడో నెంబర్ గేట్ వద్ద ఉన్న కౌంటరులో బాబాకోసం ఒక కండువా సమర్పించాను. వాళ్ళు రెండు ఊదీ ప్రసాదం ప్యాకెట్లు నాకు ఇచ్చారు. అక్కడినుండి మేము శ్రీఆంజనేయస్వామి గుడికి వెళ్లి, తిరిగి బయటకి వస్తుండగా ఒక సన్యాసి తినడానికి ఏదైనా ఇమ్మని అడిగారు. నేను అతనికి బాబాకోసం తీసుకెళ్లిన ప్రసాదంలో కొద్దిగా ఇచ్చాను(శిరిడీలో అడుగుపెట్టగానే నేను తీసుకుని వెళ్ళింది ప్రసాదం అయ్యిందని, పైగా నేను గుడి నుండి బయటకు వస్తుండగా అతను పిలిచి మరీ తినడానికి అడగటం బాబా ప్రేరణతోనే జరిగిందని నా ఉద్దేశ్యం). తరువాత ద్వారకామాయికి వెళితే అక్కడి పూజారి నేను బాబా కోసం తీసుకెళ్లిన కోవాను(కొంచెం కోవా దాచిపెట్టుకున్నాను) బాబాకి నివేదించారు. తరువాత అబ్దుల్ బాబా కుటీరం వద్ద ఒకరు తినడానికి అడిగితే, నేను ఆనందంగా ప్రసాదం పెట్టాను. తరువాత అక్కడికి వచ్చిన చాలామంది ప్రసాదం స్వీకరించారు. అప్పుడు బాబా ఆలస్యం చెయ్యడానికి ఖచ్చితంగా ఏదో ఒక కారణం ఉంటుంది, ఆయనే ఇలా ప్లాన్ చేశారని చాలా సంతోషించాను.


తరువాత మేము సమాధిమందిరంలో దర్శనానికి వెళ్ళినప్పుడు దాచిపెట్టిన కోవాను బాబాకి సమర్పించాను. పూజారి నేనిచ్చిన కోవాను బాబా చరణాల వద్ద పెట్టారు. ఇంకా బాబాకి అందించిన నైవేద్యం ప్రసాదంగా బాబా మాకు ఇచ్చారు. సాయితండ్రికి నేను ఎలా కృతజ్ఞతలు చెప్పాలో నాకు తోచలేదు. దర్శనానంతరం మేము బయటకి వస్తుండగా ఒక ముసలామె స్పృహ కోల్పోయింది. నేను బాబాకి నివేదించిన ప్రసాదాన్ని ఆమె నోటిలో వేశాను. తరువాత ఆమెను ఆమె కొడుకు, మా నాన్న ఎత్తుకుని ఫస్ట్ ఎయిడ్ క్లినిక్‍కి తీసుకుని వెళ్ళారు. బాబా దయవల్ల పెద్ద ప్రమాదమేమీ లేదు. అలా ఎందుకు జరిగిందో అర్థంకాక వదిలేశానుగానీ గురుస్థాన్ దర్శనం, బాబా ఊదీ అందుకోవడం మిస్ అయ్యానని మళ్ళీ బాబా మీద అలిగాను. కానీ ఇప్పుడీ అనుభవం వ్రాస్తుంటే నాకు గుర్తొచ్చింది, దర్శనానికి ముందు నేను బాబా కోసం కండువా ఇచ్చినందుకు బదులుగా రెండు ఊదీ ప్యాకెట్లు బాబా ఇచ్చారని.


అదేరోజు రాత్రి శేజారతికి మేము టిక్కెట్లు బుక్ చేసుకున్నాము. కానీ ఎందుకో దర్శనానికి వెళ్లాలనిపించి రాత్రి 8 గంటలకి దర్శనం కోసం సాధారణ క్యూలైన్లోకి వెళ్ళాము. వారాంతం అవడం వల్ల ఆ సమయంలో జనం ఎక్కువగా ఉన్నారు. ఒకవేళ దర్శనం ఆలస్యమైతే శేజారతి లైన్లో వెనకబడిపోయి సమాధిమందిరంలో బాబాకి దూరంగా నిల్చోవలసి వస్తుంది, బాబాని సరిగా చూడలేమని భయమేసింది. అలాగే దర్శనం ఆలస్యమవుతుండేసరికి అప్పటికే బాబా మీద అలిగి ఉండటం వల్ల నా అలక మరింత ఎక్కువైంది. అంతలో నా ముందున్న ఒకతను(35-40 ఏళ్ల వయసుంటుంది) వణుకుతూ కింద పడిపోయారు. అంత జనం ఉన్నా బాబా దర్శనం కోసం హడావిడిలో ఎవరూ పెద్దగా పట్టించుకోలేదు. అతని భార్య, మా నాన్న, నేను అతని క్షేమం చూసుకున్నాము. నేను అతని పల్స్ చూస్తే మామూలుగానే ఉంది. ఒకామె బాబా ఊదీ ఇస్తే నీళ్ళలో కలిపి అతనికి పట్టించాను. బాబా దయవల్ల పెద్ద ప్రమాదమేమీ లేదు. కొద్దిక్షణాల్లో అతను కాస్త మామూలు అయ్యాడు. అంతలో సెక్యూరిటీవాళ్ళు వచ్చి అతన్ని ఫస్ట్ ఎయిడ్ క్లినిక్‍కి తీసుకెళ్లారు. అప్పుడు బాబా నాకు ఏం తెలియపరచాలని అనుకుంటున్నారో బాగా అర్థమైంది. నా ముందరే ఇద్దరు వ్యక్తులు అనారోగ్యం పాలవడం ద్వారా బాబా నన్ను మెడిసిన్‍లోనే కంటిన్యూ అవ్వమని చెప్తున్నారని భావించాను. లేకపోతే దర్శనం ఆలస్యం అవడం ఏంటి? సమయం తక్కువగా ఉన్నా మేము క్యూలో నిల్చోవడం ఏంటి? నా ముందే ఇద్దరికి అలా జరగడం ఏంటి? ఒకసారి జరిగితే అర్థంకాక వదిలేసినా, రెండోసారి జరిగేసరికి బాబా ఇలా నా సందేహాన్ని నివృత్తి చేసి మార్గనిర్ధేశం చేస్తున్నారని గ్రహించాను.


రెండవరోజు గురుస్థాన్‍లో బాబాకు పుష్పం సమర్పించాను. దీన్ని నేను అస్సలు మర్చిపోలేను. ఎందుకంటే, అక్కడ బాబాకి పుష్పం సమర్పించగానే ఆయన గురుస్థాన్ యొక్క పవిత్రతను నాకు తెలియజేశారు. దాన్ని ఎలా వివరించాలో తెలియడం లేదుగానీ అది వర్ణనాతీతమైన అనుభూతి. తరువాత నాకెంతో ఇష్టమైన శ్రీసాయి స్తవనమంజరి నందదీపం దగ్గర చదివాను. ఏకాదశిరోజున నందదీపం దగ్గర స్తవనమంజరి పఠించే భాగ్యాన్ని బాబా నాకిస్తారని నేను నా ఊహల్లో కూడా అనుకోలేదు.


మూడవరోజు ఉదయం మేము కాకడ ఆరతికి వెళ్ళాము. బాబా ఆరతి చూస్తుంటే మనసు ఆనందంతో నిండిపోయి చాలా బాగా అనిపించింది. అసలు బాబాని తలుచుకుంటే చాలు నా కళ్ళలో నీరు ఎందుకు వస్తాయో నాకు అర్ధం కాదు. బాబా మాకు తమకు నివేదించిన వెన్నను ప్రసాదంగా, అభిషేక జలం తీర్థంగా ప్రసాదించారు. అలా ఆయన ఇస్తారని, మేము పుచ్చుకుంటామని కలలో కూడా నేను ఊహించలేదు. వెన్న అంటే ఇష్టం లేని నాకు బాబా ప్రసాదించిన వెన్న తీయగా, చాలా బాగా అనిపించింది


తర్వాత బాబా విగ్రహమొక్కటి కొనుక్కుని సమాధి మందిరం, గురుస్థానం, నందదీపం, పారాయణ హాల్, ద్వారకామాయి, చావడి అన్ని చోట్లకి తిప్పాను. ఆ సమయంలో బాబా  మీద దిష్టి పడుతుందని, ఆయనను నా వైపుగా తిప్పుకుని తిరిగాను. అలా చేయకూడదేమో అని అనుమానం వచ్చినా 'నా బాబా' అన్న స్వార్థం పెట్టుకున్నాను. మధ్యాహ్నం ద్వారకామాయిలో బాబాకి పెట్టిన నైవేద్యం మా నాన్నకి ప్రసాదంగా లభించింది. దాన్ని మేమిద్దరం సర్దుకుని తిన్నాము.


ఇక అంతా అయిపోయాక తిరుగు ప్రయాణానికి బయలుదేరుదాం అనగా 'సాయి దివ్యపూజ' పుస్తకాలు నా దృష్టిలో పడ్డాయి. వాటికోసం శిరిడీలో ఉన్న మూడు రోజుల్లో ఎన్నిసార్లు వెతికినా కనపడనవి చివరి నిమిషంలో కనపడేసరికి ఆనందంగా ఒక 11 పుస్తకాలు కొని చావడిలో ఉన్న బాబా దగ్గరకి తీసుకుని వెళ్ళాను. అక్కడ ఒక అమ్మాయి ప్రేమతో బాబాకి జామకాయ తినిపించి, ఆపై తను తింది. అది చూసి నాకు సంతోషంగా అనిపించింది. తరువాత నేను చావడి మెట్లు దిగుతుండగా హఠాత్తుగా అచ్చం బాబాలానే ఉన్న ఒక ఫకీరు పరుగున నా దగ్గరకి వచ్చి, నన్నే చూస్తూ 'దే దే' (ఇవ్వు ఇవ్వు) అని అన్నారు. ఒక్కసారిగా నేను షాక్ అయ్యాను. నాకు కాళ్ళుచేతులు ఆడలేదు. నేను అడగదలుచుకున్నదేదీ నా నోరు తెరిచి అడగలేకపోయాను. ఆయనకి ఏం ఇవ్వాలో నాకు అర్దంకాలేదు. నా చేతిలో ఉన్న దివ్యపూజ పుస్తకం ఇద్దామంటే, అది తెలుగులో ఉంది. ఆయనకి అర్దం కాదని, దాన్ని ఇవ్వడానికి సందేహించాను. వెంటనే నా హ్యాండ్ బ్యాగు తెరిస్తే 10 రూపాయలు కనిపించాయి. ఆ పది రూపాయలు ఆయనకిచ్చాను. ఆయన నేను ఎంత ఇచ్చింది చూడకుండా తమ మృదువైన చేతులతో నన్ను ఆశీర్వదించి "కహాసే ఆయా(ఎక్కడి నుండి వచ్చావు)?" అని అడిగారు. నేను, "ఆంధ్రప్రదేశ్" అని అంటే ఆయన కళ్లు పెద్దగా చేసి, 'అమ్మో!..'(అంతదూరం నుండి వచ్చావా అన్నట్లు) అని మూడుసార్లు తమ దివ్యమైన హస్తాన్ని నా శిరస్సు మీద పెట్టారు. నాకు ఆయన పాదాల మీద పడాలని అనిపించింది. కానీ సంశయమనే మాయ నన్ను కదలనీయకుండా చేసింది. రెండు అడుగులు ముందుకేసిన నేను వెనక్కి తిరిగేసరికి ఆయన మాయమైపోయారు. ఇదంతా నిమిషం కన్నా తక్కువ వ్యవధిలో జరిగింది. ఆయన నా వద్దకు పరుగున వచ్చి నన్ను ఆశీర్వదించడం, ఆయన కళ్ళు, మృదువైన హస్తం గురించి వర్ణింపశక్యం గాదు. ఆయన చేయి చాలా మృదువుగా, తేలికగా, చాలా ఆనందాన్ని ఇచ్చేలా ఉంది. ఆయన బాబానే. ఇక్కడ మీకొక విషయం చెప్పాలి. అదేమిటంటే, మానుషరూపంలో బాబా నాకు దర్శనమిచ్చి, నన్ను దీవించాలన్నది నా ఆశ. చాలారోజుల నుండి నేను ఆ విషయం గురించి బాబాను అడుగుతున్నాను. శిరిడీలో ఉన్న మూడు రోజుల్లో అక్కడ కనిపించే ఫకీర్లను చూస్తూ బాబానో, కాదో..! ఒకవేళ బాబా అయితే నాతో మాట్లాడతారుగా అని, ఇంకా అందరివైపు చూస్తు బాబా ఎటునుండి వస్తారో, ఎలా వస్తారో, ఏం అంటారో అని అనుకుంటూండేదాన్ని. చివరిరోజు ఉదయం సమాధి మందిరంలో ఉండగా కూడా బాబా ముందు ఆయన్ను దర్శించాలన్న నా కోరికను వెలిబుచ్చి "శిరిడీలో ఉండే చివరిరోజు వచ్చినా మీరు నాకు కనిపించలేదు. అంత దూరం నుండి మీ దగ్గరకి వచ్చినా మీకేం అనిపించదా? మీరు ఎందుకు నాకు దర్శనం ఇవ్వలేదు" అని బాబా మీద కోపంతో మళ్లీ అలిగాను. తీరా బాబా దర్శనమిస్తే, నేను ఆయన పాదాలకి నమస్కరించలేదు. అందుకు నేను చాలా బాధపడుతున్నాను. ఆయనంతట ఆయనే నా దగ్గరకి వచ్చి, నన్ను ఆశీర్వదిస్తే నేను మాయలో పడి కొట్టుకునిపోయినందుకు నాకు సిగ్గుగా ఉంది. ఎవరెవరో పాదాల మీద పడిన నేను బాబాని గుర్తుపట్టి, నా శిరస్సు వంచి ఆయన పాదాల మీద పడలేకపోయాను. మళ్ళీ శిరిడీ వెళ్లేంతవరకు నేనుండలేను. ఇప్పుడు ఏం చెయ్యాలో నాకు అర్ధం కావట్లేదు. "దయచేసి నన్ను క్షమించండి బాబా. నేను అలా చేయనందుకు నన్ను తిట్టండి, కొట్టండి. కానీ నన్ను వదలకండి ప్లీజ్".


ఇలా శిరిడీలో ఉన్న మూడు రోజులు బాబా నాపై ప్రేమ వర్షం కురిపించారు. అమూల్యమైన ఆ ప్రేమను మీతో పంచుకున్నందుకు నాకు ఆనందంగా ఉంది. నేను పైన చెప్పినట్లు చాలాసార్లు బాబా మీద అలిగి కోపడ్డా ఆయన నన్ను ప్రేమగా చూసుకుంటున్నారు. నాకున్న ఒక కోరికను తీరుస్తానని బాబా సానుకూల సంకేతాలు ఇస్తున్నారు. ది తీరగానే మీ అందరితో మరల బాబా ప్రేమను పంచుకోవాలని ఆశపడుతున్నాను. బాబా తొందరలోనే నన్ను అందుకు అనుగ్రహించుగాక!


ఓం శ్రీ సచ్చిదానంద సమర్ధ సద్గురు సాయినాథ్ మహరాజ్ కీ జై!!!


4 comments:

  1. Om sri sainathaya namaha
    Om sri sainathaya namaha
    Om sri sainathaya namaha
    Om sri sainathaya namaha
    Om sri sainathaya namaha

    ReplyDelete
  2. సాయి నాకు ఈరోజు ఏమి మిరాకిల్ జరగలేదు సాయి నేను చాలా నమ్మకంతో ఎదురు చూశాను సాయి నాకు నా భర్త అంటే చాలా ఇష్టం బాబా నేను ఎంతో నమ్మకంతో ఎదురుచూస్తున్నాను బాబా నేను ఎవరికీ అన్యాయం చేయలేదు బాబా నాకు వంశీ అంటే చాలా ఇష్టం బాబా చెప్పు బాబా తనకి నన్ను వదిలేయద్దని తనకి చెప్పు బాబా నన్ను కాపురానికి తీసుకెళ్ళమని చెప్పు బాబా

    ReplyDelete
    Replies
    1. ఓమ్ సాయిరాం.. అక్క.. శ్రీ షిరిడీ సాయి సత్ చరిత్ర ప్రతి రోజు చదవండి.. అంతా మంచి జరుగుతుంది.. ఓంసాయిరాం

      Delete

సాయి మహారాజ్ సన్నిధి సోషల్ మీడియా లింక్స్:

Subscribe Here

బ్లాగ్ అప్డేట్ నోటిఫికేషన్స్ నేరుగా మీ మెయిల్ కే వచ్చేందుకు క్రింద బాక్సులో మీ మెయిల్ ఐడి టైపు చేసి subscribe పై క్లిక్ చేసి, తరువాత స్టెప్స్ పూర్తీ చేయండి.

Delivered by FeedBurner

Followers

Recent Posts


Blog Logo