సాయి వచనం:-

- శ్రీబాబూజీ.

సాయి అనుగ్రహసుమాలు - 35వ భాగం.


కాకాసాహెబ్ దీక్షిత్ డైరీ - 35వ భాగం.

శ్రీ హరిసీతారామ్ దీక్షిత్ గారు వ్రాసి ఉంచిన అనుభవాలు.

అనుభవం -54 

శ్రీ శాంతారాం బల్వంత్ నాచ్నే, దహణూకర్ గారి అనుభవం 

1914వ సం||లో నేను దహణులో క్యాషియర్ గా పని చేస్తున్నప్పుడు, మేము ఆంజనేయస్వామి దేవాలయానికి దగ్గరలో ఒక బాడుగ ఇంట్లో ఉండేవారము. అక్కడ శ్రీ రామకృష్ణ బల్వంత్ ఫణ్సే అనే తలారి ఉండేవాడు. తనకు కొన్ని కారణాల వలన పిచ్చి పట్టింది. ఆ గృహస్థు ఒకరోజు మా వంటగది తలుపు వద్దకు వచ్చి నిలబడ్డాడు. నేను అదే గదిలో ఇంట్లోని ఫోటోలకు మరియు శ్రీ సాయిబాబా ఫోటోకు పూజ చేసుకుంటూ ఉన్నాను. నా దృష్టి అతని మీద పడగానే, ఆ వ్యక్తి ఒక్క ఉదుటున దూకి నా మెడ పట్టుకుని పిసకసాగాడు. తన నోటిని నా మెడ వద్దకు తీసుకువచ్చి “నేను నీ మెడ కొరికేస్తాను” అని మెడ కొరికే ప్రయత్నం చేయసాగాడు. ఆ సమయంలో  ఆత్మ సంరక్షణకై  ఆచమనం చేసే చెంచా లభించింది. ఆ చెంచాను ఆ వ్యక్తి  నోట్లో  నెట్టాను. కాని ఆ చెంచాతో పాటుగా నా కుడిచేయి బొటనవేలు మరియు చూపుడువేలు  ఆ వ్యక్తి నోట్లోకి వెళ్ళాయి. ఆ వ్యక్తి నోరు మూసివేసి, కరా కరా నమిలి వేసాడు .అందువలన నా చేతి వేళ్ళకు గాయం అయింది. గొంతు నొక్కే ప్రయత్నం వలన అతని చేతి వ్రేళ్ళ గోళ్ళు గుచ్చుకుని రక్తం వచ్చింది. నేను చాలాసేపు స్పృహలో లేను. డాక్టర్  ఉపచారం వలన నేను స్పృహలోకి వచ్చాను. తరువాత నాకు అర్థమైందేమిటంటే, నా చిన్న సోదరుడు అప్పుడే ఇంట్లోకి రావడం వలన, తాను మరియు  మా తల్లిగారు తన చేతిలో చిక్కుకున్న నా మెడను విడిపించారు. తరువాత - మరలా శిరిడీకి వెళ్ళినప్పుడు బాబా మధ్యాహ్న దర్బారులో ఈ విషయాన్ని లేవనెత్తారు. నేను ద్వారకామాయిలో కూర్చొనియుండగా బాబా నావైపు చూసి, అన్నా చించణీకర్ తో  “అన్నా , నేను కొంచెం పరాకు చూపినట్లైతే తాను పోయుండేవాడు. ఆ పిచ్చోడు గట్టిగా మెడ పట్టుకున్నాడు. కాని తనను విడిపించాను. ఏం చేద్దాం, మన కడుపులో పుట్టిన పిల్లలను మనం కాపాడకపోతే, ఎవరు కాపాడతారు” అని అన్నారు. బాబా మాటలు విని ఎంతో ఉద్వేగానికి గురయ్యాను.

దవాణులో ప్లేగు వ్యాపించడం వలన మేము “రాఈ” అనే గ్రామంలో నివసించసాగాము. అక్కడ శ్రీ రావ్ జి సఖారాం వైద్య గారి మోరు అనే చిన్న పిల్లవాడు ఉన్నట్టుండి భయంకరమైన అనారోగ్యానికి గురయ్యాడు. అందువలన వారి పెద్దబ్బాయి మా తండ్రి గారి కోసం వచ్చాడు. మా తండ్రి గారు వైద్యం చేస్తారు. మా తండ్రిగారు లేకపోవడంతో, మీరే మందులివ్వండి అని తాను అడిగాడు. కానీ “నావద్ద సాయిబాబా ఊదీ ఉంది, ఆ ఊదీ పెట్టి చూడండి” అని తనకు ఆ ఊదీని ఇచ్చాను. ఆ ఊదీని పెట్టాక ఆ అబ్బాయి ఏ ఔషధాలు లేకుండానే కోలుకున్నాడు.

దహణులో పరశురామ్ అప్పాజీ నాచ్నే అనే పేరుగల ఒక తలాఠి ఉండేవాడు. తాను ఒకసారి అనారోగ్యానికి గురయ్యాడు. దానికి ముందు తాను శిరిడీ వెళ్ళి వచ్చాడు. డాక్టర్లు మరియు వైద్యులు (మా తండ్రిగారితో సహా) ఆశ వదులుకున్నారు. కానీ పరశురామ్ ఎప్పుడూ బాబా ఫోటోను ప్రక్కన ఉంచుకుని, నేతి దీపం పెట్టమని, ఊదీబత్తి వెలిగించమని తల్లికి చెప్పడం, తల్లి కూడా దీపం వెలిగించి బాబాను "ఆ పిల్లవాడు ఆరోగ్యవంతుడైతే, శిరిడీకి మీ దర్శనానికి పంపిస్తాను” అని ప్రార్ధించడం జరిగింది. బాబా ఆమె మొక్కును తీర్చారు. పరశురామ్ పూర్తిగా కోలుకున్నాడు. ఇప్పుడు తనకు పిల్లలు కూడా కలిగారు. ఇంతకు మునుపుకంటే ఇప్పుడు బాగా సంతోషంగా ఉన్నారు.

శ్రీ గణేష్ వైద్యగారు ఒకసారి సాయి లీలలను గురించి వివరిస్తుండగా, నాకు ఆయన అనుభవం ఏమని చెప్పారంటే, ఒకసారి తన చిన్నకూతురికి వరుడుని శోధిస్తున్నప్పుడు, తనకు తెలతెలవారుతుండగా ఒక స్వప్నం వచ్చింది. అందులో శ్రీ సాయిబాబా ఒకవైపు వేలు చూపిస్తూ “ఎందుకు ఆందోళన చెందుతావు? కేశవ్ దీక్షిత్ గారి అబ్బాయి ఉన్నాడు” అని చెప్పారు. అంతకుమునుపు ఆ అబ్బాయిని తాను అసలు చూడనేలేదు. కాని మేల్కొన్నాక ఆ అబ్బాయి గురించి విచారించసాగాడు. తాను స్వప్నంలో చూసిన అబ్బాయి గురించి వర్ణించి, ఇంటి పేరు దీక్షిత్ మరియు తన తండ్రిగారి పేరు కేశవ్, అనేటువంటి అబ్బాయిని ఎక్కడైనా చూశారా? అని ఇంట్లో వారిని విచారించగా, ఆయన చిన్న కుమారుడు దత్తు “మా ఆఫీసులో అటువంటి ఒక అబ్బాయి ఉన్నాడు, ఊరు, పేరు కనుక్కొని చెపుతాను” అని చెప్పాడు. అప్పుడు స్వప్నంలో మాదిరి సరిగా వివరాలన్నీ సరిపోయాయి. ఆ కేశవరావ్ దీక్షిత్, శ్రీ గోవిందరావు సహాయంతో  సర్కారీ ఉద్యోగంలో చేరి, ప్రస్తుతం పెన్షన్ పై జీవిస్తున్నాడు. వైద్యకు మరియు శ్రీ గోవిందరావు ధబోల్కర్కు మంచి సంబంధం ఉంది. దాంతో వధూవరుల పరిణయం స్వప్నంలో మాదిరిగానే జరిగి ఆనందంగా జీవిస్తున్నారు.

తరువాయి భాగం రేపు 

సోర్సు : సాయిభక్త శ్రీకాకాసాహెబ్ దీక్షిత్ డైరీ by విజయ్ కిషోర్.

2 comments:

సాయి మహారాజ్ సన్నిధి సోషల్ మీడియా లింక్స్:

Subscribe Here

బ్లాగ్ అప్డేట్ నోటిఫికేషన్స్ నేరుగా మీ మెయిల్ కే వచ్చేందుకు క్రింద బాక్సులో మీ మెయిల్ ఐడి టైపు చేసి subscribe పై క్లిక్ చేసి, తరువాత స్టెప్స్ పూర్తీ చేయండి.

Delivered by FeedBurner

Followers

Recent Posts


Blog Logo