సాయి వచనం:-

- శ్రీబాబూజీ.

సాయి అనుగ్రహసుమాలు - 37వ భాగం.


కాకాసాహెబ్ దీక్షిత్ డైరీ - 37వ భాగం.

శ్రీ హరిసీతారామ్ దీక్షిత్ గారు వ్రాసి ఉంచిన అనుభవాలు.

అనుభవం -58

1913వ సంవత్సరంలో నేను చాలా నెలలు శిరిడీలోనే ఎక్కువ ఉండసాగాను. మొదట ఒకడినే వెళ్ళాను. తరువాత నా శ్రీమతి వచ్చింది. అప్పుడు కుమారుడిని మరియు సోదరుని కుమార్తెను బాంద్రాలోని ఒక స్నేహితుని వద్ద ఉంచడం జరిగింది.

నా శ్రీమతి  ఇక్కడకు  వచ్చిన ఒకటి లేక రెండు నెలలకు పిల్లలు అనారోగ్యానికి  గురయ్యారు. అప్పుడు నా బాంద్రా స్నేహితుడు కనీసం నా శ్రీమతినయినా వెంటనే పంపించాలనే  అర్థం వచ్చేవిధంగా అభ్యర్థిస్తూ ఉత్తరం వ్రాసాడు. అప్పుడు బాబా  వద్దకు వెళ్ళి అనుమతిని అడిగితే “ఎవరూ వెళ్ళాల్సిన అవసరం లేదు. పిల్లలనే ఇక్కడకు పిలిపించండి” అని ఆజ్ఞాపించారు. కానీ పిల్లల వార్షికపరీక్షలు నెలరోజులలోపే ఉండటం వలన పిల్లలను ఇక్కడకు పంపించకుండా నా శ్రీమతినే అక్కడకు పంపించమని మరలా నా స్నేహితుడు ఉత్తరం వ్రాసాడు. మరలా వెళ్ళి బాబాను అనుమతి అడిగితే "పిల్లలనే ఇక్కడకు పిలిపించండి” అని ఆజ్ఞాపించారు. ఆ విధంగానే శిరిడీకి పిల్లలు వచ్చారు. అనారోగ్యం వలన కుమారుడు ఎంతో అశక్తుడయ్యాడు. తనకు ఛాతిలో నొప్పి రాసాగింది. డాక్టరుగారు తన చదువుని ఆపించారు. సోదరుని కుమార్తెకు ఎలర్జీ వచ్చింది. పిల్లల ఆరోగ్యం దృష్ట్యా చూస్తే బాబా ఆజ్ఞ ఎంతో హితకారకమని స్పష్టంగా తెలుస్తుంది. శిరిడీలో కొన్ని రోజులు ఉన్నాక పిల్లల ఆరోగ్యం పూర్తిగా కుదుట పడింది. మరలా బాంద్రా స్నేహితుని వద్దనుండి ఉత్తరం వచ్చింది. "నవంబర్ రెండవ తారీఖున పిల్లలకు వార్షిక పరీక్ష ఉందని, అందువలన పిల్లలను వెంటనే ముంబాయికి పంపించాలనేది” ఆ ఉత్తరసారాంశం. ఈ విషయానికి సంబంధించి బాబా అనుమతిని అర్థిస్తే “చూద్దాం” అని మాత్రమే అన్నారు. అందువలన పిల్లలు శిరిడీలోనే ఉండిపోయారు. మరలా "కొన్ని కారణాల వలన పరీక్షను ఆరవ తేదీకి వాయిదా వేసారు” అని స్నేహితుని వద్దనుండి ముప్పయ్యవ తారీఖున ఉత్తరం వచ్చింది. అప్పుడు కూడా బాబా అనుమతిని అడిగితే “చూద్దాం” అని మాత్రమే అన్నారు. మరలా పదవ తారీఖున స్నేహితుని వద్దనుండి ఉత్తరం వచ్చింది. ఆరవ తారీఖున కూడా పరీక్ష జరగలేదని, ఆ పరీక్షను పదమూడవ తారీఖుకి వాయిదా వేస్తారని, ఆ రోజు మాత్రం పరిక్ష కచ్చితంగా జరుగుతుందని, కనుక పిల్లలను తీసుకురావడానికి మనిషిని పంపిస్తున్నానని ఆ ఉత్తరంలో నా స్నేహితుడు వ్రాసాడు. ఆ విధంగానే పదకొండవ తారీఖున మనిషి వచ్చాడు. పన్నెండవ తారీఖున బాబా ఆ మనిషితో పిల్లలను పంపించారు. పదమూడు, పద్నాలుగు మరియు పదిహేనవ తారీఖులలో పరీక్షలు జరిగాయి. ఆ పరీక్షలలో ఇద్దరు పిల్లలు ఉత్తీర్ణులయ్యారు. ఆ విధంగా బాబా ఆజ్ఞను పాటిస్తే పిల్లల ఆరోగ్యం బాగుపడింది మరియు వారు పరీక్షలలో  కూడా ఉత్తీర్ణులయ్యారు.

అనుభవం - 59

నేను శిరిడీలో ఉన్నప్పుడు ఒకరోజు రాత్రి సుమారు తొమ్మిది గంటల ప్రాంతంలో మాధవరావు దేశపాండే గారి సోదరుడు బప్పాజి సావుల్ విహిర్ గ్రామం నుండి  గాభరా, గాభరాగా వచ్చాడు. “నా భార్యకు ప్లేగు వ్యాధి వచ్చింది. జ్వరం కూడా ఎక్కువగా ఉంది. రెండు ప్లేగు బొబ్బలు కూడా వచ్చాయి. త్వరగా పద", అని మాధవరావుతో చెప్పాడు. మాధవరావు బాబా అనుమతి తీసుకోవడానికి వెళితే అను బాబా “ఇంత రాత్రి వెళ్ళవద్దు. ఉదయం వెళ్ళు. ప్రస్తుతం ఊదీ పంపించు” అని  ఆజ్ఞాపించారు. ఆ మాటలను విని బప్పాజి పూర్తిగా నిరాశ చెందాడు. మాధవరావు కూడా బాబా ఆజ్ఞను ఉల్లంఘించి వెళ్ళలేదు. కేవలం బాబా ఊదీని మాత్రమే పంపించారు. మరుసటి రోజు ఉదయం బాబా అనుమతిని తీసుకొని మాధవరావు తన మరదలి ఆరోగ్య సమాచారం కనుక్కుందామని వెళ్ళాడు. బాబా తనను “త్వరగా తిరిగి వచ్చేయమని” గట్టిగా చెప్పారు. అక్కడికి వెళ్ళి చూస్తే ఆమె జ్వరం పూర్తిగా తగ్గిపోయింది. ప్లేగు బొబ్బలు కూడా తగ్గిపోయాయి. అంతేకాదు మాధవరావు వెళ్ళే సమయానికి ఆమె తేనీరు తయారు చేస్తుంది. అంటే బాబా ఆజ్ఞ ప్రకారమే మాధవరావు వెంటనే తిరిగి రావడం సాధ్యమయింది.

అనుభవం - 60

ఒకసారి రామచంద్ర కోతే పాటిల్ ముంబాయికి వెళ్ళాడు. దానికి రెండు రోజుల ముందు నానా లక్ష్మణ్ కులకర్ణి ఒక వివాహానికి హాజరు అయ్యేందుకు ముంబాయికి వెళ్ళాడు. ఎవరి వద్దకయితే నానా కులకర్ణి వెళ్ళాడో ఆ గృహస్థు గ్రాంట్ రోడ్డులో నివసిస్తాడని మాత్రమే రామచంద్ర కోతే పాటిల్కు తెలుసు. కేవలం ఆ సమాచారం ఆధారంగా సదరు గృహస్థు వద్దకు వెళ్ళడం కష్టమని అందరూ రామచంద్ర పాటిల్కు చెప్పారు. అప్పుడు రామచంద్ర పాటిల్ “నా బాబా ఉన్నారు. ఆయనే నన్ను నానాతో కలుపుతారు. అందులో నాకు అణుమాత్రం కూడా అనుమానం లేదు” అని చెప్పి పాటిల్ బయలు దేరాడు. ఎప్పుడూ రద్దీగా ఉండే గ్రాంట్ రోడ్డులో రామచంద్ర కోతే పాటిల్ నడుచుకుంటూ వెళుతుండగా, కొంచెం దూరం వెళ్ళాక నానా కులకర్ణి నడుచుకుంటూ ఎదురుగా వచ్చాడు. అంటే రామచంద్ర పాటిల్ చెప్పిన విధంగానే బాబా తనను, నానాను కలిపారు. 

తరువాయి భాగం రేపు

సోర్సు : సాయిభక్త శ్రీకాకాసాహెబ్ దీక్షిత్ డైరీ by విజయ్ కిషోర్.

1 comment:

సాయి మహారాజ్ సన్నిధి సోషల్ మీడియా లింక్స్:

Subscribe Here

బ్లాగ్ అప్డేట్ నోటిఫికేషన్స్ నేరుగా మీ మెయిల్ కే వచ్చేందుకు క్రింద బాక్సులో మీ మెయిల్ ఐడి టైపు చేసి subscribe పై క్లిక్ చేసి, తరువాత స్టెప్స్ పూర్తీ చేయండి.

Delivered by FeedBurner

Followers

Recent Posts


Blog Logo