సాయి వచనం:-

- శ్రీబాబూజీ.

సాయిభక్తుల అనుభవమాలిక 64వ భాగం....


ఈరోజు భాగంలో అనుభవం:

  • శ్రీసాయిబాబాతో నా అనుభవాలు

ఒక అజ్ఞాత శిరిడీ సాయిబాబా భక్తురాలు ఇలా చెప్తున్నారు: 

నేను శ్రీసాయిబాబా అనుగ్రహాన్ని పొందిన ఒక సామాన్య భక్తురాలిని. బాబా నా జీవితంలో ఎలా సహాయం చేసారో అనే విషయాన్ని నేను ప్రపంచానికి తెలియచేద్దామని అనుకుంటున్నాను. బాబా సాక్షాత్తు భగవంతుని అవతారమని, ఆయన మన ప్రార్థనలన్నీ తీరుస్తారని ఈ ప్రపంచమంతా తెలుసుకోవాలి.

న గురోరధికమ్ తత్త్వమ్!
న గురోరధికమ్ తపః!!
న గురోరధికమ్ జ్ఞానమ్!
తస్మై శ్రీ గురవేనమః!! 

(తాత్పర్యం – గురువును మించిన తత్త్వము లేదు. గురువును మించిన తపస్సు లేదు. గురువును మించిన జ్ఞానము లేదు. అటువంటి గురువుకు ప్రణామము.)

ఈ అనుభవాన్ని వ్రాయటం ద్వారా నన్ను నేను శ్రీసాయిబాబా పాదపద్మములకు సమర్పించుకుంటున్నాను. శ్రీసాయిబాబా అనుగ్రహం ఎంతో అద్భుతమైన రీతిలో నా జీవితాన్ని మలచింది. నేను శ్రీవైష్ణవుల కుటుంబంలో జన్మించినందున, చిన్నతనంలోనే సద్గురువు యొక్క ఆవశ్యకతను గురించి తెలుసుకునే అవకాశం కలిగింది. మా కుటుంబమంతా ఎన్నో తరాలనుండి నింబార్క సంప్రదాయాన్ని పాటించేవారు. నేను చిన్నప్పటినుండి నా గురుదేవుల మీద ఆధారపడటం నేర్చుకున్నాను. నా రక్షకుడైన నా గురుదేవునియందు విశ్వాసమనే మొక్క దృఢంగా నాటబడింది. సద్గురువు యొక్క శరీరము దైవత్వానికి ఆధారమని, గురువు ప్రాపంచికత్వానికి, దైవత్వానికి అనుసంధానకర్త అని నా గురువు నాకు నేర్పించారు. అలా నేను బాల్యంలో నేర్చుకున్న ఈ విషయాలు, ఎన్నో సంవత్సరాల తర్వాత నాకు బాబాతో పరిచయం కలిగాక, సాయిబాబా దయార్ద్రహృదయుడు అని తెలుసుకోవటానికి ఎంతో తోడ్పడ్డాయి.

నేను పెరిగి పెద్దవుతున్నకొద్దీ, మానవులు తమ జీవితంలో తమంతట తాముగా ఏదీ సాధించలేరని నేను గాఢంగా విశ్వసించేదానిని. కేవలం దైవానుగ్రహం వలన మాత్రమే మనము మన జీవిత గమ్యాన్ని చేరుకోగలము, అద్భుత శక్తులు సాధించగలము, జీవితంలో విజయాన్ని సాధించగలము. శిష్యుని ఆలోచనలను, కర్మలను సద్గురువు సరిచేసి, జీవితంలోని కష్టాలను అధిగమింపచేసి, శిష్యునిలోని దైవశక్తిని సరైన పంథాలోకి మళ్ళిస్తారనే నమ్మకంతో ఉండేదానిని. నన్ను నేను ఒక బుద్ధిలేని, సామర్థ్యంలేని, దురహంకారం గల వ్యక్తినని, జీవితంలో ఎటువంటి సవాలు స్వీకరించలేనని తెలుసుకున్నాను. కేవలం సద్గురువు పట్ల నాకుండే చెక్కుచెదరని నమ్మకమే నన్ను ముందుకు నడిపిస్తుంది. ఈ ప్రాపంచిక జీవితమంతా కష్టాలమయం. జీవితంలో వచ్చే సమస్యల వల్ల మనము భగవంతుడి దగ్గరకు వెళతాము. జీవితంలోని కష్టసమయాలలో, సమస్యలలో, ఇంకా భయంవల్ల మన స్వశక్తితో వాటిని అధిగమించలేమని తెలుసుకున్నాక మనం దైవాన్ని ఆశ్రయిస్తాము. దైవం ఒక్కరే జీవితంలో వచ్చే కష్టాలను ఎదుర్కొనే శక్తిని మనకివ్వగలరు. 

ఎన్నో మలుపులతో కూడిన నా జీవిత ప్రయాణం అంత సున్నితంగా ఏం సాగలేదు. భగవంతుడే నా జీవితాన్ని కష్టాలమయం చేసారని చాలా సంవత్సరాలు అనుకునేదానిని. ఇలా జీవితంలో కష్టాలు, సమస్యలతో పోరాడుతున్నప్పుడు నేను భగవంతుని దివ్యానుగ్రహం గురించి తెలుసుకున్నాను.

నా జీవితంలో చాలా ఆలస్యంగా బాబా దగ్గరకు వెళ్ళాను.  2015వ సంవత్సరంలో మా అమ్మ, నేను నాశిక్, త్రయంబకేశ్వరం యాత్రకు వెళ్ళాము. ఆ యాత్రలో మేము శిరిడీ, మరికొన్ని యాత్రాస్థలాలు దర్శించుకోవాలని ప్లాన్ చేసుకున్నాము. మేము శిరిడీ దర్శించుకోవటం అదే మొదటిసారి. బాబా అద్భుతశక్తులను అనుభవించబోయే సమయం అది. బాబా గురించి నాకు ఎక్కువగా ఏమీ తెలియదు. అయినప్పటికీ, నేను శిరిడీలో అడుగిడిన వెంటనే  ఒకవిధమైన ప్రశాంతత నన్ను ఆవరించింది. వెంటనే నేను ఒక గొప్ప పవిత్రక్షేత్రంలో అడుగుపెట్టానని అర్థమైంది. మేము శిరిడీలో అడుగుపెట్టినరోజు మా అమ్మ, నేను బాబా మందిర పరిసర ప్రాంతాలను దర్శించాము, ఎందుకంటే మా ఏజెంట్ మాకు సాయిబాబా దర్శనం అప్పాయింట్‌మెంట్ ప్రక్కరోజు ఉదయం ప్లాను చేశాడు. బాబా మందిర పరిసరాలలో రద్దీ ఎక్కువగా లేదు. అలా ఒక్కొక్కటి దర్శించుకుంటూ, తెలియకుండానే నేరుగా సమాధిమందిరంలోకి ప్రవేశించి, ఎదురుగా బాబా విగ్రహాన్ని దర్శించుకున్న మేము సంభ్రమాశ్చర్యాలతో నిలబడిపోయాము. మా కల నిజమైంది. ఎటువంటి భక్తుల రద్దీ కాని, క్యూలు కాని, ఆటంకాలు కాని లేవు. మేము అలానే బాబాను చూస్తూ నిలబడిపోయాము. బాబా కూడా తమ కరుణాదృక్కులను మావైపు ప్రసరించారు. ఆ చూపుల గాలం నా గుండెల్లో చిక్కుకుంది. అంతే! బాబాతో మా కరుణానుబంధం మొదలయింది. ఆనందంతో నా హృదయమంతా నిండిపోగా, నా కన్నుల నుండి ప్రేమాశ్రువులు జాలువారాయి. అదొక వింతైన అనుభూతి. ప్రక్కరోజు మళ్లీ బాబా దర్శనానికి రావాలనే ఆకాంక్షతో మేము మా బసకు చేరుకున్నాము. ఆ సమయంలో నేను నా కెరీర్ లో ముందుకు వెళ్ళటానికి అవసరమయ్యే నేషనల్ ఎలిజిబిలిటీ టెస్ట్ క్వాలిఫై కావటానికి ఎంతో కష్టపడుతున్నాను. అంతకుముందు రెండుసార్లు నేను క్వాలిఫై కాలేకపోయాను, ఈసారి ఎలాగైనా సాధించాలనే పట్టుదలతో ఉన్నాను. ప్రక్కరోజు ఉదయం నేను నేషనల్ ఎలిజిబిలిటీ టెస్టులో క్వాలిఫై అయ్యేలా అనుగ్రహించమని బాబాను సహాయం కోరాను. నేను బాబాను ప్రార్థిస్తూ నిలబడివుండగా, ఇంతలో ఒక సెక్యూరిటీ గార్డు నా చేతిలో ఒక కొబ్బరికాయ ఉంచాడు. బాబా నా ప్రార్థనలు అంగీకరించారని నేను అనుకున్నాను.

కొన్ని నెలల తరువాత, నేను మళ్ళీ ఆ పరీక్షకు హాజరయ్యాను. నా పరీక్ష పుస్తకాలన్నింటికీ శిరిడీనుండి తెచ్చుకున్న బాబా ఊదీ పెట్టాను. నా వ్యక్తిగత, ఉద్యోగ బాధ్యతల వత్తిడి కారణంగా నేను పెద్దగా ప్రిపేర్ కాలేదు. నేను ఆ పరీక్షలో పాస్ అవుతానా అనేది అనుమానమే. సరిగ్గా పరీక్ష జరిగిన రోజు, ప్రశ్నాపత్రం చాలా కష్టంగా ఉండి, చాలా ప్రశ్నలు నేను పూర్తిచెయ్యలేకపోయాను. అప్పుడు మనస్సులోనే నా గురుదేవులైన సాయిబాబాకు నమస్కారం చేసుకొని, నేను పూర్తిచేయలేకపోయిన ప్రశ్నలకు ఏదో ఒక సమాధానం ఇచ్చేశాను. అందువలన ఈసారి కూడా ఆ పరీక్షలో పాస్ కాననే నిరాశతో ఉన్నాను. కొన్ని నెలల తరువాత పరీక్షా ఫలితాలు వచ్చాయి. నేను మంచి ఫలితాలతో పరీక్ష పాసయ్యానని తెలుసుకొని చాలా ఆశ్చర్యపోయాను. అప్పుడు సాయిబాబా నాపై అద్భుతాలను ప్రయోగించారు అని తెలుసుకున్నాను. నా తెలివితేటలతో కాకుండా, కేవలం సాయిబాబా ఆశీస్సులతోనే పరీక్ష పాసయ్యానని నాకు బాగా తెలుసు. ఈ లీలతో సాయిబాబాపై విశ్వాసం బలీయమై, నేను బాబా భక్తురాలిగా మారాను. 

కొన్ని సంవత్సరాల తరువాత మళ్ళీ నేను సంక్షోభంలో చిక్కుకున్నాను. ఎన్ని ప్రయత్నాలు చేసినా, ఎంతో వైద్య సహాయం తీసుకున్నా నేను గర్భం ధరించలేకపోయాను. అప్పటికి నాకు 35 సంవత్సరాలు నిండినా నాకు సంతానం కలగలేదు. దీనివల్ల నేను బాగా డిప్రషన్ లోకి వెళ్లాను. గత్యంతరంలేక నేను శిరిడీ వెళ్ళి సాయిబాబా పాదాలవద్ద శరణు పొందాలని నిశ్చయించుకున్నాను. శిరిడీ వెళ్లి, మానవ ప్రయత్నాలన్నీ విఫలమయ్యాయని, అందువలన వారి దైవశక్తితో నాకు సంతానాన్ని ప్రసాదించమని ఆర్తిగా సాయిబాబాను వేడుకున్నాను. ప్రతి శిరిడీ దర్శనము నాలో మంచి భావాలు, ఆశలు ఇనుమడింపజేస్తుంది. అందువల్ల బాబా తప్పక నాకొక మార్గాన్ని చూపిస్తారని అనుకున్నాను. కానీ, ఇంత త్వరగా అనుగ్రహిస్తారని నేను కలలో కూడా ఊహించలేదు. ఆ మరుసటి నెలలోనే నేను ఎటువంటి వైద్యసహాయం లేకుండానే గర్భవతినయ్యాను. బాబా నాపై కురిపించిన అనుగ్రహవర్షాన్ని నేను నమ్మలేకపోయాను. ఆ క్షణమే నేను సాయిబాబా భగవంతుని అవతారమని సంపూర్ణంగా నమ్మాను. తమ భక్తులను కష్టాల బారినుండి రక్షించటానికి దివి నుండి ఈ భువిపై అవతరించిన దైవస్వరూపులు శ్రీసాయిబాబా. ఆయన దయార్ద్రహృదయులు, ప్రేమస్వరూపులు, అత్యంత కరుణాస్వరూపులు. శ్రీసాయిబాబా నాపై వర్షించిన అనుగ్రహానికి నేను ఉక్కిరిబిక్కిరయ్యాను.

ఇక్కడ నేను రెండు ముఖ్య సంఘటనలను మాత్రమే పంచుకున్నాను. కానీ బాధల్లో, కష్టాల్లో, అపజయాలలో నా జీవితంలో నేను లెక్కలేనన్నిసార్లు బాబా యొక్క కరుణను చవిచూశాను. సాయిబాబా మీద ఆధారపడటమనేది నా దైనందిన జీవితంలో అంతర్భాగమయ్యింది. నా జీవితంలోని ప్రతి అడుగులో నేను బాబా ఆశీర్వాదాలకై అర్థిస్తుంటాను. సాయిబాబా లేని జీవితాన్ని నేను ఊహించను కూడా ఊహించలేను. నేను ఆశ కోల్పోయినప్పుడు ఆశను, నేను బలహీనంగా ఉన్నప్పుడు బలాన్ని నాకు ప్రసాదించి నా జీవితంలో ముందుకు వెళ్లడానికి కావలసిన ధైర్యాన్ని ఇస్తారు. బాబా అనుగ్రహాన్ని ఎవరికై వారు తమ హృదయపులోతుల్లో అనుభవించాల్సిందే కానీ మాటలలో వర్ణించటం ఎవ్వరికైనా అసంభవం. నా జీవిత ప్రయాణంలో ఏదైనా కష్టం వచ్చినప్పుడు నేను బాబా సహాయానికై చూస్తాను. బాబాకు కన్నతల్లి లాంటి హృదయం ఉంది. తన వెచ్చని ఒడిలో ఆర్తులకు సేదతీర్చి వారికి ఉపశమనాన్ని కలిగిస్తారు. తమ భక్తుల తప్పులను దయతో క్షమించి వారిపై తమ అనుగ్రహవర్షాన్ని కురిపిస్తారు. కలహాలు, అవినీతి, హింస పెరిగిన ఈ ప్రపంచంలో బాబాపై విశ్వాసం మనకు ఒక ఆశాకిరణం. శిరిడీ క్షేత్రం సాక్షాత్తు భగవంతుని నివాసస్థలమేనని నా ప్రగాఢ విశ్వాసము. సాయిబాబా ఇప్పటికీ శిరిడీలో ఉన్నారు. ఆ పవిత్రక్షేత్రాన్ని దర్శించిన భక్తులు ధన్యులు. శిరిడీలో సాయిబాబాను భక్తులు అడిగిన ప్రతి ప్రశ్నకు ఆయన సమాధానం ఇస్తూనే ఉన్నారనేది నిర్వివాదాంశం. ఆయన తమ భక్తుల ప్రతి ఒక్క కోరికనూ తీరుస్తున్నారు. నా జీవితంలో కలిగిన అనుభవాల వల్ల బాబా అత్యంత కరుణామూర్తియైన భగవంతుని అవతారముగా నేను నిర్ధారించుకున్నాను. సర్వాంతర్యామి, సర్వవ్యాపి, సర్వశక్తిమంతుడు అయిన సాయిబాబా దివ్యపాదాలను శరణన్నవారు నిజంగా అనుగ్రహింపబడినవారు.  నా తప్పులను మన్నించమని బాబాను ప్రార్థిస్తున్నాను. వారు తప్ప నాకు వేరే చోటు లేదు, వారు తప్ప నాకు వేరే ఆశ్రయం లేదు. వారి పాదాలపై నా శిరస్సు ఉంచి శరణు కోరుతున్నాను. “బాబా! నేను ఎల్లప్పుడూ మీ ఆశ్రయంలో ఉండనీ. ఎటువంటి హానిలేకుండా మీ అనుగ్రహ వీక్షణాలు నన్ను కాపాడనీ. మీ అనుగ్రహం నా జీవితంలో వెలుగు నింపనీ. మీరు నన్ను వీడి వెళ్ళకండి”.

source: https://www.shirdisaibabaexperiences.org/2019/05/shirdi-sai-baba-miracles-part-2349.html

సాయి మహారాజ్ సన్నిధి సోషల్ మీడియా లింక్స్:

Subscribe Here

బ్లాగ్ అప్డేట్ నోటిఫికేషన్స్ నేరుగా మీ మెయిల్ కే వచ్చేందుకు క్రింద బాక్సులో మీ మెయిల్ ఐడి టైపు చేసి subscribe పై క్లిక్ చేసి, తరువాత స్టెప్స్ పూర్తీ చేయండి.

Delivered by FeedBurner

Followers

Recent Posts


Blog Logo