సాయి వచనం:-

- శ్రీబాబూజీ.

సాయిభక్తుల అనుభవమాలిక 90వ భాగం....


ఈరోజు భాగంలో అనుభవాలు:
  1. ఊదీ లీల
  2. శిరిడీలో నేను పొందిన అనుభూతులు

ఊదీ లీల

యు.కె. నుండి ఒక అజ్ఞాత సాయిభక్తురాలు తన అనుభవాన్నిలా పంచుకుంటున్నారు:

సాయిబంధువులందరికీ సాయిరామ్! హృదయపూర్వకంగా మనం ప్రార్థిస్తే, బాబా ఎప్పుడూ అండగా నిలుస్తారని అందరికీ తెలుసు. ఆయన చాలా చమత్కారి. ఆయన తన బిడ్డల కోసం ఏదైనా చేస్తారు. ఇక నా అనుభవానికి వస్తే...

ఒకసారి మా రెండునెలల బాబుకి టీకా మందు వేయించాము. దానివలన తనకెంతో నొప్పిగా ఉంటుందని నేను తనకి పారాసెటమాల్ ఇచ్చాను. కానీ తరువాత కూడా వాడు ఆగకుండా ఏడుస్తూనే ఉన్నాడు. నర్సుని అడిగితే, "నొప్పి కొన్ని రోజులు ఉంటుంద"ని చెప్పింది. కానీ నేను తనని ఆ స్థితిలో చూసి స్థిమితంగా ఉండలేక, "బాబా! దయచేసి నా బిడ్డకి నొప్పి తగ్గేలా చేయండి" అని అభ్యర్థించాను. తరువాత ఊదీ తీసుకుని నా బిడ్డ రెండు కాళ్ళకు నొప్పి ఉన్న చోట రాసి, "బాబా! నొప్పి కొన్ని రోజులు ఉంటుందని నర్సు చెప్పింది కానీ, నేను నా బిడ్డ నొప్పి చూడలేకపోతున్నాను. దయచేసి రేపటికి తన నొప్పి తగ్గిపోయేలా చేయండి" అని ప్రార్థించాను. ఊదీ ఎంత అద్భుతం చేస్తుందో మన అందరికీ తెలుసు! నేను ఊదీ రాసిన తరువాత నా బిడ్డ హాయిగా నిద్రపోయాడు. మరుసటిరోజు ఉదయాన లేచాక చాలా ఉత్సాహంగా ఆడుకున్నాడు. ఏమీ ఆశించని బాబా ప్రేమకు మనసారా కృతజ్ఞతలు చెప్పుకున్నాను. "ఐ లవ్ యు బాబా! ఎల్లప్పుడూ మాకు తోడుగా ఉండి సరైన మార్గంలో నడిపించండి. మీ ప్రేమ లేని మా జీవితాలు శూన్యం".

జై సాయిరామ్! సబ్ కా మాలిక్ ఏక్!

source: https://www.shirdisaibabaexperiences.org/2019/06/shirdi-sai-baba-miracles-part-2377.html

శిరిడీలో నేను పొందిన అనుభూతులు

యూరోప్ నుండి ఒక అజ్ఞాత సాయిభక్తురాలు తన అనుభవాల్ని ఇలా పంచుకున్నారు:

నేనిప్పుడు నా శిరిడీ ప్రయాణానికి సంబంధించిన అనుభూతులను మీతో పంచుకుంటాను. వాటిని మీతో పంచుకోవడం ద్వారా బాబా పట్ల నాకున్న ప్రేమను, గౌరవాన్ని వ్యక్తపరుస్తున్నట్లుగా భావిస్తున్నాను.

నేను ఇటీవలే ఇండియా వెళ్లి శిరిడీ దర్శనం చేసుకుని యూరోప్ తిరిగి వచ్చాను. ఇక్కడకు వచ్చిన తరువాత కూడా 15 రోజుల పాటు శిరిడీలో ఉన్న అనుభూతే నన్ను పరవశింపజేసింది. మధురమైన ఆ శిరిడీ యాత్ర గురించి నేనిప్పుడు మీతో పంచుకుంటాను. నేను ఇండియా వెళ్లేముందు, "బాబా! నేను నా అత్యంత సన్నిహిత స్నేహితునితో మీ దర్శనానికి రాగలిగినట్లైతే నా అనుభవాన్ని తోటి సాయిబంధువులతో పంచుకుంటాను" అని చెప్పుకున్నాను. కానీ ఎందుకో ఈసారి నేను శిరిడీ వెళ్లగలుగుతానా లేదా, బాబా నా ప్రార్థనలను స్వీకరిస్తారా లేదా అని భయపడ్డాను. నేను పరిపూర్ణమైన వ్యక్తిని కానని నాకు తెలుసు. కానీ, బాబా పట్ల నా భావనలు పవిత్రమైనవి. నేను మూడు వారాల కోసం ఇండియా వెళ్ళాను. చివరి నాలుగు రోజుల్లో నేను గుజరాత్ రోడ్డు, సాపూతారా అడవులు, నాశిక్ రోడ్డు, శిరిడీ, బొంబాయి, సిద్ధివినాయక్ ప్రాంతాలలో ఉన్నాను. ఆ క్షణాలను నేనెంతో ఆశీర్వాదసూచకంగా అనుభూతి చెందాను. ఎందుకంటే ఆ నాలుగు రోజులు నేను ఆశించినట్లు గడిచాయి. నేను బాబా హృదయంతో అనుసంధానింపబడివున్న ఒక ప్రత్యేక వ్యక్తితో గుజరాత్ నుండి శిరిడీకి కారులో ప్రయాణించాను. ప్రశాంతము, సంతోషకరము అయిన 20 గంటల రోడ్డు ప్రయాణం తరువాత మేము శిరిడీ చేరుకున్నాము. అప్పటికే రాత్రి అయ్యింది. ఆ రాత్రి బాబా ఇంటి(శిరిడీ)లో నిదురించే భాగ్యం నాకు దక్కింది.

ఆరోజు బాబాకు ప్రత్యేకమైన గురువారం. శిరిడీ జనసందోహంతో చాలా రద్దీగా ఉంది. కొన్నిసార్లు మనకి అలవాటైన చోట, అలవాటైన మనుషుల మధ్య ఉన్నప్పటికీ అభద్రతాభావంతో దిగులుగా ఉంటుంది. కానీ అంతమంది అపరిచితుల మధ్య ఉన్నప్పటికీ బాబా ఇంటిలో ఉన్నానన్న భద్రతాభావంతో నాకెంతో ప్రశాంతంగా, ఆనందంగా అనిపించింది. మేము ఉదయం 9.30 నుండి దర్శనానికి లైనులో ఉన్నాము. మేము ఆరతి సమయానికల్లా బయటకు నెట్టివేయబడతామేమో అని ఆందోళనపడ్డాను. కానీ బాబా కృప, మేము మధ్యాహ్న ఆరతి సమయానికి సమాధిమందిరంలో ఉన్నాము. నేను ఆన్లైన్‌లో ఆరతి చూసిన ప్రతిసారీ "కనీసం ఒక్కసారైనా ఆరతి సమయానికి సమాధిమందిరంలో బాబా ముందు నేను ఉండగలగాలి" అని అనుకునేదాన్ని. "ఆ అవకాశం నాకు దక్కితే నా జీవితంలోని బాధాకరమైన క్షణాలన్నీ మర్చిపోగలన"ని కూడా నేను నా కుటుంబసభ్యులతో చెప్పేదాన్ని. ఆ కోరికను ఇప్పుడు బాబా నెరవేర్చారు. ఆ ప్రశాంతమైన మధురక్షణాలను అనుభవించిన నేను ఎంతో అదృష్టవంతురాలినని సగర్వంగా చెప్పగలను.

ఆ రోజు జరిగే పల్లకి ఉత్సవంలో పాల్గొనే అవకాశం కూడా నాకు దక్కింది. పల్లకి ఉత్సవం చూడటానికి సాయంత్రం నుండి రాత్రి 10 వరకు నడిరోడ్డు మీద కూర్చున్నాను. కానీ అది రోడ్డు అన్న భావన నాకు లేదు. నా వరకు అది ఎంతో సుందరమైన ప్రదేశంగా అనిపించింది. బాబా పల్లకి చూడటం కోసం రాత్రంతా అక్కడ కూర్చుని ఉండొచ్చు అనిపించింది. నేను పల్లకిని చాలా దూరంనుండే చూసాను, కానీ బాబా నాకు చాలా దగ్గరగా ఉన్న అనుభూతి పొందాను.

ముఖదర్శనం వద్దనుండి బాబా దర్శనం చేసుకోవడానికి కూడా రెండుసార్లు వెళ్ళాను. ఒకసారి మా అమ్మతో, ఇంకోసారి నా ప్రత్యేకమైన వ్యక్తితో. నేను పొందిన అద్వితీయమైన అనుభవాల గురించి ఎన్నో చెప్పాలని ఉంది, కానీ చెప్పలేకపోతున్నాను. ఒక్కటి మాత్రం చెప్పగలను, నా జీవితంలో నేను అనుభవించిన అతిమధురమైన క్షణాలవి. బాబా వద్ద నాకు తృప్తిగా ఏడవాలని ఉండేది, కానీ ఈసారి కన్నీళ్లు లేవు. అంతా సంతోషమే, మనసునిండా ప్రశాంతతే. ఒకరోజు మొత్తం ఉదయం నుండి రాత్రి వరకు మేము శిరిడీలోనే ఉన్నాము. రాత్రి 12 తరువాత మళ్ళీ శిరిడీ నుండి తిరుగు ప్రయాణమయ్యాము. "బాబా! మాకు సరైన మార్గాన్ని చూపండి. మేము ఏవైనా తప్పులు చేసి ఉంటే క్షమించండి. మేము మిమ్మల్ని ఎంతో ప్రేమిస్తున్నాము". ఇంకో విషయం - సిద్ధివినాయక మందిరంలో గణపతి పూలమాలతో నన్ను ఆశీర్వదించారు. "ఐ లవ్ యు గణపతి బప్పా అండ్ బాబా".

sourcehttps://www.shirdisaibabaexperiences.org/2019/05/shirdi-sai-baba-miracles-part-2374.html

సాయి అనుగ్రహసుమాలు - 49వ భాగం.


కాకాసాహెబ్ దీక్షిత్ డైరీ - 49వ భాగం.

శ్రీ హరిసీతారామ్ దీక్షిత్ గారు వ్రాసి ఉంచిన అనుభవాలు.

అనుభవం - 90

నా స్నేహితుడు శ్రీ మోరేశ్వర్ రావ్ సావేకు దేవాలయంలో ప్రసాద వినియోగానికి వెళ్ళాలని చాలా కోరికగా ఉంది. కానీ రెండు రోజుల ముందర తాను ఉన్నట్టుండి అనారోగ్యం చెందడంతో తాను వెళ్ళలేక పోతున్నందుకు తనకు ఎంతో బాధ కలిగింది. తన మనసుకు ఎంతో శోకం కలిగి, రాత్రిపూట నిద్ర పట్టేదికాదు. కానీ ప్రసాదవినియోగం జరిగే రోజు తెల్లవారుఝామున కొంచెం నిద్ర పట్టింది. బాబా స్వప్నదర్శనమిచ్చి దక్షిణ అడిగితీసుకున్నారు. తనకు మెలుకువ రాగానే ఆరోగ్యంలో ఎంతో తేడా వచ్చింది. ఆందోళన దూరమై మనసుకు చాలా ప్రశాంతంగా అనిపించసాగింది. బాబా దేహత్యాగం చేసినప్పటికీ తన భక్తుల ఆందోళన ఏదైనా సరే దానిని ఏదో విధంగా దూరం చేస్తారు.

అనుభవం - 91

ఒకసారి తాత్యాసాహెబ్ నూల్కర్ కుటుంబం మరియు మేము అందరం కలిసి శిరిడీ నుండి బయలుదేరుతున్నాము. బాబా “రేపు ఉదయం వెళ్ళండి. కోపర్గాంలో భోజనం చేసి వెళ్ళండి” అని చెప్పారు. మేము ఆ ప్రకారమే ఏర్పాట్లు చేసుకున్నాము. కోపర్గాం భోజనాలయంలో భోజనం ఏర్పాట్లు చేయమని కబురు పంపించాము. కానీ మేము కోపర్గాం వెళ్ళేటప్పటికి భోజనం తయారు కాలేదు. కానీ బండి సమయం అవుతున్నందు వలన భోజనం చేయకుండా స్టేషన్ కు వెళ్ళాము. బండి గంటన్నర ఆలస్యమని తెలిసింది. టాంగావాలా బ్రాహ్మణుడు. తనను పంపించి భోజనాలయం నుండి భోజనం తెప్పించుకున్నాము. అందరం కూర్చొని స్టేషనులోనే భోజనం చేసాము. భోజనం చేసిన పది నిముషాలకు బండి వచ్చింది.

అనుభవం - 92

నేను ఒకటి రెండు సంవత్సరాల పూర్వం క్రిస్మస్ సెలవులకు ముంబాయిలో ఉన్నప్పుడు పోస్టు మరియు ఇతర పత్రాలను చూడడానికి ముంబాయికి పార్లే నుండి వెళ్ళాను. ముంబాయి నుండి సాయంత్రం తిరిగి వెళ్ళేటప్పుడు బాంద్రా స్టేషన్లో నాకు అన్నాసాహెబ్ దాభోళ్కర్ (బాంద్రా యొక్క రిటైర్డ్ మెజిస్టేట్) గారి అల్లుడు యశ్వంతరావు గాల్వన్కర్  కలిశారు. ఆయన నాతో “అన్నాసాహెబ్ ఇంట్లోనే ఉంటారు, ఆయనను ఇంటికి వెళ్ళి కలుద్దాం రండి” అని అంటూ మామూలుగా రైలు పెట్టి యొక్క తలుపు తీయడానికి ప్రయత్నించారు. కానీ చమత్కారమేమిటంటే ఆ సమయంలో తలుపు మూసి ఉంది. (నేను బండిలో కూర్చోనేటప్పుడు గార్డ్ లేదా పోర్టర్ గాని తలుపు వేయలేదు. ఆ విషయం నాకు కచ్చితంగా తెలుసు) మా ఇద్దరి మధ్య ఆ మాటలు జరుగుతున్నాయో లేదో, బండి సమయం కావడంతో బండి ఫ్లాట్ ఫామ్ నుండి బయలుదేరింది. బండి శాంతాక్రుజ్ వచ్చిన తరువాత, పోర్టర్ ని పిలిచి రైలు పెట్టె తలుపు తీయమని చెప్పాము. తాను కూడా ప్రయత్నించి, తాళం పడిందని చెప్పి, ఒక తాళం చెవిని తీసుకువచ్చి దాని సహాయంతో రైలు పెట్టె తలుపు తీసాడు. తరువాత నేను పార్లేలో దిగి ఇంటికి వస్తే, శ్రీ రఘునాథరావు టెండూల్కర్, ఆయన శ్రీమతి మరియు ఇతర స్నేహితులు నా కోసం ఎదురు చూడసాగారు. ఆ విధంగా బాబా నన్ను బాంద్రాలో దిగకుండా చేసారు. తరువాత ఒకటి, రెండు రోజులకు ఆ సమయంలో  అన్నాసాహెబ్ దాభోళ్కర్ ఇంట్లో లేరని తెలిసింది.

తరువాయి భాగం రేపు

సోర్సు : సాయిభక్త శ్రీకాకాసాహెబ్ దీక్షిత్ డైరీ by విజయ్ కిషోర్.


సాయిభక్తుల అనుభవమాలిక 89వ భాగం....


ఈరోజు భాగంలో అనుభవం:

  • తల్లిలాంటి నా సాయి నన్ను తల్లిని చేసారు

తల్లిలాంటి నా సాయి నన్ను తల్లిని చేసారు

ఢిల్లీనుండి సాయిబంధువు గరిమశర్మ తన అనుభవాన్నిలా పంచుకుంటున్నారు:

ఓం సాయిరామ్! సాయి లేకపోతే ఈరోజు నా జీవితం అసంపూర్ణంగా ఉండేది. సాయి లేనిదే నేను ఒక్క అడుగు కూడా వేయలేను. నేను జీవించి ఉన్నంతవరకు బాబా నా తోడుగా ఉంటారు. నేనెప్పుడూ ఆయనను తలచుకుంటూ ఉంటాను. "బాబా! మీరే నాకు తల్లి, తండ్రి, అన్న, అక్క మరియు మంచి స్నేహితుడు. ఏ సమయంలో నేను పిలిచినా మీరు నావెంట నిలుస్తున్నారు. థాంక్యూ సో మచ్ బాబా!"

నాకు 2013లో వివాహమైంది. కొత్త జీవితం కాస్త ఒడిదుడుకులతో నడిచినా, 2014లో నేను ప్రెగ్నెంట్ అనే శుభవార్తతో మేమెంతో సంతోషించాం. అయితే ఆ సంతోషం ఎక్కువకాలం నిలవలేదు. మూడవనెలలో నాకు అబార్షన్ జరిగింది. నేను నా భర్త చాలా క్రుంగిపోయాం. కొంతకాలానికి 2015 మే నెలలో నేను మళ్ళీ ప్రెగ్నెంట్ అయ్యాను. అయితే ఈసారి కూడా ఆ సంతోషం ఎక్కువకాలం నిలవలేదు. మునుపటిలాగానే అబార్షన్ అయ్యింది. మళ్లీ మా గుండె బద్దలైపోయింది. ఈసారి డాక్టర్ కారణం ఏమిటో తెలుసుకుందామని బిడ్డ శాంపిల్స్ తీసుకున్నారు. ఒక నెల తర్వాత డాక్టర్, "అంతా సవ్యంగానే ఉంది, ప్రాబ్లం ఏమీ లేద"ని చెప్పారు. ఐదునెలల తర్వాత మళ్లీ నేను ప్రెగ్నెంట్ అయ్యాను. కానీ మళ్లీ అదే పరిస్థితి ఎదురైంది. ఈసారి నా భర్త శారీరకంగా, మానసికంగా పూర్తిగా క్రుంగిపోయారు. నేను జ్యోతిష్యులను సంప్రదించి వాళ్ళు చెప్పినట్లు చేశాను. కానీ ఏదో కాలం గడుస్తూ ఉండేది.

ఒకమాట అంటారు, 'ఏదైనా హృదయపూర్వకంగా చేస్తే, అది వృధా పోదు' అని. అది సత్యం. 2016లో నేను మళ్లీ ప్రెగ్నెంట్ అయ్యాను. ఈసారి నేను సాయి చేయి గట్టిగా పట్టుకున్నాను. ప్రతిరోజూ నేను, "బాబా! ఈసారి మా సంతోషాన్ని దూరం కానివ్వకండి, ఆడబిడ్డయినా, మగబిడ్డయినా పరవాలేదు, మీకు నచ్చిన బిడ్డని ఇవ్వండి" అని ప్రార్థించి ఊదీ నా నుదుటిపై పెట్టుకుని, కొంత నా కడుపుపై  రాసుకునేదాన్ని. ప్రతిరోజూ ప్రతిక్షణం 'ఓం సాయిరామ్' అని స్మరిస్తూ ఉండేదాన్ని. చివరికి తల్లిలాంటి నా సాయి నన్ను తల్లిని చేశారు. సిజేరియన్ ద్వారా నేను ఒక ఆడపిల్లకు జన్మనిచ్చాను. ఆపరేషన్ జరుగుతున్నంతసేపు నేను సాయిని స్మరిస్తూనే ఉన్నాను. సిజేరియన్ జరిగినప్పటికీ, తల్లినయ్యాను అన్న సంతోషం ముందు నాకు నొప్పి, బాధ తెలియలేదు. నేను ఆపరేషన్ థియేటర్ నుండి బయటకు వస్తూనే నా భర్త నవ్వు ముఖాన్ని చూడాలనుకున్నాను. కానీ అలా జరగలేదు. రెండు, మూడురోజులు ఆయన రాకకోసం నేను ఎంతో ఎదురుచూశాను. తర్వాత తెలిసిందేమిటంటే, నా భర్త మగబిడ్డ కావాలనుకున్నారని. ఆడపిల్ల పుట్టడంతో ఆయన ముఖం చాటేశారు. అది తెలిసి నేను చాలా బాధపడ్డాను. అయితే బాబా కృపవలన కాలం గడుస్తున్నకొద్దీ మా పాప నా భర్త హృదయంలో స్థానాన్ని సంపాదించుకుంది. నిజం చెప్పాలంటే ఆడపిల్ల అందరి హృదయాలలో స్థానం గెలుచుకుంటుంది. ఆ కాలమంతా నేను బాబా గురించి ఆలోచిస్తూ ఉండేదాన్ని.

2017, డిసెంబరులో మా పాపకి febrile seizures (ఎటువంటి అనారోగ్య సూచనలు కనబడకుండానే శరీరంలో అధిక ఉష్ణోగ్రత ఉంటుంది. అది కొద్దికాలమే ఉంటుంది) ఎటాక్ అయ్యింది. తన పరిస్థితి చూసి నేను నిశ్చేష్టురాలినయ్యాను. వెంటనే, "బాబా! ఈ బిడ్డను మీరే ఇచ్చారు, తనని మీరే కాపాడాలి" అని ప్రార్థించాను. తరువాత బాబా స్మరణ చేసుకుంటూ తనను తీసుకుని వెళ్లి హాస్పిటల్లో అడ్మిట్ చేశాను. అప్పుడు మావారికి ఫోన్ చేసి చెప్పగా, ఆయన వెంటనే హాస్పిటల్‌కి చేరుకున్నారు. పాపను చూస్తూ ఇద్దరమూ చాలా ఏడ్చాము. నేను, "బాబా! నా బిడ్డకు నయం చేయండి. నేను 9 గురువారాలు ఉపవాసం ఉండి, నా బిడ్డ చేతులతో తాకించి ప్రసాదాన్ని పంపిణీ చేస్తాను" అని మొక్కుకున్నాను. బాబా కృపతో మరుసటిరోజుకి తను పూర్తిగా కోలుకుంది. 

ఆ తర్వాత ఒకసారి మరుసటిరోజు తన పుట్టినరోజనగా హఠాత్తుగా తనకి తీవ్రమైన జ్వరం వచ్చింది. నేను భయంతో బాబాను ప్రార్థించాను. బాబా దయతో జ్వరం త్వరగానే తగ్గిపోయింది. "థాంక్యూ సో మచ్ బాబా! కష్టకాలంలో మా కుటుంబానికి తోడుగా ఉండి, జాగ్రత్తగా చూసుకుంటున్నారు".

కొన్నాళ్ళకి ఒకరోజు ఒక సిల్లీ విషయంలో నేను, నా భర్త వాదించుకున్నాము. ఆ వాదన శృతిమించి తీవ్రస్థాయికి చేరుకుంది. ఆ కోపంలో ఆయన, "నాకు మగబిడ్డ కావాలి, కానీ నా తలరాత నాకు సహాయపడకుంది" అని అన్నారు. దాంతో నాకు చాలా బాధగా అనిపించింది. అప్పటినుండి నేను బాబా గుడికి వెళ్లిన ప్రతిసారీ నా భర్త కోరికను బాబాకు చెప్పుకుని, ఆయన కోరికను నెరవేర్చమని బాబాను ప్రార్థిస్తూ ఉండేదాన్ని. హఠాత్తుగా ఒకరోజు నేను ప్రెగ్నెంట్ అని నిర్ధారణ అయింది. నేను ఆ విషయం నా భర్తతో సంతోషంగా చెప్పాను. కానీ మళ్లీ నాకు నిరాశే ఎదురైంది. ఆయన, "నాకు ఇద్దరు బిడ్డలు కావాలి. మన తలరాత బాగుంటే, అది నిజమవుతుంది" అన్నారు. కానీ నేను మాత్రం ప్రతిరోజూ, ప్రతిక్షణం నాకు కేవలం మగబిడ్డ కావాలన్న కోరికతో, "బాబా! నా కూతురికి ఒక తమ్ముడినివ్వండి. నా భర్త కోరిక నెరవేర్చండి" అంటూ ప్రార్థిస్తూ ఉండేదాన్ని. రోజులు గడుస్తూ సిజేరియన్ చేయాల్సిన రోజు వచ్చింది. ఆ ముందురోజు రాత్రి నేనస్సలు నిద్రపోలేదు. "బాబా! మీరు నాతో ఉండండి. దయచేసి నా చేయి విడిచిపెట్టకండి" అని ఏడుస్తూ బాబాను ప్రార్థించాను. బాబా నాకంటే ముందే ఆపరేషన్ థియేటర్‌కి చేరుకున్నారు. ఆపరేషన్ థియేటర్లోకి తీసుకుని వెళ్ళాక అక్కడ గోడకున్న బాబా క్యాలెండరును చూసి నా మనసుకు ధైర్యం వచ్చింది. ఉదయం 11 గంటలకి ఆపరేషన్ మొదలైంది. నేను శుభవార్త కోసం ఎదురుచూస్తూ ఉండగా, డాక్టర్, "గరిమా! నీ కోరిక నెరవేరింది, నీవు ఒక మగబిడ్డకు జన్మనిచ్చావు" అని చెప్పింది. నేను ఆనందంతో, "థాంక్యూ బాబా! నా కోరిక నెరవేర్చారు" అని చెప్పుకున్నాను. నా భర్త కూడా చాలా సంతోషించారు. "బాబా! మీరు నన్ను ఆశీర్వదించినట్లే, అందర్నీ ఆశీర్వదించండి. ఎప్పుడూ నాకు తోడుగా ఉండండి. నన్నెప్పుడూ విడిచిపెట్టకండి. నేను చెడుమార్గంలోకి వెళ్లకుండా చూడండి. అహంభావానికి లోనుకాకుండా నన్ను కాపాడండి. నేను తెలిసీ తెలియక ఏవైనా తప్పులు చేస్తే దయచేసి నన్ను క్షమించండి. థాంక్యూ బాబా!"

సర్వం శ్రీ సాయినాథార్పణమస్తు!

source: https://www.shirdisaibabaexperiences.org/2019/05/shirdi-sai-baba-miracles-part-2374.html

సాయి అనుగ్రహసుమాలు - 48వ భాగం.


కాకాసాహెబ్ దీక్షిత్ డైరీ - 48వ భాగం.

శ్రీ హరిసీతారామ్ దీక్షిత్ గారు వ్రాసి ఉంచిన అనుభవాలు.

అనుభవం - 88

నా యొక్క తొమ్మిదవ (లేదా) పదవ శిరిడీ యాత్రలో క్రింది విధంగా ఒక లీల జరిగింది. నేను టాంగాలో వెళూతూ ఉండగా ఒక స్త్రీ జామపండ్ల బుట్టను తల మీద పెట్టుకుని వెళుతోంది. అప్పుడు టాంగావాలా "బాబా కోసం జామపండు తీసుకుంటారా?” అని అడిగాడు. నేను ఆ పండ్ల బుట్టనంతా కొని టాంగాలో పెట్టించాను. జామకాయలు చాలా బాగున్నాయి. ఎంతో మంచి కమ్మటి వాసన రాసాగింది. నాకు కూడా వాటిని తినాలనిపించి నోటిలో నీళ్ళూరసాగాయి. వెంటనే మనసులో నాకు “బాబా నా మనసులో అలా ఎందుకనిపిస్తుంది” అని అనిపించింది. వెంటనే ఆశ్చర్యకరంగా ఆ జామపండ్ల నుండి కమ్మటి వాసన రావడం ఆగిపోయింది. జామపండ్ల బుట్ట మా వద్ద ఉందనే విషయం కూడా మరచిపోయాము.

అనుభవం - 89

మాధవరావు దేశ్ పాండేను ఒకసారి పాము కరచింది. అక్కడ ఒక విఠోబా స్థానం ఉంది. పాము కరచిన వారిని అక్కడికి తీసుకువెళితే, వారు బాగవుతారని వారి విశ్వాసము మరియు అనుభవం. అందువలన అందరూ తనను అక్కడికి  వెళ్ళమని చెప్పారు. అప్పుడు మాధవరావు “బాబా ఎలా ఆజ్ఞాపిస్తే అలా చేద్దాము” అని సమాధానమిచ్చారు. అప్పుడు బాబా వద్దకు వెళ్ళారు. మాధవరావు క్రింద ఉండగానే బాబా “పైకెక్కవద్దు” అని ఆజ్ఞాపించారు. మాధవరావు బాబా తననే ఆజ్ఞాపిస్తున్నారనుకుని ద్వారకామాయి మెట్లు ఎక్కలేదు. కానీ బాబా “పైకెక్కవద్దు” అని అన్నది పాము యొక్క విషాన్ని అని అనిపిస్తుంది. కారణం బాబా ఆ మాట అన్నప్పటినుండి విషం పైకెక్కడం ఆగిపోయింది. తరువాత మాధవరావు బాబా కృప వలన ఏవిధమైన ఔషధోపచారం లేకుండా పూర్తిగా కోలుకున్నాడు. ఈ విషయానికి సంబంధించి తనకు సరిగ్గా ఇలాగే జరుగుతుందనే దృష్టాంతం తనకు ఒక సంవత్సరం ముందే వచ్చింది.

అనుభవం - 90

ఒకసారి నేను శిరిడీలో ఉండగా నా స్నేహితులు ఒకరికి డబ్బు సమస్య వచ్చింది. ఆ సమయంలో నా వద్ద కూడా డబ్బులు లేవు. కానీ మనసులో “డబ్బులు వస్తే నా స్నేహితునికి కొంచెమైనా సహాయపడాలి” అని అనిపించింది. కానీ నా స్నేహితుడు నా సహాయాన్ని స్వీకరిస్తాడా, లేదా అనే సందేహం నాకు కలిగింది. నామనసులోని ఆలోచనను నేను ఎవరికీ చెప్పలేదు. డబ్బులు వచ్చాక ఒక నోటును కవరులో ఉంచి, దాంతో పాటుగా ఒక ఉత్తరం ఉంచి నా స్నేహితునికి పంపాలని నిర్ణయించుకున్నాను. కానీ బాబా ఆజ్ఞ లేకుండా ఎవరికీ డబ్బులు ఇవ్వకూడదనే నిబంధన బాబా పెట్టారు. అందువలన బాబా అనుమతి కోసమై వెళ్ళాను. కానీ బాబా వద్ద చాలా మంది ఉన్నారు. అందరి ముందు స్పష్టంగా అడిగే విషయం కాదు కాబట్టి, నేను మామూలుగా “బాబా ఈ కవరును  పంపించమంటారా?” అని అడిగాను. బాబా “సరే” అన్నారు. నేను ఆ ప్రకారమే నా స్నేహితునికి ఆ కవరు పంపించాను. సాయంకాలం ఆ స్నేహితుడు కలసి "మీ" కవర్ రావడానికి రెండు గంటల ముందు బాబా నా భార్యతో “నేను ఈ రోజు మీ ఇంటికి వస్తున్నాను, నన్ను తిరస్కరించవద్దని మీ ఆయనకు చెప్పు" అని చెప్పారు. అంటే మీరు ఆ కవరు పంపిస్తారని బాబా ముందే ఆ విధంగా సూచించడంతో  నాకు మీ సహాయం తీసుకో బుద్ధి పుట్టింది” అని నాతో అన్నారు.

(ఈ లీలలో కాకాసాబ్ "నా స్నేహితుడు " అని ప్రస్తావించింది భక్త మహల్సాపతి గురించి)

తరువాయి భాగం రేపు

సోర్సు : సాయిభక్త శ్రీకాకాసాహెబ్ దీక్షిత్ డైరీ by విజయ్ కిషోర్.


సాయిభక్తుల అనుభవమాలిక 88వ భాగం....


ఈరోజు భాగంలో అనుభవాలు:

  1. సాయి ప్రసాదంతో నా తోటి ఉద్యోగులలో మార్పు
  2. నాకు, నా తల్లిదండ్రులకు బాబా ఇచ్చిన సంతోషం
  3. సమయానికి బాబా ఇచ్చిన మెసేజ్
  4. బాబా మనసుకు ఊరటనిచ్చారు

నా నుండి ఏమీ ఆశించకుండా బాబా నాపై చూపే ప్రేమను తోటి సాయి బంధువులతో పంచుకోకుండా అంతటి ప్రేమను నాలో నేను దాచుకోలేను. అందుకే కొన్ని కారణాల రీత్యా నా పేరు వెల్లడించలేకపోతున్నప్పటికీ నేను నా అనుభవాలను మీతో పంచుకుంటాను.  

సాయి ప్రసాదంతో నా తోటి ఉద్యోగులలో మార్పు:

ఓం సాయిరామ్! మనం బాబా ఊదీ మహిమలు ఎన్నో చూసాం. నేటికీ అవి కొనసాగుతున్నాయి. అలానే బాబా ప్రసాదానికి కూడా చాలా మహత్యం ఉందని ఇటీవల జరిగిన ఒక అనుభవం ద్వారా నేను తెలుసుకున్నాను. నేను సాఫ్ట్‌వేర్ డెవలపర్‌ని. నేను డెవలప్‌మెంట్ విభాగంలో ఉన్నప్పుడు టెస్టింగ్ విభాగంలోని వాళ్ళందరూ నాతో చక్కగా మాట్లాడేవారు. కొన్నాళ్ళకు నేను డెవలప్‌మెంట్ నుండి టెస్టింగ్‌లోకి మారాను. అప్పటినుండి వాళ్లంతా నేను వాళ్ళకి పోటీ అనుకున్నారో ఏమోగానీ నాతో సరిగా మాట్లాడటం మానేశారు. నాకై నేను వాళ్ళని పలకరించినా ఏదో ముక్తసరిగా స్పందించేవాళ్ళే గాని మాట్లాడేవాళ్ళు కాదు. వర్కులో ఏదైనా సందేహం వచ్చి వాళ్ళని అడిగినా విసుక్కుంటూ సరిగా సమాధానం చెప్పేవాళ్ళు కాదు. వాళ్ళ సహకారం లేనందున వర్క్ ప్రోగ్రెస్ అవడంలేదని నాకు చాలా ఆందోళనగా ఉండేది. మా మేనేజర్ చాలా మంచి వ్యక్తి. ఆయన వర్క్ స్టేటస్ అడిగితే ఏం చెప్పాలో తెలిసేది కాదు. అలాగని వాళ్ళ మీద మా మేనేజరుకి ఫిర్యాదు చేస్తే పరిస్థితి ఇంకా ఇబ్బందికరంగా మారిపోతుంది. అటువంటి పరిస్థితుల నడుమ ఆఫీసుకి వెళ్లాలంటేనే ఇబ్బందిగా ఉండేది. నాకు ప్రతి గురువారం ఏదైనా నైవేద్యం తయారుచేసి బాబాకు పెట్టడం అలవాటు. ఒకవారం నా సమస్యను బాబాకు చెప్పుకుని ప్రసాదాన్ని ఆఫీసుకి తీసుకుని వెళ్ళాను. బాబా "ఎవరినీ ద్వేషించవద్ద"ని చెప్తారు కదా! ఆ మాటలు దృష్టిలో పెట్టుకుని నాతో నా టెస్టింగ్ టీమ్ వాళ్ళు ఎలా నడుచుకుంటున్నా, అదేమీ పట్టించుకోకుండా వాళ్ళకి కూడా ప్రసాదం పెట్టాను. ఆశ్చర్యం! అప్పటినుండి వాళ్లలో మార్పు రావడం మొదలైంది. ఇప్పుడు వాళ్లంతా నాతో మామూలుగా మాట్లాడుతూ వర్కులో కొంచెంకొంచెంగా సహాయం చేస్తున్నారు. బాబా దయవల్ల త్వరలో పూర్తి సహకారం అందుతుందని ఆశిస్తున్నాను.

నాకు, నా తల్లిదండ్రులకు బాబా ఇచ్చిన సంతోషం:

నా పెళ్ళైన తరువాత జరిగిన గొడవల కారణంగా నా తల్లిదండ్రులు మా ఇంటికి రావడం మానేశారు. పోనీ నేను మా ఊరికి వెళదామన్నా ఇద్దరి పిల్లలతో వెళ్ళలేకపోతున్నాను. నేను నా తల్లిదండ్రుల దగ్గరకి వెళ్లడం మా అత్తగారు వాళ్ళకి నచ్చదు. ఇదే పరిస్థితి కొనసాగితే రేపు వాళ్ళకి ఏదైనా అవసరమైతే నేను వెళ్ళలేనేమో అనే దిగులు నన్నెప్పుడూ వెంటాడుతుంటుంది. అందువల్ల, "ఇలా అయితే ఎలా బాబా?" అని బాబాతో అనుకుంటూ ఉంటాను. అయితే ఈమధ్య వేసవి సెలవుల్లో మా అత్తగారు మా పిల్లల్ని తీసుకుని పనిమీద వాళ్ళ ఊరు వెళ్లి, అక్కడే ఉన్నారు. ఇప్పట్లో ఆమె వచ్చే సూచన కనపడటం లేదు. పిల్లల్లో బాబుకు 12వ తేదీ నుండి, పాపకి 19వ తేదీ నుండి స్కూల్ ప్రారంభం కానుండటంతో నేనే వెళ్లి వాళ్ళని తెచ్చుకోవాలి. నేను జూన్ మొదటివారంలో సెలవు తీసుకుని పిల్లల్ని ఇంటికి తీసుకొచ్చి, జూన్ 19 వరకు ఇంటినుండి ఆఫీసు వర్కు చేసుకుంటూ వాళ్లతో సంతోషంగా గడుపుదామని అనుకున్నాను. మా అత్తగారి ఊరు, మా అమ్మా వాళ్ళ ఊరికి దగ్గరే. కాబట్టి అమ్మావాళ్లతో కూడా రెండు రోజులు గడుపుదామని అనుకుని ముందు వాళ్ళ ఇంటికి వెళ్ళాను. తీరా అక్కడికి వెళ్ళాక తెలిసిందేమిటంటే, వాళ్ళు మా సొంత ఊరికి మారుతున్నారు అని. ఇక నేను వారంరోజుల పాటు అక్కడే ఉండి సామాను సర్దడంలో వాళ్ళకి సహాయం చేశాను. అలా అనుకోకుండా వారంరోజులు వాళ్లతో గడిపి, వాళ్ళకి సహాయపడగలిగినందుకు నాకెంతో ఆనందంగా అనిపించింది. నా తల్లిదండ్రులు కూడా చాలా సంతోషించారు. నేను ఇక్కడ, వాళ్ళు అక్కడ ఉంటూ మేము పడుతున్న బాధను చూస్తున్న బాబా సమయానికి నన్ను అక్కడికి పంపారు. "థాంక్యూ సో మచ్ బాబా!"

సమయానికి బాబా ఇచ్చిన మెసేజ్:

ఈమధ్య జరిగిన కొన్ని గొడవల కారణంగా నేను మానసికంగా చాలా కృంగిపోయాను. బాధతో ఆత్మహత్య చేసుకోవాలనిపించింది. ఎలాగైనా చనిపోవాలని నిశ్చయించుకుని నిద్రమాత్రలు కొనితెచ్చుకునేవరకు వెళ్ళాను. కానీ తొందరపడి నేనేమీ చేసుకోకుండా బాబా కాపాడారు. సాధారణంగా నాకు చిన్న చిన్న సినిమాలు(షార్ట్ ఫిలిమ్స్) చూడటం ఇష్టం ఉండదు. ఎప్పుడూ చూడలేదు కూడా. కానీ ఆరోజు ఏడ్చి ఏడ్చి, దిగులుగా కూర్చుని ఒక చిన్న సినిమా చూసాను. ఆ సినిమాలోని కథ ఆత్మహత్యలకు సంబంధించినది. నాకు ఆశ్చర్యం వేసింది. సినిమా ముగింపు ఏమిటంటే, "మీ మానాన మీరు ఆత్మహత్య చేసుకుంటే కని, పెంచి, పెద్దచేసిన తల్లిదండ్రులు ఏమైపోతారు? ఆ వయస్సులో వాళ్ళ పరిస్థితి ఏమిటి? మీమీదే ఆధారపడి ఉన్న వాళ్ళ పరిస్థితి ఏమిటి? అందువలన ఎవరో మనసును గాయపరచారని ఆత్మహత్య చేసుకోవడం సరైనది కాదు" అని. అది చూశాక నేను ఎంత పిచ్చిగా ఆలోచించానో అర్థమై నా నిర్ణయాన్ని మార్చుకున్నాను. అప్పడు నాకు సచ్చరిత్రలోని అంబాడేకర్ కథనం గుర్తుకు వచ్చింది. అక్కడ పుస్తకం ద్వారా బాబా మెసేజ్ సమయానికి అందిస్తే, ఇక్కడ నాకు సినిమా ద్వారా అందించారు. అసలు చిన్న సినిమాలే చూడని నేను ఆ సినిమా చూడటం ఇప్పటికీ ఆశ్చర్యంగానే ఉంది. "సృష్టిలో ప్రతి కదలికా బాబా సంకల్పానుసారమే జరుగుతుంది" అనడానికి ఇదే ఉదాహరణ.

బాబా మనసుకు ఊరటనిచ్చారు:

కొంతమంది సాయిభక్తుల అనుభవాల్లో, "శిరిడీలోని ద్వారకామాయిలో ఒక పిల్లి ఉంటుంది, అది మన ఒడిలో కూర్చుంటే మనకి మంచి జరుగుతుంది, అది బాబా అనుగ్రహానికి సంకేతం" అని వ్రాసారు. మా ఇంటి దగ్గర ఉన్న బాబా గుడిలో కూడా ఒక పెంపుడు పిల్లి ఉంది. చాలాసార్లు ఆ గుడికి నేను వెళ్ళాను. కానీ ఎప్పుడూ ఆ పిల్లి నా దగ్గరకి రాలేదు. మా పాప దానితో ఆడుకునేది. ఒక నెలరోజులుగా మా ఇంట్లో గొడవలతో మనసంతా బాధగా ఉంది. 2019, జూన్ 16, ఆదివారం నేను, మా పాప బాబా గుడికి వెళ్ళాము. నేను బాధతో, "సాయీ! నా పరిస్థితి నీకు తెలుసు. దయచేసి నా కర్మని తొలగించి, నాకు మనశ్శాంతిని ప్రసాదించండి" అని ఏడ్చాను. నేను దర్శనం చేసుకుని రాగానే పిల్లి వచ్చి నా ఒడిలో కూర్చుంది. చాలాసేపు అలానే ఉంది. "బాబా నా ప్రార్థన విన్నారు, త్వరలోనే నాకు మంచిరోజులు వస్తాయి" అని అనిపించింది. పోయిన సంవత్సరం ఏప్రిల్‌లో నేను శిరిడీ వెళ్లినపుడు పిల్లి కనిపిస్తుందేమో అని గమనించాను గానీ, అది నాకు కనపడలేదు. కానీ ఇప్పుడు నేను కష్టంలో ఉన్న సమయంలో బాబా ఇలా నన్ను అనుగ్రహించారు. 

సాయి అనుగ్రహసుమాలు - 47వ భాగం.


కాకాసాహెబ్ దీక్షిత్ డైరీ - 47వ భాగం.

శ్రీ హరిసీతారామ్ దీక్షిత్ గారు వ్రాసి ఉంచిన అనుభవాలు.

అనుభవం - 84

సుమారు ఆరు సంవత్సరాల క్రితం నానాసాహెబ్ చందోర్కర్ గారి కుమారుని వివాహం గ్వాలియర్లో జరిగింది. ఆ వివాహసందర్భంగా నేను అక్కడకు వెళ్ళి నేను వివాహం ముందురోజు అక్కడికి చేరుకున్నాను. నేను అక్కడికి వెళ్ళాక శ్రీ చందోర్కర్ నాతో "మనం రేపు ఉదయం శ్రీ చింతామణ్ రావు వైద్య యొక్క గురువును ఆహ్వానించడానికి వెళదాం” అని చెప్పారు. ఆ విధంగానే మరుసటి రోజు ఉదయం నానాసాహెబ్, మాధవరావు దేశపాండే మరియు నేను కలిసి బయలుదేరాము. మొదట రైలులో వెళ్లి  తరువాత ఎద్దుల బండిలో దాదాపు 5 మైళ్ళు ప్రయాణించాల్సి ఉంటుందని నానాసాహెబ్ కు తెలిసిన విషయం. స్టేషనులో దిగగానే ఒకే టాంగా ఉంది. ఆ టాంగాను మాట్లాడుకుని మేము అందులో కూర్చొన్నాము. ఎక్కడికి వెళ్ళాలి అని టాంగావాడు అడిగితే మేము విషయం చెప్పాము. “అంతదూరం నా గుఱ్ఱం రాలేదు, మీరు కిందకు దిగండి” అని ఆ టాంగావాడు చెప్పాడు. చేసేదిలేక మేము టాంగా నుండి క్రిందకు దిగాము. స్టేషను నుండి మేము వెళ్ళవలసిన దూరం 5 మైళ్ళు కాక 5 క్రోసులు అయ్యుండి, అందులోను ఏడు మైళ్ళ దారి అధ్వాన్నంగా ఉంటుందని తెలిసింది. ఇంకో టాంగా కోసం ఎంత ప్రయత్నించినా దొరకలేదు. అప్పుడు నేను నానాసాహెబ్తో “మనం తిరిగి వెళదాం, కారణం వివాహం ఈ రోజే కదా” అని చెప్పాను. “ఆయనను ఆహ్వానించమని బాబా ఆజ్ఞ. కనుక ఆయనను ఆహ్వానించకుండా నేను తిరిగి రాను. నేను లేకపోతే వివాహం ఏమీ ఆగిపోదు” అని నానాసాహెబ్ అన్నారు. అంతలో టాంగా దొరకడం వలన మేము బయలుదేరాము. దారి అధ్వాన్నంగా ఉండి గుఱ్ఱం వేగంగా వెళ్ళడానికి వీలుకాలేదు. చివరకు గమ్యస్థానం చేరాము. గురువుగారి దర్శనం అయింది. ఆయన ఊదీని తెప్పించి మా అందరికీ పంచి “ఇది హరిహరాదుల ఊదీ” అని మాతో చెప్పారు. తరువాత ఆయన మాకు సెలవు ఇచ్చారు. తిరిగి వచ్చేటప్పుడు దారి తప్పాము. ఇక రైలు దొరకడం అసాధ్యం అని మాకు అనిపించింది. కాని బాబా కృప వలన మాకు రైలు దొరికింది. అంటే పెళ్ళికి ముందే మేము గ్వాలియర్ కు చేరుకున్నాము.

అనుభవం - 85

శనివారం 28వ తారీఖు ఆఫీసుకు వెళ్ళేటప్పుడు నాకు బాగా జ్వరం వచ్చింది. - నేను మనసులో బాబాను “ఒకవేళ జ్వరం పెరిగేటట్లయితే నన్ను శిరిడికి పిలిపించండి" అని ప్రార్థించాను. ఆఫీసుకు వెళ్ళగానే శిరిడీ నుండి వచ్చిన ఉత్తరం టేబుల్ పైన ఉంది. ఆ ఉత్తరంలో నేను శిరిడీ రావడానికి బాబా అనుమతి ఉంది. ఆ రోజంతా జ్వరం ఉంది. కానీ శిరిడీలో మాత్రం జ్వరం లేదు. నేను ఏ రోజయితే  వెళ్లానో ఆ రోజు "బాబాకు జ్వరం వచ్చింది. ఆయన నాలుగు రోజులు అస్వస్థులుగా ఉన్నారు". “సుఖ్ దేవునీ భక్తాంసి, త్యాంచే దుఃఖ్ స్వయం సోషీ” (భక్తులకు సుఖం ప్రసాదించడానికి వారి కష్టాలను తాము తీసుకుంటారు).

అనుభవం - 86

నాలుగైదు సంవత్సరాలు నా ఎడమ కాలు విపరీతంగా నొప్పి పుట్టసాగింది. ఒక ఫర్లాంగు నడవడం కూడా నాకు చాలా కష్టంగా అనిపించసాగింది. అటువంటి పరిస్థితిలో నేను శిరిడీలో ఉన్నప్పుడు బాబా నీమ్ గావ్  కు వెళ్ళారని ఎవరో చెప్పారు. వెంటనే అందరితో కలిసి నేను కూడా బయలుదేరాను. అందరం ఎంతో వడివడిగా నడుస్తూ ఒకటిన్నర మైలు వెళ్ళాము. బాబాతో కలిసి మరలా తిరిగి వచ్చాము. మొత్తం కలిసి మూడు మైళ్ళు నడిచాను, కానీ ఏ మాత్రం ఇబ్బంది కలుగలేదు.

అనుభవం - 87

18-11-1918వ రోజు తెల్లవారుఝామున కాకా మహాజనికి దృష్టాంతం వచ్చింది. ఆ దృష్టాంతంలో "నిద్రపోతున్నావా ఈ రోజు నా ముప్పయ్యవరోజు. లేచి ఆ కార్యక్రమం చేయి” అని బాబా చెప్పారు. కాకా నిద్రలేచి, లెక్కించి చూస్తే సరిగ్గా బాబా మహాసమాధి చెంది ఆ రోజుకి ముప్పై రోజులు. కానీ తనకు ఏం చేయాలో ఆలోచన రాలేదు. తరువాత నన్ను భోజనానికి పిలిచాడు. సాయంత్రం ధబోల్కర్ ప్రధాన్, ఠోసర్ వగైరా మండలిని ఆహ్వానించారు. భోజనం తరువాత భజన జరిగింది. రాత్రంతా ఎంతో ఆనందంగా గడచింది.

తరువాయి భాగం రేపు

సోర్సు : సాయిభక్త శ్రీకాకాసాహెబ్ దీక్షిత్ డైరీ by విజయ్ కిషోర్.

సాయిభక్తుల అనుభవమాలిక 87వ భాగం....


ఈరోజు భాగంలో అనుభవాలు:
  1. సాయి అనుగ్రహంతో నయమైన చెవి సమస్య
  2. బాబా నుండి లభించిన భరోసా
  3. కలలో ఊదీ ప్రసాదించి మా సమస్యలు తీర్చిన బాబా

సాయి అనుగ్రహంతో నయమైన చెవి సమస్య


సద్గురు సాయినాథునికి, గురువుగారు శరత్‌బాబూజీ గారికి నా నమస్కారాలు. నా పేరు సత్య. మొదటిసారిగా నేను నా అనుభవాన్ని మీతో పంచుకోబోతున్నాను. అందుకు నాకు చాలా సంతోషంగా ఉంది. బ్లాగు నిర్వాహకులకు నా నమస్కారములు. బ్లాగులోని అనుభవాల ద్వారా బాబాకు ఇంకా ఇంకా దగ్గర అవుతున్న అనుభూతి కలుగుతుంది. 25 సంవత్సరాలుగా బాబా నన్ను సంరక్షిస్తున్నారు. 8 సంవత్సరాల నుండి నేను కష్టాలు పడుతున్నాను. అడుగడుగునా బాబా కనిపిస్తూ నన్ను ముందుకు నడిపిస్తున్నారు. 10 రోజుల క్రితం నా చెవికి ఒక సమస్య వచ్చింది. చెవినుండి చీము కారుతుంటే అశ్రద్ధ చేసి ఆలస్యంగా డాక్టరును సంప్రదించాను. ఇ.ఎన్.టి డాక్టరు కొంచెం అనుమానంగా, చెవి నరం లోపల పుండు అయినట్లుంది, ఎక్స్‌-రే తీయించమన్నారు. నాకు చాలా  భయమేసి, "ఐదు రోజులు మందులు వాడాక కూడా తగ్గకపోతే అప్పుడు ఎక్స్-రే తీయించుకుంటాను" అని చెప్పాను. తరువాత నేను బాబాని ప్రార్థించి, రోజూ మందులు వేసుకుంటూ, బాబా ఊదీ చెవికి రాసుకుంటూండేదాన్ని. బాబా కృపవలన ఐదు రోజులు పూర్తయ్యేసరికి పూర్తిగా నయమైపోయింది. నా బాబా నా భర్తను నా దగ్గరకు తీసుకుని వస్తే నా రెండవ అనుభవంతో మళ్ళీ నేను మీ ముందుకొస్తాను. సాయినాథుని ఆశీస్సులు నా మీద ఉండాలని ప్రార్థిస్తూ...


బాబా నుండి లభించిన భరోసా

సాయిబంధువు శిరీషగారు తన అనుభావన్నిలా పంచుకుంటున్నారు:

15రోజుల క్రితం నా బిడ్డ విషయంలో భరోసానిచ్చి, నన్ను ఆనందింపజేసిన బాబా లీలను నేనిప్పుడు మీతో పంచుకుంటాను. ఇది ఈ బ్లాగులో నేను పంచుకుంటున్న మూడవ అనుభవం. ముందు అనుభవంలో నా కుటుంబసభ్యులకు దేవుని మీద నమ్మకం లేదని ప్రస్తావించాను. 15 రోజుల క్రితం నేను మా అబ్బాయి, అమ్మాయితో కలిసి నా తల్లిదండ్రుల ఇంటికి వెళ్ళాను. మా అబ్బాయికి 17 సంవత్సరాల వయస్సు. ప్రయాణంలో ఉండగా నేను, "బాబా! నా కొడుకుని మీ పాదాల చెంతకు తీసుకోండి. వాడికి మీయందు విశ్వాసం కలిగేలా చేయండి. వాడిని మీ మనవడిలా భావించి సంరక్షించండి" అని ప్రార్థించాను. మరుసటిరోజు అంటే 2019, జూన్ 11న నేను మా అబ్బాయి, అమ్మాయితో కలిసి బాబా మందిరానికి వెళ్ళాను. వాళ్లిద్దరూ మందిరం లోపలికి రావటానికి ఇష్టపడక మందిరం వెలుపల కూర్చున్నారు. నేను లోపలికి వెళ్లే సమయానికి సంధ్య ఆరతి జరుగుతూ ఉంది. నేను ఆరతిలో పాల్గొన్నానే కాని నా మనసంతా విచారంగా, అలజడిగా ఉంది. ఆరతి పూర్తైన తరువాత నేను బయటికి వచ్చి మందిర ప్రవేశద్వారం వద్ద కూర్చున్నాను. పిల్లలు నా దగ్గరకు వచ్చి నా పక్కన కూర్చున్నారు. అప్పుడు మా అబ్బాయి, "ఇది ఏ మందిరం?" అని అడిగాడు. నేను, "సాయిబాబా మందిరం" అని చెప్పాను. అందుకు తను, "మరి మందిరం లోపల ఇతర దేవతల ఫోటోలు ఎందుకున్నాయి?" అని అడిగాడు. నేను, "దేవతలందరూ ఒకటే"నని చెప్పి, కారును చూడటానికి బయటికి వెళ్ళాను. అక్కడినుండి వెనక్కి తిరిగి చూసి ఆనందంలో మునిగిపోయాను. కారణమేమిటంటే, మందిర ప్రధాన ద్వారం తలుపుల మీద నిలబడివున్న పెద్ద సాయిబాబా రూపం చెక్కబడి ఉంది. మా అబ్బాయి సరిగ్గా బాబా పాదాల వద్ద కూర్చుని ఉన్నాడు. తన తలను బాబా పాదాలు తాకుతున్నాయి. నేను కోరుకున్నట్లుగా మా అబ్బాయి విషయంలో బాబా నుండి నాకు భరోసా లభించింది. "ఇంత చక్కటి  అనుభవాన్ని ఇచ్చినందుకు ధన్యవాదాలు బాబా!"

కలలో ఊదీ ప్రసాదించి మా సమస్యలు తీర్చిన బాబా

విజయనగరం నుండి సాయిబంధువు లక్ష్మీనారాయణ తమ అనుభవాన్నిలా పంచుకుంటున్నారు:

అఖిలాండకోటి బ్రహ్మాండనాయక రాజాధిరాజ యోగిరాజ పరబ్రహ్మ శ్రీ సచ్చిదానంద సద్గురు సాయినాథ్ మహరాజ్ కీ జై!

నేను సాయిభక్తుడిని. నా పేరు లక్ష్మీనారాయణ. నేను విజయనగరంలో ప్రభుత్వ ఉద్యోగిని. మాకు ఒక అమ్మాయి, ఒక అబ్బాయి. గత 4 సంవత్సరాలుగా మా అమ్మాయి వివాహం కోసం మేము చేయని ప్రయత్నమంటూ లేదు. ఏ కారణం చేతనో మా అమ్మాయి తనకు వివాహం వద్దని అంటుండేది. నేను కేవలం బాబాని మాత్రమే నమ్ముకున్నాను, ఆయనే ఏదో ఒకటి చేస్తారని. మా ఆవిడ మాత్రం తిరగని గుడిలేదు, నోచని నోము లేదు. ఎన్ని మ్రొక్కులు మ్రొక్కిందో ఆవిడకే తెలియదు. ఇలా ఉండగా ఒక సంబంధం వచ్చింది. అన్నివిధాలా మాకు నచ్చింది. ఇక ముహూర్తం పెట్టుకోవడమే తరువాయి అనుకున్న సమయంలో మగపెళ్లివాళ్ళు మా అమ్మాయి నచ్చలేదని కబురుపెట్టారు. అనుకున్న సంబంధం కాస్తా చేజారిపోయినందుకు అందరమూ బాధపడ్డాము. అదే సమయంలో మా అబ్బాయికి రావలసిన ఉద్యోగం కూడా చేజారిపోయింది. ఈ రెండు సంఘటనలు మమ్మల్ని బాగా కలచివేశాయి. 

ఆరోజు నేను బాగా కలతచెంది నిద్రపోయాక ఒక కల వచ్చింది. కలలో ఎవరో ఒక ముసలాయన తెల్లని కఫ్నీ ధరించి పని చేసుకుంటున్నారు. దగ్గరకి వెళ్ళి చూస్తే ఆయన మరెవరో కాదు, బాబానే! వెంటనే నేను కన్నీళ్ళతో, "బాబా! ఇలా జరిగిందేమిటి?" అని అడిగాను. అందుకు బాబా ఏమీ మాట్లాడకుండా ఒక కాగితంలో ఊదీ నాకిచ్చి, నవ్వుతూ వెళ్లిపోయారు. ఇది 2019 జనవరిలో జరిగింది. తరువాత రెండు నెలలు తిరిగేసరికి మా అమ్మాయికి మంచి సంబంధం కుదరడం, మే 26న పెళ్ళి జరిగిపోవడం అంతా కలలో జరిగినట్లు చకచకా జరిగిపోయాయి. అసలు పెళ్లే చేసుకోనన్న మా అమ్మాయి పెళ్లికి ఒప్పుకోవడం, కాపురానికి వెళ్లిపోవడం బాబా దయే తప్ప ఇంకేమీ కాదు. ఆయన తప్ప ఇంకెవరూ ఈ సమస్యను తీర్చలేరు. కలలో ఊదీ ప్రసాదించి బాబా మా సమస్యలు తీర్చేశారు. ఆ కరుణామూర్తికి ఏ విధంగా కృతజ్ఞతలు చెప్పుకోగలం, జీవితాంతం ఆయన పాదాలు విడువనని చెప్పగలగడం తప్ప!?

సద్గురు సాయినాథ్ మహరాజ్ కీ జై!

సాయి అనుగ్రహసుమాలు - 46వ భాగం.


కాకాసాహెబ్ దీక్షిత్ డైరీ - 46వ భాగం.

శ్రీ హరిసీతారామ్ దీక్షిత్ గారు వ్రాసి ఉంచిన అనుభవాలు.

అనుభవం - 78

ఒకసారి మన్మాడ్ స్టేషన్లో కోపర్గాంకు వెళ్ళే రైలులో కూర్చొన్నాను. నేను డబ్బాలోకి ఎక్కి కొన్ని ఉత్తరాలు వ్రాస్తున్నాను. ఇంతలో ముగ్గురు సైనికులు ఆ పెట్టెలో ఎక్కారు. వారు నాతో “వెళ్ళి, వేరే పెట్టెలో కూర్చోండి” అని అన్నారు. “వేరే డబ్బాలోకి వెళ్ళను, నేను ఇక్కడే కూర్చొంటాను” అని చెప్పాను. “మిమ్మల్ని ఇక్కడ కూర్చోనివ్వము” అని అన్నారు. ఇంతలో నేను వ్రాస్తున్న ఉత్తరాలు పూర్తయి, వాటిని పోస్టుడబ్బాలో వేయడానికి వెళ్ళాను. వెళ్ళేటప్పుడు మనసులో బాబాతో “ఈ రోజు వారితో నేను గొడవ పెట్టుకోవాలనేదే మీ కోరిక అయితే అలాగే కానివ్వండి. మీ ఇష్టం” అని చెప్పుకుని, డబ్బాలో ఉత్తరాలను వేసి తిరిగి వచ్చేటప్పటికి ఆ సైనికులు తమ సామానును దించుకుని వేరే డబ్బాలోనికి వెళుతున్నారు. నేను ఒక్కడినే ఆ డబ్బాలో ప్రయాణించాను. ఆ విధంగా బాబా జరుగబోయే గొడవను తప్పించారు.

అనుభవం - 79

ఒకసారి సాయంకాలం ఆఫీసు నుండి క్రిందకు వచ్చి, రోడ్డు పైకి రాగానే ఒక యువకుడైన భిక్షకుడు నా వద్దకు వచ్చాడు. నవ్వుతూ, నవ్వుతూ నన్ను డబ్బులు అడుగ సాగాడు. తనను చూసి నాకు ఒక రకమైన పూజ్యభావం ఏర్పడి, తనకు డబ్బులు ఇచ్చాను. ఆ డబ్బులు తీసుకొని వెంటనే వెళ్ళిపోయాడు. తాను కనిపించకుండా పోయేంత వరకు నేను చూస్తూనే ఉన్నాను. తాను ఇంకెవరినీ డబ్బులు అడుగలేదు. అదే రోజు నేను శిరిడి వెళ్ళాను. అక్కడకు వెళ్ళిన తరువాత బాబా వద్దకు వెళ్ళి “మీరు బిక్షువు రూపంలో వచ్చారా?” అని అడిగాను. అందుకు బాబా “అవును. నేనే" అని సమాధానమిచ్చారు.

అనుభవం - 80

కొన్ని రోజుల క్రితం శ్రీమతి జోగ్ కళ్ళకు వ్యాధి వచ్చింది. ఆ వ్యాధి రోజు రోజుకూ పెరగసాగింది. తాను ఇంటి వైద్యం చాలా చేసింది. కానీ ఎటువంటి ఉపయోగం కనపడలేదు. అప్పుడు ఆమె బాబాను ప్రార్థించింది. బాబా ఆమెకు ఒక ఔషధం చెప్పారు. ఆ ఔషధం ఎంతో సులభమైనది. “ఆ ఔషధాన్ని ఎవరికీ చెప్పకు మరియు ఏ వ్యాధిగ్రస్త కళ్ళలోనూ వేయకు” అని బాబా స్పష్టంగా ఆదేశించారు.

అనుభవం - 81

నా పినకుమారుడు చి. మాధవ్ కొన్ని రోజులు ఖడ్కీ గ్రామంలో రనడే గారింట్లో ఉన్నాడు. అక్కడ ఉండేటప్పుడు తాను అనారోగ్యానికి గురయ్యాడు. శ్రీ రనడే గారి కుటుంబసభ్యులు తనను ఉత్తమరీతిలో చూసుకున్నారు. కానీ తన కుటుంబసభ్యులు ఎవరూ లేకపోవడం వలన సహజంగానే తాను దిగులుపడ్డాడు. అప్పుడు బాబా తనకు దర్శనమిచ్చి “నీవు ఆందోళన చెందవద్దు. నేను నీ వద్దనే ఉన్నాను. నీవు తొందరలోనే కోలుకుంటావు” అని అభయమిచ్చారు. ఆ విధంగానే తాను ఆరోగ్యవంతుడయ్యాడు.

అనుభవం - 82

|శ్రీ రఘువీర్ భాస్కర్ పురంధరే గారు బాబాను ప్రథమంగా దర్శించుకోవాలని నిర్ణయించుకున్నారు. అప్పుడు వారి తల్లి గారిని ఊరినుండి పిలిపించారు. బయలుదేరే ముందు రోజు రాత్రి పురంధరే కూతురుకి విపరీతమైన జ్వరం వచ్చింది. అప్పుడు పురంధరే గారి తల్లి ప్రయాణం చేసేందుకు కొంచెం తటపటాయించింది. కానీ పురంధరే మాత్రం తన ప్రయాణంలో ఎటువంటి మార్పు చేయలేదు. శిరిడీకి వెళ్ళిన తరువాత మూడవరోజు బాబా, శ్రీమతి పురంధరేకు స్వప్నదర్శనం ప్రసాదించారు. ఆ స్వప్నంలో అనారోగ్యంతో బాధ పడుతున్న పురంధరే కూతురికి ఊదీ పెట్టారు. అప్పటినుండి ఆ అమ్మాయి ఆరోగ్యం కుదుటపడసాగింది.

అనుభవం - 83

శ్రీ దామోదర్ బాబరే ఉరఫ్ అణా సాహెబ్ చింఛణీకర్ శిరిడీలో ఉన్నపుడు, ఆయన భార్య చింఛణీలోనే ఉన్నారు. అక్కడ ప్లేగు వ్యాపించి, గ్రామస్తులంతా గ్రామం నుండి బయటకు వెళ్ళిపోయారు. శ్రీమతి బాబరే ఒక్కరే ఉండిపోయి చాలా భయపడసాగారు. అప్పుడు బాబా ఆమెకు జాగృదవస్థలో ప్రత్యక్షదర్శనం ప్రసాదించారు. ప్లేగు అంతరించి, గ్రామస్తులు తిరిగి వచ్చేవరకు బాబా పది, పన్నెండు సార్లు అదే  విధంగా ప్రత్యక్షదర్శనాన్ని ప్రసాదించారు.

తరువాయి భాగం రేపు

సోర్సు : సాయిభక్త శ్రీకాకాసాహెబ్ దీక్షిత్ డైరీ by విజయ్ కిషోర్.


సాయిభక్తుల అనుభవమాలిక 86వ భాగం....


ఈరోజు భాగంలో అనుభవాలు:

  1. అడిగినంతనే కోరిక నెరవేర్చిన సాయి
  2. చాలా పెద్ద ఆపద నుండి బాబా నా బిడ్డను కాపాడారు
  3. బాబా మమ్మల్ని మరువక తిరిగి తమ చెంతకు చేర్చుకున్నారు

అడిగినంతనే కోరిక నెరవేర్చిన సాయి

నా పేరు దేవిశ్రీ. మాది విశాఖపట్టణం. నాకు సాయిబాబా అంటే చాలా నమ్మకం. 2019, జూన్ 25న జరిగిన ఒక అనుభవాన్ని సాయిబంధువులందరితో పంచుకోవాలనుకుంటున్నాను. ఆ ముందురోజు రాత్రి నా డిగ్రీ ఫలితాలు వెలువడ్డాయి. అయితే ఆ రాత్రంతా వెబ్‌సైట్ ఓపెన్ కాలేదు. ఉదయాన లేచి మళ్లీ ప్రయత్నించాను. కానీ ఎన్నిసార్లు ప్రయత్నించినా వెబ్‌సైట్ ఓపెన్ కాలేదు. ఇక నేను బాబాను తలచుకుని, "5 నిమిషాల్లో వెబ్‌సైట్ ఓపెన్ అయితే బ్లాగులో నా అనుభవాన్ని పంచుకుంటాన"ని అనుకున్నాను. అలా అనుకున్న 3 నిమిషాల్లో వెబ్‌సైట్ ఓపెన్ అవడం నాకు చాలా చాలా ఆనందాన్నిచ్చింది. ఈ అనుభవంతో బాబాపట్ల నా నమ్మకం ఇంకా ఎక్కువైంది. "థాంక్యూ వెరీ మచ్ బాబా! మీరు ఎప్పుడూ ఇలాగే మాకు అండగా ఉండాలని నా కోరిక".

ఓం శ్రీ సాయినాథాయ నమః!

చాలా పెద్ద ఆపద నుండి బాబా నా బిడ్డను కాపాడారు

తాడిపత్రిలో వుంటున్న జ్యోతిగారి అబ్బాయిని పెద్ద ప్రమాదం నుండి బాబా కాపాడారు. ఆమె ఆ అనుభవాన్నిలా పంచుకుంటున్నారు: 

మా అబ్బాయి పేరు జయ సాయి. 2019, జూన్ 25 మధ్యాహ్నం తను ఏదో పని ఉండి బండి మీద బయటకు వెళ్ళాడు. ఒక బిల్డింగ్ ముందునుండి వెళ్తుండగా హఠాత్తుగా వెనుకనుండి బండిని ఎవరో తోసినట్టు బండి వేగంగా ముందుకు పోయింది. అసలే భయస్తుడైన వాడు బండి చాలా నిదానంగా నడుపుతాడు. అలాంటిది ఒక్కసారిగా అలా జరిగేసరికి భయంతో కంగారుగా సడెన్ బ్రేక్ వేశాడు. అప్పటికే వేగంలో ఉన్న బండి కొంచెం ముందుకుపోయి ఆగింది. ఆ షాక్ నుండి కోలుకోకముందే కొన్ని అడుగుల దూరంలో ఉన్న ఆ బిల్డింగ్ పైభాగం ఉన్నట్టుండి క్రింద పడిపోయింది. దాంతోపాటే ఒక వ్యక్తి కూడా క్రింద పడిపోయాడు. అతనికి ఎలా ఉందో తెలియదుగానీ ఒక్కక్షణం ఆలస్యమై ఉంటే జరిగేదాన్ని ఊహించలేను. అక్కడ జనం ఎవరూ లేరు. అలాంటిది వెనుకనుండి ఎవరు తోస్తారు? బాబానే బండిని ముందుకు తోసి నా బిడ్డను కాపాడారు. ఎంతటి శ్రద్ధతో ఆయన మనలను కనిపెట్టుకుని ఉంటారో అని చెప్పడానికి ఇది ఒక నిదర్శనం. "ఓ సాయీ! మీ కరుణ అపారమైనది. ఇంత ప్రేమను కురిపించే మీకు మేము ఏం చేయగలం? మీరు మాపై చూపే ప్రేమను వర్ణించడానికి మాటలు రావడం లేదు. చాలా చాలా ధన్యవాదాలు బాబా! ప్రమాదానికి గురైన ఆ వ్యక్తిపై కూడా మీ కరుణను చూపండి". అందరికీ బాబా ఆశీస్సులు సదా ఉండాలని కోరుకుంటూ....

బాబా మమ్మల్ని మరువక తిరిగి తమ చెంతకు చేర్చుకున్నారు

సాయిభక్తులందరికీ సాయిరామ్!

నా పేరు మంజుభాషిణి. మేము చెన్నైలో నివసిస్తున్నాము. నాకు జరిగిన ఒక అనుభవాన్ని మీ అందరితో పంచుకోవాలని ఈ బాబా లీల వ్రాస్తున్నాను. పది సంవత్సరాల క్రిందట నాకు సాయిబాబా ఎవరో తెలీదు. ఆయన చేసే లీలలు కూడా తెలీదు. అలాంటి నన్ను తనవైపు ఎలా బాబా లాక్కున్నారో ఈ లీల చదివితే మీకు అర్థం అవుతుంది. పది సంవత్సరాల క్రిందట నేను, మావారు మైలాపూరులో ఉన్న సాయిబాబా మందిరానికి వెళ్ళాము. నేనైతే అక్కడ మంచి పొంగలి ప్రసాదంగా పెడతారని విని, కేవలం పొంగలి కోసమే అక్కడికి వెళ్ళాను. బాబా దర్శనం చేసుకున్నాక పొంగలి తీసుకుని బయటికి వస్తున్నాము. అంతలో ఏదో ఒక అద్వితీయమైన ఆకర్షణ, మరేవో దైవసంబంధమైన తరంగాలు నన్ను తిరిగి మందిరం లోపలికి లాగుతున్నట్లుగా అనిపించి, వెనక్కు వెళ్లి చూసాను. అక్కడ ఒక చిన్న దుకాణం ఉంది. అందులో ఒక చిన్న బాబా విగ్రహంపై నా దృష్టి పడింది. అదెంతో అందంగా, ఆకర్షణీయంగా ఉంది. నా మనసుకెంతో నచ్చి దాని వెల ఎంతని అడిగితే, 20 రూపాయలని చెప్పారు. నేను దాన్ని కొనుగోలు చేద్దామనుకుంటే మావారు "వద్దు" అనేశారు. మనసునిండా దుఃఖంతో ఇంటికి వచ్చాను.

మరుసటిరోజు 3 కిలోమీటర్ల దూరంలో ఉన్న మా అమ్మా వాళ్ళ ఇంటికి వెళ్ళాను. ఆశ్చర్యం! నేను ముచ్చటపడిన అదే బాబా విగ్రహం మా అమ్మా వాళ్ళ ఇంట్లో ఫ్రిడ్జ్ పైన ఉంది. నిజానికి అమ్మా వాళ్ళు రాఘవేంద్రస్వామి భక్తులు. వాళ్ళసలు బాబాను పూజించరు. నేను అమ్మతో, "ఈ విగ్రహం నీ దగ్గరకు ఎలా వచ్చింది?" అని అడిగాను. అందుకు అమ్మ చెప్పింది విని ఆశ్చర్యపోయాను. అమ్మ, "నిన్న సాయంత్రం నేను నిమ్మకాయ ఊరగాయ పెట్టడం కోసం నిమ్మకాయలు కొందామని బజారుకు వెళ్ళాను. ఆ దుకాణం వాడు నాకు 20 రూపాయలు ఇవ్వాల్సి ఉంది. నేను, "ఆ డబ్బులకు బదులు నిమ్మకాయలివ్వు" అన్నాను. అందుకు వాడు, "నిమ్మకాయలు కాదు, ఈ బాబా విగ్రహాన్ని తీసుకువెళ్ళి మీ పెద్దమ్మాయికి ఇవ్వు" అన్నాడు. తప్పనిసరై నేను విగ్రహాన్ని తెచ్చి ఇంట్లో పెట్టాను" అని చెప్పింది. నా మనసులో ఇలా అనుకున్నాను: "నిన్న మందిరం దగ్గర నిమ్మకాయల దుకాణం అతను లేడు. నేను, మావారు మాత్రమే ఉన్నాము. మరి ఇతనికి ఈ బాబా విగ్రహం నాకు నచ్చిందని ఎలా తెలిసింది?" అని. ఏదేమైనా ఆనందంతో బాబా విగ్రహాన్ని మా ఇంటికి తీసుకుని వెళ్ళాను. మా పూజగదిలోకి వచ్చిన మొదటి బాబా విగ్రహం అది. ఆరోజునుంచి ప్రతిక్షణం ఒక లీల జరుగుతోంది. మేమంతా బాబా భక్తులమయ్యాము.

మరో ఆసక్తికర విషయం చెప్పనా!? నేను మరాఠీ అమ్మాయిని. మా తాత, అమ్మమ్మా వాళ్ళు ఆ కాలంలో శిరిడీలో ఉండేవాళ్ళు. కాలక్రమంలో బాబాను మేము మర్చిపోయినా, ఆయన మమ్మల్ని మరువక తిరిగి తమ చెంతకు చేర్చుకున్నారు. అది ఆయన దైవత్వం. ఎక్కడా దొరకని, కనీవినీ ఎరుగని అద్భుతమైన దైవం ఆ సాయినాథుడు. మనం ఎంతో అదృష్టవంతులం, ఆయన పాదాల చెంతకు చేరుకున్నాము.
   
సర్వం శ్రీ సాయినాథార్పణమస్తు!

సేకరణ: శ్రీమతి టి.వి. మాధవి.

సాయి అనుగ్రహసుమాలు - 45వ భాగం.


 కాకాసాహెబ్ దీక్షిత్ డైరీ - 45వ భాగం.

శ్రీ హరిసీతారామ్ దీక్షిత్ గారు వ్రాసి ఉంచిన అనుభవాలు.

అనుభవం - 75

తాత్యాసాహెబ్ నూల్కర్ గారి స్నేహితుడు అయిన డా. పండిత్ అనే పేరు కలిగిన వ్యక్తి ఒకసారి బాబా దర్శనానికై వచ్చాడు. దర్శనం అయిపోయిన తరువాత బాబా తనను దాదా కేల్కర్ వద్దకు వెళ్ళమని చెప్పారు. తనకు దాదాసాహెబ్ యొక్క ఇల్లు తెలియదు. తాను ఎలా వెళ్ళాలో బాబా చెప్పారు. ఆ విధంగానే డాక్టర్ పండిట్ దాదాకేల్కర్ వద్దకు వెళ్ళాడు. దాదాకేల్కర్ తనకు సాదరంగా ఆహ్వానం పలికాడు. తరువాత కొంచెం సేపటికి దాదాకేల్కర్ బాబా పూజ కోసమై బయలుదేరాడు. బయలుదేరేముందు తాను డాక్టర్ సాహెబ్ తో  “బాబా వద్దకు వస్తావా?” అని అడిగారు. డాక్టరు వెంటనే బయలుదేరారు. ద్వారకామాయికి వెళ్ళాక డాక్టరు కూడా బాబా పూజ చేసుకున్నారు. సహజంగా బాబా ఎవరినీ తమ నుదిటి పై గంధం పూయనివ్వరు. అందరూ కేవలం బాబా చరణాలకు మాత్రమే గంధం పూసేవారు. మహల్సా మాత్రమే బాబా కంఠానికి గంధం పూసేవారు. దాదాకేల్కర్ పూజ పూర్తి కాగానే  డాక్టరు లేచి గంధపు గిన్నె తీసుకొని బాబా నుదిటి పై త్రిపుండ్రాన్ని పూసారు. కోప్పడతారని దాదాకేల్కర్ భయపడ్డాడు. కానీ బాబా ఏమీ మాట్లాడలేదు మరియు  డాక్టరును ప్రశాంతంగా నుదిటి పై గంధాన్ని పూయనిచ్చారు. ఆ రోజు సాయంకాలం  దాదా కేల్కర్ బాబాను “మీరు మమ్మల్ని ఎవరినీ నుదిటి పై గంధం పూయనివ్వరు. కానీ ఈ రోజు మధ్యాహ్నం డాక్టరుచే పూయించుకున్నారు. అదెలా?” అని అడిగాడు అప్పుడు బాబా “అరే! తన గురువు బ్రాహ్మణుడు. తాను నన్ను తన గురువని అనుకున్నందు వలన గంధం పూసాడు. అందువలన తనను ఆపడానికి మనసు రాలేదు” అని చెప్పారు. డాక్టరును దాదాకేల్కర్ తరువాత విచారిస్తే, డాక్టర్ యొక్క గురువు కౌపేశ్వరానికి చెందిన కాకామహారాజ్ అని తెలిసింది.

అనుభవం - 76

శిరిడీలో లక్ష్మణ్ భట్ అనే పేరు కలిగిన బ్రాహ్మణుడు ఉండేవాడు. ఆయన వద్ద నుండి నేను కొంత భూమిని 1910 లో ఖరీదు చేసాను. తను రూ.200/- ధర అడగసాగాడు. నేను రూ. 150/- కంటే ఎక్కువ ఇవ్వడానికి సిద్దంగాలేను. ఆ విధంగా బేరం సాగుతుండగా లక్ష్మణ్ భట్ ద్వారకామాయి దారిలో వెళుతున్నపుడు బాబా తనను పిలిచి “ఏమిటి సంగతి?” అని అడిగారు. లక్ష్మణ్ భట్ జరిగిన విషయాన్నంతా చెప్పాడు. అప్పుడు బాబా “ఇద్దరిది కాదు కానీ, రూ.175/- లకు భూమి ఇచ్చేయ్. కానీ అంతకంటే తక్కువకు ఇవ్వవద్దు” అని చెప్పారు. కానీ లక్ష్మణ్ భట్ ఆ విషయం మాకు చెప్పలేదు. చివరకు రూ. 150/- లకు బేరం కుదిరింది. ఆ విధంగానే రిజిస్టర్ ముందర రూ. 150/- ను మేము ఇచ్చాము. కానీ గొప్ప చమత్కారమేమంటే ఇంటికి రాగానే లక్ష్మణ్ భట్ ఆ డబ్బులను లెక్కపెడితే సరిగ్గా రూ.175/- ఉన్నాయి.

అనుభవం - 77

1915 సంవత్సరం ఆఖరులో శ్రీ బాపుసాహెబ్ బూటీ గారికి విషజ్వరం వచ్చింది. సుమారు ఒక నెల రోజులు విపరీతంగా బాధపడ్డారు. మూడు వారాల పాటు జ్వరం 103 నుండి 105 వరకు ఉండేది. లేవడానికి, కూర్చోవడానికి కూడా  తన వద్ద శక్తి లేకుండా పోయింది. అటువంటి స్థితిలో కూడా బాపుసాహెబ్ ద్వారకామాయికి తీసుకురమ్మని బాబా చెప్పేవారు. ద్వారకామాయికి వచ్చాక బాపూసాహెబ్ కు శిరా, పాయసం, శనగలతో చేసిన కూర వంటి వాటిని తినిపించి  మరలా వాడాకు పంపించేవారు. బాపూసాహెబ్ ను శ్రీ మాధవరావ్ దేశపాండే లేదా ఇంకెవరైనా వీపుపై ఎక్కించికొని బాబా వద్దకు తీసుకు వచ్చేవారు. కానీ ఆయనకు ఇంక ఏ విదమైనటువంటి ఔషధోపచారాలు లేవు. బాబా దయవలన మరియు బాబా ఊదీ వలన మెల్ల మెల్లగా కోలుకోసాగారు. ఆ రోజులలోనే బాబా కూడా అస్వస్థతకు లోనయ్యారు. బాపూసాహెబ్ ఆరోగ్యవంతులయ్యాక, బాబా కూడా ఆరోగ్యవంతులయ్యారు.

తరువాయి భాగం రేపు

సోర్సు : సాయిభక్త శ్రీకాకాసాహెబ్ దీక్షిత్ డైరీ by విజయ్ కిషోర్.

సాయిభక్తుల అనుభవమాలిక 85వ భాగం....


ఈరోజు భాగంలో అనుభవాలు:

  1. ఊదీతో చెవినొప్పి మాయం
  2. పునరావృతమైన సచ్చరిత్రలోని సాయిలీల

బెంగుళూరునుండి సాయిభక్తురాలు జయంతి దేశాయ్ తన అనుభావాలనిలా పంచుకుంటున్నారు:

సాయిరాం!

సాయిరాం! నా జీవితంలో జరిగిన బాబా లీలలను 'సాయి మహరాజ్ సన్నిధి బ్లాగు' ద్వారా సాయిభక్తులతో పంచుకుంటూ, తద్వారా మరొకసారి ఆ అనుభూతులను మననం చేసుకోవడం నాకు చెప్పలేని ఆనందాన్ని కలిగిస్తున్నది. ఈ అవకాశాన్ని నాకు ఒసగినవారికి నా ధన్యవాదాలు తెలుపుతూ.... 

ఊదీతో చెవినొప్పి మాయం

ఒక సాయిబంధువు అనుభవం చదివాక ఊదీ మహిమ వలన నాకు ఇటీవల జరిగిన ఒక అనుభవాన్ని సాయిబంధువులందరితో పంచుకోవాలనిపించింది. ఆ సాయినాథుని ప్రేరణతో నా అనుభవం మీతో పంచుకోవడం నాకెంతో సంతోషంగా ఉంది.

2018, నవంబరు నెలలో ఒకరోజు మధ్యరాత్రిలో దాహం వేసి మంచినీళ్లు త్రాగడానికి లేచాను. నీళ్ళు త్రాగుతుండగా ఎవరో ముందుకు తోసినట్లు కొంచెం దూరం ముందుకు పోయాను. నిద్రమత్తులో ఉన్న నేను ఏదోలే అనుకుని మళ్ళీ వెళ్లి నిద్రపోయాను. ఉదయం నిద్రలేచేసరికి తల తిరుగుతున్నట్లుగా అనిపించి నన్ను నేను బ్యాలెన్స్ చేసుకోలేకపోయాను. పైకి లేస్తే ఏ పొజిషన్‌లో వెనక్కి పడిపోతానో నాకే తెలియదన్నట్లుంది నా పరిస్థితి. డాక్టరును సంప్రదిస్తే, "న్యూరో ప్రాబ్లెమ్ అయివుండొచ్చు. MRI, బ్రెయిన్ స్కానింగ్ మొదలైన చాలారకాల పరీక్షలు చేయాలి" అన్నారు. సాయిభక్తురాలినైన నా నోటివెంట ఏ పరీక్ష జరుగుతున్నా సాయి నామస్మరణ తప్ప ఇతర ఏ ఆలోచనా లేదు. రిపోర్టులు వచ్చాక పెద్ద డాక్టరుని కలవాల్సిన సమయం రానే వచ్చింది. ఆ సమయమంతా బాబా స్మరణ నా మదిలో జరుగుతూనే వుంది. డాక్టరు రిపోర్టులన్నీ చూసి, "న్యూరో ప్రాబ్లెమ్ కాదు. చెవి లోపల సమస్య ఉంది" అని చెప్పి, నెలకు సరిపడా మందులు వ్రాసిచ్చి వాడమని చెప్పారు. ఒకటి కాదు, రెండు కాదు, దాదాపు నెలరోజుల పాటు చాలా బాధపడ్డాను. చివరికి బాబా దయవలన ఆరోగ్యం కుదుటపడింది. 

మళ్ళీ రెండువారాల క్రితం రెండు చెవుల లోపలి భాగం చాలా నొప్పిగాను, లాగుతున్నట్లుగా ఉండి, భరింపరాని బాధగా ఉండేది. 4, 5 రోజుల్లో తగ్గుముఖం పడుతుందిలే అని నిర్లక్ష్యం చేశాను. తరువాత అది తీవ్రమైన ప్రభావం చూపడంతో ఒకరోజు ఉదయాన్నే ఇ.ఎన్.టి. డాక్టరుకు ఫోన్ చేస్తే, 10:30 కి అపాయింట్‌మెంట్ ఇచ్చారు. త్వరత్వరగా దీపారాధన చేసి, సచ్చరిత్ర పారాయణ ముగించుకుని హాస్పిటల్‌కు వెళదామని అనుకున్నాను. దీపారాధన చేసి, పారాయణ చేయడానికి సిద్ధపడుతుండగా నా మనస్సులో ఎవరో చెప్తున్నట్లు, "ఎందుకు తొందరపడతావు? చెవి లోపల, బయట ఊదీ రాయి. మూడురోజుల తర్వాత కూడా బాధ అలానే వుంటే డాక్టరు వద్దకు వెళ్ళు" అని అనిపించింది. సర్వహృదయాంతర్యామి అయిన బాబాయే అలా చెప్తున్నారని, నేను ఆయన చెప్పినట్లుగా ఊదీ వైద్యం చేసుకున్నాను. మూడు రోజులు పూర్తయ్యేసరికి ఎలాంటి నొప్పీ కనబడలేదు. ఇప్పుడు చెవినొప్పి లేకపోయినా ప్రతినిత్యం ఊదీ రాయడం మాత్రం మానుకోలేక పోతున్నాను. నా జీవితంలో ఇలా బాబా ఇచ్చిన అనుభవాలెన్నో ఉన్నాయి. అంతా సాయిమయం.

పునరావృతమైన సచ్చరిత్రలోని సాయిలీల

సాయిసచ్చరిత్ర 13వ అధ్యాయంలో నీళ్ళ విరోచనములతో బాధపడుతున్న కాకామహాజని చేత వేరుశెనగపప్పు తినిపించి బాబా అతన్ని అనుగ్రహించిన విధంగా నన్ను కూడా అనుగ్రహించారు. ఆ అనుభవాన్ని నేనిప్పుడు మీతో పంచుకుంటాను.

పద్దెనిమిది సంవత్సరాల క్రితం చికున్ గున్యా వ్యాధినుండి కోలుకుంటున్న సమయంలో నాకు హఠాత్తుగా ఒకరోజు నీళ్ళ విరేచనాలు మొదలయ్యాయి. ఇంటి సభ్యులు వారి విధినిర్వహణకు వెళ్ళినందువలన మందులు తెచ్చివ్వడానికి ఎవరూ అందుబాటులో లేరు. మందులు తెచ్చుకోవడానికి నేను స్వయంగా వెళ్ళలేని పరిస్థితిలో ఉదయం నుండి సాయంత్రం వరకు బాబా నామస్మరణ చేసుకుంటూ, "నాకు మందులు తెచ్చి పెట్టేవారు ఎవరూ లేరు. ఎవరి ద్వారానైనా నాకు మందులు పంపండి బాబా" అని వేడుకున్నాను. ఇంట్లో ఇలా ఉన్న నా పరిస్థితి మా వారికి తెలియదు. అప్పట్లో ఇంటికి ఒక్కటే సెల్ ఫోను, అదికూడా ఇంటి యజమాని వద్ద మాత్రమే ఉండేది. ఇక ఇప్పుడు అసలు బాబా లీల చూడండి....

మావారు ఇంటికి వస్తూ బెంగళూరు బేకరీలో ఫేమస్ అయిన 'కాంగ్రెస్'(కారం మసాల వేరుశనగ విత్తనాలు) తెచ్చారు. నా పరిస్థితిని తెలుసుకుని, "నీ ఆరోగ్యానికిది మంచిది కాదు, నువ్వు తినకు" అన్నారు. నేను, "ఎవరి ద్వారానైనా ‌మందులు పంపమని బాబాను వేడుకున్నాను, ఆయన మీ ద్వారా ఇవి పంపారు. కాబట్టి నేను వీటిని తీసుకుంటాను" అని అన్నాను. తరువాత సాయి నామాన్ని తలచుకుంటూ, "ఆనాడు కాకామహాజనికి వేరుశెనగపప్పు ఔషధంగా పనిచేసి విరోచనాలు తగ్గినట్లే, ఇప్పుడు నాకూ నయం కావాలి" అని దాన్ని తిన్నాను. కాసేపటికల్లా ఉదయం నుంచి సాయంత్రం వరకు నేను పడుతున్న కష్టాన్ని, బాధను బాబా ఇట్టే తీసేసారు.

అంతా సాయిమయం. 

సాయి అనుగ్రహసుమాలు - 44వ భాగం.


కాకాసాహెబ్ దీక్షిత్ డైరీ - 44వ భాగం.

శ్రీ హరిసీతారామ్ దీక్షిత్ గారు వ్రాసి ఉంచిన అనుభవాలు.

అనుభవం - 73 

వసంతరావ్ నారాయణ్ (ముంబాయి) గారు తరచూ శిరిడీ వెళ్ళేవారు. బాబా చరణాలపై ఆయనకు పూర్ణశ్రద్ధ ఉండేది. ఆయనను ఒకసారి జహంగీర్ పటేల్  అనే  పార్శీ స్నేహితుడు శ్రీ సాయిబాబా ఫోటో కావాలని అడిగాడు. శ్రీ వసంతరావ్ తనకు బాబా ఫోటోను ఇచ్చాడు. నిజానికి శ్రీ పటేల్ బాబా ఫోటోను అడిగింది భక్తితో కాదు తన ఆఫీసులో శ్రీ లిమాయే అనే పేరు కలిగిన సాయిభక్తుడైన గుమస్తా ఉన్నాడు తనకు ఇబ్బంది కలిగించాలని శ్రీ పటేల్ ఉద్దేశ్యం. శ్రీ లిమాయేకు పటేల్ శత్రువు. పటేల్ ఎప్పుడూ ఆ ఫోటోను లిమాయే వద్దకు తెచ్చి, ఆ ఫోటోను కించపరుస్తూ మాట్లాడి, శ్రీ లిమాయే మనసును బాధ పెట్టేవారు. ఆ ఫోటో ఇచ్చినందుకు లిమాయే వసంత్రావును దూషించాడు. అప్పుడు వసంతరావు తాను ఆ ఫోటోను పటేల్ అడగడం వలన ఇచ్చానని, అందువలన తాను బాగుపడతాడు అని అనుకున్నానని చెప్పాడు. “మనం ఇప్పుడు ఆ పటేల్ ను ముక్కుపిండి దర్శనానికి తీసుకువచ్చేటట్లు బాబాను ప్రార్థించుదాం” అని వసంతరావు అన్నాడు. వారు ఆ విధంగానే ప్రార్థించారు. తరువాత సుమారు 15 రోజులకు ఆ పార్శీ గృహస్థు వసంతరావు వద్దకు ఏడుస్తూ వచ్చాడు. “తాను బాబా ఫోటో పట్ల అమర్యాదగా ప్రవర్తించానని, అందువలన తనకు పశ్చాత్తాపం కలుగుతుందనీ, తన దక్షిణను బాబాకు చేర్చాలని చెప్పాడు. ఆ వ్యక్తి మనసు మారినందుకు వసంతరావుకి చాలా ఆనందం కలిగింది. ఆ వ్యక్తి శ్రీ కాకాసాహెబ్ ముందర జరిగిన విషయమంతా చెప్పి తన తప్పును ఒప్పుకున్నాడు. తరువాత 1918 లో గురుపూర్ణిమకు వసంతరావు మరియు లిమాయే గారితో కలిసి శ్రీ పటేల్ కూడా శిరిడీకి బాబా దర్శనానికై వచ్చాడు. శ్రీ పటేల్ గారు శ్రీ లిమాయేను ద్వేషించడం మానడమే గాక, వారిద్దరూ తరువాత చాలా మంచి స్నేహితులయ్యారు.

అనుభవం - 74

శ్రీ గణపతి ధోండూ కదమ్ తమ అనుభవాన్ని క్రింది విదంగా తేలియ పరుస్తున్నారు. 1914వ సం.లో నేను కుటుంబసహితంగా నాసిక్ ద్వారా రైలు బండిలో శిరిడీకి సాయిబాబా దర్శనానికి బయలుదేరి వెళుతున్నప్పుడు, నాసిక్ స్టేషన్ కు  ఒకటిరెండు స్టేషన్ల ముందు నేను కూర్చొన్న డబ్బాలోకి దాదాపు 15-20 నల్లగా పోతపోసిన విగ్రహాల్లాంటి బిల్లులు ఒకరి తరువాత ఒకరిగా డబ్బాలోకి  ప్రవేశించారు. వారు నా ప్రక్కనే కూర్చొన్నారు. (నేను కూర్చున్న డబ్బాలో బాబా ప్రయాణికులు ఎవరూ లేరు. నేను నా భార్య మరియు పిల్లలు మాత్రమే ఉన్నాము).  ఆ సమయంలో నేను శ్రీ లక్ష్మణ్ రామచంద్ర పాల్గార్కర్ గారి “భక్తి మార్గ దీపిక” చదువుతూ కూర్చొని ఉన్నాను. అప్పుడు వారు ఆ పుస్తకం శ్రవణం చేయడానికి నా దగ్గర కూర్చొన్నారు అనుకుని ఆ పుస్తకంలోని అభంగాలను బిగ్గరగా శ్రవణం చేయడం మొదలు పెట్టాను. ఆ భిల్లులు నా వద్ద సుమారు ఐదు నిముషాలు కూర్చొన్నారో, లేదో ఉన్నటుండి వెళుతున్న రైలు నుండి క్రిందకు దూకారు. అప్పుడు నేను వారిని చూడడానికై తలుపు దగ్గరకు వెళితే, ఆ భిల్లులు ఒకటే పరిగెడుతున్నారు. ఇంతలో కూర్చొన్న స్థలం వదకు వెళ్ళడానికి వెనుకకు తిరిగితే ఒక వయోవృద్ద ఫకీరు ముందర కూర్చొన్నట్టుగా అనిపించింది. డబ్బాలో ఇంతకు ముందు ఎవరూ లేకుంటే, ఈ ఫకీరు ఇందులోకి ఎలా వచ్చాడు? అనే ఆలోచన మనసులోకి వచ్చింది. మనసులోకి అటువంటి ఆలోచన రాగానే ముందర కూర్చొన్న ఫకీరు అదృశ్యమయ్యాడు. దాంతో నేను ఎంతో సంభ్రమాశ్చర్యాలకు గురయ్యాను. నాకు కళ్ళ ముందు ఆ ఫకీరు మరియు ఆ భిల్లులే కనపడుతున్నారు. జరిగిన సంఘటన నా కళ్ళ ముందే కదలాడుతోంది. నేను శిరిడీలో, బాబా దర్శనానికి వెళ్ళినప్పుడు, ద్వారకామాయిలో కాలు పెట్టగానే “సురక్షితంగా వచ్చారు కదా” అనే మాటలు బాబా ముఖతః వెలువడడంతో నేను తీవ్ర ఉద్విగ్నతకు గురయ్యాను. రైలులో జరిగిన లీల గుర్తుకు వచ్చింది. ఆ భిల్లులు దోపిడీ దొంగలని, మమ్మల్ని దోచుకోవడానికే రైలులో ఎక్కారని, కానీ బాబా దర్శనానికి వెళుతుండటం వలన, రాబోయే సంకటాన్నుండి తప్పించటానికి స్వయంగా శ్రీ సాయిబాబాయే ఆ ఫకీరు ఈ రూపంలో వచ్చారని అర్థమైంది. తరువాత రెండు రోజులు శిరిడీలోనే ఉండి బాబా దర్శనభాగ్యాన్ని పొంది తిరిగి ముంబాయికి వచ్చాను.

తరువాయి భాగం రేపు

సోర్సు : సాయిభక్త శ్రీకాకాసాహెబ్ దీక్షిత్ డైరీ by విజయ్ కిషోర్.

సాయి అనుగ్రహసుమాలు - 43వ భాగం.


కాకాసాహెబ్ దీక్షిత్ డైరీ - 43వ భాగం.

శ్రీ హరిసీతారామ్ దీక్షిత్ గారు వ్రాసి ఉంచిన అనుభవాలు.

అనుభవం - 72

కెప్టెన్ వి.జి. హాటే , బికనేర్ గారి అనుభవాలు

శ్రీ హాటే సాహెబ్ బాబాకు గొప్పభక్తుడు. ఆయన శిరిడీలో కొన్ని రోజులు ఉన్నారు. ఆయన గ్వాలియర్లో ఉన్నప్పుడు, ఆయన వద్దకు సాళూరాం అనే పేరు కలిగిన ఒక మరాఠా గృహస్థు కలవడానికి వచ్చాడు. “తన కుమారుడు ఇంట్లో నుండి తప్పిపోయాడని, అందువలన తనకు, తన భార్యకు చాలా దుఃఖం కలుగుతోందని” చెప్పాడు. శ్రీ హాటేకు బాబాపై పూర్ణశ్రద్ధాభక్తులు ఉండటం వలన, శ్రీహటే తనతో “నీవు శిరిడీ వెళ్ళి బాబా దర్శనం చేసుకో! నీ కుమారుడు తప్పక దొరుకుతాడు” అని చెప్పాడు. అప్పుడు ఆ గృహస్థు వెంటనే “పిల్లవాడి కబురు అందగానే, వెంటనే శిరిడికి మీ దర్శనానికి వస్తాము” అని మొక్కుకున్నాడు. కొన్ని రోజులకు మెసపుటోనియా నుండి పిల్లవాడు వ్రాసిన ఉత్తరం వచ్చింది. ఆ ఉత్తరంలో “నేను ఎవరికీ చెప్పకుండా యుద్ధంలో  పాల్గొనడానికి వచ్చానని, ఇప్పుడు తిరిగి వస్తున్నానని” వ్రాసి ఉంది. ఈ వార్తను ఆ గృహస్థు శ్రీహాటేకు చెప్పగానే “అయితే మీరు వెంటనే బాబా దర్శనానికి వెళ్ళండి" అని శ్రీ హాటే చెప్పారు. కానీ ఆ గృహస్థు అలా చేయకుండా మొదట కుటుంబ సహితంగా , పిల్లావానిని కలవడానికి వెళ్ళాడు. కుమారుడు తిరిగి వచ్చాడు. కానీ ఆ అబ్బాయికి జ్వరం తరచుగా వస్తూ ఎంతో బలహీనుడయ్యాడు. కుమారుని ఆ పరిస్థితిలో చూసి సాళూరాం తనను తీసుకొని మరలా గ్వాలియర్ వచ్చాడు. శ్రీ హాటే వద్దకు మందుల కోసమై  వెళ్ళాడు. అప్పుడు శ్రీహాటే తనతో “నీవు దారి తప్పావు, మొదట నీవు బాబా దర్శనం చేసుకోలేదు. నీ కుమారుని బాబా చరణాల వద్దకు తీసుకు వెళ్ళావంటే తప్పక స్వస్థుడవుతాడు” అని చెప్పాడు. వెంటనే శ్రీ సాళూరాం శిరిడీ వెళ్ళడానికి నిశ్చయించుకున్నాడు. శ్రీహాటే వద్దనుండి పరిచయ ఉత్తరం అడిగాడు. అప్పుడు శ్రీహాటే “ఉత్తరం అవసరం లేదు, నేను ఒక వస్తువునిస్తాను. ఆ వస్తువుని బాబాకు సమర్పించు” అని చెప్పి పెట్టెలో నుండి ఒక రూపాయి నాణాన్ని తీసి సాళూరాంకు ఇచ్చాడు. బాబా చేతికి ఆ రూపాయినిచ్చి, మరలా ప్రసాదరూపంగా తీసుకోవాలనేది కెప్టెన్ హాటే గారి ఉద్దేశ్యం. కారణం అది చాలా దుర్లభమైన ప్రసాదం! సాళూరాం శిరిడీకి వెళ్ళాడు. బాబా దర్శనం చేసుకున్న తరువాత ఆ రూపాయిని బాబా చేతిలో పెట్టారు. బాబా ఆ రూపాయిని తిరిగిచ్చి “ఎవరిది వారికిచ్చేయ్” అని చెప్పారు. ఆ విధంగా బాబా, శ్రీ హాటే గారు మనసులో కోరుకున్నట్లుగానే ఆ రూపాయిని తిరిగి ఇచ్చేసారు. సాళూరాం తిరిగి గ్వాలియర్ కు వచ్చేసాడు. సాళూరాం హాటేను కలిసి “సాయి దర్శనం అయింది. పిల్లవాడు ఆరోగ్యంగా ఉన్నాడు” అని ఆనందంగా చెపుతూ, బాబా “మీ రూపాయిని మీకు తిరిగి ఇచ్చేసారు” అని చెప్పాడు. దాంతో శ్రీ హాటే యొక్క ఆనందానికి అవధులు లేకుండా పోయాయి. తాను వెంటనే లేచి బాబా ప్రసాదరూపమైన రూపాయిని చేతిలోకి తీసుకున్నాడు. కానీ వెంటనే బాబా హస్త స్పర్శ పొందిన రూపాయి అదికాదు అని తనకు స్పూర్తి కలిగింది. వెంటనే ఆ రూపాయిని తిరిగి ఇచ్చేసి, తీసుకువెళ్ళమని చెప్పారు. శ్రీ సాళూరాం మనసులో  ఆశ్చర్యపోయాడు. ఆ రూపాయిని తిరిగి తీసుకు వెళ్ళాడు. మరలా మరుసటిరోజు వేరే రూపాయిని తీసుకువచ్చాడు. ఆ రూపాయి చేతిలో పడగానే శ్రీహాటేకు బాబా హస్తస్పర్శ అనుభవమైంది. “తన భార్య యొక్క పొరపాటు వలన రూపాయి మారిపోయింది” అని సాళూరాం చెప్పాడు.

తరువాయి భాగం రేపు

సోర్సు : సాయిభక్త శ్రీకాకాసాహెబ్ దీక్షిత్ డైరీ by విజయ్ కిషోర్.

సాయిభక్తుల అనుభవమాలిక 84వ భాగం....


ఈరోజు భాగంలో అనుభవాలు:
  1. బాబా అనుగ్రహం
  2. బాబా కృపతో మా పాపకు నయమయింది

బాబా అనుగ్రహం

USA నుండి ఒక అజ్ఞాత సాయిభక్తురాలు తన అనుభవాన్నిలా పంచుకుంటున్నారు:

నా సద్గురు సాయి పాదాల చెంత నేనొక చిన్న భక్తురాలిని. బాబాకు నా కోటి కోటి ప్రణామాలు. నా వీసా పొడిగింపు విషయంలో బాబా అనుగ్రహాన్ని తెలియజేసే అనుభవమిది. చాలాకాలంగా నా వీసా పొడిగింపు పెండింగులో ఉన్నందువలన నేను ఆందోళనపడుతూ ఉండేదాన్ని. ప్రతిసారీ నేను పంపిన పత్రాలు వెనుకకు తిరిగి వస్తుండేవి. దాంతో నేను బాబాను ప్రార్థించాను. తరువాత వీసా విషయంలో బాబా నాకు మార్గనిర్దేశం చేసారు. తరువాత నా పుట్టినరోజు వచ్చింది. ముందురోజు రాత్రి నేను నా పుట్టినరోజు సందర్భంగా బాబా కోసం కేసరి తయారుచేసి మందిరంలో బాబాకు సమర్పించాలని అనుకున్నాను. ఆ రాత్రి నాకొక కల వచ్చింది. కలలో నేను కేసరి తీసుకుని మందిరానికి వెళ్లి బాబాకు సమర్పించాను. బాబా విగ్రహంనుండి బయటకు వచ్చి కేసరి తింటున్నారు. ఆయన ప్యాంటు, షర్టు ధరించి, ఎంతో అందంగా ఉన్నారు. అక్కడున్న పూజారి తన మనసులో, 'ఆమె ఇలా వచ్చి కేసరి పెడితే బాబా తినడం ఏమిటి?' అని అనుకుంటున్నారు. వెంటనే నాకు మెలకువ వచ్చింది. బాబా దర్శనం, బాబా నేను పెట్టిన కేసరి తినడం తలచుకుని ఎంత ఆనందం పొందానో మాటల్లో చెప్పలేను. తరువాత నేను కేసరిని తయారుచేసి, మందిరంలో బాబాకు నివేదించాను. తరువాత ఒక్కవారంలో నా వీసా ఆమోదింపబడింది.

మరోసారి నా భర్త తన జాబ్ లొకేషన్ మార్చుకునే ప్రయత్నంలో ఉన్నారు. నాకది నచ్చలేదు. ఎందుకంటే, మేము ఆ చోటుకి వచ్చి ఎక్కువ రోజులు కాలేదు. పైగా కొత్తచోట బాబా మందిరం లేదు. అందువలన నేను హృదయపూర్వకంగా బాబాని ప్రార్థించాను. ఆయన నాకు సహాయం చేసారు. నా భర్త ఇంటర్వ్యూలో విఫలమయ్యారు. "థాంక్యూ బాబా! మీరు అక్కడ లేకుంటే నేనేమి చేయగలను? అలా ప్రార్థించడం తప్ప ఏమి చేయాలో తెలియలేదు. మీ పాదాలను ఎల్లప్పుడూ పట్టుకుని ఉండేలా నా మీద దయ చూపించండి. దయచేసి మా తప్పులు క్షమించండి. నాకేది మంచిదో, ఎప్పుడు ఇవ్వాలో మీకు తెలుసు. ఈ ప్రపంచం, జీవితం చాలా భయంతో కూడుకున్నవి. ఎల్లప్పుడూ మాతో ఉండండి బాబా".

బాబా కృపతో మా పాపకు నయమయింది

USA నుండి ఒక అజ్ఞాత సాయిభక్తురాలు తన అనుభవాన్నిలా పంచుకుంటున్నారు: 

నేను పది సంవత్సరాలుగా సాయిభక్తురాలిని. ఇటీవల జరిగిన ఒక అనుభవాన్ని నేనిప్పుడు మీతో పంచుకుంటాను. నాకు పదినెలల పాప ఉంది. తను చాలా ఆరోగ్యంగా ఉంటుంది. తను ఈ మధ్యనే మెల్లగా ఏదైనా పట్టుకుని నిలబడటం మొదలుపెట్టింది. చిన్నగా తడబడుతూ బుడిబుడి అడుగులు వేస్తోంది. మేము ఒకరోజు పొరుగున ఉన్న ఒకరింటికి వెళ్ళాము. పిల్లలంతా మా పాపతో ఆడుకుంటున్నారు. కొంతసేపటికి అకస్మాత్తుగా మా పాప ఏడుపు వినిపించి పరుగున వెళ్లి చూస్తే, ఒక చిన్నపాప తనని ఎత్తుకుని ఉంది. వెంటనే నేను తన వద్దనుండి పాపను తీసుకుని, ఇంటికి వచ్చేసాను. ఆ రాత్రి తను నిద్రపోకుండా చాలా అల్లరి చేసింది. ప్రత్యేకించి ఒకవైపు తిరగడానికి అస్సలు ఇష్టపడటం లేదు. కారణం మాకు అర్థం కాలేదు. నిద్రవలన తను అలా చేస్తోందేమో అనుకున్నాము.

మరుసటిరోజు ఉదయానికి తను ప్రాకటం గాని, నిలబడి అడుగువేయటం గాని చేయడం లేదు. తను కుంటుతున్నట్లుగా చేస్తోంది. పగలంతా అలాగే సాగింది. తన ఒళ్ళు కూడా వేడిగా ఉంది. థర్మామీటర్ పెట్టి చూస్తే మాములుగా 98 డిగ్రీలు మాత్రమే ఉంది. మేము ఏదైనా వైరస్ సోకిందేమోనన్న అనుమానంతో డాక్టరుని పిలిచాము. ఆయన, "ఎక్కడైనా బెణికి ఉండవచ్చు" అని చెప్పారు. డాక్టర్ పరీక్షించడానికి ప్రయత్నిస్తే తనస్సలు ఒప్పుకోలేదు. నేను చాలా భయపడిపోయాను. నేను వెంటనే సహాయం కోసం బాబాను పిలిచి, "ఆదివారం మధ్యాహ్నం లోపల తనకి నయం అయేలా చూడమ"ని ప్రార్థించాను. కానీ అలా జరగలేదు. దాంతో మేము మరుసటిరోజు మధ్యాహ్నం డాక్టరుని కలవాలని అనుకున్నాము. కనీసం ఆ లోపు అయినా నయం చేయమని బాబాని ప్రార్థించాను. అలా కూడా జరగలేదు. నేను ఏడుస్తూ పాపను పట్టుకుని డాక్టర్ వద్దకు వెళ్ళాను. ఆయన అంతా పరీక్షించి, "ఫ్రాక్చర్స్ ఏమీ లేవు. బహుశా తనెందుకో భయపడి నడవటానికి వెనకడుగు వేస్తోంది. 4-5 రోజుల తరువాత కూడా అలాగే ఉంటే ఎక్స్-రే అవసరమవుతుంది" అని చెప్పారు. బహుశా మావల్ల గాని, బయటవాళ్ళవల్ల గాని తనకి ఏదైనా గాయం అయుంటుంది, అందుకే తను నడవలేక పోతోందని భావించి నేను, "బాబా! నా బిడ్డ తనంతట తాను నిలబడటం గాని, నడవటం గాని చేసేలా చూడండి. నేను మిమ్మల్ని కాక ఎవరిని పిలవను? ఇంతకన్నా నేనేమి చేయగలను? తను కోలుకుంటే నా అనుభవాన్ని బ్లాగులో పంచుకుంటాను. 10008 సార్లు 'ఓం సాయిరాం' అని కూడా వ్రాస్తాను" అని ఏడుస్తూ ప్రార్థించాను. తరువాత నేను 'క్వశ్చన్ & ఆన్సర్ సైటు'లో బాబాని అడిగితే, "15 రూపాయలు దానం చేయండి, 24 గంటల్లోపు మిరాకిల్ జరుగుతుంది" అని వచ్చింది. నేను ఆ మొత్తాన్ని దానం చేశాను. తరువాత కొన్ని గంటల్లో మాపాప 90 శాతం కోలుకుంది. నేనెప్పుడూ బాబానే నమ్ముకున్నాను. నా నమ్మకాన్ని ఆయన నిలబెట్టారు. "థాంక్యూ సో మచ్ బాబా!" బాబాకు అన్నీ తెలుసు. ఆయనపై పూర్తి నమ్మకాన్ని ఉంచండి. అంతా శుభం జరుగుతుంది.

source: https://www.shirdisaibabaexperiences.org/2019/05/shirdi-sai-baba-miracles-part-2351.html

సాయి అనుగ్రహసుమాలు - 42వ భాగం.


కాకాసాహెబ్ దీక్షిత్ డైరీ - 42వ భాగం.

శ్రీ హరిసీతారామ్ దీక్షిత్ గారు వ్రాసి ఉంచిన అనుభవాలు.


అనుభవం - 71

శ్రీ హరిసీతారాం దీక్షిత్ గారికి 20-3-24 రోజున శ్రీ కృష్ణ నారాయణ్ ఉరఫ్ శ్రీ చోటూభయ్యాసాహెబ్ పారూళ్కర్, ఆనరరీ మెజిస్ట్రేట్, హార్ధా గారి వద్ద నుండి వచ్చిన ఉత్తరంలోని సారాంశం!

మొన్న 14వ తారీఖు శివరాత్రి! అందువలన ఇంట్లోని వారందరూ శ్రీ సిద్దనాథ్ దర్శనానికై వెళ్ళారు. అందరూ ఆదివారం మధ్యాహ్నం మూడు గంటలకు బయలు దేరారు. దారిలో బండి చక్రం యొక్క ఇరుసు ఊడిపోవడం వలన బాగా ఆలస్యమైంది. సాయంత్రపు చీకట్లు అలుముకున్నాయి. నర్మదా నదీతీరం చేరుకునేటప్పటికి చీకటి పడటం వలన పడవలు నడపడం ఆపేసారు. చీకటి పడిన తరువాత ఎవరినీ పడవలో ఎక్కించుకోవద్దని ఆ పడవ వాళ్ళకు ఉత్తర్వులు ఉన్నాయి. నర్మదాతీరం చేరుకున్నాక మా నౌకరు ఆ పడవవానిని ఎంతో బ్రతిమాలుకున్నాడు. రెట్టింపు సొమ్ము చెల్లిస్తామని చెప్పాడు. అయినా సరే ఆ పడవవాడు ససేమిరా అన్నాడు. దాంతో అందరూ ఇప్పుడు ఎక్కడికి వెళ్ళాలనే ఆలోచనలో పడ్డారు. అంతలో మా శ్రీమతి “బాబా మీ ఇష్టం” అని ప్రార్థించి, నౌకరుతో “బండి కట్టి దగ్గరలో ఎక్కడికైనా దేవాలయానికి తీసుకువెళ్ళు” అని చెప్పింది. ఇంతలో ఎటువంటి చమత్కారం జరిగిందంటే ఒక ఫకీరు కఫ్నీ వేసుకొని, బాబా ఏ విధంగానైతే తలకు గుడ్డ కట్టుకునేవారో, అదే విధంగా తలకు గుడ్డ కట్టుకుని అక్కడకు వచ్చారు. ఆ ఫకీరు పడవ వానితో “మేము పగలంతా అటూ, ఇటూ తిరుగుతున్నాము. పద, మమ్మల్ని ఆవలి తీరంకు తీసుకువెళ్ళు” అని అన్నారు. కానీ ఆ పడవవాడు “కుదరదు” అని చెప్పాడు. అప్పుడు ఆ ఫకీరు మా కుటుంబసభ్యులు కూర్చొన్న చోటుకు వచ్చి “మీరు కూడా అవతలి ఒడ్డుకు వెళ్ళాలా?” అని అడిగారు. “అవున"ని చెప్పడంతో “మీరు ఇంత ఆలస్యంగా ఎందుకు వచ్చారు? ఇంకొంచెం ముందర రావాల్సింది” అని అన్నారు. అప్పుడు మా నౌకరు “బాబా, దారిలో బండి చక్రం యొక్క ఇరుసు ఊడిపోయింది. అందువలన ఆలస్యమైంది” అని చెప్పాడు. అప్పుడు ఆ ఫకీరు “ఇక్కడ అజమాయిషీ అంతా ఎవరు చేస్తారు?” అని అడిగారు. “ఇదంతా ఆంగ్లేయుల అధీనంలో ఉంది” అని చెప్పగానే, ఆ ఫకీరు “నేను ఇప్పుడే స్టేషన్కు వెళ్ళి ఉత్తర్వులు తీసుకువస్తాను. అప్పుడు వాళ్ళ బాబు కూడా తీసుకు వెళతాడు. మీరు ఆందోళన పడవద్దుఅని చెప్పి పదడుగులు వేసి కనిపించకుండా అదృశ్యమయ్యారు.

ఇంతలో ఏ పడవవాడైతే కుదరదని చెప్పాడో, అదే పడవవాడు హడావిడిగా వచ్చి, "మిమ్మల్ని పడవలో తీసుకువెళతాను” అని చెప్పి, తానే సామానంతా తీసుకువెళ్ళి పడవలో పెట్టసాగాడు. మా నౌకరుకు సహాయం చేసి, రెండు బండ్లను కూడా పడవలో పెట్టాడు. అప్పుడు మా శ్రీమతి నౌకరుతో, "డబ్బులు ఎంతో ముందే అడుగు, లేదంటే అక్కడికి వెళ్ళి ఇంత కావాలి, అంత కావాలి అని నసుగుతాడు” అని చెప్పింది. అప్పుడు మా నౌకరు ఆ పడవవాడిని “ఎంత తీసుకుంటావో ముందు చెప్పు” అని అడిగాడు. “మీకు తోచినంత ఇవ్వండి, అసలు ఇవ్వకపోయినా ఫర్వాలేదు, ముందు త్వరగా కూర్చుంటే మిమ్మల్ని అవతలి ఒడ్డుకి చేర్చివస్తాను” అని పడవవాడు చెప్పాడు. ఎప్పుడైతే ఆ ఫకీరుబాబా “నేను స్టేషనుకి వెళ్ళి ఉత్తర్వులు తెస్తాను” అని పదడుగులు వేసి అదృశ్యమయ్యారో అప్పుడే మా కుటుంబసభ్యులందరికీ కళ్ళల్లో నుండి నీళ్ళు వచ్చాయి. అందరూ చేతులు జోడించి “బాబా! మా కోసం మీరు ఎంతో శ్రమించారు” అని ప్రార్థించారు. తరువాత అందరూ ఆ పడవలో ఆవలితీరానికి చేరి సురక్షితంగా ఇంటికి చేరారు. ఇది బాబా యొక్క లీల అని మా అందరికీ అర్థం అయ్యింది. ఆ సమయంలో నా భార్యాపిల్లలు మరియు నౌకరు తప్ప ఇతరులు ఎవరూ లేరు. బాబా ప్రతిచోటా మనలను వెన్నంటే ఉండి ఎలా కాపాడుతారు అనేదానికి ఇది ఒక ఉదాహరణ. మా వంటి మూర్ఖులు మరియు సంసారచక్రంలో ఇరుక్కుపోయిన వారికి ఇటువంటి లీలలను చూడకుంటే బాబా చరణాలపై శ్రద్ధ కలుగదు. ఆయన చరణాలపై పూర్ణశ్రద్ద కలిగేటట్లు చేయమని బాబాను ప్రార్థిస్తున్నాము.

- కృష్ణారావ్ నారాయణ పారుళ్ కర్

తరువాయి భాగం రేపు

సోర్సు : సాయిభక్త శ్రీకాకాసాహెబ్ దీక్షిత్ డైరీ by విజయ్ కిషోర్.

సాయిభక్తుల అనుభవమాలిక 83వ భాగం....


ఈరోజు భాగంలో అనుభవాలు:
  1. సాయిబాబా మాపై ప్రసరించిన కటాక్షం
  2. నా తండ్రికి పునర్జన్మనిచ్చిన బాబా

సాయిబాబా మాపై ప్రసరించిన కటాక్షం

పేరు వెల్లడించని ఒక సాయి భక్తురాలు తన అనుభవాన్నిలా పంచుకుంటున్నారు:

ఒకసారి మేము (నేను, నా భర్త, మా అబ్బాయి, మా కోడలు, మనవడు) అందరం కలిసి శ్రీశైలం వెళ్లాలని అనుకున్నాము. మరుసటిరోజు మా ప్రయాణమనగా ముందురోజు మా మనవడికి వాంతులతో ఆరోగ్యం పాడైంది. మా కోడలు, "బాబుకి బాగాలేదు కదా, నేను రాను, మీరు వెళ్ళిరండి" అని చెప్పింది. నేను, "పరవాలేదు, బాబా ఉన్నారు. అంతా ఆయన చూసుకుంటారు" అని చెప్పాను. అలా కాసేపు మా అందరి మధ్య వాదులాట జరిగాక బాబాపై భారం వేసి ప్రయాణమవడానికి నిశ్చయించుకున్నాము. ప్రయాణానికి కావలసిన వస్తువులన్నీ కారులో పెట్టుకున్నాము. మా అబ్బాయి బట్టలు వేసుకుని పర్సు కోసం చూసుకుంటే, పర్సు కనబడలేదు. చాలా ముఖ్యమైనవన్నీ ఆ పర్సులోనే ఉన్నాయి. అందరం ఇల్లంతా వెతికాము కానీ, పర్సు ఎక్కడా కనిపించలేదు. ముందురోజు రాత్రి మెడికల్ షాపుకి వెళ్ళినప్పుడు అక్కడేమైనా మర్చిపోయుండవచ్చని అనుమానం వచ్చింది. అయితే అక్కడికి వెళితే, రైలుకి ఆలస్యమైపోతుంది. అయినప్పటికీ ముందు యాత్ర కాదు, పర్సు దొరకడం ముఖ్యం అనుకున్నాము. నేను నా మనసులో "బాబా! ఏమిటీ పరీక్ష? మేము వెళ్ళడానికి మీ అనుమతి మాకు రాలేదా?" అనుకుంటుండగా నాకు తెలియకుండానే నా కళ్ళనుండి కనీళ్లు జలజలా రాలిపోయాయి. మనసంతా శూన్యమైపోయింది. ఆ సమయంలో నా చేతిలో బాబా పారాయణ పుస్తకం ఉంది. ఉన్నట్లుండి బాబా మాట్లాడుతున్నట్టు, "పర్సు విషయం వదిలేసి యాత్రకు వెళ్తే అంతా సవ్యంగా ఉంటుంది" అని నా మనసులోకి వచ్చింది. ఆ విషయమే మిగతావాళ్లతో చెపితే వాళ్ళ మనసుకి కూడా బాబా చెప్పినట్లు అనిపించింది అన్నారు. ఇక అలా చేద్దామని అనుకోవడంతో అందరి మనసులు తేలికపడ్డాయి. బాబా చెప్పిన ప్రకారం పర్సు విషయం వదిలేసి యాత్రకు 11 గంటల సమయంలో బయలుదేరాము. బాబా చెప్పినట్లు ఆచరించడం వలన ఎలాంటి ఇబ్బందీ లేకుండా శ్రీశైలయాత్ర చేసుకుని తిరిగి ఇంటికి వచ్చాము. మాతో తీసుకువెళ్లిన పారాయణ పుస్తకము, చిన్న బాబా ఫోటో టేబుల్ పై పెట్టబోతుంటే, ఆశ్చర్యం! పోయిన పర్సు అక్కడే వుంది. బాబా! బాబా! ఎంత అద్భుతం! ఆనందాశ్చర్యాలతో మా మనసులలోకి ఏదో తెలియని అనుభూతి ప్రసరించగా తన్మయత్వంలో ఉండిపోయాము. "బాబా! మీకు చాలా చాలా ధన్యవాదములు".

నా తండ్రికి పునర్జన్మనిచ్చిన బాబా

హైదరాబాదు నుండి ఒక అజ్ఞాత సాయిభక్తురాలు తన అనుభవాన్నిలా పంచుకుంటున్నారు:

నాకు 31యేళ్లు. నాకు వివాహమైంది. కానీ ప్రస్తుతం నేను నా తల్లిదండ్రులతో ఉంటూ నా హక్కులకోసం, న్యాయం కోసం పోరాడుతున్నాను. మొదటిసారిగా నేను నా అనుభవాన్ని మీతో పంచుకోవాలని అనుకుంటున్నాను. నేను కూడా మీలాగే సాయిబాబా బిడ్డను. మా నాన్నగారు సాయిబాబా భక్తుడు. అందువలన నేను కూడా బాబాను ప్రార్ధిస్తూ ఉండేదాన్ని. ఒకసారి ఆయన ఉనికిని అనుభూతి చెందక నేను పూర్తిగా ఆయన పాదాలకు శరణాగతి చెందాను.

2018, జూలై 6న నేను మా న్యాయవాదిని కలవడానికి వెళ్ళినప్పుడు నా భర్త నా నుండి విడాకులు తీసుకోవాలని అనుకుంటున్నారని తెలిసి షాక్ అయ్యాను. ఆ విషయాన్నీ నా కుటుంబసభ్యులతో చెప్పాను. అది వాళ్లపై చాలా చెడు ప్రభావం చూపింది. ముఖ్యంగా మా నాన్నగారి హృదయాన్ని ఎక్కువ గాయపరిచింది. ఆయన నా జీవితాన్ని తానే నాశనం చేసానని చాలా బాధపడ్డారు. అర్థరాత్రి వరకు ఆయనతో మాట్లాడిన తరువాత మేము నిద్రపోయాము. నా చెల్లెలు తన ఆఫీసు నుండి తెల్లవారుజామున సుమారు 3:30 గంటలకు ఇంటికి వస్తుంది. ఆసమయంలో ఆమె మాములుగా నాన్నని చూడటానికి వెళ్లి, ఆయన పరిస్థితి బాగాలేకపోవడం గమనించింది. మేము ఏమి చేసినా ఆయన నుండి ఎటువంటి ప్రతిస్పందనలేదు. వెంటనే మేము ఆయనను ఆసుపత్రికి తీసుకువెళ్లాము. వైద్యులు, "ఆయన అవయవాలు ఏవీ ప్రతిస్పందించడం లేదు. కాబట్టి ఎటువంటి ఆశ లేద"ని చెప్పి ఆయనను లైఫ్ సపోర్ట్ సిస్టమ్ లో ఉంచారు. మేమంతా ఏడుస్తూ ఉన్న సమయంలో మా చిన్ననాన్న మమ్మల్ని ఓదార్చడానికి వచ్చారు. ఆయన నాకొక ఒక పుస్తకాన్ని ఇచ్చారు. అందులో సాయిబాబా పేర్లు ఉన్నాయి. ఆయన, "నాన్న ఆరోగ్యం గురించి, నీ భర్తతో మళ్ళీ కలిసి జీవించడం గురించి బాబాకు చెప్పుకొని ఇందులోని ప్రతి నామాన్ని 108 సార్లు వ్రాయి. వ్రాయడం పూర్తైయ్యాక శిరిడీలో బాబా పాదాలకు సమర్పించుకోవాలి. బాబా తన కృప చూపుతారు" అని చెప్పారు. కానీ ఆయన చెప్పినట్లు చేయడానికి నాకు ఆసక్తి, నమ్మకం రెండూ లేవు. ఒకవైపు నాన్న పరిస్థితి చాలా సీరియస్ గా ఉంది, మరోవైపు నా కళ్ళముందే నా జీవితం నాశనమై పోతుంది. నేను ఏమీ చేయలేని స్థితిలో ఉన్నాను. అయినప్పటికీ వేరే ఏ దారి కూడా లేకపోవడంతో, నా జీవితం కంటే నా తండ్రి జీవితమే ముఖ్యమనిపించి వెంటనే నాన్న గురించి బాబాను ప్రార్ధించి వ్రాయడం మొదలుపెట్టాను. నేను వ్రాయడం మొదలు పెడుతూనే నాన్న పరిస్థితిలో ఇంప్రూవ్మెంట్ కనిపించింది. అంత బాధలోనూ ఆ పుస్తకాన్ని కేవలం మూడురోజుల్లో పూర్తిచేసి చిన్ననాన్నకి ఆ పుస్తకాన్ని ఇచ్చాను. అదేరోజు నాన్నని లైఫ్ సపోర్ట్ సిస్టమ్ నుండి బయటకు తీసుకొచ్చారు. నాన్న ఆరోగ్యం చాలావరకు మెరుగుపడింది. ఆ మూడురోజులు మాకు నరకంలా అనిపించింది. ఆ తరువాత నా జీవితంలో సాయిబాబా ఇచ్చిన అనేక అనుభవాలున్నాయి. బాబా మనల్ని ఎప్పుడూ ఒంటరిగా విడిచిపెట్టారని నాకు తెలుసు. ఆయన ఎల్లప్పుడూ మనకు తోడుగా ఉంటారు. సాయిబాబా దయ, దీవెనలతో మా నాన్న క్షేమంగా ఉన్నారు. నా జీవితంలో ఇంకో మానసిక ఉద్రిక్తత ఉంది. కానీ నా బాబాపై చాలా నమ్మకం ఉంది. ఆయన ఆ విషయంలో కూడా మాకు ఖచ్చితంగా సహాయం చేస్తారు.

source: https://www.shirdisaibabaexperiences.org/2019/05/shirdi-sai-baba-miracles-part-2368.html

సాయి మహారాజ్ సన్నిధి సోషల్ మీడియా లింక్స్:

Subscribe Here

బ్లాగ్ అప్డేట్ నోటిఫికేషన్స్ నేరుగా మీ మెయిల్ కే వచ్చేందుకు క్రింద బాక్సులో మీ మెయిల్ ఐడి టైపు చేసి subscribe పై క్లిక్ చేసి, తరువాత స్టెప్స్ పూర్తీ చేయండి.

Delivered by FeedBurner

Followers

Recent Posts


Blog Logo